Friday, June 27, 2008

మా యవ్వ -- 4

* * * * * * * *


మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం

* * * * * * * *


చానా తూర్లు మాదిరి ఒగ తూరి మా మామంగడి కాడికి బొయినా మా యత్త చక్కిరి దెచ్చుకోవల్లంటే. చక్కిరి మూట్లు ఆణ్ణే వుంటాయి. మామెవురిదో చేను రిజిస్ట్రేషనుంటే వాళ్ళకి సాయింగా వాయిల్పాడుకి బొయినాడు. మాముంటే "ఆడ చెయ్యి పెట్టగాకప్పా.. అది షాక్ కొడుతుందప్పా.. బీరువా అద్దం పగులిపోతుందప్పా.. పగిలితే దెబ్బ తగుల్తుందప్పా.." అని అంటానే వుంటావుడు అయనకింగేంపన్లా పిలకాయిలంటే కింద పడకుండా, మూతో, ముక్కో పగలగొట్టుకోకుండా వుంటారా ఏంది. ఈ పెద్దోళ్ళకేం తెలీదు. అందుకే మా యత్త అంగిడి కాడికి బోతా వుందంటే యాడికీ బోకుండా ఆణ్ణే వుంటా. అబ్బుడబ్బుడూ మా యత్తేమో "ఆడెక్కబాకప్పా... ఈడెక్కబాకప్పా... పడతావప్పా.." అంటుంది. ఏందో ఈమె గూడా అంతే పిళ్ళోళ్ళనింతర్వాత దెబ్బలు తగిలిచ్చుకోకుండా వుంటారా? మా మామకి సరైంది దొరికింది. యీళ్ళకన్నా మా యవ్వే చానా మేలు. ఏం జేసినా "జాగ్రత్తప్పా.. తగుల్తుందప్పా.." అంటుంది. తగిలిచ్చుకున్యాక ఏ తంగేడాకో ఏసి కట్టు గడుతుంది. కుంటితే ఎత్తుకోని తిరుగుతుంది.

అట్ల మా యత్త అంగిడి తెరిచిందో లేదో ఎదురింటి బువ్వమ్మొచ్చె నాకు కొంజేపు పోలీసు లేకుండా జేసేదానికి. బయట్నే బువ్వమ్మతో అరట్లు కొడతావుంటే ఇదే సందు రా నాయినా అని సర్రమని నేను లోపలికి దూరి బొయినా. ఆ మిద్ది లోనే చెనిక్కాయి మూట్లు, ఒడ్లు మూట్లు, చక్కిరి మూట్లు ఏసుంటారు. మన కన్ను మిద్ది లో ఈ మూల నుండి ఆ మూలకు ఏలాడ దీసిన రాగి రిబ్బను యాంటెన్నా మింద పడె. ఇస్టూలు దెచ్చి దానిమిందెక్కి ఒగ కాలు బెట్టి ఇంగో కాలు ఆడుండే చెనిక్కాయిల మూటల మింద బెట్టి ఆ యాంటెన్నాను పట్టుకుంటే అది పుటుక్కుమని తెగి పాయె. ఇట్లాంటియ్యన్నీ ఎబ్బుడూ కాసింత చేతులుండే పిళ్ళోళ్ళ చేతుల్లోనే ఎందుకు తెగి పోతాయో నాకర్థం కాలా. ఏమి జెద్దాం రో యబ్బో.. మామయితే తిడతాడు, అవ్వయితే పడితే కట్లు గడతాది, అమ్మయితే ఇంగేం ల్యా ఓనిమెంబడి పరిగెత్తిచ్చి చింత బరస తో గొడుతుంది. టీచురు గదా ఆ బుద్దులేడ పోతాయీ. చిన్నగ సౌండు జెయ్యకుండా కిందకు దిగేసి యాడుండే ఇస్టూలు ఆడే బెట్టేసి తేలు గుట్న దొంగలా బయటకొచ్చేస్తి. ఆడ జూస్తే ఏముంది మా యత్త ఇంగా బువ్వమ్మతో కచేరి పెడతా వుంది. వాల్ల కొడుక్కి మాల్లో (మహల్ - ఊరి పేరు) పెండ్లయిందంట. దాని గురించి జెబతా వుంటే ఇంటా వుంది. అబ్బుటికి ఇంగా పెండ్లి సీను కాడికి గూడా రాలా పెండ్లి కోసరం ఏమేమి గొన్యారో జెబ్తా వుంది. వోళ్ళు సాయిబూలు గదా ఆ జుంకీలు, పూసల నగల గురించి జెబ్తా వుంటే ఇంటా వుంది. ఈ ఆడోళ్ళింతే రోల్డు గోల్డు నగల గురించి జెబ్తా వున్యా చెవులకు సమ్మగా వుంటాది.

రామాయిణం కథ ఇంగా చానా వుందని మనం మల్లా లోపలికి బొయి చక్కిరి మూట తెరిచి రొండు సార్లు బొక్కాలాడేస్తిమి. ఒగ పక్క చక్కిరి మీసమొచ్చె. దాన్ని చోక్కా పైకెత్తి తుడుచుకుంటా వుంటే ఎంబ్రాయిడరీ తెల్ల గుడ్డ గప్పిన పెద్ద రేడియో కనిపిచ్చే. ఏందో మా మాముంటే ఏమీ కనిపిచ్చవ్ ఆయన జెప్పే మాట్లే ఇనిపిస్తాయ్. మల్లా ఇస్టూలేసుకోని రేడియో నాబు బట్టుకోని రొండు మూడు సార్లు తిప్పితి. సౌండు రాలా. రేడియో కొంజెము ముందుకు లాగితి. ఎనకాల క్లిబ్యాడు (ప్యాడ్) మాదిరి చెక్క కనిపిచ్యా. చిటికెనేలు బెట్టి దాన్ని లాగితే మొత్తం అట్ట ఊడి చేతిలోకొచ్చె. లోపలంతా జంతర్ మంతర్. పెద్ద పెద్ద బల్పులు కమ్మర కట్ల మాదిరి, ట్రాన్స్ ఫార్మర్లు మైసూర్ పాకుల మాదిరి , ఇంగొన్నేమో కజ్జి కాయిల మాదిరి , కెపాసిటర్లు చిన్న అత్తిరాసాల మాదిరి , సీసం ముద్దలు ఎన్న ముద్దల మాదిరి కనిపిచ్చినాయి. తీపి తినే వోళ్ళకు అన్నీ అట్లే కనిపిస్తాయని మా యవ్వ ఎబ్బుడూ జెప్పేది. అన్నీ ఓ తూరి చేత్తో నిమిరి కొన్నింటిని లాగి మల్లా ఆణ్ణే పెట్టేసినా. ఏన్ని జేసినా సౌండు రాలా. మా మామ షోక్కోసరం పాడై పూడిసిన రేడియో పెట్టుకొనుండాడ్లే అని అట్ట పెట్టి మూసేసి కిందకొచ్చేస్తి. సౌండు లేని రేడియోలెందుకు బెట్టుకుంటారో ఈ పెద్దోళ్ళు అనుకున్యా. సౌండ్యాలొస్తుంది వాన బడితే కరంటు షాకు గొడుతుందని మా మామ కరంటు ప్లగ్గు పీకి పాయె. అది మనకు తెలక పాయె.

సాయింత్రమయినంక వాయిల్ పాడ్నుంచి మా మామొచ్చె. రాంగానె బొయ్యి చేతిలో సంచీ పీకేస్తి. "వుండుప్పా నీ కోసం కలకండ తెచ్చినా" అని పెద్ద పెళ్ళ ఒగటిచ్చె. మిగిలింది దాంపెట్టేదానికి అంగిడికి కాడికి బాయె. ఇంట్లో వుంటే మనం చప్పరిచ్చేస్తామని మామకు చానా బయిం. ఈ బయిము అన్ని చోట్లా వుంటే బాగుండె అనుకుంట్ని గానీ అది మన చేతుల్లో లేకపాయెనె. అంగిడి కాడి నుండి తిరిగొచ్చినంక ఇంగ జూసుకో నా సామిరంగ.ఱంకెలెయ్య బట్టె.

"మ్మేయ్. ఎవురు రేడియో ని కలబెట్టింది. ఈణ్ణి గానీ అంగడికి కాడికి దీస్కోని బొయింటివా. ఈడు దుడుకోడు. ఈణి చేతులెబ్బుడూ చిమ చిమ లాడతా వుంటాయి. ఈణి చెయ్యి నిమ్మళంగా వుండదు. ఇబ్బుడది రిపేరీ జెయిచ్చల్లంటే కలకడ పోవల్ల " అని అత్తనడగతా వుంటే నా చెవుల్లో బడె. ఆడుంటే మనకి పెండ్లి జేస్తార్రా సామి అని గోడ మింద నుండి ఎరువుదిబ్బ మిందకు దూకేసి గానిగ తోపులోకి వురుకో వురుకు.

ఇంటికొచ్చినంక అవ్వ సపోర్టుతో ఈపు సాపుగానె వుండిపాయె.

* * * * * * * *


ఈ పెద్దోళ్ళకు బయిమూ లేదూ ఇంగా ఏమీ పనీ లేదు లీవూల్లో పిల్లోళ్ళు ఏట్లంబడి, బాట్లంబడి, చెట్లంబడి, పుట్లంబడి తిరక్కుండా వుంటారా ఏంది? సందు దొరికితే సొక్క కాలరు బట్టుకొని కూసోబెట్టిస్తారు. అవ్వలు తాతలు అయితే పరవాలా. వాళ్ళ కింద నుండే తరముంది గదా ఈళ్ళే ఈళ్ళ సొమ్మంతా బోయినట్టు మనల్ని కూసోబెడతారు. అట్లా కుదరకపోతే వాళ్ళకన్నా పెద్దోళ్ళకు జేబ్తారు పిలకాయిలకు ఏమన్న నేర్పిచ్చచు గదా అని. ఇట్లే వాళ్ళ మాయ దారి మాటలు నమ్మి మా యవ్వ నన్నోసారి "ఎండన బడి పోగాకు నాయినా. ఇట్లా ఒచ్చి ఆ సింత సెట్టుకిందేసిన నులక మంచెం మింద కూసో. దాని మింద పరుపేస్తా గొంచెముండు" అనే. చింత చెట్టు కింద సల్లగా గాలోస్తా వుంది. ఆ ఎండకి సల్ల గాలికి సగిచ్చినట్టుగా వుంది. ఒగ సారి పండుకుంటే చింత సెట్టెగిరిపోయేట్టు గురకలు బెట్టి నిద్దర బోతా. అబ్బుటికి ఆడుకునే దానికి ఎవుడూ రాలా. ఇట్లా మా యవ్వ సట్లు కడిగేసి నార పరుపెత్తుకొని సెట్టికిందకొచ్చె అట్ల ఆడుకునేదానికి బోడోడొచ్చె. ఏందిరాయబ్బో ఎట్ల తప్పిచ్చుకునేదని పిల్లి ముందర ఎలక మాదిరి దిక్కులు జూడబెడ్తి. ఇంగే ముంది మా యవ్వ నులక మంచమ్మింద గూచెబెట్టె. కూసోని ఊరికే వుంటుంద్యా ల్యా. ఏ జెక్కీకి పాటో పాడితే నేను డ్యాన్సేస్తా ల్యాకుంటే కావమ్మ కథ జెబ్తే ఇంటా. అట్లా గాకుండా ఏందో శ్లోకం జెబ్తా పాయె. అదేందో "ఓం సిద్ధమ్న మహః" అంట. జెప్పేసి చెంబులో నీళ్ళు తాగి ఆపక్కన తిరిగి పండుకోకుండా నువ్విబ్బుడు జెప్పుప్పా అనె. "ఓం సిద్ధమ్న మహః సిద్ధమ్మని గద్దలెత్తుకుని పాయె.. సిద్ధప్ప కట్టె బట్టుకుని వాటెంబడి పరిగెత్తా పాయె.. నేను గూడా పరిగెత్తా పోతా " అని నేను నాలుగు దుముకు లేసి పరిగెత్తు కుంటా వురుకో వురుకు. "ఏం బిడ్డలురా నాయినా మీరు" అని ఆ మంచమ్మిందనే కునుకు తీసె ఇంగ. అట్లన్యా మనకు తెలుసు సాయంత్రం మనం గుడ్డలు గలీజు జేసుకోని రాంగానే టెంకాయి బొచ్చుతో మురికంతా రుద్ది రుద్ది నీళ్ళు బోసి ఏరే గుడ్డలేసి మెట్ల మింద గూసోబెట్టి మచ్చల కోడి పెట్ని గుడ్డు తో మనకు అట్టేసి పెడుతుందని. ఇంగంతే కదా అవ్వలంటే.

* * * * * * * *


ఇట్లే ఒగ సారి ఏట్లోకి బొయ్యి నీళ్ళల్లో ఈత గొట్టి అంటే కాళ్ళు నీళ్ళలో, చేతులు గడ్డ మింద పెట్టి నీళ్ళలో బాగా మునిగి ఇంటి కొచ్చినా చీగటి బడి గొడ్లు ఇంటిగొచ్చేటబ్బుడు. ఏమీ తినకుండా పండుకోని నిద్దర బోతి. అబ్బుడు మనకు అయిదెండ్లుంటాయేమో.స్పారకం లేకుండా నిద్దర బొయినా.కడుపుకేం దెలుస్తుంది స్పారకమేందో. అది కోడు గుడ్డు జాములో లేసి కోలాటమేసె. నేన్‌ లేసి "నా కన్నమో.. నా కన్నమో.. నా కన్నమో.." అని గలాట జేస్తి చేతుల్ని ఏతాము మాదిరి తిప్పుకుంటా. మా యమ్మకు కోపమొచ్చె. "ఎన్ని తూర్లు జెప్పినాన్రా నీకు కాసింత అన్నం తిని పండుకోమని ఇంటావా నువ్వు" అనె. అర్ద రేత్తిరి కాడ లేసి అరిస్తే ఎవురికి కోపం రాదు. చానా మందికొస్తుంది గానీ మా యవ్వకు రాదు. "అరె పా..నువ్వూర్కో అమ్మణ్ణీ. పాపం పిలగాడు అర్ద రేత్తిరికాడ అన్నమంటావుంటే కసురు కుంటావే. నేను రూంత ముద్దలు కలిపి పెడతా. నువ్వు పండుకో " అనె.

కన్ను బొడుచున్యా ఏమీ గనిపిచ్చదు. కిరసనాయిలు బుడ్డీ ఎలిగిచ్చుకోని అన్ని సట్లల్లో జూసె. యాడా ఒగ మెతుగ్గూడ దొరకలా. పులుగూ బూసి వుంటాయణ్యా ఇనకుండా ఆ చీగట్లోనే గాడ్డామి కాడికి బొయ్యి కొంచెం ఎండు గడ్డి దెచ్చి దాని మింద కిరసనాయిలు బోసి పొయ్యిలో ఏసి జొన్న కర్రల్తో పొయ్యెలిగిచ్చె. కొంచెం అన్నమూ, కొంచెం చిన్నెరగడ్ల తాళింపు చేసి పెట్టె. మనమేడ? ఎబ్బుడో ఎరగడ్లు పొట్టు ఒలిచేబ్బుడే నిద్దర్లోకి జారుకుంటిమి. లేపి "తిన్నాయినా. నీకిష్టమని ఎరగడ్ల తాళింపు జేసినా" అనె. నేనేమో "నా కొద్దో.. నా కొద్దో.." అనబడితి. "కొంజిము తినుప్పా.. లేగపోతే నిద్దర బట్టదు.మా చిన్ని కదా..లే నాయినా.." అనె మల్లా. మనమేమో దుప్పటి గప్పుకోని "నా కొద్దో..నా కొద్దో.." అని రికార్డు ఎయ్యబడ్తిమి. మా యమ్మకు మళ్ళీ కోపమొచ్చె. మా యవ్వేమో "పొన్లేమ్మా. బిడ్డకు నిద్దరొస్తా వుంది. పండుకోనీలే" అని కాపాడె. నన్నెనకేసుకొచ్చే దానికే అవ్వ బుట్టిందేమో.

* * * * * * * *


అబ్బుడెబ్బుడో జెప్పినా గదా ఒగ తూరి మనం చానా చిన్నగా వుణ్ణప్పుడు మనల్ని ఆస్పత్రిలో జేరిపిచ్చినారని. మదనపల్లి గౌషాష్పత్రి ఓళ్ళు నన్ను జూసి "అయ్యో ఈ పిల్లోనికి ఎన్ని మందులేసినా తగ్గ లేదే. మా వళ్ళ కాదు గానీ వేలూరి పెద్దాసుపత్రికి తీస్కోని పొండి. నేను జెయ్యాల్సిందంతా జేసినా. ఈ రోగమేందో నాకు తెల్లా. ఆడ పెద్ద డాక్టరు, ముత్తయ్య డాక్టరుండాడు ఆయినికి చీటీ రాసిస్తా" అని డాక్టర్ జెప్పె. ఇంగ జూసుకో మా యమ్మేడిశా, మా నాయినేడిశా, మా మామేడిశా, మా పెద్దమ్మేడిశా. ఇంగ మాయవ్వుంటుంద్యా "అయ్యో మారాజట్ల పిలగోనికి ఏమి రోగమొచ్చినో ఏమో" అని చీర కొంగు నోట్లో దోపుకునే.

(సశేషం)

* * * * * * * *

Wednesday, June 25, 2008

బ్లాగదాభి రామ బ్లాగర -- 6

* * * * * * * *


ఆచరణ శుద్ధి లేని ఆటోపబ్లాగది ఏల
భావశుద్ధి లేని పోస్టుయది ఏల
చీర్ శుద్ధి లేని స్పామువాగుడేల
బ్లాగదాభి రామ బ్లాగర విహారి

మరిన్ని బ్లాగదాభి రామ పద్యాలకు 'బ్లాగదాభి రామ' లేబులు నొక్కండి
* * *


ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల
భాండ శుద్ధి లేని పాకమది ఏల
చిత్త శుద్ధి లేని శివ పూజలేలర
విశ్వదాభి రామ వినుర వేమ
* * * * * * * *

Saturday, June 21, 2008

కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 2

* * * * * * * *


ఇంతవరకు జరిగిన సస్పెన్సు, యాక్షన్, స్పై, త్రిల్లర్ లేని సంఘటనలు ఇక్కడ చదివి మళ్ళీ చదవాలనిపిస్తే ఇచటకు రండి.

* * * * * * * *


వచ్చిన ఈ-మెయిల్లన్నీ చదివి అందరికీ ఒకే ఈ-మెయిల్ పంపించా.
ప్రియమైన బియ్యపు అభిమానులకు,
మీరు బియ్యం మీద చూపించిన ఆప్యాయానికి కడుంగడు సంతసించితిని. మీరు పోయిన జన్మలో ధాన్య లక్ష్మి ని సరీగా పూజించక పోయి వుండచ్చు. అందువల్ల కలిగిన పూర్వ జన్మ పాపములు, ఎప్పుడైన ధాన్య గింజకు చేసిన ద్రోహం వల్ల కలిగిన గ్రహ దోషములు ఈ సారి బియ్యం మీద చూపించిన అభిమానంతో నివారణ అగును.

మనము ఇక్కడ సమిష్టి వ్యవసాయం చెయ్యలేము కానీ సమిష్టిగా పోరాడవచ్చు. మీలో ఒక సర్దార్ పాపారాయుడు వుండవచ్చు (తుపాకులవసరం లేదు..బారెడు గడ్డం కూడా), బొబ్బిలి బ్రహ్మన్న వుండవచ్చు(కత్తులు అవసరం లేదు..ఎర్రని కళ్ళు, ఉబ్బిన చాతీ మాత్రం మాండేటరీ), రాణా ప్రతప సింగు వుండవచ్చు(గుర్రాలు అవసరం లేదు). మనమందరం మనకు బియ్యపు కార్డులు వచ్చే వరకు కలిసి పోరాడదాం. ఆ తరువాత ఎటూ మన జన్మతః వచ్చిన లక్షణాలవల్ల విడిపోతాం కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు.

అందరం వచ్చే శని వారం సాయంత్రం 4 గంటలకు మా ఇంట్లో కలుద్దాం. మా ఇంట్లో 15 కుర్చీలు, 15 కాఫీ కప్పులు మాత్రమే వున్నాయి. కావున మీలో మీరే మాట్లాడుకుని 15 మంది మాత్రమే రండి. అందరం కలిసి రైతు కూలీ సంఘం లా బియ్యం సంఘం పెట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపిద్దాం. ఇంగ్లీషులో రైస్ అసోసియేషన్‌ అని రిజిస్టర్ చేద్దాం. పేరులో రైస్ అని వుంది కాబట్టి కండోలిజ్ రైస్ మనతో కలిసి పని చేసే అవకాశం 99% వుంది.
- జై బియ్యం సంఘం (అరిస్తే పోయేదేమీ లేదు)
- జై అమెరికా తెలుగోళ్ళు (అరిచాం కాబట్టి మళ్ళీ అరవచ్చు)


ఈ-మెయిల్ పంపిస్తే పోయేదేమీ లేదని మనసు మార్చుకుని ఇంకొందరికి కాపీ పెట్టా.

* * * * * * * *


జిడ్డు సుబ్బారావు గాడు బీరు కావాలని అడిగాడు కదా. బీర్లు పెట్టాలంటే ఏ ప్రత్యేక లక్షణాలు లేని భర్తలు బాసు దేవిని అడిగి అనుమతి తెచ్చుకోవాలి.
కార్యేషు దాసుడా
కరణేషు మంత్రీ
భోజ్యేసు భీముడా
శయనేషు మన్మధా

సనాతనమైన అమెరికాలోని భారతీయుల్లో సంప్రదాయ సతీవ్రతా శిరోమణులు యాభై శాతం. అంటే నాకు యాభై శాతం మంది మద్దతు వుంది. ప్రతి శుక్ర వారం సతీవ్రతా శిరోమణుల ఇళ్ళల్లో ఈ శ్లోకాలు నియమ నిష్టలతో టెంకాయ కొట్టి ప్రాక్టీసు చేసుకుంటుంటారు. ఈ శ్లోకం వినబడక పోతే వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డు రానట్టు. ప్రతి రోజూ ప్రాక్టీసు చేస్తుంటే వాళ్ళు అమెరికా సిటిజెన్ షిప్పు తీసుకున్నట్లు. ఎవరింట్లోంచయినా ఈ శ్లోకం ఇంకా వినబడలేదంటే వాళ్ళకు గ్రీన్ కార్డు లేదని సహృదయతతో అర్థం చేసుకోవాలి. ఈ విభాగానికి చెందిన వాళ్ళు భారత్ వెళ్ళి వచ్చేప్పుడు అత్తారింట్లో జరిగిన 'మర్యాదలు' గుర్తుకు తెచ్చుకొని 16 గంటల విమాన ప్రయాణంలో వల్లె వేస్తుంటారు.

పాజిటివ్ గా రిప్లై రావాలంటే ఎడమ చెవిలో చెప్పాలంట అని ఓ శాస్త్రజ్ఞుడు చెప్పాడు. ఆ శాస్త్రవేత్త కి నమస్కరించి భక్తి ప్రపత్తులతో బాసు దేవి ఎడమ చెవి దగ్గరకెళ్ళి బీర్లు తాగడానికి అనుమతి కోసం అడగట మాలస్యం కడిగెయ్యడం మొదలయింది. "అసలే బియ్యం కొనటానికి డబ్బుల్లేక పోతే బీరు కావాలా? ఎక్కువ మాట్లాడితే కాఫీ బదులు కషాయం పోస్తా. అంతగా బీరు కావాలంటే మీ వాళ్ళకు ఎవరికన్నా ఫోను చేసి కనుక్కో ఇంట్లోనే కాయట మెలానో. మీ ముత్తాత మూడో తమ్ముడి ముని మనవడు భాకరా పేట అడవుల్లో ఇప్ప సారా కాచి గవర్నమెంటోళ్ళకి అమ్ముతున్నాడట గదా. అదెట్లా చేస్తారొ కనుక్కొని ఆ వచ్చే వాళ్ళకు పొయ్యి" అంది. ఆ శాస్త్రవేత్త గాడెవడో శాడిస్టు గాడు. పెళ్ళాం చేతిలో తిట్లు తిని ప్రపంచం లో వున్న మగాళ్ళందరూ తిట్లు తినాలని థీసిస్ రాసినట్లున్నాడు. పెళ్ళాం చేతిలో తిట్లు తిన్న ఇంకెవడో ఎడిటర్ గుర్నాధం హెల్త్ జర్నల్ లో వేసి పారేశాడు. వాడో సారి కనిపిస్తే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, ఫ్రైడ్ రైస్, బిర్యానీ రైస్, చింతకాయ రైస్, లెమన్ రైస్ అన్నీ నోట్లో కుక్కేసి బాగా అలవాటు చేయించాలి. అప్పుడు కుదురుతుంది వాడి తిక్క బియ్యం కోసం తిప్పలు పడినప్పుడు.

వారం రోజుల కిందట ఇంటి వెనక నాటిన ద్రాక్ష మొక్క ఆకులు కూడా ఇగురించలేదు ద్రాక్ష తో వైన్ చెయ్యడానికి. అవసరమైతే బిన్ లాడెన్ డెన్ లోకి గన్ లేకుండా బ్రేవ్ మ్యాన్ లా వెళ్ళోచ్చు కానీ అమెరికాలో ఇప్పసారా కాయటం లాంటివి పెట్టుకోకూడదు. ఆ ప్రయత్నానికి తిలోదకాలిచ్చేసి మ్యాచ్ పోయినా మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ కొట్టెయ్యాలని " ఛీ.. ఛీ.. ఆ వెధవ పేరెత్తకు. వాడు నేను మొన్న పంపించిన డబ్బుల్తో ఊళ్ళో పంచాయితీ వాటర్ ట్యాంకు కన్నా పెద్ద సైజు డ్రమ్ము కొనుక్కొని అందులో సారా పోసి అమ్ముతున్నాడట. బీరు కన్నా కాఫీ యే శ్రేష్టం. కాఫీ తాగితే క్యాన్సర్ కూడా పోతుందట. యాక్టివ్ గా వుంటే ఇంకా బాగా డిస్కస్ చేసుకోవచ్చు. ఏమంటావ్ నా పుట్ట తేనె!!! జై బియ్యం సంఘం.." అన్నా

ఆ ఫ్లోలో అలా 'జై' బియ్యం సంఘం అనేశాను గాని బాసు దేవి ఇచ్చిన చూపుకి రెండు రోజులు జై అని కానీ, పిల్లాడిని జో జో అని కానీ, బాలా'జీ' అనే పదము కానీ నోట్లోంచి రాలా. ఇంకా నయం హిందీ వాళ్ళం కాకపోతిమి. అయుంటే ప్రతి దానికీ ముక్కులో కోడి ఈక పెట్టుకొని హా... హా... జీ అని అందర్ని పిలవాల్సి వచ్చి నా నా కష్టమ్స్ వచ్చేవి. అప్పుడప్పుడూ గాడ్ ఈజ్ నాట్ క్రేజీ. సమ్‌ టైంమ్స్ ఐ డూ లైక్ గాడ్ లైక్ బేబీ భక్త ప్రహ్లాద.

వీకెండు 95 డిగ్రీల ఫారెన్ హీటుతో రానే వచ్చింది. సాయంత్రం నాలుగ్గంటలకు అందర్ని రమ్మన్నాం కానీ ఇండియన్ స్ట్రెచబుల్ టైము తో మొదటి శాల్తీ వచ్చేసరికి ఎంత లేదన్నా 6 గంటలు అవుతుందని ఇంటి ముందర గడ్డీ ప్లస్ గాదం పీక్కుటూ చెమటోడ్చి పని చేసుకుంటూ "కుమ్మరి కొలిమి....హుమ్..మ్‌..‌..సాలెల మగ్గం....హుమ్‌..మ్‌... " లా

"కార్పొరేట్ జననం...హుమ్..మ్‌..‌..
కర్షక మరణం...హుమ్..మ్‌..‌..
అడుగు బడుగు చెమట భొట్లు...హుమ్..మ్‌..‌..
అంబానీ గొడుగులో కరెన్సీ కట్లు...హుమ్..మ్‌..‌..
అయ్యింది నా చేను బీడు...హుమ్..మ్‌..‌..
అయ్యాడు వై.ఎస్. పెద్ద ఱేడు...హుమ్..మ్‌..‌..
"
అనే ఆర్.నారాయణ మూర్తి పాటలు, గద్దర్ పాటలు, సుద్దాల అశోక్ తేజ పాటలు పాడుకుంటూ పని చేసుకున్నా. ఆ స్పూర్తి తో "రక్త గడ్డ పార - చెమట చెనిగి పార" అనే సినిమా తియ్యటానికి ప్లాటు రడీ అయింది. అప్పటికప్పుడు, ఇంటికి వచ్చే వాళ్ళతోనే సినిమా తియ్యాలనే సంకల్పాని బలవంతంగా ఆపుకొని ఆరు గంటలవుతుందనగా పైకెళ్ళి బాత్రూములో దూరా స్నానం చెయ్యటానికి. సాయంత్రం స్నానమా అనే కొచ్చెన్ మార్కు ముక్కు పెట్టుకోకూడదు. అమెరికాలో అంతే. ఇంకా కొందరైతే శుక్ర వారం ఆఫీసుకు వెళ్ళేప్పుడు చేస్తే మళ్ళీ వచ్చే సోమ వారం దాకా స్నానం చెయ్యరు. వీళ్ళకు గ్లోబల్ వార్మింగు వాళ్ళు వీక్లీ విన్నర్స్ అని బనీన్‌లు,టి.షర్ట్ లు లాంటి ప్రైజులు గట్రా ఇస్తూ వుంటారు. వాళ్ళ లిస్టు సిఎన్ఎన్ డాట్ కాం లో చివరి పేజీలో వేస్తారు. నేనెప్పటికయినా ఈ లిస్టు ఒక్కసారన్న పేరు సంపాదించుకోవాలి అని కృషి చేస్తుంటే ఎదో ఒక పార్టీ తగలబడి నా ప్రయత్నాలకు గండి కొడుతోంది.కాసేపటికి స్నానం చేసి బయటకు వచ్చా. కిటికీ లోనుండి కిందకు చూస్తే రెండు కార్లు కనిపించాయి. ఒకటి టయోటా కరోలా ఇంకోటి హాండా సివిక్. అబ్బో ఆశ్చర్యంగా ఇద్దరొచ్చారు అప్పుడే. ఇవాళ ఈ 95 డిగ్రీలప్పుడు వర్షం పడేట్టుంది గడ్డికి నీళ్ళు పెట్టే అవసరం లేదు అని కిందకు దిగితుంటే లివింగు రూములో 15 మంది కనిపించారు ఒకే ఇంట్లో అయిదు వందలు ఓటర్లున్నట్లు. గబ గబా కింద కొచ్చి చూస్తే సుబ్బి గాడు, రమణ ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు.

"రేయ్ అప్పుడే చెప్పా గదా గ్యాస్ చార్జీలు మనం షేర్ చేసుకోవాలి అని. అందరం మా ఇంటి నుండి ఇక్కడికొచ్చినందుకు 33 మైళ్ళకు ఒక గ్యాలన్ పైన అయింది. గ్యాలన్ $3.87 చొప్పున ఎనిమిది మందికి సమానంగా పంచితే 48 సెంట్లవుతుంది. రానూ పోనూ ఒక్కొక్కరు 96 సెంట్లు ఇవ్వాలి. ఇప్పుడు ప్లేటెందుకు ఫిరాయిస్తున్నావ్?."

"నేనొప్పుకోను నువ్వు వస్తూ వస్తూ దార్లో కరి వేపాకు కొంటానికి ఇండియెన్ గ్రాసరీస్ షాపు దగ్గర ఆగావు. అది నీ సొంత ట్రిప్పు కాబట్టి ఆ దూరానికి నేనివ్వను. నేను 77 సెంట్లే ఇస్తా."

"రేయ్ అబద్దం చెప్పకు ఇప్పుడు కరి వేపాకు కూడా బ్యాన్ చేశారు అమెరికాలో. నేను దానికోసం పోలేదు. చిన్నప్పట్నుంచి నాకు హజ్ మోలా అంటే ఇష్టం. అది కొంటానికెళ్ళా అంతే."

"ఒరేయ్ సుబ్బిగా! కొక్కొ కోలా తాగే వయసులో కూడా నీకింకా హజ్ మోలా తినే దురద పోలేదురా. మీరు ఆ తగువేదో మీ ఇళ్ళకు వెళ్ళి తీర్చుకోండి. ఇక్కడ కాదు. అవునొరేయ్ టయోటా కరోలాలో ఎనిమిది మంది ఎలా వచ్చార్రా?" అని అడిగా అమాయకంగా.

దానికి సుబ్బారావ్ గాడు పడి పడి నవ్వాడు. "ఒరేయ్ నీకు ఇంకా తెలీదా అందరూ ఎలా ఆఫీసులకొస్తున్నారో. ఒక్కో కార్లో ఎనిమిది మంది వస్తున్నారు. ముందు ఇద్దరు. వెనకాల నలుగురు ఇక మిగిలిన ఇద్దరూ ట్రంకులో (డిక్కీలో)" చిదంబర రహస్యం చెప్పాడు వాడు.

"వెనకాల ముగ్గుర్నే కదరా అలో చేసేది? కాపు చూస్తే పట్టుకోడూ? ఈ ఎండల్లో ట్రంకులో ఎలా వచ్చార్రా? మాడి మసై పోరూ?"

"భలే వాడివేరా. అందుకోసమే రీ-చార్జబుల్ ఏ.సి. ఒకటి, ఆక్సిజెన్ మిషన్ ఒకటి ట్రంకులో పెట్టుకొనే వచ్చాం. ఏ.సి. మిషన్ 20 సెంట్లకు, ఆక్సిజెన్ మిషన్ 43 సెంట్లకు గరాజ్ సేల్ లో కొన్నా. గ్యాస్ కన్నా దీని ధర తక్కువ కదా."

"మీరు అసాధ్యులు రా. ఈ టెక్నిక్కు లన్నీ నాకెందుకు ముందుగా చెప్పలేదురా. ఒరేయ్ రబ్బరట్ల గబ్బు సుబ్బి గా! ఇన్నాళ్ళ మన స్నేహానికి ఇంత ద్రోహం చేస్తావా. నీకు కాఫీ లేదు. అర గ్లాసు చేపల ట్యాంకులో నీళ్ళు మాత్రమే రా" ఆవేశంగా సమాధాన మిచ్చా.

"అంత పని చెయ్యకురా బాబు. పాల రేట్లు కూడ గ్యాస్ తో పోటీ పడుతున్నాయని నేను కాఫీ అడిగినా మా ఆవిడ ఇవ్వలేదు. ఎటూ మీ ఇంటికొస్తున్న కదా వెళ్ళి మీ ఇంట్లో వారం రోజులకు సరిపడా తాగి రమ్మంది. ఇప్పుడు నువ్విలా అంటే ఎలారా. నీకు తెలుసు కదా నా కాఫీ వ్యసనం. హజ్ మోలా తరువాతా నేను బాగా లైక్ చేసేది కాఫీనే కదరా. కావాలంటే మా ఇంటికొచ్చినప్పుడు ఒక గుక్క కాఫీ ఎక్కువ తాగుదువులే గానీ."

"అలా అన్నావ్ బావుంది. వీళ్ళు అలా వచ్చారు సరే. మీరెలా ఏడు మంది ఒకే కారులో వచ్చార్రా?"
వాళ్ళందరూ కుర్చీల్లోంచి లేచి కింద పడి పొర్లి నవ్వడం మొదలు పెట్టారు.
రెడ్డి గాడిని లేపి చొక్కా పట్టుకుని "ఏరా తమాషగా వుందా? మా ఇంటికొచ్చి నన్ను చూసి నవ్వుతావా? చస్. మీ లాంటి దేశ, రాష్ట్ర, జాతి, మిత్ర ద్రోహులతో నేను చెయ్యికలపను. మీటింగు లేదు గీటింగు లేదు. వాటర్ క్యాన్సిల్. కాఫీ క్యాన్సిల్. కుర్చీలు క్యాన్సిల్. అన్నీ క్యాన్సిల్. వెళ్ళండి బయటికి. నేను వెళ్ళి ఈస్టు కోస్టోళ్ళతో టైయప్పు పెట్టుకొని పని చేస్తా"

"అంత పని చెయ్యకురో కావాలంటే మా ఇంటికొచ్చినప్పుడు నువ్వు భారత్ నుండి తెచ్చిన ఈగల్ ఫ్లాస్కు తెచ్చుకో. మా ఆవిడకు తెలియకుండా నా కాఫీ నీ ఫ్లాస్కులో పోసి ఇస్తా."

"ఇప్పటికి కుదిరిందా దెయ్యం. మీ అందరికీ నేను మంద కృష్ణ మాదిగ ముందు ఆంధ్ర జ్యోతి పేపర్ లా అయిపోయాన్రా. బొత్తిగా భయం లేక పోయింది. ఒకే ఇందాకా చెప్పిన క్యాన్సిల్లన్నీ క్యాన్సిల్. సరే విషయం చెప్పు ఏడు మంది హాండా సివిక్ లో ఎలా వచ్చారు?"

"నీకు చాలా అయిడియాలొస్తాయి కానీ ఇలాంటి వాటిల్లో నువ్వు చాలా పూర్ రా. ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను చూసినప్పుడే నా గుండె కలుక్కుమంటుంది.నా గుండె విదారకంగా మారిపోతుంది. ఇలాంటి సమయాల్లోనేరా నాకు కొడిగట్టిన దీపపు ప్రమిదలోని సల సల కాగే నూనెలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ అప్పుడే ఒక బలమైన ఎర్ర చీమ నన్ను వెనక్కులాగుతుంది. నేను లేక పోతే ఎలా పైకొస్తావో ఏమో. యండమూరి విజయానికి అయిదు మెట్లు పుస్తకం చదవ లేదు కదా నువ్వు. ప్చ్. అసలు ఈ టెక్నిక్ వాళ్ళకు చెప్పిందే నేను. మేమందరం ఆల్రెడీ రీ-చార్జబుల్ ఏ.సి. మిషన్‌లు ఆక్సిజెన్ మిషన్ లు కొనేసుకున్నాం."

"సరే అంతగా బాధ పడుతున్నవ్ కాబట్టి క్షమించేస్తున్నా. ఈ సారి మంచి డీల్ కుదిరితే చెప్పు నేను కూడా రెండు సెట్లు కొంటా. ఒకటి నాకు ఇంకోటి కూడా నాకే. ఇలా అయితే గ్యాస్ మీద చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇంకో కండిషన్ ఇలాంటి టెక్నిక్కులు ఇంకా ఏమన్నా వుంటే మొదట నాకే చెప్పాలి. లేకపోతే కాలేజీ లో బెంగాలి అమ్మాయి బితిక నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు కుదరదని చెప్పిన విషయం నిజం కాదని నువ్వే బితిక కు ప్రపోజ్ చేస్తే వాళ్ళ తమ్ముడు తొరొంగో రాయ్ తో నిన్ను కొట్టించిండం వల్లే నీ ముక్కు వంకర పోయిందనే విషయం మీ ఆవిడకు చెప్పేస్తా. అర్థమయిందా"

"నా ఖర్మ బర్నయ్యి నా కాలేజీ గాడివి నువ్వు తగిలావు ఇక్కడ. చస్తానా. రేపో మాపో మా కంపెనీ వాళ్ళు నన్ను లే ఆఫ్ చేస్తే నేను ఇక్కడినుండి ఏ టొర్నాడోనో, తుఫానో వచ్చే రాష్ట్రానికి వెళ్ళి పోతా."

"ఒరేయ్ మీరిలానే పోట్లాడుకుంటారా లేక బియ్యం గురించి మాట్లాడేదేమన్నా వుందా?" రామ సుబ్బా రెడ్డి చెప్పాడు.

అంతలో కాఫీ లొచ్చాయి. అలా కాఫీ రావడం ఆలస్యం ఒక్కోడు లేచి ఎదురెళ్ళి పోయి కాఫీ తెచ్చేసుకున్నారు లేటయితే ఎక్కడ కప్పు మిస్సవుతుందోనని. తాగేసిన తరువాత అందరూ అందులో కొన్ని నీళ్ళు పోసుకోఎని భూచక్రం, విష్ణుచక్రం లా తిప్పి అడుగంటిన కాఫీ కూడా తాగేశారు. కాఫీ పడి కొంచెం తేరుకున్నాకా సమావేశం మొదలైంది.

"ఇవాళ మనమందరం ఇలా కలిసినందుకు నాకు సంతోషంగా లేదు.." అని మొదలు పెట్టానో లేదో.

"అదేంట్రా ఈ-మెయిల్ లో సంతోషంగా వుందన్నావ్ ఇప్పుడేమో లేదంటున్నావ్. నీకు స్ప్లిట్ పర్సనాలిటీ వుందా" సుబ్బి గాడు.

"ఒరేయ్ నిన్ను అందుకే కాఫీ కొంచెం కొంచెం తాగమని చెప్పింది. అది ఈ-మెయిల్ కాబట్టి అలా రాశా. నేను చెబుతోంది బియ్యం రేట్లు అమాంతం పెరిగి పోయి బాధా కరంగా కలుసుకొంటున్నందుకు. సరే విషయం లో కొస్తా. ఇక్కడున్న మనం ఎంతో ధనవంతులని తెలుగుదేశం లో వున్న వాళ్ళందరూ అనుకుంటుంటారు.(ఇక్కడ నరసింహా విజిల్ వేశాడు). కానీ మనం నిజానికి అంత డబ్బున్నోళ్ళం కాదని ఇప్పుడు తేలి పోయింది. బింకానికైనా మనోళ్ళముందు డబ్బున్నట్టు నటించి ఈ అమెరికా గర్నమెంటు వాళ్ళ ముందు డబ్బులేనోళ్ళ లాగా నటించి వై.ఎస్. ఇచ్చిన బియ్యం కార్డులు(సమరసింహా విజిల్ వేశాడు) సంపాయించాలి. మనకు కంపెనీ వాళ్ళు ఎన్ని బోనస్ లు ఇచ్చినా డబ్బులు సరిపోవు.."

"ఒరేయ్ మామా మొన్న మామ సోము టాక్సు బ్రేక్ మనిషికో $600.00, ఒక్కో బుడ్డోడికి $300.00 ఇచ్చాడు కదా.అది కూడా సరిపోదా.." సుబ్బి గాడు.

"సున్నపు భొట్ల సుబ్బా రావ్! వికారాబాద్ లో తుకారాం లా ఆకారానికి వికారం కలిగే మాటలు మాట్లాడావంటే ప్రకృతి సిద్ధ మైన నీ ఆకృతి వికృతంగా మారిపోతుంది జాగ్రత్త"

"సరేరా! నువ్వు మాట్లాడుకో నేను బయటికెళ్ళి ఓ దమ్మేసొస్తా.."

"మంచిది. ఆశీర్వాదం. మళ్ళీ రాకు. . మనమిప్పుడెక్కడున్నాం? బోనస్ ల దగ్గరున్నాం. కావున మనకు ఈ దేశంలో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కావాలి. అటువంటి వాటిల్లో మొదటిది. బియ్యం కార్డు. ఓక్క సారి ఈ కార్డు మన చేతికొస్తే దీనికి గ్యాసు, కూర గాయలు జత చేసుకోని పోవచ్చు. ఇంకా ఎక్కువ సేపు మాట్లాడితే మీరు తాగిన కాఫీ అరిగి పోయి మళ్ళీ అడిగే ప్రమాదముంది. అందువల్ల ఇంతటితో ఆపి నా తరువాత సప్రస్డ్ శివరాం గారిని మాట్లాడ మని కోరుకుంటున్నాను."

"ఇవాళ మనమందరం సమావేశమయినందుకు నాకెంతో ఆనందంగా వుంది.ఈ అవకాశమిచ్చిన విహారి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మర్రి చెట్టు మహా వృక్షమయ్యేముందు ఒకప్పుడు అది కూడా ఒక మొక్కే. అలాగే మనం వటవృక్షం లా వేళ్ళూనుకునే ముందు ఒక మొక్క గా ప్రారంభిద్దాం. ఒక హిట్లర్(గ్యాప్), ఒక నెపోలియెన్(గ్యాప్), ఒక ఆబ్రహం లింకన్(రెండు గ్యాప్ లు), ఒక తాంతియా తోపే(రెండు గ్యాప్ లు), ఒక వీర సావర్కర్(ఒక గ్యాప్), ఒక గాంధి(ఒక గ్యాప్), ఒక శివాజీ(జుస్ట్ గ్యాప్), ఒక చిరంజీవి(చాలా గ్యాప్ లు చప్పట్లు కొట్టుకోడానికి. చాలా మంది ఛాతీలు చపాతీలయ్యాయి), ఒక బాల కృష్ణ(అయిదు గ్యాప్ లు కొంత మంది ఛాతీలు పూరీలయ్యాయి), ఒక జగన్(మూడు గ్యాప్ లు), ఒక ఈ టి.వి. సుమన్ (చాలా గ్యాప్ లు)మనలోనే వున్నారని నిరూపిద్దాం. అలా నన్ను నిరూపించుకునే అవకాశమిచ్చిన విహారి గారికి ధన్యవాదాలు. అలాగే 1762 లో ఆఫ్రికాలో అణగదొక్కబడ్డ 'బొకాంగొ సుక్కో ముక్రోసూ' తెగ వారి భూ పోరాటం గురించి చెప్పుకుంటే ఎంతో వుంది. ఎంతో అన్నాను కాబట్టి కొంత చెప్పుకుంటే బావుంటుంది. వాళ్ళు కూడా ఎన్నో ధన(గ్యాప్), ప్రాణ(గ్యాప్..గ్యాప్), మాన(గ్యాప్..గ్యాప్..గ్యాప్) త్యాగాలు చేసి వాళ్ళనుకున్నది సాధించారు. అలాగే మనము కూడా ఇక్కడ అమెరికాలో లెక్కకు మిక్కిలిగా త్యాగాలు చేసి తెలుగు వాళ్ళ త్యాగ నిరతిని ఈస్టు కోస్టు నుండి వెస్టు కోస్టు వరకు, కెనడా నుండి మెక్సికో వరకు, ఆగ్నేయం నుండి వాయవ్యం వరకు, నైరుతు నుండి ఈశాన్యం వరకు చాటి చెప్పాలి. ఇలా చాటి చెప్పే అవకాశాన్ని నాకిచ్చిన.."

"విహారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ఆపేస్తున్నా.ఇప్పుడు అందరూ చప్పట్లు" మనోజ్ అడ్డు పడ్డాడు.

"మనోజ్ గారు మీరు కొచెం ఆగండి ఆయనికి మనం టైము లిమిట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన్ని ఆపలేము. ఆయన్ని కాసేపు మాట్లాడుకోనిద్దాం" అన్నా నేను.

మనోజ్ చెవిలో "చూడండి. ఆయన గురించి మీకు తెలీదు. ఆయనకి ఆపమళ్ళీమొదనియా అనే జబ్బు వుంది. ఒకసారి మధ్యలో అపామంటే మళ్ళీ మొదటి నుండి మొదలు పెడతాడు. అయన చివరలో నమస్తే, జై హింద్ అంటాడు. అంతవరకు ఈ నల్లటి గుడ్డ మీ నల్లని నోట్లో కుక్కుకోండి. ఈ సారి అయన్ని ఆపితే మిమ్మల్ని ఈ కిటికీలోనుండి తోసేస్తా. మరీ ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కోసేసి మా ఇంట్లో బల్లులకు, చేపలకు, చిలకలకు ఆహారంగా వేసేస్తా" అని చెప్పా.

"ఇవాళ సమావేశమయినందుకు నాకెందుకో ఆనందంగా వుంది. అవకాశమిచ్చిన విహారి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మర్రి చెట్టు మహా వృక్షమయ్యేముందు ఒకప్పుడు అది కూడా ఒక చిన్న మొక్కే....(ఈ సారి ఛాతీలు చపాతీలు, పూరీలు అవడం కొంచెం తగ్గింది)...అలాగే 1762 లో ఆఫ్రికాలో అణగదొక్కబడ్డ 'బొకాంగొ సుక్కో ముక్రోసూ' తెగ వారి భూ పోరాటం గురించి చెప్పుకుంటే ఎంతో వుంది.... ఇలా చాటి చెప్పే అవకాశాన్ని నాకిచ్చిన విహారికి మరొక్క సారి ధన్యావాదాలు తెలుపు కుంటున్నాను. మనం ఏ పని చేసినా చాలా తెలివి గా, ఇంటెలిజెంట్ గా చెయ్యాలి. అంటే మనకు ఇంటెలిజెన్సు వుండాలి. ఇంటెలిజెన్సు అంటే ఎలా వుండాలి? అసలు ఇంటెలిజెన్సు అంటే ఏవిటి? .."

"ఇంటెలిజెన్సు అంటే ఇరాక్ లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వున్నాయని చెప్పేది" ఈ సారి బొబ్బర్లంక వెంకట్ ఓ చెయ్యేశాడు. అంతే మిగిలిన వాళ్ళందరూ ఆయన మీద పడి సేఫ్ వే స్టోర్ ప్లాస్టిక్ కవర్లు నోట్లో కుక్కేశారు.

"మీరు కానివ్వండి శివరాం గారు. ఈ సారి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు బిన్ లాడెన్ బెస్టు ఫ్రెండ్, ఇరాన్ కి అణ్వాయుధాలు సప్ప్లై చేస్తున్నాడు అని బియ్యం అర్జీ బదులు సీక్రెట్ నోట్ ఎఫ్.బి.ఐ. కి పంపించేస్తాం." అన్నాడు గణేష్.

"ఇవాళ సమావేశమయినందుకు నాకెందుకో ఆనందంగా వుందో లేదో తెలియడం లేదు. ఈ అవకాశం మిచ్చిన..(కాసేపటికి అందరూ సెల్ ఫోనులో అడ్రసు బుక్కు చదువుకోవడం లో నిమగ్నమై పోయారు. చాతీలు మామూలుగానే వున్నాయి)... అలాగే 1762 లో ఆఫ్రికాలో అణగదొక్కబడ్డ 'బొకాంగొ సుక్కో ముక్రోసూ' తెగ వారి భూ పోరాటం గురించి చెప్పుకుంటే ఎంతో వుంది....
అలా చెప్పుకుంటూ పోతే దానికి అంతే లేదు. నేను మాత్రం మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తా. నాకీ అవకాశమిచ్చిన... నమస్తే. జై హింద్." అని శివరామ్‌ కూచున్నాడు.

అందరూ చప్పట్లే చప్పట్లు. "కోర్టు కోర్టుకీ, తీర్పు తీర్పుకి ఇంతే తేడా వుంటే ఎలా యువరానర్ ..." అన్న సర్దార్ పాపారాయుడి డైలాగుకు కూడా అన్ని చప్పట్లు వచ్చుండవ్. అది చూసి శివరామ్‌ జేబులోనుండి మెక్ డోనాల్డ్స్ పేపర్ నాప్కిన్‌ తీసి కళ్ళు తుడుచుకున్నాడు.

తరువాత బ్రహ్మాండం భోజేశ్వర్రావ్ ని మాట్లాడ మన్నారు.
" ముందుగా నన్ను ఇంట్లోకి రానిచ్చిన విహారికి ధన్య వాదాలు. నన్ను రావద్దని మెయిల్ పెట్టారట. కానీ అర్జీ అనగానే చేతులు దురదపుట్టి ఆపుకోలేక మా అవిడను ఇంటి దగ్గే ఆపేసి వచ్చేశాను. మా ఆవిడను కూడా తీసుకొచ్చుంటే చాలా సరదాగా వుండేది. ఎనీవే, మీ కందరికీ శ్రమ తగ్గించాలని నేనాల్రెడీ అర్జీ రాసేసి తీసుకొచ్చేశాను. దాన్ని ఆఫీసులో జిరాక్సు చేసుకొని 15 కాపీలు తెచ్చాను. ఇదిగోండి తలా ఒకటి తీసుకోండి" అని బ్యాగు లోనుండి పేపర్లు తీసి ఇచ్చేశాడు.

అందరూ దాన్ని సెహ్భాష్ అని మెచ్చుకొని ఒకే చేశేశారు మూజు వాణీ ఓటుతో.

ఇకే అసోసియేషన్‌కు పేరేం పెట్టాలి అనే దానిమీద అందరూ మల్ల గుల్ల పడ్డారు. అమెరికన్‌ తెలుగు రైస్ అసోసియేషన్(ATRA)‌, అట్ర అని పెడదామంటే కొంత మంది ఒప్పుకోలేదు. అది కాదని రైస్ అసోసియేషన్‌ ఆఫ్ నార్త్ అమెరికా(RANA),రానా అని పెట్టాలంటే ఇంకొందరు ఒప్పుకోలేదు. చివరికి అట్రానా అని పేరు పెట్టడానికి ఎవరికీ అభ్యంతరం లేక పోయింది.

అసోసియేషన్‌ ఆఫ్ తెలుగు ఫార్ రైస్ ఇన్‌ నార్త్ అమెరికా (ATRANA)

తరువాత ఈ అర్జీకి బుష్షు ఎలాంటి రిప్లై ఇస్తాడో అన్న దాని మీద పందాలు జరిగాయి.
మన అర్జీ చదవగానే "మీరు ఎక్కువగా బియ్యం తింటున్నారు కాబట్టే ఇప్పుడు ప్రపంచానికి ఆహార సమస్య వచ్చింది అని అంటాడు" అన్నాడు వెంకట్.
అలా అన్నాడో లేదో "లేదురా ఇప్పుడు ఆవిషయాన్ని గ్రహించాడు కాబట్టి అలా అనడు. కావాలంటే పందెం కాస్తా." అన్నాడు మనోజ్.
"సరే అలానే అంటాడని పది ఏర్ పోర్టు ట్రిప్పులు పందెం." అన్నాడు వెంకట్.
"అంటే"
"అదే. నా ఫ్రెండ్సు కానీ బంధువులు కానీ ఎవరొచ్చినా నువ్వే ఏర్ పోర్టుకు వెళ్ళి తీసుకొని రావాలి" అన్నాడు వెంకట్.
"అట్లయితే సరే. జీతం కన్నా గ్యాస్ రేటే ఎక్కువ పెరుగుతుంది. నేను ఓడిపోతే నీ కోసం పది ఫ్రీ రౌండ్ ట్రిప్పులేస్తా ఎయిర్ పోర్టు నుండి." ఒప్పుకున్నాడు మనోజ్.

"నో వే అలా అనడు. మన అర్జీ చదవగానే మనకో ప్రశ్నొస్తుంది. అదేంటంటే Are you with us or with them అని" అన్నాడు సుబ్బి గాడు అప్పుడే లోపలికొస్తూ.
"లేదండీ అలా అనడు. అలా అంటే నేను నిన్ను రెండు వారాలు నా కారులో ఆఫీసుకు తీసుకెళ్ళి దిగ బెట్టి వస్తా. పందెమేనా" ఈ సారి సప్రెస్డ్ శివరామ్‌.
"లేదండీ నేను చెప్పినట్టే జరుగుతుంది. నేను ఓడిపోతే మిమ్మల్ని రెండు వారాలేమి ఖర్మ. ఈ సంవత్సరంలో వచ్చే అన్ని పండగలప్పుడూ మిమ్మల్నీ,మీ ఫ్యామిలీ ని ప్రతి పండక్కీ గుడికి నేను నా కార్లో తీసుకెళతా"
"అయితే సరే. డన్." అన్నాడు సప్రెస్డ్ శివరామ్‌.


నాకూ బెట్టింగులు చెయ్యాలనే వుంది కానీ బాసు దేవి చెవుల పడుతుందని బెట్టింగులో వేలు పెట్టలేదు.

బెట్టింగులన్నీ అయిపోయిన తరువాత అర్జీని సప్రెస్డ్ శివరాంకు ఇచ్చి వాషింగ్టన్ కు సెర్టిఫైడ్ మెయిల్ చెయ్యమన్నాం. శివరాం ఎగిరి గంతేసి అర్జీని నాలుగయిదు సార్లు అన్ని వైపుల ముద్దు పెట్టుకొని కవర్ లో పెట్టాడు. మళ్ళీ కవర్ ని నాలుగు వైపులా ముద్దు పెట్టుకున్నాడు.

అది చూసి సన్నాయి నొక్కుల సంజీవ్ రావ్ "ఎవరన్నా మంచి జరగాలంటే కవర్ కు పసుపు, కుంకుమ రాసి పోస్టు చేస్తారు. ఈయనేంది మొత్తం ఎంగిలి పూసేస్తున్నాడు. వాళ్ళు కవర్ ని టెస్ట్ చేసి చూస్తే ఏ బయొలాజికల్ వెపనో అని భయపడ ప్రమాదముంది. ముందు ఆ ముద్దులాపండి."
"క్షమించండి నాకు ఏదైనా కొన్నా, కొత్త పని చెయ్యాలన్నా ఇలా ముద్దాడ్డం అలవాటు.మీరేమీ అనుకోకండి"
"ఏంటి మీరు కారు కొన్నప్పుడు కూడ ఈ పని చేశారా?
"అవునండి. ఇల్లు కొన్నప్పుడు కూడా. నిచ్చెనేసుకొని పైకెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" సిగ్గు పడుతూ చెప్పాడు శివరామ్‌.
"మీరు ఇండియాలో సేద్యం చేశారా"
"చేశానండి. మీ అనుమానం అర్థమయింది. ఓ సారి చెట్లకు మందు కొట్టమని మా నాన్న తారా-909 ఇస్తే దాన్ని కూడా చాలా సార్లు ముద్దు పెట్టుకొని ఆస్పత్రి పాలయ్యా. ఏదో నకిలీ మందు కాబట్టి బతికి బట్ట కట్టి ఇలా అమెరికా వచ్చి ఈ అర్జీని పోస్టు చేసే చారిత్రాత్మక ఘట్టం లో పాలు పంచుకుంటున్నాను" అని కళ్ళు తుడుచుకున్నాడు.

అది చూసి సంజీవ్రావ్ చలించి పోయాడు. వాడు చలించడం చూసి సుబ్బారావ్ గాడు కూడా చలించి పోయాడు.
వాళ్ళందర్నీ చూసి వెంకటేష్ కి కోపమొచ్చింది. "చస్. ఆపండెహె. మీరు మీ చలించి పోవడాలు. అసలే ఇంట్లో ఆ దిక్కు మాలిన సీరియెళ్ళు చూడలేక్పోతుంటే మీరు కూడా మొదలు పెట్టారు. శివరాం గారు ఇలా మీరు చలించిపోతే కష్టం. పోస్టు డబ్బాలో వేసేప్పుడు మీ చెయ్యి చలిస్తే కష్టం. మీ వల్ల కాదు గానీ నాకివ్వండి నేను పోస్టు చేస్తా" అన్నాడు.

అది విన్న సప్రెస్డ్ శివరాం "ఇక్కడ వేరే వాళ్ళ చేత మనమే సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ అనుకున్నానండి. కానీ మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక తెలుగు వాడిని ఇంకో తెలుగు వాడు సప్రెస్ చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. నేను చదివిన ఏ యూరప్ చరిత్రలోనూ, ఆసియా చరిత్రలోనూ, ఆస్ట్రేలియా చరిత్రలోనూ, ఆఫ్రికా చరిత్రలోనూ, ఉత్తర అమెరికా చరిత్రలోనూ, దక్షిణ.."

అయిపోయింది అంతా అయిపోయింది ఎవర్నయితే ఈ సమావేశం జరుగుతున్నంత సేపు జాగ్రత్తగా కూర్చో బెట్టామో ఆయ్యన్నే రెచ్చ గొట్టేశారు. మళ్ళీ ఇదంత స్థిమిత పడాలంటే ఇంట్లో ఇంకో 15 కప్పుల కాఫీ ఖర్చవ్వాలి. అదే జరిగితే నాకు 15 రోజుల పాటు కాఫీ బందు. ఈ దుకాణాన్ని కట్టెయ్యాలి అని వెంకటేష్ ను టి.వి. దగ్గరకు తీసుకెళ్ళి రికార్డు చేసిన మూసీ నది మీద మంచు కొండల సెట్టింగేసి తీసిన చక్రవాక నమ్మాళ్వార్ అనే భక్తి రస కార్యక్రమం పెట్టేశా. వాడిని అలా టి.వి. ముందు పెట్టడం ఆలస్యం అందరూ ఒక్కసారి వాచీ చూసుకొని ముక్త కంఠంతో "అరే తొమ్మిదయిపోయింది వెంటనే వెళ్ళాలి" అని పరుగెత్తుకొని వెళ్ళి కారులో కూర్చున్నారు. ఎప్పుడు కారులో కూచున్నాడో కానీ వెంకటేష్ గాడు శూన్యం లోకి చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నాడు. అలా అందర్నీ వదిలించుకున్నా.

* * * * * * * *


అప్పుడే దశావతారం సినిమా చూసి వచ్చాడు జార్జి బుష్. అందులో తన రోల్ చూసి ఎంతో మురిసి పోయాడు డైలాగులు అర్థం కాలేదు కాబట్టి. వచ్చిన అర్జీని పి.ఏ. చేతికివ్వంగానే నిశితంగా పరీశీలించి బాగా ఆలోచించాడు. అసలే వీళ్ళకు కొంచెం బుర్ర ఎక్కువ కాబట్టి వీళ్ళకు నేరుగా సమాధానం ఇవ్వకుండ ఎదో ఒక తిరకాసు పెట్టాలి. నా టర్మ్ రెండు సార్లు అయిపోయింది. ఎటూ మూడో సారి వచ్చే చాన్సు లేదు. తన పార్టీ రిపబ్లికన్లకు ఓటెయ్యమని అడిగితే పోలా అని అనుకున్నాడు. వెంటనే తన పి.ఏ. ను పిలిచి తన సమాధానాన్ని చెప్పి టైపు చెయ్యమన్నాడు. టైపయిన కాగితాన్ని చూసి ఈ మాత్రం దానికి టైపు చెయ్యడం ఎందుకు గ్లోబల్ వార్మింగుకు తను కూడా ఓ చెయ్యి వెయ్యాలని దాన్ని చించేసి తన లెటర్ ప్యాడ్ మీద చేత్తో రాసి మడిచి కవర్ లో పెట్టి పి.ఏ. ని పోస్టు చెయ్యమన్నాడు.

* * * *:: * * * *


మూడు రోజుల తరువాత.

సాయంతం ఇంటికి వచ్చి చూస్తే ఉత్తరం. అదీ అమెరికా ప్రెసిడెంటు నుండి. ఆత్రంగా చించి చదివా. దాని సారాంశం..
.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

Vote for Obama
God bless America.


(అయిపోయింది)

* * * * * * * *

Thursday, June 19, 2008

ప్చ్..ఏవిటో పిల్లలు

:::::::::


పిల్లలకి సెలవులొచ్చాయి..అమెరికావాళ్ళకి లెండి. ఊరుకుంటారా? అదని ఇదని కాకుండా సింపుల్ గా "పందిరి దాని పీకుడు" అనే స్పెషల్ కార్యక్రమాలు కొత్త పద్దతుల్లో మొదలుపెడతారు. ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడూ అడ్డుతగులుతూ కొన్ని కబుర్లు చెప్పాలి లేకపోతే "బ్యాంకు దానికో పెద్ద చిల్లు" అనే కార్యక్రమం లో మనం పాల్గొనాల్సి వుంటుంది. అలాంటి కబుర్లు కార్యక్రమం లో కొన్ని.

పెద్దయిన తరువాత నేను BMW కారు కొనుక్కుంటా.
ఏం మన బెంజ్ బాలేదా? నీ ఫ్రెండ్ వాళ్ళ లెక్సస్ కన్నా ఇదే బావుందన్నావ్ కదా

నేను డిఫరెంట్ కారు కొనుక్కుంటా.
సరే అయితే అందులో ఎవర్ని ఎక్కించుకుంటావ్? (మనసులో ఆహా అమ్మానాన్నల్ని ఎక్కించుకుంటాడు అని ఒక ఆనందం)

నేనూ నా వైఫూ, నా కిడ్స్.
అదేంట్రా మేమెక్కద్దా?

అప్పుడప్పుడూ ఎక్కించుకుంటాలే.
???

:::::::::


నేను ఆడుకోడానికి చక్కీ చీజ్ వెళుతున్నా.
ఒరేయ్ నువ్వు బయటికెళ్తున్నావ్ కదా నీ ఫ్రెండ్సు నీ గోళ్ళు చూస్తే యక్కీ బాయ్ అంటారు. గోళ్ళు కత్తిరించనా?
అలాగే.

చేతి గోళ్ళు కత్తిరించడం పూర్తయ్యాక.

అయిపోయిందా?
చేతులకు అయిపోయింది.కాళ్ళు ఇలా పెట్టు వాటికి కూడా గోళ్ళు కత్తిరించాలి.

అవసరం లేదు అవి కనిపించవ్. వాటికి షూష్ వేసుకుంటా కదా. బై
???

:::::::::

Monday, June 16, 2008

మా ఇంట్లో ఫాదర్స్ డే.

:::::::::



పిలకాయల్కి పరీక్షలయిపోయినాయి. నిన్న ఆదివారం ఇంటికి కొందరోస్తే బార్బక్యూ పార్టీ మొదలెట్టా మొక్క జొన్న కంకుల్తో. ఇంటి వెనక డెక్ మీద కుర్చీలేసుకుని కూర్చున్నాం. అప్పుడప్పుడూ గ్రిల్లు మీద కంకులు సరీగా కాలుతున్నాయో లేదో అని లేచి చూసి వస్తున్నా. అలా లేచి కాలుస్తూ వుంటే మా పెద్ద బుడ్డోడు వచ్చి “నాన్నా నువ్వెక్కడ కూచున్నావ్” అని అడిగాడు. నేను కూర్చునే కుర్చీ చూపించా. తరువాత నన్నటు తిరగమన్నాడు. సరే అని మొక్క జొన్న కంకుల్ని తిప్పడం లో లీనమైపోయా. కాసేపటికే “నానా! నువ్వెళ్ళి నీ కుర్చీలో కూచో” అని ఒకటే రొద. వీడేమన్నా (ఇంకో ఇద్దరు గడుగ్గాయిలు కూడా వున్నారు) కుర్చీ కి కాలు గానీ పీకేశాడేమో అని అనుమానమొచ్చింది కానీ అవి మడత కుర్చీలు కాబట్టి విరిచే చాన్సు లేదు. దగ్గరికెళ్ళి చూస్తే దాని మీదో తెల్ల కవర్. అంతకు ముందే ఈ పిల్లకాయలందరూ ఏదో బొమ్మలు గీసుకుంటామంటే కొన్ని తెల్ల కాగితాలిచ్చా. వాటితోనే కవర్ లాంటిది చేసి అందులో ఒక జాబు పెట్టాడు. దాన్ని తెరిచి చదివితే.

Dear Dad,

Happy father’s Day. You are the best daddy in the world. Can you please take me on a vacation(trip) for a week.

-- Rushil Vihaari


దీన్ని చదవగానే వాడిని వెకేషన్ కు తీసుకెళ్ళాలో లేక వెకేషన్ కోసం నన్ను ప్రపంచంలో బెస్టు చేశాడో అర్థ కాలా.

:::::::::

Friday, June 13, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ(బత్తీ బందు, బ్లాగులు, సినిమాలు)

:::::::::


అయ్యా!!!
ఆ సిద్ధా.

అయ్య గారూ?
అలా వణుకుతున్నావెందుకు చెప్పు.

నాకు భయమేస్తోందండి
ఎందుకురా పెట్రోల్ గానీ స్టాకు ఎక్కువ పెట్టావేంటి. బ్లాకు లో అమ్మటానికి వుంచావని కేస్ పెట్టి జైల్లో తోస్తారని భయమా?

అట్లాంటి దేదయినా జరిగితే మీరు చూసుకుంటారు గదా నాకేం భయం. ఇప్పుడొచ్చిన భయమల్లా నిన్న రాత్రొచ్చిన కలేనండి.
నీకు భయమెందుకురా మొన్నే బత్తి బందు కోసం అందర్నీ కలిసొచ్చావ్ కదా. కొంచెం హవా పెరుగుంటుంది.

ఆ తరువాత వచ్చిందే ఈ కల.
వాళ్ళేదో పదవి ఇస్తామని ఆశ చూపించుంటారు. వాటి గురించి డిస్కో లైట్ల పగటి కల కనుంటావ్. అవే మళ్ళీ రాత్రి వచ్చుంటాయ్.

మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. చెబుతా వినండి.
వినటానికే నా చెవులున్నాయి కానీ.

నేను బాగా నిద్ర పోతున్నానా. ఉలిక్కిపడి లేచి చూసేసరికి నా మొహం మీద ఏదో పక్షి వాలినట్టయింది. కొంచెం దగ్గరగా చూస్తే రెండు కళ్ళు. ఒక కంట్లో జానీ వాకర్ విస్కీ కింద పోసేస్తే చారలు కట్టినట్లు ఎర్రగా జీరలు. ఇంకో కంట్లో ఓల్డ్ మాంక్ రమ్ము కింద పోస్తే చారలు కట్టినట్లు జీరలు ఎర్రగా. ఇదేదో రాకాసి నన్ను పీక్కు తింటోదని పై ప్రాణాలు పైనే పోయాయి. వచ్చే సంవత్సరం ఈ రోజే నా సంవత్సరీకం జరుగుతుందని గుండె గుభేల్మంది. అంతలో కొంచెం కొంచెంగా ఆ ప్రాణి వెనక్కు వెళ్ళింది. అలా వెళ్తుంటే అప్పుడు అర్థమయింది ఆ జీవి ఎవరో. అది నేను చూసిన మొహమే.

:::::::::


ఏరా నేను బత్తీ బందుకు అనుకూలంగా లేననుకున్నవ్రా?
అలా అని ఎవరన్నారన్నా.నీకు అందరూ అగర్బత్తి లు వెలిగించి పెడుతున్నారంట గదా.

అంటే నీ ఉద్ధేశ్యమేంది? ఓటర్లు నాకు అగర్బత్తి ఎలిగించి పొగ బెడితే నువ్వు నాకు బ్లాగులో సెగ బెడతావ్ రా?
అబ్బే నా ఉద్ధేశ్యం అది కాదన్నా.మీరారోజు దొరక్కపోతేనూ..

ఓటర్ల దగ్గర నా మార్కులు సున్నా అయిపోయినాయని నేనేడస్తా వుంటే బత్తీ బందని పేరు చెప్పి నేను కొద్దో గొప్పో మార్కులేసుకునే చాన్సు కూడా లేకుండా చేస్తావ్ రా? ఏమ్రా నీదేం బ్లాగ్రా?
ఏదో బడుగు బ్లాగన్నా?

బడుగోడయితే అడుగు రాతల్ రాస్కోక ఈ రాతలేంద్రా? మా పేపర్ల బాడుగ బ్లాగని హెడ్డింగ్ వెట్టి రాయించమంటావేంది భే.
అంత పని మీకెందుకన్నా.

రేయ్. ఈ రోజు నేను దంచుడో..నువ్వు చచ్చుడో తేలి పోవల్ల.
అన్నా! నీకు చింత చచ్చినా పులుపు చావలేదే.నీ కల్మొక్తా నన్నొగ్గెయ్. నువ్వు బత్తీ బందు జేస్తున్నవని నా బ్లాగ్ల రాస్త. మీ దెబ్బకి దిల్లీ దర్బార్ ల కూడ బత్తీ బందు చేస్తుండ్రని గూడా రాస్తా. మీ దిల్ కుష్ చేస్తా.

గట్లన్నావ్ బావుంది. నే వస్త. జర దిమాఖ్ దగ్గర్ వెట్టుకొని బ్లాగ్ రాయ్. లేకపోతే చండాలొలుస్తా తమ్మి.

:::::::::


అదీ అయ్యగారూ సంగతి.
ఇంకేం కె.సి.ఆర్. బత్తీ బందుకు సపోర్టని అందరికి చెప్పు. నీ ప్రాబ్లెం సాల్వయిపోతుంది. నువ్వా తరువాత ఏం ఫికరవ్వక్కరలేదు.

హమ్మయ్యా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా వుంది. ఏవైనా శుభ కార్యాల గురించి మాట్లాడుకుందాం ఇంక.
అలాగే బాబు 'మీ కోసం' యాభై రోజుల పండగ గురించి మాట్లాడుకుందామా?

మళ్ళీ రాజ కీయాలా? అదొద్దు గానీ. మొన్న మీ ఫ్రెండు వాళ్ళ కజినెవరికో అమ్మాయి కావాలని అమెరికా నుండి వచ్చాడు కదా. ఎవరైనా మంచి అమ్మాయి దొరికిందా?
మంచి సంగతి పక్కన పెట్టు అసలు వాడికి అమ్మాయి అనే పదార్థం దొరకటమే కష్టమయిపోతోంది.

ఏం ఎందుకలా. అమెరికా సంబంధమంటే ఎగిరి గంతేసి పెళ్ళి చేసుకుంటారు కదా.
అది ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. అక్కడున్నోళ్ళే తట్టా బుట్ట సర్దుకుని ఇక్కడికొచ్చేస్తున్నారు. మా వాడిని ఏరా ఎందుకు అమ్మాయిలు దొరకడం లేదు అంటే అంధ్రజ్యోతి పేపర్లు తీసుకొచ్చి నా ముందు పడేశాడు.

అందులో పెళ్ళి ప్రకటనలు రావడం లేదని బాధేమో
అది కాదులేరా. ఇదిగో ఆంధ్రజ్యోతి హెడ్లైన్‌లు చూడు, అమెరికాలో హాహా కార్, అమ్మబోతే అడవి, ఒక ఇల్లు కొంటే ఇంకో ఇల్లు ఫ్రీ, కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్. ఇలాంటివి చూస్తే పిల్లనిచ్చే తండ్రెవరైనా అమెరికా సంబంధం వైపు కన్నెత్తి చూస్తాడా?

పాపం. ఆ అబ్బాయినే భారత్ వచ్చెయ్యమన్లేక పోయారా?
వద్దామనే అనుకున్నాడు. ఇక్కడున్న నెల రోజులు జనాలు పెట్టే ఖర్చు చూసి తట్టుకోలేక వీళ్ళతో నేను పోటీపడ లేనని చేతులెత్తి వెళ్ళి పోయాడు. పైగా వాడు అక్కడనుండి తెచ్చుకొన్న సెల్ ఫోను చూసి వాడి ఫ్రెండ్సందరూ అదో డొక్కు ఫోను మేము ఆ ఫోను తరువాత వచ్చిన రెండు మాడల్స్ కూడా కొని పారేశాం అన్నారట.

అమెరికాంధ్ర వాళ్ళ పరిస్థితి త్రిశంకు స్వర్గమయిందన్నమాట. అక్కడుండలేరు. భారత్ కి రాలేరు. ఎటూ పెట్రోల్ ఖర్చులు పెరిగి పోతున్నాయి కదా భారత్ నుండి కానీ చైనా నుండి కానీ ఎగుమతి చెయ్యాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అక్కడే సెజ్(special economic zone) పెట్టుకొని ఏవైనా ఉత్పత్తి చేసుకుని అమ్ముకుంటే మంచి లాభసాటిగా వుంటుంది.
అయిడియా బావుంది. కానీ అక్కడ వాళ్ళకు చేత కాదనా ఇతర దేశాల నుండి కొనుక్కునేది. అక్కడ తయారు చేస్తే వాళ్ళ వాతావరణం కలుషితమై పోదూ?

పెద్దన్న తెలివితేటలు తక్కువగా అంచనా వేశా. నాటకాలెయ్యడం లో సిధ్ధహస్తులు కదా. అవార్డులు రావుగానీ అలాంటి వేవన్నా వుంటే అన్నీ పెద్దన్న కే ఇచ్చేయ్యాలి.
పెద్దన్నంటే గుర్తొచ్చింది. తెలుగు పరిశ్రమ లో పెద్దాయన అని పిలవబడే రామానాయుడు తీసి నటించిన 'హోప్' సినిమా కు జాతీయ అవార్డు వచ్చింది.

అదో సినిమా వుందా? దేని గురించా హోప్? అమెరికా కెలా వెళ్ళాలనా?
కాదు. పిల్లలు పరీక్షల్లో మంచి మార్కుల కోసం బాగా చదవాలనే వత్తిడిలో ఎంత మానసిక సంఘర్షణ కు లోనవుతారు. ఆ వత్తిడిలో ఆత్మ హత్య చేసుకునే పరిస్థితిలొస్తాయనే దాని గురించి చెబుతుంది ఈ సినిమా.

మంచి సందేశాత్మక సినిమానే.ఇంకా మన తెలుగు సినిమాల కేమన్నా అవార్డులు వచ్చాయా?
కిట్టు అనే యానిమేషన్ సినిమా కు కూడా జాతీయ అవార్డు వచ్చింది.

ఈ సంవత్సరం గుడ్డిలో మెల్లన్నమాట.మంగ తాయారు టిఫిన్‌ సెంటర్ కు అవార్డొస్తుందేమో అనుకున్నా

:::::::::


ఈ సారి బ్లాగుల్లో ప్రత్యేకతేంటి?
తేనెగూడు డౌనయ్యింది.

ఇంకా.
కొత్త బ్లాగర్లు పిచ్చ పిచ్చగా రాసేస్తున్నారు. ఒకప్పుడు పది కామెంట్లున్న టపా చూడాలంటే వారానికొకటి కానీ కనపడేది కాదు. ఇప్పుడు కొత్త వాళ్ళు కత్తి కాంతా రావు లా కత్తి పట్టుకొని ముందుకు దూకేసి 'టపాకో పది' అని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ ప్రవాహంలో చదవకుండా కొట్టుకు పోతున్న బ్లాగులెన్నో.

మంచి పరిణామం. రేపో మాపో బ్లాగర్లకోసం ఓ ఎమ్మెల్సీ సీటు అడగొచ్చు.
నీకు బాగ ముదిరింది.

మీకు మల్లే.
!!!

:::::::::

Wednesday, June 11, 2008

అమెరికాలో టిక్కెట్లు – ఇక్కట్లు

:::::::::


ఏరా? ఎందుకలా ఏడుపు మొహం పెట్టుకున్నావ్?
టికెటొచ్చింది.

మామా! కార్లేమీ రావడము లేదు. రారా రోడ్డు దాటేద్దాం.
నేను రాన్రా. మొన్న ఇలా దాటినందుకే జే వాకింగ్ అని టికెటిచ్చాడు వెధవ.

ఏవిటే అంత దూరంగా పార్క్ చేస్తున్నావ్? స్టోర్ దగ్గర పార్కు చెయ్యొచ్చు గదా. మళ్ళీ ఇంత దూరం నడవాలా? హఁబ్బా!
దగ్గరుంది కదా అని మొన్న రెండు కార్ల మధ్యలో దూరి పార్క్ చేసి వెళ్ళా తీరా వచ్చి చూస్తే విండ్ షీల్డ్ మీద టికెట్టుంది డబులు పార్కింగు చేసినందుకు. అసలే డ్రైవింగు కొత్తగా నేర్చుకుంటున్నా. నువ్వు టెన్షన్ పెట్టకుండా లోపలికి పద.
:::::::::

ఇప్పటికి సగం మందికి అర్థమయుంటుంది. మిగతా సగం మంది అదేంటో తెలుసుకోవాలంటే కాసేపు చదవండి. అమెరికాలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఇచ్చే రశీదునే టికెట్ అంటారు. ఒక్క సారి టికెట్ వచ్చిందంటే అది మీ డ్రైవింగు రికార్డుకు నక్షత్రకుడి లా జత చేయబడతాయి. సాధారణంగా సోషల్ సెక్యూరిటీ నంబరు లేనిదే డ్రైవింగు లైసెన్సు ఇవ్వరు. అంతర్జాతీయ డ్రైవింగు లైసెన్సు వుంటే కూడా ఇక్కడ డ్రైవింగు చెయ్యచ్చు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే టికెట్ ఇస్తారు. కాక పోతే పాయింట్లు వుండవు ఫైను కట్టాల్సి వస్తుంది. కట్టకుండా కూడా దేశం నుండి చెక్కెయ్యొచ్చు. దాని గురించెందుకులే ఇప్పుడు.

ప్రతి ట్రాఫిక్ నిబంధన అతిక్రమణ కు కొన్ని పాయింట్లు ఇస్తారు దానితో పాటు కొంత ఫైను వేస్తారు. ఉదాహరణకు మీరు 60 మైళ్ళ స్పీడు వున్న చోట 75 మైళ్ళ స్పీడుతో వెళుతుంటే రెండు పాయింట్లు $60 డాలర్ల ఫైను వుంటుంది. అదే స్కూలు దగ్గరో ఇళ్ళ ప్రాంతం లోనో 25 మైళ్ళ స్పీడు వున్న చోట 35 వెళ్ళారంటే 4 పాయింట్లు $125.00 ఫైను వుంటుంది. స్కూళ్ళ దగ్గర క్లాసులు మొదలయ్యే ముందు స్కూలు వదిలేటప్పుడు మాత్రం 30 మైళ్ళు వున్న చోట 15 మైళ్ళ స్పీడు తో వెళ్ళాలని సూచిస్తూ లైట్లు ఫ్ల్యాషు అవుతుంటాయి. అలాంటి చోట్ల ఫాస్టు గా వెళ్ళిన వాడికి ఆ రోజు మూడిందనే అర్థం. పెద్ద విస్తరేసి రాక్షస గరిట తో 6 పాయింట్లు వడ్డించి $300.00 ఫైనేసినా ఆశ్చర్యం లేదు. ఇంకా పోలీసుకు తిక్క రేగితే లైసెన్సు క్యాన్సిల్ చెయ్యమని రెకమండ్ చేసి పారేస్తాడు. తరువాత డౌన్‌లోడ్ చేసుకున్న MP3 పాటలినుకుంటూ బస్సులో తిరుగుతూ వచ్చే పోయే కార్ల నంబర్లు చదువుకుంటూ కాలం గడపాల్సి వస్తుంది. లైసెన్సు పోతే అమెరికాలో కారు నడపలేము. అమెరికాలో కారు లేక పోవడం కాళ్ళు లేక పోవడం రెండూ ఒకటే.

అమెరికాలో ఎట్టి పరిస్థితిలోనూ మందు తాగేసి కారు నడపకండి. ఒక్క సారి DUI (Driving under influence) కింద పట్టుబడ్డారంటే జీవితం నరక ప్రాయమవుతుంది. ఉద్యోగాలివ్వరు. లైసెన్సు వుండదు. ఒక షెరీఫ్(పోలీస్ ఆఫీసర్) డ్యూటీ అయిపోయిన తరువాత DUI కింద అరెస్టయి ఉద్యోగం పోగొట్టుకొని నానా కష్టాలు పడ్డం చూశాను.

ఈ పాయింట్లేంటంటే... ఒక 12 నెలల కాలం లో మొత్తం 12 పాయింట్లు వస్తే లైసెన్సు ను ఒక్క సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తారు. ఇంకా 24 నెలల కాలం లో 16 పాయింట్లు వచ్చినా ఇదే సూత్రం వర్తిస్తుంది. రాష్ట్రాన్ని బట్టి కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ పాయింట్లు మూడు సంవత్సరాల కాలం పాటు కర్ణుడికి కవచాల్లా డ్రైవింగు రికార్డుకు అతుక్కొని వుంటాయి. ఒకటో రెండో పాయింట్లు రాగానే గోతి కాడ నక్కలా కాచుక్కూచున్న కారు ఇన్సూరెన్సు సారు వాడు డింగుమని లేచి "హ్యాపీ డేస్...హ్యాపీ డేస్..." అని పాడుకుంటూ ఇన్సూరెన్సు ప్రీమియం పెంచేస్తాడు. అదృష్టం కొద్దీ ఇన్సూరెన్సు వాళ్ళు నెలకో సారి మన డ్రైవింగు రికార్డు చెక్ చెయ్యడు. ఇన్సూరెన్సు కాల పరిమితి పొడిగించేప్పుడు మాత్రం చూసి నీకు ప్రైజొచ్చిందని నెలకు $30 కట్టే వాడి చేత $300 కట్టించుకొని "డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు" అని వాడు సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఇలా పాయింట్లు పెంచుకుంటూనో లేక అప్పుడప్పుడూ వేరే కార్లు చాల ముద్దు గా వున్నాయని సరదాగా ముద్దులిస్తూనో వుంటే ఇన్సూరెన్సు వాడు ఇంటికి రాకుండా ఆఫీసుకొచ్చి ఆఫీసు వాళ్ళిచ్చే జీతం నేరుగా వాడి అక్కౌంట్ లోకి తీసేసుకుంటాడు ఖామెడీగా. అందుకే ఈ దేశం లో మరీ ప్రమాదకరంగా వాహనాలు నడిపేవాళ్ళు చాలా తక్కువ. కొంచెం మిడి మాలం గాళ్ళుంటారు. వాళ్ళు జైలుకి రెగ్యులర్ విజిటర్లు అయుంటారు.

పట్టుబడిన రెండు వారాల వరకు కోర్టుకు వెళ్ళి చాలెంజ్ చెయ్యడానికి లేదు. రెండు వారాల తరువాత ఫోను చేస్తే "నీకు నాలుగు పాయింట్లు తోమాము కదా. నువ్వు వెంటనే ఫైను కట్టేసి మాకు కోర్టు పని తగ్గిస్తే నీకు తోమిన రెండు పీకేసి మిగిలిన రెండే ఇస్తాం. సరేనా సార్." అని మర్యాదగా బార్ గైన్‌ ప్లీ ఇస్తారు. కాదంటే "ఒరేయ్ నీ ఖర్మ రా చెబితే వింటావా?. అయితే ఫలానా రోజు కోడి కూసే టైముకు కోర్టుకు వచ్చి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వరకు మాడు వెధవ సారు" అని కొంచెం తెలివైన మర్యాద చేస్తూ చెబుతారు. మనం ఎక్కడో బేస్ మెంట్ లో పడేసిన టై కోసం వెదికితే అది బుడ్డోడి నడుముకు చుట్టుకొని వుంటాడు. వాడికి మూడు ఐస్ క్రీములు, నాలుగు చాక్లెట్లు ఇస్తే ముక్కు తుడుచుకొని తిరిగి ఇస్తాడు. దాన్ని కట్టుకొని వెళ్ళి బాగా వాదించిన తరువాత జడ్జి గారు జాతకం చెప్పే చిలక కార్డు తీసినట్టు లామినేట్ చేసిన తీర్పునొకదాన్ని తీసి మొత్తం చదివి డ్యాషున్న చోట మన పేరు పెట్టి, ఆ పేరు ముందర అవసరమున్నా లేకున్నా మిస్టర్ పెట్టి మిసరబులు చేసి "ఈ నాలుగు తో నలుగు పెట్టుకో. ఆ కౌంటర్ లో డబ్బు కట్టుకో" అని నవ్వేసి "నెక్స్ట్" అంటాడు. అప్పడు మనకు కోర్టు ఖర్చుకు కట్టాల్సిన ఎక్ స్ట్రా ముప్పై, ఎక్కడో ఊరి చివర్న వున్న కోర్టుకు రావడానికి అయిన పెట్రోలు ఖర్చు, బాసు ఏడుస్తూ ఇచ్చిన పర్మిషనూ, బుడ్డోడి ఐస్క్రీము గుర్తుకు వస్తాయి. ఆనంద భాష్పాలు కొన్ని టైకి రెండు వైపులా దేవాదుల ప్రాజెక్టు పైపు లీకయినట్లు కారుతుంటాయి.

సాధారణంగా కాపులు (దీని మీద కాపులు, రెడ్లు అంటూ మిమిక్రీ శివా రెడ్డి చెప్పే జోకు భలే వుంటుంది. భలే అంటే నాకు గుర్తు లేదని అర్థం.) అంటే పోలీసులు స్పీడుగా వెళ్ళే వాళ్ళను పట్టుకోటానికి ఏ చెత్త కుప్పల వెనకాల్నో, విరిగిపోయిన చెట్ల వెనకాల్నో రాడార్ గన్నులెట్టుకొని కాపు కాస్తారు. గంగమ్మ జాతరప్పుడు వేషాలేసినట్టు ఒళ్ళంతా బొట్లు పొడిపించుకొని, కట్ బనీను హాఫ్ కట్ చేసికొని జుట్లో దాసరోళ్ళ పూసలేసుకొని ఊగుతూ రెండు చేతులూ గాల్లో పెట్టేసి వాహనం నడిపే వాళ్ళు దొరగ్గానే పెళ్ళి బ్యాండు, ఈస్ట్ మన్‌ కలర్ రంగుల లైట్లు వేసుకోని వచ్చి టికెట్ పెళ్ళి చేస్తారు.వాళ్ళు కాపు కాయడం చూసినప్పుడు చిన్నప్పుడు ఆడిన దొంగ-పోలీసు ఆట గుర్తుకు వస్తుంది. ఈ ఆట బాగా ఆడిన వాళ్ళకు ట్రాఫిక్ టికెట్లు తక్కువ వస్తాయి.

పొద్దున్నే ఆఫీసు కొస్తూ కాపు గాడి జాక్ పాట్ తో టికెట్టొస్తే వాడు టికెట్ చేతిలో పెట్టి మన సంతకం అయిపోగానే "హ్యావ్ ఏ బెట్టర్ డే" అంటాడు. అప్పుడు కాలినట్టు తండూరి పెనం కూడా కాలదు. కావాలంటే తండూరి పెనం పక్కన పెట్టుకొని స్పీడుగా నడిపి చూడండి.

ట్రాఫిక్ టికెట్ల నుండి తప్పించు కోడానికి కొంత మంది చాలా ట్రిక్కులు ప్లే చేస్తారు(ట). మా ఆఫీసులో ఒకావిడ కాప్ పట్టుకోగానే బోరు మని ఏడ్చేస్తుందట. పోయిన జన్మలో తమిళ నాడు లో పుట్టి వుంటుంది. అలా ఆవిడకి చాలా సక్సస్ రేటు వుందిట. ఇంకొకతను "సార్ చాలా అర్జంటు సార్... వెళ్ళకపోతే పాంటు సార్ ... తడిచిపోతుంది సార్..." అని చెప్పి తప్పించుకుంటాడట. న్యూయార్కు లాంటి చోట్ల కొంత మంది తాయిలం ఇచ్చి మరీ తప్పించుకుంటారట. ఇంకా కొన్ని వున్నాయి. వాటిని బ్లాగులో రాస్తే బాగోదని రాయట్లేదు. ఈ ట్రిక్కులన్నీ అన్ని సమయాల్లోనూ వర్కవుట్ కావు. నేనయితే రెండు సార్లు తప్పొప్పేసుకోని "నిజమే సార్.. చూసుకోలేదు సార్... మీరు చాన మంచోళ్ళు సార్" అని చెప్పేసి తప్పించుకున్నా. మిగతా ఆరు సార్లు మాత్రం కుక్కరు సరీగా లేక పప్పులు వుడక లేదు.

కారు కొన్న కొత్తలో పార్కింగు లాట్లలో కూడా ఫిరంగి గుండు లా దూసుకు పోయే వాడిని. అరవై మైళ్ళ పోస్టింగు వున్న చోట నూరు దాటించినప్పుడు కూడా పట్టుకోలేదు చేత కాని సన్నాసులు. ఏ కాబోయే పెళ్ళికొడుకు గాడ్నో ఏర్ పోర్ట్లో డ్రాప్ చేసి సెక్యూరిటీ చెక్ దాటించి వాడి ఇండియా విమానం టేకాఫ్ అయ్యే లోపు రయ్యిమని వచ్చి ఇంట్లో గరాజ్ లో కారు పార్క్ చేసే వాడిని. గ్రహచారమేంటంటే ఎప్పుడైతే మోజు తీరి జాగ్రత్త గా వెళ్ళడం మొదలు పెట్టానో అప్పట్నుండి టికెట్లు సాక్షి పేపర్ సైజులో రావడం మొదలు పెట్టాయ్..ప్చ్.

గాడ్స్ మస్ట్ బీ క్రేజీ ఐ సే.


:::::::::

Wednesday, June 04, 2008

ప్రమదావనంలో నేను

:::::::::



నా కళ్ళకు ర్యాండం గుణమెక్కువ. ప్రమదా వనం అని పేరు పెట్టినప్పుడే నా తడబడే కళ్ళు ఆ పేరును ప్రమాద వనం లా చదివాయి. అలాంటిది అతిథిగా రమ్మంటే కళ్ళే కాదు ఒళ్ళు కూడా తడబడ్డం మొదలైంది. కాలేజీలో వున్నప్పుడు ఎవరైనా అమ్మాయిలు మాట్లాడితే గొంతు తడారిపోయేది. సినిమాలకు రమ్మని పిలిచిన అమ్మాయిలకైతే ఆ సినిమా థియేటర్ లోనుండి ఎత్తేసే వరకు కనిపించే వాడిని కాదు. ఆడవాళ్ళతో మాట్లాడాలంటే మా అవ్విచ్చిన ధైర్య రసమూ, మాధీఫల రసాయనమూ సమ పాళ్ళలో కలుపుకుని కంచు గ్లాసులో తాగి వెళ్ళే వాడిని. ఇప్పుడు మా అవ్వలేదు, మాధీఫల రసాయనమూ లేదు. మా ఆవిడ నడిగితే అవేంటో తెలీదు అంటుంది. జీవితంలో ఎప్పుడో ఓ సారి రిస్కు తీసుకోక తప్పదని తెలిసింది. అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నా. అలా ఆ రిస్కు తో కొంత ధైర్యం వుంది కాబట్టి అతిథిగా వస్తానని చెప్పేశా.ఆ రోజు డంకనక డంకనక... డంకనక డంకనక... అని వచ్చేసింది. భయ పడుతూ పడుతూ ప్రమాదావనం లో అడుగు పెట్టేముందు



ఇలా వెళితే






అలా బయటికి వస్తానని అనుమానిస్తూ పిల్లిలా అడుగు పెట్టా.




అలా బొమ్మలు మాత్రమే పెట్టేస్తే బ్లాగు లోకానికి అన్యాయం చేసినట్టవుతుంది.అక్కడేమి జరిగిందో తోటి మగ బ్లాగర్లకు చెప్పకపోతే మగ పుట్టకే వేస్టు అంతే కాకుండా మగ బ్లాగు లోకానికి ద్రోహం చేసిన వాడనై నరకాని కెళితే అక్కడ ఆడ రాక్షసుల చేత శిక్షింపబడతానని గ్రహించి ఇప్పుడు రాస్తున్నా.

అది శాలి వాహన శక సంవత్సరం 1930...
స్వస్తి శ్రీ సర్వధారి నామ సంవత్సరం....
వైశాఖ శుధ్ధ చతుర్దశి......
వర్జ్యం లేదు.

సమయం: భారత్ లో ఎగిరే పక్షులు ఇంటికి చేరుకునే సమయం. ఉద్యోగ పక్షులు ఏడుస్తూ పార్కుల నుండి ఇంటికి చేరుకే సమయం.
అమెరికా లో బ్రష్షు బదులు కాఫీ నోట్లోకి తోసే సమయం.

ధైర్యే సాహసే ఉబ్బసమే దగ్గు అని 11 సార్లు అనుకొని ప్రమదా వనం లో అడుగు పెట్టా. నేను అడుగు పెట్టేసరికి కొందరు పెద్ద మహిళా బ్లాగర్లు వచ్చి వెళ్ళి పోయారు. (హమ్మయ్య…మొదటి హమ్మయ్య) అప్పుడు అక్కడున్న బ్లాగరులు జ్యోతక్క, రాధిక, సుజాత శ్రీనివాస్, నిషిగంధ, తెరెసా, వరూధిని వున్నారు. ఇంకా రేణు కూడా మధ్యలో వచ్చి వెళ్ళారు.

కాసేపు పిచ్చాపాటి కబుర్లు నడిచాయి. పిచ్చా పాటి అంటే జన్మ కుండలాలు, జాతక నక్షత్రాలు తెల్సుకోవడమన్నమాట.

అప్పటికి వాతావరణం బావుంది (హమ్మయ్య రెండో సారి. ఐడియా హమ్మ హమ్మ కాదు )

అవన్నీ అయిన తరువాత మెల్లిగా మాటలు చెబుతూ “స్వాగతం దొరా….సుస్వాగతం..” అని ఉష్ణ పీఠం ఎక్కించారు. అదేదో బొబ్బిలి బ్రహ్మన్న సింహాసనమనుకొనేరు. ఎక్కి కూచుంటే కానీ దాని శక్తి తెలీదు. తరువాత మొదలైంది ప్రశ్నల పరంపర. (ఇంక హమ్మయ్యాలు లేవు గమనించగలరు)

మీదే ఊరు?
మేము కొండ దొరలం, కొండల్లో వుంటాం. మంచు కురుస్తుంది కదా మంచు దొరలం కూడా.

గర్లు ఫ్రెండ్స్ వున్నారా?
ఫ్రెండ్సులో గర్ల్సు లేరు.

మీది ప్రేమ వివాహమా?
పెళ్ళయిన తరువాత ప్రేమించిన వివాహం.

మీ ఆవిడ ఇండిపెండెంటా, డిపెండెంటా?
నా మెళ్ళో పెండెంటు.

మీ దగ్గరకో అందమైన్ డబ్బున్న అమ్మాయొచ్చి పెళ్ళి చేసుకుంటా నంటే ఏమంటారు.
ఎగిరి గంతేసి చేసుకుంటా

ఇద్దరూ కలిసే వుండాలంటే ఏమి చేస్తారు?
వాళ్ళు కొట్లాడు కోకుండా ఒకరికి ఈ టి.వి. పెట్టి ఇంకోకరికి కూడలి చూపిస్తా.

మీకు బ్లాగడానికి అవిడియాలు ఎలా వస్తాయి?
చిన్నప్పుడు ఎక్కువగా దొంగతనాలు చెయ్యడం వల్ల. ఇప్పుడు చేయిస్తున్నా.

మీరు సరదాగా వుంటారా , మూడీగా వుంటారా?
సరదా మూడ్ లో వుంటా.

మీ హైటెంత?
సిక్స్ టూ సిక్సు.

మీరేం చేస్తుంటారు?
పిల్లల చేత మారాం చేయిస్తుంటా.

అమెరికా ఎందుకెళ్ళారు?
విమానెక్కాను కాబట్టి

మీరు మందు కొడతారా?
అవును ఇక్కడ మా చెట్లకు తెగులు ఎక్కువ.

మీ కిష్టమైన బ్లాగు
విహారి

అది కాకుండా ఇంకోటి
ఇదీ నా మది

ఊహూ అది కాకుంటా ఇంకొకటి
నాటకాలూ..వగైరా

మీకు తిరకాసోడు అని పేరుందా
అవును నాదగ్గర ఎప్పుడు త్రీ కాసులే వుంటాయి. ఫోర్ కాసులు(నాలుగు రాళ్ళు) వుండవు.

అందరూ హాస్యంగా రాస్తున్నారు గదా మీరు కుళ్ళు కుంటున్నారా?
అవును. బండకేసి బాదుకుంటున్నాను. అందుకే ఇకమీదట సీరియెస్ టపాలు రాస్తాను.

(ప్రమదా వనం కొంత సేపు కంపించింది. రాధిక కంప్యూటరును గట్టిగా బాదడం వల్ల తన కంప్యూటరుకు పగుళ్ళు వచ్చాయి. సరే హాస్యం రాస్తాను అన్న తరువాత అన్నీ సవ్యంగా పని చెయ్యడం మొదలు పెట్టాయి)

అలా రాసుకుంటూ పోతే చాలా వున్నాయి. ఉష్ణ పీఠం మీద నుండి దిగిన తరువాత నేనెలా అయిపోయానో నని మీకు అనుమానం కదూ. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..బాతు గుడ్డోయ్..ఆమ్లెట్లోయ్.. అని పాట పాడుకున్నానని మీ అనుమానం కదూ. మీ అనుమానం తీర్చుకోవడానికి ఈ కింది బొమ్మ చూడండి. (మైసూర్ మహరాజ్)



మొత్తానికి భూమి మీద నున్న అన్ని ఖండాల లలనాంగనలు అందరూ చేటలు వదిలేసి ఒక్క చోట ముచ్చట్లు పెట్టుకోవడం బావుంది. రేపో మాపో వీవెన్ స్క్రీన్ మీద రాసే సదుపాయమిస్తే సంక్రాంతి ముగ్గులు వేసుకోని గొబ్బెమ్మలు పెట్టేసి హైటెక్ చేస్తారు. ఎవరైనా మహిళామణులు మిస్సయితే తప్పకుండా వెళ్ళి ఆ వనం లో విహరించండి.


గమనిక:
ఇందులో కొన్ని కల్పితాలున్నాయి.


:::::::::

హడలి చచ్చా..

హమ్మయ్యా కె.సి.ఆర్. రాజీనామా ఉపసంహరించుకున్నాడు. టి.ఆర్.ఎస్. అధ్యక్ష పదవికే కాకుండా కరీం నగర్ లోక సభకు కూడా రాజీనామా చేసేస్తాడేమోనని తెగ టెన్షన్‌ పడ్డా. చేసేస్తే మళ్ళీ జీవన్‌ రెడ్డి, రమణ వచ్చేసి ప్రజలకు జీవన్మరణ సమస్య తెచ్చేసుండేవాళ్ళు. ఏంటో అప్పుడూ లైఫు హ్యాప్పీగానే వుంటుంది.

Tuesday, June 03, 2008

ముక్కులో మైకు కార్యక్రమం

"మీరు కాంగ్రేసులో చేరుతున్నారా?"

"మాకు వై.ఎస్. విధానాలు నచ్చాయి అందుకే కాంగ్రేసు పార్టీ నచ్చింది. ఇప్పుడున్న జల యజ్ఞం ప్రాజెక్టులు సరైన సమయానికి పూర్తయితే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేరు."


"కొత్తగా పార్టీలొస్తున్నాయి కదా వాళ్ళు కూడా కాంగ్రేసు మీద ప్రభావం చూప లేరా?"
"నో వే. కొత్త నాయకులు ఎవరొచ్చిన కాంగ్రేసు మీద ప్రభావం చూపలేరు. వచ్చే ఎన్నికల తరువాత కూడా వై.ఎస్సే. సి.ఎం. "

అడిగింది పాత్రికేయులు. చెప్పింది సినీ నటి జీవిత.


మైకు కట్ చేస్తే హెడ్లైన్......







చిరంజీవి ముఖ్యమంత్రి కాలేడు అన్న జీవిత



:::::::::