Wednesday, May 14, 2008

భ్లాగర్ల కథ ( నా వల్ల కాదు )

తప్పకుండా చదివాల్సింది:

పొద్దులో కొల్లూరి సోమశంకర్ గారు రాసిన బ్లాగర్లకో లేఖ చదివిన తరువాత నా డ్రాఫ్టు తవ్వకాల్లోంచి దీన్ని బయటకు తీసా. ఇది నూరో టపాగా విడుదల చెయ్యాల్సి వుండె. పూర్తి చెయ్యడం చేత కాక దీని బదులు బ్లాగోళ జంభ వీడియో విడుదలచేశా. పొద్దులో రాసిన సోమశంకర్ గారికి అభినందనలు. మీరింకా చదవక పోతే ఓ ట్రిప్పేసి తరువాత ఇక్కడికి రండి. ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇంకొక ఉదాహరణ. మీ బుర్ర స్క్రీన్‌ పై తళుక్కుమన్న "ఇలాంటివి మాట్లాడ్డం నీ కలవాటే గా" అన్న అక్షరాలు బర బర చెడిపెయ్యండి. మళ్ళీ నా మీద సెటైరెయ్యకండి.

తప్పకుండా చదవాల్సింది ఇంకొంచెం:

కింద రాసిన బ్లాగుల పేర్లే కాకుండా ఇంకా చాలా రాయాల్సి వుంది వాటిని రాయడానికి కుదరక మధ్యలో ఆపేశాను. ఇందులో ఉదహరించ బడ్డ బ్లాగు పేర్లకు, వాళ్ళ అసలు పేర్లకు, వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ బ్లాగు విధానానికి, వాళ్ళ ఉద్యోగాలకు, వాళ్ళ ఇంకా చానా చానాలకు ఏ మాత్రం సంబంధం లేదు.

-- ఇదే నా వీర శూర Disclaimer ...


కథ మొదలయ్యింది :

ఓ తెలుగు విద్యార్థి కి తెర చాటు చందమామ లా తెలుగు కోసం తపన పడుతున్న వాళ్ళెందరున్నారో తెలుసుకుందామనే కుతూహలంతో కలిగింది. పదుగురికి ఏదో చెప్పాలనే తపన రోజు రోజుకీ బలీయమయింది. ఇలా ఒంటరిగా ఊహా ప్రపంచం లో మునిగితే సరిపోదు. తనకున్న తెలుగు తీపి ఇంకా ఎంతమందికుందో తెలుసుకోవానే తలపు కలిగడం ఆలస్యం వెళ్ళి తన అంతరంగాన్ని వాళ్ళ నాన్న కి చెప్పాడు.

అది విన్న వాళ్ళ నాన్న చిత్తూరు నాగయ్య లాగా "ఇలా మనసులోని మాట చెప్పి భాష ఊసులు తెలుసుకోవాలనే భావన కలగడం ఎంతో సంతోషం. తెలుగు భాషా అన్వేషి వై బయలు దేరు. నీ అభీష్ట సిద్ధిరస్తు. ఎక్కడా నిరాశా, నిస్పృహ లకు లోను కాకుండా పారదర్శి వై దిగ్విజయంగా తిరిగిరా. తిరిగి వచ్చిన తరువాత నీవు విన్నవీ-కన్నవీ, అవీ-ఇవీ అన్నీ మాకు వినిపిస్తే మేము వాటిని సంగ్రహాలయం లో భద్రపరుస్తాం నాయానా. ఇదిగో ఇక్కడ నున్న మహిమాన్విత కీలు గుర్రం తీసుకెళ్ళు. దాని మీద కూచుని ఈ శాస్త్రం లో చెప్పబడిన విధంగా మంత్రం జపిస్తే నువ్వు కోరుకున్న చోటకు వెళుతుంది." అన్నాడు.

"అలాగే నాన్నా! తపస్వి అయిన మీరు నాకు ఓనమాలు దిద్దించి అమృత వర్షం లా వేదాల్నీ, పురాణాల్నీ అవపోశన పట్టించి నన్నింతగా తీర్చిదిద్దినరనే విషయం నా మనో ఫలకం పై ఎప్పటికీ వుంటుంది " అని చెప్పి సెలవు తీసుకున్నాడు.

విక్రమాదిద్యుడి సింహాసనానికికున్న సాలభంజికల రూపుతో చెక్కబడిన ఆ కీలుగుర్రాన్ని ఎక్కి మంత్రాన్ని జపించాడు. సౌమ్యంగా ఆ బొమ్మను ఒక్క సారి చరిచాడు. లయ బద్దమైన సవ్వడి చేసుకుంటూ మరుక్షణమే అది స్వేచ్చా విహంగం లా గాలిలోకి ఎగిరింది.

అది నిండు పౌర్ణమి. జాబిల్లి వెన్నెల విరబూసి పసిడి కాంతులు వెదజల్లుతోంది. అలా గాలిలో ఎగురుతూ తను ఇంతవరకూ ఆ అడవి లో తను చూడని ఎన్నో చిన్న చిన్న అందాలను చూసాడు. సన్నని జల్లు కురవడం మొదలైంది. తన ఒంటి మీద పడ్డ చినుకుల్ని చూసి వెన్నెల చినుకులంటే ఇవే నేమో అనుకున్నాడు. కాసేపు సేద దీరుదామని కిందికి దిగాడు. అక్కడ హరివిల్లు లా వంగిన పూల తీగల పొద దగ్గిర ఆసీనుడయ్యాడు. ఆ పూల పొద పక్కనున్న బావిలోకి వంగిన చెట్ల కొమ్మలకు కట్టుకున్న గిజి గాని గూళ్ళు వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించాయి. ఆ అందాలను అలానే చూస్తూ వుండగా నిద్ర పట్టేసింది. ఊదయ భానుని లేత కిరణాలు మీద పడుతుండగా వసంత కోకిల కిల కిలా రావాలకు నిదుర లేచాడు. కాల కృత్యములు తీర్చుకుని అక్కడ కింద పడ్డ రేగు పండు ను చూశాడు. అక్కడ రేగు పండు వుండిన ఎడల ఇంకా ఏమైన ఫలములు దొరుతాయేమో నని వెదికిన తరువాత బృందావనం లాంటి ఆ వనంలో అన్ని రకాల చెట్లు కనపడ్డాయి. వాటిని కడపు నిండా తిని కీలు గుర్రమెక్కి కళార ను మహా సముద్రాన్ని దాటి కొంచెం వెళ్ళగానే ఆ వాతావరణం కొత్తగా అనిపించిది. ఇదే ఆంధ్ర పర్యావరణం కాబోలు అనుకున్నాడు. తను ముందుగా వెళ్ళాలనుకున్న ఆంధ్ర దేశం రాజధాని వైపు గుర్రాన్ని తిప్పాడు. కాసేపటిలో గోల్కొండ, బుద్ధ విగ్రహం కనిపించాయి. వాటిని చూడగానే కీలు గుర్రం వింత శబ్దం ఎహెహీహీఎ అని చేసింది. విద్యార్థి కి అర్థం మయిపోయింది ఇక్కడ ఏదో వాతావరణ కాలుష్యముందని. అందుకే కీలూ బొమ్మ కూడా తన బాషలో నా గోల అర్థం చేసుకో అని అరిచింది. హైద్రాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు ఆరు కిలోమీటర్లు దూరంలో గుర్రాన్ని ఆపి తేలుగు నేల పై అడుగుపెట్టాడు. అక్కడనున్న పొదల పక్కన ఆపేసి దాని మీద కొన్ని ముళ్ళ కంపలు పరిచేశాడు.

పొదల సందుల్లోంచి ఋ ౠ అనుకుంటూ గుర్రం ఆగిపోయింది. అక్కడి నుండి దిగి నడిచిన తరువాత నల్లగ నిగనిగ లాడుతున్న నాలుగు రోడ్ల కూడలి కనిపించింది. కలగూర గంప లాగా వున్న రోడ్డును చూసి ఎటు పోవాలో అర్థం కాక రోడ్డు కూడలి దగ్గర నిలుచున్నాడు. రోడ్డు పక్కనే కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు రైతులు కనిపించారు. దగ్గరకు వెళ్ళి వాళ్ళను పలకరించాడు. తన వేషం కూడా దాదాపు వారి లాగే వుండటం వల్ల వాళ్ళు అప్యాయంగా పలకరించారు. హైద్రబాదు కు వెళ్ళు అని వాళ్ళు చెప్పిన వైపు నడక సాగించాడు. రోడ్డు మీద వచ్చే పోయే వాహనాలను చూసి ఆంధ్ర ప్రగతి చాలా వుందనుకొన్నాడు. సాయంత్రానికి చార్ మినార్ చేరుకున్నాడు. అక్కడ రోడ్డు దాటడానికి నానా తంటాలూ పడవలసివచ్చింది. ఇదేదో జగమే మాయ లాగా వుంది ఎవరో ఒకరి సహాయం తీసుకోకపోతే కష్టమే అనుకొన్నాడు. అంతలో ఈ-తెనుగు చొక్కా వేసుకొనొకతను కనిపించాడు. హమ్మాయ్యా ఇతనెవరో తెలుగబ్బాయ్ లాగా ఉన్నాడని అతన్ని ఆపి "చూడు తెలుగోడా త్రినేత్రుడి కి కూడా ఈ రోడ్డు దాటటం కష్టం. దీన్ని దాటాలంటే నాకు ఎన్నో ధర్మ సందేహాలు వస్తున్నాయ్. వాటిని తీర్చగలవా" అని అడిగాడు.


"చూడూ! నా పేరు తెలుగోడా కాదు ఫణి పక్కా తెలుగబ్బాయ్. ఇదిగో అక్కడ బడి పిల్లగాళ్ళు రోడ్డు దాటుతున్నారు. వాళ్ళతో పాటు నిన్ను రోడ్డు దాటించేస్తా రా. నేను నా ఫ్రెండ్స్ ను కలవాలి" అని చెప్పి రోడ్డు దాటించేసి వెళ్ళి పో యాడు.

"నారాయణ..నారాయణ , ఏడు కొండలవాడా వెంకట రమణ" అనుకుంటూ రోడ్డు దాటేశాడు. రోడ్డు దాటిన తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఇదంతా జగమే మాయ గా వుంది. ఆ జగన్నాటక సూత్రధారి ఇక్కిడి కొచ్చినా ఎవరూ పట్టించుకోరు అని అనుకొంటూ వున్నాడో లేదో ఎవరో తన చేతిలో ఒక కర దీపిక పెట్టేసి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అది తెలుగు పుస్తక మహోత్సవం గురించి, అక్కడ జరగనున్న సాంస్కృతిక మహోత్సవాల గురించి. ఏలాగైనా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు. ఈ సారి ఎవరి నైనా అడుగు దామంటే ఎవరూ ఖాళీ గా కనిపించలేదు. ఫ్రతి వాళ్ళూ చెవిలో సెల్ ఫోను పెట్టుకొని నా గోల నాది అన్నట్టుగా వున్నారు. అక్కడ బైక్ ఆపి నా గోల అనుకుంటూ మాట్లాడున్న ఒక యువకుడి దగ్గర నిలుచున్నాడు. స్పీకర్ ఫోను పెట్టి మాట్లాడుతున్నందువల్ల అన్నీ వినిపిస్తున్నాయి.
"జలజా నేను చెప్పేది విను.నేను తొందరగా వచ్చేస్తా"
"నువ్వెంతసేపూ నేనూ నా సాహిత్యం అంటూ తిరగడమే కానీ నన్ను పట్టించుకోవా"
"నువ్వే నా ప్రాణం. నా మనసు నీకు తెలుసు కదా నే రాసిన నా రాతలకు ఎప్పుడో ఓ సారి సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. అలా వస్తే అందులో నీకే గదా సగం దక్కేది"
"నిజం గా తొందరగా వచ్చేస్తారు కదూ"
"నువ్వలా ఎదురు చూస్తూ వుండు. అభిరాం హోటల్నుండి పూత రేకులు, కిరణ్ ఫ్లవర్ మర్కెట్ నుండి సన్న జాజులు తీసుకుని వచ్చేస్తా" అని ఫోను పెట్టేశాడు.
ఇతను కూడా పుస్తక ప్రదర్శనకు వెళ్తున్నట్టున్నాడు ఇతన్ని లిఫ్ట్ అడిగితే పోలా అని దగ్గరకెళ్ళి అడిగాడు.

కథ ఆగిపోయింది.

(అంతే ఇంకా 280(అప్పట్లో) బ్లాగులున్న పేర్లతో ఈ ట్విస్టులతో రాయడం కుదరని "హ్యాండ్స్ అప్" అన్నా.)

సోమశంకర్ గారు,

మీరు రచయిత కాబట్టి అయ్యవారి బొమ్మ అనుకున్నారు అదే వచ్చింది. నేను గీసింది ఎలా వచ్చిందో చూడండి. మీ రాతకు టొపీ తీశాను.

-- విహారి

(ఈ టపా పోస్టు చెయ్యకూడదని చివర్లో ఆపేశా. కానీ ఇవాళ ఫణి గారు ? నాడు-నేడు కు కామెంటుచేస్తూ కాన్‌సెప్టు ఎవరైనా కాపీ చేశారా అన్నారు. ఏటూ ఆ ఇమేజీ వచ్చింది కదా అని సంక్రాంతి సినిమాలప్పుడు పెద్ద సినిమాల్తో పోటీ పడి చిన్న సినిమా రిలీజ్ అయినట్టు రిలీజ్ చేసేస్తున్నా )


త్వరలో రాబోయే టపా : బ్లైన్‌,బ్లిస్కీ,బ్లోడ్కా,బ్లీరు తాగేసి బ్లాగడమెలా

15 comments:

సుజాత వేల్పూరి said...

మీరు కమండలం, రుద్రాక్షలు,గడ్డం వెతుక్కోరు, అందరికీ వెదికి పెడతారు! బ్రహ్మాండంగా రాసేశారు.

Anonymous said...

"బ్రహ్మాండంగా రాసేశారు"

అబ్బా! భలే ఆత్మ విశ్వాసం నింపేరండి నాలో :-)
ధన్యవాదాలు.

-- విహారి

One Stop resource for Bahki said...

ఘోరం , అన్యాయం నా కబుర్లు కానరాలేదు , అంతా తోండి .
నేను ఖడిస్తున్నా

Kolluri Soma Sankar said...

విహారి గారూ,
మీ బ్లాగరుల కథ బాగుంది. "ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ".ఐడియా ఒకటే అయినా, ప్రెజెంటేషన్‌లో చాల తేడా ఉంది కదూ. నా ఉత్తరానికీ, మీ కథకి మూలమైన ఆలోచన ఒకటే కాని, మన స్టైళ్ళు వేరు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. అభినందనలు.

ఏకాంతపు దిలీప్ said...

@విహారి గారు
మన ఏకాంతాన్ని కూడా మరిచిపోయారు :-(

ఏకాంతపు దిలీప్ said...

@విహారి గారు
మన ఏకాంతాన్ని కూడా మరిచిపోయారు :-(

phani said...

విహారి గారు,ఇంతవరకు వ్యాఖ్యానాలలోనే కనపడే ఈ అర్భకుని పేరును అందలమెక్కించి మీ బ్లాగు లో ప్రస్తావించినందుకు బ్లాగాయుష్మాన్ భవ.

siva said...

మీ ఓర్పు కు నా జోహార్ {ఇంత పొడవైన బ్లాగు ను రాసినందుకు}

seenu said...

మా వ్యాఖ్యానాలకు మీ స్పందన చాలా బాగుంది,దయ చేసి బ్లాగు సైజు కొంచెం తగ్గిస్తే సంతోషం.

Ramesh said...

అసంపూర్తి అయినా చాలా బాగా ఉంది. ఏదో ఒక ఉధ్దేశ్యం మాత్రం సార్దకమైంది. అన్నింటికన్నా ముఖ్యంగా తెలుగులో ఇలాంటి (ఇంతమంచి) బ్లాగ్ ఉందా అని చాలా సంతోషమైంది. థాంక్సండీ. ఇకనుండీ నేను మీ బ్లాగుకి రెగ్యులర్ విజిటర్ని.

మేధ said...

వ్రాసిన విధానం బావుంది కానీ, ఆ పేర్లకి అలా బ్రాకెట్స్ పెట్టే బదులు లింక్ ఇస్తే బావుండి ఉండేది. లింక్ కాకపోయినా, బోల్డ్ అలా ఉండి ఉంటే బావుండేది.. అలా ఉండడం వలన, చదవడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది.. అయినా మీరు ఇది వ్రాయడానికి పడిన కష్టం ముందు నా ఇబ్బంది పెద్ద ఇబ్బంది కాదేమో!

జ్యోతి said...

తమ్మి విహారి, అలా బ్రాకెట్లలో పెట్టే బదులు లింకులు ఇస్తే అన్ని ఇళ్ళు ఓసారి చుట్టేసి వస్తాము కదా. ఇంకో టపా రాసే బదులు కాస్త ఈ పని చూడు..

Anonymous said...

@ కాశ్యప్ గారు,

భలే వారండీ. నాకు ఓపికుంటే అందరి పేర్లు రాసుందే వాడిని. :-)

మీలాగే అందరూ అడుగుంటే ఎంత బావుండేదో? ఓ మూడువందలు కామెట్లొచ్చి రికార్డు స్థాపించి వుండేవాడిని.
@ సోమ శంకర్ గారు,

నెనర్లు.
@ దీపు గారు,

అవునండి చింతిస్తున్నాను :-(

ధన్య వాదాలు.

@ ఫణి గారు,

మన మందరం బ్లాగర్లు సార్ ఎవరూ అర్భకులు కారు. నేనూ మీ లాంటి వాడినే.

@ శివ గారు,

ఇలాంటి పొడవైన బ్లాగులు చాలా మంది రాస్తున్నారు సార్.

నెనర్లు.

@ సీను గారు,

బ్లాగు సైజంటే టెంప్లేటా లేకు రాసే టపా సైజా?
టపా సైజు తగ్గించాలంటే చాలా సాధన చెయ్యాలి.
ధన్యవాదాలు.

@ a గారు,

మీ అభినానానికి ధన్యుణ్ణి. ఇంకా చాలా బ్లాగులున్నాయి. అవి కూడా చూడండి.

@ మేధ గారు,

సవరించాను బోల్డు గా.లింకులు పెట్టాలంటే మరో గంట టైము అవసరమవుతుంది. అందువల్లే జై హింద్ చెప్పేశా.

నెనర్లు.

@ జ్యోతక్కా,

నా వల్ల కాని పని.

నెనర్లు.

-- విహారి

Ramesh said...

కాదారయ్య పేరడీ చదివి చాలా నవ్వాను. ఇతర పోస్టులూ బాగున్నాయి,చాలా మంచి బ్లాగు. బ్లాగర్లకధ ఆరంభశూరత్వం బాగుంది. మొత్తానికి తెలుగువాడనిపించుకున్నారు. కాస్త రిస్కు తీస్కుని దాన్లో ఉన్న అన్ని బ్లాగుల పేర్లకి ఆ బ్లాగు అడ్రస్ లోకి డైరెక్ట్ చేసేలా బుక్ మార్కో హైపర్ లింకో ఇచ్చుంటే చాలా ఉపయోగంగా ఉండేది. www.thatstelugu.oneindia.in చూడండి. బుక్ మార్క్స్ లో మీ బ్లాగుకి చోటిచ్చాం.

Anonymous said...

హైపర్ లింకులు పెట్టాలంటే ఓ పెద్ద పని. అసంపూర్తి గా వుంది కదా అని పెట్టలేదు.

దట్స్ తెలుగు లో లంకె వేసినందుకు ధన్యవాదాలు.

-- విహారి