Wednesday, January 13, 2016

దేవలోకం లో 'ఐరావత్' స్టేడియం కిట కిటలాడిపోతోంది. "సంక్రాంతి ఇంటర్ లోక కప్" కోడి పందాల టోర్నమెంట్ ప్రారంభమవబోతోంది.పాతాళ పుష్పక్ , సర్ప పష్పక్ ప్రత్యేక సర్వీసులు నడపడం వల్ల వేల మంది టోర్నమెంట్ చూడ్డానికి విచ్చేశారు.
స్పాన్సర్ ప్రకటనలు మొదలయ్యాయి. 'రామ్ రాజ్' బనీయన్లు,పంచలు అడ్వర్టైజ్మెంట్ లో పంచలు మాత్రమే చూపించారు బనీన్లు ఎవ్వరూ వాడరని. తరువాత 'జాయ్ అలూకాస్' వారి కిరీటాల అడ్వర్టైజ్మెంట్ కి అనూహ్య స్పందన వచ్చింది. ఆయా లోకాల రాజులు కిరీటాల డిజైన్స్ ఫోటొ తీసుకున్నారు. చివరిగా 'డాబర్ ఆమ్లా' హెయిర్ అయిల్ అడ్వర్టైజ్మెంట్ రాగానే ముందు వరసలో కూర్చుని వున్న ద్రోణుడు, పరశు రాముడు, బల రాముడు,భీష్ముడు తదితర గడ్డం పురుషులు డాబర్ నంబరు వాళ్ళ ఇంద్రవాణిలో ఫీడ్ చేసుకున్నారు. ధృతరాష్ట్రునికి ఇంద్రవాణిలో ఫీడ్ చెయ్యడానికి విదురుడు సాయం చేశాడు.
**********
**********
దేవేంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, నాగేంద్రుడు అందరు జీడి పప్పు, చైనా పప్పు, అమృత పప్పు తిని బాగా బలిసిన కోడి పుంజులతో బరిలోకి దిగుతున్నారు. ప్రవేశ రుసుము కట్టిన వాళ్ళకు భీమవరం కుక్కుటేశ్వర రాయలు రచించిన "కోడి గర్జన - పీక లేవ్ నా ఈక" అనే కుక్కుట శాస్త్ర పుస్తకం సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించి ఉచితంగా ఇచ్చారు. అందరూ శాస్త్రాన్ని బాగా అవపోశన పెట్టి మరీ బరి లోకి పుంజులను దించుతున్నారు.
**********
**********
ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేలితో తిప్పి నిప్పు రాజేసి జ్యోతి వెలిగించి టోర్నమెంట్ స్టార్ట్ చేశాడు.
మొదట ఊర్వశి, మేనక డ్యాన్సులు తరువాత నాగ లోక జబర్దస్త్ ప్రోగ్రాం జరిగాయి.అందరూ చప్పట్లతో సెల్ఫీ లతో వాట్సాప్ ఫేస్‌బుక్ లు అప్డేట్ చేసేశారు. కోడి పందాలు భీకరంగా మొదలయ్యాయి. బ్రహ్మ కోడి పుంజుని చూడగానే అందరి ఆశలు ఆవిరైపోయాయి. కోడి పీకలు , ఈకలు తెగి పడుతున్నాయి. కోడి ఈకలు దేవ లోకం నుండి ఆదిలా బాద్ లో పడ్డాయి.వాటిని ఏరుకుని టోపీలో పెట్టుకుని కోడి పందాల అంపైర్లు భూమి మీద పందాలకు ముహూర్తమొచ్చిందని సిగ్నల్ ఇచ్చేశారు.సిగ్నల్స్ కోసం పైకి చూస్తున్న గోదావరి అంపైర్లకు ఆదిలాబాద్ అంపైర్లనుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది..మాకు సిగ్నల్స్ వచ్చాయి మీరు పందాలు ప్రారంభించచ్చు అని. గోదావరి అంపైర్లు మొహాలు చూసుకుని ఈకల సిగ్నల్ తమకు రాలేదని తెలిస్తే పరువు పోతుందని పోయిన సంవత్సరం పడిన ఈకల్ని ఎవరికీ తెలియకుండా పాంటు జేబులో నుండి తీసి టోపీ మీద పెట్టుకుని మైకు దగ్గర కెళ్ళి విజిల్స్ వేసి పందాలు ప్రారంభించేశారు.
అది చూసి కాళోజీ దగ్గర కెళ్ళారు అన్న గారు. "ఏంటి బ్రదర్ ఎప్పుడూ కోడి పందేల లవర్స్ వుండే గోదావరి లో కాకుండా ఆదిలాబాద్ లో ఈకలు పడ్డాయెందుకు" అని అడిగాడు.
"మీ శిష్యుడు, కె.సి.ఆర్. ఈ సారి ఆయత చండీ యాగం చేశాడు. ఈ సారి గ్రహాలు మారాయిలే" అని కాళోజీ అన్నాడు.
"ఏదయితే నేం బ్రదర్ మన తెలుగువాళ్ళలో ఎవరైనా ఒకటే నాకు. క్లారిఫికేషన్ కోసం అడిగా. మొన్నొచ్చిన రంగనాథ్ ది బలవన్మరణం అవడం వల్ల స్వర్గానికి రానీకుండా పెండింగ్ లో పెట్టారు. కాస్త పైరవీ చేసి ఇక్కడి తీసుకురావడంతో లేటయింది. న్యూస్ కొంచెం ఫాలో అవలేదు. సర్లే పందాలు చూద్దాం" అన్నాడు.
**********
**********
దేవ లోక కోడి పందాల్లో అన్ని కోడి పుంజుల్ని బాదం పప్పుల్ని నమిలినట్టు నమిలేస్తోంది బ్రహ్మ గారి కోడి పుంజు. అది చూసిన మిగిలిన అందరు కప్పు మీద ఆశలు వదిలేసుకున్నారు. ఇది చాలా అన్యాయమని జడ్జి నారదుని దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకున్నారు.
ఆయన చిడతల్ని రెండు దెబ్బలేసుకొని "చూడండి పార్టిసిపెంట్స్ మీరు ఇలా మాట్లాడతారనే గేమ్ బుక్కు దేవ, గంధర్వ, సంస్కృత, ఇంగ్లీషు భాషల్లో ముద్రించి ఇచ్చారు. ఇదిగో ఇక్కడ నూట పద కొండో పేజీ రెండో పేరాగ్రాఫ్ చదవండి. ఇందులో స్పష్టంగా వుంది కోడి ఓనర్ ను బట్టి కోడి తెచ్చుకోవచ్చు. కావాలంటే కొత్త కోడి పుంజు ను ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు.ఎవరైనా ఎప్పుడైనా టోర్నమెంట్ లో చేరవచ్చు".
**********
**********
"అమ్మ బ్రహ్మా! మీరు తల రాతల్తో పాటు కోడి రాతలు కూడా ఇలా రాస్తారా? మీ పని పడతాం" అని ఇంద్రుడు ఓడిపోతున్న కోళ్ళయజమానులు, డింకీలు, కోచ్ లతో 'నల అమృత్ అండ్ ఫలహార్' రెస్టారెంట్ లో ఆ సాయంత్రం ఓ సమావేశం ఏర్పాటు చేశాడు.
బ్రహ్మ కోడి పుంజును తట్టుకొని నిలబడే పుంజు ఎవరి దగ్గరుంటుందో అందరూ సలహాలిస్తున్నారు. అమృతం సీసాలు ఖాళీ అవుతున్నాయి కానీ ఎవరూ ఒక నిర్ణయానికి రాలేక తలలు పట్టుకుని కూర్చున్నారు..
అప్పుడు నారదుడు ఎంటరయ్యాడు."నారాయణ!..నారాయణ!..అందరూ దేన్లోనో తల మునకలైనట్టున్నారు..నా సహకారమేమన్నా కావాలా?" అన్నాడు .
"ఎందుకులే నారదా. నీ కారాలు...సహకారాలు.. దాని తరవాత జరిగే వికార ..కార్యాలు .. మాకెరుకే.మీరు దయ చేయండి" అన్నాడు విష్ణువు
"అలా అంటారేవిటి స్వామీ! ఇన్ని తలలు పనిచేయనిచో ఎన్నో తలలున్న చోట పనిచేయ వచ్చును కదా" అని చిడతలు పది సార్లు కొట్టి వెళ్ళిపోయాడు.
శివుని మెళ్ళో పాము ఫోటొజెనిక్ పడగ ఎత్తి చెవిలో బుస్ బుస్ మని పది సార్లు అంది. వెంఠనే శివుడన్నాడు "మనం ఇప్పుడు రావణాసురుడి దగ్గర కెళ్ళాలి"
"అవును బ్రహ్మ కోడి ని దెబ్బ కొట్టగలిగేది రావణాసురిడి కోడి ఒక్కటే. అందరం రావణుడి దగ్గరకు వెళ్దాం పదండి. మన మహేశ్వరుడు అడిగితే ఏదీ కాదనడు." అని అమృతరిటా చివరి సిప్ లో నిమ్మకాయ పిండుకొని తాగి గ్లాస్ పక్కన పెట్టేశాడు నాగేంద్రుడు.
"మీరెళ్ళండి నేను బిల్లు కట్టి వస్తా" అని ఇంద్రుడు అక్కడే ఆగి పోయి గ్లాసుల్లో మిగిలిపోయిన అమృడ్కా ని వజ్రాయుధం పిడి బిరడా లా తిప్పి రహస్య సొరుగులో పోసుకున్నాడు దార్లో దాగొచ్చని.
**********
**********
అందరూ వారి వాహనాలెక్కి బయలుదేరారు.వాహనాలు లేని వారు షేర్ పుష్పక్ లో రావణుడి నివాసానికి చేరుకున్నారు.
ఇంద్రుడు,విష్ణువు రావణాసురుడి అంతఃపురం గేటు తీసి లోపలికెళ్ళి కాలింగ్ బెల్లు కొట్టారు. డోర్ తీసిన మండోదరి దేవి ఒక్క సారి అవాక్కయి "ఇక్కడే వుండండి విష్ణు ప్రభూ! హారతి పట్టుకొస్తా" అని లోపలికెళ్ళి దేవకార్ట్ లో కొన్న వెండి పళ్ళెం లో అసురజాన్ లో కొన్న కర్పూరం వెలిగించి డోర్ దగ్గరకు వచ్చింది.
ఇదంతా పైన వరండాలో నిలుచుని నరకం నుండి పారిపోయి వచ్చిన కాలకేయుడి తో రహస్య మంతనాలు చేస్తున్న రావణుడు చూశాడు. కోపం తో ఊగిపోతూ అక్కడున్న ఓ నల్ల మేఘాన్ని పట్టుకుని జర్రున కిందకి వచ్చి గద పైకెత్తాడు.
"నిమ్‌డా... గొజ్రస్ థెల్మీ..ఆర్ధ భొస్.. క్రాక్వికన భుంలీ...సారీ... దేవీ! స్వర్గానికొచ్చినా వీరి బుద్ది పోనిచ్చుకోలేదు. మనం అసురలమని వీరి రాజ ప్రాసాదాలకు దూరంగా ఈ అంటరాని నల్ల మేఘాల మధ్య అంతఃపురాన్నిచ్చి ఊరికి దూరంగా వుంచారు. పూజలకు వీరు అనర్హులు. వీళ్ళని ఇక్కడే హతమారుస్తాను." అన్నాడు.
ఆ సీన్ చూసిన కుబేరుడు తన నరవాహనాన్నెక్కి "ఇది మనకు గిట్టు బాటయ్యే వ్యవహారం కాదు గానీ ప్రశాంతంగా బెట్టింగ్ చేసుకుందాం పదా" అని టోర్నమెంట్ జరిగే ప్లేస్ కు వెళ్ళి పోయాడు.
**********
**********
నాగేంద్రుడు గొణుగుతున్నాడు..' ఈ శివుడెక్కడికి పోయాడు సరైన టైం లో వుండడు... వుండే టైం లో వాట్సాప్ లో మెసేజ్ లిచ్చినట్టు వరాలిచ్చుకుంటూ పోతాడు '. అంతలో శివుడు వచ్చాడు.
"నాగ లోక రాజా! అలా చూడకయ్యా. రావణుడి గేట్ చూసి మా నంది హై జంప్ చెయ్యాలని ముచ్చట పడితే కాస్త వెనక్కి వెళ్ళాం జంపింగ్ పొజిషన్ కోసం. అంతలో ఈ తొందర ఇందురుడు గేట్ తీసేశాడు.ఇంద్రా! నీ కెన్ని సార్లు చెప్పా దార్లో ఆ అమృడ్కా తాగొద్దని. అలా అహల్య దగ్గర కెళితే ఏమి జరిగిందో తెలుసు కదా. ఇంకా బుద్ది రాలా?."
"తొందరగా రావయ్యా శివయ్యా!. లేకపోతే ఇంకో అవతారం ఎత్తే అవసరం వచ్చేటట్లుంది" అన్నాడు విష్ణువు.
శివుడు ముందుకు వచ్చి "భక్తా! శాంతించు. నేను నీ కోసమే వచ్చా" అన్నాడు .
"జటాటవి గలజ్జల..ప్రవాహ పావితస్థలే..గలేవలంబ్య లంభితాం.." రావణుడు గద కిందపెట్టి శివ స్తోత్రం అందుకున్నాడు.
"రావణా! ఇప్పుడు సమయం లేదు. కప్పు కొట్టిన తరువాత మళ్ళీ ప్రోగ్రాం పెట్టుకుందాం. నీ కోపానికి కారణం అర్థమయింది. దేవ లోక చట్టాలను సవరించి రాక్షస జాతి వారికి కూడా దేవతల వలే సమాన హక్కులు వచ్చేటట్లు చేస్తాం. అందుకు ఈ ఇంద్రుడు పూచీ. అంతవరకు ఇదిగో ఈ ఇంద్రుడి వజ్రాయుధం నీ దగ్గరే పెట్టుకో. ప్రస్తుతానికి నీ కోడి పుంజు కావాలి"
"మహేశ్వరా మీరడిగితే ప్రాణాన్నిస్తా. మా కోడి ఒక లెక్కా..తీసుకెళ్ళండి... కానీ నాకీ వజ్రాయుధమొద్దు. నా బ్రాండ్ దానవ్‌డ్కా. అది మా దానవ లోకం నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. " అని తన కోడి పుంజుని వెడల్పాటి పంజరం లో పెట్టి ఇచ్చేశాడు.
రావణుడిని, రావణుడి కోడిని తీసుకొని సమరోత్సాహం తో అందరూ తిరిగి వచ్చేశారు. విషయం అర్థమయిన కుబేరుడికి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామనిపించింది. రావణాసురుడిని లొంగతీసుకోడానికి విభీషణుడితో ప్రయత్నం చేశాడు. సఫలం కాలేదు.హన్సీ క్రోనే తో ఇంద్రవాణిలో మాట్లాడాడు. తనకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని తాను రాలేనని చెప్పాడు.
**********
**********
చివరి రోజు ప్లేఆఫ్స్ అండ్ ఫైనల్స్. రంభ డ్యాన్సు ప్రోగ్రాం మొదలయింది. రంభని చూసి తను కూడా డ్యాన్సు చేద్దామని అన్న గారు స్టేజ్ ఎక్కుదామని వెళ్తుంటే వై.ఎస్.ఆర్. లాగేశాడు."ఇంగ జాల్లే అబ్బీ.యమ గోల భూమ్మీదున్నపుడే నూరు తూర్లు జూసినా ఇంగ నా వల్ల కాదు" అన్నాడు. అది చూసి ఎస్.వి.రంగారావొచ్చి "భేష్ భేష్ సొదరా! మీరు యమ గోల మాత్రమే వీక్షించినట్టున్నారు.మేము ఈయన నటించిన దేవాంతకుడు సినిమా కూడా దర్శించినాము. ఆ జఘన కొట్టుడు, ఆ పాద పచ్చడి ఈ కళ్ళతో చూళ్ళేక కళ్ళకు కటకములు వచ్చినవి. మీ సాహసానికి మెచ్చితిమి. వీలున్నప్పుడు మా ఇంటికి రండి మీకు ఓ పది వీర తాళ్ళు వేసెదము" అన్నాడు.
పాతాళ లోకం వాళ్ళు 'ఆల్చిప్ప- అప్పచ్చి' అనే భరత భాంగ్ర పూడిస్సి అనే ఫ్యూషన్ డ్యాన్సు చేశారు. దీనికి హై టి.ఆర్.పి. రేటింగ్స్ వచ్చాయి.
ప్లే ఆఫ్స్ అయిన తరువాత బ్రహ్మ కోడి పుంజు, రావణుడి కోడి పుంజు ఫైనల్స్ కు చేరుకున్నాయి.బెట్టింగ్స్ ఊపందుకున్నాయి.
**********
**********
అంత వరకు ఒక ముక్కు కోళ్ళతో ఇరగదీసిన నాలుగు తలలు , నాలుగు ముక్కుల బ్రహ్మ కోడి అడ్వాంటేజ్ పది తలలు, పది ముక్కులున్న రావణ కోడి ముందు పనికి రాకుండా పోయింది. బ్రహ్మ కోడి ఒక సారి కత్తి కాలు పైకెత్తగానే రావణ కోడి రౌండప్ చేసి తన పది ముక్కులతో పొడిచి పొడిచి పారిపోయేటట్లు చేసింది. బ్రహ్మ మొహం చిన్నబోయింది.ఐరావత్ స్టేడియం మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. రావణుడు దానవ లోకం నుండి స్మగుల్ చేసి తెచ్చిన 'నరకాషైన్' బాటిల్ ఓపెన్ చేసి స్టేడియమంతా తాండవం చేశాడు.
రావణ కోడిని "సంక్రాంతి ఇంటర్ లోక కప్" చాంపియన్ గా డిక్లేర్ చేశారు.పబ్లిక్ చాయిస్ గా నారదుణ్ణి "ఐడియా బ్రహ్మ" గా అనౌన్స్ చేశారు.
.
.
.
.
బ్రహ్మ నారదుని జన్మ ఫైల్ ఓపెన్ చేశాడు ఐ-తాళపత్ర archives నుండి.
**********
**********

Wednesday, August 19, 2015

స్పెషల్ స్టేటస్

లక్ష్మి దేవి: ఎప్పుడూ ఆ ఫేస్ బుక్ చూస్తారు గానీ మీకు సీమాంధ్రా అప్డేట్స్ కనిపించవా?
మహా విష్ణువు: కనిపించకేం అన్నీ చూస్తూనే వున్నాం గా మేము.

లక్ష్మి దేవి: స్పెషల్ స్టేటస్ కోసం సీమాంధ్రులు నెత్తి నోరు బాదుకుంటున్నారు కదా. వాళ్ళకు మోడి చేత ఇప్పించవచ్చును కదా
మహా విష్ణువు: నువ్వు బాహుబలి సినిమా చూశావా?

లక్ష్మి దేవి: ఈ మోకాలికి బోడి గుండుకు లంకేమిటి? నేను చెప్పేదేమిటి మీరు అడిగేదేమిటి?
మహా విష్ణువు: ఏ పని చేసినా దాని మీదా శ్రద్ధా భక్తులు పెట్టి చెయ్యాలి. ఆ అరికాలి ఎడమవైపు నొప్పి వస్తోంది అక్కడ కొంచెం ఫోకస్ పెట్టి మర్దన చెయ్యి ఈ స్పెషల్ స్టేటస్ గురించి నీకెందుకు?

లక్ష్మి దేవి: చేస్తాను లెండి తప్పుతుందా ఈ భూమండలమంతా చూస్తోంది గా. కానివ్వండి ఇంకో అవతారం ఎత్తకపోతానా మీ సంగతి చూడక పోతానా.అయినా ఇప్పుడు భాహుబలి సినిమా ఎందుకు? నేనిప్పటికే మూడు సార్లు చూశాను.
మహా విష్ణువు: అందులో కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు?

లక్ష్మి దేవి: బాహుబలి - 2 లో ఇద్దరు బాహుబలులు వుండకూడని.
మహా విష్ణువు: ఏడ్చినట్లుంది. రాజమౌళి పొడవమన్నాడు కట్టప్ప పొడిచాడు. అది రాజ మౌళి లీల.

లక్ష్మి దేవి: అయినా ఈ సోదెందుకు? మోడి బీహార్ కు 1.25 లక్షల కోట్లు ఇచ్చాడు కదా. సీమాంధ్ర కు కూడా ఏమన్నా ఇవ్వచ్చు కదా అని నేనడుగుతుంటే.
మహా విష్ణువు: రాజమౌళి లీల లాగా ఇది కూడా మోడి లీల.

లక్ష్మి దేవి: మీరెప్పుడు సరిగ్గా సమాధానం ఇచ్చారు గనుక.ఆ ద్వాపర యుగం లో కృష్ణావతారం ఎత్తినప్పటి నుండి టూ మచ్.
మహా విష్ణువు: శాంతించు దేవి. సీమాంధ్ర కు కూడా కానుకలొస్తాయ్ బీహార్ లాగా మారితే. కాస్త కత్తులు కటార్లమీద మీద మనసుపెడితే సరి.

Monday, July 20, 2015

కట్టప్ప బహుబలిని ఎందుకు పొడిచాడు?



అస్లం ఖాన్ తండ్రి బిస్లం ఖాన్ ఆయుధాలతో పాటు అత్తరు వ్యాపారం చేసేవాడు. అత్తరంటే కట్టప్ప కూతురికి చాలా ఇష్టం. కట్టప్ప అంతఃపురంలో లేడని తెలిసి బిస్లం ఖాన్ అత్తరు శాంపుల్స్, ఆయుధాల శాంపుల్స్ చూపిద్దామని కట్టప్ప ఇంటికొస్తాడు. అక్కడ కట్టప్ప కూతురు కొన్ని సాంపుల్స్ తీసుకొని పౌడర్ రూం లోకి వెళ్తుంది. బిస్లం ఖాన్ కొలిమి ల్యాబ్ నుండి కొత్త ఆయుధం వచ్చిందని "కసక్ కిరాక్ ఖడ్గ్" అనే ఖడ్గాన్ని చూపిస్తాడు.

అప్పుడే అడవి నుండి వేట అయిపోయి కోటలోకి ప్రవేశిస్తుంటాడు బాహుబలి. కొండెక్కి అలసిపోయిన గుర్రానికు రెస్ట్ ఇద్దామని గుర్రాన్ని లాక్కుంటూ వస్తున్న బాహుబలి కట్టప్ప ఇంటి నుండి వస్తున్న అత్తరు వాసన చూద్దామని ఇంట్లోకి వస్తాడు. "కసక్ కిరాక్ ఖడ్గ్" వేస్టని కట్టప్ప అంటే బిస్లం ఖాన్ కు కోపం వచ్చి టెస్ట్ చెయ్యమంటే కట్టప్ప, బహుబలి "జై కత్తి కాంతా రావ్" అని ఖడ్గ ఫైటింగ్ చేసుకుంటారు. పీటర్ హేన్స్ కు ఐడియాలు , కీరవాణి దగ్గరనున్న అన్ని కత్తి బ్యాక్ గ్రవుండ్ సౌండులు అయిపోగానే కట్టప్ప కూతురు మిద్దె మీద నుండి "నాన్నా ఈ అత్తరు సూపరు. రెండు జాడీలు కొనుక్కో..." అని వస్తూ వుంటుంది. కత్తి యుద్ధం లో 360 డిగ్రీలు తిరుగుతూ కట్టప్ప కత్తి దెబ్బలని కాచుకుంటున్న బాహుబలి కట్టప్ప కూతుర్ని చూస్తూ 360 డిగ్రీల బదులు 180 డిగ్రీల దగ్గర ఆగిపోతాడు.

అంతే...కీరవాణి కొత్త బ్యాక్ గ్రవుండ్ బ్యాంగ్...
"కసక్ కిరాక్ ఖడ్గ్" బాహుబలి బ్యాక్ నుండి ఫ్రంటుకు..

ఎడిటింగ్ లో తీసేసిన సీన్: బిస్లం ఖాన్ అత్తరుని ప్రాడక్ట్ లైన్ నుండి తీసేసి ఆయుధాల వ్యాపారాన్ని అస్లం ఖాన్ చేతిలో పెట్టి చనిపోతాడు.

Friday, December 06, 2013

ధ.భ.నే.శు.(TGIF)- హోకు



The flight is about to land at San Francisco Airport. An American starts a conversation with an Indian IT girl.

"Where are you going?"
"ఐయాం గోఇంగ్ టూ శాన్ జోస్(San Jose)"

"No. You should not say joes. HERE j will be spelled as h. It is San h-o-se " 
"థాంక్స్. ఐ విల్ రిమెంబర్ ఇట్"

"Where are you from?"
"రాహమండ్రి , ఇండియా "

"What is your name?"
"మై నేం ఈజ్ హలహ"

"Nice name. Its Reversable. What is your mother's name?"
"షి ఈజ్ నాట్ రివర్సబుల్. హర్ నేం ఈజ్ హానకి"

"When are you going back to India"
"మై ప్రాహెక్ట్ విల్ బీ ఓవర్ ఇన్ హూన్. మై హర్నీ బ్యాక్ టూ ఇండియా స్టార్ట్స్ ఇన్ హూలై"

"థ్యాంక్స్ ఫర్ ద హోక్. యు మేడ్ మై డే. ఐ విష్ యు గుడ్ లక్ అట్ యువర్ న్యూ హాబ్."

Thursday, November 21, 2013

ధ.భ.నే.శు. - ద ఆర్ట్ ఆఫ్ (న)ల్లివింగ్


ఓ నూట యభై లక్షల సెకండ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ….

*****

“అరే! అన్ని పూరీలు నేను తినలేనండి బాబూ..ఇక చాలు”
“అల్లాఘంటే ఎళ్ళాగ మీఋ మా వైట్ హవుజ్ అతిథులు. ఇవి మా మిచెల్లె శ్వయంగా చేషింది. రసిక రెస్టారెంట్ నుండి తెచ్చిన పూరీలు కావు.బావున్నాయి తిణండి” ఒబామా ఒకటే బలవంత పెడుతున్నాడు.తినక పోతే నోట్లో పెట్టేటట్టు వున్నాడు.
“ హవును ణేను ఒబామా కి ఖూడ ఎప్పుఢూ ఇంత భాఘా బర్గర్ షెయ్యలేదు. మీఋ తప్పఖుంఢా తిణండి” మిచెల్లె ఒబామా కూడా బలవంత పెట్టేస్తోంది.
“నేను పూరీలు తింటాను గానీ. ఇంతకూ మీకు తెలుగు నేర్పింది ఎవరు?”
“మాంచు లఖ్ష్మి..”

అంతలో ఓ హెలికాప్టర్….. నా మీద పడింది.

“ఇది ఘోరం. పూరీలు తినక పోతే నా మీద డ్రోన్ దాడులు జరిపిస్తారా ఇదెక్కడి అన్యాయం ఒబామా గారూ ” అని గట్టిగా అరిచాను.
“నాన్నోయ్.. నీ పూరీలు సంతకెళ్ళా. అమ్మ పేరు ఓ బామ్మ ఎప్పుడయ్యింది? నీ మీద దాడులు కాదు నా మీద ఏలియన్స్ దాడి చేసి నన్ను కొరికేస్తున్నారు” రెండో బుడ్డోడు ఉరఫ్ చిన్న బుడ్డోడు.
“ఇంతకూ నువ్విక్కడికెలా వచ్చావ్రా?”
“నా రూములో హెలికాప్టరేసుకుని మీ బెడ్ రూములో ల్యాండ్ అయ్యా”
“నీ హెలికాప్టర్ చుట్టూ ఆ నల్లగా తిరుగుతున్నవేమిట్రా?”
“ఏలియన్స్ నాన్నా.. అవి హెలికాప్టర్ లోకి కూడా వచ్చేశాయి”
“వాటిని ఏలియన్సు అనర్రా..నల్లులు అంటారు”
“అయితే మన మీద నల్లేలియన్సు దాడి జరిగింది నానా”

 అప్పుడు కోడి పుంజు ఆడియో సాంగేసుకునే టైము 3:33.

  బుడ్డోడి హెలికాప్టర్ అద్దెకి తీసుకొని దాని ప్రొపెల్లెర్ మీద కూచుని పక్కింటోడి బ్యాక్యార్డ్ లోకెళ్ళి అక్కడున్న మోషన్ సెన్సార్ సోలార్ సెక్యూరిటీ లైట్లు మూడు లాక్కోని నా నెత్తి మీద పెట్టుకుని చిన్న బుడ్డోడి రూం లో పరిశోధన కెళ్ళా.

  అప్పుడే ఫ్రెష్ గా డిన్నర్ అయిపోయినట్లుంది. చాలా నల్లులు రక రకాల భంగిమలలో డ్యాన్స్ చేస్తూ కనిపించాయి. అవి ఏవో పాటలు కూడా పాడుకొంటున్నట్లున్నాయి. నా చెవులకేమీ వినబడలేదు. నా అపరాధ పరిశోధన బుర్రలో హెడ్ ఫోన్లు వెలిగాయి.

  అందరి పక్కింటోళ్ళలాగా మా పక్కింటోడు కూడా చాలా పిసినారి. వాడి బ్యాక్ యార్డ్ లో మోషన్ సెన్సారే పెట్టాడు ఆడియో సెన్సర్ పెట్టలేదు. ఈసారి ఎదురింటి పక్కింటోడి బ్యాక్ యార్డ్ లో కెళ్ళి ఆడియో సెన్సర్ బగ్గులన్నీ పీకి దాని వైర్లు నా నాలుగు చెవుల్లో పెట్టుకొని మళ్ళీ బుడ్డోడి రూములో కెళ్ళా. ఇప్పుడు పాట్లన్నీ సర్రౌండ్ సౌండ్ లో వినిపించాయి.

  ఒక గుంపు “జిలె లె జిలె లె ఆయొ ఆయొ జిలె లె..మస్తి మె మస్తి మె ఆయొ ఆయొ ...జిలె లె  జిలె లె..”  అని. ఇంకో గుంపు..”ఎంద చాటయొ..ఎంద కాట్ర విల్లియో..ఎంద చాట్ర కాట విల్లయో  ” అని పాడుకుంటున్నాయి.

  ఇంకొన్ని చాలా ఐకమత్యంగా సెపరేటుగా  “జింగాలే జిగి బిగిలే... కిళ్ళీ లో జెల్లీ లే...  నీ బెల్లీ నే గిల్లా లే ..” అని  , “రొప్పు.....  రొక్కు.....  నొక్కు....  నక్కు....  కక్కు.....  బొక్కు......  డొక్కు.... బ్రక్కు..... ళ్రక్కు... ణ్రక్కు..  ” అని , “నీ డిప్ప మీద కాయ్....  నా రెప్ప మీద టాయ్... నువ్వు నన్ను చేశావు అన్నాయ్....  నేను నిన్ను చేస్తా డెస్ట్రాయ్......” లాంటి స్వచ్చమైన తెలుగు పాటలు పాడుకుంటున్నాయ్.

  ఇంకొంచెం లోపలికెళితే “నీ చంకలో బంక... నేనందులో దుంక.. ఇద్దరం అవుదాము ఇంక బంకబంక....ఈ విహారి గాడి ఇల్లు చేద్దాము టెంక టెంక...  ” అని వినిపించింది .  నా అయిదు చెవుల్లోని బగ్గులు పేలిపోయాయి.

  ఫగిలిపొయిన బగ్గులు తీసేసి నెత్తినున్న లైట్లతో పెద్ద బుడ్డోడి రూములో హెలికాప్టర్ ఇంజిన్ కి కాళ్ళు వేలాడేసి వెతికా. అక్కడ కూడా 300 సినిమాలో సైన్యం లా ఎక్కడ చూసినా మందలు మందలుగా "ఎన్నియల్లో...  ఎన్నియల్లో...  చంద మామా ..ఓయ్..  ఒరేయ్..  అరేయ్... విహారిగా... " అని కోయ యుగళ గీతాలు, అమంగళ గీతాలు స్వేచ్చగా పాడుకుంటున్నాయి.

  కట్ చెయ్యకుండా సీను అర్థమయిపొయింది. అప్పటికి మూడో అంతస్తంతా ఆక్రమించేశాయ్. ఇక ఆ రాత్రి అందరూ కూచుని ‘ఐ డోంట్ స్పై నల్లి’ ఆట ఆడుతూ సంతోషంగా జాగారం చేశాం.

    'ఐ డోంట్ స్పై' అనేది 'ఐ స్పై' కి ఆపోజిట్. ఐ స్పై ని చిన్నప్పుడు చెడ్డీ ఎక్కడుందో తెలీని వయసులోనే నేను చౌడేపల్లి లో ఆడుకున్నా. దాన్ని 'ఐస్‌పాయ్' అనే వాళ్ళం. నాన్-చౌడేపల్లి వాళ్ళు కాపీ కొట్టేసి సాబ్జ అని కూడా అంటారు. చరిత్ర చూస్తే చౌడేపల్లి వాళ్ళందరూ మేధావులే. కొంత మంది చాలా ఏళ్ళ క్రితం వలసపోయారు. అక్షర క్రమం లో వారి పేర్లు..అరిస్టాటిల్, ఆర్కిమెడిస్, ఇసాక్ న్యూటన్… ( ఈ వరస క్రమం లో విహారి పేరు కూడా గుర్తొస్తే మీరు తెలివైన వాళ్ళే కాదు అందమైన ధనవంతులు కూడా అవుతారు)

ఐ డోంట్ స్పై ఆట వివరాలు

  హాల్లో వన్ టూ త్రీ చెప్పుకొని అందరూ వాళ్ళ రూముల్లోకి వెళ్ళాలి. వెళ్ళి నల్లులు కనిపించక పోతే 'ఐ డోంట్ స్పై నల్లి' అని అరవాలి. నల్లి కనిపిస్తే చంపాలి.

  చాలా సేపు వన్ టూ త్రీ లే అరిచాము. కానీ ఒక్కరూ ఐ డోంట్ స్పై నల్లి అని అరవలేదు. పక్కింటోళ్ళు ఫోర్ ,ఫైవ్ ,సిక్స్ అని కోరస్ ఇచ్చారు. మా గేమ్ రూల్సు చెప్పిన తరువాత సెవన్, ఎయిట్ అని అట్లాంటా సముద్రం లోకి నైట్ డ్రస్సులో కారేసుకుని వెళ్లి పోయారు. మేము మాత్రం మళ్ళీ ఒన్ టూ త్రీ లు చెప్పుకుని అలుపూ సొలుపు లేకుండా రెండున్నర వారాలు ఆడాం. అయినా గేం అయిపోలేదు.  నల్లులు చావలేదు.

  ఇలా కాదని నల్లుల సమస్య పరిష్కారించాలని 'దోని(పర్తి)' రాజ్య సమితి సమావేశానికి సమితిలోని మొత్తం నలుగురు సభ్యులకూ ఈ మెయిలు, ఫేస్బుక్ అకౌంట్ కి మెసేజ్ లూ పంపించాము. ఫేస్ బుక్ నుండి వెంటనే రిప్లై వచ్చింది అందరినుండి.

   శాశ్వత సభ్యులైన నేనూ, మా ఆవిడా, తాత్కాలిక సభ్యులైన మా బుడ్డోళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ మీద 'శుక్లాం బరధరం' మలయాళం లో  చెప్పుకుని సమావేశమయ్యాం. టేబుల్ మీద నుండి కాళ్ళు కింద జారేసి ఒకరి మొఖాలు ఒకరు చూసుకోకుండా కూచున్నాం  అచ్చం ఐక్య రాజ్య సమితి సమావేశం లా నిండుగా.

 నిండు సభ తో చర్చలు మొదలయ్యాయి.

كيف تقتل البق
Πώς να σκοτώσει τα ζωύφια
איך להרוג חרקים
如何殺臭蟲

నాలుగు నాన్ తెలుగు బాషల్లో బట్టలు చినిగాకా తెలుగు లో నాలుగు తీర్మానాలు చేసి ఏకాభిప్రాయం కుదరక ఒక్క దాన్ని మాత్రమే పాటించాలి అని ఓటింగుకు పెట్టాం. తీర్మానాలు కింద ఇవ్వబడ్డాయి.

     1. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి ఒకటి 
     2. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి రెండు
     3. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి మూడు
     4. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి నాలుగు

  ఓటింగుకు పెడితే ఒక్కో దానికి ఒక్క వోటు మాత్రమే వచ్చింది. చీటింగుకు కూడా పెట్టాము. అయినా ఒక్కో దానికి ఒక ఓటు మాత్రమే వచ్చింది.  నాలుగు ఓట్లు వున్నప్పుడు ఒక ఓటు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. తరువాత టాస్ వేద్దామని నిర్ణయించాం. పెద్ద బుడ్డోడు ఐదు రూపాయిల బిళ్ళ తెచ్చాడు. బిళ్ళ అర చేతిలో పెట్టుకొని ఏం కావాలో  కోరుకోండి అన్నా.

  మా ఆవిడ "రవ్వల నెక్లెస్" అంది. పెద్దోడు "విమానం" అన్నాడు. రెండో వాడు "అంగారకుడు" అన్నాడు. ఫ్లోలో నేను కూడా "ఏ.కె. 47." అన్నా.

"నా అరచేతిలో ఐరావతం లేదు ఐదు రూపాయలే వున్నాయి. వాటికి ఇన్ని రావు" అనగానే మా ఆవిడ వాళ్ళ పుట్టింటికి ఫోన్ చెయ్యడానికి వెళ్లి పోయింది.  బుడ్డోళ్ళు హెలికాప్టర్ లో క్రికెట్ ఆడుకుంటూ వెళ్ళిపోయారు.

మళ్ళీ అందరికి ఎస్సెమ్మెస్ పంపిస్తే ముగ్గురూ హెలికాప్టర్ లో వచ్చేసారు.

   ఇద్దరు బొమ్మ అన్నారు.ఇంకో ఇద్దరు మాత్రం బొరుసుకు ఆపోజిట్ అన్నారు.  ఏదో ఒకటే నెగ్గాలి కాబట్టి సింహం బొమ్మ ఒకో తలకాయ మీద ఒక్కొక్కరు పందెం కాసాం. గుర్తు కోసం అందరూ వాళ్ళ నంబర్లు వాళ్ళ సింహం తలకాయ మీద స్కెచ్ పెన్ను తో రాశారు. నేను టాస్ వేస్తే నాలుగో తలకాయ బొమ్మ పడింది. మా చిన్న బుడ్డోడు ఎగిరి గంతేశాడు. అదెలా జరిగిందిరా అంటే.

“మీరందరూ మీ సింహం జుట్టులో నంబరేశారు.  నేను నా సింహం ముక్కు మీద నంబరేశా. అది నంబర్ని గొక్కుంటూ పైకి వచ్చేసింది”.

 ఎంతైనా మేధావి కదా (మీకు చౌడేపల్లి గుర్తుకు వస్తే మీరు అక్కడి నుండి వలస వెళ్ళిన మేధావి కాందిశీకులు. ఫేస్ బుక్ , ట్విట్టర్ , గూగుల్ ప్లస్, గూగుల్ డివైడెడ్ బై , గూగుల్ VIBGYOR లలో ఉన్న మనోళ్ళనందరినీ ఏకం చెయ్యండి. నేను వాళ్ళకు నాయకుడిగా అవకాశమిస్తా. ). అందరం వాన్ని పైకెత్తాం. ఆ సంతోషం లో వాడు మూడు లక్షల ఏడు నల్లుల్ని కంటి రెప్పతో అతి పరాక్రమంగా చంపి నల్లుల శాతాన్ని 0.0001 తగ్గించాడు. వాడికి 'నల్లి గండర గండడు' అని బిరుదు ఇచ్చాం. దాన్ని వాడు స్కూల్లో టీచర్ కి ఇచ్చి వాడి క్లాస్ మేట్ సోఫియా కు వాలంటైన్స్ డే కి గిఫ్టుగా ఇమ్మన్నాడు.

*****

  దోని రాజ్య సమితి తీర్మానం ప్రకారం ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవడానికి ఎవరైనా జ్యోతిశాస్త్రం చెప్పే పూజారి దొరుకుతాడేమోనని గూగుల్ లో వెంకటేశ్వర టెంపుల్ అని సెర్చ్ కొట్టా. అయిదు మైళ్ళ రేడియస్ లో పది వెంకటేశ్వర టెంపుల్స్ కనిపించాయి. వాటి పేర్లు బాక వెంకటేశ్వర టెంపుల్, లుబ వెంకటేశ్వర టెంపుల్ ,యరూబ వెంకటేశ్వర టెంపుల్ అని అన్నీ ఆఫ్రికా తెగల పేరుతో వున్నాయి. విచారిస్తే గుళ్ళన్నీ తెలుగు వాళ్ళవే. ఆఫ్రికా తెగల పేర్లన్నీ ఇప్పుడున్న తెలుగు వాళ్ళ కులాలట వాళ్ళు తెలివిగా తమ పూర్వీకుల తెగల పేర్లు పెట్టుకున్నారట. ఈ విషయాలన్నీ బేస్మెంట్ లో జరిగే  ప్రైవేట్ మీటింగుల్లో పోకర్ ఆడేప్పుడు తెలుస్తాయ్. మీ జ్ఞాన పీఠం పెద్దదవాలంటే పోకర్ నేర్చుకొని అమెరికా వీసాకు అప్లై చెయ్యండి.

  లుబ పేరు బాగా నచ్చి ఆ గుడి కెళ్ళి లోపలున్న పూజారితో నల్లి సమస్య చెప్పడము మొదలుపెట్టా. ఆయన కళ్ళు మూసుకుని నన్ను నోరు మూసుకోమన్నాడు. కొంతసేపటికి తను నోరు తెరిచి నన్ను కళ్ళు మూసుకోమన్నాడు. తల పైకెత్తిన తరువాత కళ్ళు, చెవులు తెరవమన్నాడు.

“ఇప్పుడు చెప్పు నీకు ఏమి కనిపిస్తోంది?" అని అమృతమ్ అప్పాజీ లా అన్నాడు.
“ఎల్.జి. 60W ఎల్ఈడి. బల్బు స్వామీ. నేను కూడా మొన్నే వాల్మార్ట్ లో కొన్నా. డిస్కౌంటు పోయిన తరువాత 2 డాలర్ల 13 సెంట్ల బిల్లు కనిపించింది.”

“చూడు నాయనా ఎంత ఇంజినీరయితే మాత్రం బ్రాండు పేరుతో సహా చెప్పాలా? నీ పెళ్ళప్పుడు అరుంధతి నక్షత్రం కనిపించిందా?”
“పెళ్ళప్పుడు ఆ ఖర్చులకు చాలా నక్షత్రాలే కనిపించాయి స్వామి ఆ పేర్లన్నీ ఇప్పుడు గుర్తు లేవు”

“నేనడిగింది చుక్కల గురించి కాదు. శాస్త్రమన్న తరువాత కొన్ని సార్లు కొన్ని ఒప్పుకోవాలి.”
“సరే స్వామి ఇప్పుడెక్కడ చూడాలో ఏమి కనిపించుకోవాలో చెప్పండి. అందులో నాకు U సర్టిఫికేట్ వుంది. ”

“తెలివైన వాడివి పైకొస్తావ్! మీది చౌడేపల్లనుకుంటా..... ఆ చాతీ కొంచెం లోపలికి దోపుకో నాయనా. ఈ సారి పైకప్పు కాకుండా అలా ఏటవాలుగా కిటికీ లోనుండి ఆకాశం చూడు. అక్కడ ఒక సింహాసనం కనిపిస్తుంది”.

“ఆ కనిపించింది. దాని మీద  ఎవరో యూరి గగారిన్ గాడు కూర్చుని వున్నాడు. మెళ్ళో వజ్రాల హారాలు చాలా వున్నాయి.”
“ఇక ఇటు వైపుకు తిరుగు. ఆ యువకుడెవరో కాదు.గద మగధ సామ్రాజ్య యువరాజు.  నువ్వే. అది నీ పూర్వ జన్మ.”

“అబ్బా! ఇప్పుడా యువకుడు మహేష్ బాబులా వున్నాడు స్వామీ. ఏమన్నారు అది నేనా? అయితే ఇప్పుడున్న మహేష్ బాబు నాకు డూపన్నమాట. వుండండి స్వామీ ఇప్పుడే ఓ ఫోటో తీసుకుంటా…”
“ఎందుకు నాయనా..”

“ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చెయ్యాలి స్వామీ.”
“అలా ఆల్జీబ్రా మెలికలు తిరగటం ఆపి ఆ వృత్తాంతం వింటావా?”

“అలాగే. అందులో ఎవరున్నా లేకున్నా సమంతా లాంటి యువరాణి మాత్రం వుండాలి స్వామీ నేను ముందుగానే చెబుతున్నా. తరవాత మాటొస్తుంది. ”
“అలాగే కానీ. నువ్వు మాటి మాటికీ వట్ర సుడులు తిరగటాలు… చాతీ వుబ్బటాలు... మీసాలు తిప్పటాలు లాంటివేం చెయ్యకు... ఆ బెల్టు కొంచెం కిందకు లాగి తొడకు కట్టుకో అసలే రాయలసీమోడివి.  నీకు నీ పూర్వ జన్మ లో చేసిన నల్లి కర్మ వృత్తాంతాన్ని చెబుతా విను. ”.

(మళ్ళొస్తా ...)

Friday, November 15, 2013

ధ.భ.నే.శు.



కచరా: జై తెలంగాణా!
కికురె: జై సమైఖ్యాంధ్రా!
చబానా: జై.... జై.... నేను రెండు సార్లు జై కొట్టాను. ఇద్దర్ని ముఖ్యమంత్రులను చెయ్యాలి.(నన్నూ...మా యువ నాయకుడు లోకేష్ నూ)

Friday, November 08, 2013

ధ.భ.నే.శు. - సర్ప సెలవులు



నాగ రాణి: స్వామీ! మీరు ఈ నాగులచవితికి కూడా నాకు గొడుగు తెచ్చివ్వక పోతిరి. చూడండి నా వొళ్ళంతా ఎలా తడిసి ముద్దయిందో.

నాగ రాజు: మహా మంత్రీ! మంచి తాటాకు ఛత్రాన్ని తెచ్చిమ్మని మీకు నాగుల చవితికి పక్షం ముందుగానే చెబితిని కదా. ఏమయ్యింది?

నాగ మంత్రి: ప్రభూ! నేను ఎచ్చట వెదికినను చైనా కోటు లే తప్ప తాటాకు గొడుగులు కనిపించడం లేదు. ఈ నాగ భక్తులు పోసే పాల బారిన మనము పడకుండా వుండాలంటే ఒకటే మార్గము. నాగుల చవితికి దసరా సెలవుల్లాగా సర్ప సెలవులు ప్రకటించండి రాజ్యమంతా.

నాగ రాజు: అందువల్ల మనకు కలిగే ప్రయోజనము?

నాగ మంత్రి: ఈ పాలు అన్నీ కల్తీ పాలు అందులో మళ్ళీ చైనా డబ్బా పాలు కలిసిపోయినాయి. చైనా పాములు మాత్రమే తట్టుకోగలవు. అవి తాగడం కాదు కదా తాకినా ఒళ్ళంతా దురద వస్తుంది మనకు. అసలే మీ పుట్టఃపురము చాలా ఏపుగా నున్నది. భక్తుల కళ్ళన్నీ మీ పుట్టఃపురము పైనే పడి చెంబులు చెంబులు కుమ్మరించుచుంటిరి. అందువల్ల ఈ సర్ప సెలవులప్పుడు మనమందరము వన భోజనాలని దట్టమైన అడవుళ్ళోకి వెళ్ళి వచ్చెదము.

నాగ రాణి: అవును స్వామీ! మన పుట్టఃపురము అంతా నాగార్జున సాగరము అయ్యింది. నాకు ఈదుట కన్నా పాకుడే ఇష్టము.

నాగ రాజు: అలాగే దేవీ. మీరు పాలలో, నీళ్ళలో ఈదుచున్న చూసి సంతసించే చపల రాఘవేంద్ర మానవున్ని కాదు. మహా మంత్రీ! వచ్చే నాగుల చవితికి వారము పాటు సర్ప సెలవులు ఇస్తున్నామని రాజ్యమంతా ప్రకటించండి.

Tuesday, September 29, 2009

మన బడి గడుగ్గాయిలు

* * * * * * * *

వేసవి సెలవులు అయిపోయిన తరువాత వచ్చిన పిల్లలను సెలవుల్లో ఏమి చేసారో రాసుకొని రమ్మన్నాను. ఒకళ్ళేమో డిస్నీకెళ్ళామంటే ఇంకొకళ్ళు డకోటా(సౌత్ డకోటా) కెళ్ళామని రాసుకొచ్చారు. ఒక గడుగ్గాయి భారత్ వెళ్ళొచ్చాడు. పేపర్ లో రాసుకొచ్చింది నా చేతిలో పెట్టి నా పక్కన నుంచున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింట్లో ఆవు ఈనిందట. ఒక దూడ పెయ్యని ఈనిందట. అమ్మమ్మ జున్ను చేసి ఇచ్చిందట. జున్ను.. జున్ను అనగానే మనసు రాకెట్ ఎక్కి మా అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ నేను ఆవు పొదుగు నుండి పాలు తాగుతున్న సీన్ ని 70 MM లో "క్షీర క్షీర క్షీర.. మనసార గ్రోలరా.. " అన్న పాట ను బ్యాక్ గ్రౌండు లో పెట్టి ఫ్రంట్ గ్రౌండ్ మర్చిపోయా. యాంత్రికంగా రాసింది చదువుతూ వుంటే భారత్ లో వున్నప్పుడు మొట్టికాయల ఆట ఆడాను అన్నది కనపడింది. బ్యాక్ గ్రౌండ్ పాట తారాస్థాయిలో వుండగా ఆ గడుగ్గాయిని మొట్టికాయల ఆట ఎలా ఆడుతారు అని పొరపాటున అడిగా. నా కళ్ళు ఒక చేత్తో మూసి ఇంకో చేత్తో టెంకి జెల్ల ఇచ్చుకున్నాడు. ఆ దెబ్బకి నా ఏడో తరగతి మొట్టికాయలు గుర్తుకు తెచ్చుకుంటుంటే నా ముందున్న మూడో తరగతి పిలకాయలు "ఎన్నాళ్ళో వేచిన ఉదయం... " అన్న పాటకి మైఖేల్ జాక్సన్ స్టెప్పు లేస్తూ కనిపించారు.

* * * * * * * *


కొత్తగా మొదలయిన క్లాసు లో పిల్లలు రెండో సెషన్ కు వచ్చినప్పుడు పోయిన క్లాసు లో చెప్పిన హోము వర్కు చేసుకొచ్చారా అని అడిగితే అందరూ చూపించారు. ఒకడు మాత్రం చూపించలేదు.
"హోం వర్కు చేసుకొచ్చావా ?"
"ఎస్!"
"అయితే చూపించు?"
"వై?"

ఈ బుడ్డోడు పైన చెప్పిన మొట్టికాయల బుడ్డోడి తమ్ముడు. వయసు ఆరేళ్ళు

* * * * * * * *


కొత్త క్లాసులో కొత్తగా చేరింది ఓ పిల్ల పిడుగు. నేను ఒకటి చెబితే తను నాలుగు చెబుతుంది. ఎంత ఊర్కోమన్నా ఊర్కోలేదు. సరే ఇలా కాదని నేను వెళ్ళి తన పక్కన కూర్చుని నేను పాఠాలు చెప్పను నువ్వే వెళ్ళి చెప్పు అన్నా. నదురు బెదురు లేకుండా లేచి నేను నుంచునే చోటుకు వెళ్ళి.

"బ్రేక్..." అని చెప్పింది ఆరేళ్ళ పిల్ల పిడుగు.
* * * * * * * *

Friday, September 04, 2009

ఈ వారం సిధ్ద -- బుద్ధ(సాహస యోధుడు )

***

"అయ్య గారూ"
"ఏం సిద్ధా?"

"దేవుడెక్కడున్నాడు?"
"కాంగ్రేస్ పార్టీ లో వున్నాడు కదా?

"మరిప్పుడు వై.ఎస్ ఎక్కడున్నాడు?"
"దేవుడి దగ్గర కెళ్ళిపోయాడు?"

"ఏ దేవుడి దగ్గర కెళ్ళాడు?"
"వరుణ దేవుడు వచ్చి అసలు దేవుడి దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు."

"అదే ఎందుకు అని?"
"సకాలం లో వర్షాలు పడనందుకు ఆందోళన చెందిన దేవుళ్ళు తమ ధైర్యం కోసం మొండి ధైర్యం కల వై.ఎస్. తోడుంటే బావుంటుందని."

***

నీకెలాంటి స్నేహితుడు కావాలని నన్నెవరైనా అంటే "నాకు వై.ఎస్. లాంటి స్నేహితుడు కావాలి" అంటాను.ఓ ఫ్రెండ్షిప్ డే నాడు వై.ఎస్. కు బెస్ట్ ఫ్రెండ్ అవార్డు ఎందుకివ్వాలో సరదాగా రాసినా అదెంత నిజమో ఈనాడు ఆయనను అభిమానించే వాళ్ళ సంఖ్య చూస్తే తెలుస్తోంది.

నిత్య అసమ్మతి నాయకుడైనా, అను నిత్యం తనను నమ్మే వాళ్ళను పేరుతో సహా గుర్తుపెట్టుకోవడం, ఆవేశం తో అసెంబ్లీ లో మైకులు విరగ్గొట్టినా, అవసరమొచ్చినప్పుడు అనుచర గణాన్ని ఆప్యాయంగా ఆదుకోవడం లోనూ ఈ మేరు నగ ధీరుడిని మించిన వారు లేరు. ముఖ్యమంత్రయినా పల్లెటూరి బిడ్డలోని ఆప్యాయతను మరిచిపోని ప్రజా నాయకుడు 'రాజస' శేఖరుడు .కట్టు బానిసల కాంగ్రేస్ లో కట్టి పడేసే కనికట్టు విద్య వున్న అసలు సిసలు నాయకుడు మరిక పుడతాడో లేడో.అచ్చ తెనుగు పంచ కట్టుతో చిద్విలాసంగా నవ్వుతూ చెయ్యి ఊపుతూ సాగే ఆ నడక ఇక కనిపించదంటే జీర్ణించుకోవడం కష్టం. పాద యాత్రతో రాష్ట్రాన్ని సృజించిన ఈ మడమ తిప్పని సాహసి దైవ యాత్ర లోని ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ.

**

Monday, August 31, 2009

మరొక్క సారి... అంటే మూడో సారి.. తెలుగు బడి మన బడి గురించి ..

* * * * * * * *


సిలికానాంధ్ర అని పేరు చెబితే అమెరికాలో కొంత మందే గుర్తుపట్టే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ఏ కూచిపూడో, శాస్త్రీయ సంగీతమో, జాన పద కళో చప్పున గుర్తుకు వస్తుంది అమెరికా తెలుగోడి కైనా, తెలుగు దేశం లో తెలుగు మాట్లాడని వాడికైనా. ఆ సంఘం తెలుగు బాషకు చేసే సేవల్లో మన బడి ఒకటి. మన బడిని పిల్లలకు తెలుగు భాష నేర్పటానికి మొదలు పెట్టారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ మన బళ్ళు ఉత్తర అమెరికా దేశం లోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికి 14 రాష్ట్రాల్లో వేళ్ళూనింది. ఈ సంవత్సరం మరిన్ని రాష్ట్రాలు జత కలుస్తున్నాయ్. ఈ మన బడి ప్రయాణం లో మా కొలరాడో మన బడి కూడా విజయవంతంగా మూడో సంవత్సరం లోకి అడుగుపెడుతోంది. మా మన బడి పిల్లలతో పాటు నేను కూడా 'ప్రవేశం', 'ప్రకాశం' తరగతులు దాటుకొని పరీక్షలు రాయకుండా(దిద్దుకుంటూ)'ప్రమోదం' తరగతి లోకి అడుగు పెడుతున్నా నా మూణ్ణెల బడి సెలవులు ముగించుకొని. వాఁ..బ్యాక్ టూ స్కూల్. మళ్ళీ పలకా బలపాలూ..గోడ కుర్చీలూ..

సంవత్సరం తరగతులు వచ్చే సెప్టెంబరు రెండవ వారం లో మొదలవుతున్నాయి. మీ పిల్లలను ఇందులో చేర్పించాలంటే లేదా వారి ఊళ్ళలో ఈ మనబడి ప్రారంభించాలంటే రాజు చమర్తి గారిని(408-685-7258, raju@siliconandhra.org) లేదా శంకర్ తుములూరు గారిని(650-430-5958 sankar@siliconandhra.org) గానీ సంప్రదించండి.

కొన్ని వివరాలు:

1. చేరాలంటే 2009 సెప్టెంబర్ 1 కి ఆరు సంవత్సరాలు నిండి వుండాలి. (మా బుడ్డోడు కుడి చేత్తో నెత్తి మీదుగా ఎడమ చెవిని పట్టుకుంటాడు అది సరిపోద్దా అంటే కుదరదు.)

2. వారానికి రెండు గంటలు తరగతులు వుంటాయి. (మా బుడ్డది తైతక్కలాడ్డానికి వెళ్తుంది దీన్ని ఎగ్గొడితే మళ్ళీ క్లాసులు చెబుతారా అని అడక్కూడదు. ఎగ్గొడితే మార్కులు కోసేస్తారు.)

3. పిల్లలకు పెన్సిల్ దగ్గర నుండి పుస్తకాల వరకు ఈ సంస్థ వారే ఇస్తారు. (బజ్జి బువ్వ కూడా పెడతారా, పరీక్షలు కూడా మీరే రాసిస్తారా అని డవుట్లు వస్తే మీరు నాలుగణాలు ఆదా చేద్దామనుకునే పదహారణాల తెలుగు వారే.)

4. పాఠాలు భోదించే ఉపాధ్యాయులకు భోధనాంశాలు కూడా ఏ వారానికి ఆ వారం సులభంగా చెప్పేటట్లు వుంటాయి.(ఉపాధ్యాయులు కొన్ని తెలుగు పదాలను ఇంగ్లీషులో తర్జుమా చేసి చెప్పటానికి క్లాసుకు 372 వెంట్రుకలు సులభంగా పీక్కుంటారు)

5. ప్రవేశం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అని నాలుగు సంవత్సరాల తరగతులు వుంటాయి.(హమ్మయ్యా అని అనుకోవడం తల్లి దండ్రుల వంతు.)

6. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తీర్ణతా పత్రాలు ఇవ్వబడతాయి.

ఇది ఉచిత విద్య కాదు. కొద్దో గొప్పో ఫీజులు గట్రాలుంటాయ్. పాఠాలు చెప్పే పంతుళ్ళందరూ వాలంటీర్లే.


* * * * * * * *



ఇంతకూ అంత చదివితే ఏమొస్తుందట అంటే.... మొన్న మా బుడ్డోడు తెలుగు లో తన చేతి వ్రాత తో ఓ ఉత్తరం,పంతుళ్ళయిన నానమ్మకు, తాతయ్యకు రాశాడు. వాళ్ళు ఎన్ని సార్లు దాన్ని చదువుకున్నారో ఎంత మందికి చెప్పుకున్నారో కనుక్కుంటే తెలుస్తుంది.

* * * * * * * *

Wednesday, August 19, 2009

ఏ ఫిల్మ్ బై RGV

* * * * * * * *


అనగనగా ........
ఓ చంద్రుడు లేని రాత్రి
అదే కాళ రాత్రి.....
అమావస్య రాత్రి....

చిమ్మ చీకటి రాత్రి
చీమ చిటుక్కు మనే రాత్రి

కటిక చీకటి
చీకటి....
కటి.....

కట్.....

రెండు కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్.అబగా ఆర్తిగా ఆకలిగా..
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తీక్షణంగా చూస్తూ..

ఆ కాళ్ళు వెనక్కి నక్కాయి.
ఏండుటాకుల మీద అడుగుల చప్పుడు.

అలికిడి..
అలజడి..

వెతుకుతున్నది కళ్ళ బడింది.నిగ నిగ లాడుతూ నవ యవ్వనంతో రాజ కుమారి లా తొలి ప్రేమలో కీర్తి రెడ్డిలా గెంతుతోంది.
ఎంతో కాలం నుండి తను వెతుకుతున్నది తన సొంతం కాబోతోంది.

అంతే ఆ రెండు కళ్ళూ పెద్ద రెండు కళ్ళు అయ్యాయి.
పిడికిలి బిగిసింది.

భూన భోంతరాలు దద్దరిల్లిన చప్పుడు
ఆకాశం లో పెళ పెళ ఉరుముల మెరుపుల డప్పుడు

సముద్రం లోనుండి ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు.
దెయ్యం లా మర్రి చెట్టు ఊడ ఊగటాలు.

గుడ్ల గూబలు అరవటాలు
గబ్బిలాలు ఎగరటాలు

ఒక్క సారిగా లంఘించి.
ఒడిసి పట్టుకుని తన కబంధ...

అంతలో....

జూమ్.... మైనస్
కెమెరా క్రమషడ్భుజాకారం లో తిరిగింది.

జూమ్ జూమ్.. మైనస్ మైనస్
ఈ సారి దీర్ఘ చతురస్రాకారం లో తిరిగింది.

జూమ్ జూమ్ జూమ్.. మైనస్ మైనస్ మైనస్
ఈ సారి వృత్తాకారం లో తిరిగింది.

(ప్రేక్షకుల కోసం: తెలుగు మరచిపోయినోళ్ళు ఈ జూమ్‌ జూమ్‌ నే సింహాసనం సినిమా లో 'ఝుం..ఝుం..ఝుం..ఆకాశం లో ఒక తారా..' అనే పాట అనుకుంటారు. ఇది అది కాదు, మైనస్ లు ఉష్ణోగ్రతలు కాదు. కెమెరా జూమ్ చేస్తే దూరం తగ్గే మైనసులు)

ఇక కెమెరా కే కళ్ళు తిరిగి తిరగలేక ఆ "దృశ్యం" మీద ఆగింది.

పెద్ద మెరుపు.
మెరుపుల జన్మలలో అతి పెద్ద మెరుపు.(గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోది)

ఆ మెరుపు తెలుపులో....స్క్రీన్ మీద తెలుగక్షరాలు

ఇదే
అనాదిగా జరుగుతున్న వికృత క్రీడ
మరో సారి మరో చోట

స్క్రీన్ మీద ఎడమ వైపున క్లిక్ క్లిక్...

A   క్లిక్     క్లిక్     F     క్లిక్     I     క్లిక్     L     క్లిక్     M     క్లిక్
మళ్ళీ ఎడమ వైపుకి..ఒక లైనంతా క్లిక్     క్లిక్     క్లిక్.
రెండో లైనంతా క్లిక్     క్లిక్     క్లిక్.
మూడో లైను పై లైనే
చివరి లైను....

పది క్లిక్కుల తరువాత.. B     క్లిక్     Y         క్లిక్     క్లిక్     R     క్లిక్     G     క్లిక్     V     క్లిక్
3 నిముషాలు స్క్రీన్ మీద అదే.

ఇప్పుడు ఫోకస్ ఆ "దృశ్యం" మీద.
అడవి పిల్లి నవ యవ్వనం లో వున్న చుంచెలుకను తన పంజా తో ఒక్క దెబ్బ వేసి ఒడిసి పట్టుకుని లొట్టలేసుకుంటూ ఆరగించడం మొదలు పెట్టింది.

తరువాత ఒకే క్లిక్కు.

మాకు మేమే సమర్పించు
"అడవారణ్యం"
(గొప్ప సస్పెన్స్, యాన్, స్పైన్, థ్రిల్లర్)


(ప్రేక్షకుల కోసం: యాన్ అచ్చు తప్పు కాదు. ఇది యాక్షన్ సినిమా కాదు యానింగ్ సినిమా. ఈ సినిమా చూస్తుంటే అందరూ నోరు వెళ్ళ బెట్టాల్సిందే. ఆవులించేప్పుడు నోరు వెళ్ళబెడతారు కాబట్టి యాన్ అని పెట్టడం జరిగింది. తెలుగు మరియు ప్రపంచ చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి అద్భుత పద ప్రయోగం. తెలివైన వాళ్ళకు స్పైన్ గురించి వివరించక్కర లేదు. ఈ బ్లాగు చదివే వాళ్ళందరి ఐక్యూ 111 వుంటుంది. నా ఐక్యూ 7. అంతా ఏడు కొండల వాడి దయ.)

ఆ అడవి లోని గుబురు పొదల మధ్యలోని ఇసుక మేటల లోపలినుండి పొడవాటి గడ్డం తో చెతిలో వంకర టింకర కర్ర పట్టుకుని ఒక దృఢకాయుడు బయటికొచ్చాడు. ఆకాశం వంక ఓ సారి చూసి రోడ్డు మీద కొచ్చాడు. ఒంటి మీద ఒక్క ఇసుక రేణువు లేదు. మేటలు వేసిన గడ్డం లో కూడా.

నడుస్తున్న అతని పక్కన ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది నిశ్శబ్దంగా. అంత వరకు కునికి పాట్లు పడుతున్న ఎస్సై అందులో నుండి కిందకు దిగి గడ్డం అతన్ని ప్రశ్నించాడు.

"ఎవడ్రా నువ్వు ఈ రాత్రి ఇక్కడెందుకున్నావ్?"
"......" సమాధానము చెప్ప లేదు.

"రేయ్ నిన్నే రా అడిగేది.నీ పేరేంటి? ఊరేంటి? చెప్పు. "
"కడప"

"సార్. మీది కడపా. క్షమించండి సార్ ఎవరో అనుకున్నా. ప్రమోషన్ కోసం చూస్తున్నా నా పొట్ట కొట్టకండి సార్" అని చేతులు జోడించాడు.
దృఢకాయుడు సీరియెస్ గా ఫేసు పెట్టి "మాది కడప కాదు. నా పేరు కడప"

"ఓస్ పేరా? అనవసరంగా భయపడ్డానే. అలా అయితే ఇంత అర్ధ రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావ్. తిరపతోళ్ళు తిరపతని పేరుపెట్టు కోవడం చూశాను గానీ కడప అని పేరు వినలేదే. కడప పేరేంది?"
"నా పేరు కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీన్. ఇంటి పేరు కమాలుద్దీన్. అసలు పేరు డమాలుద్దీన్. నకిలీ పేరు పకాలుద్దీన్. అందరూ నన్ను కడప అని పిలుస్తారు"

"ఇక్కడేం చేస్తున్నావ్?"
"అదిగో అక్కడ ఆకాశం లో చూశావా? అష్ట గ్రహ కూటమి. ఏం జరుగుతుందో తెలుసా?"

"పెద్ద చెప్పొచ్చావ్ లే. ఇక్కడ ఆల్రెడీ మహా కూటమి ఫెయిలయింది. అక్కడ అష్ట గ్రహ కూటమి ఏం చేస్తుంది?"
"ఎందుకు చెయ్యదురా మూర్ఖా? ఆ అష్ట గ్రహ కూటమి అలా ఫామ్‌ అవడం వల్లే ఈ రిసెషనూ, స్వైన్ ఫ్లూ వచ్చింది."

"ఇంకా నయం కాంగ్రేస్ పార్టీ వచ్చింది అన్లేదు. రేయ్! నీకు ఎగస్ట్రాలెక్కువయ్యాయి బండెక్కు."
"నేను బండెక్కనురా! నిన్నే కొండెక్కిస్తా" అని తన చేతిలోని కర్ర లో వుండే కత్తి తీసి ఎస్సై ని రెండు క్షణాల్లో కసా పిసా పొడిచేశాడు.కత్తికంటిన రక్తాని ఎస్సై బట్టలకు తుడిచేసి రొడ్డు మీద నడవసాగాడు "మేరా జూతా హై జపానీ..ఏ పత్లూ ఇంగ్లీస్థానీ..." ఆని పాట పాడుకుంటూ.

తరువాత రాజ్ కపూర్ పాటలు పదకొండు, షమ్మీ కపూర్ పాటలు మూడు, శివాజీ గణేషన్ డబ్బింగ్ పాటలు రెండు, ఎన్టీయార్ పాటలు ఎనిమిది, వై.ఎస్. పాటలు ముప్పై తొమ్మిది పాడుకుంటూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కొచ్చి అక్కడ పోలీస్ గుర్రాన్ని చూశాడు. ఆ పోలీస్ గుర్రం ఆటో లో కూచుని టిఫిన్ బాక్సు లో ఉప్మా తింటున్న తాకమతి ఉప్మా చేతిని నాకుతోంది. అది తెలీని కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీన్ గుర్రం రోడ్డుకు అడ్డుగా వుందని "హట్..హట్.." అన్నాడు. గుర్రానికి కోపం వచ్చింది.

తాకమతి చేతి ఉప్మా
గుర్రం మూతి మీద ఉప్మా

ఉప్మా చెత్తో తాకమతి
ఉప్మాతో గుర్రం మూతి

గుర్రం తోక మీద ఏమిటి చెప్మా
తోకలో ఉప్మా.. కాదు కాదు కోపం. ఆ కోపం ఆ తోక లో లేకపోయుంటే ఈ టపా రాసే అవసరం వుండేది కాదు.

తాకమతి ఉప్మా చేతిలోని కరంటు గుర్రం తోక ద్వారా కడప చెంపని తాకింది అమెరికా నుండి స్వైన్ ఫ్లూ అలిమేలు మంగాపురానికి వచ్చినట్టు.

సరిగ్గా అదే సమయానికి పానీ పూరీలు అమ్ముకునే వాళ్ళ మధ్య పానీ పూరీ పోటీలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కువ ఎత్తు పానీ పూరీలు పేర్చి, దాన్ని వాళ్ళ తోపుడి బండితో ఎగిరి దూక గలిగితే వాళ్ళే గెలిచినట్లు.

వెండి తెర నల్లగా అయిపోయింది.

(తెర మీద తెలుగక్షరాలు తెలుపు రంగు తెలుగులో. తెలుగక్షరాలు తెలుగులో మరో అద్భుతమైన ప్రయోగం)

కడప ఎస్సైని ఎందుకు చంపాడు. దాని వెనుక వున్న కారణాలేంటి? ఎందుకంత పగ? కడప అసలు పేరు కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీనేనా? అతనికి పునర్జన్మ ఙ్ఞాపకాలేమైనా గుర్తుకు వస్తున్నాయా? తాకమతి నుండి కరంట్ కట్ వున్న సమయం లో కరంట్ ఎలా వచ్చింది? అతను అష్ట వంకర్ దృవ వంశ యోధుడా? అందుకే అతని కర్ర వంకరగా వుందా? తెలుసుకోవాలంటే "అడవారణ్యం - 2" చూడండి.


పాఠకుల కోసం:

ఇది నేను త్వరలో తీయ బోయే సస్పెన్స్, యాన్, స్పైన్, థ్రిల్లర్, క్షుద్దర్, భూతాల్ , ప్రేతాల్, పిశాచాల్, పునర్జన్మల్ టి.వి. సీరియల్ కి సినిమా శాంపిల్. టైటిల్ కి, కంటెంట్ కి సంబంధం లేకుండా అంతా సస్పెన్స్...

RGV అనగా R రాయల్ G గాబ్రియేల్ V విహారి

* * * * * * * *

Monday, August 17, 2009

ఈ వారం సిధ్ద -- బుద్ధ(మగాడు, మగ ధీరుడు)

"అయ్య గారూ...అయ్య గారొ...."
"...."

"అయ్య గారూ...ఎక్కడున్నారు?"
"ఏవిట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు. పొద్దున్నుంచీ కనిపించ లేదు ఎక్కడ చచ్చావ్."

"ష్. గట్టిగా అరవకండి."
"ఏవిటి మగ ధీర సినిమా టికెట్లు గానీ దొరికాయా?.. నెత్తిన ఆ మూటలేంటి?"

"ముందు మీరా తలుపులేసేసి బీరువా దగ్గరకు రండి."
"బీరువా దగ్గరకా? ఏవన్నా లంకె బిందెలు దొరికాయా?"

"లంకె బిందెలు ఎవడిక్కావాలి..ఇవి వాటి కన్నా విలువైనవి. మీరు బీరువా లో వున్న డబ్బు బయటెక్కడన్నా పెట్టి ఈ మూటలు లోపల పెట్టండి."
"ముందా మూటలో ఏముందో చెప్పు. అప్పుడు బీరువా తెరుస్తా."

"అయ్యో .మీకు ఇలా చెబితే అర్థం కాదు. ఎవరన్నా వింటారు కాస్త దగ్గరకు వచ్చి ఆ చెవి ఇలా పడేయండి."
"వార్నీ.. అవా?..ఆ మాట కొంచెం ముందుగా చెప్పొద్దూ..వుండు కిటికీలు కూడా మూసేసి వస్తా. ఇదిగో ఆ బంగారూ,డబ్బూ చావిట్లో పెట్టేసిరా.ఇవి మాత్రం జాగ్రత్త.రేపటి నుండి నువ్వు ఇక్కడే కాపలా పడుకోవాలి. తెలిసిందా?"

"అలాగేనండీ. ష్ ...అమ్మా..అబ్బా.. ఎక్కడెక్కడో వెతికి అంత దూరం నుండి తీసుకుని వచ్చేసరికి భుజాలు పడిపోయాయి. కాస్త మంచి నీళ్ళు ఇస్తారా?"
"మంచి నీళ్ళేం ఖరమ. ఈ రోజంతా నీకు నచ్చిన జ్యూసులు తాగు. ఇప్పుడే తీసుకు వస్తా."

"అవునొరేయ్. ఇవి ఎన్నాళ్ళొస్తాయంటావ్? ..ఇదిగో సపోటా జ్యూస్ తాగు."
"ఇంకో ఆరు నెలలు ఫరవాలేదు మీరు గారెలు, వడలు, మిరప కాయ బజ్జీలు అనకపోతే."

"మిరప కాయ బజ్జీలు తినే భాగ్యం కూడానా? ఆ రోజులే వేరు. అప్పట్లో మిరపకాయ బజ్జీలు ఆపకుండా పది లాగించేసే వాడిని."
"అప్పట్లో వీడియోలు తీసుంటే ఇప్పుడు వాటిని చూసైనా సంతోషించే వాళ్ళు.. ఇప్పుడు ఇలా ధరలు పెరిగిపోవడానికి కారణమెవరు?"

"దేవుడు."
"దేవుడా? ప్రభుత్వం కాదా?"

"మరి పంటలు ఇలా ఎండి పోవడానికి కారణం?"
"దేవుడు."

"అంటే మీరనేది.దేవుడు వై.ఎస్సా?"
"కాదు. అసలు దేవుడే? "

"కాంగ్రేసోళ్ళు.... దేవుడు వాళ్ళ పార్టీలో చేరాడన్నారు కదా? "
"అది తప్పు. కాంగ్రేసే దేవుడి పార్టీలో చేరిపోయింది. అందుకే గెలిచింది.ఇప్పుడు చూడు ఇన్నాళ్ళకు ఊరించి ఊరించి వర్షం పడింది."

"వుండండి మీకు కంది పప్పు పరమాణ్ణం చేసి పెడతా. కంది పప్పు తినక ఇలా అయిపోయారు."

****

"మీరు ఈ మధ్య సాక్షి పత్రిక చూసారా?"
"చూళ్ళేదే! ఏం పేజీలు గానీ తగ్గాయా?"

"రాబడి తగ్గితే గదా పేజీలు తగ్గేది. మొన్న పులివెందుల మీద రివర్స్ గోల్ వేసుకున్నారు.వై ఎస్ మావోడే, జగన్ మా వోడే అని అన్ని చోట్లా రేట్లు పెంచేసుకుంటున్నారట."
"రాజా వారు, యువ రాజా వారు ఏదో పెద్ద ప్లాన్ లో వుండి వుంటారు. అయినా అమెరికన్ సిస్టం లాగా డబ్బున్న పులి వెందుల రాజులందరూ మనీ సర్క్యులేషన్ చేసుకుంటుంటే జనాలకు బాధేందుకో. "

"అది సామాన్య ప్రజానీకానికానికి ఇబ్బంది కాదా? ప్రభుత్యం ధరలు నియంత్రించాలి కదా."
"ప్రభుత్వం నియంత్రించాల్సినవి నియంత్రిస్తుంది."

"ఏంటి డబ్బులు పోనాయి మేమేటి సేత్తాం అన్న మంత్రి గారు తన జిల్లా లో మగధీర సినిమాను నిలిపేసినట్టా?"
"మరి! ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అంటారా? అయిదేళ్ళు అనుభవమయిన తరువాత ఇంకా అలా మాట్లాడ్డానికి ఎంత ధైర్యం.అది సాంపిల్ మాత్రమే.ఎక్కువ మాట్లాడితే స్టేటంతా నిలిపేస్తారు."

"అంత లేదు లెండి. పవన్‌ కళ్యాణ్ తో సినిమా తీయడానికి అలా డ్రామా లాడారు. "
"అందులో విలన్‌ రోల్ ఎవరు చేస్తున్నారు."

"నాకేటి తెలుస్తాది.. సినేమా వచ్చినప్పుడు గానీ తెల్వదు."

****

"అయ్యగారు, చారిత్రాత్మక తప్పిదం అంటే ఏంటి?"
"చిరంజీవి రాజకీయల్లోకి రాకపోయుంటే చారిత్రాత్మక తప్పిదం. దేవేందర్ గౌడ్ తెలుగు దేశాన్ని వదిలి రావడం చారిత్రాత్మక తప్పిదం. కమ్యూనిస్టులు ప్రధాని పదవిని వద్దనటం చారిత్రాత్మక తప్పిదం.ఎల్టీటిఈ రాజీవ్ ను చంపడం చారిత్రాత్మక తప్పిదం."

"చాలు ఇంకొద్దు.అయితే పవన్ కళ్యాణ్ చాలా తెలివైనోడు. "
"అదెలా?"

"ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సొస్తుందని తెలుసేమో. ప్రజా రాజ్యానికి 160 రాకపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్తా నన్నాడు ఎలక్షన్లప్పుడే."
"నాగ బాబు ఇంకా తెలివైనోడు. స్టేట్మెంట్ లేకుండానే గుడ్ బై చెప్పాడు."

"తెలివైన మగాళ్ళు అలానే చేస్తారు."
"తెలివైనోళ్ళు అనొచ్చు గదా అలా మగాళ్ళు అని లింకు పెట్టడం దేనికి."

"ఏవిటో ఒక్క మగాడు సినిమా చూసి ఆ మాట మర్చిపోయినా మన నాయకుల మాటలు చూసి అది తప్పకుండా వాడాల్సిన పదమేమో అని వాడుతున్నా."
"అంత మగ మాటలు మాట్లాడు తున్నదెవరు?"

"ఇంకెవరు రోశయ్య గారు, నన్నపనేని గారు. రోశయ్య గారు 'ముద్దు' ని మగాడివా అన్నారు. నన్నపనేని గారేమో దగ్గుపాటి గారినన్నారు."
"నువ్వు పెద్ద మగాడివి రా."

"నామీదేవో బాణాలు వేస్తున్నట్టున్నారు. "
"నీ మీద బాణాలెయడానికి నేనేమన్నా వైఎస్సా, నువ్వేమన్నా చంద్ర బాబా?రాఖీ పౌర్ణమి రోజున వై.ఎస్. కు రాఖీ కట్టిన వాళ్ళెవరో తెలుసా?"

"ఇంకెవరు చేవెళ్ళ చెల్లెమ్మ సబితమ్మే కదా?"
"ఒక్కరేనా?"

"ఇంకా కొండా సురేఖ, గీతా రెడ్డి కట్టినట్లు వున్నారు."
"వచ్చే రాఖీ పౌర్ణమి కి ఈ లిస్టులో చేరే కొత్త చెల్లెమ్మెవరో చెప్పుకో చూద్దాం? తెలిసీ చెప్పక పోతే నిన్ను అమెరికన్‌ ఏయిర్ లైన్స్ లో అమెరికా పంపిస్తా."

"అంత పని చెయ్యకండి. ఆ టార్చర్ భరించలేను. రాబోయే కాలం లో కాబోయే కొత్త చెల్లెమ్మ మెదక్ మెరుపులమ్మ రాములమ్మ."
"కరక్టుగా చెప్పావు. నువ్వు తెలివైన మగాడివిరా "

"అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్నేస్తా దానికి సమాధానం చెప్పండి చాలు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల సమయానికి ఎంత మంది ప్రజా రాజ్యం పార్టీ లో మిగులుతారు. "
"..."

"సమాధానం చెప్పమంటే అలా బెంచీ మీద లేచి నిలబడి చేతులు పైకెత్తారేంటి. "
"సింబాలిక్ రా మట్టి వెధవా.వెళ్ళి పది అరవ సినిమాలు చూసిరా."

"మీరు గొప్ప మగాడు. అయితే ఆపరేషన్‌ ఆకర్ష్ అంత స్ట్రాంగంటారు. "
"పాపం ప్ర.రా.పా. కి ఎలక్షన్ల ముందున్న ఆకర్ష్ ఇప్పుడు వికర్ష్ అయిపోయింది."

***

"అయ్య గారూ మగధీర చూశారా?"
"అంతగా హైపిన తరువాతా చూడక చస్తామా?"

"అరుంధతి చూశారా?"
"చూసి తరించాం"

"ఈ సినిమాలు చూస్తుంటే మీకు ఎవరు గుర్తొచ్చారు?"
"అరుంధతి చూస్తుంటే శ్యాం ప్రసాద్ రెడ్డి, కోడి రామ కృష్ణ గుర్తొచ్చారు. మగ ధీర చూస్తుంటే రాజ మౌళి గుర్తొచ్చాడు.

"ఈ రెండిట్లో వున్న తేడా ఏంటి?"
"తేడాలేమీ లేవు రెండూ ఒకటే?"

"అదెలా?"
"అరుంధతి లో పిల్ల హీరోయిన్ కోనేట్లో మునిగి లేచిన తరువాత యాక్షన్ మరిచిపోతుంది. ఇందులో హీరో లోయలో పడి పోయిన తరువాత యాక్షన్ మరిచిపోతాడు."

"???"
"నేను కూడా ఆరు ??? ???"

--

Tuesday, February 03, 2009

నా ఆరు పెట్టెలు

* * * * * * * *


ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే రోజు ఏదో ఒకటి వుంటుంది. అదే జీవితాన్ని, కుదరకపోతే శరీరాన్ని మలుపులు తిప్పుతుంది. అమెరికా వచ్చినప్పుడు తెచ్చింది రెండు పెట్టెలు. ఇప్పటికీ ఆ రెండు పెట్టెలను నా "రెండు పెట్టెలు" అని అప్పుడప్పుడూ బయటకి తీసి ఊడిపోయిన నట్లు బిగించి, సంక్రాంతి అప్పుడు ఎద్దు కొమ్ములకు రంగులేసినట్టు రంగులేసి ఆరబెట్టి మళ్ళీ ప్లాస్టిక్ సంచుల్లో దూర్చేస్తా. అలా నా రెండు పెట్టెలు కాస్త నా ఆరు పెట్టెలు అనే 'ఓ రోజు' వస్తుందని అనుకోలేదు. అలా 'ఓ రోజు' రావడానికి స్పూర్తి నిచ్చిన చాలా 'ఓ రోజ'లు లో ఒక రోజు.

ప్రపంచమంతా(అమెరికా లో తెలుగోళ్ళు) ఒబామాలో చిరంజీవిని చూసుకుంటున్న రోజులవి. అంధ్రాలో(అమెరికా వెళ్ళాలనుకుంటున్న తెలుగోళ్ళు) అంతా చిరంజీవిలో ఒబామాను చూసుకుంటున్న రోజులు.




వేస్తే ....

ఏడున్నర కోట్ల తెలుగు జీ(వచ్చ)వాలకు ఇంకోటి కలిపి తలకు హెల్మెట్ లేకుండా జెమినీ "జాణవులే నెరజాణవులే" చూస్తున్నా. టి.వి చూడకుండా అన్నమన్నా తినాలి లేదా అన్నం తినకుండా టి.వి. అన్నా చూడాలి. టి.వి. చూస్తూ ప్లేటు వైపు చూడకుండా అన్నాన్ని ముక్కు మీదకు, మీసాలమీదకు ట్రాన్‌స్ఫర్ అవకుండా నేరుగా నోట్లో లోడ్ చేసే కళను జెమిని సీరియల్స్ చూసే నేర్చుకున్నా. మా ఆవిడ చేసిన చింతాకు పులగూర తింటూ "నువ్వు చేసిన చింత చిగురు కొంచెం ముదురోయ్ " అన్నానో లేదో తెర మీద దేశ ముదురు అడ్వర్టైజ్మెంట్.

అల్లు అర్జున్ చాలా బీదబ్బాయి.

పాపం..ఒంటి మీద చొక్కా లేదు. పాంటు కూడా శ్రీ420 లో రాజ్ కపూర్ వాడిన పాంటు.

తలకు తైలం లేదు.

రాసుకోవాల్సిన నూనె వొంటికి రాసుకొని వాతమొచ్చినోడిలా తల అటు వైపెక్కడో పెట్టాడు. కెమరా రెండు మూడు సార్లు పొట్టలోకి, జబ్బల్లోకి వెళ్ళొచ్చిన తరువాత అర్థమయింది రెండు సార్లు మిస్టర్ యూనివర్స్ అయిన ప్రేమ్‌ చంద్ డోగ్రా లా తయారయ్యాడని.

అది చూసి పెద్ద బుడ్డోడు "నాన్నా! పాపం అంకుల్ కి నూనె రాసుకోడానికి చేతులు అందక ఒంటికి రాసుకున్నట్టున్నాడు. బాడీ అంతా బంక మన్ను పూసిన మర్రి చెట్టయిపోయింది..యాక్ " అన్నాడు.
"చా. అది కాదురా ఒళ్ళు అలా పురులు తిరిగితే పురుల వీరుడు అని పిలుస్తారు.వాటిని చూపిస్తే కురులున్న సొగసరి అమ్మాయిలు కళ్ళు తిరిగి వెంట పడతారు. దాన్నే ఆరు పెట్టెలు అంటారు. నువ్వు బాగా తింటే అలా ఒళ్ళు పెంచొచ్చు. అప్పుడు 'హీ బాయ్' అని అందరూ నీ చుట్టూ తిరుగుతారు. గాబ్రియేలాకి నువ్వు చాక్లెట్ ఇస్తే డేవిడ్ గాడికి హ్యాప్పీ వాలెంటైన్‌ డే చెప్పింది కదా. అలా కాకుండా డేవిడ్ గాడు చాక్ లెట్ ఇస్తే తెచ్చి నీకు ఇస్తుంది." అన్నా.

వాడు కళ్ళు స్కైల్యాబంత చేసుకోని "అలా అవాలంటే ఏమేమి తినాలి?"
"గుమ్మడి కాయలు, కాకరకాయలు, వేప కాయలు, కుంకుడు కాయలు,శీకాయలు ...."

"సరే. తింటా కానీ అన్ని కూరగాయలు కొంటానికి నీ దగ్గర డబ్బుల్లేవన్నావ్ కదా.అన్ని కొనాలంటే రాత్రిళ్ళు మెక్ డోనాల్డ్స్ లో పనిచెయ్యాలన్నావు కదా. తాత ఇచ్చిన డబ్బుల్తో ఇవన్నీ కొని నువ్వెప్పుడైనా ఈ ఆరు పెట్టెలు తయారు చేశావా?" అన్నాడు.

అప్పుడే ఉదయభాను "జాణవులే నెరజాణవులే" అనగానే గొంతునొక్కేసా.

ఫ్ల్యాషు బ్యాకులో కెళ్ళి పోదామని గొంతు సవరించుకున్నా.

మా ఆవిడ."అయ్యో నేను బట్టలు మడత పెట్టడం మరిచి పోయా. మిద్దె పైకెళ్ళి అక్కడే టి.వి. చూస్తూ మడత పెట్టుకుంటా" అని వెళ్ళి పోయింది.

చిన్న బుడ్డోడు చాలా 'ఖండ' ముదురు. "అమ్మోయ్! నేనూ పైకొత్తా...బత్తలు మలత బెత్తా.." అని మెట్లు ఎక్కకుండా ఎగిరి వెళ్ళి పోయాడు.

మిద్దె పైన:

"ఎందుకురా వచ్చేశావు.నాన్న ఏదో చెబుతున్నాడుగా"
"అమ్మో నా వల్ల కాదే!. నా బుజ్జి సళీళాన్ని నాన ఫ్ల్యాషు 'బాకుల్తో' చంపేత్తాలు"

"మా నాయినే నీకు రెండేళ్ళకే ఇన్ని తెలివి తేటలు వచ్చేశాయిరా.నాకు చూడు ఇన్నేళ్ళొచ్చినా బల్బు వెలగదు."

మిద్దె కింద:

అడిగిన పెద్ద బుడ్డోడిని వళ్ళోకి తీసుకుని.

"నన్ను కాలేజీ రోజుల్లో సిల్వస్టర్ స్టాలిన్ అనే వాళ్ళు నాకున్న ఆరు పెట్టెలు చూసి."
"అవును, నువ్వు అప్పుడు రోజూ లీటరు పచ్చి పాలు తాగి, రెండు గుడ్లు తిని తిఫిన్ చేసే వాడివి."

"అరే భలే కనిపెట్టేశావే నీకు భలే జ్ఞాపక శక్తి వుందే.."
"అవును మరీ! నేను అమ్మ బొజ్జలో వున్నప్పుడు కూడా ఈ కథలే చెప్పేవాడివి..పాపం అమ్మ..."

"పాపం అమ్మ కాదు. అలా కండలు పెంచక పోవడం పాపం. నువ్వు సిల్వెస్టర్ స్టాలిన్ సినిమాలు చూశావు కదా"
"ఎవరు?"

"అదే రా. ర్యాంబో, ఫస్ట్ బ్లడ్ సినిమాలు."
"నేను చూళ్ళేదు."

"మొన్న టి.వి. లో వచ్చింది కదా టాంగో అండ్ క్యాష్ అందులో వున్నాడు కదా'
"ఓ దట్ ఓల్డ్ మ్యాన్?"

ఓల్డ్ మ్యాన్?.... పీకేసిన ఫ్యూజులకు కొత్త రాగి వైరు తిరిగి పెట్టి.

"ఇప్పుడు ఓల్డు కానీ అప్పుడు చాలా యంగ్ రా. ఆ బాణాలు..అవీ.. భుజమ్మీద పెట్టుకొని..నన్‌ చాకు గాల్లో తిప్పుతుంటే...నా సామి రంగా.."
"నాన్నా నువ్వు అలా నన్‌చాకు తో ఎవరినన్నా కొట్టావా?

"ఆ కొట్టాను?
"ఏమైంది."

"పగిలింది"
"అంటే అశోక్ సినిమాలో ఎన్టీఆర్ కొట్టినట్లు ఎవరి నెత్తి మీద నైనా కొట్టి బద్దలు చేశావా?"

"బద్దలైంది బుర్ర కాదు. నూనె సీసా. రూములో పెరుగు కోసం పెట్టుకున్న పాలు ఓ పిల్లొచ్చి తాగేస్తుండేది. ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి పోయింది. దాని సంగతి చాడాలని నన్ చాక్ దానిమీద ప్రయోగించా. అది దానికి తగలకుండా నూనె సీసా కి తగిలి పగిలింది. మూడు స్పూన్ల నూనె వేస్టవడానికి నేనే కారణమని నా చేత మూడు లీటర్ల నూనె కొనిపించారు.నా రూమ్మేట్ దొంగ నాయాళ్ళు."
"బాగా శాస్తి జరిగింది. నేను ఎక్స్ బాక్సడిగితే నింటెండో కొనిస్తావా?..."

"సిక్సు ప్యాక్ గురించి మాట్లాడుతుంటే ఎక్సు బాక్సంటావేంది రా.."
"అల్పుడెపుడు బలుకు నాడంబరముగాను పద్యం మొన్న క్లాసులో చెప్పావు గదా అది నేర్చుకోవాలి.నే వెళతా.."

ఛా... ఇంతున్న ఈ బుడ్డోడే సెటైరెయ్యడం మొదలు పెట్టాడు. ఇక తప్పదు సమయం వచ్చేసింది...వచ్చేసింది..

అప్పుడే ఎవరూ ఊహించనిది జరిగిపోయింది.

ప్రపంచంలోని యురేనియం...థోరియం...ప్లూటోనియం...ఇండాలియం అన్నీ ఒక్క చోట కలిశాయి........
ఎలక్ట్రాన్లు...న్యూట్రాన్లు...ప్రోటాన్లు...పవన్‌ కళ్యాన్లు...అన్నీ ఒక్క సారిగా ఒక దానికొకదానికి గుద్దుకున్నాయి.
ఆల్ఫా రేస్...బీటా రేస్...గామా రేస్...ఒబామా రేస్...అన్నీ ఒక్కసారిగా ఉద్భవించాయి.............

అంతా గాఢాంధకారం.....అంత లో ఓ చిన్న వెలుగు. ఆ వెలుగు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళి పోయింది.
మళ్ళీ అంధకారం........అక్కడ ఎవరెడే బ్యాటరీ లైటేస్తే...

రేలంగి ముందు మాట తో మొదలై రమణా రెడ్డి రాసిన "కండలు పెంచడం ఎలా?" అన్న పుస్తకం చదువుతూ నేను.
పక్కన ఇంకా "బండ లాంటి కండలేలా పెంచాలి","పురులు తిరిగే కండల కోసం", "దేహ దారుఢ్య వడ్డన", "కండ కండ మధ్య గుండె", "బై బై బక్క బర్రెలు..", " సిరులొలికించే పురులకోసం" లాంటి పుస్తకాలెన్నో....

* * * * * * * *


భారతీయుడన్న వాడెవడైనా సరే కండలు పెంచాలంటే ముందు వాడాల్సింది జీవన్ టోన్. భారతీయురాలెవ్వరైనా సరే అందంగా కనపడాలి అంటే లక్సు సోపు వాడాల్సిందే. జీవన్ టోన్ గుర్తుకు రాకపోతే వాడు మొగాడే కాదు. గుర్తుకు రావడం ఆలస్యం ఈ ఎకానమీలో మంచి డిస్కౌంటుకు నూరు డబ్బాలు కొనేసి నా మనవళ్ళకు కూడా కొని దాచి పెడదామని నంబరు సంపాదించి వాళ్ళకు ఫోన్ చేశా.

"హలో జీవన్ టోన్ ఆఫీసా?"
"అవున్రా...చెప్పు ఏం కావాలి"

చా.. ఇంత బతుకు బతికి వీడెవడో సన్నాసి గాడి దగ్గిర మాటలనిపించుకోవాలా. బాగా కండలు పెంచిన తరువాత వీడి దగ్గరి కెళ్ళి వుతికి పారెయ్యాలి అని నిర్ణయించుకొని ఫోను పెట్టేశా. భారత్ లో ఆడవాళ్ళకు కాస్తో కూస్తో విలువిస్తూ గిఫ్టులు కూడా కొనిపెడితున్నారు గదా ఎలాగైనా గొంతు మార్చి మాట్లాడదాం అని అద్దం ముందుకెళ్ళి నిలుచున్నా. ఏది చేసినా నిష్టగా ఇన్వాల్వ్ అయి చెయ్యమని మా బాస్ బురఖేష్ చెప్పాడు. ఆందుకనే అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకొని బుగ్గల మీద నొక్కుని జగదేవక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి లా కాళ్ళు మిటకరిస్తూ "మానవా...వామ హస్తాన్నీయవా.." అనే డైలాగు భారీగా ప్రాక్టీసు చేసి కాన్ఫిడెన్సు వచ్చాకా ఫోను తీసుకుని మళ్ళీ జీవన్ టోన్ ఆఫీసుకు ఫోను చేశా.

"మానవా... " నాలుక్కరుచుకుని. కాలి బొటన వేలితో గుండ్రాలు వేస్తూ శ్రావ్యంగా .."హలో..జీవన్ టోన్ ఆఫీసాండీ.."
"అవునుమ్మె... సోది లేకుందా విషయం చెప్పుమ్మే.."

హా.. హృదయ కవాటాన్ని తెరిచి సిరల్ల్లో ఎక్కడో దూది మొనతో సుర సుర పొడిచినట్లయింది.(దూది మొనే అచ్చు తప్పు కాదు). ఒకానొక జనవరి ఒకటిన స్వర్ణ ముఖి నది నీళ్ళలో ఉత్కంఠగా జరుగుతున్న 'ఆల్ ఆంధ్రా పెంకుల బంపుల చాంపియన్‌' పోటీలో ఎక్కువ బంపులు వీరుడిగా అవార్డు వచ్చే టైములో నా కాన్‌సంట్రేషన్‌ దెబ్బతియ్యటానికి న్యూట్రిన్ చాకలెట్ చేతిలో పెట్టి న్యూ ఇయర్ విషస్ బదులు 'ఐ లవ్ యూ' అని లటాషా చెప్పినప్పుడు కూడా బాధపడలేదు. (మా ఆవిడ చూస్తుందేమోనని లటాషా అని పేరు మార్చడమైనది. అసలు పేరు నీరోషా. ఇంకో విషయం. అందమైన ఆడవాళ్ళు బ్రాకట్లలలో వున్నది చదవరు. ఏవరైనా చదివేసి అందమైన వాళ్ళు కాదని ఫీలయితే నాది బాధ్యత కాదు). సరే గుండెను టెర్రరిస్టు చేసుకొని మళ్ళీ డయల్ చేసి ఇంగ్లీషులో అమెరికను యాక్సెంట్ లో మాట్లాడా.

"హె...వాస్సప్..డ్యూడ్.. ఈజ్ దిస్ జీవ టో..?"
"ఒరేయ్ విహారిగా ఫోను పెట్టరా. ముందు కాలర్ ఐడీలో పేరు రాకుండా ఎలా చెయ్యలో తెలుకోరా"

గుడ్ల నుండి ఉబికి వస్తున్న నీళ్ళను గ్లాసులో పోసుకొని ఎర్ర మార్కర్ తీసుకొని గ్లాసు మీద 'ఆనంద భాష్పాలు' అని రాశా. అయిపోయింది అంతా అయిపోయింది అమెరికా ఫుట్ బాల్ ఆట రాకపోయినా అమెరికన్ తెలివితేటలొచ్చేశాయి. ఇక సిటిజెన్‌షిప్ తీసుకోవాల్సిన తరుణమిదే.

లిస్టులో నుండి జీవన్‌ టోన్ పేరు కొట్టేసి తరువాతి నంబరుకు ఫోను చేశా మామూలుగానే.

"హలో డాబర్ వారి చ్యవన్ ప్రాశాండి?"
"అవునండీ షుబోదయం షుష్వాగతం... మీక్ ఏం కావాలి"

"మాకు ఉదయమని మీకెలా తె్లుసు?"
"మాద్ నడుము సమయం. మీద్ కొండ సమయం. అదే మాద్ సెంట్రల్ టై జోన్."

"నేను ఫోను చేసింది ఇండియాకు కదా. అక్కడ నడుము సమయం అదే సెంట్రల్ టై జోన్ ఎక్కడుంది?.ఇప్పుడు ఉదర సమయం, పాద సమయం అని టైమ్‌ జోన్లు పెట్టేరా?"
"ఓహ్ మీర్ వార్తల్ సరిగ్గా సదువుతున్నటు లేదు. ఇప్పుడు ఇండియెన్‌ ప్రాడక్టు కస్టమర్ సపోర్టు, సేల్స్ అణ్ణీ అమెరికా నుండే. ఇక్కడే చీప్ గా దొరుకుతున్నారు."

"అంటే.."
"ఇన్ సోర్సింగ్"

"మీకు జీతం కింద డబ్బులు బాగా వస్తున్నాయన్న మాట."
"నెలకు ముప్పై బాక్సులు చ్యవన్‌ ప్రాశ ఇస్తారు..వాటిని ఇక్కడ అమెరికాలో మీలాంటోళ్ళకు బ్లాక్ లో అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నాం"

"అయితే చ్వవన్‌ ప్రాశ్ నాకొద్దు."
"సార్..సార్.."

ఫోన్ పెట్టేశా.

లిస్టులో మూడో పేరు వీకో వజ్ర దేహ కు ఫోను చెయ్యకుండానే పేరు కొట్టేశా ఎలాగైనా ప్రకృతి వైద్యం తో సొంతంగానే కండలు పెంచాలని నిర్ణయానికొచ్చి కళ్ళు మూసుకున్నా. మూడు 'సుత్తి'లు గాల్లో ఎగురుకుంటూ వచ్చి నా బుర్రకాయ్ మీద మూడు దెబ్బలు వేసాయి. మూడు పేర్లు గుర్తుకు వచ్చాయి. మొదటి దెబ్బకు మంతెన సత్యనారాయణ రాజు గుర్తుకొచ్చాడు. రెండో దెబ్బ.. మూడో దెబ్బ.. మొదటి దానికి డూప్ లు.

* * * * * * * *


వున్నట్టుండి సత్యనారాయణ రాజు గారి పుస్తకాలు, వీడియోలు దొరకవు కదా. అందుకనే సతీమణి నడిగా "నేను కాలేజీలో వున్నప్పటి లాగా ఆరు పెట్టెలు పెంచాలనుకుంటున్నాను. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ల లాగా స్టెరాయిడ్లు వాడకుండా ప్రకృతి వైద్యం తో పెంచాలనుకుంటున్నా. దానికి నీ సహకారం కావాలి" అని అడిగా.
"దానికేం భాగ్యం తప్పకుండా" అని టి.వి. రీమోట్ చేతికిచ్చి "నా సహకారాన్నందిచేశా. ఇక నన్నేమీ అడక్కండి."

"అలాగంటే ఎలా చెప్పు.?"
"అదే మరి ఒళ్ళు మండుద్ది. రీమోట్ ఇచ్చింది డి.వి.ఆర్.(డిజిటల్ వీడియో రికార్డర్) లో రికార్డయిన మంతెన సత్యనారాయణ 'మీ ఆరోగ్యం మీ చేతిలో' ప్రోగ్రాం చూసుకోమని"

తప్పు లెప్పుడైనా చెయ్యొచ్చు. సతీమణి దగ్గర, ప్రియురాలి దగ్గర చెయ్యకూడదు. చేసినా చేసినట్టు కనిపించకూడదు. లేకపోతే ఋతురాగాలు ముదిరి రాధ మధు అయినట్టు విషయం చాలా దూరం పోతుంది. ఇది మా బాస్ బురఖేష్ చెప్పిన ఫిలాసఫీ.

"థ్యాంక్యూ సో మచ్. యువ్ ఆర్ సో ఆసం" అని చెప్పా. ఏదన్నా అర్థం కాకపోతే 'ఆసం' అనే పదాన్ని ఎప్పుడన్నా వాడచ్చు. పేకాటలో జోకర్ లాంటి ఈ పదం ఎప్పుడూ మరిచి పోకూడదని మా బాస్..(ఇప్పటికే మా బాస్ పేరు అర్థమయిపోయుండాలి..)చెప్పాడు.

ఇలాంటి మరి కొన్ని పదాలు...మారెప్ప, ఒక్క మగాడు.

* * * * * * * *


రెండు రోజులు ఆఫీసుకు లీవు పెట్టి తలుపుకు గడియ పెట్టి పక్కన పెన్నూ పేపరూ పెట్టుకొని మంతెన సత్యనారాయణ వీడియోలన్నీ చూసేసి ముఖ్యమైన పాయింట్లన్నీ పేపర్ లో నోట్ చేసుకోని తెలుగోళ్ళు పెట్టిన ఇండియన్‌ స్టోర్సు కెళ్ళి లిస్టు చూపించి అవున్నాయేమో చెప్పమని అడిగా. అది చూసిన ఆయన బాత్రూములో కెళ్ళాడు.ఏదో సౌండొస్తోంది కానీ ఏమీ వినపడలేదు. అయిదు నిమిషాల తరువాత బయటకు వచ్చాడు.

తరువాత లిస్టు చూసి "మా దగ్గర లేవు సార్" అన్నాడు. ఈ సారి రెండో లిస్టు చూపించా.. దాన్ని పట్టుకోని మళ్ళీ బాత్రూములో కెళ్ళి పోయాడు. డౌటొచ్చి దగ్గర కెళ్ళా. తలుపులేసుకొని తనలో తనే నవ్వుకుంటున్నాడు. కాసేపటికి బయటికొచ్చాడు. నేను పరుగెత్తుకొని కౌంటర్ దగ్గరరకెళ్ళా.

"ఈ లిస్టులోవి ఇక్కడ దొరకవు సార్."
"సరే ఈ లిస్టు చూడండి.."

అది కూడా పట్టుకొని పరిగెత్తుకుంటూ బాత్రూములో కెళ్ళి పోయాడు. ఇదేదో వ్యవహారం చూద్దామని బాత్రూమ్‌ కిటికీ దగ్గరకెళ్ళి లోపలకు చూశా..

నేనిచ్చిన లిస్టు చూసి "వార్నీ వీడికెవరిచ్చారా వీసా?.. గుల్ మొహర్ బెరడు..హా..హ్హ ..బోగన్‌ విల్లియా కాండము.....అబ్బో..అబ్బో.. " అని కింద పడి దొర్లుతున్నాడు.."వేప గింజల గుజ్జు.. వెలక్కాయ వెలుపలి పొట్టు...బ్లాక్ అండ్ వైట్ పచ్చి గడ్డి...." అని పొట్ట పట్టుకొని నొప్పి తగ్గాక బయటికి వచ్చాడు.

"ఇవి కూడా మా దగ్గర లేవు సార్.." అని కస్టమర్ ఎక్కడ రాకుండా పోతాడో అని బయటకు నవ్వకుండా నవ్వును ఆపుతున్నాడు.
అప్పటికప్పుడు స్టెరాయిడ్సు తీసుకొని కండలు పెంచి గాడ్జిల్లా కారు ని తిప్పినట్లు వాడిని గాల్లో గిర గిరా తిప్పి బయటకు విసిరి వేయాలనిపించింది.

ఇంకో లిస్టు ఇచ్చి "ఇవున్నాయమో చూడండి"
లిస్టు చూడకుండా బాత్రూమ్‌ వైపు వెళ్ళబోతుంటే కాలర్ పట్టుకొని ఆపి. "దీనికి బాత్రూములో కెళ్ళక్కర లేదు.ఇది మా ఆవిడిచ్చింది."

అప్పుడు లిస్టు చూసి "ఓహ్.. అప్పడాలు, బిర్యానీ మషాలాలా?..ఇదిగో ఇక్కడున్నాయి." చూపించాడు.
అన్నీ తీసుకోని డబ్బు కట్టేసి రాబోతుంటే..

"సార్.. మీరు మొదటిచ్చిన మూడు లిస్టులు ఎక్కడినుండి తెచ్చారో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది సార్. కాస్త చెబుతారా?"
"మీకు మా టి.వి. వస్తుందా?"

"లేదు సార్."
" అయితే ఈ లింకుకెళ్ళి డిష్షు పెట్టుకోని మా టి.వి. తీసుకో...వస్తా.."

ఈ మంతెన తో పెట్టుకుంటే మన వంతెన విరిగి పోతుందని ఆ లిస్టు అక్కడే చించేసి రెడీమేడ్ గా ఏవన్నా దొరుకుతాయేమో కనుక్కుందామని అమీర్ ఖాన్‌ కి ఫోను చేశా..

"హలో అమీర్ ఖానా?"
"నో గజిని.."

"యా..ఐ నో గజిని. అమీర్ ఖాన్‌ హైనా?"
".. నామ్‌ గజిని."

"రామ్‌ నామ్‌ సత్య్ హై...అమీర్ ఖాన్‌ హే..?"
"హమ్‌ గజని హై.."

"నయ్ ..రామ్‌ నామ్‌ సత్య్ హై.."
"గజని హై.."

"ఓకే.... ఆప్కో బ్లాగ్ హే.."
"హై.. షారూఖ్ ఖాన్‌ కుత్తే బీ హై.."

"అమీర్ ఖాన్‌ హై..?"
"నో గజిని.."

"యువ్ గజని. ఐ యాం రజని. ఏక్ బార్ బోల్ తో సౌ బార్ బోల్ నట్లే. కీప్ ద ఫోన్‌ డౌన్‌ " అని వేలును గాల్లో పెట్టి నేను గిర గిర తిరిగా. ఫోను కింద పడి పగిలింది.మా ఆవిడకు తెలియకుండా కొత్త ఫోను తీసుకొచ్చి పెట్టేశా.

అన్ని తీరాలను దరిచేర్చే గూగులమ్మ కు మొర పెట్టుకుంటే బాడీబిల్డింగ్ డాట్ కామ్‌ లింకిచ్చింది. అక్కడికెళ్ళి కండరాల శక్తికి మూడు బాక్సులు, నరాల శక్తి మూడు బాక్సులు, గోళ్ళ శక్తికి 11 బాక్సులు, వెంట్రుకల శక్తికి 147 బాక్సులు ఆర్డర్ చేశా. అన్ని పెట్టెల తో పాటు సాక్షి న్యూస్ పేపర్ పరిచినంత వైశాల్యంతో ఒక పెద్ద పుస్తకం కూడా వచ్చింది. అందులోని ఫోటోలలో సొట్టలున్న ప్రతి బాడీ బిల్డర్ మీద చేతులేసుకొని సొట్టలు పోతూ ఒక అందమైన అమ్మాయి వుంది. ఆ బొమ్మ కింద చిన్న అక్షరాలతో : పెళ్ళి కాని వారికి మాత్రమే. పెళ్ళయిన వాళ్ళకు దీని ప్రతులు పంపబడవు. వారికి ఒక వేళ అలా వచ్చినట్లతే వెనక్కి తిరిగి పంపండి అని. నేను తిరిగి పంపలేదు.

ఆ పుస్తకం లో వాళ్ళు పంపిన మందులతో పాటు వాళ్ళు చెప్పినట్లు శరీర వ్యాయామం చెయ్యాలిట. లేక పోతే మందులు పనిచెయ్యవు అని చెప్పారు. సరే అని రెక్ సెంటర్ కు(జిమ్ము) వెళ్ళాలని తీర్మానించా.

రెక్ సెంటర్ అంటే రిక్రియేషన్ సెంటర్. దీన్లో ఈత కొట్టుకోవడం, వాత పెట్టుకోడం, కాళ్ళు విరగ్గొట్టుకోడం (టెన్నిస్ ఆడి)లాంటి సదుపాయాలన్నీ వుంటాయి. కాక పోతే కొన్ని ఫీజులు కూడా వుంటాయి. ఇల్లు కొన్నప్పుడు బడితె పూజ అయిపోయిందనుకుంటే నెలకో సారి గోడ కుర్చీ వేయించే పనిష్మెంట్లే ఈ రెక్ సెంటర్ ఫీజులు. ఇక్కడికి వెళ్ళినా వెళ్ళక పోయినా నెలకు యభయ్యో వందో చదివించుకోవాలి.

* * * * * * * *


జిమ్ము కెళ్ళాలంటే కొన్ని గెటప్పులుంటాయి. అవి లేకుండా వెళితే ఎడారిలో ఎస్కిమోను చూసినట్లు చూస్తారు. నైకీ షాపు కెళ్ళి షూసు, రీబాక్ కు వెళ్ళి రీబాక్ అనే పెద్ద లోగో అన్ని వైపుల నుడి కనిపించేలా వున్న జాగింగ్ పాంటు, మ్యాచింగు చొక్కా, ఆదిదాస్ కెళ్ళి రిస్టు బ్యాండు, ఆపిల్ స్టోరు కెళ్ళి ఐపాడు కొనుక్కొని జిమ్ముకెళ్ళా. ఇవేవీ లేకుండా జిమ్ము కెళితే వాడు జిమ్మరే కాదు.

ఐపాడ్ లో "అయ్యో పాడూ..నువ్వు నాకు తోడా..చీ పాడు.." అనే పాటకు అనుగుణంగా వీపు మీద గోక్కుంటూ డ్యాన్సు చేసుకుంటూ లోపలికి అడుగు పెట్టా. లోపల ఇసుక వేస్తే రాలనంత జనం. మా బుడ్డోళ్ళకు ఈత నేర్పేటప్పుడెప్పుడూ అంత జనం చూళ్ళేదు.

ఎక్కడ చూసినా ఏతాము తొక్కే వాళ్ళు (స్టెప్స్), కపిల తోలే వాళ్ళు (తాడు తో బరువులు లాగే వాళ్ళు),దొంగ కోళ్ళు పట్టే వాళ్ళు (పెద్ద బాలును పొట్ట కింద పెట్టుకొని అటూ ఇటూ ఊగే వాళ్ళు) కనిపించారు.

అమెరికాలో అవ్యయాలు బాగా వాడాలి. (ఓయీ...ఓరీ...ఓసీ...ఒసేయ్ లటాషా లాంటివన్నీ అవ్యయాలు అని పిలవబడతాయి.). అవకాశాలు మిథ్య అని తెలిసి ఈ మధ్యనే అమెరికా వచ్చిన వాళ్ళెవరైనా వుంటే వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాల్సినవి. ఆఫీసులో ఎవడైనా మౌసు తో గానీ మానిటర్ తో గానీ నెత్తిన బాదితే వెంటనే "ఒరేయ్ నీ యామ్మ..." అని బూతులంకించుకోకూడదు.
"వావ్..ఊ.. యువ్ హ్యావ్ అల్మొస్ట్ కిల్డ్ మీ మ్యాన్." అని అనాలి. అప్పుడే అమెరికన్లతో కలిసిపోయినట్టు. లేకపోతే గ్రీను కార్డు రాదు.

రెక్ సెంటర్ లోపలికెళ్ళగానే ..
"వావ్. వాటే క్రౌడ్ మ్యాన్ .." అని నేను ఓ నోరేశా పక్కన భారీ కాయంతో అపసోపాలు పడుతున్న కల్పనా రాయ్ లా వున్న ఒకావిడతో
"ఊ.. వాట్ ద హెక్...ఐ నోటీస్డ్. ఐ కేం లాస్ట్ వీక్ టూ. టు డేస్ క్రౌడ్ ఈజ్ అమేజింగ్."

"వావ్.. సో మెనీ న్యూ ఇయర్ రెసొల్యూషన్స్ ఐ థింక్..దట్స్ వండర్ఫుల్..థిస్ ఈజ్ వండర్ఫుల్. యువర్ అబ్సర్వేషన్ ఈజ్ వండర్ఫుల్... యువ్ ఆర్ ఆసం.." అంతలో అమ్మాయి మహేష్ బాబు లా వున్న బాయ్ ఫ్రెండు దగ్గరకు వెళ్ళిపోయింది.

జిమ్ములో కోడి రామ్మూర్తి లు వున్న చోటుకు వెళ్ళి డంబెల్స్ ఎత్తడం మొదలు పెట్టా. ఎన్ని ఎత్తానో, ఎన్ని సార్లు ఎత్తానో గుర్తులేదు. భారత్ లో నేను వెళ్ళిన హనుమాన్‌ వ్యాయామ శాలను, నేను వాడిను బుల్ వర్కర్ ను గుర్తుకు తెచ్చుకొని అక్కడ వున్న అన్ని బరువులు(1267 గ్రాములు) ఎత్తేశా. అలా క్రమం తప్పకుండా రోజుకో గ్రాము ఎక్కువ ఎత్తుతూ కండలు పెంచడం మొదలు పెట్టా. (విజిట్ కు విజిట్ కు మధ్య సంవత్సరం విరామ మిచ్చే అవకాశమున్నా పది రోజులు మాత్రమే విరామ మిస్తూ)

* * * * * * * *



కండెలా పెరిగాయో అందరికీ చూపించక పోతే కండల జన్మ వృధా అయిపోతుంది. ప్రజలకు చూపించడానికి, వార్నర్ బ్రదర్సు, బర్నర్ అరవిందూ నాకు తెలీరు. కనీసం ఆఫీసులో చూపించచ్చు కదా అని ఘర్షణ సినిమాలో వెంకటేష్ వేసుకున్నట్లు పొట్టి చొక్కా వేసుకొని ఆఫీసుకెళ్ళా. ఫ్రంటు డెస్కు దగ్గరున్న సోఫియా చూసి ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తుందేమోనని బ్యాడ్జి కోసం వెతుకుతున్నట్లు జేబులో చెయ్యి పెట్టి వెతుకుతూ నిలబడ్డా. నా వెనకల వచ్చిన రమణా రెడ్డి కి హాయ్ చెప్పింది కాని నాకు చెప్పలేదు. సరేలే చూళ్ళేదు కాబోలు అనుకుని నా డెస్కు దగ్గర్కు వెళ్ళా. కాసేపు పని చేసి పనుంటే పక్క డెస్కు భటాష దగ్గరకు వెళ్ళా(పేరు మార్చడమైంది. అసలు పేరు బీరోషా. బీరోషా అంటే బీరు ప్లస్ షా కాదు. రణబీర్ వంశానికి చెందినది కాబట్టి బీరోషా అని పేరు పెట్టుకుంది).

"ఏమిటి మీ ఆవిడకు చొక్కా గుండీలు కుట్టడం రాదా?"
అప్పుడు గుర్తొచ్చింది కండలు కనిపించాలని నేను గుండీలు పెట్టుకోలేదని.

"ఓహ్ సారీ.." అని డెస్కు దగ్గరకొచ్చేశా.

భటాషాది చాదస్తపు కుటుంబం. ఇంట్లో మొగుడి చొక్కా గుండీలు తనే కుడుతుంది, వంట తనే చేస్తుంది. మొగుడి తల దువ్వుతుంది. పిల్లలను తనే స్కూల్లో వదిలి వస్తుంది.ఇడ్లీ పిండి తనే రుబ్బుకుంటుంది. ఈవిడని అందుకే దేశీ ఆడవాళ్ళు దూరంగా పెడతారు తమ మొగుళ్ళు ఎక్కడ పాడయిపోతారో అని.

అందుకనే ఆవిడను ఏ ఫంక్షన్లకు పిలవరు. ఊళ్ళో వున్న గూగుల్ గ్రూపుల పేర్లన్నీ నాన్-భటాష లలిత సహస్ర నామ గ్రూపు, నాన్-భటాషా సాయి బాబా గ్రూపు, నాన్-భటాషా కొత్త దేవుడి గ్రూపు, నాన్-భటాషా పాత దేవుడి గ్రూపుఅని వుంటాయి.

మా టీములో నన్నెవరూ గుర్తించడం లేదని కేఫిటేరియా కెళ్ళా. అక్కడ అన్నము వేడి చేసుకోవాలంటే పెద్ద లైను వుంది. వెళ్ళి లైనులో నిలబడ్డా. తెలిసిన వాళ్ళు కూడా హాయ్ అన్నారు కానీ నా ఆరు పెట్టెల గురించి ఒక్కరూ మాట్లాడలేదు. నా వంతు వచ్చినా కానీ అన్నం డబ్బా వేడి చేసుకోకుండా నా తరువాత వాళ్ళను ముందుకు పంపించేశా. చివరకు నా తరువాత వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి ఉస్సూరుమని అన్నం వేడి చేసుకోక తప్పలేదు.

భాధాపరితప్త హృదయంతో ఇంటికి వచ్చేశా. రాగానే జిమ్ము డ్రస్సు వేసుకోని రెక్ సెంటర్ కు వెళ్ళి పోయా. అక్కడ ఒక పౌండు నుండి వంద, నూట యాభై, రెండు వందలు పౌండ్లున్న బరువులన్నీ ఎత్తేశా. ట్రెడ్ మిల్లు మీద పది మైళ్ళు పరిగెత్తా. ఎక్సర్ సైజు మెషీను మీద వున్న మాక్జిమం లెవల్లన్నీ అవలీలగా పూర్తి చేసేశా. ఇక రెక్ సెంటర్ క్లోజ్ చేస్తాం ఇంటికెళ్ళండి సార్ అని చెబ్తే గానీ ఇంటికి బయలు దేర లేదు.

ఇంటికొచ్చి చొక్కా విప్పి పెద్ద అద్దం ముందు నిలబడి ఊపిరి బిగబట్టి నా ప్రతిబింబాన్ని చూసుకున్నా...



నా గురించి ఎవరూ పొగడలేదని.. నాకు నేనే.
"వావ్...వావ్.. సూపర్ బాడీ...ఆసం బాడీ...సిక్స్ ప్యాక్..ఎయిట్ ప్యాక్...టెన్‌ ప్యాక్..హా.. టెన్‌ ప్యాక్..ఐ డిడ్ టెన్‌ ప్యాక్..
ఐ డిడ్ టెన్‌ ప్యాక్.
ఐ డిడ్ టెన్‌ ప్యాక్.
ఐ డిడ్ టెన్‌ ప్యాక్."

* * * * * * * *


" నాన్నా!..నాన్నా.. లే టైమయిపోతోంది.ఆ టెన్‌ ప్యాకేంది..నాకు టెన్‌ ప్యాక్ సాక్సులు తీసుకొని రావాలి. వెళదాం లే.."


* * * * * * * *

Wednesday, December 10, 2008

ఈ వారం సిద్ధ - బుధ్ధ (లతోబా బాబా, లంబ కోణ దృక్కోణం)”

* * * * * * * *


"బాబా బాబా.... లతోబా బాబా.
ఇల్లా బాబా...ముల్లా బాబా.
లాహి..లాహి లతోబా..ఇల్లా ఇల్ల లతోబా"
"ఎవరండీ ఇక్కడ ఇంట్లో ఏవైనా పూజలు చేస్తున్నారా?"

"బల బల బల బల బాబా?...ఓ ఎవరు?.... పక్కింటి ఎంకట్రావు గారా? పూజ చేసుకుంటున్నామండి "
"ఓ ఈ బాబా నా. నాకు బాగా తెలుసు. ఈ లతోబా బాబా దయవల్లే మనం ఇంకా బతికి వున్నాం..నేను కూడా భజన చేస్తా
బాబా బాబా లతోబా ..బాబా బాబా లతోబా."

"మమ్ములను దయ చూచు లతోబా...
మమ్ములను కరుణించు లతోబా...
ఎవరక్కడ మళ్ళీ తలుపు కొడుతున్నారు?"
"నేను సిద్ధా! ఎదురింటి సుబ్బారావును. ఏవిటి ఇక్కడ భలే బజనలు వినిపిస్తున్నాయి."

"ఓ మీరా? రండి. మనమందరం సుఖంగా ప్రాణాలతో వుండాలని లతోబా బాబా కి పూజ చేస్తున్నాం"
"అయ్యో ఎంత మాట. నాకు చెప్పరే. నేనూ పూజలో కూచుంటా..
మామ్ములను కాపాడు లతోబా....
ఈ దీనులను కాపాడు లతోబా..."

"మీరూ బాగా పాడుతారు..ఇపూడు కొంచెం హెచ్చు స్వరం లో పాడాలి..బాబా..బాబా"
"లతో బాబా. లతో బాబా "

"బాబా బాబా... దీనుల బాబా…"
"లతో బాబా..."

"బాబా బాబ... దీవించు బాబా…"
"లతో బాబా..."

"బాబా..బాబా..
లతో బాబా.. బాబా..బాబా….
భూమ్మీద బాబా....లతోబా బాబా.
బూడిద లేని బాబా...లతోబా బాబా.
లతోబా...లతోబా... ఇల్లల్లా... జిల్లిల్లా....లతోబా"

* * * * * * * *



"రేయ్ సిధ్ధా…ఒరేయ్..సిధ్ధా? ఒరేయ్ లేవరా? పద కొండు గంటలవుతోంది పోతే పోనీలే అని పడుకోనిస్తే మధ్యలో ఆ బాబా గోలేంటి?"
"బాబా బాబా ...లతోబా...
భాబా బాబా ... లతోబా.."

"ఆ నమస్కారాలేంది ఆ పాటలేంది నీ నెత్తిన ఓ బిందె నీళ్ళు కుమ్మరిస్తే కానీ ఈ లోకం లోకి రావు...ఆ నీళ్ళ బిందెక్కడ... ఇక లేచి చావు"
"అమ్మో..అయ్యో..ఓర్నాయినో లతోబా నీళ్ళు... లతోబా నీళ్ళు"

"లతోబా నీళ్ళు కాదు మున్సిపల్ నీళ్ళు...ఆ అరుపులాపి ఇప్పుడు చెప్పు ఈ లతోబా బాబా ఎవర్రా? కొత్తగా ఎవరైనా స్వాములొచ్చారా?"
"అయ్యో ఇదంతా కలా? అది కాదండీ మనం ఇన్నాళ్ళు బతికున్నామంటే కారణమెవరు? ఈ లతోబా బాబానే. ఈ లతోబా బాబా కన్ను తెరిచారంటే మనమందరం భస్మమయిపోతాం.."

"సరే ముందు ఈ బాబా ఎవరో చెప్పు తరువాత భస్మమవుతామో, చూర్ణమవుతామో చెబ్తా"
"అదేనండి లష్కర్-ఈ-తోయిబా. పట్టు మని పది మంది కూడా లేని వాళ్ళు ఇరవై మిలియన్ల ప్రజలున్న నగరాన్ని గడగడ లాడించారు కదా. వాళ్ళు ఓ 500 మంది వచ్చారనుకోండి మన వంద కోట్లు ఏమవ్వాలి? అందుకే ముందు జాగ్రత్త చర్య గా పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటున్నా."

"నీ లాంటి దద్ధమ్మల్లాంటి నాయకులుండ బట్టే ఇలా వాళ్ళు బరితెగించ గలుగుతున్నారు. వీళ్ళని ఖలిస్థాన్ టెర్రరిస్టులను అణిచినట్లు అణిచి వేసుంటే ఇప్పుడు ఇలా తెగ బడే వాళ్ళు కాదు. ఇలాంటి వెధవల్ని దయా దాక్షిణ్యం లేకుండా పిచ్చి కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పడెయ్యాలి. పట్టుకున్న ఆ ఒక్కణ్ణి కూడా ఇంకో కొన్ని రోజుల తరువాత వాడి సహధ్యాయుల దగ్గరికి పంపిస్తారు చూడు"

"ఊర్కోండి. ఆ ఒచ్చినవాడిని విడిపించేస్తారు చూడండి ఏ లింకో పెట్టేసి."
"ఓహో నువ్వు పాకిస్తాన్ వాళ్ళ వర్షను చదివావనుకుంటా"

"మళ్ళీ ఇందులో ఇంకో వర్షనా?"
"అవును. వాళ్ళుద్దేశ్యం లో ఆ పట్టు బడిన వాడి పేరు అమర్ సింగు. పంజాబు వాడు. అంతే కాదు గతం లో రా(RAW) ఆఫీసరు కూడా. వీడు బి.జె.పి. సానుభూతి పరుడు. అందుకే కర్కరే మాలెగావ్ కేసుల్లో హిందువులను ఇరికిస్తున్నాడని వీడే మొదట చంపేశాడట. మిగిలిన వాళ్ళందరూ కూడా బి.జె.పి. సానుభూతి పరులట. బి.జె.పి. ఈ సారి గెలవలేదని ఈ కుట్ర పన్నారట"

"అమ్మో నాకిప్పుడు ఫ్యూజు కొట్టేసింది. ఇంత బాగా ప్రచారం చేసుకుంటున్నారా వాళ్ళు?"
"అప్పుడే ఏమయ్యింది ఐక్య రాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టి దీన్ని కూడా భారత ప్రభుత్వం మీద తోసేస్తారు. మనోళ్ళు చెక్క భజన చేసుకుంటూ వుంటారు. వీలయితే ఎలక్షన్లలో దీన్ని వాడుకుంటారు."

"మొన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎలక్షన్లలో ఎవరు గెలిచినట్లు?"
"షీలా దెబ్బకు డిల్లీ బి.జె.పి. డీలా,
రాజస్థాన్ లో రాజే లీజుకు బూజు ,
చత్తీస్ గడ్ లో చితికిపోయి చిత్తయిన చెయ్యి,
మధ్య ప్రదేశంబునన్ కమల కలశం ప్రకాశించెన్ చౌహాన్ తోడన్ ,
లాల్ తన్వాలా మిజోరము వాలా చూపెను చెయ్యి జ్వాల"

".....డొంక తిరుగుడు రూట్లు ఇలానే పుట్టుంటాయనుకుంటా.."
"ఏంటా గొణుగుడు..."


* * * * * * * *



"అయ్య గారూ నా మేనల్లుడు మొన్నొచ్చాడండి. వాడి ధోరణి చాలా విచిత్రంగా కనిపిస్తోంది"
"ఏమిటది"

"అందరికీ నచ్చింది వాడికి నచ్చటం లేదు. ఎవరికీ నచ్చనిది వాడికి నచ్చుతుంది."
"ఓస్..అంతే కదా"

"మంచి సినిమాలు బాలేవంటాడు. బాగాలేని సినిమాలు బాగున్నాయంటాడు"
"ఇదేదో కొత్తగా వుందే"

"వర్షం పడితే కవిత, వర్షం ఆగితే కవిత, ఎండొస్తే కవిత, నీడొస్తే కవిత."
"అహా...."

"ఇంకా బస్సు ఎక్కుతుంటే కవిత, దిగుతుంటే కవిత.."
"ఇంకా చాలానే వుండాలే"

"దానికి తోడు కంప్యూటర్ వాడాయా. కొత్తగా ఏదన్నా వస్తే దానిగురించే మాట్లాడతాడు."
"ఇక మిగిలిన లక్షణాలు నేను చెబ్తా. పుస్తకాలు చదివితే ఏదో రాయాలని పిస్తుంది. టెర్రరిస్టు కనిపిస్తే కాల్చేసి మసి చెయ్యాలని కూడా అనిపిస్తుంది. రాజకీయ నాయకులంటే అసలు పడదు కానీ మామో, బాబాయో రాజకీయ నాయకుడైతే వాడి గురించి అసలు మాట్లాడ బుద్దెయదు."

"భలే కనిపెట్టేశారు"
"ఎక్కడకు పోయినా అవినీతి వుండకూడదంటాడు. ఇళ్ళు, అపార్టుమెంట్లు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజులు ఎగ్గొడతాడు. పైరవీలు పోవాలంటాడు గుట్టు చప్పుడు కాకుండా పైరవీలతో తిరపతి కొండ మీద పనులు చేయించుకుంటాడు. పైరసీ పోవాలంటాడు. పైరసీ సినిమాలు చూస్తాడు. పైరసీ సాఫ్టువేర్ వాడతాడు."

"అవునండోయ్. "
"ఇంకా చెప్పుకుంటూ పోతే ఎవరికైనా పేరొచ్చిందని తెలిస్తే ఆ పేరొచ్చినోడి లాగే ప్రవర్తించాలనిపిస్తుంది. తనో వెరైటీ వ్యక్తి అని కూడా అనుకుంటాడు. అన్నింటికి మించి నా దృక్కోణం లంబ కోణం అంటాడు. అవునా?"

"అంత కరక్టుగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదేమైనా ఒక జబ్బా?"
"ఓ మాదిరి జబ్బే"

"దీనికి విరుగుడు"
"బ్లాగర్లనడుగు "

* * * * * * * *



చదివిన వారికి, వ్యాఖ్యానిస్తే వ్యాఖ్యాతకు ముందస్తు ధన్యవాదాలు.


* * * * * * * *

Friday, November 28, 2008

ఈ దుశ్చర్యను ఖండించాలా?

ముంబైలో విదేశీ ముష్కరులు చేసిన మారణకాండను ఖండించాలా? ఎందుకు ఖండించాలి? ఖండించాల్సింది జరిగిన దుస్సంఘటనను కాదు.

ఈ సంఘటనకు శాయశక్తులా సహాయపడిన స్వదేశీ రాక్షసుల కుత్తుకలను ఖండించాలి.
వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీల గుట్టు మట్లు తెలుసుకోవడానికి చూపిస్తున్న స్వామి భక్తి పరాయణత ను దేశ భద్రత మీద పెట్టని ఇంటెలిజెన్సు అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
వస్తోంది మాదక ద్రవ్యమో, మందు గుండో తెలుసుకోకుండా లంచం తీసుకుంటూ ఆయుధ సామాగ్రి ని దేశం లోకి అనుమతిస్తున్న సరిహద్దు నిఘా విభాగం అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
ఒంటి మీది తెల్ల చొక్కా నలగకుండా నలుగురు ప్రజలు కనిపిస్తే రెండు వేళ్ళు పైకెత్తి చూపించే భ్రష్ట రాజకీయ నాయకులకి చూపిస్తోంది చేతకాని తనమని చెప్పి వాళ్ళ చేతులు ఖండించాలి.
సంక్షోభ సమయం లో సంఘీభావాన్ని ప్రకటించకుండా తగుదునమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభుత్వ వైఫల్యమని చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకుల కాళ్ళు ఖండించాలి.

Tuesday, November 25, 2008

ఈ వారం సిద్ధా - బుధ్ధ (వంశాలు, గర్జనలు, బ్లాగులు, ఆటలు)

* * * * * * * *


"రేయ్ సిధ్ధా!!!"
"......"

"రేయ్ సిధ్ధా!!! ఆ గంతులేమిటి ఇలా రా.. క్రికెట్ లో మనోళ్ళు బాగానే ఆడుతున్నారు. నువ్వు ప్రాక్టీసు చేసి దేశాన్నేమీ ఉద్ధరించక్కర్లేదు ఇటొచ్చి కాస్త పని చూడు"
"అయ్య గారూ, నేను క్రికెట్ ప్రాక్టీసు మానేసి చాలా కాలమయింది. ఇప్పుడు నేను ప్రాక్టీసు చేస్తోంది తొడ కొట్టి మీసం మెలెయ్యడం"

"ఏ సంక్రాంతికి కుస్తీ పోటీలు గానీ జరుగుతున్నాయా ఊర్లో?"
"వచ్చే సంక్రాంతి కల్లా ఈ కుచ్చు టోపీలొళ్ళంతా ఎలక్షన్లతో కుస్తీ పట్లు పడతారు కదా. మునెమ్మలా నాక్కూడా ఏదైన చాన్సు వుంటుందేమోనని ఇప్పట్నుండి తొడ కొట్టడం ప్రాక్టీసు చేసుకుంటున్నా. ఇప్పుడు తొడ కొట్టడం, మీసం మెలెయ్యడం, గాల్లో ముద్దులివ్వడం.. అదే కదా ఫ్యాషన్"

"నువ్వు తొడ కొట్టడం బానే వుంది గానీ. మీసాలు మెలెయ్యాలంటే నీకు వున్నవి మిడత మీసాలు అవి సరిపోవు"
"మీసాలు పెరగడానికి ఏవైనా స్టెరాయిడ్సు వున్నాయేమో కాస్త అంతర్జాలం లో వెతికి పెట్టండి. ఓ సాంపుల్ మా కిలారి పాల్ గారికి కూడా పంపిస్తా"

"అన్ని పార్టీలోళ్ళు అయిపోయారు ఇప్పుడు పాల్ మిగిలాడన్న మాట. ఈ గర్జన వంశం, తొడ కొట్టే వంశం, ముద్దులిచ్చే వంశం, సర్ప వంశం వాళ్ళతో ఎక్కడ పోటీ పడుతాడు"
"అరె! ఆ నాలుగో సర్ప వంశమేంది కొత్తగా?"

"ఆ నలుగురు హీరోల్లో మూడో హీరో వున్నాడు కదా. ఆయనదే సర్ప వంశం"
"అది అక్కినేని వంశం కదా?"

"కాదు. మొన్న కింగు ఆడియో విడుదలప్పుడు అక్కినేనే చెప్పాడు. నా పేరులో పాముంది, నా కొడుకు పేరు లో పాముంది, నా మనవడి (నాగ చైతన్య) పేరులో కూడా పాముంది అని. బుజ్జి సర్పం కూడా 'నేను ఇలా ప్రేక్షకుల మీద బుస కొట్టడానికి రెండేళ్ళ నుండి ఎదురు చూస్తున్నా' అని చెప్పింది. సో అది సర్ప వంశమన్న మాట"
"ఆ నలుగురు హీరోల్లో ముగ్గురు మూడు పార్టీల్లో ఫిక్సయిపోయారు కదా. నాలుగో ఆయన కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతే బావుణ్ణు. ప్రేక్షకులు నిశ్చింతగా చింత కాయల బదులు చింతాకు పులగూర చేసుకుని తింటారు. బహు జన సమాజ్ పార్టీలో చేరి బడుగు జనాలకు కీడు జరక్కుండా కాపాడుతూ వుంటే బావుంటుంది"

"ఆయనకి కొంచెం దైవ భక్తి ఎక్కువ, కొంచెం వేదాంతం మనిషి. బి.జె.పి. అయితే బావుంటుందేమో"
"'ప్రేమించుకుందాం రా', 'పెళ్ళి చేసుకుందాం రా' లా 'బి.జె.పి లో చేరదాం రా' అనే సినిమా తీసి రాజకీయ రాజ్యం లోకి రాకెట్ లో రోదశీలోకి వెళ్ళిన రాకేష్ శర్మ లా, రణ గొణ ధ్వనుల రాక్షస రహదారుల రాజధానిలో రివ్వున రాసుకు దూసుకు పోయే రీగల్ క్యాబులా, పీడిత తాడిత ప్రజలను ఆదరించి, అభిమానించి, పరిపాలించే ప్రభువులా వస్తే అందరినీ సంతోష పెట్టిన వాడవుతాడు"

"నువ్వు ఆశు కవివయిపోయావురో?"
"డైరెక్టుగా తిట్టమని మీకెన్ని సార్లు చెప్పాలి అయ్యగారూ? మీకు ఆ హక్కు వుందని ఎప్పుడో చెప్పానుగా. ఇలా డొంక తిరుగుడు గా మారెప్ప... చింతకాయల రవి... అని అనడమెందుకు"

"సడేలే. వెళ్ళి మిరపకాయలు బాగా దట్టించి ఓ పెసరట్టు వేసి కొబ్బరి చెట్నీ తో పట్టుకు రాపో.."
"ఇవిగోండి"

"అట్టు అదరగొట్టావ్ రో. ఏవిటి బ్లాగుల్లో కొత్త రెసిపీలు గానీ చూస్తున్నావా?"
"ఆయనెవరో భాస్కర్ రాజట నల భీమ పాకం అని మొదలు పెట్టి భలే ప్రయోగాలు చేస్తున్నాడు. నేను కూడా ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టా. వచ్చే వారం మీకు ఐస్ క్రీం పప్పు విత్ జామూన్ బిర్యాని. సైడ్ డిష్ గా ఉప్మా సూప్ చేసి పెడతా"

"హుం.... బ్లాగులు పెరిగిపోతున్నాయి."
"అవునండి ఏం జదివేట్టు లేదు..ఏం రాసేట్టు లేదు.."

"చంపేస్తా వెధవా... రాయక పోతే పోయావ్ చదివేదన్నా సరిగ్గా చదువు ఏడువు. లేకపోతే నేను ఎలాంటి వంటకాలు తినాల్సి వస్తుందో ఏమో. ఇంటర్నెట్ కనెక్షన్ పీకించేస్తా"
"ఊ..అలానే అంటారు. పీకించిందేం లేదు"

"ఆ బుంగ మూతేంటి? పదారేళ్ళ కుర్రాడిలా? కొత్త బంగారు లోకం రివ్యూ గానీ చదివావా?"
"ఆ మీరు మరీను, కుర్ర కారు బ్లాగులు చూస్తే కుర్ర తనంగానూ, చరిత్ర బ్లాగులు చూస్తే చరిత్ర కారులు గానూ, భక్తి బ్లాగులు చూస్తే భక్తులు గానూ, పాటల బ్లాగులు చూస్తే పాటగాళ్ళు గానూ, వంటల బ్లాగులు చూస్తే వంటవాడి గానూ, ఆవేశం బ్లాగులు చూస్తే.."

"ఇక ఆపెయ్. నా కర్థమయిపోయింది. ఈ రోజుకి నీ నోటి టపా కట్టెయ్."
"అలాగే"

* * * * * * * *


"అయ్యగారూ! మనమిద్దరం ఈ రోజు ఒక ఆటాడుకుందాం"
"సరే. నువ్వు తొడ గొట్టు. నేను మీసం మెలేస్తా"

"అబ్బే అదికాదండి. మనం తెలుగు సంఘమాట ఆడుకుందామా?"
"ఓ అదా! నువ్వు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు, నేను తిరుపతి ఎంపీ గా పోటీ చేస్తున్నట్టు ఆడుకుందాం.."

"మీ ఫ్యూజు ఒక పక్క బాగా పీకేసింది"
"ఏం. అమెరికా తెలుగు సంఘాలోళ్ళు చేసే పని అదే కదా"

"ఆ ఆట లో మజా ఏముంది. నేను చెప్పేది అది కాదు"
"మరి?"

"మీరు నన్ను బహిష్కరించండి... నేను మిమ్మల్ని బహిష్కరిస్తా... మీరొక పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వండి దానికి కౌంటర్ గా నేనొక స్టేట్ మెంట్ ఇస్తా"
"!!!"

"ఏం అలా అయిపోయారు"
"ఏం లేదు నేను వెళ్ళి రెస్టు తీసుకుంటా. ఎవరొచ్చినా డిస్టర్బ్ చెయ్యాకు"

"అలాగే. ఎవరన్నా వస్తే రామ కోటి రాసుకుంటున్నాడని చెబ్తా"

* * * * * * * *

Sunday, November 23, 2008

ఒబామా నాకెందుకు నచ్చలేదంటే...

* * * * * * * *


దేశంలో గరీబోళ్ళు ఎక్కువయ్యారని ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' అంది. పదవి లోకి రాగానే గరీబోళ్ళకు చాలా చేసింది...
గరీబోళ్ళు హ్యాప్పీ..
రాష్ట్రం లో బీదోళ్ళు ఎక్కువయిపోయారని రెండు రూపాయలకే బియ్యమిస్తానన్నాడు అన్న ఎన్టీఆర్. రాగానే ఇచ్చాడు...
బీదోళ్ళు హ్యాప్పీ...
రైతులు బ్యాంకు ఋణాలు కట్టలేరని మాఫీ అన్నాడు చెన్నా రెడ్డి. పదవిలోకి రాగానే ఋణాలు మాఫీ...
రైతులు హ్యాప్పీ...
కరెంటు మాఫీ అన్నాడు వై.ఎస్. పదవిలోకి రాగానే కరెంటు చార్జీలు మాఫీ...
మళ్ళీ రైతులు హ్యాప్పీ...
అమెరికా ఎకానమీ బుష్షు కాలం లో భ్రష్టు పట్టిపోయిందని,ఇంటి ఋణాలు(మార్టుగేజు) కట్టలేక కొంపలు కొల్లేరవుతున్నాయని(ఫోర్ క్లోజర్సు) అన్నాడు ఒబామా. పదవిలోకొస్తే ఇళ్ళ ఋణాలు మాఫీ అంటాడేమో ..నేను కూడా హ్యాప్పీ అనుకున్నా..ప్చ్..
ఇప్పుడు నేను నాట్ హ్యాప్పీ...


మీకు తెలుసా?: ఒబామా ట్రాన్సిషన్‌ టీము 15 మంది లో భారతీయ సంతతివారు నలుగురు.

* * * * * * * *

Thursday, November 20, 2008

ఎకానమీ సునామీ... దీనిక్కొంచెం మెంటల్.

* * * * * * * *

అన్ని దేశాల ఎకానమీలు సున్నా అయి సున్నకెంత విలువుందో చూపిస్తాం అని సునామీ సృష్టిస్తున్నాయి. దీనికి మెంటలా అంటే అవును. ఓ రోజు తారా జువ్వలా రివ్వున ఎగసి పడుతుంది ఇంకో రోజున తుస్సు తుపాకీ అని పుటుక్కుమని నేల పడుతుంది. అక్టోబరు మొదటి వారం లో రికార్డు స్థాయిలో అమెరికా డౌ జోన్సు ఇండెక్సు 800+ పాయింట్ల పతనం..(చరిత్ర సృష్టించింది) మళ్ళీ వారం తిరక్కుండానే రికార్డు స్థాయిలో 800+ పాయింట్ల వృద్ధి..(మళ్ళీ చరిత్ర సృష్టించింది). సహజంగా ఏ దేశం సంక్షోభంలో పడినా ఆ దేశపు కరెన్సీ చతికిల పడుతుంది.(సోవియట్ రష్యా కింద పడ్డప్పుడు రూబుళ్ళ విలువెంతుందో అందరికీ గుర్తుండే వుంటుంది. రష్యాకు రూబుళ్ళలో మనమివ్వాల్సిన డబ్బు ఏ అయిదో, పదో శాతానికి పడికిపోయింది). కానీ అమెరికా డాలర్ విలువ ప్రపంచం లోని ప్రతి కరెన్సీ తోనూ పెరుగుతోంది. గుడ్డిలో మెల్లంటే ఇదే. మతులు పోతున్న ఈ సమయములో దిగుమతులకు ఊరట. ఖజానా ఖాళీ అయితే ఇదేం ఊరట అంటే అయిసు ముక్క లేకపోయినా అయిసు పుల్ల చీక్కోడం లోని తృప్తి ఇదే. ఇక మన రూపాయి నువ్వెక్కడ అంటే నేను హాఫ్ సెంచురీ నాటవుట్ అంటోంది. జనవరిలో 21,000దాటి చుక్కల్లెక్కేసిన బొంబాయి స్టాకు ఇండెక్సు ఇప్పుడు ఎనిమిది వేల దగ్గర ఎగరలేక పీక్కు పోయిన రెక్కలతో బిక్క చచ్చి పోయింది.

ఈ దెబ్బలకి ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోవడం సంగతేమో గానీ ప్రాడక్టివిటీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రతోడూ పనిచ్చిన పదినిముషాలకు పూర్తి చేసి ఇంకా పనేమన్నా వుందా సార్ అని అడుగుతున్నారు. లేకపోతే ఉద్యోగానికి ఎసరొస్తుందని భయం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు ఎంత బాగా పని చేసినా పింకు స్లిప్పు బారి నుండి తప్పించుకోవడం సులభతరమే కాదు.

ఇప్పటికే భారత్ లో కొన్ని కంపెనీలు కొంత మందిని పిప్ (పర్ఫార్మెన్సు ఇంప్రూవ్మెంట్ ప్లాన్) లో పెట్టాయి.మరి కొంత మందికి శనక్కాయలకు బదులు సున్నలు చేతిలో పెట్టాయి. ఈ కేటగిరీల లో వున్న వాళ్ళ మీద మొదట దెబ్బ పడుతుంది. సాధారణంగా మొదటి దశ పింకు(ఉద్వాసన) స్లిప్పు ఇచ్చే ముందు సరీగా పని చెయ్యక పోవడం, తోటి ఉద్యోగులతో సఖ్యత గా లేకపోవడం, ఇంటర్నెట్ చూడ్డం, పని వేళల్లో కేఫిటేరియాలో చక్కర్లు కొట్టడం లాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఇందులో ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు కూడా వుంటారు. ఇక రెండో దశ లో ఎవరు మిగతా వారికన్నా తక్కువగా పని చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి వుంటుంది.

ఇప్పుడున్న పరిస్థితులతో ఉద్యోగం కాపాడుకోవాలంటే ఒంట్లోని మత్తును పక్కన పెట్టి ఒళ్ళు వంచి పని చెయ్యడం ఉత్తమం. ఒకప్పుడు "ఆఁ నన్నెవడు పీకుతాడు" అని మీసాలు మెలేసి నిమ్మకాయలు నిలబెట్టిన వీర సామ్రాట్టులు నీరసంతో ఆ నిమ్మకాయలు పిసికి జ్యూసు తాగి ఎక్ స్ట్రా గా పని చేస్తున్నారు పీరియెడ్. ఆఫీసులో బెస్టు ఇంటర్నెట్ యూజర్ అవార్డు రాక ముందే అంతర్జాల సందర్శనం పూర్తిగా ఆపేస్తే మంచిది. దాని బదులు ఆ సమయాన్ని కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కోసం కేటాయిస్తే మరీ మంచిది. ఎందుకంటే గ్రహ చారమో, ఉప గ్రహాచారమో బాలేక ఉద్యోగం ఉష్ కాకయితే బయట ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ. వాళ్ళతో పోటీ పడి కాకిలాగ కావు కావు మంటే వేరే ఉద్యోగాలు రావు. ఓ నెల క్రితం మా కంపీనీ వాళ్ళకు ఒక డి.బి.ఏ. (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) కోసం 140 రెస్యూమే లు వచ్చాయి. అంతకు ముందు ఒకటీ అరా కూడా వచ్చేవి కాదు. భారత్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి వుందనుకుంటున్నా.
* * * * * * * *

బాగా పని చేసినా పీకేస్తారు కదా అంటే ఒక్కోసారి నా ఫ్రెండుకు జరిగినట్లు జరగచ్చు. అతను కాలిఫోర్నియాలో పని చేస్తాడు. రెండు రూపాయల పనేదన్నా వుంటే పావలా జీతం తీసుకుంటున్న అతనికి ఇచ్చేవారు. పావలాలు తీసుకుంటూ శనాది వారాలు కూడా పని చేస్తూ వాళ్ళకు చాలా రూపాయలు మిగలబెట్టే వాడు. ఇంత చేసినా పరిస్థితి బాలేదని కంపెనీలో దశల వారీగా పింకు స్లిప్పులు ఇవ్వడం మొదలు పెట్టారు. కంపెనీ వాళ్ళేమో ఉదారంగా, పీకేసిన ప్రతోడికీ సంవత్సరం సర్వీసుకు ఒక నెల జీతం చొప్పున సెవెరన్సు ప్యాకేజీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ లెక్కన మనకూ ఎనిమిది నెలల జీతమొస్తుందని లెక్కలేసుకొని భారత్ కి తిరిగి వెళ్ళి పోదామని సంబరంగా వున్నాడు. తన ఇల్లు అమ్ముకోని భారత్ కు ఓ ట్రిప్పు వెళ్ళి వచ్చాడు. శని గ్రహం దాటొస్తే ఉపగ్రహం తీసుకెళ్ళి దింపొచ్చినట్లు ఓ ప్రమోషనిచ్చి రెండు సెనిక్కాయలు చేతిలో పెట్టి మూట సెనిక్కాయలు ఖర్చయ్యే చోటికి బదిలీ చేస్తామన్నారు. అసలే వున్న సెనిక్కాయలు భారత్ లో ఖర్చు పెట్టుకొచ్చాడు వాళ్ళిచ్చిన రెండు సెనిక్కాయలు ఒద్దని చెప్పేశాడు.పావలాకే బాగా పని చేస్తాడని ఉద్యోగం లో నుంచీ పీకనూ లేదు. ఇప్పుడు ఉప గ్రహాలను చూస్తే పారిపోతున్నాడు.

ఇంత ఎకానమీ తంతున్నా కొంత మంది తమ ఎంజాయ్ మెంట్ లు మాత్రం మానటం లేదు. ఇక్కడ నా ఫ్రెండోళ్ళ ఆఫీసులో ఎవడో వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఆ సాయంత్రం పెద్ద మందు పార్టీ ఇచ్చార్ట ఆఫీసు వాళ్ళందరూ కలిసి. ఇక మీడియా వాళ్ళయితే ఓబామా వైట్ హౌసుకు తీసుకెళ్ళడానికి ఏ కుక్కయితే బావుంటుంది అని కొన్ని కుక్కపిల్లలను సెలక్టు చేసి ఓటింగుకు పెట్టారు. ఈ కుక్క పిల్లల్లో కూడా తక్కువ అలర్జీ వున్న బొచ్చు కుక్క పిల్లల ఫోటోలు పట్టుకొచ్చి పెట్టారు. ఒబామా పిల్లల్లో ఒకరికి అలర్జీలున్నాయట మరి. రా.త.దె.కొ.

ఇంత జరుగుతున్నా షాపింగు చేసే వాళ్ళకోసం థాంక్సు గివింగు బ్లాక్ ఫ్రైడే వస్తోంది.కొనేవాళ్ళు కొంటూనే వుంటారు. ఇప్పుడే చాలా స్టోర్లవాళ్ళు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంటారు. మీరు అమెరికాలో వుండి అలాంటి డీల్సు కోసం ఎదురు చూస్తుంటే నేడే సందర్శించండి డీల్ అంకుల్..డీల్ అంకుల్..డీల్ అంకుల్... దీనికి నీకు ఏమి సంబంధం అంటే నేనే ఆ డీల్సు లోడర్ని, క్లీనర్ని, ఓనర్ని. ఎందుకు మొదలెట్టావ్ అంటే ఉద్యోగం పోతే బ్యాకప్ కోసం. మా ఆఫీసులో రెండు సునామీలు తప్పించుకున్నా ఇప్పటికి. పోయిన్నెల్లోనే ఒకటి జరిగింది. ఇంకోటొస్తే తప్పించుకుంటానో లేదో తెలీదు. అందుకే ఈ డీల్ మావయ్య.. ఇందులోంచి మీరు ఏ స్టోరు లో కొనాలంటే ఆ స్టోరు లింకు మీద నొక్కి ఆ స్టోరు నుండి కొనుగోళ్ళు చెయ్యొచ్చు. పన్లో పనిగా మీ స్నేహితులకు వాళ్ళ స్నేహితులకు కూడా చెప్పండి. హ్యాప్పీ డీల్సూ...

* * * * * * * *


చివరగా నా ప్రశ్న నా సమాధానం:
ప్రశ్న: 2001 లో కూడా ఎకానమీ తన్నింది కదా. అప్పుడు లేనిది ఇప్పుడెందుకంత పరిస్థితి వచ్చింది.
సమాధానం: అప్పుడు వాలు వీధి పెట్టుబడులలో నేను వున్నాను కాబట్టి ఒడ్డున పడింది. ఇప్పుడు నేను లేనుగా.
* * * * * * * *

Wednesday, October 15, 2008

ప్రపంచ చేతులు కడుక్కునే రోజు (Global handwashing day)

కంపెనీలు : ఉద్యోగులను ఇంటికి పంపించి
స్టాక్ మార్కెట్ : ఇండెక్సును కిందకి పంపి
చిరంజీవి: ప్రజాపర్యటన మధ్య లో ఆపేసి
వై.ఎస్.: 24 గంటలు బీరు తయారీకి అనుమతిచ్చి
భారతీయ రిజర్వు బ్యాంకు: ఒక శాతం వడ్డీ తగ్గించి
తమిళెంపీలు: 39 రాజీనామాలు కరుణా నిధి చేతిలో పెట్టి
నేను: ఒక టపా రాసి

Friday, October 10, 2008

ఎకానమీ సునామీ

* * * * * * * *


"అమెరికా తుమ్మితే మిగతా ప్రపంచానికి జలుబు చేస్తుందట కదా?"
"కాదు. ప్రపంచానికి జలుబు చేసే ముందే అమెరికా తుమ్ముతుంది."

* * * * * * * *


"ఇవాల్టికి మీ కంపెనీలో స్కోరెంత?"
"ఆ ఎంత ఓ ముప్పై!!!"
"ఓస్ అంతేనా మా దాన్లో యాభై"
"అయితే ఇక క్లోజన్న మాట"
"ఏవిటి అప్పుడేనా ఇంకా చాలా వుందట"
"మా కంపెనీలో కూడా"

* * * * * * * *


"మీ కంపెనీలో వ్యవహారమెలా వుంది?"
"కొందర్ని క్యూబు దాకా రానిస్తున్నారు."
"మీ కంపెనీ నే బెటరు.మా కంపెనీ లో గేటు వరకే"

* * * * * * * *


"నీ 401K లో ఎంతుంది?"
"పోయిన్నెల 100K వుండేది ఇప్పుడు 30K వుంది."

* * * * * * * *