Tuesday, November 27, 2007

క్లోజప్పూ కోల్గేటూ లైఫ్ బాయీ..




బ్లాగులో సొంత విషయాలు రాయ కూడదు అని గఠ్ఠిగా నిర్ణయించుకుని ఆ మాట మీదనే నిలబడి, వంగోని, కూచోని, పడుకొని వుంటున్న ఏకైక వ్యక్తిని నేనే. ఒక్క టపా పొస్టు చేసే ముందు నుండి పోస్టు అయిపోయేంతవరకు మాత్రం కొంచెం వెసులు బాటు కల్పించే దయార్ద కరుణామయుడైన ఏసు ప్రభువును, అడిగిన వెంటనే వరాలిచ్చే ఈశ్వరుడను, అడిగినోళ్ళందరికి ఇందిరమ్మ గృహాలిచ్చే అభినవ సర్ ఆర్థర్ కాటన్ దొర వై.ఎస్.ను కూడా నేనే.


ఈ మధ్య ఏది బ్లాగదామనిపించినా పెద్ద బుడ్డోడు చిన్న బుడ్డోడు చుట్టూనే తిరుగుతోంది. చంద్ర బాబు దగ్గుతూ “గర్జించు రైతూ..గాండ్రించు రైతూ” అని గర్జించినప్పుడు, కాంగ్రేసు సమావేశాల్లో “రావబ్బా...రాహూలూ...రావబ్బా...” అని పాడుతూ రాహూల్ గాంధిని పిలుస్తున్నప్పుడు , దేవేగౌడ నిద్దర్లోంచి లేచి “చూ మంతర్” అని యడుయూరప్ప కుర్చీ లాగేసి మళ్ళీ గురక పెట్టినప్పుడు కూడా అవుడియాలు రావడం లేదు. ఏమిటా అని ఆలోచిస్తే ఒక్క విషయం అవగతమైంది. ఈ మధ్యనే ఇక్కడి తెలుగు సంఘంలో నాలుగేళ్ళు పని చేసి స్టాన్ ఫోర్డు యూనివర్సిటీ లో ఎం.బి.ఏ. కన్నా ఎక్కువ అనుభవం సంపాదించి దీపావళి తారాజువ్వలాగా ఎగిరి అందులో మందు అయిపోయాకా భూమ్మీద కొచ్చా. మామూలుగా ఆఫీసులో గోళ్ళు గిల్లుకోవడం అయిపోయాకా సాయంత్రాల్లో మరియు శనాదివారాలో ఆ పని మీద కాళ్ళు గిల్లు కునే వాడిని. ఇప్పుడు ఆ పన్లు లేనందువల్ల లుంగీ కట్టుకుని ఇంట్లో బుడ్డోళ్ళని ఆడించే పన్లో వుంటున్నా. అమెరికా చలి కొంపల్లో లుంగీ లేంటి షరాయిలేసుకోకుండా అంటే కొన్ని శాల్తీలంతే గోదాట్లో, చౌడేపల్లి చెరువులో ఎన్ని సార్లు ఈదినా మారవు.


గతం:


లైఫ్ బాయ్ ఎక్కడ వుందో ఆరోగ్యం అక్కడ వుంది…ట్రిల్..ట్రిల్.. లైఫ్బాయ్…ట్రిల్..ట్రిల్..


అడ్వర్టైజ్మెంట్ అదయినా నేను భారత్ లో వున్నంత కాలం పియర్స్ సబ్బు, క్లోజప్పు పేస్టు వాడే వాడిని. పియర్స్ సబ్బేమో “ఆనాటికి ఈనాటికి కొందరి చర్మ సౌందర్యం ఒక్కటే. కారణం...పేర్స్...పేర్స్..” అంటుంది.యాదృచ్చికంగా అందులో చిన్న బుడ్డోడు బార్అనగాలేదా(/) బుడ్డిది వుంటుంది బార్అనగాలేదా(/) వుంటాడు. నేనేమో ఫ్రీ కరంటుకు పడి పోయిన రైతు లాగా చర్మ సౌందర్యం అలాగే వుంటుందని వాడా. మర్మం అర్థమయ్యేలోగా ఎఫెక్టేమో అంతః సౌందర్యానికి వచ్చింది. బహుశా “సీతయ్య” సినిమాలో హీరో కూడా ఈ సబ్బే వాడుంటాడు. (ఈ వాక్యం పైన చెప్పిన లుంగీకి సంబంధించినది. లింకిక్కడెందుకుందంటే నేను బ్లాగులు సరీగా రాయటం కుదరలేదని తెలుగు సినిమా రైటర్ బార్ అనగా మరియూ ఎడిటర్ ని నియమించుకొన్నా. అతను ఇచ్చిన సలహాలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నా. అలా పాటించకపోతే టపా ఫ్లాపని హెచ్చరించాడు. ఎడిటింగ్ లేకుండా చెప్పాలంటే ఇంకో మాట కూడా అన్నాడు. “నువ్వీ జన్మకు బాగు పడవు” అని. ముందు మాటకు ఈ మాటకు లింకేంటని అడిగితే తెలుగు ఎడిటర్ ని అవమాన పరుస్తావా? వెళ్ళి మైసమ్మ ఐ.పి.ఎస్. సినిమా చూడు లేక పోతే నేనే చూపిస్తా అని బెదిరించాడు.)


క్లోజప్ ఫార్ క్లోజ్ అప్స్….


ఇక క్లోజప్పు పేస్టు కొస్తే రెండు వారాలు తిరక్కనే క్లోజు అయిపోయేది. మా రూమ్మేట్లు కాలేజీ బిగినింగ్ అప్పుడు వాళ్ళూర్లో సెట్టంగట్లో కొనుక్కొచ్చిన కోల్గేట్ పేస్టు మాత్రం అట్లాగే వుండి ఎండాకాలం లీవుల్లో వాళ్ళూరికి పొయ్యేటప్పుడు తీసుకుని వెళ్ళి పోయేవాళ్ళు. మళ్ళీ కాలేజీ తెరిచినప్పుడు అదే పేస్టు తో వచ్చే వాళ్ళు. ఏమన్నా అడిగితే కొత్త పేస్టు అని చెప్పేవాళ్ళు. అదే పేస్టు కాలేజి చివరి రోజు ఆటోగ్రాఫ్ లో సంతకం పెట్టించుకునే రోజు వరకు వచ్చేది రిలే రన్నింగ్ లో స్టిక్కు లాగా. నా క్లోజప్పు పేస్టు చివరికొచ్చినప్పుడు దాన్ని తీసుకొని రోడ్డు రోలరు డ్రైవరు తో మాట్లాడి ట్యూబులో నుండి వచ్చే దాంట్లో చెరి సగం అని డీల్ మాట్లాడుకొని రోలరు తో ట్యూబు ను తొక్కించి పేస్టు బయటికి లాగే వాళ్ళు. కొత్తగా వచ్చిన రూమ్మేట్లు కూడా సాయంత్ర మైతే చాలు మొహమ్మీద నోరు పెట్టి “హా..హా” అని “వాసనొస్తుందా ” అని కనుక్కొని మరీ బాత్రూం లో దూరి డోర్ గట్టిగా క్లోజ్ చేసి క్లోజప్ సంహారం చేసే వాళ్ళు. వాళ్ళకు పాత రూమ్మేట్లు ఇన్స్పిరేషన్ అని ఆటోగ్రాఫ్ బుక్కులో రాసినప్పుడు కానీ నా గంట మోగ లేదు. జీవితంలో ఒక్క సారన్నా “క్లోజప్ దాతా సుఖీభవ” అని దీవించలేదు కృతఘ్నులు. పియర్స్ సబ్బు రుద్దుకునే వాళ్ళు కాదు అని మాత్రం అర్థం అయింది ఎందుకంటే వాళ్ళు నాలాగా సీతయ్యలు అయిపోలేదు.


కొస మెరుపు ఏంటంటే నా రిన్/డెట్ సబ్బు కూడా వాడే వాళ్ళు కాదు. కారణం జానా రెడ్డి ని అడిగినా తడుము కోకుండా చెప్పేస్తాడు. వాళ్ళు ఉతికిన బట్టలు వేసుకునే వాళ్ళు కాదు. ఐరన్ బాక్సు మాత్రం పాంట్లకు, చొక్కాలకు, బనీన్లకు వాడే వాళ్ళు. వాళ్ళు ఇస్త్రీ చేసిన తరువాత ఐరన్ బాక్సుని విమ్ పౌడర్ తో కడిగి వాడే వాడిని.


మళ్ళీ వర్తమానం:


చిన్న బుడ్డోడికి పైన మూడు పళ్ళు కింద మూడు పళ్ళు వచ్చాయి. వాడికి కోల్గేట్ పేస్టు చూపించగానే ఆరు పళ్ళూ బయట బెట్టి “పే..పే..” అని ముడ్డి ఊపుకుంటూ వచ్చేస్తాడు. ఇంకా క్లోజప్పు పేస్టు అలవాటు చెయ్యలేదు. పేస్టు మాత్రమే నోట్లో పెట్టు అని అరిచేంతలోపే బ్రష్షు మీద పేస్టు పెట్టి వాడి నోట్లోకి తొయ్యబడుతుంది. వాడు అలా బ్రష్షుతో పేస్టు చప్పరించినప్పుడల్లా రవితేజా లాగ కళ్ళద్దాలు పెట్టుకుని కుడి వైపుకి చూస్తూ

“గుర్తుకొస్తున్నాయి… గుర్తుకొస్తున్నాయి..
బాత్రూములో ఏ మూలనో పెట్టిన క్లోజప్పేస్టు..
రూమ్మేట్లు బొక్కిన రోజులు గుర్తుకొస్తున్నాయి..”

అని పాడు కుంటూ వుంటా. పెద్దోడేమో పేస్టు నోట్లో పెట్టుకుని “వన్..టూ..త్రీ .. “ అని పద్దాకా లెక్క పెట్టుకుని తోముకుం(తిం)టాడు. ఆ లెక్కలకర్థం పైకి పది సార్లు, కిందకి పది సార్లు, అడ్డంగా పది సార్లు, నిలువుగా పది సార్లు తోమాలన్నమాట.


కాలెజీలో క్లోజప్పయితే ఇప్పుడు కోల్గేటా అని పెళ్ళయిన వాళ్ళను అడక్కూడదు. చంద్ర మోహన్ సినిమాలు బాగా చూడాలంతే.




Wednesday, November 21, 2007

నేడు నెనర్ల డే




అమెరికాలో ఇవాళ థ్యాంక్స్ గివింగ్ డే. ఈ రోజు అమెరికన్లు తమ తమ కుటుంబాల తో గడపటం దీన్లోని విశేషం. రోడ్లో కార్లు తిరగని రోజేదన్న వుందంటే అది నవంబర్ లో వచ్చే నాలుగో గురువారం. ఈ డే వచ్చిందంటే కొన్ని మిలియన్ల టర్కీ కోళ్ళకు డయ్యింగ్ డే. రెండ్రొజులో మూడురోజులో టర్కీని ఊరగాయ పెట్టినట్లు ఊరబెట్టి, కాల్చి తరువాత ఇంటి పెద్ద చేత మొదటి కత్తెర వేయించి వైన్ తాగుతూ ఇంటిల్లి పాదీ ఆనందంగా గడుపుతారు.

తరువాతి రోజు అంటే శుక్ర వారం రోజు అన్ని షాపుల వాళ్ళు ఎంతో కొంత చౌకగాగా వస్తువుల్ని అమ్మకానికి పెడతారు. అది కూడా ఉదయం కొన్ని గంటలు మాత్రమే. వీటికోసం పోలో మంటూ షాపులకు పొద్దున్నే వెళ్ళి చల్లో కోట్లు వేసుకొని నిలబడి కావల్సిన వస్తువుల్ని కొనుక్కోవడం రివాజు. ఇదంతా ఒక ఎత్తు.

ఇన్ని మిలియన్ల టర్కీలలో ఒక టర్కీకి జీవితాంతం బతగ్గలిగే అవకాశం ఒకటి వుంటుంది. ఆ అదృష్టం కావాలనే టర్కీ కోడి అధ్యక్ష భవనంకేసి పరుగులు పెట్టాల్సిందే. ప్రతి సంవత్సరం అమెరికా అధ్యక్షుడి ఒక టర్కీకి క్షమా భిక్ష పెడతాడు. ఆ రోజు అధ్యక్షుడు క్షమించిన టర్కీని చచ్చేదాకా రాచ రికపు మర్యాదలతో చూసుకుంటారు. ఈ సారి "మే" అనబడే టర్కీ కోడిని ఆ అదృష్టం వరించింది.


అఖిల భారత రౌడీల మహా సభ

ఆకు రౌడీలు, చాకు రౌడీలు ,ఘరానా రౌడీలు, పురానా రౌడీలు, రిటైర్డ్ రౌడీలు,రెలిజియెస్ రౌడీలూ,మెగా రౌడీలూ, మోడు రౌడీలు,వీధి రౌడీలు అందరూ వచ్చారు..వస్తున్నారు. ఈ సారి మహా సభల ప్రత్యేకత సైబర్ రౌడీలు కూడా వీళ్ళతో కలవడం. ఏ ఒక్కరు కానీ తమ సొంత వాహానాల్లో సభా ప్రాంగణానికి రావడం లేదు. అన్నీ కొట్టుకొచ్చినవి లేదా ఓనరును కొట్టేసి తీసుకు వచ్చినవి. సభా నియమాల ప్రకారం అందరూ తమ దుస్తులును వదిలేసి సభా నిర్వాహకులు ఇచ్చిన నలుపు చారల దుస్తులు వేసుకుని లోపలికి వెళుతున్నారు. వాళ్ళ వదిలేసిన దుస్తులు గోడకున్న కొక్కానికి వేలాడ దియ్య బడ్డాయి.

ఎంత రద్దీ వున్నా ఎవరూ ఎవరినీ తోసుకుని ముందుకు వెళ్ళడము లేదు. ఓపికగా ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నారు. వచ్చిన వాళ్ళ బ్యాడ్జ్ నంబరు ప్రకారం వారి సీట్లో వారు కూర్చుంటున్నారు. ముందు వచ్చిన వాళ్ళకు ముందు సీట్లు వెనక వచ్చిన వాళ్ళకు వెనక సీట్లు ఇస్తున్నారు. అందరూ తమ పక్కన కూర్చున్న వాళ్ళతో ఉల్లాసంగా మాట్లాడుతూ తాము ఎన్ని మర్డర్లు చేశారో, ఎన్ని దొంగతనాలు చేశారో చెప్పుకుంటూ సరదాగా ముచ్చటంచుకుంటున్నారు. కొందరు తాము ఎంత తొందరగా మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి చేపట్టామో విపులంగా చెబుతున్నారు. కుర్ర రౌడీలు అలాంటి వారి దగ్గర ఆటోగ్రాఫులు లైన్లో నిలబడి తీసుకుంటున్నారు.

అందంగా వున్నా ఆడ రౌడీల వెనక ఏ మగ రౌడీ కూడా వెంట బడటం లేదు. ఆ సభకున్నా నీతి నియమాల్ని ఏ ఒక్కరూ అతిక్రమించడం లేదు. కొత్తగా సభ్యులయిన వారు తెలియక చేసే కొన్ని పనులకు సుతారంగా హెచ్చరించి వదలి వేస్తున్నారు.

సభ ప్రారంభమయ్యే అర గంట ముందు రౌడీ మహా సభ నాయకుడు ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ అందర్ని పలకరిస్తున్నాడు. వేదిక మీద చెప్పే గణాంకాల కోసం అందరూ విప్పేసిన దుస్తులు వున్న గదిలోకి వచ్చాడు. అక్కడ చాలా రంగుల చొక్కాలు వున్నాయి. తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, గులాబీ, నలుపు ఇలా భారత దేశంలో వున్న అన్ని పార్టీల రంగులు కనపడ్డాయి. ఎక్కువమంది బీహారు నుండీ, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చినట్టు గమనించాడు. పక్క రాష్ట్రం కర్నాటక నుండి కొంత మందే వచ్చినట్టు గమనించి "ఏంటి ఈ మన కర్నాటక రౌడీ సోదరులు సాఫ్టువేరు కంపెనీలు గానీ తెరిచారా ఈ సారి చాలా తక్కువ మంది వచ్చారు " అని అడిగాడు.

పక్కనున్న అనుచరుడు అందుకొని "అన్నా అక్కడ మన వాళ్ళకు మంచి పని దొరికిందన్నా మనొడెవడో ముఖ్యమంత్రి పదవికి ట్రై చేస్తున్నాడు అందుకనే మన రాయల సీమ రౌడీ సోదరులు కూడా బెంగళూరు వెళ్ళి పోయినారన్నా. మూడో రోజు ముగింపు సమావేశాలకు వచ్చేస్తారన్నా" అని చెప్పాడు.


సభ మొదలయింది. సభాధ్యక్షుడు మైకు తీసుకుని “తోటి రౌడీ సోదరసోదరీమణులకు ఇక్కడికి విచ్చేసినందుకు చోర నమస్కారాలు. ఎప్పట్లాగా మన నీతి నియమాల గురించి మొదట మొదలు పెడతాను. మన మందరం ఎప్పట్నుండో ఐకమత్యంగా వుంటున్నాం. అలాగే వుండాలి కూడా. మనం మనల్ని దోచుకోకూడదనే విషయం మనందరికీ తెలిసిందే. కొంత మంది తమకు సరయిన జరుగుబాటు లేకపోవడం వల్ల అంటే స్ట్రిక్టుగా వుండే పోలీసులు, ప్రభుత్వాలు వుండే చోట వుండడం వల్ల. క్షుద్భాధ ను ఆపుకోలేక ఈ సభా ప్రాంగణానికి వచ్చి తోటి సోదరుల వస్తువల్ని తస్కరించి వుండ వచ్చు. అలా ఎవరూ చేయరని అనుకుంటున్నాను. తమకు తెలియక అలా చేసి వుంటే వెంటనే తాము కొట్టేసిన వస్తువులను వాళ్ళ యజమానికి తిరిగి ఇచ్చివేయమని కోరుకుంటున్నాను” అన్నాడు.

యాభై వేల మంది హాజరయిన ఆ సభలోనుండి ఒక వ్యక్తి లేచి నిలబడి కళ్ళ నీళ్ళ పర్యంతమై “అన్నా ! మా ఏరియా లో వుండే ఎస్పీ చాలా స్ట్రిక్టు. అందువల్ల ఏమీ చెయ్యలేక పూటకు కూడా గడవడం లేదు. అందువల్లే నేనీ రౌడీ కుల ద్రోహానికి ఒడి గట్ట వలసి వచ్చింది. నన్ను నిలువునా చంపేసి నా కళ్ళూ, కిడ్నీలు వృత్తి ధర్మం చేస్తూ విధి నిర్వహణలో ఉంటూ వాటిని కోల్పోయిన వాళ్ళకు బహూకరించండి.” అని భోరున విలపించి తాను కొట్టేసిన బంగారు బ్రేసులెట్, డైమండ్ నెక్లీస్ యజమాని దగ్గరికి వెళ్ళి ఇవ్వబోయాడు.

ఆ యజమాని వెంటనే అతన్ని కోగలించుకొని “రౌడీ సోదరా! ఈ నగలు నువ్వే వుంచుకో. ఒక రౌడీకి ఇంకో రౌడీ సాయం చేసుకోకుంటే ఎలా. మనమేమన్నా రాజకీయ నాయకులమనుకున్నావా? మనం బతుకు దెరువు కోసం మాత్రమ రాజకీయ నాయకులం. ఇక్కడ కాదు” అని ఇంకో సారి గట్టిగా కౌగలించుకుంటే అతని నడుముకున్న జర్మన్ మేడ్ పిస్టల్ తగిలి బలహీన రౌడీ “అబ్బా” అన్నాడు.

“క్షమించు తమ్ముడూ” అని తన పిస్టల్ తీసి ఆ బలహీన రౌడీకి ఇచ్చాడు మంచి పద్యం చెప్పిన కవికి మహరాజు మణిహారాన్నిచ్చినట్టు.

సభంతా కర తాళ ధ్వనులతో మార్మోగి పోయింది. సభాధ్యక్షుడు మైకి తీసుకు “అన్ని తూటాలుంటే కొన్ని తూటాలివ్వవోయ్ అని చాటి చెప్పిన చంబల్ మంగళ్ సింగ్ మాటల్ని ఆచరించి చూపిన ఇలాంటి వారే మన రౌడీ వంశానికి స్పూర్తి. ఇతనికి వచ్చే సమావేశాల్లో చోరాదరణ్ సామ్రాట్ బిరుదును ఇవ్వడానికి కృషి చేస్తా. మరొక్క సారి చప్పట్లు కొట్టండి” అని చెప్పి తన సెక్రెటరీని పిలిచి ఆ బలహీన రౌడీ వున్న ఏరియాలో పని చేసే ఎస్పీ పేరు నోట్ చేసుకోమన్నాడు.

“పోయిన సారి సభలు జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ముగ్గురే వున్నారు. ఈ సారి అది ఒకటికి చేరింది. వచ్చే సభలకు ఇలాంటి బలహీన రౌడీలున్న ఇల్లే లేకుండా చేయడం మన ప్రధాన లక్ష్యం. ఈ సభలోనే కాదు మన సంఘంలో చేరిన ఏ ఒక్కరూ ఇలాంటి దుస్థితికి రాకూడదు...రాకూడదు..రా... ” అని చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు.

"ఇక సభను ప్రారంభించబోయే ముందు ఈ సభ నిర్వహణ కోసం పగలనక రాత్రనక పని చేసి, పగలు నిద్ర పోకుండా వున్నందు వల్ల తన అరోగ్యం పాడయినా, తన ఆదాయానికి గండి పడ్డ లెక్క చేయక ఒంటి చేత్తో ఇక్కడ హైదరబాదులో వున్న వాళ్ళను అదిలించి బెదిరించి అన్ని సౌకర్యాలను సమకూర్చిన 'బ్యాంకు బొక్కల' దుడ్డు దుర్మాగ రాయుడిని సభా ముఖంగా ప్రశంశిస్తూ అతనికి ఏ.కె.47 ను బహూకరిస్తున్నాము” అని పిలవగానే దుడ్డు దుర్మాగ రాయుడు వేదిక మీదకు వచ్చి ఆ ఏ.కె.47 ని తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు.

చమరుస్తున్న కళ్ళతో “నాకు ఇచ్చిన ఈ ఏ.కె.47 ను మన రౌడీ సోదరులెవ్వరి మీద ప్రయోగించనని నిండు సభలో ప్రమాణం చేస్తున్నాను.ఎంగిలి మెతుకులు తింటూ పిక్ పాకెటర్ గా మొదలు పెట్టిన ఈ జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే స్థాయికి చేరాను. మీ అండ దండలు ఇలానే వుంటే నేను ముఖ్యమంత్రి అయిన తరువాత రౌడీల కోసం ఒక ప్రత్యేక మైన్ సెల్ ఓపన్ చేసి కొత్తగా వృత్తి లో చేరుతున్న వారందరికి ఉచితంగా కత్తులూ, బ్లేడులు సప్లై చేస్తా.జై చోర సామ్రాజ్ ” అని ఏ.కె. 47 ను భుజానికి వేసుకొని వేదిక దిగాడు.

అక్కడ వున్న సామాజిక శక్తి పత్రిక విలేఖరి వెంటనే తన నోట్ బుక్ తెరిచి అందులో "ఆకలి పేగులతో , మాడిన కడుపులతో,ఎండిన గుండెలతో ఒక బాలుని రౌడీ జీవిత నిజ గాథ" అనే హెడ్లైన్‌తో న్యూస్ ఐటం తయారు చెయ్యడంలో నిమగ్నమైపోయాడు.

సరిగ్గా అప్పుడే సభా ప్రాంగణంలోకి కొన్ని హెలికాప్టర్లు దిగాయి. అందులో నుండి దిగితున్న వారిని రిసీవ్ చేసుకోడానికి కొంత మంది అటు వైపు వెళ్ళారు.

సరిగ్గా అదే సమయానికి సి.ఎన్.ఎన్. లో బ్రేకింగ్ న్యూస్
"ఇండియాలో కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఏక కాలంలో కనిపించుట లేదు"

(సశేషం)

Tuesday, November 20, 2007

ఎవరు చెప్పారు?




మాట్లాడే వయసు వచ్చినప్పుడు ఏదన్నా చెప్పాలంటే మా అమ్మ చెప్పింది అంటాం.

అలాగే స్కూలుకు వెళ్ళే వయసులో మా టీచరు చెప్పింది/చెప్పాడు అంటాం.

కాలేజీ వయసులో మా ఫ్రెండు చెప్పాడు అని.

ఉద్యోగమొచ్చాక మా బాసు చెప్పాడు అని అంటాం.

తరువాత పెళ్ళయ్యాక


.....................

.....................

.....................


మా ఆవిడ చెప్పింది.. మా ఆవిడ చెప్పింది..మా ఆవిడ చెప్పింది(మూడు సార్లు శోభన్ బాబు లాగా) అంటాం(రు).

ఇలా రాయమని ఎవరు చెప్పారు అని మెదడులో ఉత్తేజకరమైన ఉత్సాహ తరంగాలు మొదలయితే మీకు పెళ్ళి కాలేదని అర్థం.

Monday, November 05, 2007

రైతుల పాడి పంటల కోసం అసెంబ్లీ (లో) రాజకీయుల "పెంట" పొలాలు.




పొలం కబుర్లు:


పంటలు పాడవకుండా చేనుకు చేవ రైతుకు దిగుబడి కావాలంటే మీ పొలంలోకి వచ్చే ఇతర కోడె గిత్తలను ఇలా బాగా కడిగిన తరువాత అలా నోరు ముయ్యాలి. మీ ఇతర పశువుల నుండి వచ్చే పేడతో ఆ కోడె గిత్తలమీద మెత్తగా గుండ్రంగా వేసి పిడకల కోసం వేస్తున్నామని భావించాలి.