అదృష్టం ఎన్ని సార్లు తలుపు కొడుతుంది?
మల్లిక్ గారి ప్రోగ్రాం అయిపోయింది. దానికి తోడు విజయ లక్ష్మి మరియు విశ్వమోహన్ ల మ్యూజికల్ నైట్. ఆ పాటల హుషారు మల్లిక్ జోకుల సరదాలు అన్నీ అయ్యేసరికి రాత్రి పదకొండు. దాని తరువాత ఇంకొకరి ఇంట్లో భొజనాలు అయ్యేసరికి రాత్రి ఒంటి గంట బెల్లు టంగు మని కొట్టింది. అసలే ఆదివారం రాత్రి తరువాతి రోజు ఆఫీసుకు తొందరగ వెళ్ళక పోతే బాసు మన పేరు గోడ బల్ల మీద జక్కనా మాత్యులు లాగా చెక్కేస్తాడు. మిస్టర్ డొక్కు గాడికి జక్కన పోస్టు ఇవ్వడమెందుకని 40 మైళ్ళ దూరం లో వున్న బెడ్రూముకు చేరుకుని నిద్రపోవాలనే తాపత్రయం తో కారు ఎక్కి రెండు కాళ్ళూ త్వరణయంత్రం(ఆక్సిలేటర్) మీద పెట్టి 'సొంతోడి కి సెజ్ పర్మిట్' ఇచ్చినంత స్పీడు గా వెళ్తున్నా.
ఓ ముప్పై మైళ్ళ దాకా అదృష్ట దేవత నా వెంటే వుండి అన్ని విధాల ప్రొత్సహించి ఇల్లు దగ్గరవుతుందనగా నా డ్యూటీ అయిపోయింది నా రీప్లేస్మెంట్ వస్తాదో రాదో తెలీదు ఇక నే వెళ్ళొస్తా ఈ మధ్య ఓవర్ డ్యూటి అయిపోయింది అని వెళ్ళి పోయింది. సరిగ్గా అపుడే టైం చూసి శనేశ్వర రావ్ సీన్ లోకొచ్చి నా అదృష్టం జోన్ లో దూరి తలుపేసుకున్నాడు. అంతలో వెనకల నుండి మిరుమిట్లు గొలిపే రంగు రంగుల కాంతితో వెలుతురు వచ్చింది. నెక్స్ట్ షిఫ్టు అదృష్ట దేవత వచ్చింది కాబోలు అని సంబరపడితే సౌండిచ్చి మరీ కారును ఆపాడు ఆ కౌంటీ పోలీసు మామ. శనేశ్వర రావ్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుండగా కారును రోడ్డు పక్క ఆపాను.
ఆ ఆరున్నర అడుగుల పోలీసోడు వచ్చి కారు కిటీకీ కొట్టి దూరంగా వెళ్ళి కుడి చేతిని బెల్టు గన్ను మీద పెట్టి “ఆర్యా! మీరు 45 మైళ్ళ దగ్గర 75 లో వెళుతున్నారు మీకు స్పీడంటే భలే ఇష్టం లాగుంది. నాక్కూడా నీలాంటి వాళ్ళంటే పిచ్చ పిచ్చ నచ్చేస్తారు, నా రాడార్ గన్నుకు కూడ భొలే నచ్చారంట. అందుకే ఓ సారి నీ లైసెన్సూ, ఇన్ సూరెన్సూ, నీ కార్ రిజిస్ట్రేషన్ పేపర్లూ ఇస్తే ఓ సారి కాపీ కొట్టుకుని నీకే ఇచ్చేస్తా” అని చెప్పాడు మొహం మీద పెద్ద గాటు పెట్టుకుని.
నిగ నిగ మెరిసే జుబ్బా దానికి కిందుగా రెడీ మేడ్ లాల్చీ ధరించి వున్నా, వెనకల సేం టూ సేం డ్రెస్ నిద్ర బోతున్న బుడ్డోడికి, ఆ పక్కనే నాజూకైన చీర కట్టిన నా రెండో సగం. ఇవన్నీ చూస్తే ఆపొలీసోడికి గుర్తొచ్చేది ఏ ఆఫ్ఘనిస్థానోడో తప్ప భారతీయుడు గుర్తుకు రాడు. జనప నార గడ్డం లేదు గాబట్టి కొంచెం కరుణించి బెల్ట్ గన్ను మీద చెయ్యి మాత్రమే పెట్టుకుని మాట్లాడాడు లేక పోతే ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకుని మాట్లాడే వాడు.
కార్లో ఎలుక లాగా కెలికి అన్నీ తీసి ఇచ్చా. శనేశ్వర రావ్ నా మీద ప్రేమ కొద్దీ క్వాలిటీ ఎక్కువుండాలని ప్రావిడెంట్ ఫండ్ నుంచి లోన్ తీసుకుని నాకు ప్రత్యేక నిధి సప్లై చెయ్యడం వల్ల కొత్త ఇన్ సూరెన్స్ కాగితాలు కార్లో లేవు. లేవని చెబ్తే అంత వరకు బాధగా ఉన్న పోలీస్ మొహం పదెకరాల బీడు భూమి పక్కన ఫ్యాబ్ సిటీ వచ్చినట్టు వెలిగి పోయి 4 పాయింట్లు ఇచ్చేవాడు కాస్త 10 పాయింట్లు ఇచ్చి నా చేత ఆటోగ్రాఫ్ తీసుకుని గెంతులేసుకుంటూ వెళ్ళి పోయాడు. "ఈ రేయి తీయనిది.." అనె పాట పాడు కుంటూ వెళ్ళడం స్పష్టంగా వినిపించింది. వెళ్తూ వెళ్తూ "హావ్ యె బెట్టర్ డే" అని వాగుడొకటి హై కోర్టు తిట్టిన తర్వాత డిల్లీ మేడం డిన్నరుకు పిలిచి తిట్టినట్టు. “వెధవా మూడేళ్ళ నుండి ఒక్క టికెట్టూ లేకుండా డ్రైవ్ చేస్తుంటే ఇప్పుడు పది ఇస్తావా?” అని కారు కిటికీలు మూసేసి తిట్టుకున్నా. ఇల్లు చేరేంతవరకు నా సగ భాగం "స్లో గా నడుపు..స్లో గానడుపు" అని ఒకటే రొద. కారు గ్యారేజ్ లో పార్క్ చేసినతరువాత కూడా "స్లో గా నడుపు..స్లో గా నడుపు.." అనే రింగ్ టోన్ మాత్రం వదల్లేదు.
ఆ రాత్రి ఆ టికెట్టొచ్చిన ఆనందంతో వూహా లోకాల్లో విహరించి సరైన టైముకు ఆఫీసుకు వెళ్ళి మధ్యాహ్నం ఏదో పని మీద తిరిగి ఇంటికి రావడానికి ఆఫీసు పార్కింగ్ ప్లేస్ లో నుండి కారు తీసి బయటకు వస్తున్నా. శనేశ్వర రావ్ సూటూ బూటూ వేసుకుని డబుల్ దర్జాగా డబుల్ చీస్ బర్గర్ ఆరగించినతరువాత ఐస్క్రీం తింటూ నా వెన్నంటే వున్నాడని మర్చిపోయాను. ఈ సారి సిటీ బ్యాంకు వాళ్ళ దగ్గర లోను తీసుకుని వచ్చాడేమో మరింత ఎఫెక్టు కోసం. సర్వ శక్తులూ ఒడ్డి ఆక్సిలేటర్ మీద నున్న నా కాలు మీద డెబ్బై కేజీల బరువు పెట్టి ముందుకు తోశాడు. అలా రోడ్లోకి రావడం ఆలస్యం “హోళీ” అంటూ రంగులేసుకుని స్కూటర్ మీద ఓ ముసలి పోలీసావిడ నా కారు వెనకాల పడింది. శనేశ్వర రావ్ మాత్రం అద్దెకు తెచ్చిన సూటు మీద ఐస్క్రీం పడుతున్నా పట్టించుకోకుండా తెగ ఎంజాయ్ చేస్త్తున్నాడు.
హోళీ అంటే పోలీసులు దొంగల వెంట పడేటప్పుడు రంగు రంగుల బులుగు బులుగు బల్బులేసుకుని తిరుగుతారే ఆ టైపు అన్నమాట. హోళీ అనగానే అర్థమయిపోయుంటే మీరు హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తారని అర్థం. అర్థం కాకపోతే తెలుగు లో కి డబ్ చేయబడిన రాకాసి వీరుడు, గుంటనక్క సుందరి, మాయా గండర గండడు, మృత్యు ఘీంకారం లాంటి సినిమాలు చూడమని మనవి.
“ఎంత ఘాటు ప్రేమయో..” అని పాడుకుంటూ కారు పక్కన ఆపా. ఈ సారి పగలు అందునా ఆ చుట్టుపక్కల మన లాంటి మొహాలు ఎక్కువ అవ్వడం వల్ల గన్ను జోలికి వెళ్ళ కుండా పక్కింటి అవ్వ లాగా “బిడ్డా! ఇక్కడ వున్న స్పీడ్ లిమిట్ 30 నువ్వు వెళ్తోంది 42” అని చెప్పి నా పత్రాలు చూపెట్ట మంది. నేను టపీ మని 11 గంటల క్రితం వచ్చిన “టికెట్” చూపించా. “అడ్డడ్డే.. అలా జరిగిందా. కానీ ఇది ఆ కౌంటీ వాళ్ళది. ఆ కౌంటీ వేరే కాబట్టి నా సన్మాన పత్రాన్ని నువ్వు స్వీకరించవలసిందే” అని స్వీటుగా చెప్పింది సొట్టలు పడిన బుగ్గల్తో. అడ్డడ్డే అనగానే ప్రాణం లేచి వచ్చినట్టనిపించి చేతిలో పత్రం తో రావడం చూసి ఆశలు ఆవిర్లు, మంటలు అయిపోయాయి. ఆ ఇచ్చిన పత్రం లో 4 పాయింట్లు ఇచ్చింది. శనేశ్వర రావ్ ఐస్ క్రీము చప్పరించుకుంటూ నా భుజాల మీదుగా తొంగి చూస్తున్నాడు ఇవాళ తన పనితనం ఎంత అని. లాగి ఒక్కటిచ్చా వెళ్ళి వెనక సీట్లో పడ్డాడు.
ఏడ్చే పిల్లాడి చేతిలో బెల్లమ్ముక్క పెట్టినట్టు “నువ్వు కోర్టు కెళ్ళకుండా డైరెక్టుగా డబ్బు కట్టేసేటట్టయితే రెండు పాయింట్లతో సర్దుకోవచ్చు” అని సెలవిచ్చి టాటా, బిర్లా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అనుకుంటూ వెళ్ళిపోయింది ఆ పోలీసు అవ్వ. కిక్కురు మనకుండా "ధన్యోస్మి మహిళామణీ" అని సెలవు తీసుకుని "పేదరాశి పెద్దమ్మ లాగా మాట్లాడి మంత్రాల చింతక్క లాగా టికెట్టిస్తావా ముసల్దానా? " అని గొణుక్కుంటూ ఇంటికెళ్ళా.
శనేశ్వర రావ్ "వీడ్ని ఇవ్వాల్టికి వదిలేస్తా. నా ఆఫ్ షోర్ జాబ్ అయిపోయింది ఇక ఆన్ సైట్ వెళ్ళి భారత్ లో కొంత మంది భరతం పట్టాలి" అని వెళ్ళిపోయాడు.
తరువాత రోజు నుండి మా బడ్జెట్ మేము చేరుకున్నాము అన్నట్టు మా ఆఫీసు రూట్లో స్పీడ్ లిమిట్ 35 కు మార్చారు నా హితులయిన కౌంటీ వారు. బుద్ధి హీనులు పరీక్షలయిపోయిన తరువాత ఆన్సర్లు గుర్తొచ్చి ప్రయోజనం లేదు అని తెలీదు.
ఈ 2 పాయింట్లు, రాత్రొచ్చిన 10 కలుపుకుంటే నాకు 12 పాయింట్లు. దాన్నే లొట్టో లాటరీ కొట్టడం అంటారు. 12 పాయింట్లుంటే నాలుగు టైర్ల కారు బదులు ఎనిమిది టైర్ల బస్సులో చక్కగా వెళ్ళచ్చు ఎక్కడికైనా. పైగా బోల్డంత మంది తోడు. బస్సులో బుక్కులు చదువుకోవచ్చు, FM లో “రాక్ బేబీ రాక్... షేక్ బేబీ షేక్.... ” అనే పాటలు వింటూ బజ్జోవచ్చు. లేదా "జన్మ మెత్తితిరా.. అనుభవించితిరా.." అనే పాటలు పాడుకుంటూ ముక్కు చీదుకుంటూ పక్కనోడి టోపీ కి రాయొచ్చు. ఇంకా బోలెడు కార్ పెట్రోలు ఖర్చు మిగులు. పెట్రోలు ఖర్చు తగ్గించినందుకు బుష్షు బాబాయ్ పిలిచి అవార్డు ఇచ్చినా ఇవ్వచ్చు. వారాంతాల్లో సకుటుంబ సమేతంగా బస్సు ఎక్కుతూ దిగుతూ వుండే సీను కళ్ళ ముందు 3-డి లో సాక్షాత్కరించింది. 12 పాయింట్లు వస్తే కారు డ్రైవింగ్ లైసెన్స్ మటాష్ మరి.
పది పాయింట్లిచ్చిన కౌంటీ కోర్టు కెళ్ళి నా అసలు ఇన్ సూరెన్స్ పేపర్లివ్వగానే 6 పాయింట్లు తీసేసారు. ఇక మిగిలింది 4 పాయింట్లు. నా పేరు పిలవగానే బోనులో కెళ్ళి జడ్జి ముందు నిలబడ్డా. నేను ఎందుకు స్పీడుగా వెళ్ళానో చెబితే శ్రద్ధగా విని (కాదు నటించి), గత 3 సంవత్సరాలుగా ఏమీ “రశీదులు” లేవు కాబట్టి రెండే పాయింట్లు ఇస్తున్నా. ఇంకా ఒకటి తగ్గాలంటే “రక్షణాత్మక నడుపుడు”(defensive driving) క్లాసుకెళ్తే తగ్గుతుంది అన్నాడు.
"మీ కరుణా కటాక్షములకు జన్మ తరించెన్ స్వామీ! ఎప్పుడైనా నాకు మీ కౌంటీ నందు ఉద్యోగమొచ్చిన ఎడల ప్రోగ్రామింగ్ అంతా తెలుగులో ఇంలీ ఈక్ రాసేసి మీ మీద కక్ష తీర్చుకునే రోజు రావాలని దీవించండి" అని బోను దిగేశాను.
ఇంతకు ముందు నా తప్పు లేక పోయినా లేన్ మార్చేటప్పుడు టికెట్ రావడం జరిగింది. అప్పుడు ఇరగ దీద్ధామని “అభిమన్యుడు” లెవెల్లో కోర్టుకు వెళ్ళాను. అభిమన్యుడికి జరిగిందే జరగడం వల్ల “అనువు గాని చోట అధికుల మనరాదు ..” అనే వేమన పద్యం నేను అక్కడ వున్నంత సేపు వాళ్ళు వినిపించడం వల్లా "బుధ్ధం శరణం గచ్చామి..బుద్ధం శరణం" గచ్చామి అని బయటకు వచ్చేశా.
ఇది జరిగి ఓ రెండు సంవత్సరాలు అవుతోంది.
అమెరికా ట్రాఫిక్ టికెట్ గురించి:
టికెట్ అంటే ఉల్లంఘన చేసినందుకు ఇచ్చే రశీదు. వీలయితే చెక్కు పంపించి ఫైను కట్టుకోవచ్చు లేదా కోర్టు కెళ్ళి అటార్నీ ద్వారా వాదించుకోవచ్చు. ఏ సమయం లో నయిన 12 పాయింట్లు వస్తే లైసెన్సు కొన్ని సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తారు. ఏ రెండు సంవత్సరాల లో నయినా 18 పాయింట్లు వస్తే కూడా లైసెన్సు సస్పెండ్ చేస్తారు. వచ్చిన ప్రతి పాయింటూ మూడు సంవత్సరాల తరువాత డ్రైవింగ్ రికార్డు నుండి తొలగించ బడుతుంది. ఒక్కసారి పాయింట్లు వచ్చాయంటే అది కారు ఇన్ సూరెన్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. నెలకు ముప్పై డాలర్లుండే ఇన్ సూరెన్సు మూడు వందలు దాటినా ఆశ్చర్యం లేదు. మరీ ఎక్కువయితే లైసెన్సు పోతుంది.
4 comments:
పోలీసు బాబాయి ఎవరికి లైట్లు వేసినా నాకు గుండెల్లో రైళ్ళు పరిగెట్టేస్తాయి.అయినా మీకు 10 పాయింట్లు ఇచ్చిన బాబాయి దాన కర్ణుడికి తమ్ముడేమో?
లలలా...
నాకింత వరకూ ఏ ఫైనూ పడలేదుగా. నా దగ్గర అన్ని పేపర్లూ సక్రమంగా ఉండడం ఒక కారణం అయితే ఇక్కడ స్పీడ్ లిమిట్లు పెద్దగా ఉండకపోవడం మరోటి. నేను 80 లో (అదే లెండి కారుకింకా ఎదగలేదు. ఏదో చిన్న ఉద్యోగిని.) దూసుకెళినా అడిగే వారుండరు. అదెపుడు కుదురుతుందంటారా ? ష్.. గప్‌చుప్. ఆ ఒక్కటీ అడక్కు.
ఒక గుసగుస: ఈ మధ్యనే నా ఖర్మకూడా దోరగా కాలింది. ఈ టపా చివర వ్యాఖల పైన మూడుఅడ్డేళ్ల సందు ఉందే, అక్కడ తెల్లని పొలంలో తెల్లని విత్తనాలున్నాయ్. ఇంతవరకూ ఎవరికీ కనిపించలేదు. నేనుకూడా చాలా మధనపడ్డాను. కొర్టుకు రావలసిందే అన్నారు. సర్దార్ పాపారాయుడు లెవెల్లో "యువరానర్" అందామనుకున్నా, అక్కడ అంత దృశ్యం లేకపోయింది :)
నువ్వేమీ ఒంటరిగా ఫీలవ్వకు బ్రదరూ, ఆ మధ్య మంచుపై టైరు జారి ముందున్న ట్రక్కాయనకు భుజం తాకింది. సైడు అద్దం పోయింది + పంట్లాంలు దక్కాయి. డబ్బులు కక్కి దు:ఖాన్ని దాచిపెట్టుకున్నాను. ఏం చేస్తా. మూడేళ్ళ విరహం తప్పదు.
Post a Comment