Monday, August 31, 2009

మరొక్క సారి... అంటే మూడో సారి.. తెలుగు బడి మన బడి గురించి ..

* * * * * * * *


సిలికానాంధ్ర అని పేరు చెబితే అమెరికాలో కొంత మందే గుర్తుపట్టే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ఏ కూచిపూడో, శాస్త్రీయ సంగీతమో, జాన పద కళో చప్పున గుర్తుకు వస్తుంది అమెరికా తెలుగోడి కైనా, తెలుగు దేశం లో తెలుగు మాట్లాడని వాడికైనా. ఆ సంఘం తెలుగు బాషకు చేసే సేవల్లో మన బడి ఒకటి. మన బడిని పిల్లలకు తెలుగు భాష నేర్పటానికి మొదలు పెట్టారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ మన బళ్ళు ఉత్తర అమెరికా దేశం లోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికి 14 రాష్ట్రాల్లో వేళ్ళూనింది. ఈ సంవత్సరం మరిన్ని రాష్ట్రాలు జత కలుస్తున్నాయ్. ఈ మన బడి ప్రయాణం లో మా కొలరాడో మన బడి కూడా విజయవంతంగా మూడో సంవత్సరం లోకి అడుగుపెడుతోంది. మా మన బడి పిల్లలతో పాటు నేను కూడా 'ప్రవేశం', 'ప్రకాశం' తరగతులు దాటుకొని పరీక్షలు రాయకుండా(దిద్దుకుంటూ)'ప్రమోదం' తరగతి లోకి అడుగు పెడుతున్నా నా మూణ్ణెల బడి సెలవులు ముగించుకొని. వాఁ..బ్యాక్ టూ స్కూల్. మళ్ళీ పలకా బలపాలూ..గోడ కుర్చీలూ..

సంవత్సరం తరగతులు వచ్చే సెప్టెంబరు రెండవ వారం లో మొదలవుతున్నాయి. మీ పిల్లలను ఇందులో చేర్పించాలంటే లేదా వారి ఊళ్ళలో ఈ మనబడి ప్రారంభించాలంటే రాజు చమర్తి గారిని(408-685-7258, raju@siliconandhra.org) లేదా శంకర్ తుములూరు గారిని(650-430-5958 sankar@siliconandhra.org) గానీ సంప్రదించండి.

కొన్ని వివరాలు:

1. చేరాలంటే 2009 సెప్టెంబర్ 1 కి ఆరు సంవత్సరాలు నిండి వుండాలి. (మా బుడ్డోడు కుడి చేత్తో నెత్తి మీదుగా ఎడమ చెవిని పట్టుకుంటాడు అది సరిపోద్దా అంటే కుదరదు.)

2. వారానికి రెండు గంటలు తరగతులు వుంటాయి. (మా బుడ్డది తైతక్కలాడ్డానికి వెళ్తుంది దీన్ని ఎగ్గొడితే మళ్ళీ క్లాసులు చెబుతారా అని అడక్కూడదు. ఎగ్గొడితే మార్కులు కోసేస్తారు.)

3. పిల్లలకు పెన్సిల్ దగ్గర నుండి పుస్తకాల వరకు ఈ సంస్థ వారే ఇస్తారు. (బజ్జి బువ్వ కూడా పెడతారా, పరీక్షలు కూడా మీరే రాసిస్తారా అని డవుట్లు వస్తే మీరు నాలుగణాలు ఆదా చేద్దామనుకునే పదహారణాల తెలుగు వారే.)

4. పాఠాలు భోదించే ఉపాధ్యాయులకు భోధనాంశాలు కూడా ఏ వారానికి ఆ వారం సులభంగా చెప్పేటట్లు వుంటాయి.(ఉపాధ్యాయులు కొన్ని తెలుగు పదాలను ఇంగ్లీషులో తర్జుమా చేసి చెప్పటానికి క్లాసుకు 372 వెంట్రుకలు సులభంగా పీక్కుంటారు)

5. ప్రవేశం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అని నాలుగు సంవత్సరాల తరగతులు వుంటాయి.(హమ్మయ్యా అని అనుకోవడం తల్లి దండ్రుల వంతు.)

6. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తీర్ణతా పత్రాలు ఇవ్వబడతాయి.

ఇది ఉచిత విద్య కాదు. కొద్దో గొప్పో ఫీజులు గట్రాలుంటాయ్. పాఠాలు చెప్పే పంతుళ్ళందరూ వాలంటీర్లే.


* * * * * * * *



ఇంతకూ అంత చదివితే ఏమొస్తుందట అంటే.... మొన్న మా బుడ్డోడు తెలుగు లో తన చేతి వ్రాత తో ఓ ఉత్తరం,పంతుళ్ళయిన నానమ్మకు, తాతయ్యకు రాశాడు. వాళ్ళు ఎన్ని సార్లు దాన్ని చదువుకున్నారో ఎంత మందికి చెప్పుకున్నారో కనుక్కుంటే తెలుస్తుంది.

* * * * * * * *

Wednesday, August 19, 2009

ఏ ఫిల్మ్ బై RGV

* * * * * * * *


అనగనగా ........
ఓ చంద్రుడు లేని రాత్రి
అదే కాళ రాత్రి.....
అమావస్య రాత్రి....

చిమ్మ చీకటి రాత్రి
చీమ చిటుక్కు మనే రాత్రి

కటిక చీకటి
చీకటి....
కటి.....

కట్.....

రెండు కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్.అబగా ఆర్తిగా ఆకలిగా..
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తీక్షణంగా చూస్తూ..

ఆ కాళ్ళు వెనక్కి నక్కాయి.
ఏండుటాకుల మీద అడుగుల చప్పుడు.

అలికిడి..
అలజడి..

వెతుకుతున్నది కళ్ళ బడింది.నిగ నిగ లాడుతూ నవ యవ్వనంతో రాజ కుమారి లా తొలి ప్రేమలో కీర్తి రెడ్డిలా గెంతుతోంది.
ఎంతో కాలం నుండి తను వెతుకుతున్నది తన సొంతం కాబోతోంది.

అంతే ఆ రెండు కళ్ళూ పెద్ద రెండు కళ్ళు అయ్యాయి.
పిడికిలి బిగిసింది.

భూన భోంతరాలు దద్దరిల్లిన చప్పుడు
ఆకాశం లో పెళ పెళ ఉరుముల మెరుపుల డప్పుడు

సముద్రం లోనుండి ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు.
దెయ్యం లా మర్రి చెట్టు ఊడ ఊగటాలు.

గుడ్ల గూబలు అరవటాలు
గబ్బిలాలు ఎగరటాలు

ఒక్క సారిగా లంఘించి.
ఒడిసి పట్టుకుని తన కబంధ...

అంతలో....

జూమ్.... మైనస్
కెమెరా క్రమషడ్భుజాకారం లో తిరిగింది.

జూమ్ జూమ్.. మైనస్ మైనస్
ఈ సారి దీర్ఘ చతురస్రాకారం లో తిరిగింది.

జూమ్ జూమ్ జూమ్.. మైనస్ మైనస్ మైనస్
ఈ సారి వృత్తాకారం లో తిరిగింది.

(ప్రేక్షకుల కోసం: తెలుగు మరచిపోయినోళ్ళు ఈ జూమ్‌ జూమ్‌ నే సింహాసనం సినిమా లో 'ఝుం..ఝుం..ఝుం..ఆకాశం లో ఒక తారా..' అనే పాట అనుకుంటారు. ఇది అది కాదు, మైనస్ లు ఉష్ణోగ్రతలు కాదు. కెమెరా జూమ్ చేస్తే దూరం తగ్గే మైనసులు)

ఇక కెమెరా కే కళ్ళు తిరిగి తిరగలేక ఆ "దృశ్యం" మీద ఆగింది.

పెద్ద మెరుపు.
మెరుపుల జన్మలలో అతి పెద్ద మెరుపు.(గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోది)

ఆ మెరుపు తెలుపులో....స్క్రీన్ మీద తెలుగక్షరాలు

ఇదే
అనాదిగా జరుగుతున్న వికృత క్రీడ
మరో సారి మరో చోట

స్క్రీన్ మీద ఎడమ వైపున క్లిక్ క్లిక్...

A   క్లిక్     క్లిక్     F     క్లిక్     I     క్లిక్     L     క్లిక్     M     క్లిక్
మళ్ళీ ఎడమ వైపుకి..ఒక లైనంతా క్లిక్     క్లిక్     క్లిక్.
రెండో లైనంతా క్లిక్     క్లిక్     క్లిక్.
మూడో లైను పై లైనే
చివరి లైను....

పది క్లిక్కుల తరువాత.. B     క్లిక్     Y         క్లిక్     క్లిక్     R     క్లిక్     G     క్లిక్     V     క్లిక్
3 నిముషాలు స్క్రీన్ మీద అదే.

ఇప్పుడు ఫోకస్ ఆ "దృశ్యం" మీద.
అడవి పిల్లి నవ యవ్వనం లో వున్న చుంచెలుకను తన పంజా తో ఒక్క దెబ్బ వేసి ఒడిసి పట్టుకుని లొట్టలేసుకుంటూ ఆరగించడం మొదలు పెట్టింది.

తరువాత ఒకే క్లిక్కు.

మాకు మేమే సమర్పించు
"అడవారణ్యం"
(గొప్ప సస్పెన్స్, యాన్, స్పైన్, థ్రిల్లర్)


(ప్రేక్షకుల కోసం: యాన్ అచ్చు తప్పు కాదు. ఇది యాక్షన్ సినిమా కాదు యానింగ్ సినిమా. ఈ సినిమా చూస్తుంటే అందరూ నోరు వెళ్ళ బెట్టాల్సిందే. ఆవులించేప్పుడు నోరు వెళ్ళబెడతారు కాబట్టి యాన్ అని పెట్టడం జరిగింది. తెలుగు మరియు ప్రపంచ చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి అద్భుత పద ప్రయోగం. తెలివైన వాళ్ళకు స్పైన్ గురించి వివరించక్కర లేదు. ఈ బ్లాగు చదివే వాళ్ళందరి ఐక్యూ 111 వుంటుంది. నా ఐక్యూ 7. అంతా ఏడు కొండల వాడి దయ.)

ఆ అడవి లోని గుబురు పొదల మధ్యలోని ఇసుక మేటల లోపలినుండి పొడవాటి గడ్డం తో చెతిలో వంకర టింకర కర్ర పట్టుకుని ఒక దృఢకాయుడు బయటికొచ్చాడు. ఆకాశం వంక ఓ సారి చూసి రోడ్డు మీద కొచ్చాడు. ఒంటి మీద ఒక్క ఇసుక రేణువు లేదు. మేటలు వేసిన గడ్డం లో కూడా.

నడుస్తున్న అతని పక్కన ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది నిశ్శబ్దంగా. అంత వరకు కునికి పాట్లు పడుతున్న ఎస్సై అందులో నుండి కిందకు దిగి గడ్డం అతన్ని ప్రశ్నించాడు.

"ఎవడ్రా నువ్వు ఈ రాత్రి ఇక్కడెందుకున్నావ్?"
"......" సమాధానము చెప్ప లేదు.

"రేయ్ నిన్నే రా అడిగేది.నీ పేరేంటి? ఊరేంటి? చెప్పు. "
"కడప"

"సార్. మీది కడపా. క్షమించండి సార్ ఎవరో అనుకున్నా. ప్రమోషన్ కోసం చూస్తున్నా నా పొట్ట కొట్టకండి సార్" అని చేతులు జోడించాడు.
దృఢకాయుడు సీరియెస్ గా ఫేసు పెట్టి "మాది కడప కాదు. నా పేరు కడప"

"ఓస్ పేరా? అనవసరంగా భయపడ్డానే. అలా అయితే ఇంత అర్ధ రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావ్. తిరపతోళ్ళు తిరపతని పేరుపెట్టు కోవడం చూశాను గానీ కడప అని పేరు వినలేదే. కడప పేరేంది?"
"నా పేరు కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీన్. ఇంటి పేరు కమాలుద్దీన్. అసలు పేరు డమాలుద్దీన్. నకిలీ పేరు పకాలుద్దీన్. అందరూ నన్ను కడప అని పిలుస్తారు"

"ఇక్కడేం చేస్తున్నావ్?"
"అదిగో అక్కడ ఆకాశం లో చూశావా? అష్ట గ్రహ కూటమి. ఏం జరుగుతుందో తెలుసా?"

"పెద్ద చెప్పొచ్చావ్ లే. ఇక్కడ ఆల్రెడీ మహా కూటమి ఫెయిలయింది. అక్కడ అష్ట గ్రహ కూటమి ఏం చేస్తుంది?"
"ఎందుకు చెయ్యదురా మూర్ఖా? ఆ అష్ట గ్రహ కూటమి అలా ఫామ్‌ అవడం వల్లే ఈ రిసెషనూ, స్వైన్ ఫ్లూ వచ్చింది."

"ఇంకా నయం కాంగ్రేస్ పార్టీ వచ్చింది అన్లేదు. రేయ్! నీకు ఎగస్ట్రాలెక్కువయ్యాయి బండెక్కు."
"నేను బండెక్కనురా! నిన్నే కొండెక్కిస్తా" అని తన చేతిలోని కర్ర లో వుండే కత్తి తీసి ఎస్సై ని రెండు క్షణాల్లో కసా పిసా పొడిచేశాడు.కత్తికంటిన రక్తాని ఎస్సై బట్టలకు తుడిచేసి రొడ్డు మీద నడవసాగాడు "మేరా జూతా హై జపానీ..ఏ పత్లూ ఇంగ్లీస్థానీ..." ఆని పాట పాడుకుంటూ.

తరువాత రాజ్ కపూర్ పాటలు పదకొండు, షమ్మీ కపూర్ పాటలు మూడు, శివాజీ గణేషన్ డబ్బింగ్ పాటలు రెండు, ఎన్టీయార్ పాటలు ఎనిమిది, వై.ఎస్. పాటలు ముప్పై తొమ్మిది పాడుకుంటూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కొచ్చి అక్కడ పోలీస్ గుర్రాన్ని చూశాడు. ఆ పోలీస్ గుర్రం ఆటో లో కూచుని టిఫిన్ బాక్సు లో ఉప్మా తింటున్న తాకమతి ఉప్మా చేతిని నాకుతోంది. అది తెలీని కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీన్ గుర్రం రోడ్డుకు అడ్డుగా వుందని "హట్..హట్.." అన్నాడు. గుర్రానికి కోపం వచ్చింది.

తాకమతి చేతి ఉప్మా
గుర్రం మూతి మీద ఉప్మా

ఉప్మా చెత్తో తాకమతి
ఉప్మాతో గుర్రం మూతి

గుర్రం తోక మీద ఏమిటి చెప్మా
తోకలో ఉప్మా.. కాదు కాదు కోపం. ఆ కోపం ఆ తోక లో లేకపోయుంటే ఈ టపా రాసే అవసరం వుండేది కాదు.

తాకమతి ఉప్మా చేతిలోని కరంటు గుర్రం తోక ద్వారా కడప చెంపని తాకింది అమెరికా నుండి స్వైన్ ఫ్లూ అలిమేలు మంగాపురానికి వచ్చినట్టు.

సరిగ్గా అదే సమయానికి పానీ పూరీలు అమ్ముకునే వాళ్ళ మధ్య పానీ పూరీ పోటీలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కువ ఎత్తు పానీ పూరీలు పేర్చి, దాన్ని వాళ్ళ తోపుడి బండితో ఎగిరి దూక గలిగితే వాళ్ళే గెలిచినట్లు.

వెండి తెర నల్లగా అయిపోయింది.

(తెర మీద తెలుగక్షరాలు తెలుపు రంగు తెలుగులో. తెలుగక్షరాలు తెలుగులో మరో అద్భుతమైన ప్రయోగం)

కడప ఎస్సైని ఎందుకు చంపాడు. దాని వెనుక వున్న కారణాలేంటి? ఎందుకంత పగ? కడప అసలు పేరు కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీనేనా? అతనికి పునర్జన్మ ఙ్ఞాపకాలేమైనా గుర్తుకు వస్తున్నాయా? తాకమతి నుండి కరంట్ కట్ వున్న సమయం లో కరంట్ ఎలా వచ్చింది? అతను అష్ట వంకర్ దృవ వంశ యోధుడా? అందుకే అతని కర్ర వంకరగా వుందా? తెలుసుకోవాలంటే "అడవారణ్యం - 2" చూడండి.


పాఠకుల కోసం:

ఇది నేను త్వరలో తీయ బోయే సస్పెన్స్, యాన్, స్పైన్, థ్రిల్లర్, క్షుద్దర్, భూతాల్ , ప్రేతాల్, పిశాచాల్, పునర్జన్మల్ టి.వి. సీరియల్ కి సినిమా శాంపిల్. టైటిల్ కి, కంటెంట్ కి సంబంధం లేకుండా అంతా సస్పెన్స్...

RGV అనగా R రాయల్ G గాబ్రియేల్ V విహారి

* * * * * * * *

Monday, August 17, 2009

ఈ వారం సిధ్ద -- బుద్ధ(మగాడు, మగ ధీరుడు)

"అయ్య గారూ...అయ్య గారొ...."
"...."

"అయ్య గారూ...ఎక్కడున్నారు?"
"ఏవిట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు. పొద్దున్నుంచీ కనిపించ లేదు ఎక్కడ చచ్చావ్."

"ష్. గట్టిగా అరవకండి."
"ఏవిటి మగ ధీర సినిమా టికెట్లు గానీ దొరికాయా?.. నెత్తిన ఆ మూటలేంటి?"

"ముందు మీరా తలుపులేసేసి బీరువా దగ్గరకు రండి."
"బీరువా దగ్గరకా? ఏవన్నా లంకె బిందెలు దొరికాయా?"

"లంకె బిందెలు ఎవడిక్కావాలి..ఇవి వాటి కన్నా విలువైనవి. మీరు బీరువా లో వున్న డబ్బు బయటెక్కడన్నా పెట్టి ఈ మూటలు లోపల పెట్టండి."
"ముందా మూటలో ఏముందో చెప్పు. అప్పుడు బీరువా తెరుస్తా."

"అయ్యో .మీకు ఇలా చెబితే అర్థం కాదు. ఎవరన్నా వింటారు కాస్త దగ్గరకు వచ్చి ఆ చెవి ఇలా పడేయండి."
"వార్నీ.. అవా?..ఆ మాట కొంచెం ముందుగా చెప్పొద్దూ..వుండు కిటికీలు కూడా మూసేసి వస్తా. ఇదిగో ఆ బంగారూ,డబ్బూ చావిట్లో పెట్టేసిరా.ఇవి మాత్రం జాగ్రత్త.రేపటి నుండి నువ్వు ఇక్కడే కాపలా పడుకోవాలి. తెలిసిందా?"

"అలాగేనండీ. ష్ ...అమ్మా..అబ్బా.. ఎక్కడెక్కడో వెతికి అంత దూరం నుండి తీసుకుని వచ్చేసరికి భుజాలు పడిపోయాయి. కాస్త మంచి నీళ్ళు ఇస్తారా?"
"మంచి నీళ్ళేం ఖరమ. ఈ రోజంతా నీకు నచ్చిన జ్యూసులు తాగు. ఇప్పుడే తీసుకు వస్తా."

"అవునొరేయ్. ఇవి ఎన్నాళ్ళొస్తాయంటావ్? ..ఇదిగో సపోటా జ్యూస్ తాగు."
"ఇంకో ఆరు నెలలు ఫరవాలేదు మీరు గారెలు, వడలు, మిరప కాయ బజ్జీలు అనకపోతే."

"మిరప కాయ బజ్జీలు తినే భాగ్యం కూడానా? ఆ రోజులే వేరు. అప్పట్లో మిరపకాయ బజ్జీలు ఆపకుండా పది లాగించేసే వాడిని."
"అప్పట్లో వీడియోలు తీసుంటే ఇప్పుడు వాటిని చూసైనా సంతోషించే వాళ్ళు.. ఇప్పుడు ఇలా ధరలు పెరిగిపోవడానికి కారణమెవరు?"

"దేవుడు."
"దేవుడా? ప్రభుత్వం కాదా?"

"మరి పంటలు ఇలా ఎండి పోవడానికి కారణం?"
"దేవుడు."

"అంటే మీరనేది.దేవుడు వై.ఎస్సా?"
"కాదు. అసలు దేవుడే? "

"కాంగ్రేసోళ్ళు.... దేవుడు వాళ్ళ పార్టీలో చేరాడన్నారు కదా? "
"అది తప్పు. కాంగ్రేసే దేవుడి పార్టీలో చేరిపోయింది. అందుకే గెలిచింది.ఇప్పుడు చూడు ఇన్నాళ్ళకు ఊరించి ఊరించి వర్షం పడింది."

"వుండండి మీకు కంది పప్పు పరమాణ్ణం చేసి పెడతా. కంది పప్పు తినక ఇలా అయిపోయారు."

****

"మీరు ఈ మధ్య సాక్షి పత్రిక చూసారా?"
"చూళ్ళేదే! ఏం పేజీలు గానీ తగ్గాయా?"

"రాబడి తగ్గితే గదా పేజీలు తగ్గేది. మొన్న పులివెందుల మీద రివర్స్ గోల్ వేసుకున్నారు.వై ఎస్ మావోడే, జగన్ మా వోడే అని అన్ని చోట్లా రేట్లు పెంచేసుకుంటున్నారట."
"రాజా వారు, యువ రాజా వారు ఏదో పెద్ద ప్లాన్ లో వుండి వుంటారు. అయినా అమెరికన్ సిస్టం లాగా డబ్బున్న పులి వెందుల రాజులందరూ మనీ సర్క్యులేషన్ చేసుకుంటుంటే జనాలకు బాధేందుకో. "

"అది సామాన్య ప్రజానీకానికానికి ఇబ్బంది కాదా? ప్రభుత్యం ధరలు నియంత్రించాలి కదా."
"ప్రభుత్వం నియంత్రించాల్సినవి నియంత్రిస్తుంది."

"ఏంటి డబ్బులు పోనాయి మేమేటి సేత్తాం అన్న మంత్రి గారు తన జిల్లా లో మగధీర సినిమాను నిలిపేసినట్టా?"
"మరి! ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అంటారా? అయిదేళ్ళు అనుభవమయిన తరువాత ఇంకా అలా మాట్లాడ్డానికి ఎంత ధైర్యం.అది సాంపిల్ మాత్రమే.ఎక్కువ మాట్లాడితే స్టేటంతా నిలిపేస్తారు."

"అంత లేదు లెండి. పవన్‌ కళ్యాణ్ తో సినిమా తీయడానికి అలా డ్రామా లాడారు. "
"అందులో విలన్‌ రోల్ ఎవరు చేస్తున్నారు."

"నాకేటి తెలుస్తాది.. సినేమా వచ్చినప్పుడు గానీ తెల్వదు."

****

"అయ్యగారు, చారిత్రాత్మక తప్పిదం అంటే ఏంటి?"
"చిరంజీవి రాజకీయల్లోకి రాకపోయుంటే చారిత్రాత్మక తప్పిదం. దేవేందర్ గౌడ్ తెలుగు దేశాన్ని వదిలి రావడం చారిత్రాత్మక తప్పిదం. కమ్యూనిస్టులు ప్రధాని పదవిని వద్దనటం చారిత్రాత్మక తప్పిదం.ఎల్టీటిఈ రాజీవ్ ను చంపడం చారిత్రాత్మక తప్పిదం."

"చాలు ఇంకొద్దు.అయితే పవన్ కళ్యాణ్ చాలా తెలివైనోడు. "
"అదెలా?"

"ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సొస్తుందని తెలుసేమో. ప్రజా రాజ్యానికి 160 రాకపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్తా నన్నాడు ఎలక్షన్లప్పుడే."
"నాగ బాబు ఇంకా తెలివైనోడు. స్టేట్మెంట్ లేకుండానే గుడ్ బై చెప్పాడు."

"తెలివైన మగాళ్ళు అలానే చేస్తారు."
"తెలివైనోళ్ళు అనొచ్చు గదా అలా మగాళ్ళు అని లింకు పెట్టడం దేనికి."

"ఏవిటో ఒక్క మగాడు సినిమా చూసి ఆ మాట మర్చిపోయినా మన నాయకుల మాటలు చూసి అది తప్పకుండా వాడాల్సిన పదమేమో అని వాడుతున్నా."
"అంత మగ మాటలు మాట్లాడు తున్నదెవరు?"

"ఇంకెవరు రోశయ్య గారు, నన్నపనేని గారు. రోశయ్య గారు 'ముద్దు' ని మగాడివా అన్నారు. నన్నపనేని గారేమో దగ్గుపాటి గారినన్నారు."
"నువ్వు పెద్ద మగాడివి రా."

"నామీదేవో బాణాలు వేస్తున్నట్టున్నారు. "
"నీ మీద బాణాలెయడానికి నేనేమన్నా వైఎస్సా, నువ్వేమన్నా చంద్ర బాబా?రాఖీ పౌర్ణమి రోజున వై.ఎస్. కు రాఖీ కట్టిన వాళ్ళెవరో తెలుసా?"

"ఇంకెవరు చేవెళ్ళ చెల్లెమ్మ సబితమ్మే కదా?"
"ఒక్కరేనా?"

"ఇంకా కొండా సురేఖ, గీతా రెడ్డి కట్టినట్లు వున్నారు."
"వచ్చే రాఖీ పౌర్ణమి కి ఈ లిస్టులో చేరే కొత్త చెల్లెమ్మెవరో చెప్పుకో చూద్దాం? తెలిసీ చెప్పక పోతే నిన్ను అమెరికన్‌ ఏయిర్ లైన్స్ లో అమెరికా పంపిస్తా."

"అంత పని చెయ్యకండి. ఆ టార్చర్ భరించలేను. రాబోయే కాలం లో కాబోయే కొత్త చెల్లెమ్మ మెదక్ మెరుపులమ్మ రాములమ్మ."
"కరక్టుగా చెప్పావు. నువ్వు తెలివైన మగాడివిరా "

"అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్నేస్తా దానికి సమాధానం చెప్పండి చాలు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల సమయానికి ఎంత మంది ప్రజా రాజ్యం పార్టీ లో మిగులుతారు. "
"..."

"సమాధానం చెప్పమంటే అలా బెంచీ మీద లేచి నిలబడి చేతులు పైకెత్తారేంటి. "
"సింబాలిక్ రా మట్టి వెధవా.వెళ్ళి పది అరవ సినిమాలు చూసిరా."

"మీరు గొప్ప మగాడు. అయితే ఆపరేషన్‌ ఆకర్ష్ అంత స్ట్రాంగంటారు. "
"పాపం ప్ర.రా.పా. కి ఎలక్షన్ల ముందున్న ఆకర్ష్ ఇప్పుడు వికర్ష్ అయిపోయింది."

***

"అయ్య గారూ మగధీర చూశారా?"
"అంతగా హైపిన తరువాతా చూడక చస్తామా?"

"అరుంధతి చూశారా?"
"చూసి తరించాం"

"ఈ సినిమాలు చూస్తుంటే మీకు ఎవరు గుర్తొచ్చారు?"
"అరుంధతి చూస్తుంటే శ్యాం ప్రసాద్ రెడ్డి, కోడి రామ కృష్ణ గుర్తొచ్చారు. మగ ధీర చూస్తుంటే రాజ మౌళి గుర్తొచ్చాడు.

"ఈ రెండిట్లో వున్న తేడా ఏంటి?"
"తేడాలేమీ లేవు రెండూ ఒకటే?"

"అదెలా?"
"అరుంధతి లో పిల్ల హీరోయిన్ కోనేట్లో మునిగి లేచిన తరువాత యాక్షన్ మరిచిపోతుంది. ఇందులో హీరో లోయలో పడి పోయిన తరువాత యాక్షన్ మరిచిపోతాడు."

"???"
"నేను కూడా ఆరు ??? ???"

--