Tuesday, February 26, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (క్రికెట్, ఉండవల్లి)




"రేయ్ సిద్ధా, ఓ సారిలా రా?"
"......"

"రేయ్ సిద్ధా, ఎక్కడున్నవ్ రా? ఏంటి వంటింట్లో లేడు కంప్యూటర్ రూములో లేడు ఎక్కడికెళ్ళాడు? రేయ్ సిధ్ధిగా ఎక్కడ చచ్చావ్ రా?"
"....."


"ఏంటిది వరండాలో కూడా లేడు…. ఓర్నీ ఇక్కడ రోడ్లో ఆ క్రికెట్టేందిరా ఇది క్రికెట్టాడే వయసా? ఆ బ్యాటూ బాలూ అక్కడ పడేసి లోపలికి రా"
"చా పొండయ్యగారూ నేను సక్కగా కిరికెట్టు నేర్చుకుంటుంటే మీకు కుళ్ళు గా వుంది. కావాలంటే మీరు కూడా రండి ఇద్దరం కలిసి ఆడుకుందా. నేనిప్పుడే దోసె రా ఎట్లా ఎయ్యాలో నేర్చుకున్నా. మీరు బ్యాటు పట్టుకోని నిలబడుకోండి. చూపిస్తా."

"అది దోసె రా కాదు రా దూస్రా. నీ దూస్రా పిచ్చుకలెత్తుకెళ్ళ. వెంటనే వచ్చి ఓ దోసె పడెయ్ నాకు."
"అది కాదయ్య గారూ, కావాలంటే మీరు బౌలింగ్ చెయ్యండి నేను రివర్సు స్వీటు షాటు ఎలా చేస్తానో చూపిస్తా"

"నీ అర్ధ క్నాలెడ్జి తగలెయ్య. అది రివర్సుస్వీప్ షాట్, రివర్సు స్వీటు కాదు. ఈ లెక్కన ఎల్బీడబ్ల్యూ ని లడ్డూ జిలేబి, సిల్లీ పాయింటు ను చిల్లీ చికెను అని క్రికెట్ మొత్తాన్ని డైనింగ్ టేబుల్ చేసేట్టున్నావ్. ఆ బ్యాటు అక్కడ పడేసి రా."
"అది కాదండి నేను పెద్ద క్రికెటరయితే మీరు హాయిగా ఇంటి పట్టున కూచోని మ్యాచు ఫిక్సింగ్ చేసుకో వచ్చు కదా."

"మ్యాచు ఫిక్సింగులా అదేమన్నా కేకు మిక్సనుకున్నావా? నీ మూతికి బాలు ఫిక్సుకాకుండా చూసుకో. అసలు నీకు క్రికెట్టాడే వయసా ఇది?"
"అదేంటండి అట్లంటారు. జయసూర్య కు 37, కుంబ్లేకి 36, సచిన్ కు 35. నాకు 15 ఏళ్ళకే పెళ్ళి చేసారు కాబట్టి పెద్ద పిల్లలున్నారు కానీ. నా వయసు 34 కదా. క్రికెట్టాడ్డానికి ఏం తక్కువని?"

"నీ లెక్కలు బానే వున్నాయి కానీ. నీకు శరద్ పవార్ కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ తెలుసేమిటి?"
"అబ్బే తెలీదండి."

"అయితే బాగా మసాలా పట్టించి పప్పుల పోడేసి వెన్న రాసి రెండు మాసాలా దోసెలు పట్టుకురా వంటింట్లోకెళ్ళి. "
"అలాగే అయ్యగారూ" అని గుర్రు మని చూసుకుంటూ వెళ్ళిపోయాడు.


**


"మసాలా దోసె బ్రహ్మాండగా చేశావు. పోయిన వారం బ్లాగులన్నావ్ ఈ సారి క్రికెట్టంటున్నావ్.నీకు ఈ క్రికెట్ మీద మనసెందుకు పోయింది? "
"నేను చిన్నగా వున్నప్పుడెప్పుడో మా ఊర్లో రాత్తురుల్లో బట్టలు ఏలం ఏసేవాళ్ళు. రెండు కిరసనాయిలు బుడ్డీలు ఆపక్కొకటి, ఈ పక్కొకటి పెట్టి మధ్యలో గుడ్డలు పరిచి అమ్మేవోళ్ళు. ఏలం పాట చెబితే మా ఊర్లో ఆడోళ్ళు మగోళ్ళు రెట్టలు ఎగేసుకోని భలే పాడే ఓళ్ళు లే. ఇప్పుడు సేం టూ సేం. గుడ్డల బదులు కిరికెట్టు ఆడే ఓళ్ళు... మా ఊర్లో రెట్టలెగేసుకునే వాళ్ళ కు బదులు కోట్లేసుకున్నోళ్ళు. ధోనీని ఆరు కోట్లకు, ఇషాంత్ నాలుక్కోట్లు, ఆండ్రో సైమండ్స్ అయిదున్నరకోట్లు, ఒకట్రొండు మ్యాచులాడిన మనోజ్ తివారిని కూడా రెండున్నర కోట్లకు ఏలం పాటలో పాడేసుకున్నారు కదా. నేను కూడా కిరికెట్టు నేర్చుకుంటే నన్ను కూడా ఏలం లో పాడుకుంటారు కదా "

"వాళ్ళందరి లక్కూ అలాంటిది మరి. మనోళ్ళెవరికైనా బాగా డబ్బొచ్చిందా?"
"మన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ కు వచ్చింది ఒకటిన్నర కోటే పాపం"

"అయ్యో అంత తక్కువా?"
"ఏం లేదు తనకి దిగ్గజం హోదా వస్తే అయిదు కోట్లకు పైగా ఇవ్వాల్సి వస్తుంది. అంత డబ్బు పెట్టే బదులు తాను కేప్టన్ అయిన హైదరాబాద్ కు మంచి ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు కదా అని."

"ఇట్లాగే మంచికి పోతే ఏదో ఒక రోజు టెస్టుల నుండి కూడా పీకేస్తారు. "


***


"అయ్యగారూ, మీకు జంతువులు మాట్లాడే భాష తెలుసా?"
"తెలీదు రా"

"పక్షులు మాట్లాడే భాష తెలుసా? "
"పక్షుల భాషే కాదురా అక్కుపక్షీ! చేపల భాష కూడా తెలీదు. ఇంతవరకు ఏ జంతువు భాషా శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేదు."

"మరి మొన్న వై.ఎస్. అసెంబ్లీ లో చంద్ర బాబును పట్టుకుని అసలది మనుషులు మాట్లాడే భాష కాదు అని స్పష్టంగా ఎలా చెప్పగలిగాడు?"
"నాకు తెలీదు ఆయనకు ఆంధ్ర దేశంలో వున్న ఆడవాళ్ళనందరినీ లక్షాధికారులు, దళితులనందరినీ టాటా, బిర్లాల లాగా చేసే శక్తులు వున్నాయన్నాడు గదా. అంత గొప్పోడికి జంతు జాలాలు మాట్లాడే భాష కూడా వచ్చేమో?"

"కాకా ఇంట్లో విందుకు పోయినప్పుడు ఏ భాష మాట్లాడుంటారంటారు?"
"ఏదయినా గానీ రాయలసీమ భాష మాత్రం మాట్లాడుండడు.వై.ఎస్.కి చాలా భాషలు వచ్చు "

"ఉండవల్లి రాజమండ్రి లో ఏ భాష వాడాడు?"
"ఒకటి తెలుగు దేశం భాష , ఇంకోటి కాంగ్రేస్ భాష."

"అవి పార్టీలు కదా వాటికి భాషలేంటి?"
"అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏ స్పీకర్ లోనుండి వస్తే అది ఆ పార్టీ వాళ్ళ బాష. సపోస్ తెలుగుదేశం వాళ్ళ స్పీకర్ నుండి వచ్చిందనుకో అది 'దురదృష్ట వశాత్తు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. ఇప్పుడు దాన్ని ఆచరించక తప్పని పరిస్థితి' అని చెప్తుంది. ఆదే కాంగ్రేస్ వాళ్ళ స్పీకర్ నుండి వస్తే తెలుగు దేశం వాళ్ళని ఉద్ధేశిస్తున్నట్టు '(మీ) దురదృష్టం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. ఇప్పుడు దాన్ని ఆచరించక తప్పని పరిస్థితి ' అని వినిపిస్తుంది."

"ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం?"
"అలాంటి వాటికి జవాబు చెప్పడానికి పడవల్లో నుండి, కూచిపూడి నుండి, కుండల్లో నుండి వెలికి తీసి నిష్కర్షగా నిజాలను చెప్పే పత్రిక వస్తోంది. అందుకు నువ్వే సాక్షి."



Tuesday, February 19, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (18-ఫిబ్రవరి-2008)



"ఏంట్రా అలా దిగులుగా వున్నావు?"

"ఏం లేదయ్యా ఏం చెప్పమంటారు. ఇన్నాళ్ళు చక్కగా గిలిగింతలు పెట్టే అమెరికాలో అపసోపాలు టపా అయిపోయింది."

"దానికెందుకు ఏడవటం మురళీ బ్లాగునుండి మళ్ళీ ఇంకో సీరియల్ మొదలవుతుందిలే అంతవరకు అదిగో ఈ జెమినీలో వచ్చే దైవ భక్తి సినిమా 'అమ్మోరు మట్టి' అనే సీరియల్ చూడు."

"అయ్యగారు, నా మీదేమన్నా కోపముంటే తిట్టండి కొట్టండి అంతే కానీ నన్నలాంటి టి.వి. సీరియళ్ళు చూడమని హింసించకండి" గుడ్ల నిండా నీరు వస్తుంటే టవల్ తో నోట్లొ కుక్కుకుని చెప్పాడు.

"సరేలే ఏడవకు భక్తి సీరియళ్ళు చూడకపోతే చూడక పోయావ్ దానికి విరుగుడుగా త్రిల్లర్ సీరియల్ 'పీక కోసిన పాప' TV 9 లో వస్తుంది చూడు."

"అయ్యగారు, మీకు నా మీద ప్రేమో లేక నన్ను బయటికి గెంటెయ్యాలనే ప్లానో తెలియడం లేదు నేనేదన్నా తప్పు చేస్తే నన్ను క్షమించండయ్యా" అని కాళ్ళ మీద పడిపోయాడు.

"సర్లే లేవరా నిన్ననే అంత వాడినా చెప్పు ఏదో నెలసరి ఖర్చుల్లో తేడా వస్తుందేమో నని అలా మాట్లాడా."

"ఆ నాకిప్పుడర్థమయింది మీరెందుకిలా మాట్లాడుతున్నారో. మొన్న, ఇళ్ళల్లో పని చేసే వాళ్ళందరికి రోజుకు వంద రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది కదా. నేను కూడా అంత డబ్బులు అడుగుతానని అనుకున్నారు కదూ. మా పిల్లల చదువులకు, అమ్మాయి పెళ్ళి కి సహాయం చేసిన మిమ్మల్ని నేను అలా డబ్బు అడుగుతానని ఎలా అనుకున్నానయ్య గారు. ఎలా అనుకున్నారు?" అని మళ్ళీ తువ్వాలులో మొహం పెట్టి ఏడ్చాడు మామ గారు సినిమాలో దాసరి నారాయణ రావు లాగా.

"నిన్ను నా మందులకోసం చెన్నై పంపించడం తప్పయిపోయిందిరా. అక్కడ కె.ఆర్.విజయ నటించిన భక్తి సినిమా ఏదో చూసి నట్టున్నావ్ ఇంకా ఆ ట్రాన్స్ లోనుండి బయటికి రాలేక పోతున్నావ్.ప్రతి దానికి ఏడుపులే. నేనన్నది మన రోశయ్య గారు 13వ సారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి. పైకి మెత్తగా కనిపిస్తున్న ఈ బడ్జెట్ ఎక్కడ నా బొక్కసానికి బొక్కేస్తుందోనని అలా అన్నా "


"అంతేనంటారా? నేనే అనవసరంగా భయపడ్డాను.నేను ఈ వారమ్లో మిస్సయినవి ఏవన్నా వుంటే చెప్పండి."

"వాలెంటైన్‌ డే స్పెషల్ గా హైదరాబాద్ లో ఏదో రేడియో వాళ్ళు డేట్ 'ఇన్‌ద స్కై' అనే కార్యక్రమం చేశారు. అందులో గెలిచిన వాళ్ళను కాసేపు విమానంలో తిప్పారట. "

"ఆ తొక్కలో డేటింగులు ఇక్కడికూడా వచ్చాయన్నమాట. ముంబై నుండి శంషాబాదుకు విమానమ్లో రావడానికి ఎంత సేపు పడుతుంది?"

"ఒక గంట"

"అదే శంషాబాదు నుండి హైదరాబాద్ రావటానికి ఎంత సేపు పడుతుంది?"

"ఆ ఎంత ఓ పదో పాతికో నిముషాలు."

"అక్కడే మీరు బ్లాగులో కాలేశారు. ఒకటిన్నర గంట. సరేలే బ్లాగుల గురించి చెప్పండి."

"ఈ వారం వాలెంటైం డే సందర్భంగా వచ్చిన నాకు నచ్చిన హెడ్లైన్‌ ప్రేమలో పడకండి – ప్రేమలో నిలబడండి. చాలా కాలం తరువాత నాకు నచ్చిన సినిమా అని కాకుండా నాకు నచ్చిన సినిమా సన్నివేశం అని సిరి గారు, టి.వి.సుమన్‌ మీద శ్లేష తో ఆచార్యుల వారు తిరంగేంట్రం చేశారు."

"తిరంగేట్రం ఏంటండి అయ్య గారు. అసలే మద్రాసు నుండి వచ్చిన నాకు అంతా అరవం లా వినబడుతోంది."

"మొదటి సారిగా ఏదన్నా ప్రదర్శన ఇస్తే దాన్ని అరంగేట్రం అంటారు.రెండో సారి తిరిగి వస్తే తిరంగేట్రం అంటారు."

"సొంత పైత్యమన్న మాట. మీకు అవార్డు ఇవ్వాలి ఇలాంటివి కనుక్కునందుకు."

"అవార్డులంటే గుర్తుకు వచ్చింది. మొన్న నంది అవార్డులు ఇచ్చార్రో?"

"అబ్బా ఉగాది రాకనే అంత తొందరగా ఇచ్చేశారా?"

"ఏమి నమ్మకం రా నీకు ఈ ప్రభుత్వం మీద. ఇప్పుడు ఇచ్చింది 2007 కు కాదు 2006 కు.ఇంకా నయం 2009 లో ఇవ్వలేదు. "


::::::::::::::::::::::::::::::::::::::::

"అయ్యగారూ. ఎక్కడ చూసిన ఈ జోధా అక్బర్ గొడవేంటి?"

"ఏమోరా శ్రీధర్ గారు అక్బర్ గురించి రాసిన టపాలు చదివిన తరువాత కనీసం దీని రివ్యూ కూడా చదవాలనిపించలేదు. సినిమా కథంతా కల్పితమట. రాజస్థాన్లో రాజ్ పుట్ లు గొడవ చేస్తున్నారు. చరిత్రకి దీనికి సంబంధం లేదట."

"మనకు భాగ్యనగర్ అని పేరు రావాడానికి కూడా ఎదో చరిత్ర వుంది కదా."

"ఆ ఏదో వుంది."

"అదే భాగ్య నగర్ లో వున్న మూసీ నదికి ఆ పేరు ఎలా వచ్చింది?"

"ఆ నది పక్కన నడిచేటప్పుడు ముక్కు మూసి నడవాలి కదా అందుకని మూసీ నది పేరొచ్చింది."

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

Friday, February 15, 2008

రాజు గారి రహస్య పర్యటన




రోజూ తన దైనందిన కార్యక్రమాలతో విరామం లేకుండా పనిచేస్తున్న వై.ఎస్. కి ఏదైనా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పని చెయ్యాలనుకున్నాడు సూరీడు. పూర్వ కాలం లో రాజు అలసి పోయాడనిపిస్తే వెంటనే ఓ ఆటా పాటా ఏర్పాటు చేసే వారు. ఇప్పుడు రాచరికాలు లేవు కాని పరివారం మాత్రం వుంది. ఆటా పాటా కావాలంటే అందుకు సంబంధించన వాడు వుండాలి అని తమ పార్టీ వాడైన సాంస్కృతిక శాఖ చైర్మెన్, సినీ నటుడు అయిన ధర్మ వరపు సుబ్రహ్మణ్యానికి ఫోను చేశాడు.



"ఆ చెప్పండి సూరీడు అన్న గారు, ఎమన్నా ప్రాబ్లమా? మీకు ప్రాబ్లమేంటండి? మీరు దేవానందు గైడు లాంటి వారు మీరు మిమ్మల్ని చూసి మేము కాపీ కొట్టాలి గానీ"

"అంత లేదులే గానీ అబ్బీ, అన్నకి ఎబ్బుదూ పన్లు వుంటాండాయి గదా. ఏమన్న ఎంటర్ టైన్‌మెంట్‌ ఇజ్జామని అనుకుంటాండా"

"అయ్యో దాందేముందన్నా. వెంటనే ఇంద్ర, ఆది, సమరసింహా రెడ్డి సినిమాలు చూపించు"

"ఎంత రాయల సీమ గురించి జూపిస్తే మాత్తరం మన ఎగస్పార్టీ వాళ్ళ సినిమాలు జూపిచ్చమంటావా ఏంది?"

"సర్లే అయితే ఒక పాత శ్రీకృష్ణ దేవరాయలు సినిమా వుంది పంపించమంటావాన్నా"

"అట్లాగేబ్బీ బిర్నే పంపిచ్చు. రాత్తిరికి అన్నకి జూపిస్తా"

"అన్నా ఇంకో మాట."

"చెప్పుబ్బి"

"అన్నా నేనెన్ని పైరవీలు చేసినా నాలుగయిదు కోట్లకన్నా ఎక్కువ ఖజానా లో జమ కాలేదు. తమరు కనీసం ఓ వందేసుకోనుంటారు కదా అదెలానో సెలవిస్తే నేనూ ఫాలో అయిపోతా"

"ఏంది? నూరా అది నువ్వు ఇబ్బుటికే చేరుకోవాల్సిన రేంజు. నేనంత నాబర్దాగా కనిపిస్తా వుండానా? నువ్వు ఫోను పెట్టెయ్ ముందు"

::::::

ఆ రోజుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే సూరీడు డి.వి.డి ఆన్ చేసి టి.వి. పెట్టి

"అన్నా! నువ్వు బాగా అలిసిపొయినావు గానీ కొంజేపు ఈ సినిమా జూసి పండుకో" అని చెప్పి వెళ్ళిపోయినాడు.

ఆ సినిమా చూస్తున్న వై.ఎస్.కి ఒక సన్నివేశం చూసాకా బుర్రలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. వెంటనే సూరీడు ని పిలిపించాడు.

"సూరీడూ, నువ్వు ఈ రోజు చానా మంచి పని జేసినావ్. ఈ సినిమా జూసినంక నాగ్గూడా శ్రీకృష్ణ దేవరాయలు మాదిరి రాజ్యమంతా రహస్యంగా తిరిగి నా గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసు కోవాలని వుంది"

"అదెంత పనన్నా ఇబ్బుడే అన్ని అరేంజిమెంట్లు జేస్తా. కాక్పోతే ఒగ కండిషన్. మనమెప్పుడు యాడికి పోతున్నామో నేను జెప్పను"

"అయ్యో సూరీడూ నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా అలాగే కానీ"

::::::

తరువాత రోజే ప్రయాణం మొదలయింది. ప్రజలు గుర్తు పట్టకుండా వై.ఎస్. సర్దార్ పాపారాయుడి గెటప్ వేసుకున్నాడు (తుపాకీ లేకుండా). సూరీడేమో రామ దాసు సినిమాలో నాగేశ్వర రావు వేసిన కబీరు గెటప్పు తెప్పించుకుని వేసుకొన్నాడు(జోలె లేకుండా). చీకటవగానే హెలికాప్టర్ ఎక్కి ఆంధ్ర దేశంలో ని ఒక ఊరికి పది కిలోమీటర్ల దూరంలో చేన్లో దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పాత అంబాసిడర్ కారు ను తీసుకొని సూరీడు డ్రైవ్ చేసుకుంటూ ఊరి చివర్లో చెట్టు కింద పార్క్ చేసి ఊర్లో సంచారం చెయ్యడం మొదలు పెట్టారు.



ఆ ఊర్లోని రోడ్లు, ఇళ్ళు, శుభ్రత చూసి వై.ఎస్. ముగ్దుడైపోయాడు. అందరి ఇళ్ళ ముందు ఏదో ఒక ఫారిన్ కారో ఇండియెన్ కారో వుంది. ఇంట్లో ఎల్.సి.డి. టి.వి.లు, కార్పెట్లు చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు. వెంటనే సూరీడును గుండెలకు హత్తుకొని “ఈ సారి బాబుకి బోడి చిప్పే మళ్ళీ మనమే రాబోతున్నాం. మేడంకు ఇప్పుడే ఫోను చేసి చెప్పేస్తా ఎలక్షన్లు ఇప్పుడే పెట్టేద్దామని” అని ఫోను తియ్యబోతుంటే సూరీడు వారించాడు.

"అయ్యో మీరు కొంచెం ఆగండి. ఇంగా ఒగ ప్లేసుకూడా పూర్తిగా చూడలేదు అప్పుడే ఫోనెందుకు. ఇంకొంచెం ముందు బొయ్యి ఊరంతా చూద్దాం పా"

అలా కొంత దూరం వెళ్ళి కొంచెం మధ్య తరగతి కుటుంబం లా కనిపించే ఇంటి ముందు ఆగి ఆ ఇంట్లో నుండి వచ్చే మాటలు వింటున్నారు.

"ఓయ్ మామా నేనిప్పుడే వెళ్ళి చీటీ పాడుకోని వస్తా నువ్వీణ్ణే వుండి పిల్లోడికి మందులెయ్యి"

"అది కాదే నేనియ్యాల పొలం కాడికి బొయ్యి ప్రాజెక్టులో నుండి వచ్చే నీళ్ళు మన మళ్ళోకి కట్టల్ల. నువ్వీణ్ణే వుండి పిల్లోడికి మందులెయ్యి. వానికసలె ఒంట్లో బాగలేదు"

"అయ్యో వాడికేమీ కాదులే మొన్నే కదా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వాడికి ఒళ్ళు బాగు చేయించుకుని వచ్చాం గదా ఏమీ కాదులే. ఇంకా ఏమన్నా అయితే మనమే డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకోవచ్చు. పావలా వడ్డీతో తీసుకున్న అప్పు తీరిపొయి కొంచెం వెనకేసుకున్నాం కదా"

"అది కాదే వరసగా మూడో సమత్సరం.ఈ సారి కూడా మూడో పంట వేస్తున్నాం అది మన చేతికి వస్తే మనం కూడా కారు కొనుక్కోవచ్చే"

"సరేలే అయితే నువ్వు పొలం కాడికి పొయి రా నేను పిల్లాడిని చూసుకుంటా. ఈ చీటీ కాకపోతే ఇంకో చీటి. మనకేమన్న డబ్బులకు కష్టమా"

అది విన్న వై.ఎస్. పరమానంద భరితుడయ్యాడు.

"చూశావా సూరీడూ, మన ఆంధ్ర ప్రదేశ్ ఇంతగా డెవలప్ అయిపోతుంటే ఆ బాబేమో హరితాంధ్ర కాదు నేరాంధ్ర, జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అంటాడు. వెంటనే మేడం కు ఫోను చేసి ఎలక్షన్స్ పెట్టెయ్యమని చెప్పేస్తా" అని ఫోను తియ్యబోతుంటే సూరీడు గబుక్కున లాక్కొని జేబులో వేసుకున్నాడు.

అంతలో అక్కడ టీ స్టాలు దగ్గర ఎవరో మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళారు.

"ఏం? రాజశేఖర్ మాత్రం నటుడు కాదా? అతనికి ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? చిరంజీవి, రాజశేఖర్ ఒకే సినిమాలో నటించలేదా? అని ఈ రోజు నేను మాట్లాడుతున్నా. చిరంజీవి కన్నా ఇంకా మంచి రంగు, రుచి, వాసన వున్న వాళ్ళు ఎంతో మంది వున్నారు. వాళ్ళు లిట్మస్ టెస్ట్ ఎలా చెయ్యాలో తెలీక అలా అయిపోయారు ..." ఏకబిగిన మాట్లాడేస్తున్నాడు మంత్ర మారెప్ప.

"ఏమిటిది అప్పుడెప్పుడో దీని గురించి మాట్లాడమని కీ ఇచ్చా. అదింకా పని చేస్తున్నట్టుంది.. " అన్నాడు వై.ఎస్.

"మీ కీ అంత స్ట్రాంగన్నా.సర్లే పదన్నా మనం తరువాత వెళ్ళాల్సిన చోటికి టైమవుతోంది" సూరీడు పురమాయించాడు.

హెలికాప్టర్ లో వెళ్ళి ఇంకో చోట వాలారు. అదో పల్లె టూరు. అక్కడో దీపం ఇక్కడో దీపం వెలుగుతోంది. ఇంటి ముందు పెద్ద పేర్లతో ఇందిరమ్మ గృహ పథకం అని కనిపిస్తోంది.

ఆ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ఇంటి కిటికీ దగ్గరకు వెళ్ళి గోడకు ఆనుకుని నిలబడ బోయాడు వై.ఎస్.

అది చూసి "అన్నా ఆ గోడకు ఆనుకోవద్దు. గట్టిగా ఆనుకుంటే ఈ గోడ పడిపోతుంది. ఈ రోజు పొద్దునే వాన కూడా పణ్ణట్టుంది." అన్నాడు సూరీడు.

"మన వాళ్ళు అంత స్ట్రాంగా కట్టారా?"

"అంతా మనూరోళ్ళే అన్నా "

లోపలి నుండి మాటలు వినిపించసాగాయి.

మొగుడి మీద పెళ్ళాం గట్టిగా అరుస్తోంది.

"నేను నీకెప్పుడో చెప్పినా ఈ ఇంట్లోకి మారొద్దు. చావో రేవో ఆ మట్టి కొంపలోనే తేల్చుకుందాము అని. నువ్వు నా మాటింటావా వున్న ఆ కొంచెం డబ్బులు పోసేసి పక్కా ఇల్లు, పక్కా ఇల్లు అని ఈడకొచ్చి పడినాం. వచ్చిన్రోజే చెప్పినా ఆ గొళ్ళకు నెర్రెలు కనిపించకుండా సున్నాలు కొట్టినారు. ఈడుండేది మంచిది కాదు అని. ఇప్పుడు చూడు ఇల్లంతా కారి చస్తా వుంది. ఎప్పుడు ఊడి మీద పడుతుందో అని ప్రాణాలు అర చేతిలో పెట్టుకోని బతుకుతున్నా".

"అది కాదే నకెట్ల తెలుస్తుంది ఈళ్ళు ఇట్లా చెస్తారని. నేనేమన్నా కల గన్నానా. ఈ మాడి పోతేపోయింది గానీ నాలుగడుగుల నేల మన పేరు మీద రిజిస్టరు అయింది కదా"

"ఆ చాల్లే సంబడం. కాణీ విలువ లేని పాములు, తేళ్ళు తిరిగే చోట కాలనీ కట్టేసి. భూమొచ్చిందంటావా. అది కూదా శ్మశానం పక్కన. అది సరే ఆవు కొనుక్కునే దానికి అప్పు ఇచ్చినారు గదా ఆ డబ్బే ది"

"ఇంకెక్కడి డబ్బే. ఆడ డబ్బులు అందరి చేతులు మారి నా చేతికొచ్చింది నాలుగు వందలు. దానికి ఆవు తోక కాదు కదా కాలి గిట్టలు కూడా రావు. అందుకే ఆ గవర్నమెంటోళ్ళు ఇచ్చిన డబ్బులు ఆ గవర్నమెంటోళ్ళకే ఇచ్చి అప్పు తీర్చేసి వచ్చేశా"

"నీ జిమ్మడ ఆ వచ్చిన డబ్బులు ఊరి మొగసాల్లో పెట్టిన బెల్టు షాపులో ఇచ్చేసి పీకల్దాకా తాగొస్తావా అసలు నిన్ను కాదు అనాల్సింది.." అని బూతులంకించుకుంది.

"సూరీడూ మనం తొందరగా హైదరా బాద్ వెళ్ళి పోదాం పదా. మన జగన్ బాబు సాక్షి పత్రిక గురించి ఏదో మాట్లాడన్నాడు గదా తొందరగ పోదాం రా" అని వెనక్కి కూడా తిరిగి చూడకుండా హెలికాప్టర్ దగ్గరకి వెళ్ళి పోయాడు.

సూరీడు బిక్క మొహం వేసుకొని వెంట నడిచాడు.



హెలికాప్టర్ లో కూచున్న తరువాత మెల్లిగా సూరీడు నడిగాడు.

"ఈ ఊరు ఇంకా బాగు పడినట్టు లేదు ఈ ఊరు పేరేమి"

"పేరెందుకులే అన్నా, ఇది మన ఆంధ్ర దేశం లో ఒకానొక ఊరు "

"ఇలా ఒక్క ఊరే ఉంటుంది కదా. దీన్నెలాగైనా మనం మొదట చూసిన ఊరి లాగా మార్చెయ్యాలి. అప్పుడే మనది హరితాంధ్ర అవుతుంది"

"ఇలా ఒక్కటి కాదు. అన్నీ ఇలాంటి ఊర్లే అన్నా."

"అదేంటది మరి మనం మొదట చూసిన ఊర్లో అందరూ హాయిగా సుఖంగా వుండారు కదా. ఆ ఊరి పేరేమి"

"చెప్పక తప్పదంటారా"

"చెప్పు సూరీడు నేను నిన్నేమన్నా అంటానా చెప్పు"

"పులివెందుల"


:::::


Wednesday, February 13, 2008

ఒక్క సారి ఊరు పోయిరా..(గజల్ గానం)










గజల్ శ్రీనివాస్ గారి వెబ్సైటు కోసం ఇక్కడ క్లిక్కండి.




Tuesday, February 12, 2008

ఈ వారం సిద్ధ-బుద్ద (11-ఫిబ్రవరి-2008)



"అయ్యగారూ , నేను కూడా బ్లాగురాస్తా"
"రాయరా ఎవరు కాదన్నారు? అయినా వున్నట్టుండి ఇప్పుడు నీకు ఆ బుద్ది పుట్టిందెందుకు?"

"ఆ ఏమీ లేదు నా పేరు కూడా ఈనాడులో వస్తుందేమో అని "
"నువ్వు రాయడం మొదలు పెడితే రాదు. ఏదో ఒక దానిలో నిష్ణాతుడైతే పేరు వస్తుంది. ఈ లెక్కన అందరి పేర్లు రాయాల్సి వస్తే పేపరు కాస్త ఎల్లో పేజెస్ అయిపోతుంది."

"అంతేనంటారా?"
"అదే కదా చెప్తోంట. ఒరేయ్ సిద్ధిగా! ఇన్నాళ్ళ నుండి బ్లాగులు చూస్తున్నావు ఆ మాత్రం అర్థమయి చావడం లేదా. నీకు ఎలక్షన్ల ముందు తెలంగాణా గుర్తుకు వచ్చిన రాజకీయ నాయకుల స్పీచ్ వినొద్దంటే విన్నావా? ఇలా కంప్యూటర్ ఎరా లోనో, కంప్యూటర్ విజ్ఞానం లోనో, ఈనాడు లోనో వార్త వచ్చినప్పుడల్లా నీకు బ్లాగు దురద పుడుతుంది."

"మరి మీరు కూడ అంతే కాదేటి బ్లాగులకు విరామం ఇచ్చానని మళ్ళీ ఎందుకు రాస్తున్నారు?"
"వెధవా! నేను అప్పుడు చెప్పింది కొన్ని చెయ్యాల్సిన పన్లు వుండడం వల్ల అలా చెప్పా. అవి తొందరగా అవడం వల్ల మళ్ళీ బ్లాగు బాట పట్టా."

"చంద్ర బాబు పల్లె బాట లాగన్నమాట."
"ప్రతి దానికి కంపారిజనే నీకు. ఇంకా బుర్రలో ఏవో తొలుస్తున్నట్టున్నాయి వాటిని బయట బెట్టు"

"ఇప్పుడు వున్నట్టుండి టీ.ఆర్.ఎస్. వాళ్ళు ఎందుకు రాజీనామా అంటున్నారు."
"వాళ్ళ టర్మ్ అయిపోవచ్చిందిగా."

"మరి కాకా ఎందుకు బాకా ఎత్తి ఊదుతున్నారు."
"ప్రతిభా పాటిల్ ప్లేస్ మిస్సయిందని."

"అయ్యగారు, నేను మీకు ఇప్పుడు కొన్ని జెనరల్ క్నాలడ్జ్ ప్రశ్నలు వెయ్యనా?"
"బ్లాగుల దెబ్బ కు నీ బాష కూడ వ్యంగమయిందిరో,నాలెడ్జిని క్నాలడ్జి అంటున్నావ్. కానీ... ఆలస్యమెందుకు"

"కాపాడలేని వాజమ్మలు దద్దమ్మలు అని ఎవరు అన్నారు?"
"రోజా! ఆయేషా హత్య గురించి మాట్లాడుతూ."

"ఓకే మీకో మార్కు ఇస్తున్నా. ప్రతి సంవత్సరం ఉత్తమ శాసన సభ్యుడు అవార్డు ఇస్తే ఎవరికి వస్తుంది?"
"ఎప్పటికీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి కే "

"ఎందుకు?"
"ఏం తిక్క తిక్కగా వుందా బతకాలని లేదా?"

"అర్థమయింది మహాప్రభో!!! "
"మరదే ఎక్కువ మాట్లాడావంటే పులివెందుల పంపిస్తా మొన్నో రిపొర్టర్ గల్లంతయ్యాట్ట."

"అవి మనకెందుకులే కానీ ఇంకో ప్రశ్న. అసలది ఒక టీమే కాదు అంతా పాలిటిక్స్, పెర్సనల్ ఇమేజ్ కోసం ఆడతారు. అసలు వీళ్ళని రెండేళ్ళ పాటు బ్యాన్‌ చెయ్యాలి అన్నది ఎవరు?"
"సగటు భారత దేశపు క్రికెట్ అభిమాని."

"అబ్బో మనోళ్ళు చించేశారు 'ఆసీస్! ఖబడ్దార్' అన్నదెవరు."
"ఇంకెవరు సగటు భారత దేశపు క్రికెట్ అభిమానే."

"మన శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఏకాభిప్రాయంతో వోటేసే దెప్పుడు?"
"వాళ్ళ జీతాలు పెంచాలని ప్రతిపాదన పెట్టినప్పుడు"

"అబ్బో మీకు అయిదుకు అయిదు మార్కులు. మీకు జెనరల్ క్నాలెడ్జి కింగ్ అని బిరుదిస్తున్నా."
"కానీరా నువ్వు నాకు బిరుదులు ఇచ్చే వాడంత అయ్యావన్నమాట."

**

"అయ్యగారూ రిజిస్టర్డు అభిమానులంటే ఎవరు?"
"రక్తం,కళ్ళు దానం చేసే వాళ్ళు"

"మరి అన్‌ రిజిస్టర్డు అభిమానులు ఎవరు?"
"రక్తం కళ్ళ చూసే వాళ్ళు"



Friday, February 08, 2008

ఈ సంవత్సరం పర్ఫామెన్స్ అప్రైసల్స్

కొంతమంది బ్లాగు సోదరులు బ్లాగుల అప్రైసల్స్ చేస్తున్నారు. మా మ్యానేజరేమో నా అప్రైసల్ చేశాడు. ఈ నా అప్రైసల్ మీ ముందు పెట్టిన తరువాత నా టీములో చేరే వాళ్ళందరూ చేతులు పైకెత్తండి.






నా అప్రైసల్ కు ముందు నేను కొందామనుకున్నది ఇది:





నా అప్రైసల్ తరువాత నేను కొన్నది:






దీనికి స్టాండు కూడా లేదని అండర్ స్టాండింగు చేసుకోక పోతే మీ అప్రైసల్ తో కొనేది సైకిలు హ్యాండిలే.




బైదవే ఇది గూఢచారి 116వ టపా.