Wednesday, January 13, 2016

దేవలోకం లో 'ఐరావత్' స్టేడియం కిట కిటలాడిపోతోంది. "సంక్రాంతి ఇంటర్ లోక కప్" కోడి పందాల టోర్నమెంట్ ప్రారంభమవబోతోంది.పాతాళ పుష్పక్ , సర్ప పష్పక్ ప్రత్యేక సర్వీసులు నడపడం వల్ల వేల మంది టోర్నమెంట్ చూడ్డానికి విచ్చేశారు.
స్పాన్సర్ ప్రకటనలు మొదలయ్యాయి. 'రామ్ రాజ్' బనీయన్లు,పంచలు అడ్వర్టైజ్మెంట్ లో పంచలు మాత్రమే చూపించారు బనీన్లు ఎవ్వరూ వాడరని. తరువాత 'జాయ్ అలూకాస్' వారి కిరీటాల అడ్వర్టైజ్మెంట్ కి అనూహ్య స్పందన వచ్చింది. ఆయా లోకాల రాజులు కిరీటాల డిజైన్స్ ఫోటొ తీసుకున్నారు. చివరిగా 'డాబర్ ఆమ్లా' హెయిర్ అయిల్ అడ్వర్టైజ్మెంట్ రాగానే ముందు వరసలో కూర్చుని వున్న ద్రోణుడు, పరశు రాముడు, బల రాముడు,భీష్ముడు తదితర గడ్డం పురుషులు డాబర్ నంబరు వాళ్ళ ఇంద్రవాణిలో ఫీడ్ చేసుకున్నారు. ధృతరాష్ట్రునికి ఇంద్రవాణిలో ఫీడ్ చెయ్యడానికి విదురుడు సాయం చేశాడు.
**********
**********
దేవేంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, నాగేంద్రుడు అందరు జీడి పప్పు, చైనా పప్పు, అమృత పప్పు తిని బాగా బలిసిన కోడి పుంజులతో బరిలోకి దిగుతున్నారు. ప్రవేశ రుసుము కట్టిన వాళ్ళకు భీమవరం కుక్కుటేశ్వర రాయలు రచించిన "కోడి గర్జన - పీక లేవ్ నా ఈక" అనే కుక్కుట శాస్త్ర పుస్తకం సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించి ఉచితంగా ఇచ్చారు. అందరూ శాస్త్రాన్ని బాగా అవపోశన పెట్టి మరీ బరి లోకి పుంజులను దించుతున్నారు.
**********
**********
ఇంద్రుడు వజ్రాయుధాన్ని వేలితో తిప్పి నిప్పు రాజేసి జ్యోతి వెలిగించి టోర్నమెంట్ స్టార్ట్ చేశాడు.
మొదట ఊర్వశి, మేనక డ్యాన్సులు తరువాత నాగ లోక జబర్దస్త్ ప్రోగ్రాం జరిగాయి.అందరూ చప్పట్లతో సెల్ఫీ లతో వాట్సాప్ ఫేస్‌బుక్ లు అప్డేట్ చేసేశారు. కోడి పందాలు భీకరంగా మొదలయ్యాయి. బ్రహ్మ కోడి పుంజుని చూడగానే అందరి ఆశలు ఆవిరైపోయాయి. కోడి పీకలు , ఈకలు తెగి పడుతున్నాయి. కోడి ఈకలు దేవ లోకం నుండి ఆదిలా బాద్ లో పడ్డాయి.వాటిని ఏరుకుని టోపీలో పెట్టుకుని కోడి పందాల అంపైర్లు భూమి మీద పందాలకు ముహూర్తమొచ్చిందని సిగ్నల్ ఇచ్చేశారు.సిగ్నల్స్ కోసం పైకి చూస్తున్న గోదావరి అంపైర్లకు ఆదిలాబాద్ అంపైర్లనుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది..మాకు సిగ్నల్స్ వచ్చాయి మీరు పందాలు ప్రారంభించచ్చు అని. గోదావరి అంపైర్లు మొహాలు చూసుకుని ఈకల సిగ్నల్ తమకు రాలేదని తెలిస్తే పరువు పోతుందని పోయిన సంవత్సరం పడిన ఈకల్ని ఎవరికీ తెలియకుండా పాంటు జేబులో నుండి తీసి టోపీ మీద పెట్టుకుని మైకు దగ్గర కెళ్ళి విజిల్స్ వేసి పందాలు ప్రారంభించేశారు.
అది చూసి కాళోజీ దగ్గర కెళ్ళారు అన్న గారు. "ఏంటి బ్రదర్ ఎప్పుడూ కోడి పందేల లవర్స్ వుండే గోదావరి లో కాకుండా ఆదిలాబాద్ లో ఈకలు పడ్డాయెందుకు" అని అడిగాడు.
"మీ శిష్యుడు, కె.సి.ఆర్. ఈ సారి ఆయత చండీ యాగం చేశాడు. ఈ సారి గ్రహాలు మారాయిలే" అని కాళోజీ అన్నాడు.
"ఏదయితే నేం బ్రదర్ మన తెలుగువాళ్ళలో ఎవరైనా ఒకటే నాకు. క్లారిఫికేషన్ కోసం అడిగా. మొన్నొచ్చిన రంగనాథ్ ది బలవన్మరణం అవడం వల్ల స్వర్గానికి రానీకుండా పెండింగ్ లో పెట్టారు. కాస్త పైరవీ చేసి ఇక్కడి తీసుకురావడంతో లేటయింది. న్యూస్ కొంచెం ఫాలో అవలేదు. సర్లే పందాలు చూద్దాం" అన్నాడు.
**********
**********
దేవ లోక కోడి పందాల్లో అన్ని కోడి పుంజుల్ని బాదం పప్పుల్ని నమిలినట్టు నమిలేస్తోంది బ్రహ్మ గారి కోడి పుంజు. అది చూసిన మిగిలిన అందరు కప్పు మీద ఆశలు వదిలేసుకున్నారు. ఇది చాలా అన్యాయమని జడ్జి నారదుని దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకున్నారు.
ఆయన చిడతల్ని రెండు దెబ్బలేసుకొని "చూడండి పార్టిసిపెంట్స్ మీరు ఇలా మాట్లాడతారనే గేమ్ బుక్కు దేవ, గంధర్వ, సంస్కృత, ఇంగ్లీషు భాషల్లో ముద్రించి ఇచ్చారు. ఇదిగో ఇక్కడ నూట పద కొండో పేజీ రెండో పేరాగ్రాఫ్ చదవండి. ఇందులో స్పష్టంగా వుంది కోడి ఓనర్ ను బట్టి కోడి తెచ్చుకోవచ్చు. కావాలంటే కొత్త కోడి పుంజు ను ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు.ఎవరైనా ఎప్పుడైనా టోర్నమెంట్ లో చేరవచ్చు".
**********
**********
"అమ్మ బ్రహ్మా! మీరు తల రాతల్తో పాటు కోడి రాతలు కూడా ఇలా రాస్తారా? మీ పని పడతాం" అని ఇంద్రుడు ఓడిపోతున్న కోళ్ళయజమానులు, డింకీలు, కోచ్ లతో 'నల అమృత్ అండ్ ఫలహార్' రెస్టారెంట్ లో ఆ సాయంత్రం ఓ సమావేశం ఏర్పాటు చేశాడు.
బ్రహ్మ కోడి పుంజును తట్టుకొని నిలబడే పుంజు ఎవరి దగ్గరుంటుందో అందరూ సలహాలిస్తున్నారు. అమృతం సీసాలు ఖాళీ అవుతున్నాయి కానీ ఎవరూ ఒక నిర్ణయానికి రాలేక తలలు పట్టుకుని కూర్చున్నారు..
అప్పుడు నారదుడు ఎంటరయ్యాడు."నారాయణ!..నారాయణ!..అందరూ దేన్లోనో తల మునకలైనట్టున్నారు..నా సహకారమేమన్నా కావాలా?" అన్నాడు .
"ఎందుకులే నారదా. నీ కారాలు...సహకారాలు.. దాని తరవాత జరిగే వికార ..కార్యాలు .. మాకెరుకే.మీరు దయ చేయండి" అన్నాడు విష్ణువు
"అలా అంటారేవిటి స్వామీ! ఇన్ని తలలు పనిచేయనిచో ఎన్నో తలలున్న చోట పనిచేయ వచ్చును కదా" అని చిడతలు పది సార్లు కొట్టి వెళ్ళిపోయాడు.
శివుని మెళ్ళో పాము ఫోటొజెనిక్ పడగ ఎత్తి చెవిలో బుస్ బుస్ మని పది సార్లు అంది. వెంఠనే శివుడన్నాడు "మనం ఇప్పుడు రావణాసురుడి దగ్గర కెళ్ళాలి"
"అవును బ్రహ్మ కోడి ని దెబ్బ కొట్టగలిగేది రావణాసురిడి కోడి ఒక్కటే. అందరం రావణుడి దగ్గరకు వెళ్దాం పదండి. మన మహేశ్వరుడు అడిగితే ఏదీ కాదనడు." అని అమృతరిటా చివరి సిప్ లో నిమ్మకాయ పిండుకొని తాగి గ్లాస్ పక్కన పెట్టేశాడు నాగేంద్రుడు.
"మీరెళ్ళండి నేను బిల్లు కట్టి వస్తా" అని ఇంద్రుడు అక్కడే ఆగి పోయి గ్లాసుల్లో మిగిలిపోయిన అమృడ్కా ని వజ్రాయుధం పిడి బిరడా లా తిప్పి రహస్య సొరుగులో పోసుకున్నాడు దార్లో దాగొచ్చని.
**********
**********
అందరూ వారి వాహనాలెక్కి బయలుదేరారు.వాహనాలు లేని వారు షేర్ పుష్పక్ లో రావణుడి నివాసానికి చేరుకున్నారు.
ఇంద్రుడు,విష్ణువు రావణాసురుడి అంతఃపురం గేటు తీసి లోపలికెళ్ళి కాలింగ్ బెల్లు కొట్టారు. డోర్ తీసిన మండోదరి దేవి ఒక్క సారి అవాక్కయి "ఇక్కడే వుండండి విష్ణు ప్రభూ! హారతి పట్టుకొస్తా" అని లోపలికెళ్ళి దేవకార్ట్ లో కొన్న వెండి పళ్ళెం లో అసురజాన్ లో కొన్న కర్పూరం వెలిగించి డోర్ దగ్గరకు వచ్చింది.
ఇదంతా పైన వరండాలో నిలుచుని నరకం నుండి పారిపోయి వచ్చిన కాలకేయుడి తో రహస్య మంతనాలు చేస్తున్న రావణుడు చూశాడు. కోపం తో ఊగిపోతూ అక్కడున్న ఓ నల్ల మేఘాన్ని పట్టుకుని జర్రున కిందకి వచ్చి గద పైకెత్తాడు.
"నిమ్‌డా... గొజ్రస్ థెల్మీ..ఆర్ధ భొస్.. క్రాక్వికన భుంలీ...సారీ... దేవీ! స్వర్గానికొచ్చినా వీరి బుద్ది పోనిచ్చుకోలేదు. మనం అసురలమని వీరి రాజ ప్రాసాదాలకు దూరంగా ఈ అంటరాని నల్ల మేఘాల మధ్య అంతఃపురాన్నిచ్చి ఊరికి దూరంగా వుంచారు. పూజలకు వీరు అనర్హులు. వీళ్ళని ఇక్కడే హతమారుస్తాను." అన్నాడు.
ఆ సీన్ చూసిన కుబేరుడు తన నరవాహనాన్నెక్కి "ఇది మనకు గిట్టు బాటయ్యే వ్యవహారం కాదు గానీ ప్రశాంతంగా బెట్టింగ్ చేసుకుందాం పదా" అని టోర్నమెంట్ జరిగే ప్లేస్ కు వెళ్ళి పోయాడు.
**********
**********
నాగేంద్రుడు గొణుగుతున్నాడు..' ఈ శివుడెక్కడికి పోయాడు సరైన టైం లో వుండడు... వుండే టైం లో వాట్సాప్ లో మెసేజ్ లిచ్చినట్టు వరాలిచ్చుకుంటూ పోతాడు '. అంతలో శివుడు వచ్చాడు.
"నాగ లోక రాజా! అలా చూడకయ్యా. రావణుడి గేట్ చూసి మా నంది హై జంప్ చెయ్యాలని ముచ్చట పడితే కాస్త వెనక్కి వెళ్ళాం జంపింగ్ పొజిషన్ కోసం. అంతలో ఈ తొందర ఇందురుడు గేట్ తీసేశాడు.ఇంద్రా! నీ కెన్ని సార్లు చెప్పా దార్లో ఆ అమృడ్కా తాగొద్దని. అలా అహల్య దగ్గర కెళితే ఏమి జరిగిందో తెలుసు కదా. ఇంకా బుద్ది రాలా?."
"తొందరగా రావయ్యా శివయ్యా!. లేకపోతే ఇంకో అవతారం ఎత్తే అవసరం వచ్చేటట్లుంది" అన్నాడు విష్ణువు.
శివుడు ముందుకు వచ్చి "భక్తా! శాంతించు. నేను నీ కోసమే వచ్చా" అన్నాడు .
"జటాటవి గలజ్జల..ప్రవాహ పావితస్థలే..గలేవలంబ్య లంభితాం.." రావణుడు గద కిందపెట్టి శివ స్తోత్రం అందుకున్నాడు.
"రావణా! ఇప్పుడు సమయం లేదు. కప్పు కొట్టిన తరువాత మళ్ళీ ప్రోగ్రాం పెట్టుకుందాం. నీ కోపానికి కారణం అర్థమయింది. దేవ లోక చట్టాలను సవరించి రాక్షస జాతి వారికి కూడా దేవతల వలే సమాన హక్కులు వచ్చేటట్లు చేస్తాం. అందుకు ఈ ఇంద్రుడు పూచీ. అంతవరకు ఇదిగో ఈ ఇంద్రుడి వజ్రాయుధం నీ దగ్గరే పెట్టుకో. ప్రస్తుతానికి నీ కోడి పుంజు కావాలి"
"మహేశ్వరా మీరడిగితే ప్రాణాన్నిస్తా. మా కోడి ఒక లెక్కా..తీసుకెళ్ళండి... కానీ నాకీ వజ్రాయుధమొద్దు. నా బ్రాండ్ దానవ్‌డ్కా. అది మా దానవ లోకం నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. " అని తన కోడి పుంజుని వెడల్పాటి పంజరం లో పెట్టి ఇచ్చేశాడు.
రావణుడిని, రావణుడి కోడిని తీసుకొని సమరోత్సాహం తో అందరూ తిరిగి వచ్చేశారు. విషయం అర్థమయిన కుబేరుడికి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామనిపించింది. రావణాసురుడిని లొంగతీసుకోడానికి విభీషణుడితో ప్రయత్నం చేశాడు. సఫలం కాలేదు.హన్సీ క్రోనే తో ఇంద్రవాణిలో మాట్లాడాడు. తనకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని తాను రాలేనని చెప్పాడు.
**********
**********
చివరి రోజు ప్లేఆఫ్స్ అండ్ ఫైనల్స్. రంభ డ్యాన్సు ప్రోగ్రాం మొదలయింది. రంభని చూసి తను కూడా డ్యాన్సు చేద్దామని అన్న గారు స్టేజ్ ఎక్కుదామని వెళ్తుంటే వై.ఎస్.ఆర్. లాగేశాడు."ఇంగ జాల్లే అబ్బీ.యమ గోల భూమ్మీదున్నపుడే నూరు తూర్లు జూసినా ఇంగ నా వల్ల కాదు" అన్నాడు. అది చూసి ఎస్.వి.రంగారావొచ్చి "భేష్ భేష్ సొదరా! మీరు యమ గోల మాత్రమే వీక్షించినట్టున్నారు.మేము ఈయన నటించిన దేవాంతకుడు సినిమా కూడా దర్శించినాము. ఆ జఘన కొట్టుడు, ఆ పాద పచ్చడి ఈ కళ్ళతో చూళ్ళేక కళ్ళకు కటకములు వచ్చినవి. మీ సాహసానికి మెచ్చితిమి. వీలున్నప్పుడు మా ఇంటికి రండి మీకు ఓ పది వీర తాళ్ళు వేసెదము" అన్నాడు.
పాతాళ లోకం వాళ్ళు 'ఆల్చిప్ప- అప్పచ్చి' అనే భరత భాంగ్ర పూడిస్సి అనే ఫ్యూషన్ డ్యాన్సు చేశారు. దీనికి హై టి.ఆర్.పి. రేటింగ్స్ వచ్చాయి.
ప్లే ఆఫ్స్ అయిన తరువాత బ్రహ్మ కోడి పుంజు, రావణుడి కోడి పుంజు ఫైనల్స్ కు చేరుకున్నాయి.బెట్టింగ్స్ ఊపందుకున్నాయి.
**********
**********
అంత వరకు ఒక ముక్కు కోళ్ళతో ఇరగదీసిన నాలుగు తలలు , నాలుగు ముక్కుల బ్రహ్మ కోడి అడ్వాంటేజ్ పది తలలు, పది ముక్కులున్న రావణ కోడి ముందు పనికి రాకుండా పోయింది. బ్రహ్మ కోడి ఒక సారి కత్తి కాలు పైకెత్తగానే రావణ కోడి రౌండప్ చేసి తన పది ముక్కులతో పొడిచి పొడిచి పారిపోయేటట్లు చేసింది. బ్రహ్మ మొహం చిన్నబోయింది.ఐరావత్ స్టేడియం మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. రావణుడు దానవ లోకం నుండి స్మగుల్ చేసి తెచ్చిన 'నరకాషైన్' బాటిల్ ఓపెన్ చేసి స్టేడియమంతా తాండవం చేశాడు.
రావణ కోడిని "సంక్రాంతి ఇంటర్ లోక కప్" చాంపియన్ గా డిక్లేర్ చేశారు.పబ్లిక్ చాయిస్ గా నారదుణ్ణి "ఐడియా బ్రహ్మ" గా అనౌన్స్ చేశారు.
.
.
.
.
బ్రహ్మ నారదుని జన్మ ఫైల్ ఓపెన్ చేశాడు ఐ-తాళపత్ర archives నుండి.
**********
**********

Wednesday, August 19, 2015

స్పెషల్ స్టేటస్

లక్ష్మి దేవి: ఎప్పుడూ ఆ ఫేస్ బుక్ చూస్తారు గానీ మీకు సీమాంధ్రా అప్డేట్స్ కనిపించవా?
మహా విష్ణువు: కనిపించకేం అన్నీ చూస్తూనే వున్నాం గా మేము.

లక్ష్మి దేవి: స్పెషల్ స్టేటస్ కోసం సీమాంధ్రులు నెత్తి నోరు బాదుకుంటున్నారు కదా. వాళ్ళకు మోడి చేత ఇప్పించవచ్చును కదా
మహా విష్ణువు: నువ్వు బాహుబలి సినిమా చూశావా?

లక్ష్మి దేవి: ఈ మోకాలికి బోడి గుండుకు లంకేమిటి? నేను చెప్పేదేమిటి మీరు అడిగేదేమిటి?
మహా విష్ణువు: ఏ పని చేసినా దాని మీదా శ్రద్ధా భక్తులు పెట్టి చెయ్యాలి. ఆ అరికాలి ఎడమవైపు నొప్పి వస్తోంది అక్కడ కొంచెం ఫోకస్ పెట్టి మర్దన చెయ్యి ఈ స్పెషల్ స్టేటస్ గురించి నీకెందుకు?

లక్ష్మి దేవి: చేస్తాను లెండి తప్పుతుందా ఈ భూమండలమంతా చూస్తోంది గా. కానివ్వండి ఇంకో అవతారం ఎత్తకపోతానా మీ సంగతి చూడక పోతానా.అయినా ఇప్పుడు భాహుబలి సినిమా ఎందుకు? నేనిప్పటికే మూడు సార్లు చూశాను.
మహా విష్ణువు: అందులో కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు?

లక్ష్మి దేవి: బాహుబలి - 2 లో ఇద్దరు బాహుబలులు వుండకూడని.
మహా విష్ణువు: ఏడ్చినట్లుంది. రాజమౌళి పొడవమన్నాడు కట్టప్ప పొడిచాడు. అది రాజ మౌళి లీల.

లక్ష్మి దేవి: అయినా ఈ సోదెందుకు? మోడి బీహార్ కు 1.25 లక్షల కోట్లు ఇచ్చాడు కదా. సీమాంధ్ర కు కూడా ఏమన్నా ఇవ్వచ్చు కదా అని నేనడుగుతుంటే.
మహా విష్ణువు: రాజమౌళి లీల లాగా ఇది కూడా మోడి లీల.

లక్ష్మి దేవి: మీరెప్పుడు సరిగ్గా సమాధానం ఇచ్చారు గనుక.ఆ ద్వాపర యుగం లో కృష్ణావతారం ఎత్తినప్పటి నుండి టూ మచ్.
మహా విష్ణువు: శాంతించు దేవి. సీమాంధ్ర కు కూడా కానుకలొస్తాయ్ బీహార్ లాగా మారితే. కాస్త కత్తులు కటార్లమీద మీద మనసుపెడితే సరి.

Monday, July 20, 2015

కట్టప్ప బహుబలిని ఎందుకు పొడిచాడు?



అస్లం ఖాన్ తండ్రి బిస్లం ఖాన్ ఆయుధాలతో పాటు అత్తరు వ్యాపారం చేసేవాడు. అత్తరంటే కట్టప్ప కూతురికి చాలా ఇష్టం. కట్టప్ప అంతఃపురంలో లేడని తెలిసి బిస్లం ఖాన్ అత్తరు శాంపుల్స్, ఆయుధాల శాంపుల్స్ చూపిద్దామని కట్టప్ప ఇంటికొస్తాడు. అక్కడ కట్టప్ప కూతురు కొన్ని సాంపుల్స్ తీసుకొని పౌడర్ రూం లోకి వెళ్తుంది. బిస్లం ఖాన్ కొలిమి ల్యాబ్ నుండి కొత్త ఆయుధం వచ్చిందని "కసక్ కిరాక్ ఖడ్గ్" అనే ఖడ్గాన్ని చూపిస్తాడు.

అప్పుడే అడవి నుండి వేట అయిపోయి కోటలోకి ప్రవేశిస్తుంటాడు బాహుబలి. కొండెక్కి అలసిపోయిన గుర్రానికు రెస్ట్ ఇద్దామని గుర్రాన్ని లాక్కుంటూ వస్తున్న బాహుబలి కట్టప్ప ఇంటి నుండి వస్తున్న అత్తరు వాసన చూద్దామని ఇంట్లోకి వస్తాడు. "కసక్ కిరాక్ ఖడ్గ్" వేస్టని కట్టప్ప అంటే బిస్లం ఖాన్ కు కోపం వచ్చి టెస్ట్ చెయ్యమంటే కట్టప్ప, బహుబలి "జై కత్తి కాంతా రావ్" అని ఖడ్గ ఫైటింగ్ చేసుకుంటారు. పీటర్ హేన్స్ కు ఐడియాలు , కీరవాణి దగ్గరనున్న అన్ని కత్తి బ్యాక్ గ్రవుండ్ సౌండులు అయిపోగానే కట్టప్ప కూతురు మిద్దె మీద నుండి "నాన్నా ఈ అత్తరు సూపరు. రెండు జాడీలు కొనుక్కో..." అని వస్తూ వుంటుంది. కత్తి యుద్ధం లో 360 డిగ్రీలు తిరుగుతూ కట్టప్ప కత్తి దెబ్బలని కాచుకుంటున్న బాహుబలి కట్టప్ప కూతుర్ని చూస్తూ 360 డిగ్రీల బదులు 180 డిగ్రీల దగ్గర ఆగిపోతాడు.

అంతే...కీరవాణి కొత్త బ్యాక్ గ్రవుండ్ బ్యాంగ్...
"కసక్ కిరాక్ ఖడ్గ్" బాహుబలి బ్యాక్ నుండి ఫ్రంటుకు..

ఎడిటింగ్ లో తీసేసిన సీన్: బిస్లం ఖాన్ అత్తరుని ప్రాడక్ట్ లైన్ నుండి తీసేసి ఆయుధాల వ్యాపారాన్ని అస్లం ఖాన్ చేతిలో పెట్టి చనిపోతాడు.

Friday, December 06, 2013

ధ.భ.నే.శు.(TGIF)- హోకు



The flight is about to land at San Francisco Airport. An American starts a conversation with an Indian IT girl.

"Where are you going?"
"ఐయాం గోఇంగ్ టూ శాన్ జోస్(San Jose)"

"No. You should not say joes. HERE j will be spelled as h. It is San h-o-se " 
"థాంక్స్. ఐ విల్ రిమెంబర్ ఇట్"

"Where are you from?"
"రాహమండ్రి , ఇండియా "

"What is your name?"
"మై నేం ఈజ్ హలహ"

"Nice name. Its Reversable. What is your mother's name?"
"షి ఈజ్ నాట్ రివర్సబుల్. హర్ నేం ఈజ్ హానకి"

"When are you going back to India"
"మై ప్రాహెక్ట్ విల్ బీ ఓవర్ ఇన్ హూన్. మై హర్నీ బ్యాక్ టూ ఇండియా స్టార్ట్స్ ఇన్ హూలై"

"థ్యాంక్స్ ఫర్ ద హోక్. యు మేడ్ మై డే. ఐ విష్ యు గుడ్ లక్ అట్ యువర్ న్యూ హాబ్."