ఈ మధ్య ఆర్. నారాయణ మూర్తి అన్నమాచార్య సినిమా తీసినట్టు, ఫైల్ మీద్ ఎందుకు సంతకం పెట్టలేదో అడగటానికి వచ్చిన సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ గోడ కుర్చీ వేయించినట్టు, రాజ శేఖర్ రెడ్డి, పి.జె.ఆర్. కలిసి మందు కొట్టినట్టు, చంద్ర బాబు రెండు గంటలు మాట్లాడినా రెండు వేళ్ళూ చూపకుండా ఆ విధంగా అనే పదాన్ని వాడనట్టు, నా బ్లాగులో ఉబుసుపోక రాసుకోక పద్యాలు నేర్చుకోవాలనే పట్టుదల వచ్చినట్టు, అందరూ మెచ్చుకునే బ్లాగులన్నీ చాలా చండాలంగానూ, అసలు వీడొక వేస్టు బ్లాగ్గాడు వీడి బ్లాగులు చదవడం కన్నా ఏ తెలుగు సినిమానో, టి.వి.9 చూడ్డం నయం అని అందరూ అనుకునే బ్లాగులకు ఆస్కార్ అవార్డు ఎందుకు రాలేదు అని అందర్నీ ప్రశ్నిస్తూ ఈనాడు, ఆంధ్ర జ్యోతి, వార్త త్వరలో రాబోయే ఉదయం, సాక్షి దిన పత్రికలలో దినానికొక ప్రకటన ఇస్తునట్టు ఆవేశం వస్తోంది. ఆ ఆవేశంలో బ్లాగ్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించాలనిపిస్తోంది.(బ్లాగ్ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ త్వరలో).
ఇది ఇంతకూ నిజమైన ఆవేశమో, ఆవేదనో తేల్చుకోవాలంటే ముందుగా “ఎవర్ని కలవాలి …ఎవర్ని కలవాలి” అని బుర్ర మీద చిటికెన వేలు పెట్టి నెర్రెలు వచ్చేట్టు కొట్టుకుంటుంటే మా చిన్న బుడ్డోడు వచ్చి.. “డా..డా..డా” అన్నాడు. గీతోపదేశం చివరి సీన్లో అర్జునుడి లాగా వాడికి సాష్టాంగ దండ ప్రణామం చేసి “నన్ను డాక్టరుని కలవమని సలహా చెప్పినందుకు నీకు జీవితాంతం నాన్నా అనే అదృష్టాన్నిస్తున్నా” అని వరమిచ్చేశా.
వెంటనే చెత్త బుట్టెక్కడుందో వెదికి అందులోనుండి ఫోను బుక్కు, పెన్సిల్ ముక్క బయటికి తీశా. చేతికి తగిలిన ఫోను మాత్రం అందులోనే వేసేశా. పిల్లలున్న ఇంట్లో ఏది దాచాలన్నా చెత్త బుట్ట లే సేఫ్టీ ప్లేసులు ప్రభుత్వం కబ్జా చేసిన భూమి లాగా. ఫోను బుక్కు తీసి ఇన్సూరెన్సు కంపెనీ ఫోను నంబరు మీద కుడి చేతి చూపుడు వేలు పెట్టుకొని చెత్త బుట్టలో ఎడమ చెయ్యి పెట్టి ఫోను తీశాను. ఇన్సూరెన్సు కంపెనీ నంబరుకి డయల్ చేసా. తేజా టి.వి. లో రెండు సినిమాలు అయిపోయిన తరువాత ఓ ఆవిడ లైన్లోకొచ్చింది.
“మే ఐ హెల్ప్ యూ” అంది.
ఏంటి ఈవిడెందుకు నాకు సహాయం చేస్తుంది అని “వై డూ యూ వాంట్ టు హెల్ప్” అని అడిగా.
అప్పటిదాకా “చెల్లీ! పుట్టింట్లో మళ్ళీ పుట్టకు తల్లీ” అనే అరవం సినిమా “అంతరిక్షంలో రక్కసి కుక్క” అనే హాలీవుడ్ సినిమా చూడ్డం వల్ల షార్ట్ టర్మ్ అమ్నీషియా వచ్చింది. టి.వి. ఆఫ్ చెయ్యగానే గతం గుర్తుకు వచ్చింది.
“యా..యా..ఐ నీడ్ హెల్ప్. ఐ వాంటూ సీ ఏ డాక్టర్ ఇన్ మై నెట్వర్క్”
“ఓ ఐ సీ.. యువర్ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ సక్స్…సో యు గెట్ ఓన్లీ వన్ డాక్టర్ ఇన్ దట్ ఏరియా. ద నియరెస్ట్ డాక్టర్ లివ్స్ 120 మైల్స్ ఫ్రం యువర్ ప్లేస్. అదర్ వైస్ యు హ్యావ్ టు గో టూ షికాగో ఆర్ న్యూయార్క్.”
ఇప్పటికే ఇన్సూరెన్సు దెబ్బలకి కంపెనీలే మూసుకుంటున్నాయి నా నోరు మూసుకోలేనా అని వెధవ ప్రశ్నల్ని టప్ మని ఆపి నోరు అప్పళంలా తెరిచి తృతీయ ఫ్రంట్ కన్వీనర్ లా “ఇట్స్ నో బిగ్ డీల్. ఐ కెన్ డ్రైవ్ టు దట్ డాక్టర్” అని చెప్పా.
“ఓకే సర్. ప్లీజ్ నోట్ డవున్ ద డాక్టర్స్ నేం. హిస్ నేం ఈజ్ చింగ జింగ చూ యాక్ అండ్ ద అడ్రెస్ ఈజ్… థ్యాంక్యూ సర్”
“హోల్డాన్. ఐ హ్యావ్ అనదర్ క్యశ్చెన్.” స్పీకర్ సురేష్ రెడ్డిని అడిగినట్లు అడిగా.
ఇక అమెరికా గూగుల్లో వెదికా ఆ డాక్టర్ ఎలాంటి వాడో అని. ఇలాంటి డాక్టర్లు ప్రపంచంలో ఇద్దరే వున్నారట. ఒకరు మా ఊరికి దగ్గర్లో ఇంకొకరు లాస్ ఏంజిలిస్ లో. ఆ డాక్టర్ల పేర్లు “లాస్ ఏంజిలిస్ చింగ జింగ చూ యాక్” మరియు “మా ఊర్లో చింగ జింగ చూ యాక్” అట. ఈ డాక్టర్లను కలవాలంటే మామూలు రోజుల్లో లీవు దొరికే వాళ్ళు మా వూరికి రావాలట. లీవు దొరకని వాళ్ళు శనాదివారల్లో లాస్ ఏంజిలిస్ కి పోవాలట. వీళ్ళిద్దరూ మిగతా రోజుల్లో ఎక్కడుంటారో ప్రపంచానికి కానీ, ప్రతిపక్షానికి కానీ తెలీదట. అలా అని అమెరికా గూగుల్లో వుంది. ఎందుకైనా మంచిది అని సెకండ్ ఒపీనియెన్ కోసం ఇండియా గూగుల్లో వెదికితే ఇద్దరూ ఒకటే నని తెలిసింది.
సరే నని డాక్టర్ చింగ జింగ చూ యాక్ ఆఫీసుకు ఫోను చేసి అపాయింట్‌మెంట్ తీసుకున్నా. ఆఫీసులో మా బాసు కనిపించినప్పుడల్లా కుంటు కుంటూ నడిచా సిక్ లీవు కోసం. బాసు చూశాడో లేదో గానీ మిగిలిన వాళ్ళందరూ “నీకు ఆపిల్ పళ్ళు తెచ్చివ్వనా” “కేఫిటేరియా కెళ్ళి కాఫీ తీసుకురానా” “నువ్వు మెట్లెక్కలేవు గదా నీ బ్యాగు నే మోసుకురానా” “మా ఇంట్లో మా అత్త తెచ్చిన జిందా తిలిస్మాత్ వుంది తీసుకురానా” అని మదర్ తెరిస్సా పాత్రలో జీవించేశారు.
ఓ రోజు దేవుడికి ఇండియెన్ స్టోర్స్ లోనుండి కొనుక్కొచ్చిన పెద్ద కొబ్బరి కాయ కొట్టగానే లీవొచ్చింది. అదేంటో ఈ మధ్య అమెరికన్ స్టోర్స్ లో కొన్న కొబ్బరి కాయలకి ఎఫెక్టు వుండటం లేదు.
నీతి: నాన్-భారత్ లో వున్న అందరూ ఇండియెన్ స్టోర్స్ లోనే కొబ్బరి కాయలు కొనండి(పుచ్చులు ఎన్ని వున్ననూ).
ఆ రోజు రానే వచ్చింది. పులుసన్నమూ, మజ్జిగన్నమూ బాక్సులో పెట్టుకొని బయలు దేరా చింగ జింగ చూ యాక్ ఆఫీసుకి (ఇక్కడ క్లినిక్కులని అట్లే అంటారు). కొండలూ, కోనలూ, సముద్రాలూ, నదులూ, కార్లూ, ట్రక్కులూ, ఏర్‌పోర్ట్లు, రైల్వే స్టేషన్లూ, హార్బర్లూ దాటుకొని మజ్జిగన్నమూ, పులుసన్నమూ మింగేసి డాక్టర్ ఆఫీసుకు వెళ్ళా.
లోపలికి అడుగు పెట్టగానే చైనాకి పాస్ పోర్టు లేకుండా వెళ్ళినంత అనుభూతి వచ్చింది.
అక్కడున్న రిసెప్షనిస్టు పేద్ద మిని స్కర్టు వేసుకొని కుడితిలో చేప పిల్ల నవ్వినట్టు నవ్వి “ ఫిలా అప్లికే..” అంది. వెంటనే అప్లికేషన్ ఫాం తీసుకొని పూర్తి చేసి ఇచ్చేశా.
“డూ ఇన్సూ..కా ?” ఇన్సూరెన్సు కార్డు ఇచ్చా. దాన్ని ఫోటో కాపీ తీసుకొని ఇచ్చేసింది.
“వే..హీ..నసూ..వి..కా..” నర్సు వస్తుందని ఎదురు చూశా. రానే వచ్చింది.లోపలికి తీసుకెళ్ళింది.
ఇక ఆవిడ ఆనందానికి హద్దుల్లేవ్. ఆ ఆనందంలో ముద్దు పెట్టుకుంటుందేమో ఈ అమ్మాయి అని మనసులో ఒకటే ఆనందం. చైనీస్ అమ్మాయి ముద్దు మొదటి అనుభవం అని బుగ్గల్లోకి మరింత గాలి కొట్టి పొంగించి కళ్ళు మూసుకుని ఎదురు చూస్తూ వుంటే హుస్సైన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేసే ముందు నీళ్ళింకి పోయినట్టు జిగటగాడు అదే డాక్టర్ చింగ జింగ చూ యాక్ లోపలికొచ్చాడు.
“起号然到召…武拿阳然武召号” నర్సు
“到见武偶然底地)阳” డాక్టరు.
“彻屋底修整(房屋)” నర్సు
“均屋植]无论器无阳光无有的能阳长” డాక్టరు
డాక్టరూ, నర్సు నడిచే విమానం ఇంజిన్ లో సుమీత్ మిక్సీ పెట్టి పిండి రుబ్బినట్టు పక్కుమని నవ్వుకొని నన్ను చూశారు. చైనీస్ సినిమాలో ఈకలు పీకిన నాటు కోడి పెట్ట ని తలకిందులుగా వేళ్ళాడ దీసి జాకీ చాన్ గాల్లోకి ఎగిరి ఒక్క కాలితో తన్ని దాని తలకాయ లేపినట్టు కళ్ళ ముందు సీను కదలాడింది.
“సో వాటీజ్ యువర్ ప్రాబ్లెం” డాక్టర్ యాక్ అడిగాడు.హమ్మయ్యా బొచ్చు పీకిని కోడిలా కాకుండా పందెం కోడికి జీడి పప్పు పెడుతున్నట్టు అడుగుతున్నాడు అని ఆనందమేసింది.
“ఐ యాం లుకింగ్ థింగ్స్ డిఫెరెంట్లీ..”
“వాట్ డూ యూ డూ?”
“సాఫ్ట్వేర్” నేను
“లీషర్ టైం”
“బ్లాగ్స్..” నేను
“ఓ బ్లా..”
“యా బ్లా..” నేను
“యూ మీన్ బ్లా..”
“యా ఐ మీన్ బ్లా..” నేను
“ఐ బ్లా…ఆల్వేస్.”
“ఐ టూ బ్లా కొంచెం కొంచెం ఆల్వేస్.” నేను
“వాట్ లాంగ్వేజ్?”
“తెలుగు” నేను
“యువ బ్లా నేం..”
“విహారి..” నేను
“సో యు హ్యావ్ సం ప్రాబ్లెం..?”
“నో సం ప్రొబ్లెం…. బిగ్ ప్రాబ్లెం..” నేను
“ఐ డూ హ్యావ్ సేం బిగ్ ప్రాబ్లెం. ఐ విజిట్ యువర్ బ్లాగ్…”
“ఏంటి నా బ్లాగా..?”
“యా..”
“ఎందుకు..”
“ఐ నీడ్ సం సొల్యూషన్..”
“నా దగ్గిరేముంది బూడిద..?”
“ఐ లెఫ్ట్ సం కామెంట్స్ ఆన్ యువర్ బ్లాగ్ టు గెట్ ఆన్సర్స్..”
అంత వరకు సెలవ్. అవన్నీ ఇప్పుడు నేర్చుకొవాలంటే ఓ అర్ధ దశాబ్దం పడుతుంది. అంత వరకు యమగోల సినిమాలో యముడు భూలోకాని కెళితే తాళాలు వేసినట్టు బ్లాగుకు తాళాలు వేస్తున్నా.
పులి ని చూసి నక్క వాత పెట్టుకుంటే….. సందేహాలొస్తున్నాయా? ఆ వాత లెలాంటివో చూద్దాం.
ఇక్కడ “ఆనంద్ అవుట్ డోర్ సినీ సర్వీస్” లేనందున బ్లాగోళ జంభ టపా కోసం బేస్‌మెంట్ లోనే చిన్న సెట్టింగ్ వేసి షూటింగ్ చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా కిందకెళ్ళిపోయి దాని ప్రొడక్షన్ సీన్లు చూసే వాడిని. ఈ షూటింగ్ కి లైట్ బాయ్ నుండి తోట తరణి, పి.సి.శ్రీరాం, మణి రత్నం, రామా నాయుడు వరకు నేనే.
అప్పుడప్పుడూ అడిగినప్పుడు మా ఆవిడ కాఫీ నో, టీనో తెచ్చి ఇచ్చేది. అలా వచ్చినప్పుడు అక్కడే హ్యంగర్స్ కు వేళాడుతున్న డ్రస్సులు చూసి “మొత్తానికి బేస్‌మెంట్ ను ఒక డ్రామా కంపెనీ లాగా మార్చేశావ్” అంది.
“మరి నువ్వు మాత్రం కాచి టీ పెట్టుకొని రమ్మంటే, మైక్రోవేవ్ లో పెట్టి బ్రూ కాఫీ తీసుకొచ్చేసి అదే టీ అన్నట్టు డ్రామా లెయ్యడం లేదా” అని సగటు మగవాడిలా అనబోయి తమాయించుకొని “అప్పుడే ఏమయింది ఇంకా చూస్తూ వుండు ఎన్ని చేస్తానో” అన్నా రాబోయే ఉపద్రవాన్ని పసి గట్టకుండా.
“ఆ..చాల్లే సంబడం. ఇంటి వెనకాల గడ్డి పీకడానికి టైము లేదు గానీ వీటికంతా వుంటుంది. తొందరగ ముగించుకోని రా” అంది.
తను అలా వెళ్ళగానే బుడ్డోళ్ళిద్దరూ నా యూనిట్ లో నాన్-వర్కింగ్ సభ్యులయిపోయి నన్ను నాట్ వర్కింగ్ ఆర్టిస్టును చేసేవాళ్ళు.
“గుండయితే అయ్యింది కానీ లడ్డు మాత్రం దొరికింది” అన్నంత ఆనందం తో ‘భ్లాగోళ జంభ” డబ్బా బ్లాగులోకి వెళ్ళింది.
ఇక ట్రైపాడు ఇతర వస్త్రా లంకరణ సామాగ్రి అంతా పైకి తెచ్చే పని మా ఆవిడది. “హమ్మయ్యా, కాఫీలు మోసుకెళ్ళే బాధ తప్పింది” అని అన్నీ తీసుకొచ్చి పైన బడేసింది.
ఆఫీసు నుండి రాగానే కూచుని టి.వి. చూస్తూ “నా తోడు గా నీవుండగా …..చక్ర వాకం….చక్ర వాకం” అని వింటుంటే ఎక్కడి నుండో “భ్లాగోళ జంభ… భ్లాగోళ జంభ… ” అనే సౌండు టి.వి. కన్నా ఎక్కువ వస్తోంది. మా ఆవిడే లేచి వెళ్ళి లివింగ్ రూములో నుండి ఒక చేత్తో ట్రైపాడూ ఇంకో చేత్తో హ్యాటూ తీసుకొని వచ్చింది.
ఆ వెనకనే మా పెద్ద బుడ్డోడు “అమ్మా! నేను, తెలుగు బ్లాగు గేము ఆడుకుంటా. నా కివ్వు” అంటూ వెంట పడుతున్నాడు.
నేను నవ్వుకుంటా వాడిని దగ్గరకు తీసుకున్నానో లేదో అంత వరకు అక్కడే లివింగ్ రూములో ఆడుకుంటున్న సంవత్సరం కూడా నిండని చిన బుడ్డోడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ “భ్లా... భ్లా... భ్లా... “ అని వస్తున్నాడు.
బ్లాగు లో టపా రాసిన ప్రతిసారి అది అందరినీ చేరిందో లేదో లేక ఎంతమందికి నచ్చిందో అని ప్రతి బ్లాగరు అనుకొంటాడు/ది. ఇది ప్రతి బ్లాగరుకున్న సహజ బలోపేతమైన బలహీన లక్షణం. ఈ లక్షణాలు లేక పోతే అసలు బ్లాగరే కాదు. పైత్యం ప్రకోపించి నాకు ఈ లక్షణాలు లేవు అని ఎదురొస్తే అన్నీ అనుభవించేసి మోక్షాన్ని సాక్షాత్కరించుకొన్న “యోగి బ్లాగరు” అని నమస్కరించి పక్కకు తప్పుకుంటాన్నేను.
వృత్తం గుండ్రంగా వుంటుంది అని చెప్పడానికి కాగితం మీద వృత్త లేఖిని పెట్టి పెన్సిల్ భుజానేసుకుని చుట్టూ రౌండు కొట్టి చూపించడం కంటే చంద్రుడి లాగా గుండ్రంగా వుంటుంది అని చెప్పడం తేలిక. అలాగే ఇప్పుడు సౌలభ్యం కోసం సరళంగా బ్లాగులను సినిమాలు అనుకొందాం. బ్లాగర్లలో కొంత మంది చిరంజీవులు ఉండచ్చు, కొంతమంది బాలకృష్ణలు వుండచ్చు. ఇంకొంతమంది మహేష్ బాబులు, మరికొంతమంది జూ.ఎన్టీఆర్ లు అయుండచ్చు. కేవలం రికార్డులకోసం వీళ్ళ పేర్లను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. బ్లాగులు రాసేటైపుకు ఈ రంగులేసుకునే వాళ్ళ ఇమేజిలకు సంబంధం లేదు. మామూలుగా అయితే కామెంట్లు బాగా వస్తే ఆ టపా హిట్టయినట్టు లెక్క. కొన్ని సార్లు కామెంట్లు లేకపోయినా అది హిట్టు కింద లెక్క కట్టచ్చ్చు. అదెలానో వివరంగా తెలుసుకుందాం.
హిట్లు:
మీరొక టపా రాసిన వెంటనే అంటే ఇరవై నాలుగ్గంటల్లో టపీ టపీ మని 150+ హిట్లు వచ్చాయంటే మీరు మహా బ్లాగరు కింద లెక్క. అంటే చిరంజీవి, జూ.ఎన్టీఆర్ సినిమాలకు భారీ ఓపనింగ్స్ వచ్చినట్టు. ఇంకా ఎక్కువ హిట్లు వస్తే ఎక్కువ సెంటర్లలో ఓపన్ అయిన మాంచి క్రేజీ కాంబినేషన్ సినిమా అన్నట్టు. అలా కాకుండా కొంచెం కిందకి అంటే 100-150 మధ్య హిట్లు వస్తే రవితేజా, ప్రభాస్ రేంజు వున్న టపా అన్నట్టు. అంతకన్నా కింద అంటే 50-100 మధ్యలో వస్తే మీ బ్లాగు శ్రీహరి, శ్రీకాంత్, తొట్టెంపూడి వేణు లాంటి క్రేజు వున్న టపా అన్నట్టు. 50 కన్న తక్కువ వస్తే మీ బ్లాగు కూడల్లోనూ , తేనెగూడులోనూ , తెలుగు బ్లాగర్స్ లోనూ , జల్లెడలోనూ ఎక్కడా లేనట్టు. ఒక వేళ వున్నా అంత తక్కువ వచ్చాయంటే మీరు కొత్త బ్లాగరు కావచ్చు లేక పోతే పబ్లిసిటీ ఏమాత్రాం లేని “ఒరేయ్ నా గుడిసె పీకరా” సినిమాలాగా మీ టపా కి పేరు పెట్టినట్టు. పాత బ్లాగరయ్యి ఈ రేంజులో హిట్లు వస్తే టపాలు రాయడం మానేసి “విహారి బ్లాగు శిక్షణాలయం” లో మూడు నెలల ప్రాథమిక కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలి. గొప్ప దసరా, దీపావళి తగ్గింపు ధరలు నడుస్తున్నాయి. తెలుగు బ్లాగులు రాయాలనుకుంటున్న ఆంగ్ల బ్లాగరులకు పది శాతం అదనపు తగ్గింపు.
ఎంత భారీ ఓపనింగ్స్ వచ్చినా ఆంధ్రావాలా, అందరివాడు సినిమాల్లాగా తుస్సు మనే సినిమాలు కూడా వుంటాయి. అలాంటి టపాకు ఒక్క కామెంటు కూడా రాదు. వచ్చినా ఆ కామెంట్లు రాసిన వాళ్ళు ఆ బ్లాగుకు గుడ్డి పంకా (బ్లైండ్ ఫ్యాన్) అయుంటారు. వాళ్ళు సినిమా రిలీజుకు ముందు నాన్న జేబులో డబ్బు కొట్టేసి ఆ డబ్బుతో హీరో కటవుట్ కు పాలాభిషేకం చేసి, బ్యానర్లు కట్టే అభిమానుల్లాగా “ఇరగదీశావ్ గురు” అనే మాటల్ని clipboard లో, రెండు పెగ్గులు రమ్ము కడుపులో సేవ్ చేసుకొని వస్తారు. ముందు కామెంటు పోస్టు చేసి తరువాత టపా చదువుతారు. తీరా చదివిన తరువాత అంత బాగా లేదనిపిస్తే “స్టోరీ బాగా లేదు కానీ.. బాసు మాత్రం యాక్షన్ చింపేశాడు” అనే వీరా(ర్రి)భిమాని టైపులో “శైలి బాగా వుంది.. తీసుకున్న సబ్జక్టు బాలేదు” అని కామెంటు రాస్తారు. వీటిని హిట్టు కింద పరిగణలోకి తీసుకోనక్కర లేదు.
కొన్ని టపాలకు హిట్లు కూడలి కామెంట్ల విభాగం నుండి వస్తాయి. ఇవి “వర్డ్ ఆఫ్ మౌత్” కింద పబ్లిసిటీకి నోచుకునేవి. మొదట 70 కి దగ్గరి ప్రాంతంలో హిట్లు వచ్చినా ఈ దెబ్బకి అవి అమాంతం 150 కి చేరుకుంటాయి. ఇందులో, కూడల్లో మీ టపా కనిపించగానే "థూ ఈడొకడు వీడి మొఖానికొక బ్లాగు” లేదా " వీడి టపా చదివితే నేను మళ్ళీ కుళ్ళుకోవాలి. నేను వీడి బ్లాగు చదవను"“ అని అనుకునే వాళ్ళు ఎవరైనా వుంటే వాళ్ళు కూడా ఈ లిస్టులో వచ్చి పడతారు. అప్పుడు కూడా మీ టపా హిట్టే. ఇక్కడే టపా విజయానికి కిటుకు లన్నీ ఆధార పడి వుంటాయి.
సందర్భ ప్రకటన:
టపా హిట్టు చేయు విధానంబెట్టిదన…. సునీతా విలియమ్స్ భారత దేశం గర్వించ తగ్గ మహిళ అని టపా రాశారనుకోండి. ఠాఠ్ అసలు ఈవిడ భారద్ధేశపు మహిళ కాదు. ఇక్కడ పుట్టని వాళ్ళు భారతీయులు కాదు. దేశాన్ని వదిలి వెళ్ళి పోయిన వాళ్ళు అని చిన్న దొంగ కామెంటు ఒకటి రాసుకుంటే చాలు. నివాస భారతీయులు ఒక వైపున ప్రవాస భారతీయులు ఇంకో వైపున నిలబడి కీబోర్డులనుండి నాగాస్త్రాలు, వారుణాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు వదులుకుంటారు. మీరప్పుడు పుట్టపర్తి విమానాశ్రయం దగ్గర చంద్రుని లో బాబా ని చూద్దామని వచ్చిన 10 వేల మంది జనాలకు “ఇదిగో ఆ మేఘం కింద బాబా, అదిగో ఆ మేఘం పైన బాబా” అని ఉత్సాహ పరిచినట్టు “ప్రవాస భారతీయులు కొంత మంది అలా అని ఒప్పుకుంటున్నా కానీ... నా ఉద్ధేశ్యమేంటంటే.."అని దీర్ఘాలు తీస్తూ.. కొంచెం ఆవు నెయ్యి, కొంచెం ఇరాక్ పెట్రోలు పొయ్యాలి. ఇక 100+ హిట్ల నుండి వెయ్యి హిట్లకు చేరుకోనే బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడి పూజ లేకుండానే జరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని కిటుకుల కోసం నేడే “విహారి బ్లాగు శిక్షణాలయం” లో చేరండి. గొప్ప దీపావళి తగ్గింపు ధరలు.
సందర్భ ప్రకటన సమాప్తం.
“ఆపరేషన్ దుర్యోధన” టైపు టపాలు:
ఒక్కోసారి మీ బ్లాగు, హిట్లు లేని శ్రీకాంత్ లాగా తయారయ్యిందనుకుంటే “ఆపరేషన్ దుర్యోధన” లాంటి టపా ఒకటి రాయాలి. అంటే అందులో అవసరం లేకపోయినా కొన్ని అభ్యంతర కర ప్రేలాపనలు వుండాలి. అది కనుక్కున్నట్టు కొన్ని కామెంట్లు రాసి కూడలి లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలాంటి టపాలు కూడా హిట్టు కిందే లెక్క మీరు అదే పనిగా ఇలా రాస్తే. డబ్బింగ్ టపాలు:
ఏ ఇసిజులూ బాషలోనో, సెసొతో బాషలోనో బాగా హిట్టయిన గొర్రె తోక నుండి విమానం ఇంధనం అనే విషయాన్ని తెలుగు లోకి అనువదించే టపాలు ఈ కోవ కిందికి వస్తాయి. వీటికి మూలాధారం ఇచ్చేస్తే ఆటోమేటిగ్గా మీ టపా ఫ్లాపవుతుంది. అలా కాకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం రెఫెరెన్సులు ఇచ్చుకుంటూ రాసేస్తే అది బాగా హిట్టయిన టపా. మంచి విషయం చెప్పారు అని కామెంటేస్తారు. మీ కన్నా ముందుగా ఇంకెవరన్నా చదివేసి (ఆ ఇసిజులూ,సెసొతో బాషలో ) దీన్ని అక్కడ చదివినానోచ్ అని కామెంటు రాస్తే వెంటనే దాన్ని యువరాజ్ సిక్సు లాగా బ్లాగవతలకి కొట్టి పడేస్తే మీ టపా హిట్టే.
“భ్లాగోళ జంభ” టపాలు:
ఇవి సాధారణంగా అన్ని సీజన్లలో హిట్టవుతాయి. ఇందులో విషయమంతా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు బ్లాగు చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరగడమే కాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు భూమి మీద జరిగే అన్ని విషయాలూ ఇందులో ఇరికించబడతాయి. అంటే భూగోళం లో భ్లాగోళం లాగా. ఇవెప్పుడూ నిత్య నూతనంగా వుంటాయి. అచేతనంగా వున్న కొందరు బ్లాగర్లను కూకట్ పల్లి నుండి దిల్‌సుఖ్ నగర్ కు అయిదు నిముషాల్లో చేరుకున్నంతగా దిల్ ఖుష్ చేస్తాయి. ఆహా నేను కూడా ఇలా రాస్తే ఎంత బావుంటుంది అని బ్లాగర్లు రోజుకు ఒక్క సారన్నా అనుకొంటారు. అలా అనుకోలేదంటే వాళ్ళు బ్లాగుకుళ్ళుకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ బ్లాగ్వేస్టుజీ స్వాముల వారి ఆశ్రమం నుండి వచ్చిన వారయుంటారు. ఇలాంటి వారితో ఫోనులో మాట్లాడం గానీ, కాఫీ కెళ్ళడం గానీ చెయ్య కూడదు. ఎందుకంటే వీళ్ళు టపావేస్ట్ చూర్ణం మీచేత తాగించేస్తారు. ఇలా మారు వేషం లో తిరిగే కుళ్ళు కోటి మఠం భక్తులు పేర్లు ఒక శిక్షణాలయం లో రికార్డు గావించ బడ్డాయి. అర్థం కాకపోతే “విహారి శిక్షణాలయం” ను సంప్రదించండి. గొప్ప తగ్గింపు ధరలు. (ఇది చాలా అడ్వాన్సుడు కోర్సు. ఈ కోర్సుకు ప్రత్యేక ప్రీమియెం ఫీజులు కలవు. ఈ శిక్షణాలయం కరస్పాండెంట్/సి.ఈ.ఓ. వ్యక్తిగత పర్య వేక్షణ లో కోర్సు సా……..గుతుంది)
ముష్టి కామెంట్ల టపాలు:
హిట్లు వచ్చినా కామెంట్లు 5 అంతకన్నా తక్కువగా వస్తే, తరుణ్ సినిమా రిలీజ అయిన నాలుగు వారాలు బాలకృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు నటించిన ఏ సినిమా రిలీజ్ కానట్టు. గతి లేక మీ బ్లాగుకొచ్చినట్లు అని అర్థం. అప్పుడు వచ్చేవి ముష్టి కామెంట్లు. ఇలాంటి సమయాల్లో వెంటనే ఇంకో టపా రాయడం ఉత్తమం. ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు అనే సామెత అసలు గుర్తుకు రాకూడదు.
దండోరా టపాలు:
మా పనిమనిషి ముక్కులో మిరపకాయ దూరింది. డాక్టరు పనిమనిషి ముక్కు కోసి (ఇక్కడ డాక్టరు వచ్చి పని మనిషి గా ఎందుకు చేరింది అని యక్షుడు మెదడు తడిమితే తెలుగు సినిమాలు, తెలుగు సీరియళ్ళూ తగ్గించండి. వీలయితే కంటాపరేషన్ చేసుకొని గంతలు కట్టుకోండి. డాక్టరు వేరు పనిమనిషి వేరు. మళ్ళీ వేరు, ఖాండము అని యక్షుడు గోటితో గోకితే పవర్ సప్లై ఆపేయండి) తీసిన తరువాత ఆ మిరపకాయ తో చేసిన కూర వెజిటేరియనా నాన్ వెజిటేరియనా మీ అభిప్రాయం చెప్పండి, దీన్ని చర్చించండి, టెంపులీకరించండి, మసీదీకరించండి, గురుద్వారీకరించండి అంటూ టపాలు తొందరపడి రాసేస్తే అది హిట్టవదు. ఎవరూ కామెంట్లివ్వరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ “రణం” సినిమా. ఈ సినిమాని ఏ పెద్ద స్టారో లేక వాడి గొట్టం బంధువో తీసుంటే సూపర్ డూపర్ హిట్టయుండేది. గోపి చంద్ కాబట్టి సక్సెస్ తో ఆగి పోయింది. ఫ్రంటు పుల్లింగూ బ్యాకు పుషింగూ లేకుండా వచ్చిన సినిమా హీరో స్క్రీన్ మీద ఎంత రక్తం చిందించినా హిట్టవదు కదా అలాగే ఇదీను. అలా “వెతో ములా” (వెనుక నుండి తోపుడు ముందు నుండి లాగుడు) లేని వాళ్ళకు బ్లాగు శిక్షణ అవసరం. మీ బ్లాగుల్లో “ఈ బ్లాగు విహారి శిక్షణాలయం సెర్టిఫైడు” అని పెట్టుకుంటే SAP సెర్టిఫికేషన్ వున్నట్టు.
“సందు చూసి” (టైమింగ్) టపాలు:
ఏదన్నా మంచి టపా వస్తే దాని లాంటిదే ఇంకో టపా రావడం. స్టూవర్టు పురం పోలీసు స్టేషన్ సినిమా పెద్ద క్రేజు తో రిలీజయింది అది హిట్టో పట్టో దేవుడికెరుకు. ఆ సమయంలో భానుచందర్ నటించిన స్టూవర్టు పురం దొంగలు అనే సినిమా ఒకటి వచ్చింది. వాళ్ళయితే డబ్బులు బాగానే దండుకున్నారు. ఇప్పుడు యమ దొంగ వచ్చిన సమయంలో యమ గోల మళ్ళీ మొదలైంది వచ్చింది. యమ దొంగ పబ్లిసిటీలో సగం ఉచితంగా వీళ్ళకొచ్చి మూడున్నర కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత కు డబ్బు పంట పండించింది. అదిప్పుడు కాస్తా 15 కోట్లకు చేరుకుందట. విషయం అర్థమైపోయింది కదా ఇలాంటి టపా రాసుంటే అది తప్పకుండా హిట్టవుతుంది.
కాఫీ లాంటి టపాలు:
టపా రాసిన ఇరవై నాలుగ్గంటల్లో 50 హిట్లు ఆ తరువాత రోజు 50 హిట్లు, ఆ తరువాత రోజు 50 హిట్లు వచ్చి పదికి పైగా కామెంట్లు వస్తే మీరు ఆహ్లాదకరంగా శేఖర్ కమ్ముల స్టైల్లో “ఆనంద్” టపా రాసినట్టు. వీటికి హాలు నిండినది బోర్డు వుండదు కానీ హార్టు నిండినది అని అనుకుంటూ వుంటారు. వీటికి రోజుకు 5 చొప్పున కామెంట్లు వుంటాయి లేదా ఇంకొకరు ఈ టపాను ఎక్కడో ఒక చోట తమ టపాల్లో పేర్కొంటారు.
టోఫూ లాంటి చల్లని టపాలు:
బ్లాగుల్లో ప్రత్యేకమైనవి వున్నాయి అవి కవితల బ్లాగులు, ఫోటోల బ్లాగులు, సేకరణల బ్లాగులు. ఏ కొంచెమో తప్ప పూర్తిగా కమర్షియల్ కాని సినిమాల టైపు. వీటి యజమానులు కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాస రావ్, బాపు, శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు. పూర్తిగా తమకోసమే రాస్తున్నట్టు వుంటాయి. బ్లాగుల మీద సదభిప్రాయం వున్న వాళ్ళందరూ హిట్లు గానే పరిగణించాలి. ఇందులో ప్రతి టపానూ హిట్టే. కామెంట్లకు సంబంధం లేదు. ఇలాంటి టపాలు రాసే వాళ్ళు శిక్షణా లయంలో గెస్టు లెక్చరర్ గా వస్తారు.
ఉచిత శిక్షణ : ఇప్పటికే బ్లాగులు మొదలు పెట్టి పేరు సంపాదించుకొన్న బ్లాగరులను ఈ శిక్షణా లయం లో ఉచితంగా చేర్చుకొంటారు. వాళ్ళ హిట్లూ ఫట్లూ గట్రా సాక్ష్యాలు తీసుకు రాగలిగితే చాలు. ఈ ప్రమోషన్ చూసి పదో తరగతీ.. ఇంటర్మీడియెట్టూ.. స్టేట్ ఫస్టూ .. ఎంసెట్ కోచింగూ.. కార్పొరేట్ కాలేజీ లో ఫ్రీ అడ్మిషన్ గుర్తుకు వస్తే మిమ్మల్ని చేర్చుకోరు.
అసందర్భ ప్రేలాపన :
మీ బుర్రలో యక్షుడి సందేహాలు – నా బుర్రలోని దక్షుడి సమాధానాలు:
ఇంతకూ ఈ టపా హిట్టా ఫట్టా అంటే ఓ వారం తరువాత వచ్చి చూడండి. ఓ పది కామెంట్లు వుంటే సక్సస్, ఇరవై వుంటే హిట్టు, ముప్పై వుంటే సూపర్ హిట్టు. నలభైకి పైన ఎన్ని వచ్చినా సూపర్ డూపర్ హిట్టే. ఈ బ్లాగు చరిత్రలో ఇరవై ఎప్పుడూ దాట లేదు కాబట్టి హిట్టూ, సూపర్, డూపర్ లాంటివి వుండవని ముందుగానే సెటిలైపోవచ్చు. వెంకటేషూ, రాజేంద్ర ప్రసాదూ సినిమాలలో పెట్టిన పెట్టుబడి గ్యారంటీ. అందులోనూ సక్సస్లే ఎక్కువున్నాయి కాబట్టి ఇది ఆ టైపు బ్లాగు. కాకపోతే వెంకటేష్ లాగా డబ్బింగులు వుండవు.
మరి ఇరవై కామెంట్లు కూడా లేకుండా శిక్షణా లయమా అని యక్షుడు మళ్ళీ నిద్దర లేస్తే అయ్యేయెస్ ట్రైనింగు ఇవ్వడానికి అయ్యేయెస్సు అయుండఖ్ఖర్లేదు అనే దర్జా సమాధానం ఎనర్జిటిక్కావుంది. అదే మన లౌజిక్కు :-)
గమనిక: ఇందులో గ్రామీణ వాతావరణంలో స్నేహితుల మధ్య జరిగే సహజ సంభాషణలు రాయ బడ్డాయి. కొన్ని చోట్ల బూతులాంటి వెగటు అనిపించొచ్చు. ఇబ్బందనిపిస్తే ఇంకో టపా ఆహ్వానం పలుకుతోంది.
ఇరవై సంవత్సరాలా పొడవు కత్తెరేస్తే...
......
......
......
భారద్దేశంలో ఓ చిన్న ఊరు… ఓ అందమైన సాయంత్రం…………. అది గోదారి గట్టు కాదు.కొబ్బరి చెట్లసలే లేవు ఎక్కడ చూసినా పచ్చదనమే అని చెప్పే సీను లేదు.అది వంశీ దృశ్య కావ్యమూ కాదు.
కూలి పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరే వారు కొందరు. ఆవులను మేపుకొని ఇంటికి ఆతృతగా వెళ్ళే వాళ్ళు కొందరు. ఎద్దు బళ్ళ మీద ఇంటికి చేరుకునే వారు ఇంకొందరు. అవన్నీ చూస్తూ, ఆస్వాదిస్తూ రోడ్డు మీద ఓ స్నేహితుల గుంపు. ఏ కల్మషాలు తెలియని స్నేహం. ఇజాలకు బీజాలు పడలేదు. ఈగోల లోగోలు లేవు. తుళ్ళిపడే నవ్వులే తప్ప తవ్వి తీసుకునే గోతులు లేవు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కొట్టుకున్నా ఆనందమే.. తిట్టుకున్నా ఆనందమే. ఒక్కడి ఆనందం ఇంకొక ఆరుగురికి ఆనందం. ఊళ్ళో అప్పటికీ ఇప్పటికీ అదే గుంపు అందరి ముందు. ఒకడు ఊరెళ్తే ఆరుగురు తోడు బస్టాండు వరకు. ఒకడు ఊరినుండి వస్తుంటే ఆర్గురు ఎదురుచూపులు బస్టాండులో.
**
“రేయ్ కర్రోడా! ఈ రోజు రాత్తిరికి చెనిక్కయిలు ఉడకేసుకుందా మేమిరా” శంకిరి గ్యాడు.
“కొండామారి కాడికి బోతే ఈ శంకిరి గ్యాని చేన్లో చెనిగి చెట్లు పీకల్ల. వీడు పిసినారి నాకొడుకు. ఒద్దులేరేయ్ ఎలకుంట్ల కాడికే పోదాము” మల్లి గ్యాడు గాలి తీసేసినాడు.
“నీ యబ్బ మల్లి గా నీకు చేనుంటే తెలిసేదిరా దాని బాదేందో. మీ కొంపకొస్తే ఎప్పుడూ కారంబెట్న బొరుగులే ఇస్తావు కదరా ఎబ్బుడన్నా క్ర్యాక్ జాక్ బిస్కట్లు ఇచ్చినావా నోరు ముయ్యరా రేయ్ పుట్ట గోసిగా” శంకిరి గ్యాడు రివర్సిచ్చినాడు.
“నోరు ముయ్యిరా నంగి నాకొడకా మాకు చేనుంటే దినానిగొగసారి గొడ్డును చేన్లోకి తోసినట్టు నిన్ను చేన్లోకి తోసేసిండేవాణ్ణి” మల్లి గ్యాడు బాణాలు ఎయ్యడం మొదలు పెట్టినాడు.
“థూ.. మీరేంట్నాకొడుకుల్రా ఎబ్బుడు జూసినా కొట్టుకుంటా వుంటారు. ఇదే పనా మీకు. రాత్తిరికి యాడికి బోదామో మల్ల డిసైడ్ జేద్దాం గ్యానీ. ముందు ఎవురెవురొస్తారో కనుక్కోండి” నా హూంకరింపు.
“ఈళ్ళెబ్బుడూ ఇంతేలేరా ఈల్లిట్లా కొట్టు కుంటా వుంటేనే మంచిది లేగబోతే ఉడకేసిన చెనిక్కాయలన్నీ బొక్కలాడేస్తార్రా సామి” కర్రోడని పిలవబడే వీరి గ్యాడు.
“ఏందిరాయప్పో నేనే ముందు గా వచ్చినాననుకుంటే నాకన్న ముందుగానే అందురూ వచ్చేసినారు. ఇంగా ఒగడు మిస్సింగే. ఆ పీలి గ్యాడు ఇంగా రాలేదా?”
“వాడబ్బుడే యాడొస్తాడు. వాళ్ళీధిలో నీళ్ళిడిసిపిట్టే టైము గదా ఆ కిట్టూ కి లైనేస్తా వుంటాడు” మల్లి గ్యాడు.
“శివప్పా! ఈ రోజు రాత్తిరికి చెనిక్కాయిలు ఉడకేసుకునే దానికి పోదాం రేయ్.” శంకిరి గ్యాడు చెప్పినాడు.
“మెరెట్ల జెబ్తే అట్లనే ప్పా. ఈ పొద్దు రేత్తిరికి ఎన్నెల గూడా బాగుంది.అద్సరే ఉడకేసుకునే దానికి బోకెవురు తెస్తారు?”
“అది గూడా కష్టమేనేమిరా. నేను అన్నం తినేసి మీ ఇంటికొచ్చి మీ యమ్మ ని మాటల్లో బెడతా నువ్వు చిన్నగా ఒగ పెద్ద సంగటి జేసే గిన్నె ఎనకాల్నుండే మొండి గోడ మింద పెట్టేయ్. తరువాత నేను జూసుకుంటా దాని సంగతి.” నేను.
“అట్లాగేప్పా” శివి గ్యాడు.
“ఉప్పెవురు తెస్తారు. రేయ్ శంకిరిగ్యా నువ్వు తెస్తావా?” చెంగడు.
“తూరి తూరికి నేనే నేనే తేవల్నా? ఈ తూరి ఈ మల్లి గ్యాణ్ణి తెమ్మను.రేయ్ మల్లి గా నువ్వు తీసుకోని రారా” శంకిరి గ్యాడు.
“థూ ఆపండి ఎప్పుడూ కాట్ల కుక్కల మాదిరి జెటీ పటీ కొట్టుకునే పనే మీకు. ఆడ జూడండ్రేయ్. ఎగరేసుకుంటా మొగానికి రెండించీల ఫేర్ అండ్ లవ్లీ రాసుకోని వస్తా వుండాడు ఆ పీలి గ్యాన్నడిగితే సరి పోతుంది” నేను.
“రేయ్ శివిగా ఎవురి చేన్లో చెట్లకు కాయిలు బాగా కాసినాయిరా” చెంగడు.
“మా చేన్లో ఈ తూరి కొంచుం తక్కువే. మా చేను పక్కన కిష్ణప్పోల్ల చేన్లో అయితే చెట్టుకి ఇరవే ముప్పై గాయిలు గాసినాయి”
“వాల్లవి చిన్న గుత్తి కాయిలు గదరా” శంకిరి గ్యాడు.
“వాళ్ళీతూరి చిన్నగుత్తి కాయిలు ఒగ్గొడ్డం మాత్తరమే ఏసినారు. మిగతా అంతా పెద్ద గుత్తి కాయిలే”
“ఏ గుత్తయితే ఏం గ్యానీ. ముందు చెట్లు పీకండి. అందురూ పీకిన వన్నీ ఆ రోడ్డుకు ఒగ పక్కగా వెయ్యండి” కర్రోడు జెప్పిన్యాడు.
“రేయ్ నాకొడకల్లారా నాకు పాములంటే బయిం కదరా నన్నొదిలేసి యాడాడికో పూడస్తా వుండారు. నేను ఈణ్ణే రోడ్డు వారగా వుంటా. మీరందురూ పీకేసిన చెట్లన్నీ నా దగ్గిరిగ్య తెచ్చి ఎయ్యండి” మల్లి గ్యాడు.
“అందుకేరా జెప్పింది.మా తో పాటూ వచ్చి ఈత నేర్చుకోని జావచ్చు గదా” నేను.
“మీతో వస్తే ఏమి నేరిపిస్తారు పోయింతూరి ఎండా కోలంలో ఏమి నేర్పిచ్చిన్యారు. బెండ్లు కట్ట తెస్తానని డబ్బులు తీసుకోని పోయిన ఆది గ్యాడు పత్తా ల్యే. మీతో వచ్చి వచ్చి బాయి కాడ డాయర్లు బోగొట్టుకునే ద్దప్పిచ్చి ఇంగేం జరగలా” నిష్టూరా ల్యాణ్యాడు మల్లి గ్యాడు.
వీని ముందర ఎప్పుడు ఈత సంగతి జెప్పినా ఆ పోయిన డ్రాయరు సంగతి గుర్తు జేస్తా వుంటాడు.
“మల్లి గ్యా, నివ్వింగా ఆ ఎర్ర డ్రాయరు సంగతి మరిచిపోలేదేమ్ర్యా” చెంగడు.
“అన్ని చెట్లు ఒగే చోట పీకొద్దురా. ఆడ కొంచెము ఆడ కొంచెం పీకండి లేగపోతే వాళ్ళు గుర్తు పడతారు” శివి గ్యాడు వార్నింగులు ఇచ్చేశిన్యాడు.
“ఒరేయ్ శంకిరిగ్యా. ఇంగ నువ్వు ఈడ పీకింది జాలు గానీ పొయ్యి ఆ ఈరన్నోళ్ళ చేన్లో కొన్ని చెట్లు పీకు బో. వాళ్ళ చేన్లో చెట్లకు భలే కాయిలు గాసినాయంట” కర్రోడు చెప్పి న్యాడు.
“నువ్వాడికి పోరా. నేను ఈ కొంచెం పీకేసి వస్తా” శంకిరి గ్యాడు.
“నేను రెడ్డెమ్మోళ్ళ చేన్లో కొన్ని చెట్లు పీక్కోని వస్తా” వీరి గ్యాడు.
“రేయ్ ఆడికి మళ్ళీ బోవద్దురా సామీ నేనిబ్బుడే ఇన్ని చెట్లు పీక్కోని వచ్చినా. కావల్లంటే ఇంకొచెం ఎగదాలకు బొయ్యి కుంటెంగటప్ప వాళ్ళ చేన్లో పీక్కోని రా” నేను.
“రేయ్ పీలిగ్యా ! మల్లి గ్యా! ఈ చెట్లన్నీ మోసుకోని ఆ కంపలేసిన కాడికి దీసుకోని బో. ఆడ అన్నీ వుడ్డేసి చెనిక్కాయిలు ఇడిపిచ్చు. నేను ఈ చెన్లో కొన్ని పీకేసి ఆడికొచ్చి మంటేస్తా” చెంగడు చెప్పిన్యాడు.
“నీ యబ్బా మీరందురూ తలా కొన్ని చెట్లు పీకేసి నన్ను మాత్తరము అన్ని చెట్లూ ఇడిపిచ్చమంటారేంది వాయ్. నేను గావల్లంటే పొయ్యెలిగిస్తా. మీరందురూ ఒచ్చి కాయిలు ఇడిపిచ్చండి.” కోపంగా చెప్పిన్యాడు మల్లి గ్యాడు.
“నీకు మజ్జరం ఎక్కువ సోంబేరి నాకొడకా. కొంచెం ఒళ్ళు ఒంచు వాయ్. బొక్కలాడే దానికి మాత్రం ముందరుంటావ్. అట్లే బొయ్యి ఆడేడన్నా మూడు పెద్ద రాళ్ళుంటే తీసుకోని రా పొయ్యి జేసేదానికి” నేను.
“నేను పోను రా సామి. ఆ బండ్ల కింద తేల్లు గానీ మండ్ర గబ్బలు గానీ వుంటాయి.” మల్లి గ్యాడు.
“వుంటే వాటి చేత కరిపిచ్చుకో ఆడింగి నాకొడకా.” శంకిరి గ్యాడు.
“రేయ్ నువ్వు చెన్లో నుండి ఇవతలకు రారా నీ సంగతి జెబ్తా. యారక తినే నాకొడకా” మల్లి గ్యాడు.
“రేయ్ అడ్డ పట్టీ నాకొడకా! పుల్లలు పోయ్యిలోకి తోస్తావుండావా నా లుంగీ లోకి తోస్తావుండావా” అని ఎగిరి పైకి లేసి లుంగీ ఇదిలిచ్చిన్యాడు.
శివి గ్యాడేమో కూలుగా “అది నీ మింద పడిందేమిరా. అది ఏదో ఎర్రగ ఎలగతా వుంటే మినకర బూసి అనుకుంట్ర్యా. చాణా కాలిపూడిసిందా” అని అడిగిన్యాడు.
“గుడ్డి నా కొడకా మినకర బూసికి అగ్గికి తేడా తెలీదా? అందుకే నాకొడకా నువ్వు టెంత్ క్లాసు రెండు సార్లు ఫెయిలయ్యింది”
ఇట్లా మాట్లాడుకుంటా వుంటే శంకిరి గ్యాడేమో ఉడికిందా లేదా అని చెనిక్కాయిలు పాత్తర లో నుండి తీసి ఊదుకుంటా తినేస్తా వుండాడు. “రేయ్ తిండిపోతు నాయాలా యేరక తినేదానికి మాత్తరం ముందొస్తావు. కంపలయిపోయినాయి పోయ్యి కొన్ని ఆ గప్చీప్ కంపలు తీసుకోని రాపో” పీలి గ్యాడు అరిచాడు.
“ఈ నాకొడ్డుక్కి ఎప్పుడూ నేనే కనిపిస్తా….” అని తిట్టుకుంటూ శంకిరి గ్యాడు వెళ్ళి కంపలు తెచ్చిన్యాడు.
కొంజేపుకి కాయిలు ఉడికిపూడిసినాయి. చెంగడు నీళ్ళను వడగట్టేసి రోడ్డు మింది పోసినాడు. ఇంగ అందురూ వుడ్డగా గూచోని చెనిక్కాయిలు తినే కార్యక్రమాన్ని పూర్తి జేసినాము…
అబ్బుటికి టైము అర్ధ రేత్తిరి దాటి ఒంటి గంటయింది… ఖాళీ అయిన బోకిని శంకిరి గ్యాని నెత్తి మీద బొర్లిచ్చి అందురూ ఊరి వైపు నడుచుకుంటా వస్తా వుండాం…
......
......
......
కత్తిరించిన ఇరవై సంవత్సరాలు మళ్ళీ కుట్టేస్తే.
అమెరికాలో ఒక నగరంలో కంప్యూటర్ ముందర…
అలా చెనిక్కాయలు ఉడకేసిన రోజులు ఎన్నో, నేరేడు చెట్లెక్కి నేరేడు కాయలు కోసుకుంటూ లేటుగా ఇంటికొచ్చి తన్నులు తిన్న రోజులెన్నో.. మామిడి తోపుల్లో ఉప్పూ కారం తో కలిపి మామిడి కాయలు తిన్న రోజులెన్నో… ఇలాంటివి మరెన్నో… గుర్తుకొస్తున్నాయి…ఆ రోజులు మళ్ళీ రావని మనసు మౌనంగా రోదిస్తోంది.
.
రేపే విడుదల : మీర్రాసిన టపా హిట్టా ఫట్టా – విశ్లేషణాత్మక వ్యాసం .
క్రిక్కిరిసిన జనసందోహం. గాలి కూడా మాట్లాడ్డం ఆపేసింది. కూలి పోవాలనుకున్న బ్రిడ్జిలు ఆగిపోయాయి. పేలి పోవాలనుకున్న బాంబులు పేలడం మానేసాయి.
చివరి ఓవర్…
చివరి బాల్….
చివరి వికెట్…
గెలవటానికి కావలసినవి అయిదు పరుగులు. కొడితే సిక్సే కొట్టాలి.
క్రీజులో పించ్ హిట్టర్ వై.ఎస్. పంచ ఊడిపోతుందేమోనని అంపైర్ అనుమతితో బెల్టు తెప్పించుకొని దాని మీద వేసుకున్నాడు. బెల్టు తెచ్చిన సూరీడు వికెట్ల వెనక కీపింగ్ చేస్తున్న మైసూరా రెడ్డిని కొర కొరా చూశాడు వై.ఎస్. ఎక్కడున్నా వెనకుండే తన బదులు ఎవరో వుండడం చూసి ఓర్వలేక. సూరీడు వై.ఎస్. తాగేసిన నీళ్ళ బాటిల్ తీసుకొని బయటకొచ్చేశాడు. వై.ఎస్. 99 మీదున్నాడు.
అవతలి టీం కెప్టెన్ అయిన చంద్ర బాబు ఫీల్డింగ్ సరి చేస్తున్నాడు. సీనియర్ క్రికెటర్లయిన దేవేందర్ గౌడ్, ఎర్రం నాయుడులు సలహాలు ఇద్దామా వద్దా అని ఆలోచించి ఎందుకొచ్చిన గొడవలే అని చెబితే హరికృష్ణకు చెబుదాం అని వెళ్ళి వై.ఎస్. కు ఏ వైపున బాల్ వేస్తే దొరికిపోతాడో చెప్పారు.
హరి కృష్ణ వెంటనే చంద్ర బాబు దగ్గరికెళ్ళి “బావా! నువ్వు ఈ బాల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వేస్తే వై.ఎస్. ఈజీగా దొరికిపోతాడు” అని చెప్పాడు.
“నేను మారాను అని చెప్పినంత మాత్రాన అందరి సలహాలు తీసుకుంటున్నట్టు కాదు. మామూలు బౌలింగ్ బదులు రౌండ్ ద వికెట్ బౌల్ చేస్తానని అర్థం. పేస్ లోనూ, లెంగ్త్ లోనూ తేడా వుండదు.” అని చెప్పి వికెట్ కీపర్ కి వెనకాల బౌండరీ లైను దగ్గర వెళ్ళి నిలబడ మన్నాడు.”నేను స్లిప్స్ లో వుంటా బావా” అని చెప్పబోయి మాట్లాడలేక బౌండరీ లైను దగ్గరకి వెళ్ళిపోయాడు.
వై.ఎస్. పొజిషన్ లో నిలబడి బ్యాటును గ్రౌండ్ కేసి కొట్టి ఏదో అనుమానమొచ్చి అంపైర్ నడిగి మళ్ళీ గార్డు తీసుకున్నాడు. వెనక నుండి మైసూరా రెడ్డి స్లెడ్జింగ్ మొదలు పెట్టాడు.
“చూడుబ్బీ.. వై.ఎస్సూ! ఈ తూరి నువ్వయిపోయినావ్బో. బాల్ కొట్టే ముందు నీ పంచి చూసుకోబ్బీ అది ఊడిపోతా వుంది. ఇంగేం బాల్ కొడతావ్. బ్యాటు పైకెత్తితే పంచి కిందుంటుంది.అబ్బుడు నువ్వు పటా పట్టీల డ్రాయర్ తో ఇడుపుల పాయలో మడికి అండ గొట్టిన సీను గుర్తొచ్చుంది. ”
వై.ఎస్. బ్యాట్ను నేల కేసి దబా దబా బాదుతూ కంగారుగా ఆలోచించాడు ‘ ఇప్పుడే కదా బెల్టు పెట్టుకుంది అదెందుకు ఊడిపోతుంది ‘ అని సర్ది చెప్పుకొని తన ట్రేడ్ మార్కు గుర్తుకు రాగానే ఓ చిరు నవ్వు నవ్వాడు.
రైట్ ఆర్మ్ మీడియం స్పిన్నర్, ఆల్రౌండర్ చంద్ర బాబు బాలు కు బాగా ఎంగిలి పూసి తొడల మీద రుద్దుకుంటున్నాడు. బౌలింగ్ పాయింటు దగ్గర కెళ్ళి వికెట్ల వైపు తిరిగి పరుగెత్తుతూ ఆలోచించాడు. ఈ ఒక్క వికెట్ పడిపోతే విజయం తమదే. మళ్ళీ ఓ అయిదేళ్ళు మనల్ని ఎవ్వడూ అడగడు. ఈ సారి పాద యాత్రలకు చేతి యాత్రలకు అసలు అనుమతి ఇవ్వకూడదు ఇస్తే గిస్తే పొర్లుడు యాత్రలకు అనుమతి ఇవ్వాలి అని బలంగా అనుకున్నాడు.
అక్కడ క్రీజులో వై.ఎస్. ఫీల్డింగ్ మొత్తం చూసుకున్నాడు. కొడితే లాంగాన్ లో ఎర్రం నాయుడి మీదుగా సిక్సర్ కొట్టాలి. అక్కడ మంచి గ్యాప్ వుంది. బాల్ లో తేడా వస్తే కవర్స్ లో వున్న దేవేందర్ గౌడ్ మీదుగా సిక్సర్. దేవేందర్ గౌడ్ కు తాను పంపించిన సందేశం “క్యాచ్ వదిలేస్తే తరువాత తమ ప్రభుత్వం కాంగ్రేస్ లో చేర్చుకొని తెలంగాణా ఇచ్చేసి ముఖ్యమంత్రి ని చెయ్యడం” అందించారో లేదో అని ఓ క్షణం అనుమానపడ్డాడు.
నాన్ స్ట్రైకర్ కె.వి.పి. అసహనంగా కదులుతున్నాడు. అంతకు ముందే చంద్ర బాబు చేతిలో డకౌటైన రోశయ్య స్థానం లో వచ్చాడు.
వై.ఎస్. బ్యాట్ ఊపుతూ చంద్ర బాబు చేతుల్నే చూస్తున్నాడు. చివరి బాలు చంద్ర బాబు చేతి నుండి విడుదలయింది. అది సుడులు తిరుగుతూ లెగ్ సైడు వెళ్ళబోతూ వైడు అవుదామా వద్దా అని సందేహించింది. అంతలో వై.ఎస్. సగం పిచ్ దాటి పది మీటర్లు ముందుకు వచ్చి బ్యాటును బలంగా అడ్డంగా ఊపాడు.
మిస్సయింది.!!!
బాల్ చంద్ర బాబు మాట్లాడే స్వభావాన్ని వంట బట్టించుకుని చాలా నిదానంగా వికెట్ల దగ్గరికి వెళుతోంది. అంత పెద్ద బ్రహ్మిణి ప్లాంటుకు ఎంత వేగంగా పర్మిషన్ తెచ్చాడో అంతే వేగంగా వెనక్కి వచ్చి గింగిరాలు తిరిగుతున్న బాలును రివర్సు స్వీప్ చేసి "నీకు పావలా వడ్డీకే అప్పిస్తానే" అని బ్యాట్ తో గాల్లోకి లేపాడు. అది గాల్లో యువరాజ్ సింగ్ కొట్టిన 119 మీటర్లను దాటేసి 150 మీటర్ల ఎత్తుకు వెళ్ళి బౌండరీ లైను వైపు వెళ్తోంది.
అది చూసి కె.వి.పి. కళ్ళు మూసుకుని పరుగు కోసం పరిగెత్తాడు. వై.ఎస్. చిరునవ్వు నవ్వుతూ పరుగులు పెడుతూ బాల్ ను చూస్తున్నాడు.
మైసూరా రెడ్డి గుడ్లప్పగించి చూడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోయాడు.
చంద్ర బాబు మాత్రం హరి కృష్ణ ను చూసి అరుస్తూ “క్యాచ్..క్యాచ్… నువ్వు దాన్ని పట్టుకుంటే నీతో తెలుగయ్య.. ఈ కప్పు నేనెవ్వర్నీ పట్టుకోనివ్వను అనే సినిమా తీస్తా. అందులో ఇలియానా, త్రిషా హీరోయిన్స్ ” అన్నాడు.
“బిపాసా బసూతో ఐటం సాంగుందా..” అన్నాడు హరికృష్ణ
“కావాలంటే బ్రిట్నీ స్పియర్స్ కూడా” అరిచాడు చంద్ర బాబు
“నువ్వు ప్రధాన మంత్రయితే నన్ను ముఖ్య మంత్రిని చేస్తావా”
“కావాలంటే నిన్ను రాష్ట్రపతిని కూడా చేస్తా. ముందు ఆ బాలును క్యాచ్ పట్టు” చెయ్యి ఫ్లాట్ గా పెట్టి అరిచాడు చంద్ర బాబు.
అది విన్న హరి కృష్ణ ఆ బాలు పట్టుకోవడానికి వెనక్కి పరిగెడుతున్నాడు.
బాలు కిందకొస్తోంది…
కాలు బౌండరీ రోపు దగ్గరకెళ్తోంది…
బాలు దగ్గర కొచ్చేసింది…
కాలు బౌండరీ రోపు ను తాకుతోంది.
బాలు చేతుల్లో పడ బోతోందనగా హరికృష్ణకి కాలు రోప్ మీదుందని తెలిసింది.
ఇక అది క్యాచే అని డిసైడ్ అయిపోయి కడియం శ్రీహరి, అయ్యన్న పాత్రుడు, అశోక్ గజ పతి రాజు ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. స్టేడియం లో వున్న తెలుగు దేశం అభిమానులు “క్యాచ్ టైగర్..క్యాచ్…."
"క్యాచ్..టైగర్..క్యాచ్” అని అరుస్తున్నారు.
బాలును చూస్తూ రెండుచేతులతో బాలును పట్టుకోబోతూ క్షణంలో వెయ్యో వంతు సమయంలో హరికృష్ణ రోప్ మీద కాలును తీశేశాడు. బాలు రెండు అరిచేతుల్లో పడింది. ఇక వేళ్ళు మూసుకోవడమే మిగిలింది.
వై.ఎస్. "నువ్వు చేతులు సరిగ్గా కడుక్కున్నావా లేక నన్ను కడగమంటావా ..." అని గర్జించాడు.
……
……
అంతే
మూసుకోబోతున్న వేళ్ళు తడబడ్డాయి……
బాలు కింద బడింది.
క్యాచ్ డ్రాప్…సీతయ్య ఈ బాలును పట్టుకోలేదు.
వెంటనే తేరుకున్న హరికృష్ణ అది బౌండరీ లైనును దాటక పోతే చాలు అని కింద పడ్డ బాలు మీద సీతయ్య సినిమాలో సిమ్రన్ మీద పడ్డట్టు పడ్డాడు. సిమ్రన్ “దొంగ సచ్చినాడా “ అని తోసేస్తే పక్కకు దొర్లినట్టు ఆ బాలును పట్టుకుని మైసూరా రెడ్డి వైపుకు విసిరాడు. మైసూరా రెడ్డి దాన్ని ఒడుపుగా పట్టుకుని వికెట్లను గిరాటేసి మూడో పరుగు తీస్తున్న వై.ఎస్. ను ఆపి “వురికెత్తింది చాల్లేబ్బీ. ఇంగ కడప లోక సభ సీటు నాదే” అన్నాడు. అది చూసి కె.వి.పి. అక్కడే క్రీజులో కూలిపోయాడు.
కాంగ్రేసు అభిమానులలో కలకలం బయలు దేరింది. తెలుగు దేశం అభిమానులు జయ జయ ధ్వానాలు మొదలు పెట్టారు. స్టేడియంలో వున్న వై.ఎస్.అభిమానులు జేబులోనుండి కడప బాంబులు తియ్యడానికి సిద్ధమవుతున్నారు.
వై.ఎస్.మాత్రం యమదొంగ లో జూ.ఎన్టీఆర్ గదను ఎత్తినట్టు బ్యాట్ ను భుజం మీద పెట్టుకుని చిరునవ్వు నవ్వి, కళ్ళెగరేసి “చూద్దాం… థర్డంపైర్ ఏమి చెబుతున్నాడో చూడు” అన్నాడు. మైసూరాకి బొబ్బిలి ఎం.పి. ఎలక్షన్ సీను గుర్తుకు వచ్చింది.
జెయింట్ స్క్రీన్ మీద హరికృష్ణ బాలును క్యాచ్ పట్టుకోవడం చూపిస్తున్నారు. బాలు చేతుల్లోనుండి జారిపొవడం హరికృష్ణ దాని మీద పడ్డం కనిపిస్తోంది. ఆ షాట్ ని ముందుకు వెనక్కి చూపిస్తున్నారు. ఊహూ.. ఈ యాంగిల్ లో ఏమీ కనిపించడం లేదు. ఇంకో యాంగిల్లో చూపిస్తున్నారు. అందులో సైడు నుండి స్పష్టంగా కనిపిస్తోంది.
బాలు చేతుల్లోనుండి జారగానే గ్రౌండు మీద పడి……
పడి…
పడి…
బౌండరీ రోపును తాకి వెనక్కి వచ్చింది. కాంగ్రేస్ అభిమానుల కోలాహలం చెప్పఖ్ఖర్లేదు. దాన్ని ఫోర్ గా ప్రకటించాడు థర్డంపైర్ సురేష్ రెడ్డి. ఇంకేం స్కోరు టై అయింది.
అంపైర్లు వై.ఎస్.ను, చంద్ర బాబును పిలిచి చెప్పారు. స్కోరు టై అయింది కాబట్టి బౌలవుట్ పెడతాం అయిదుగురు బౌలర్ల పేర్లు ఇమ్మన్నారు. “బౌలవుట్ లో అయిదు కన్నా ఎక్కువ బంతులుండవ్. అది టై అయితే మరో మూడు బంతులు గట్రా లుండవు. డిఫెండింగ్ చాంపియెన్ కే కప్పు ఇస్త్తాం” అని కూడా చెప్పారు.
వై.ఎస్. తర్జన భర్జనలు పడి అగ్రెసివ్ బౌలర్ జె.సి దివాకర్ రెద్ది, స్పిన్నర్ రోశయ్య, మీడియం పేసర్ ఎమ్మెస్ సత్యనారాయణ, పార్ట్ టైం బౌలర్ బొత్స సత్యనారాయణ, స్లో బౌలర్ దాసరి నారాయణ రావు పేర్లు ఇచ్చాడు.
చంద్ర బాబు ముందుగానే ఆలోచించి పెట్టుకున్న లిస్టు ఇచ్చేశాడు. అందులో ఫాస్ట్ బౌలర్ కె.ఇ.కృష్ణమూర్తి, స్పిన్నర్ లాల్ జాన్ భాషా, స్లో బౌలర్ బాబు మోహన్, ఆల్రౌండర్ హరికృష్ణ, పార్ట్ టైం బౌలర్ కోడెల శివ ప్రసాద్ వున్నారు.
వై.ఎస్. బొమ్మ అన్నాడు. అంపైర్ టాస్ ఎగరేశాడు. బొమ్మ పడింది. వై.ఎస్. టాస్ గెలిచాడు. వెంటనే రెండువైపులా బొమ్మ వున్నా ఆ నాణాన్ని అంపైర్ జేబులో వేసేసుకున్నాడు. వై.ఎస్. అంపైర్ వైపు చూసి ఓ చిర్నవ్వు నవ్వాడు. అంపైర్ ఎవరికీ కనిపించకుండా రెండు వేళ్ళు చూపించి రెండు సార్లు టాస్ గెలిపించాను కాబట్టి నాకు రెండు సెజ్ కాంట్రాక్టులు ఇవ్వాలి అని సైగ చేశాడు. దానికి వై.ఎస్. కోడ్ బాషలో సరే అన్నాడు. తమ వాళ్ళే మొదట బోలింగ్ చేస్తారన్నాడు.
బౌలవుట్ మొదలయింది.
మొదట జె.సి దివాకర్ రెడ్డి బాలును చేతిలోకి తీసుకొని బాంబు వేసినట్టు వేశాడు. మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. కాంగ్రేస్ అభిమానులు అరిచారు.
ఇక తెలుగుదేశం తరపున మొదటి బాల్ ను హరికృష్ణ కిచ్చాడు చంద్ర బాబు. అప్పటికే క్యాచ్ పట్టనందుకు తిట్లు బాగ తిని వున్నందున కోపంగా ఆ బాలును తీసుకొని ఖాళీ గా వున్న వికెట్ల వైపు చూసి “నేను ఎవ్వరి బాలూ వెయ్యను “ అని వేశాడు. మిడిల్ స్టంప్, ఆఫ్ స్టంప్ విరిగి అవతల పడ్డాయి. తెలుగు దేశం శిబిరం లో ఆనందోత్సాహాలు.
స్కోరు సమానం 1-1. మొదటి బంతి తరువాత పట్టిక కాంగ్రేస్ : 1 తె.దే.: 1
తరువాత రోశయ్య బాలు వేశాడు. అది మూడు మైళ్ళ వైడు అయింది. ఫస్టంపైర్ రెండు చేతులూ చాపి ఎగురుకుంటూ బౌండరీ లైను దగ్గర కెళ్ళి “వైడు” అన్నాడు. లెగ్ అంపైర్ పరుగెత్తుకెళ్ళి ఫస్టంపైర్ చెవిలో చెప్పాడు “ఏరా నువ్వు వై.ఎస్. ఊరి నుండి వచ్చావా? రూల్సు అసలు తెలిసినట్లు లేదు. ఇది బౌలవుట్. రెగ్యులర్ బౌలింగ్ కాదు ” అని చెప్పగానే నాలుక్కరచుకుని టోపి తీసి మొహమ్మీద పెట్టుకున్నాడు.
“హత్తెరి. ఆపరేషన్ జరిగినప్పట్నుండి చెయ్యి సరీగా పనిచెయ్యడం లేదు” అన్నాడు రోశయ్య. స్కోర్ అక్కడే.
ఈ సారి కె.ఇ.కృష్ణమూర్తి వేసిన బాలు కొద్దిలో వికెట్లను మిస్సయింది. తె.దే. అభిమానులు నీరు కారి పోయారు.
స్కోరు 1-1. రెండో బంతి తరువాత పట్టిక కాంగ్రేస్ : 1-0 తె.దే.: 1-0
బొత్స సత్యనారాయణ వచ్చి వై.ఎస్. ను అడిగాడు. “ఏటి? నా పేరు లిస్టులోనుండి గానీ పీకేశారేటి. నాను వికెట్లను పీకీసి పిచ్ ని తవ్వీసి సీకాకుళం లో ఎయ్యనేటి. ఏటి? ఉత్తరాంధ్ర కావాల్ని నన్ననమంటావేటి. ” మారు మాటాడకుండా బాలు ఇచ్చేశాడు వై.ఎస్. బొత్స వేసిన బాలు లెగ్ స్టంప్ ను పగల గొట్టింది.
ఇక లాల్ జాన్ భాషా బాలును తీసుకొని “అరే ఇస్కీ…..మారో వికెట్స్ కో” అని గట్టిగా అరిచి వేశాడు. మూడు వికెట్లూ కింద పడ్డాయి. “ఇన్షా అల్లా..” అని ఆనందంగా వెళ్ళిపోయాడు. తె.దే. ఆనందం.
మళ్ళీ స్కోరు సమానం 2-2 మూడో బంతి తరువాత పట్టిక కాంగ్రేస్ : 1-0-1 తె.దే. : 1-0-1
నాలుగో బాలు ను వెయ్యబోయే ముందు వై.ఎస్. దాసరిని పిలిచి చెప్పాడు. “తిప్పి తిప్పి వెయ్యాకుండా నేరుగా వికెట్ల వైపు వెయ్యండి”. అది విన్న దాసరికి చిర్రెత్తుకొచ్చింది.
“ఎఁవిటి…హేవనుకుంటున్నావయ్యా నన్ను? ఆఁ? ఈ బాలు వికెట్ల మీద పడాలా లేక వికెట్లే ఈ బాలును మీద వేయించుకోవాల? బాలు వికెట్ల మీద పడ్డా వికెట్లు బాలు మీద పడ్డా అవుటు అవుటే కదయ్యా? అవుటయ్యేది బ్యాట్స్ మెన్నేనయ్యా . బాలు తెల్లగా వున్నా, ఎర్రగా వున్నా అది వెళ్ళాల్సింది వికెట్ల వైపేనయ్యా. బాలు గుండ్రంగా తిరిగి వెళ్ళిందా, చతురస్రాకారంగా తిరిగి వెళ్ళిందా అని చెప్పడం ముఖ్యం కాదయ్యా…నేను నడుచుకుంటూ వెళ్ళి బాలు వేసినా..పరుగెత్తుకుంటూ వెళ్ళి బాలు వేసినా.. బౌలింగ్ బౌలింగేనయ్యా. బాలు గాల్లోకి లేచినా.. గాల్లోకి బాలు లేచినా…” అని ఇంకా చెప్పబోతుండగా వై.ఎస్. కింద పడిపోయాడు. సూరీడు వెంటనే ఓ గ్లాసు నీళ్ళు తాగించి కూచోబెట్టాడు.
“ఆ అదీ మన దెబ్బంటే. ఈ సారికి ఈ డోసు చాల్లే” అని బాల్ తీసుకొని బౌలింగ్ పాయింట్ కు వెళ్ళాడు. బౌల్ చేసే ముందు బాలును చేత్తో తన కళ్ళ కెదురుగా పెట్టుకుని “ఎఁవే..నా పరువు నిలబెట్టవే. చెప్పిందే పది సార్లు తిప్పి తిప్పి చెప్పడం నా అలవాటే..అలాగే నువ్వు కూడా పిచ్ మీద పడిన చోటే ఎగిరెగిరెగిరి పడక నేరుగా వికెట్ల మీద పడు….ఎఁ?..... ఓసేయ్ వికెట్లమ్మా... ” అని బాల్ ను వేశాడు. అది పాము లాగా బుస్సు బుస్సు అనుకుంటూ వికెట్ల పక్కనుండి వెళ్ళిపోయింది. తె.దే. వాళ్ళు “బూ” అని అరిచారు.
దాసరి వెంటనే జేబులో నుండి సెల్ ఫోను తీసి ”ఆ.. ఆడియో ఫంక్షన్ వుందామ్మా? నేను ఇప్పుడే వచ్చేస్తా నమ్మా. ఆ క్యాసెట్ కవరు నేనే చింపుతా మీరు చింపకండమ్మా..” అని డ్రెస్సింగ్ రూం లోకి రాకుండా గ్యాలరీలోకి వెళ్ళి పోయాడు.
బాలు కోడెల శివ ప్రసాద్ చేతుల్లోకి వచ్చింది. “నా ఇంట్లో బాంబులున్నాయంటారా. మీ ఇళ్ళలో బాంబులు పెట్టేస్తా” అని బాలు వేస్తే అది ఫుల్ టాసయి వికెట్ల వెనకాల పడింది. “ఇంకో సారి చెప్తా నీ సంగతి “ అని రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాంగ్రేస్ వాళ్ళు “బూ…” అని అరిచారు.
స్కోరు 2-2. ఒక్క బాలు మాత్రం మిగిలింది. నాలుగో బంతి తరువాత పట్టిక కాంగ్రేస్ : 1-0-1-0 తె.దే. : 1-0-1-0
అందరి లోనూ ఉత్కంఠత పెరిగి పోయింది. కొంత మంది కళ్ళు మూసుకున్నారు.
బౌలవుట్ చివరి బాల్ ను ఎమ్మెస్ సత్యనారాయణ వెయ్యాలి. దాసరి అనుభవంతో ఈయనేం మాట్లాడతాడో అసలే ఈయనకి నోటి దురదెక్కువ అని నోరు తెరవకుండా ఇచ్చేశాడు. రైలుటికెట్ కొన్లేదని రైలు రావడం ఆగుతుందా? కూత పెట్టుకుంటూ రైలొస్తుంది.
“నేను వికెట్లను కూలగొడితే నన్ను గవర్నర్ గిరీకి సోనియమ్మకు రెకమెండ్ చేస్తావా” అన్నాడు.
“ముందు వికెట్లను పడగొట్టండి”
“అలా కాక పోతే నన్ను మళ్ళీ మంత్రి వర్గం లోకి తీసుకుంటావా”
“లెట్స్ సీ…”
“తెలంగాణా ఇప్పించి నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా”
“మీరు బాలు వేస్తారా నన్ను వెయ్యమంటారా ? ”
“ఒద్దులే నేనే వేస్తా” అని బాలు తీసుకోని “నేనే గనుక సెంటర్ లో చక్రం తిప్పుంటే మూడు వికెట్లు ఏక్ ధం లో ఎగిరి పోవల్ల” అని బాలును ముద్దు పెట్టుకొని వేశాడు. అది వికెట్ల మీద కాకుండా నేరుగా స్టాండ్స్ లో వున్న కె.సి.ఆర్. ఒళ్ళో పడింది.
కె.సి.ఆర్. అక్కడి నుండి “అన్నా! గందుకే జెప్తా. జర ఇనుకోయే మా టి.ఆర్.ఎస్.లోకి రాయే అని. మా దర్వాజా లెప్పుడూ తెరిచే వుంటయ్. తెలంగాణ భవన్ ల నీకోసం అత్తర్ జల్లి రూం రడీగా పెట్నం. ఈడ కొస్తే గడ్ బిడ్ ఏముండదు. సంజాయించకుండా రాయే. నీ దిల్ కుష్ చెయ్యనీకి గావాల్నంటే గా కరిమ్నగర నీకే ఇనాంగా ఇస్తా. మా హరీష్ రావ్కి గుస్స రాకుండా నే జెబ్తలె.”
ఎమ్మెస్ మాట్లాడకుండా వెళ్ళి డ్రెస్సింగ్ రూం లో కూచున్నాడు.
ఇక తె.దే. పార్టీ వాళ్ళ హంగామా ఎక్కువయింది. ఈ ఒక్క బాలు వికెట్లను పడగొడితే కప్పు వాళ్ళదే. ఈ బాలును వెయ్యాల్సింది సినీ నటుడు బాబూ మోహన్. చంద్ర బాబు బాబూ మోహన్ ను పిలిచి ల్యాప్టాప్ లో చూపిస్తూ “చూడండి బాబూ మోహన్ గారూ. ఇది మనకు ఆఖరు అవకాశం. ఈ సారి మిస్సయి డ్రా అయితే అంతే సంగతులు వాళ్ళకు కప్పు మనకు చిప్ప. మీరు గనుక ఈ విధంగా బాలు వేసినట్లయితే తప్పకుండా వెళ్ళి ఆ విధంగా వికెట్లకు తగులుతుంది. అప్పుడు ఈ ప్రభుత్వం మనదే. మీరు వికెట్లను పడగొడితే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా. మీరు ఏమీ మనసులో పెట్టుకోకుండా నిండు హృదయంతో విసిరెయ్యండి. మిగిలింది నేను చూసుకుంటా.” అన్నాడు.
బిక్క మొహం వేసుకొని చేతులు తిప్పుతూ, చీదుకుంటూ “ఏమి చూసుకోవడమో ఏందో. గీ పాలిటిక్స్ ను నమ్ముకుని వస్తే ఇట్ల గవర్నమెంటు పాయె. అట్లా సినిమా చాన్సులూ పాయె. ఇట్లా బాలేసేది మా స్కూల్లో చెప్పకండా పాయిరి. ఏందిరో దేవుడో.” అని అనుకుంటా వుంటే సౌందర్య ప్రత్యక్షమయ్యి “చూడు బాబూ మోహన్ గారు. మనం మాయలోడు సినిమాలో డ్యాన్సు చేసిన ‘చినుకు చినుకు అందెలతో...‘ పాట గుర్తుకు తెచ్చుకొని బాలు వెయ్యండి. విజయం మీదే” అని చెప్పి మాయమయింది.
బాబూ మోహన్ ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు. గుటకలేస్తూ ”అయ్యో..అమ్మో.. సౌందర్యా! ..ఎఁల్దుకూ... ఎఁమిటీ ఎలా అని ఆలోచించకుండా వేసేస్తా బాలు… ఇదిగో… ఇప్పుడే… వేసేస్తున్న…నే వేస్తున్నా…నే వేసేస్తా..నే వేసేసా.. “ అని గట్టిగా కళ్ళు మూసుకొని బాలు వేశాడు.
స్టేడియం మొత్తం చిన్న కాంట్రాక్టులకు సి.ఎం. సంతకం పెట్టినా వినిపించేంత నిశ్శబ్దం…
బాలు వికెట్ల వైపుకు గంటకు 1.61290323 మైక్రో మీటర్ల స్పీడుతో దూసుకు వెళుతోంది.
అది ఇరవై మీటర్లు దాటిన తరువాత ఫలితం చెప్పబడుతుంది.
ఎలాగయితేనేం వంద టపాలు పూర్తయ్యాయి. మొదట్లో అనుకున్నా వంద టపాలు పూర్తి చెయ్యడం పెద్ద గొప్పేమీ కాదులే అందుకోసం బ్లాగుకు ఫ్రేము కట్టడం ఎందుకు అని. ఈ మధ్యనే ‘ఊరందరిదీ ఒక దారయితే ఉలిపి కట్టె దొకదారి’ అనే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడకూడదు నువ్వు కూడ జన జీవన స్రవంతి లో కలవాలి అని గడ్డి పీకుతున్నప్పుడు బుద్ధుడు గాంధీ రూపంలో వచ్చి కర్రెత్తి జ్ఞానోదయం చేసి వెళ్ళాడు. మహాను భావులు చెప్పిన తరువాత జవదాటడం కూడానా అని వందవ టపా అలా విడుదల చేశా. ఇప్పుడు ఆ వందని సింహావలోకనం చేసుకుందామని ఈ ప్రయత్నం. ఈ వందలో నావి కానివి 6. నా బ్లాగు వారోత్సవం పూర్తయితే సొంతంగా వంద రాసినట్టు లెఖ్ఖ. కవితల బ్లాగుని, నాటకాల బ్లాగుని ఈ కూడికలో కలపడం లేదు.
నేను బ్లాగులు మొదలు పెట్టింది నాలో నాకు తెలీకుండా వున్న శక్తి ఏంటొ పరీక్షించుకుందామనే బులపాటం తో. నా కోసం మాత్రమే రాసుకుంటున్నా అని చెప్పే సాహసం, ధైర్యం రెండూ లేవు. వ్యాఖ్యలు నా కోసం టపాలు అందరి కోసం. మొదట్లో నన్ను నేను పరీక్షించుకోడానికి ప్రయోగశాల లాగ బ్లాగు ఉపయోగపడింది. ఆ పరీక్షల్లో అప్పుడప్పుడూ అత్తెసరి మార్కులొచ్చినా, స్టేటు ఫస్టు రాకపోయినా వీలున్నంతలో మండలం ఫస్టు అనే స్థాయి కనిపించింది. సరేలే కాస్త తెలుగు మీద పట్టు వుంటుంది ఇలా రాస్తూ పోతే అని అనిపించి రాయడం మొదలు పెట్టా.
నువ్వు పిండి మెత్తగా రుబ్బి మంచి వంటకాలు చేస్తున్నావు అని కొంత మంది నా భుజాల మీద వాళ్ళ చేతులు వదిలేసి ‘ అప్పుడప్పుడూ సెభాష్..సెభాష్ అంటూ ఈ బులపాటం గాని భుజాన్ని తట్టండి అని కీ ఇచ్చి వెళ్ళిపోయారు ‘ . నా భుజాల మీద నా చేతులకు తోడు ఇంకొన్ని చేతులు తోడవటంతో వైన్ తాగుతూ కోడిని గ్రిల్లు మీద పెట్టి కాల్చుకుని, దాన్ని గిల్లుకుని తినే సమయాన్ని కొంచెం తగ్గించి ఇందులో ప్రవేశించా.
అలా మీ అందరి ఆదరాభిమానాలు ఎంతగా వున్నాయో చెప్పడానికి ఈ మధ్య కొత్తపాళి, ఇస్మాయిల్, నేను సైతం, a-z, సి.బి.రావ్ గార్లు నేను నాలుగు వారాలుగా రాయకపోయే సరికి నా గురించి వాకబు చేయడం ఒక ఉదాహరణ. ఇంత అభిమానాన్ని చూపిస్తున్న బ్లాగు లోక జనులందరికి నా మనహ్ ప్రణామములు. ఇక నేను బ్లాగులు ఎలా రాస్తాను అంటే. ఇది అదని కాకుండా అన్నీ బ్లాగాలని అనిపిస్తుంది అందరిలాగే. అన్నింటిలోనూ ఎంతో కొంత హాస్యం లేకుండ రాయడం నా వల్ల కాని పని కొందరి లాగా. ఏదైనా రాయాలనుకుంటే బుర్ర లోకొచ్చిన దాన్ని కీ బోర్డు మీద టక టక లాడించేస్తా. రాసే దాని మీద విషయ సేకరణ దాదాపు శూన్యం. చెప్పుకుంటూ బోతే చాట భారతం అవుతుంది.
ఇక ఇప్పటి వరకు నాకు బాగా నచ్చినవాటి మీద నా విశ్లేషణ. ఇందులో సొంత డబ్బా సౌండెక్కువ( గులక రాళ్ళు ఎక్కువ కలిపా) వుంటుంది కాబట్టి మీ ఎలక చెవులు జాగ్రత్త. ప్రపంచ కప్ 20/20 జ్వరం చాలా మందికి వుంది కాబటి అదే స్పూర్తి తో టాప్ ట్వెంటీ ఇస్తున్నా “ప్రభుత్వ కప్ ట్వెంటీ/ (ట్వెంటీ – 11)” వచ్చేముందు.
మొదటి మురిపెపు బ్లాగు టపా. అసలు బ్లాగులన్నీ ఈ తరహాలోనే రాయాలని మొదలు పెట్టాను. ఇది చిత్తూరు మాండలీకంలో రాయబడింది. భారత దేశంలో ప్రతి యాభై కిలోమీటర్లకి వేష భాషల్లో, తినే తిండిలో ఎంతో తేడా వుంటుంది. అలాగే ఇందులో కూడా. గట్టిగా నలభై కిలోమీటర్లు లేని మా యవ్వ వాళ్ళ ఊరికి మా ఊరికి భాషలో తేడా వుంటుంది. మొదటిది కదా అన్నీ సవ్యంగా కుదరక పోయినా బాగానే రాశానన్న తృప్తి మిగిలింది.
ఇది రాసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా రాసేశా. రాసినప్పుడు మెదడు తరంగాలు బీటా దశలో వుంటే మళ్ళీ చదివిన తరువాత నవ్వుల్తో గామా దశకు చేరింది. బహుశా ఇదే నేను బాగా రాయగలననే నమ్మకాన్ని ఇచ్చిందేమో.
పైది ప్రేరేపించిన ఆలోచనోత్సాహంతో దీన్ని కూడా రాశాను. ఇది సరదా సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని రాసిన టపా. బెంగుళూరు మహా నగరంలో ఒకే రోజులో పాస్పోర్ట్ ఎలా సంపాదించాలో చెప్పే టెక్నిఖ్ఖులు వున్న టపా. మధ్యలో కన్నడ కస్తూరి కూడ కొంత దొర్లుతుంది.
ఇండీ బ్లాగర్స్ వాళ్ళు ఉత్తమ బ్లాగుల అవార్డు ఇస్తున్నారంటే నా బ్లాగును చక్క గా అలంకరించి పెట్టి ‘బెస్టు డిజైన్ బ్లాగు ‘ అవార్డుకు ప్రతిపాదించి ఓట్లెయ్యమని అభ్యర్థిస్తూ రాసిన టపా.
వజ్రోత్సవాలు చూసిన తరువాత కలిగిన జుగుప్సతో రాసింది. వంద సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకునే సంబరాలు ఎలా వుంటాయో తెలియ చెప్పడానికి అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఎలా వుంటుందో ఊహించి ఫాంటసీ గా రాసినది. చివరలో నున్న అద్భుతమైన క్లైమాక్స్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది.
బ్లాగులను క్రెకెటర్లతో పోలుస్తూ రాసిన టపా. అప్పటికి ప్రపంచ కప్ సమ్మెట పోట్లేమీ లేవు. బాగా హిట్టయిన టపా. వెరైటీల ప్రయత్నంలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన టపా. వ్యాఖ్యానాలు కూడ క్రెకెటర్ల లాగానే వున్నాయి.
ఇండీ బ్లాగర్ల ఉత్తమ డిజైన్ బ్లాగుల పోటీలో వున్నాననుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఉత్తమ తెలుగు బ్లాగుల పోటీలో వేశారు. అది చూసి చిర్రెత్తుకొచ్చి రాసిన టపా. ఇందులో ప్రత్యేకత ఏంటంటే నేను ఓటు వెయ్యకున్నా నాకు ఎవరో ఒక ఓటు వేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాసిన టపా.
అందరికీ హిందీ వస్తుంది నా ఒక్కడికే రాదు. ఎందుకు రాదో ఎలా రాలేదో చెబుతూ స్కూల్లో అన్ని చోట్లా సెభాషనిపించుకుంటున్నా హింది లో మటాషనిపించుకొని మా క్లాసు అమ్మాయి చేతిలో మొట్టి కాయలు తిన్న వైనం. గిలి గింతలు పెట్టే సన్నివేశాలతో హాస్యంగా రాసిన టపా.
నెహ్రూ లాగా పంచ వర్ష ప్రణాలికతో మొదలు పెట్టింది ఇది. అమెరికాలో వుంటున్న సీనుగాడు ఇండియా వెళ్ళే టప్పుడు ఎదుర్కునే అనుభవాలు ఇందులో వున్నాయి. ఇది ప్రవాసభారతీయులందరికి ఎదురయ్యే పరిస్థితులే. ఇప్పటికి మూడు భాగాలు పూర్తయ్యాయి. మూడో భాగం తన్నిందేమో అనే ఉద్ధేశ్యంతో రైలింజెన్ ఆఫ్ చేసి దండకా రణ్యంలోకి వెళ్ళి పోయా.
కార్టూనిస్టు మల్లిక్ చే కార్టూన్ గీయించుకునే అదృష్టం కలిగిన టపా. అమెరికాలో తెలుగు సంఘాల ఉత్సవాలు ఎలా వుంటాయో చెప్పే సెటైర్. ఇది తెలుగు వన్ వారిచే అమెరికాలో నడపబడుతున్న తెలుగు టైమ్స్ లో వచ్చింది. * * * * చుక్కలు
“ఇవాళ నిన్ను కడిగేస్తా “ డైలాగు అందరికీ గుర్తుండే వుంటుంది. దాని మీద వేసిన సెటైర్. మీ ఫోనుకొచ్చేమర్కెతింగ్ కాల్స్ తప్పించుకోవాలంటే ఈ టపా తప్పక చదివి తీరాలి.
తెలుగు బ్లాగుల సంఘం వాళ్ళు ఒక ఉత్సవాన్ని జరుపుకుని దానికి అతిథులు గా వై.ఎస్.ను చంద్ర బాబు ను పిలిస్తే ఎలా వుంటుందో చెప్పే సరదా మిమిక్రీ వీడియో. మొదట్లో అపరిచితుడు గెటప్ తరువాత ఎల్.బి.శ్రీరాం అదనపు ఆకర్షణలు. ఇరవై నాలుగ్గంటలు కూడా దాటకుండా 330 పేజ్ లోడ్లు దాటిన టపా కూడా ఇదే( బ్లాగర్లు/బ్లాగుచదువర్లు పెరిగారు).
ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే రెండు రోజులకే డబ్బాలు డిస్ట్రిబ్యూటర్ ఇంటికి వచ్చినట్లు అయిన టపా. ఎంతో సంతృప్తి గా చేసిన టపా. దాదాపు ఓ పది మందికి చూపించి అయిదు మంది అదిరింది(?) అంటే తీసుకొచ్చి బ్లాగులో పెట్టా. రాకేశ్వరుడు అప్పుడెప్పుడో చెప్పిన ‘ పది ఉపాయాలు .. ‘ కు ఖచ్చితంగా నప్పుతుంది. కష్టం నూరు పాళ్ళు. ఫలితం రెండు పాళ్ళు కు ఇదే ఉదాహరణ.(ఇది పూర్తిగా నాకు దురద పుట్టి చేసింది మరి) ఉపోధ్ఘాతం ఎక్కువై (తరువాత పీకేశా) వీడియో కూడా ఎక్కువై జనాలను ఇబ్బంది పెట్టింది. సాఫ్టువేర్ ఇబ్బందుల వల్ల ఆడియో మిక్సింగ్ అనుకున్నట్లుగా పూర్తి చెయ్యక పోవడం పెద్ద తప్పు. మొదటి వీడియో నే అలా క్లోనింగ్ చేసి బ్లాగు ఆత్మతో మాట్లాడుతున్నట్టు తియ్యడం రానారె చెప్పినట్లు ధైర్యమైన పనే. ఫెడేల్ ఫెడేల్మని లెంప కాయలు బాగా వేసిన టపా. ఇది చేసిన మేలు ఏంటంటే ఇలాంటివి మరిన్ని చెయ్యాలనె కసిని పెంచడం.
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అన్న పాటలో …..అనుభవమ్ము వచ్చు అనే చరణాన్ని పదే పదే గుర్తు చేసిన టపా.
* * * * * చుక్కలు
అన్నీ రాసే సరికి నాకు 99 చుక్కలు కనిపించాయి. కొలీగ్ తో కేఫిటేరియా కెళ్ళి బాసును కొంత సేపు తిట్టుకుంటే కానీ మనసు ప్రశాంతంగుండదు.