జబ్బలు చరిచాం... అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం జరిపాం.
జబ్బలు చరిచాం. అమెరికా బ్లాగర్ల సమావేశం జరిపాం.
(ఇది బస్తీమే సవాల్ కు పేరడీ కాదని మనవి)
సమ ఆవేశంతో సమావేశంలో పాల్గొన్నవారు: పద్మ ఇంద్రకంటి, రవి వైజా సత్య,
రానారె, ప్రసాద్ చరసాల,ఇస్మాయిల్, సురేష్ కొలిచెల మరియూ విహారి.
తేదీ :19-May-07
సమయం :రాత్రి 10:00(తూర్పు తీర ప్రాంతం– సురేష్,ప్రసాద్,ఇస్మాయిల్ )
9:00(మధ్య ప్రాంతం – రవి, రానారె)
8:00(విహారీ కొండ ప్రాంతం)
7:00(పశ్చిమ తీర ప్రాంతం - పద్మ)
(భారత కాల మానం ప్రకారం తరువాతి రోజు ఉదయం 7:30 గంటలు)
స్థలం :దూర తంత్రుల్లో
సురేష్ గారు అందరికీ ఒక్క ఎనిమిది వందలు నంబరిచ్చి (1-800-xxx-xxxx) అందర్నీ దూర తంత్రుల్లో దూరమని ముందుగానే చెప్పారు. సరైన సమయానికే రవి, రానారె, సురేష్, ఇస్మాయిల్ లు తమ టెలిఫోను మీటలు నొక్కడం వల్ల పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. సేద్యం పనులు వుండడం వల్ల మూడు నిముషాలు ఆలస్యంగా విహారి సమావేశంలోకి చేరారు. కాసేపటికి పద్మ ఇంద్రకంటి గారు లాస్ ఏంజలిస్ నుండి కలిశారు.ప్రసాద్ అన్నీ పూర్తి చేసుకుని సమావేశంలో దూకుదాము అనుకునే సమయానికి వాళ్ళ అబ్బాయి వల్ల చిన్న అవాంతరమేర్పడి కొంచెం ఆలస్యంగా కలిశారు. అమెరికాలోని అన్ని టైం జోన్ల వాళ్ళు (ఒక్క హవాయ్, అలస్కా టైమ్ వాళ్ళు తప్ప) కలిశాం.
ఈ సమావేశానికో ప్రత్యేకత వుంది. ఇందులో దాదాపుగా ఎవరికీ ఇంకొకరు ఎలా వుంటారో తెలీదు. సురెష్ గారికి పద్మ గారు తెలుసు. రానారె, ఇస్మాయిల్ అప్పుడెప్పుడో విమానాలు పైకెగిరి కిందకు దిగే చోట కలుసుకుని బాంబులెలా తయారు చెయ్యాలో మాట్లాడుకున్నారు. అంతకు మించి ఎవరికెవరూ తెలీదు. అవతలి వ్యక్తి హావ భావాలు ఎలా వున్నాయో తెలీకుండా అందరూ తగు జాగ్రత్త గా మాట్లాడారు. కొంత సేపు గంభీరంగా మరికొంతసేపు ఉల్లాసంగా జరిగింది.
మొదటగా అందరూ తాము తెలుగు లిపిని ఎలా వాడుతున్నారో చెప్పారు. ఇస్మాయిల్ కావ్యనందనం ద్వార తెలుగు నేర్చుకున్నట్లు, రానారె మొదట ఫోనెటిక్ ఉపయోగించినా ఇప్పుడు ఇన్స్క్రిప్ట్ ద్వారా తెలుగును ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
తెలుగు ప్రచారాన్ని ఎలా పెంచాలనే విషయమ్మీద అందరూ ఎంతో విలువైన సలహాలు ఇచ్చారు. తెలుగు ను పెంచడానికి స్థానిక సంస్థల తొడ్పాటు తో కృషి చేయ్యాలని రవి చెప్పారు. అందులో భాగంగా అమెరికా లో వున్న తెలుగు సంఘాల సాలె గూళ్ళను తెలుగు యూనీ కోడీ కరించడం, తెలుగును ఎలా ఉపయోగించాలో చెప్పే విధానాలను అందరికి అందించడం మంచిదని చెప్పారు. ప్రస్తుతానికి ఆచరణలో తెలుగు సంఘాల సాలె గూళ్ళను తెలుగీకరింపచేసే ప్రయత్నం కొన్ని కారణాల వల్ల కుదరక పోవచ్చునని విహారి చెప్పారు. కానీ తెలుగు సంఘాల సహాయాన్ని తీసుకుని వాళ్ళ సభ్యులందరికి తెలుగు వికీపీడియా గురించి, తెలుగు బ్లాగుల గురించి, తెలుగును ఎంత సులభంగా కంప్యూటర్లలో వాడచ్చో చెప్పే సమాచారాని అందిచవచ్చని అన్నారు.
సురేష్ గారు తనకు తెలుగులో మాట్లాడ్డం అంత బాగ రాదని పెద్ద జోక్ పేల్చారు. పొద్దులో ఆయన రాసిన వ్యాసాన్ని చూసి ఎవరైనా ఆ మాట నమ్ముతారా?
ప్రసాద్ తనకు C-Dac వాళ్ళు పంపిన సి.డి. వచ్చింది కానీ దానిని వ్యవస్థాపితం చెయ్యడంలో ఇబ్బందు లొస్తున్నాయని చెప్పారు. తరువాత విషయం ఫాంట్ల మీదికి మళ్ళింది. కంప్యూటర్లో తెలుగు వాడచ్చా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారని ఇస్మాయిల్ చెప్పారు.
కొత్త తెలుగు ఫాంట్ కోసం జరుగున్న అభివృద్ధి గురించి రవి చెప్పారు. ఫాంట్ల పోటీలో ప్రస్తుతం హైదరాబాదు నుండి అంబరీష్ గారు ఫాంటు తయారు చేస్తున్నారు. ఫాంటులు తయారు చేయటానికి కావలసిన పరిజ్ఞాన మున్న వారికి ఈ వార్త అందకపోవటం మరియు బహుమతి మొత్తం పెద్ద ఎక్కువేం కాకపోవటం ఎక్కువ మంది ముందుకు రాక పోవటానికి కారణాలని భావించటమైనది. ఫాంటు తయారీకి నగదు బహుమతి పెంచితే మరింత మంది పాల్గొనే అవకాశముందని పద్మ గారు అన్నారు. పద్మ ఇంద్రకంటి గారు గతంలో వేమూరి వేంకటేశ్వర రావ్ గారు పెట్టిన ఒక పోటీ గురించి చెబుతూ వచ్చిన ప్రతిస్పందన స్వల్పమని అభిప్రాయపడ్డారు. ఈ ఫాంట్ల పోటీని కూడా తానా/ఆటా వారి ఆధ్వర్యంలో జరిపితే బాగుంటుందనే ఆలోచనని సభ్యులు కొద్దిగా చర్చించారు. ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోబడలేదు.
తెలుగు లో అందరూ టైపు చెయ్యాలంటే దాని గురించి అన్ని సమాచారాలతో కూడుకున్న ఒక ఎక్జిక్యూటబుల్ ను అందిస్తే దాన్ని అందరూ తమ కంప్యూటర్లో వ్యవస్థాపితం చేసుకుని సులువుగా తెలుగు టైపు చెసుకునే సౌకర్యం వుంటుంది అని రానారె చెప్పారు. ఇది అందరికి నచ్చింది. బహుశా భా.తె.బ్లా.సం., బె.బ్లా.సం., అ.బ్లా.సం. వాళ్ళు అందరూ కలిసి దీని మీద పని చేస్తే మంచిదని అనుకున్నారు.
యాహూ లో యూనికోడ్ సపోర్ట్ పూర్తిగా లేకపోవడం, చాలా మందికి ఇంకా యాహూ email accounts ఉండడం: యాహూ బీటా లో యూనికోడ్ సపోర్ట్ ఉన్నా, చాలా మంది users పాత యాహూ కి అలవాటు పడి ఉండడం యూనికోడ్ వ్యాప్తికి చిన్న ఆటంకాలు అని అనుకోవడం జరిగింది. ఈమాట లో తెలుగు యూనీకోడ్ ప్రయత్నాన్ని దాని లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈమాట.కాం సంపాదకులైన సురేష్ గారు వివరించారు.
CDAC వాళ్లు విడుదల చేసిన ఫాంట్లు 'పైన పటారం లోన లొటారం' చందాన ఉండడం. కానీ, వాటికి copyright, licensing వివరాలు తెలిస్తే, ఆ ఫాంట్లు software ద్వారా 'బాగు'చేసి public domain లో ఉంచడం కష్టమేమీ కాదని సురేష్ గారు సెలవిచ్చారు. తాము ఇండియా వెళ్లినప్పుడు CDAC వాళ్లని కలిసి copyright వివరాలు వాకబు చేసి, ఆ ఫాంట్లని బాగు చేసే పని తన భుజస్కందాలపై వేసుకున్నారు. అందమైన యూనికోడ్ ఫాంట్లు అందుబాటులోకి రావడం అన్నది తెలుగు కంపూటింగ్ లో ముఖ్యమైన మైలురాయి అవుతుందని సభ్యులందరూ ఒప్పుకున్నారు. సురేష్ గారు భారత్ వెళ్ళినపుడు మన హైదరాబాద్ బ్లాగు మిత్రులను కలుస్తానని చెప్పారు.
తెవికీ గురించి: తెవికీలో సభ్యుల సంఖ్య కన్నా, దానిలో వ్యాసాలకి లింకు చేసేవారి సంఖ్య గణనీయంగా తక్కువ ఉండడం మీద పద్మ విచారం వెలిబుచ్చారు. (పల్లకీ ఎక్కేవారికన్నా మోసేవారి సంఖ్య ఎక్కువ ఉండడం విచిత్రం!) బ్లాగర్లందరూ తెవికీలో వ్యాసాలకి తమ బ్లాగుల్లో సందర్భోచితంగా లింకు చెయ్యాలనే పద్మ సలహా అంగీకరించబండింది.
బ్లాగుల్లో అభిప్రాయాలు తెలియచేయగలిగే interface అన్ని బ్లాగుల్లో ఒకేలాగా ఉంటే,పాఠకులకి బ్లాగుల్లో అభిప్రాయాలు తెలియచేయడం సులువు అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడయింది. 'ఈమాట' సురేష్ గారు తాము తయారు చేసిన wordpress telugu comments plugin ని ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. ఇది ఉపయోగించడం లో ఏర్పడిన ఒక చిన్న ఇబ్బందిని (bug) ని ప్రసాద్ గారు సురేష్ గారి దృష్టికి తెచ్చారు. అది త్వరలోనే పరిష్కరించబడుతుందని సురేష్ గారు హామీ ఇచ్చారు.
blogspot.com , wordpress.com లో (వీటికి సొంత plugins install చేసే అవకాశం లేదు) జావాస్క్రిప్ట్ ద్వారా తెలుగు అభిప్రాయాలు తెలియచేయగలిగే అవకాశం ఉందేమో పరిశీలించాలని పద్మ సూచించారు.
తెలుగు గురించి వీలయితే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటి తయారు చేసి వచ్చే తానా సమావేశంలో ప్రదర్శిస్తే బావుంటుందని విహారి చెప్పారు. అందుకోసం అందరూ ప్రయంత్నించొచ్చని అనుకున్నారు. ప్రజెంటేషన్ తయారు చేసే బాధ్యత రవి తీసుకున్నారు.బహుశా తమ కొత్త జీవిత భాగ స్వామికి తన బాధ్యతను అప్పచెప్పుతారని అనుకుంటున్నాం.
ఇంట్లో ఎప్పుడూ కంప్యూట కీబోర్డును టక టక లాడించే రానారే అందరికి ఉపయోగ పడే కొన్ని తెవికి లింకులు తయారు చేస్తానని అన్నారు. స్కూల్లో రెండో తరగతి చదివేటప్పుడు తమ మేస్టారు తనకు బహుమతి గా ఇచ్చిన చింత బర్ర ని ఆయుధంగా వాడుకుని అందరు బ్లాగర్లూ తమ బ్లాగుల్లో అవి పెట్టేటట్లు చూస్తానని చెప్పారు.
కార్య వర్గం ఏర్పాటు చేసుకునే అంత అవసరం ఇప్పుడు లేదు వీలయితే ఓ నాన్-ప్రాఫిటబుల్ సంస్థ గా నమోదు చేయించుకోవచ్చని సూచించడం జరిగింది. అందరూ కలిసి e-తెలుగు కు అనుబంధంగా పని చేస్తూ e-తెలుగు ఆశయాలే అమెరికా తెలుగు బ్లాగర్ల, అమెరిక వికీపీడియన్ల ఆశయాలుగా పని చెద్దామని నొక్కి వక్కాణించారు.
ఇలా మాట్లాడుతూ వుండగా తూర్పు తీర ప్రాంతం వారు నోట్లో చిటికెలు వేసుకోవడం వినిపించడం, పశ్చిమ తీరం వాళ్ళకు "ఆత్మా రాముడి" నుండి ఫోన్లు రావడం జరిగింది. ఇంకాసేపు అలానే మాట్లాడితే "మత్తు వదలర నిద్దుర మత్తు వదలరా.." అని తూర్పు నుంచి, "వివాహ భోజనంబు వింతైన వంటకంబు.." అని పశ్చిమం నుండి పాటలు వస్తాయని సమావేశాన్ని "శుభ రాత్రి" అని ముగించేశారు.
ప్రస్తుతానికి తీసుకొన్న కొన్ని నిర్ణయాలు:
* తెలుగు ప్రచార ఉద్యమాన్ని తీవ్ర తరం చేయడం.
* తెవికీ ని అందరికి అందుబాటులో వుంచడం
* బ్లాగుల విశిష్టతను తెలియ చెప్పడం.
* తెలుగు టూల్బార్ ఉపయోగాలు చెప్పడం.
* అన్ని బ్లాగులలో వికీపీడియా గురించి సమాచారాన్ని అందరికి కనిపించే చోటులో వించడం.
* వీలయితే అందరి బ్లాగుల్లో (కొత్త వారి) కామెంట్లు సులువుగా తెలుగు రాసేటట్లు వుంచడం
అడిగిన వెంటనే పైనున్న ఛాయ చిత్రాన్ని "గూగుల్ మామ" తో నిర్మించి పెట్టిన సురేష్ గారికి ధన్యవాదాలు.
గమనిక:
అమెరికాలో వున్న ఇతర తెలుగు బ్లాగర్లు,
త్వరలో జరగబోవు ఇంకో సమావేశంలో పాల్గొనాలని ఈ బ్లాగు ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఇంకో కిటుకు చెబుతున్నా ఎవరికీ చెప్పకండి (కావాలంటే ఈ-మెయిల్ పంపించండి). మీరు కాఫీ తాగుతూనో లేక దుప్పటి కప్పుకుని గుర్రెట్టి( శబ్దం రాకుండా) ఊ కొడుతూనో కూడా సమావేశంలో పాల్గొనవచ్చు. కాకపోతే ఇందులో జ్యోతక్క వంటకాలు, కామత్ హోటల్ భోజనాలు, మావళ్ళి టిఫిన్ రూం పూరీ, సాగులు వుండవు.
గుంపులో కేకల
విహారి
14 comments:
how do you use inscript to type in Telugu? is it like type-writing in Telugu?
అద్భుతం. ఆనందం. అమెరికా లోని తెలుగు భాషా ప్రియులు ఇలా కలవటం ఎంతో ముదావహం.అమెరికా తెలుగు ఉద్యానవనం లో, మీరంతా, తెలుగు భాషా సౌరభాలు వెదజల్లే పూలు పండించటానికి, ఈ కలయిక దోహద పడ గలదు.ఈ సమావేశాన్ని, తప్పిపోయిన వారు, తదుపరి సమావేశాలలో పాల్గొనగలరని ఆశిస్తాను. బస్తీమె సవాల్ స్వీకరించినందుకు, ఈ నివేదిక ఆసక్తికరంగా, చదివించేట్లుగా రాసిన విహారికి అభినందనలు.
మొత్తానికి ఆన్లైన్ లోనే బాంబులు తయారీ బాగా జరిగిందన్నమాట :-) ఇంకో సారి ఈ సమావేశం అయినప్పుడూ మాకూ ఆ ఎనిమిదొందల సంఖ్య ఇవ్వండీ, మేము స్కయిప్ లో వింటాం.
ఇరగ తీసినారు కదా
మొత్తానికి అమెరికా వాళ్ళనిపించుకున్నారు ఎనిమిది వందలతో :)
ఆహా...
మంచిది. తెలుగు సౌరభాలు అన్ని చోట్లా వెల్లి విరుస్తున్నాయి.
తెలుగు లో అందరూ టైపు చెయ్యాలంటే దాని గురించి అన్ని సమాచారాలతో కూడుకున్న ఒక ఎక్జిక్యూటబుల్ ను అందిస్తే దాన్ని అందరూ తమ కంప్యూటర్లో వ్యవస్థాపితం చేసుకుని సులువుగా తెలుగు టైపు చెసుకునే సౌకర్యం వుంటుంది అని రానారె చెప్పారు. ఇది అందరికి నచ్చింది. బహుశా భా.తె.బ్లా.సం., బె.బ్లా.సం., అ.బ్లా.సం. వాళ్ళు అందరూ కలిసి దీని మీద పని చేస్తే మంచిదని అనుకున్నారు.
అచ్చంగా మేమూ ఇదే విషయం మీద మాట్లాడుకున్నాము. అజెండా లో చేరుస్తా.
హ్ మ్ మ్ (Hmmmm)!!
తీవ్రంగా ఖండిస్తున్నాను! మధ్యలో సురేష్ ఏంటి ఇంత హడావిడి పడిపోవడం? ఆయన బ్లాగ్లెస్ (Homeless లాగా) కదా? ఎలా రానిచ్చారు?
(బాంబులు చేయడం సురేష్ నేర్చుకోలేదనే అనుకుంటున్నాను... అసలే హైదరాబాద్ వస్తున్నాట్ట త్వరలో :( )
జోకులు పక్కన పెట్టి, అందరికీ అభినందనలు. నేనూ ఏదో చిన్న పాటి సాఫ్ట్ వేర్ ఉద్యోగమే వెలగ పెడ్తున్నాను. ఓ సాహిత్య సమావేశానికి వెళ్ళి నప్పుడు, ఓ పత్రిక పెద్ద స్థానాలలోనే పనిచేసే వాళ్ళతో మాట్లాడాను. బతిమిలాడి చెప్పాను Unicode లోకి పత్రికలు మారాల్సిన అవసరమేమిటో. పత్రిక ఆఫీసుకు వచ్చి నా లాప్ టాప్ లో ప్రెజెంటేషన్ ఇస్తాననీ, ఎలా తెలుగు టైప్ చేయాలో అందరికీ నేర్పుతాననీ ఎన్నో చెప్పా... విన్న నాథుడు లేడు ఇప్పటిదాకా.
-అక్కిరాజు
giri గారు: inscript గురించి, తెలుగు బ్లాగింగ్ గురించి, ఇతర బ్లాగర్షుల గురించి తెలుసుకోవాలంటే మీరు తెలుగు బ్లాగుల గ్రూప్ లో చేరాల్సిందే (మీరు ఇప్పటికే సభ్యులు కాకపోయి ఉంటే). తెలుగు బ్లాగింగ్ కు అపూర్వమైన చైతన్యానికి, అసాధారణమైన ప్రచారాన్ని కలిగించిన వీవెనుడి టెక్కునిక్కులు కూడా మీకు సాయపడవచ్చు. Inscript గురించిన కొన్ని వివరాలు ఇక్కడ కూడా చూడవచ్చు.
@అక్కిరాజు 8-బిట్ ఫాంట్లకు అలవాటు పడ్డ తెలుగు పత్రికల వారిని అంత తొందరగా యూనికోడ్ లోకి మార్చడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, "ఏకం శాస్త్రం యూనికోడ్ ఏవ, ఏకో మంత్రః యూనికోడ్ నామాని " అంటూ యూనికోడ్ మంత్ర మహాత్మ్యాన్ని వీరికి పలుమార్లు, పలువురు, పదేపదే వినిపిస్తే ఏదో ఒకనాటికి యూనికోడ్ అంధత్వం పోయి వెలుగు చూడగలుగుతారనే ఆశ.
హడావిడిగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన బ్లాగర్లకు (అబ్లాగర్లకు), సమావేశం అయిన వెంటనే ద్విగుణీకృత ఉత్సాహంతో ఆచరణాంశాలను (action items) అమలులో పెట్టే కార్యక్రమం మొదలుపెట్టిన రానారె, విహారి మొదలైన వారందరికి కృతజ్ఞతలు, అభివందనములు.
"అబ్లాగ్య" సురేశ్.
బ్లాగు, బ్లాగనియేవు, బ్లాగు నాదనియేవు ...
సంజాయిషీ నోటీసు (Show cause): బ్లాగులో ఉండాల్సిన తెవికీ బొత్తమూ లింకూ లేవే, విహారానికెళ్లుంటాయా!
"ఇంట్లో ఎప్పుడూ కంప్యూట కీబోర్డును టక టక లాడించే రానారే" ... ఈ మాటకు ముందర "పనీపాటా లేకుండా" అనే విశేషణం ఒకటి ఉండాలే!?
బ్లాగు బ్లాగనియేవు, (నాకు)బ్లాగు లేదనియేవు,
మీ బ్లాగు లెంతవే సిలకా ...
పదిమంది రాస్తున్న పెద్ద బ్లాగే నాది,
"ఈమాట" నమ్మవే సిలకా ...
[అక్కిరాజుగారి అక్షితలకోసం సురేశ్‌గారి తరఫున సిద్ధమైన] రానారె :)
"ఈమాట" నమ్మవే సిలకా అంటూ తత్వబోధ చేసే రానారె అండ ఉండే ఏ అక్కిరాజు అక్షింతలకు, బూదరాజు బూదకుండలకు, బాంబురాజు బాంబులకు భయపడాల్సిన అవసరం లేదన్నమాట.
త్వరలో అమెరికా,బెంగళూరు,కొరియా,హైదరాబాదువాళ్ళందరు ఇలాగే ఒకేసారి సమావేశం జరుపుకోవాలని నా కోరిక.
రానారె మరియు సురేష్...
పిల్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదే! మాలాంటి వాళ్ళం చెమటోడ్చి (??) రాసినవన్నీ వేసేసుకుని, వాటిని కబ్జా చేసేసి... నా బ్లాగు అంటే ఊరుకోరు!
అక్కిరాజు అంటే "అన్నంరాజు" అని అనువదిస్తే పద్ధతి, భాషా శాస్త్రం చదివి దాన్ని "అక్షింతల రాజు" గా మారిస్తే... చదివాక కీకరకాయ అయినట్టుంది!!
అక్కిరాజు
శుభంభూయాత్.కీలక నిర్ణయాలు చాలానే తీసుకున్నారు.మీరు నిర్వహించే చిన్న చిన్న కార్యక్రమాలలో ఒక 5 నిమిషాలు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి గురించి చెప్పడానికి కేటాయిస్తే బాగుంటుందేమో?
జ్యోతి గారు: మంచి కోరికే! skype, gotomeeting.com, freeconferencecall.com మొదలైన వాటి ద్వారా మనమంతా కలిసి మాట్లాడుకోవడం వీలుపడుతుందనే అనుకుంటాను.అయితే, ఇన్ని టైం జోన్ల మధ్య అందరికి సౌకర్యంగా ఉండేటట్టుగా సమావేశాన్ని ఏర్పాటుచెయ్యడం ఒక చిన్న సమస్య కావచ్చు.
స్వాతి గారు: థాంక్స్. యునీకోడ్ ప్రాధాన్యత గురించి lec-demo సెమినార్లు ఏర్పాటు చెయ్యడం, అన్ని స్థానిక సంఘాల పత్రికలలో తెలుగు యునీకోడ్ విప్లవం గురించి వ్యాసాలను ప్రచురించడం, స్థానిక సంస్థలతో పని చేసి వారి వారి వెబ్సైట్లలో యునీకోడ్ వాడుకునేట్టుగా చెయ్యగలగడం లాంటి విషయాలు ఈ టెలీ-కాంఫరెన్స్ లో చర్చకు వచ్చాయి. కొత్తపాళీ గారు తానా సూవనీర్ కోసం రాసే వ్యాసాన్ని కొద్దిపాటి మార్పులతో స్థానిక పత్రికలలో ప్రచురించవచ్చేమో. చూద్దాం, ఏవి ఎంతవరకు ఫలితాలనిస్తాయో.
రిగార్డులతో,
సురేశ్.
అక్కి: అరి, అరికి, అరిచి, అక్కి అన్న పదాలకు పలు ద్రావిడ భాషలలో పొట్టు తీసివేసిన బియ్యం/వడ్లు అన్న అర్థమే ఉంది కాని వండిన అన్నం అన్న అర్థం లేదనే అనుకుంటున్నాను (DEDR 215). అయితే, అక్కి అన్న పదానికీ, సంస్కృతంలోని అక్షత (క్షత=విరిగిన; అక్షత=విరగని) అన్న పదానికి శబ్దసామ్యమే తప్ప వ్యుత్పత్తి సంబంధం లేదు.
(సమయానికి ఈ-మెయిలు చదవక, ) ఆరోగ్యం అంతంత మాత్రాన ఉండి, సమయానికి జబ్బలు చరచలేక కేవలం వ్యక్తిగత-దగ్గులతో సరిపెట్టుకున్నాను. ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగదని భావిస్తున్నాను. ఇక పాలు-కొన్న వారు అందరు కూడా తరువాతి మీటింగులో మాకు పంచగలరు.
Post a Comment