Thursday, May 31, 2007

ఓక ప్రశ్న ఇద్దరి సమాధానాలు:

ముఖ్యమంత్రి ని మాజీ ముఖ్యమంత్రి ని ఒక టీ.వి. కార్యక్రమానికి ఆహ్వానించారు. ఏదురెదురుగా కూచున్న వాళ్ళని యాంకర్ ప్రశ్నలేస్తోది.

మీరు బాగా అభివృధ్ధి చేసిన ప్రదేశం

ప్రభుత్వాధి నేత : నా నియోజక వర్గం
ప్రతిపక్ష నేత : నా నియోజక వర్గం

మీకు హైటెక్ పద్ధతిలో డబ్బు తినడం ఇష్టమా, ప్రాజెక్టులు పేరు చెప్పి డబ్బు తినడం ఇష్టమా?

ప్రభుత్వాధి నేత : రెండూ ఇష్టమే. రెండూ రెండు కళ్ళు లాంటివి.
ప్రతిపక్ష నేత : రెండూ ఇష్టమే. రెండూ రెండు కళ్ళు లాంటివి.

మీకు ఎదయినా పరాజయం ఎదురయితే దానికి కారణమేదని పిస్తుంది?

ప్రభుత్వాధి నేత.: నా ఎదురుగా కూర్చున్న ఆయన కారణమనిపిస్తుంది.
ప్రతిపక్ష నేత : నా ఎదురుగా కూర్చున్న ఆయన కారణమనిపిస్తుంది.

మీకు జీవితమంతా ఎలా గడపాలని పిస్తుంది?

ప్రభుత్వాధి నేత.: ప్రజా సేవలో
ప్రతిపక్ష నేత : ప్రజా సేవలో

అలా కాదు మీ శేష జీవితాన్ని ఎక్కడ గడపాలనిపిస్తోంది?

ప్రభుత్వాధి నేత.: ముఖ్యమంత్రి కుర్చీలో
ప్రతిపక్ష నేత : ముఖ్యమంత్రి కుర్చీలో

మీకు ఏమయినా ఆయనతో అభిప్రాయ బేదాలున్నాయా?

ప్రభుత్వాధి నేత.: ఆయనకు నేనంటే పడదు. నా అభివృధ్ది పథం వేరు. ఆయన అభివృద్ధి పథం వేరు.
ప్రతిపక్ష నేత : ఆయనకు నేనంటే పడదు. నా అభివృధ్ది పథం వేరు. ఆయన అభివృద్ధి పథం వేరు.

మీరు ఒకే మాట మీద వుండి ఓటు వేసేదెప్పుడు?

ప్రభుత్వాధి నేత.: మా జీతాలు పెంచాలని ఓటింగ్ పెట్టినప్పుడు.
ప్రతిపక్ష నేత : మా జీతాలు పెంచాలని ఓటింగ్ పెట్టినప్పుడు.

Tuesday, May 29, 2007

బ్లాగదాభి రామ బ్లాగర -- 4

.

బ్లాగుతీర్పులిచ్చువారు బోలెడీభూమండలంబు
లుర్వి బ్లాగులనెల్ల నుండు వింత తీర్పు
తీర్పుచెప్పువారు తమ తిక్క తీర్పులెరగరు
బ్లాగదాభి రామ బ్లాగర విహారి


తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభి రామ విన వేమ.

.

Tuesday, May 22, 2007

జబ్బలు చరిచాం... అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం జరిపాం.


జబ్బలు చరిచాం. అమెరికా బ్లాగర్ల సమావేశం జరిపాం.
(ఇది బస్తీమే సవాల్ కు పేరడీ కాదని మనవి)

సమ ఆవేశంతో సమావేశంలో పాల్గొన్నవారు: పద్మ ఇంద్రకంటి, రవి వైజా సత్య,
రానారె, ప్రసాద్ చరసాల,ఇస్మాయిల్, సురేష్ కొలిచెల మరియూ విహారి.



తేదీ :19-May-07
సమయం :రాత్రి 10:00(తూర్పు తీర ప్రాంతం– సురేష్,ప్రసాద్,ఇస్మాయిల్ )
9:00(మధ్య ప్రాంతం – రవి, రానారె)
8:00(విహారీ కొండ ప్రాంతం)
7:00(పశ్చిమ తీర ప్రాంతం - పద్మ)
(భారత కాల మానం ప్రకారం తరువాతి రోజు ఉదయం 7:30 గంటలు)
స్థలం :దూర తంత్రుల్లో


సురేష్ గారు అందరికీ ఒక్క ఎనిమిది వందలు నంబరిచ్చి (1-800-xxx-xxxx) అందర్నీ దూర తంత్రుల్లో దూరమని ముందుగానే చెప్పారు. సరైన సమయానికే రవి, రానారె, సురేష్, ఇస్మాయిల్ లు తమ టెలిఫోను మీటలు నొక్కడం వల్ల పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. సేద్యం పనులు వుండడం వల్ల మూడు నిముషాలు ఆలస్యంగా విహారి సమావేశంలోకి చేరారు. కాసేపటికి పద్మ ఇంద్రకంటి గారు లాస్ ఏంజలిస్ నుండి కలిశారు.ప్రసాద్ అన్నీ పూర్తి చేసుకుని సమావేశంలో దూకుదాము అనుకునే సమయానికి వాళ్ళ అబ్బాయి వల్ల చిన్న అవాంతరమేర్పడి కొంచెం ఆలస్యంగా కలిశారు. అమెరికాలోని అన్ని టైం జోన్ల వాళ్ళు (ఒక్క హవాయ్, అలస్కా టైమ్ వాళ్ళు తప్ప) కలిశాం.


ఈ సమావేశానికో ప్రత్యేకత వుంది. ఇందులో దాదాపుగా ఎవరికీ ఇంకొకరు ఎలా వుంటారో తెలీదు. సురెష్ గారికి పద్మ గారు తెలుసు. రానారె, ఇస్మాయిల్ అప్పుడెప్పుడో విమానాలు పైకెగిరి కిందకు దిగే చోట కలుసుకుని బాంబులెలా తయారు చెయ్యాలో మాట్లాడుకున్నారు. అంతకు మించి ఎవరికెవరూ తెలీదు. అవతలి వ్యక్తి హావ భావాలు ఎలా వున్నాయో తెలీకుండా అందరూ తగు జాగ్రత్త గా మాట్లాడారు. కొంత సేపు గంభీరంగా మరికొంతసేపు ఉల్లాసంగా జరిగింది.


మొదటగా అందరూ తాము తెలుగు లిపిని ఎలా వాడుతున్నారో చెప్పారు. ఇస్మాయిల్ కావ్యనందనం ద్వార తెలుగు నేర్చుకున్నట్లు, రానారె మొదట ఫోనెటిక్ ఉపయోగించినా ఇప్పుడు ఇన్స్క్రిప్ట్ ద్వారా తెలుగును ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.


తెలుగు ప్రచారాన్ని ఎలా పెంచాలనే విషయమ్మీద అందరూ ఎంతో విలువైన సలహాలు ఇచ్చారు. తెలుగు ను పెంచడానికి స్థానిక సంస్థల తొడ్పాటు తో కృషి చేయ్యాలని రవి చెప్పారు. అందులో భాగంగా అమెరికా లో వున్న తెలుగు సంఘాల సాలె గూళ్ళను తెలుగు యూనీ కోడీ కరించడం, తెలుగును ఎలా ఉపయోగించాలో చెప్పే విధానాలను అందరికి అందించడం మంచిదని చెప్పారు. ప్రస్తుతానికి ఆచరణలో తెలుగు సంఘాల సాలె గూళ్ళను తెలుగీకరింపచేసే ప్రయత్నం కొన్ని కారణాల వల్ల కుదరక పోవచ్చునని విహారి చెప్పారు. కానీ తెలుగు సంఘాల సహాయాన్ని తీసుకుని వాళ్ళ సభ్యులందరికి తెలుగు వికీపీడియా గురించి, తెలుగు బ్లాగుల గురించి, తెలుగును ఎంత సులభంగా కంప్యూటర్లలో వాడచ్చో చెప్పే సమాచారాని అందిచవచ్చని అన్నారు.


సురేష్ గారు తనకు తెలుగులో మాట్లాడ్డం అంత బాగ రాదని పెద్ద జోక్ పేల్చారు. పొద్దులో ఆయన రాసిన వ్యాసాన్ని చూసి ఎవరైనా ఆ మాట నమ్ముతారా?


ప్రసాద్ తనకు C-Dac వాళ్ళు పంపిన సి.డి. వచ్చింది కానీ దానిని వ్యవస్థాపితం చెయ్యడంలో ఇబ్బందు లొస్తున్నాయని చెప్పారు. తరువాత విషయం ఫాంట్ల మీదికి మళ్ళింది. కంప్యూటర్లో తెలుగు వాడచ్చా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారని ఇస్మాయిల్ చెప్పారు.


కొత్త తెలుగు ఫాంట్ కోసం జరుగున్న అభివృద్ధి గురించి రవి చెప్పారు. ఫాంట్ల పోటీలో ప్రస్తుతం హైదరాబాదు నుండి అంబరీష్ గారు ఫాంటు తయారు చేస్తున్నారు. ఫాంటులు తయారు చేయటానికి కావలసిన పరిజ్ఞాన మున్న వారికి ఈ వార్త అందకపోవటం మరియు బహుమతి మొత్తం పెద్ద ఎక్కువేం కాకపోవటం ఎక్కువ మంది ముందుకు రాక పోవటానికి కారణాలని భావించటమైనది. ఫాంటు తయారీకి నగదు బహుమతి పెంచితే మరింత మంది పాల్గొనే అవకాశముందని పద్మ గారు అన్నారు. పద్మ ఇంద్రకంటి గారు గతంలో వేమూరి వేంకటేశ్వర రావ్ గారు పెట్టిన ఒక పోటీ గురించి చెబుతూ వచ్చిన ప్రతిస్పందన స్వల్పమని అభిప్రాయపడ్డారు. ఈ ఫాంట్ల పోటీని కూడా తానా/ఆటా వారి ఆధ్వర్యంలో జరిపితే బాగుంటుందనే ఆలోచనని సభ్యులు కొద్దిగా చర్చించారు. ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోబడలేదు.


తెలుగు లో అందరూ టైపు చెయ్యాలంటే దాని గురించి అన్ని సమాచారాలతో కూడుకున్న ఒక ఎక్జిక్యూటబుల్ ను అందిస్తే దాన్ని అందరూ తమ కంప్యూటర్లో వ్యవస్థాపితం చేసుకుని సులువుగా తెలుగు టైపు చెసుకునే సౌకర్యం వుంటుంది అని రానారె చెప్పారు. ఇది అందరికి నచ్చింది. బహుశా భా.తె.బ్లా.సం., బె.బ్లా.సం., అ.బ్లా.సం. వాళ్ళు అందరూ కలిసి దీని మీద పని చేస్తే మంచిదని అనుకున్నారు.


యాహూ లో యూనికోడ్ సపోర్ట్ పూర్తిగా లేకపోవడం, చాలా మందికి ఇంకా యాహూ email accounts ఉండడం: యాహూ బీటా లో యూనికోడ్ సపోర్ట్ ఉన్నా, చాలా మంది users పాత యాహూ కి అలవాటు పడి ఉండడం యూనికోడ్ వ్యాప్తికి చిన్న ఆటంకాలు అని అనుకోవడం జరిగింది. ఈమాట లో తెలుగు యూనీకోడ్ ప్రయత్నాన్ని దాని లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈమాట.కాం సంపాదకులైన సురేష్ గారు వివరించారు.


CDAC వాళ్లు విడుదల చేసిన ఫాంట్లు 'పైన పటారం లోన లొటారం' చందాన ఉండడం. కానీ, వాటికి copyright, licensing వివరాలు తెలిస్తే, ఆ ఫాంట్లు software ద్వారా 'బాగు'చేసి public domain లో ఉంచడం కష్టమేమీ కాదని సురేష్ గారు సెలవిచ్చారు. తాము ఇండియా వెళ్లినప్పుడు CDAC వాళ్లని కలిసి copyright వివరాలు వాకబు చేసి, ఆ ఫాంట్లని బాగు చేసే పని తన భుజస్కందాలపై వేసుకున్నారు. అందమైన యూనికోడ్ ఫాంట్లు అందుబాటులోకి రావడం అన్నది తెలుగు కంపూటింగ్ లో ముఖ్యమైన మైలురాయి అవుతుందని సభ్యులందరూ ఒప్పుకున్నారు. సురేష్ గారు భారత్ వెళ్ళినపుడు మన హైదరాబాద్ బ్లాగు మిత్రులను కలుస్తానని చెప్పారు.


తెవికీ గురించి: తెవికీలో సభ్యుల సంఖ్య కన్నా, దానిలో వ్యాసాలకి లింకు చేసేవారి సంఖ్య గణనీయంగా తక్కువ ఉండడం మీద పద్మ విచారం వెలిబుచ్చారు. (పల్లకీ ఎక్కేవారికన్నా మోసేవారి సంఖ్య ఎక్కువ ఉండడం విచిత్రం!) బ్లాగర్లందరూ తెవికీలో వ్యాసాలకి తమ బ్లాగుల్లో సందర్భోచితంగా లింకు చెయ్యాలనే పద్మ సలహా అంగీకరించబండింది.


బ్లాగుల్లో అభిప్రాయాలు తెలియచేయగలిగే interface అన్ని బ్లాగుల్లో ఒకేలాగా ఉంటే,పాఠకులకి బ్లాగుల్లో అభిప్రాయాలు తెలియచేయడం సులువు అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడయింది. 'ఈమాట' సురేష్ గారు తాము తయారు చేసిన wordpress telugu comments plugin ని ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. ఇది ఉపయోగించడం లో ఏర్పడిన ఒక చిన్న ఇబ్బందిని (bug) ని ప్రసాద్ గారు సురేష్ గారి దృష్టికి తెచ్చారు. అది త్వరలోనే పరిష్కరించబడుతుందని సురేష్ గారు హామీ ఇచ్చారు.


blogspot.com , wordpress.com లో (వీటికి సొంత plugins install చేసే అవకాశం లేదు) జావాస్క్రిప్ట్ ద్వారా తెలుగు అభిప్రాయాలు తెలియచేయగలిగే అవకాశం ఉందేమో పరిశీలించాలని పద్మ సూచించారు.


తెలుగు గురించి వీలయితే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటి తయారు చేసి వచ్చే తానా సమావేశంలో ప్రదర్శిస్తే బావుంటుందని విహారి చెప్పారు. అందుకోసం అందరూ ప్రయంత్నించొచ్చని అనుకున్నారు. ప్రజెంటేషన్ తయారు చేసే బాధ్యత రవి తీసుకున్నారు.బహుశా తమ కొత్త జీవిత భాగ స్వామికి తన బాధ్యతను అప్పచెప్పుతారని అనుకుంటున్నాం.


ఇంట్లో ఎప్పుడూ కంప్యూట కీబోర్డును టక టక లాడించే రానారే అందరికి ఉపయోగ పడే కొన్ని తెవికి లింకులు తయారు చేస్తానని అన్నారు. స్కూల్లో రెండో తరగతి చదివేటప్పుడు తమ మేస్టారు తనకు బహుమతి గా ఇచ్చిన చింత బర్ర ని ఆయుధంగా వాడుకుని అందరు బ్లాగర్లూ తమ బ్లాగుల్లో అవి పెట్టేటట్లు చూస్తానని చెప్పారు.


కార్య వర్గం ఏర్పాటు చేసుకునే అంత అవసరం ఇప్పుడు లేదు వీలయితే ఓ నాన్-ప్రాఫిటబుల్ సంస్థ గా నమోదు చేయించుకోవచ్చని సూచించడం జరిగింది. అందరూ కలిసి e-తెలుగు కు అనుబంధంగా పని చేస్తూ e-తెలుగు ఆశయాలే అమెరికా తెలుగు బ్లాగర్ల, అమెరిక వికీపీడియన్ల ఆశయాలుగా పని చెద్దామని నొక్కి వక్కాణించారు.


ఇలా మాట్లాడుతూ వుండగా తూర్పు తీర ప్రాంతం వారు నోట్లో చిటికెలు వేసుకోవడం వినిపించడం, పశ్చిమ తీరం వాళ్ళకు "ఆత్మా రాముడి" నుండి ఫోన్లు రావడం జరిగింది. ఇంకాసేపు అలానే మాట్లాడితే "మత్తు వదలర నిద్దుర మత్తు వదలరా.." అని తూర్పు నుంచి, "వివాహ భోజనంబు వింతైన వంటకంబు.." అని పశ్చిమం నుండి పాటలు వస్తాయని సమావేశాన్ని "శుభ రాత్రి" అని ముగించేశారు.


ప్రస్తుతానికి తీసుకొన్న కొన్ని నిర్ణయాలు:


* తెలుగు ప్రచార ఉద్యమాన్ని తీవ్ర తరం చేయడం.
* తెవికీ ని అందరికి అందుబాటులో వుంచడం
* బ్లాగుల విశిష్టతను తెలియ చెప్పడం.
* తెలుగు టూల్బార్ ఉపయోగాలు చెప్పడం.
* అన్ని బ్లాగులలో వికీపీడియా గురించి సమాచారాన్ని అందరికి కనిపించే చోటులో వించడం.
* వీలయితే అందరి బ్లాగుల్లో (కొత్త వారి) కామెంట్లు సులువుగా తెలుగు రాసేటట్లు వుంచడం


అడిగిన వెంటనే పైనున్న ఛాయ చిత్రాన్ని "గూగుల్ మామ" తో నిర్మించి పెట్టిన సురేష్ గారికి ధన్యవాదాలు.

గమనిక:

అమెరికాలో వున్న ఇతర తెలుగు బ్లాగర్లు,

త్వరలో జరగబోవు ఇంకో సమావేశంలో పాల్గొనాలని ఈ బ్లాగు ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఇంకో కిటుకు చెబుతున్నా ఎవరికీ చెప్పకండి (కావాలంటే ఈ-మెయిల్ పంపించండి). మీరు కాఫీ తాగుతూనో లేక దుప్పటి కప్పుకుని గుర్రెట్టి( శబ్దం రాకుండా) ఊ కొడుతూనో కూడా సమావేశంలో పాల్గొనవచ్చు. కాకపోతే ఇందులో జ్యోతక్క వంటకాలు, కామత్ హోటల్ భోజనాలు, మావళ్ళి టిఫిన్ రూం పూరీ, సాగులు వుండవు.

గుంపులో కేకల
విహారి

Thursday, May 03, 2007

ధ.దే.ఈ.శు. ఏదో ఒక ఊసు

పిల్లలు స్కూలుకు వెళ్ళే సన్నివేశాలు పిల్లలున్న అందరికి గుర్తుంటుంది. భారత్ లో అయితే ఆరున్నొక్క రాగం తొ మొదలయ్యి చెవులు ఎర్ర రంగులోకి, చెంపలు గులాబి రంగులోకి, వీపు వివిద రంగుల్లోకి వర్ణ సంక్రమమయి ఇంధ్రధనుస్సు వెలిశాక బుజ్జి శాల్తీ నిండైన రిక్షాలోకో, ఆటోలోకో వెళ్తుంది. ఆ వెళ్ళే వాహనాన్ని చూస్తే ఇంధ్ర ధనుస్సు గుంపు అరుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అమెరికాలో అయితే ఆ ఇంధ్రధనుస్సు అంతా ఇంట్లో వుండేట్టు చూసుకోవాలి లేకపోతే నెమలి ఈకల రంగులు గుర్తుకుతెచ్చుకుని ఆ ఈకల ధారి శ్రీకృష్ణ జన్మస్థానం చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మా బుడ్డోడు రంగుల్లేకుండా స్కూలుకు వెళ్తున్నాడు. కాకపొతే మాకే ఎక్కువ రంగుల పడుతున్నాయి వాడి మాటల్తో.


మామూలుగా స్కూలుకు వెళ్ళి వచ్చిన పిల్లలు స్కూల్లో ఆ రోజు ఏమి జరిగిందో గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. దానికి మా వాడు రివర్స్. ఇదిగో నిన్న జరిగిన సంభాషణ మా వాడు K.G. స్కూలు నుండి వచ్చిన తరువాత.


బుడ్డోడి అమ్మ: నాన్న! ఈ రోజు స్కూల్లో ఏమి చెప్పారు?

బుడ్డోడు : నేను చెప్పను.

అమ్మ: అది కాదు నాన్నా స్కూల్లో ఏమి జరిగిందో ఇంట్లో చెప్పాలని నీకు స్కూల్ టీచర్ చెప్పింది కదా.

బుడ్డోడు : నేను చెప్పనంటే చెప్పను అంతే.

అమ్మ: చెప్పు నాన్న ప్లీజ్.

బుడ్డోడు : అయితే నువ్వు పొద్దున్నుండి ఏమి చేశావో చెప్పు అప్పుడు నేను ఆలోచిస్తా చెప్పాలో వద్దో.

అమ్మ: ? ? ?



:

: