అఖిల భారత రౌడీల మహా సభ
ఆకు రౌడీలు, చాకు రౌడీలు ,ఘరానా రౌడీలు, పురానా రౌడీలు, రిటైర్డ్ రౌడీలు,రెలిజియెస్ రౌడీలూ,మెగా రౌడీలూ, మోడు రౌడీలు,వీధి రౌడీలు అందరూ వచ్చారు..వస్తున్నారు. ఈ సారి మహా సభల ప్రత్యేకత సైబర్ రౌడీలు కూడా వీళ్ళతో కలవడం. ఏ ఒక్కరు కానీ తమ సొంత వాహానాల్లో సభా ప్రాంగణానికి రావడం లేదు. అన్నీ కొట్టుకొచ్చినవి లేదా ఓనరును కొట్టేసి తీసుకు వచ్చినవి. సభా నియమాల ప్రకారం అందరూ తమ దుస్తులును వదిలేసి సభా నిర్వాహకులు ఇచ్చిన నలుపు చారల దుస్తులు వేసుకుని లోపలికి వెళుతున్నారు. వాళ్ళ వదిలేసిన దుస్తులు గోడకున్న కొక్కానికి వేలాడ దియ్య బడ్డాయి.
ఎంత రద్దీ వున్నా ఎవరూ ఎవరినీ తోసుకుని ముందుకు వెళ్ళడము లేదు. ఓపికగా ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నారు. వచ్చిన వాళ్ళ బ్యాడ్జ్ నంబరు ప్రకారం వారి సీట్లో వారు కూర్చుంటున్నారు. ముందు వచ్చిన వాళ్ళకు ముందు సీట్లు వెనక వచ్చిన వాళ్ళకు వెనక సీట్లు ఇస్తున్నారు. అందరూ తమ పక్కన కూర్చున్న వాళ్ళతో ఉల్లాసంగా మాట్లాడుతూ తాము ఎన్ని మర్డర్లు చేశారో, ఎన్ని దొంగతనాలు చేశారో చెప్పుకుంటూ సరదాగా ముచ్చటంచుకుంటున్నారు. కొందరు తాము ఎంత తొందరగా మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి చేపట్టామో విపులంగా చెబుతున్నారు. కుర్ర రౌడీలు అలాంటి వారి దగ్గర ఆటోగ్రాఫులు లైన్లో నిలబడి తీసుకుంటున్నారు.
అందంగా వున్నా ఆడ రౌడీల వెనక ఏ మగ రౌడీ కూడా వెంట బడటం లేదు. ఆ సభకున్నా నీతి నియమాల్ని ఏ ఒక్కరూ అతిక్రమించడం లేదు. కొత్తగా సభ్యులయిన వారు తెలియక చేసే కొన్ని పనులకు సుతారంగా హెచ్చరించి వదలి వేస్తున్నారు.
సభ ప్రారంభమయ్యే అర గంట ముందు రౌడీ మహా సభ నాయకుడు ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ అందర్ని పలకరిస్తున్నాడు. వేదిక మీద చెప్పే గణాంకాల కోసం అందరూ విప్పేసిన దుస్తులు వున్న గదిలోకి వచ్చాడు. అక్కడ చాలా రంగుల చొక్కాలు వున్నాయి. తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, గులాబీ, నలుపు ఇలా భారత దేశంలో వున్న అన్ని పార్టీల రంగులు కనపడ్డాయి. ఎక్కువమంది బీహారు నుండీ, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చినట్టు గమనించాడు. పక్క రాష్ట్రం కర్నాటక నుండి కొంత మందే వచ్చినట్టు గమనించి "ఏంటి ఈ మన కర్నాటక రౌడీ సోదరులు సాఫ్టువేరు కంపెనీలు గానీ తెరిచారా ఈ సారి చాలా తక్కువ మంది వచ్చారు " అని అడిగాడు.
పక్కనున్న అనుచరుడు అందుకొని "అన్నా అక్కడ మన వాళ్ళకు మంచి పని దొరికిందన్నా మనొడెవడో ముఖ్యమంత్రి పదవికి ట్రై చేస్తున్నాడు అందుకనే మన రాయల సీమ రౌడీ సోదరులు కూడా బెంగళూరు వెళ్ళి పోయినారన్నా. మూడో రోజు ముగింపు సమావేశాలకు వచ్చేస్తారన్నా" అని చెప్పాడు.
సభ మొదలయింది. సభాధ్యక్షుడు మైకు తీసుకుని “తోటి రౌడీ సోదరసోదరీమణులకు ఇక్కడికి విచ్చేసినందుకు చోర నమస్కారాలు. ఎప్పట్లాగా మన నీతి నియమాల గురించి మొదట మొదలు పెడతాను. మన మందరం ఎప్పట్నుండో ఐకమత్యంగా వుంటున్నాం. అలాగే వుండాలి కూడా. మనం మనల్ని దోచుకోకూడదనే విషయం మనందరికీ తెలిసిందే. కొంత మంది తమకు సరయిన జరుగుబాటు లేకపోవడం వల్ల అంటే స్ట్రిక్టుగా వుండే పోలీసులు, ప్రభుత్వాలు వుండే చోట వుండడం వల్ల. క్షుద్భాధ ను ఆపుకోలేక ఈ సభా ప్రాంగణానికి వచ్చి తోటి సోదరుల వస్తువల్ని తస్కరించి వుండ వచ్చు. అలా ఎవరూ చేయరని అనుకుంటున్నాను. తమకు తెలియక అలా చేసి వుంటే వెంటనే తాము కొట్టేసిన వస్తువులను వాళ్ళ యజమానికి తిరిగి ఇచ్చివేయమని కోరుకుంటున్నాను” అన్నాడు.
యాభై వేల మంది హాజరయిన ఆ సభలోనుండి ఒక వ్యక్తి లేచి నిలబడి కళ్ళ నీళ్ళ పర్యంతమై “అన్నా ! మా ఏరియా లో వుండే ఎస్పీ చాలా స్ట్రిక్టు. అందువల్ల ఏమీ చెయ్యలేక పూటకు కూడా గడవడం లేదు. అందువల్లే నేనీ రౌడీ కుల ద్రోహానికి ఒడి గట్ట వలసి వచ్చింది. నన్ను నిలువునా చంపేసి నా కళ్ళూ, కిడ్నీలు వృత్తి ధర్మం చేస్తూ విధి నిర్వహణలో ఉంటూ వాటిని కోల్పోయిన వాళ్ళకు బహూకరించండి.” అని భోరున విలపించి తాను కొట్టేసిన బంగారు బ్రేసులెట్, డైమండ్ నెక్లీస్ యజమాని దగ్గరికి వెళ్ళి ఇవ్వబోయాడు.
ఆ యజమాని వెంటనే అతన్ని కోగలించుకొని “రౌడీ సోదరా! ఈ నగలు నువ్వే వుంచుకో. ఒక రౌడీకి ఇంకో రౌడీ సాయం చేసుకోకుంటే ఎలా. మనమేమన్నా రాజకీయ నాయకులమనుకున్నావా? మనం బతుకు దెరువు కోసం మాత్రమ రాజకీయ నాయకులం. ఇక్కడ కాదు” అని ఇంకో సారి గట్టిగా కౌగలించుకుంటే అతని నడుముకున్న జర్మన్ మేడ్ పిస్టల్ తగిలి బలహీన రౌడీ “అబ్బా” అన్నాడు.
“క్షమించు తమ్ముడూ” అని తన పిస్టల్ తీసి ఆ బలహీన రౌడీకి ఇచ్చాడు మంచి పద్యం చెప్పిన కవికి మహరాజు మణిహారాన్నిచ్చినట్టు.
సభంతా కర తాళ ధ్వనులతో మార్మోగి పోయింది. సభాధ్యక్షుడు మైకి తీసుకు “అన్ని తూటాలుంటే కొన్ని తూటాలివ్వవోయ్ అని చాటి చెప్పిన చంబల్ మంగళ్ సింగ్ మాటల్ని ఆచరించి చూపిన ఇలాంటి వారే మన రౌడీ వంశానికి స్పూర్తి. ఇతనికి వచ్చే సమావేశాల్లో చోరాదరణ్ సామ్రాట్ బిరుదును ఇవ్వడానికి కృషి చేస్తా. మరొక్క సారి చప్పట్లు కొట్టండి” అని చెప్పి తన సెక్రెటరీని పిలిచి ఆ బలహీన రౌడీ వున్న ఏరియాలో పని చేసే ఎస్పీ పేరు నోట్ చేసుకోమన్నాడు.
“పోయిన సారి సభలు జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళు ముగ్గురే వున్నారు. ఈ సారి అది ఒకటికి చేరింది. వచ్చే సభలకు ఇలాంటి బలహీన రౌడీలున్న ఇల్లే లేకుండా చేయడం మన ప్రధాన లక్ష్యం. ఈ సభలోనే కాదు మన సంఘంలో చేరిన ఏ ఒక్కరూ ఇలాంటి దుస్థితికి రాకూడదు...రాకూడదు..రా... ” అని చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు.
"ఇక సభను ప్రారంభించబోయే ముందు ఈ సభ నిర్వహణ కోసం పగలనక రాత్రనక పని చేసి, పగలు నిద్ర పోకుండా వున్నందు వల్ల తన అరోగ్యం పాడయినా, తన ఆదాయానికి గండి పడ్డ లెక్క చేయక ఒంటి చేత్తో ఇక్కడ హైదరబాదులో వున్న వాళ్ళను అదిలించి బెదిరించి అన్ని సౌకర్యాలను సమకూర్చిన 'బ్యాంకు బొక్కల' దుడ్డు దుర్మాగ రాయుడిని సభా ముఖంగా ప్రశంశిస్తూ అతనికి ఏ.కె.47 ను బహూకరిస్తున్నాము” అని పిలవగానే దుడ్డు దుర్మాగ రాయుడు వేదిక మీదకు వచ్చి ఆ ఏ.కె.47 ని తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు.
చమరుస్తున్న కళ్ళతో “నాకు ఇచ్చిన ఈ ఏ.కె.47 ను మన రౌడీ సోదరులెవ్వరి మీద ప్రయోగించనని నిండు సభలో ప్రమాణం చేస్తున్నాను.ఎంగిలి మెతుకులు తింటూ పిక్ పాకెటర్ గా మొదలు పెట్టిన ఈ జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే స్థాయికి చేరాను. మీ అండ దండలు ఇలానే వుంటే నేను ముఖ్యమంత్రి అయిన తరువాత రౌడీల కోసం ఒక ప్రత్యేక మైన్ సెల్ ఓపన్ చేసి కొత్తగా వృత్తి లో చేరుతున్న వారందరికి ఉచితంగా కత్తులూ, బ్లేడులు సప్లై చేస్తా.జై చోర సామ్రాజ్ ” అని ఏ.కె. 47 ను భుజానికి వేసుకొని వేదిక దిగాడు.
అక్కడ వున్న సామాజిక శక్తి పత్రిక విలేఖరి వెంటనే తన నోట్ బుక్ తెరిచి అందులో "ఆకలి పేగులతో , మాడిన కడుపులతో,ఎండిన గుండెలతో ఒక బాలుని రౌడీ జీవిత నిజ గాథ" అనే హెడ్లైన్‌తో న్యూస్ ఐటం తయారు చెయ్యడంలో నిమగ్నమైపోయాడు.
సరిగ్గా అప్పుడే సభా ప్రాంగణంలోకి కొన్ని హెలికాప్టర్లు దిగాయి. అందులో నుండి దిగితున్న వారిని రిసీవ్ చేసుకోడానికి కొంత మంది అటు వైపు వెళ్ళారు.
సరిగ్గా అదే సమయానికి సి.ఎన్.ఎన్. లో బ్రేకింగ్ న్యూస్
"ఇండియాలో కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఏక కాలంలో కనిపించుట లేదు"
(సశేషం)
2 comments:
విహారీ...ఒక్క సారి నీ పాత పోస్టులను సింహావలోకనం చేసి చూడు......ఈ పోస్టు బాగానే ఉంది కానీ........?
@ నరహరి గారు,
ఒక్కోసారంతే... స్టాలిన్లొస్తుంటాయి
-- విహారి
Post a Comment