మా ఊళ్ళో ఉగాది సంబరాలు
చాన్నాళవుతోంది ఓ పెద్ద బ్లాగు వ్యాసం రాసి. రాద్దామనుకుంటూ వుంటే అసలు తీరిక దొరకట్లేదు. అసలు ఎందుకు రాయలేక పోతున్నానో ఓ పట్టీ తయారు చేసేస్తే అదొక పెద్ద టపా అయిపోతుంది. ఎలాగయితేనేం రాయటానికి బుర్ర లో కి కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఇవయితే ఎవరూ కాపీ కొట్టలేరని ధైర్యంగా రాసేస్తున్నా.
ఓకే! ఓ రెండు మూడు కత్తెరలేస్తే....
బ్లాగులు మొదలు పెట్టిన తరువాత ఉగాది మొదటి సారిగా వచ్చింది బ్లాగు నిండా వేప మండలు, మామిడి కొమ్మలు బెల్లం ముక్కలు పెట్టేసి అందరికి పచ్చడి తయారు చేసి "పచ్చడి బ్లాగు" అవార్డు కొట్టేద్దామని సంబర పడ్డా. మామూలుగా ఉగాది అయిపోయిన తరువాత ఏ మూడు నాలుగు వారాల తరువాతో చేసే తెలుగు సంఘ ఉత్సవాలు ఈ క్రికెట్ ప్రపంచ కప్పు పుణ్యమా అని ఎంతొ ముందే పెట్టేశాం. ఆలస్యమయితే అందరూ క్రికెట్ పిచ్చిలో పడి అక్కడ స్టేజి మీద మాట్లాడే వాళ్ళు కూడ దొరకరు వుండే కార్య వర్గ సభ్యులు మాట్లాడితే పెళ్ళాలు వినాల్సి వస్తుంది. అంతే కాకుండా మేము పెట్టే లడ్లు, పచ్చళ్ళు అన్నీ మేమే పంచేసుకుని భుజమ్మీద ఇంటికి ఎత్తుకుని పోవాల్సి వస్తుందని తెలివిగా దేశంలో అందరికన్నా ముందే పెట్టేశాం. దాని హాడావుడి లో పడి బ్లాగు సంగతి మరిచి పోయా.
ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చినట్టు సరిగ్గా అసలు ఉగాది ముందు రోజు మా పెద్ద బుడ్డోడికి ఏదో డ్యాన్స్ ప్రాక్టీసు పుణ్యమా అని దగ్గు వచ్చింది దానితో పాటు అదృష్టం కలిసొచ్చి జ్వరమూ, జలుబూ కూడా ఇంటిని పావనం చేశాయి. కట్ చేస్తే ఓ రోజు ఆఫీసుకు డుమ్మా. ఇంట్లో అన్ని ఉగాది సంబరాలూ బంద్. మన ప్రభుత్వమూ మరియూ పంచాంగ కర్తల పుణ్యమా అని ఒక ఉగాది కాదు రెండు చేసుకోవచ్చని కాస్త వెసులుబాటు కూడా ఇచ్చారు. కనీసం రెండో ఉగాది కూడా చేసుకోలేక పోయాం. వచ్చే సంవత్సరం నాలుగు ఉగాదులు చేసుకోవచ్చని ఓ స్టేట్ మెంట్ ఇస్తే నేను సకుటుంబ సమేతంగా టికట్టు కొనుక్కొని వచ్చి ఈ పార్టీ కే ఓటు వేస్తా. వీలయితే కొన్ని దొంగోట్లు కూడా వేస్తా!
మావాడికి బాగున్నప్పుడు చెప్పాం "ఒరేయ్ పండూ! మనింటికి గజల్ శ్రీనివాసు గారు వస్తున్నారు మనింట్లో కొన్నాళుంటారు. వాళ్ళకో ఆరేళ్ళ అమ్మాయుంది చక్కగా ఆడుకోవచ్చు" అంటే తెగ సంబర పడి పోయాడు. వాడి జ్వరం ఎంతకీ తగ్గక పోయేసరికి గజల్ శ్రీనివాస్ గారిని ఇంకొకరి ఇంట్లో వుంచ వలసి వచ్చింది. 'పండు ' ఇక రెండు రోజులు జ్వరంతో అలుగుడు. 'అమ్మ పండు ' వాడికి డ్యాన్స్ వల్లే జ్వరం వచ్చిందని గులుగుడు. 'నాన్న పండు ' సర్దుడు. ఇవన్నీ చూస్తూ 'బేబీ పండు ' కేరింతల దొర్లుడు. అలా ఇల్లంతా డు,ము,వు,లు ప్రథమా విభక్తి అయిపోయింది.
ఎలాగయితేనేం ఉగాది సాంస్కృతిక సంబరాల రోజుకి పండుకి జ్వరం తగ్గి స్టేజ్ ఎక్కి ఉగాది వేడుకలంటూ కాసేపు గెంతాడు. ఆ తరువాత అక్కడ ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో కు వెళ్ళి మాయల మరాఠీ మంత్రాలు తంత్రాలు చూశాడు. మ్యాజిక్ షో ఎందుకు అంటారా? గజల్ పాదుషా మన తెలుగు గజల్ శ్రీనివాస్ గారి గానామృతం వినిపించేప్పుడు పిల్లలు సద్దు చేయకుండా వుండేందుకు.
భోజనాలయిన తరువాత మొదలయింది గజల్ గారి గానం. ఒక్కో పాటా ఒక్కో ఆణిముత్యం. ప్రతి చరణానికి చప్పట్లు. ఏ గజలయిన ఎవరి మది నయినా కదిలించ లేదంటే బహుశా వారు డాక్టరు దగ్గరకు వెళ్ళి వాళ్ళ మనస్తత్వాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి గజలూ ఆడిటోరియం లో వున్న వాళ్ళను ఆత్మీయ తీరాలకు తీసుకు వెళ్ళి లాలించింది. పసితనం, బాల్యం, అమ్మ, పుట్టిన ఊరు అక్కడ జరిగిన అనుభవాలు, దేవుడు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. ప్రతి దాన్నీ సృజించి దాని మాధుర్యాన్ని సభికులకు అందచేసి గజలంటే ఇలా వుంటుంది అంటూ గజల్స్ తెలియని వారికి తెలియ చెప్పి వాళ్ళ మనసును కొల్ల గొట్టేశారు డాక్టరు గజల్ శ్రీనివాస్ గారు. సి.నా.రె., రెంటాల రాసిన గీతాలకు శ్రీనివాస్ గారి గాత్రం ఎంతో తియ్యదనాన్ని ఇచ్చింది. తన గజల్ కార్యక్రమంలో తను ఉపయోగించే వాయిద్యాలు ఏంటో తెలుసా ఒక్క "కంజీర" మాత్రమే. అమ్మ ను గురించి, పుట్టిన ఊరు గురించి గజలు పాడుతున్నప్పుడు ఎంత మంది కళ్ళళ్ళోనుండి నీళ్ళు జల జల మని రాలాయో.
నేను చదువు కునే రోజుల్లో పంకజ్ ఉధాస్ "చిట్టీ..ఆయీ హై.." అని పాడుతుంటే ఆర్ధ్రతతో కూడిన శ్రావ్యమైన పాట వింటుంటే అనిపించేది నాకు ఈ పాటకు అర్థం తెలుసుంటే ఎంత బాగుండేది....అలాగే తెలుగులో వింటే ఎంత బావుండేది అని. ఆ లోటు ఇప్పుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అయిన కేసిరాజు శ్రీనివాస్ గారు పూరిస్తున్నారు. శ్రీనివాస్ గారు పాడటం ఒక ఎత్తయితే ఆయన చేసే సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు. సధ్బావనా యాత్ర, పాకిస్తానుకి శాంతి యాత్ర, ఖైదిల మానసిక వికాసం కోసం, సునామీ భాధితుల కోసం పాడటం. ఆయన ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. ఎంతో రాయాలని వుంది కానీ రాయలేక పోతున్నాను.
ఒక పక్క మన జీవితలో ని విషయాలను సుతారంగా మీటుతూ నాన్న పాడితే "ఎవ్వరి తో ఆటలాడుకోవాలి" అని ఆరేళ్ళ సంస్కృతి మన కంట తడి పెట్టిస్తుంది. పాట పాడటమే కాదు మాటల్తో ఎవరినైనా బోల్తా కొట్టిచ్చేస్తుంది. నన్ను మాత్రం బాగానే బోల్తా కొట్టించింది. అందుకే చెప్పా "నేను నీ ఫ్యాన్ ని, నీ ఫ్యాన్స్ అసొసియేషన్ కి ప్రెసిడెంట్ నవుతా" అని.
"అట్టాంటి ఆశలేం పెట్టుకోకు. నా ఫ్యాన్స్ అసొసియేషన్ ప్రెసిడెంట మా నాన్నే" అంది.
"అలా కాదు గానీ కనీసం అమెరికాలో ఫ్యాన్స్ అసొసియేషన్ ప్రెసిడెంట్ అవుతా" అని.
"ఠాట్, కుదరదు" అని గాఠ్ఠి గా చెప్పేసింది చిచ్చు బుడ్డి.
"ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్ గా సెటిలవుతా" అంటే.
"అలాగే మామా...బామ్మా.. ఆంటీ..తాతా." అంది ఆ సిసింద్రీ. నన్ను అంకుల్ అని పిలవొద్దు మామా అనో బాబాయ్ అనో పిలువు అన్నందుకు అన్ని రకాలుగా పిలుస్తోంది నన్ను.
గజల్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి తీసుకు రావడానికి మాదాల రవి గారు, శ్రీధర్ గారు ఎంతగానో సాయపడ్డారు. కార్యక్రమం అయిపోయిన తరువాత రోజు శ్రీనివాస్ గారిని సకుటుంబ సమేతంగా ఇక్కడున్న కొన్ని చూడవలసిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళి వచ్చాం.
ఇంతకుముందో టపా లో చెప్పా variety is spice of life అని. దాన్ని నేను పాటించడం ఏమిటో కానీ మా బుడ్డోడు అక్షరాలా పాటిస్తున్నాడు. ఇదిగో ఈ కింది ఫోటో చూడండి. అది చూసి చెప్పండి ఇందులో ఎవ్వరు వెరైటీగా నిలబడ్డారో?
350 మందికి పైగా వచ్చిన మా ఉగాది సంబరాలు ఎన్నో పత్రికల్లో ప్రచురింప బడ్డాయి. వాటి వార్తా విశేషాలకు ఈ కింద నున్న లంకెల మీదకు మీ మూషిక సాయం తో లంఘించండి.
ఈనాడు
ఆంధ్రజ్యొతి
తెలుగువన్
సినీగొయెర్
ఆంధ్రభూమి
అరవై ఏళ్ళ క్రితం వచ్చిన సర్వజిత్ నామ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని చెబుతూ....
:
"ఉప్పుకప్పురంబు..నొక్క పోలిక నుండు" అంటూ "పండు"
:
ఓ కూచిపూడీ నృత్యం
:
'గజల్ ' మాట్లాడుతుంటే వింటున్న కార్యవర్గ సభ్యులు
:
పిల్లలు చేసిన ఓ రామాయణ ఘట్టం
:
"ఉగాది వేడుకలు" అనే కార్యక్రమం
:
"ఉగాది వేడుకలు" అనే కార్యక్రమంలో పంచాగం వింటున్న పిల్లలు
:
"ఉగాది వేడుకలు" అనే కార్యక్రమం వెనుకనున్న అతిరథులు
:
రాయల్ గార్జ్ అనే వేలాడుతున్న బ్రిడ్జ్ దగ్గర తీసిన ఫోటో.
నేను, హరి మోరి సెట్టి, గజల్, సురేఖ(గజల్ గారి భార్య), ఫోజులు కొడుతున్న "బుడిగి" సంస్కృతి, మూర్తి గరిమెళ్ళ(కోశాధికారి), శ్రీధర్ తాళంకి, CTA బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు ATA regional co-ordinator
3 comments:
"కార్య వర్గ సభ్యులు మాట్లాడితే పెళ్ళాలు వినాల్సి వస్తుంది." హహ్హ!
ఇంద్రజాలప్రదర్శనం పిల్లలను మాయజేయడానికి భలే వాడుకున్నారు!
కంజీరా - ఇది నోటితో వాయించే సాధనం కదా, మరి పాడటమెలా?
ముందుకు నిలబడి వెనక్కు చూడటం ఎందుకనుకున్నాడేమో పండు!
ఉగాది వేడుకల వీడియోను కూడా చూపించండి.ముఖ్యం గా పిల్లల ప్రోగ్రాములవి,గజల్ శ్రీనివాస్ గారి పాటలవి వీడియొ లింకులు ఇవ్వండి. ఆయన పాడిన ఆ పాటలు విని మమ్మలని కళ్ళనీళ్ళు పెట్టుకోనివ్వండి. ఇంకో విషయం "పండు మాత్రం సూపర్ " తండ్రిని మించిన తనయుడు అవ్వాలి.
@ రానారె,
కంజీర నోటితో వాయించేది కాదు. ఫోటో లో గజల్ గారి చేతిలో వుంది చూడండి. ఇది చిన్న డప్పు లాగ వుంటుంది.
@ రాధిక గారూ,
వీడియో లు పెట్టేస్తే కొత్తగా గజల్ గారి పాటల వినేవాళ్లకు అందులోని మాధుర్యం మిస్సవుతారని పెట్టట్లేదు.
Post a Comment