Monday, April 28, 2008

అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశం

హైదరాబాదు వాళ్ళు బిర్యానీ తింటూ, బెంగుళూరు వాళ్ళు బిసిబెళే బాతు తింటూ ఎడతెరిపి లేకుండా బ్లాగు సమావేశాలు ఏర్పాటు చేసేస్తున్నారని అమెరికా బ్లాగర్లకు ఆవేశం ఆరడుగులు పుట్టుకొని వచ్చింది. ఇకూరుకుంటే లాభం, వడ్డీ లేదని ల్యాప్టాప్ లాగ్గట్టి (గోచీ ఎగ్గట్టి కి ప్రత్యామ్నాయ నుడికారం@రిజిస్టర్డు) తెగ బాధ పడిపోయారు. అమెరికాలో వున్న అమెరికన్లకు మన ఇంగ్లీషు అర్థం కాలేదని తెలుగు నేర్పిస్తున్న తెలుగు బ్లాగర్లకు ఇంకెంత సత్తా వుండాలి అని విహారి ఓ వేగు రాసేసి గిలారి కి పంపించాడు. గిలారి ఆలస్యం చెయ్యకుండా తూర్పు తీర ప్రాంతంలో వున్న తులారి కి, మధ్య ప్రాంతంలో వున్న మహారికి, పడమటి తీర ప్రాంతం లో వున్న పహారికి, కొండ ప్రాంతం లో వున్న కొహారికి తంతి కొట్టాడు. అన్నింట్లోనూ ఒకటే సారాశం.

"ఇరగ దీద్ధాం..."

అందరూ అనుకున్న సమయానికి సమావేశ స్థలానికి చేరుకున్నారు.

పాల్గొన్నవాళ్ళు: తుహారి, పహారి, మహారి, కొహారి, విహారి
పాల్గొనలేక పోయిన వాళ్ళు : జిలారి, దులారి, దురదారి, గోకారి
ప్రదేశం : కాకులు దూరేసిన కారడవి, చీమలు దూరేసిన చిట్టడవి
సమయం : సూర్యుడు మాడు మాడ్చేటప్పుడు

చర్చించిన అంశాలు మరియూ తీసుకొన్న నిర్ణయాలు:

1. అమెరికాలో అందరి చేత తెలుగు మాట్లాడించాలి. ప్రత్యేకంగా జార్జి బుష్షు చేత. ఆ తరువాత ఓబామాకు, హిల్లరీకు కూడా నేర్పించాలి. నేర్చుకుంటే వచ్చే అధ్యక్ష ఎన్నికలలో తెలుగు వాళ్ళందరూ వాళ్ళకే ఓట్లు వేస్తారని తెలియ చెప్పాలి. ఎన్ని ఓట్లు వున్నాయో తెలుసుకోవడానికి ఇంతవరకు అమెరికా ఇచ్చిన వీసాలు పరిశీలించుకోమని చెప్పాలి. ఆ సంఖ్యను రెండు తో గుణించుకోమని చెప్పాలి. ఈ పని సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఎవ్వరూ చెయ్యలేరని నాగలోకం నాగరాజు గారికి అప్పజెప్పారు.

2. అమెరికాలో వున్న తెలుగు సంఘాల వెబ్సైట్లను తెలుగు లోకి మార్చే ప్రయత్నం అందరూ చెయ్యాలి. కాకపోతే అందరు చేసేపని ఒక్కడే చెయ్యగలడని ఈ పనిని ఈ మధ్య కాలం లో బ్లాగులను కొండెక్కించిన చరసాల ప్రసాద్ గారికి అప్పగించాలి అని ఏకగ్రీవంగా నిర్ణయించేశారు.

3. వచ్చే ఆటా సమావేశాల్లో బ్లాగుల గురించి ఏదన్నా చెప్పాలి. అలా చెప్పడానికి సరైన వ్యక్తి ఎవరూ అని తెలీక బుర్ర బద్దలు కొట్టుకొని రెండు బుర్రలు పగిలిన తరువాత వికీపీడియన్ రవి వైజా సత్య పేరు పైకి వచ్చింది. ఊరు మారిన తరువాత పత్తాలేకుండా పోయాడని ఈ పని గుత్తగా అప్పజెప్పితే సొంత డబ్బులతో ఆటా కెళ్ళు బ్లాగు సౌరభాలు వెదజల్లుతాడని బుర్రకు అప్పుడే కుట్లేసుకున్నాయన చెప్పాడు. ఈయనే ఎందుకంటే మిగిలిన బ్లాగర్లందరూ ఇంట్లో ముగ్గురికో నలుగురికో వంట చేసి పెట్టాలి. ఈయనయితో వాళ్ళావిడకొక్కరికే వంట చెయ్యాలి. బోలెడంత సమయం మిగులుతుందని అలా డిసైడయిపోయారు.

4. మోటర్ సిటీలో (డెట్రాయిట్) లో మోటార్లు నడుపుకోకుండా సాహితీ సమావేశాలు, పిల్లలకు పద విజ్ఞాన పోటీలు అంటూ తిరుగుతున్న కొత్త పాళికి బ్లాగుల మీద భాగవతం రాయాలని పురమాయించారు. వాటిని వైజా సత్యాకిస్తే ఆయన తిప్పలు ఆయన పడతాడని అందరూ చేతులు దులుపుకున్నారు.

5. హైనెకిన్ బీరు తాగి, కౌబాయ్ రాష్ట్రం లో కౌబాయ్ లాగా నడుముకు గన్నట్టుకుని, నెత్తిన టోపీ ఎట్టుకొని హై హీల్సు వేసుకున్న భామలతో బీచి వాలీ బాలు ఆడుకోకుండా బ్లాగులో బంతాట ఆడుతున్న రానారె ని తన కారుకు తెలుగు బ్లాగులు స్టిక్కర్ పెట్టుకొని తెలుగు వాళ్ళున్న చోటికెళ్ళి కార్ హంక్ చెయ్యాలని చెప్పారు. రానారె గురించి మాట్లాడుకుంటుంటే అమెరికన్ అశరీర వాణి ఇలా చెప్పింది "అలా తెలుగు కోసం పాటు పడుతూ ప్రతి సెంటర్ లోనూ గూగులమ్మ పద్యాలు పాడితే అమెరికాలో తెలుగు బ్లాగుల మీద మక్కువ వున్న అమ్మాయి తన వెంట పడే అవకాశముంది". అవకాశమేనా లేక భగవత్సంకల్పమా అని తిరిగి ప్రశ్నిస్తే అమెరికన్ అశరీర వాణిని తిరిగి ప్రశ్నించకూడదని వెళ్ళి పోయింది.

6. ఈ మధ్య డాటరీ గిరీ కోసం ఊరు మారిన కృష్ణదేవరాయలును ఆస్పత్రి కొచ్చే ప్రతి పేషంటుకు బిల్లుతో పాటు బ్లాగు పుస్తకం ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఒక వేళ ఉద్యోగం పోతే ఇంకొ సారి పరీక్షలకు తయారయ్యేప్పుడు పోయిన సారి కన్నా పదకొండు ఎక్కువగా " బెస్ట్ ఆఫ్ లక్ లు " చెబుతామని గ్యారంటీ ఇచ్చారు.

7. పెళ్ళి ప్రకటనల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన వికటకవి కి కొత్తగా పెళ్ళయి అమెరికాలో అడుగుపెట్టే తెలుగు వాళ్ళకు గాలం వేసి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ వాళ్ళను దాటగానే వాళ్ళ చేతిలో ఒక బ్లాగు పుస్తకం పెట్టే పని ఇచ్చారు. ఒక వేళ వాళ్ళు పుస్తకం తీసుకోకపోతే వెంటనే కస్టమ్స్ ఆఫీసరు దగ్గరికెళ్ళి వీళ్ళు హైదరాబాద్ లో లష్కరే తోయిబా తీవ్రవాద గ్రూపు కు చెందిన వాళ్ళు అని చెవిలో చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చెయ్యాలి.

8. వచ్చే బ్లాగర్ల సమావేశం కేవలం మహిళా బ్లాగర్లతోనే చేయించి బ్లాగు ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించాలి అని నిర్ణయించారు. ఈ బాధ్యతని రాధిక, లలిత, నిషిగంధ, చేతన (అమెరికానేనా?) గార్లకు అప్పగించారు.


రహస్యంగా తీసుకొన్న కొన్ని నిర్ణయాలు(అమెరికా బ్లాగర్ల గీత పెద్ద గీత కావాలంటే):

1. హైదరాబాద్ లో కార్యక్రమాలు జరగ కుండా చెయ్యాలంటే వీవెన్ కు తెలుగు మరిచి పోయి ఏ అస్సామీనో, ఇసుజులూ నో మాత్రమే గుర్తుండేట్లు ఇక్కడ తయారు చేసిన "డింగో మతి"మందు ఇవ్వాలి. ఇంకా ఎవరైనా సహాయపడితే వాళ్ళను కొత్తగా కడుతున్న ఫ్లై ఒవర్ల కింద సమావేశాలు పెట్టుకోమని సలహా ఇవ్వాలి. ఏ ఫ్లై ఓవర్ ఇలాంటి పనులకు ప్రాడక్టివో తెలుసుకోవడానికి సెలక్షన్ అడ్వైసు కోసం సూరీడుని కలవాలి. చదువరి చేసిన తెలుగు బ్లాగు సంఘం రిజిస్ట్రేషన్‌ చెల్లదని సాక్షి పత్రికలో ఒక అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వాలి.

2. బెంగులూరులో ఎప్పుడూ సమావేశాలనే ప్రవీణ్ కు బ్లాగు పుస్తకం రోజుకొకటి రిలీజు చెయ్యాలని ఆదేశాలివ్వాలి. ఆ పనిలో పెడితే గానీ ఈ పని మరిచి పోడు. చెయ్యనంటే ఓ మిలియన్ రోజులు బ్లాగుల నుండి బహిష్కరించాలి. వినకపోతే డా: రాజ్ కుమార్ అభిమాన సంఘ వాళ్ళకు కన్నడ వ్యతిరేకి అని చెప్పి ఫోను చేసి పెట్టెయ్యాలి. ఇంకా వీలయితే హొగెనేకల్ నీళ్ళు కర్నాటక వి కాదు అని కూడా అన్నాడని ఎస్.ఎం.ఎస్. చెయ్యాలి.

3. మద్రాసులో ఇంకెవరన్నా సమావేశాలు నిర్వహిస్తామని ఉత్సాహం చూపిస్తుంటే వాళ్ళు ఎల్.టి.టి.ఈ. తీవ్రవాదులని రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించాలి. ఒక వేళ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి స్నేహితులు అని అనుమానముంటే సి.బి.ఐ. వాళ్ళకు కూడా చెప్పాలి.

4. వైజాగ పట్టణం లో దేవరపల్లి రాజేంద్ర కుమార్ ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడైనా బ్లాగు సమావేశాలు పెట్టే ప్రమాదముంది కాబట్టి, తన మంత్రి పదవి పోవడానికి ఈ రాజేంద్రే కారణమని టి.సుబ్బరామి రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన పూజలోనుండి రాగానే మెళ్ళో రుధ్రాక్షమాల వేసుకొని ఎదురు వెళ్ళి చెప్పాలి.

5. గుజరాత్ నువ్వు సెట్టి బ్రదర్స్ కు పైకెత్తి కట్టిన లుంగీలా కనిపించే షార్ట్స్ తో ఇంట్లోని వార్డ్ రోబ్ నింపెయ్యాలి. దెబ్బకు బ్లాగు సమావేశాలు గుర్తుకు రాకూడదు.

6. పై అయిదు నిర్ణయాలు ప్రతి సమావేశంలోనూ తీసుకోవాలి.

గమనిక: ఈ టపాకి అమెరికాలోని ఇతర బ్లాగర్లకి ఏ మాత్రం సంబంధం లేదని వివరించువాడను. ఇది కేవలం నా బుర్ర లోనుండి పుట్టిందనియూ, మిగిలిన వారెవరూ బాధ్యులు కారు అనియూ చెప్పుచున్న వాడను. తిట్లూ, శాపనార్థాలూ నాకిచ్చి పొగడ్తలూ, పొంగించటాలు మిగిలిన అమెరికా బ్లాగర్లకివ్వాలని ఒకే ఒక కోరిక కోరుచున్న వాడను. చాలా మంది అమెరికా బ్లాగర్లను మరిచిపోయినానని గుర్తొస్తే నా పేరు గజిని అని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పుచున్న వాడను.

ఇట్లు,
విహారి
(ఎలక్ట్రానిక్ చేవ్రాలు)

Thursday, April 24, 2008

సూపర్ సీన్స్ (చెంప కదిలితే....)

* * * *


విలన్ సారుకు చాలా కోపం వచ్చేస్తుంది. రమ్మంటే రాదా? ఎన్ని సార్లు ఎదురుగా వచ్చి పోరాడినా హీరో గాడు మూతి మీద గుద్దుతా వుంటాడు. బిల్లేమో డాక్టర్ దంతేశ్వర్ కి వెళుతుంది. తనొక్కసారి గాల్లో ఎగిరితే హీరో అయిదు సార్లు గాల్లోకి ఎగురుతాడు. తన చాకు రౌడీ లందరూ చాక్ పీసు లా విరిగి పడడుతుంటే చూడలేక వెనకనుండొచ్చి ఓ పెద్ద కారు సైలెన్సర్తో హీరో బుర్ర మీద డింగుమని ఒకటిస్తాడు. దెబ్బకు హీరో గారు సైలన్సయిపోయి బజ్జుంటాడు. అలానే వుంచేస్తే మళ్ళీ గాల్లోకి లేచి తంతాడని తీసుకెళ్ళి ఓ జీపు లో పడేస్తారు. విలనేమో జీపులో పెట్రోలు తీసి తగలేస్తాడని(అప్పుడు బేరల్ పెట్రోలు పదో ఇరవయ్యో డాలర్లే ఇప్పట్లా నూట ఇరవై డాలర్లు కాదు) థియేటరంతా ఎదురు చూస్తే విలన్ సారేమో వెరైటీగా ఓ పెద్ద గొయ్యి తవ్వి అందులోకి హీరో గార్ని, జీపు గార్ని తోసేస్తాడు. తోసేటప్పుడు హీరో ఎవ్వరికీ తెలియకుండా బయటికి దూకేస్తాడు అని థియేటర్లో అందరూ మరొక్క సారి ఎదురు చూస్తారు. ఎందుకంటే అప్పటికే అలా చాలా సార్లు ఎదురు చూడగానే జరిగిపోతుంటాయి కాబట్టి. కానీ అలాంటి దేమీ జరగదు. అలా చూస్తూ వుండగానే కొంచెం కాళ్ళూ చేతులూ విరిగిన ఆకు రౌడీలందరూ కలిసి థార్ ఎడారినుండీ తెచ్చిన ఇసుక బస్తాలు తెచ్చి, విప్పేసి ఆ ఇసుక నంతా వేసి ఆ గొయ్యి ని మూసేస్తారు. హీరో గారు కొంచెం, కొంచెం కళ్ళు తేలేస్తారు.

మొత్తం ఇసుక తోసేసిన తరువాత ఒక కేసు కింగు ఫిషర్ బీరు, ఒక కేసు కళ్యాణి బీరు వస్తాయి. వాటిని ఓపెన్ చేసి తాక్కుంటూ, ఊక్కుంటూ విలన్ సారు డెన్ కు వెళ్ళి పోతారు. ఈ గొయ్యికీ విలన్ డెన్‌ కు దూరమెంత అంటే రెండు బీర్లు అయిపోయేంత.

అక్కడ డెన్లో.....

హీరో గారి చెల్లెల్ని విలన్ సారు బంధించి వుంటాడు. హీరో ను భూస్థాపితం చేశాం అని చెప్పి బీరు బాటిల్లోని చివరి రెండు చుక్కల్ని వేలు పెట్టి తీసి తాగే(నాకే)స్తాడు.

హీరో లేడు.

హీరో చెల్లెలుంది.

విలనున్నాడు.


తరువాత సీను ఏంటని వై.వి.ఎస్.చౌదరిని గానీ, గుండు కొట్టుకున్న ఏ గోవిందాన్ని గానీ అడిగినా చెప్పేస్తారు. విలన్ ఆ సీను లో అనుభవమంతా ప్రదర్శిస్తూ వుండగా అప్పుడు జరుగుతుంది ఓ మాహాద్భుతం.


"అన్నయ్యా..." అని అరుస్తుంది హీరో చెల్లెలు.

"హహ్హ....హహ్హా" అని అరుస్తాడు విలన్ సారు.

"అన్నయ్యా..."

"పిలు..పిలు వాడి నెప్పుడో పాతి పెట్టేశాం" అంటాడు పుచ్చిపోయిన పంటి తో ఇంకో బీరు బాటిలు ఓపన్ చేస్తూ.

"అన్నయ్యా..."

తరంగాలు...............

గాలిలో తరంగాలు...........

అలలు.................

అలలు అలలుగా తరంగాలు....

ఒక తరంగం.............

రెండు తరంగాలు..........

మూడు తరంగాలు.........

ఇంకో నాలుగో అయిదో....అంతే....


పాతి పెట్టబడిన గొయ్యిలోకి కెమరా వెళుతుంది (డైరెట్రు సారు తీసుకెళతాడు).....


గాల్లో తరంగాలు.........

గొయ్యిలోకి తరంగాలు......

ఇసుకలోకి తరంగాలు......

జీపులోకి తరంగాలు.......

అన్నయ్యా అని పిల్చే తరంగాలు..

హీరో చెవిలోకి తరంగాలు.......

హీరో చెంపలోకి తరంగాలు......

చెంప బదులు..పులి తల .....

పులి తల బదులు హీరో చెంప...

చెంప...పులి...
పులీ...చెంపా..

(మధ్య మధ్యలో బిస్లరీ వాటర్ చుక్కలు..)

చెంపా...పులీ...
పులీ...చెంపా...

(మళ్ళీ బిస్లరీ వాటర్..)

పులి కదులుతుంది..చెంప కదులుతుంది..
చెంప చాలా సార్లు కదులుతుంది..
స్క్రీను కదులుతుంది..

కొంత మంది ప్రేక్షకులు కదులుతారు..

మళ్ళీ ఇంకోసారి అంతే....

జీపు స్టార్టవుతుంది........

ముందు బెంచీల వాళ్ళు ఎనిమిది సార్లు విజిల్ వేస్తారు.
వెనక బెంచీల వాళ్ళు ఇంకో రకం విజిల్ ఆరు సార్లు వేస్తారు.
చాలా వెనక బెంచీల వాళ్ళు ముందు బెంచీల విజిల్స్ మూడు సార్లు వేస్తారు.

విజిల్ వెయ్యని వాళ్ళు థియేటర్ బయటుంటారు.


కెమరా గొయ్యి లోనుండి బయటికొచ్చేస్తుంది.జీపు కూడా వచ్చేస్తుంది.
కెమరా విలన్ సారు డెన్ లోకి వెళుతుంది.కెమరా కన్నా ముందే జీపు వెళ్ళి విలన్ సారును గుద్దు తుంది.

ఇంకోసారి అంతే..... విలన్ సారు కేమవదు.

చెల్లెలేమో....."అన్నయ్యా.."
అన్నయ్యేమో..."చెల్లెమ్మా..."

ఓ పాట?

"నో కెమరాలో రీలు లేదు డబ్బంతా ఇసుక కొనడానికే సరిపోయింది" అని డైరెట్రు సారు చెబుతాడు.

మళ్ళీ స్క్రీనంతా కసా పిసా మస.

హీరో సేఫ్..............
హీరో చెల్లెలు సేఫ్.........
బయటికొచ్చిన ప్రేక్షకులు సేఫ్..

ఇది ఒకానొక తెలుగు సినిమాలోని క్లైమాక్స్ సీను. సినిమా పేరు గుర్తుంటే చెప్పుకోండి.త్వరలో మరో సూపర్ సీన్ తో మీ ముందుకు.

* * * *

Wednesday, April 23, 2008

ఐయాం నాటే లెజెండ్

:::::::::


ఇది చిరంజీవి ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. బాలకృష్ణ ఇచ్చింది అంతకన్నా కాదు. మరీ ముదురుగా మోహన్ బాబేమో అని అనుమానమొస్తే టైడ్ తో ఓ సారి, వై.ఎస్. నోటితో ఓ సారి బుర్రని కడిగి తళ తళ లాడిన తరువాత మళ్ళీ నెత్తి మీద బొర్లించుకోవాలి. ఇది నాకై నేను అయిదారు టి.వి. కెమెరాల ముందు ప్రాక్టీసు చేసి ఇచ్చిన స్టేట్ మెంట్.

ఐయాం నాటే లెజెండ్ అనగానే తెలుగు సినిమాల కన్నా హాలీ వుడ్ సినిమాలే బావుంటాయనే వాళ్ళకు టక్కున గుర్తుకు వచ్చేది "ఐ యాం లెజెండ్" సినిమా. ఆ సినిమా లో ప్రపంచం లో వున్న ఓ ఆరు బిలియెన్ల మందికి ఓ దిక్కుమాలిన వైరస్ వస్తుంది. అది సోకిన వాళ్ళు, ఎండ మీద పడితే ఎండ్రిన్ తాగినోళ్ళలా గిల గిలా తన్నుకుని పైకెళ్ళి పోతారు. అందువల్ల వాళ్ళు రాత్రిళ్ళు మాత్రం సంచరిస్తుంటారు. మన హీరో విల్ స్మిత్ను మాత్రం వైరస్ ఏమీ చెయ్యదు. అదెలా అంటే నాకు తెలీదు. నేను హాలీ వుడ్ సినిమాలు భాషా మాదిరి ఒక్క సారే చూస్తా. అర్థం చేసుకోడానికి ప్రయత్నించను. స్మిత్తే మో ఎంచక్కా న్యూ యార్క్ లో వాల్ స్ట్రీట్ మధ్యలో పగటి పూట సల్మాన్ ఖాన్ లెవల్లో జింకలు వేటాడుకుంటూ, బాంబర్ల మీద గోల్ఫ్ ఆడుకుంటూ సమయం గడిపేస్తుంటాడు. అప్పుడప్పుడూ రీసెర్చ్ కూడా చేస్తుంటాడు. ఆయన గారికో "రాము" అనే కుక్క తోడుంటుంది కాస్టవే సినిమాలో టామ్‌ హ్యాంక్సుకు ఫుట్ బాల్ తోడున్నట్లు. సాయంత్రం ఆరవగానే "కుయ్యోవ్…కుయ్యోవ్" అంటుంది. ఏంటి కుక్కను కున్నారా? కుక్కను కుంటే తెలుగు ప్రేక్షకుడు, గడియారం అనుకుంటే హాలీవుడ్ ప్రేక్షకుడు. అంటే ఆ టైమొచ్చిందంటే ఎక్కడున్నా చెడ్డీ ఎగ్గట్టుకొని ఇంటికెళ్ళి పోవాల్సిందే. లేక పోతే వైరస్ వచ్చిన వాళ్ళు బయటికొచ్చి .. ఆఁ బయటికొచ్చి ...... ఏమవు తుంది? ఫ్యాక్షన్ సినిమాల్లో సుమోలు ఏమవుతాయి? కొన్ని సినిమాల్లో పదడుగులు ఎగురుతాయి, ఇంకొన్ని సినిమాల్లో ఇరవై అడుగులు ఎగురుతాయి. ఇదీ అంతే. ఇక్కడ తొడ గొడతారు. అక్కడ వైరసు లూ, గ్యాస్ లీకులు జరుగుతాయి. స్క్రీన్ మీద సేం టూ సేం. భీభత్సం.


ఈ సినిమాలో 'రాము'కూడా చివర్లో యజమాని కోసం ప్రాణ త్యాగం చేస్తుంది. ఓనరు స్మిత్ కూడా అప్పుడు గట్టిగా కావిళించుకుని "రాము..రాము.. " అని ఓ పది కన్నీటి భొట్లు కారుస్తాడు. అసందర్భంగా ఒక విషయం. మన భారత్ లోని సినిమాలలో ఓ సలీం భాయ్ నో, ఓ ఫాదర్ పీటర్ నో స్నేహానికి గుర్తుగా, త్యాగానికి సింబల్ గా విలన్ చేతుల్లో గాయ పడి జై హింద్ అని పైకెళ్ళి పోతాడు. ఆలాగే హాలీ వుడ్ సినిమాల్లో కూడా ఓ మెక్సికన్ బ్రదర్ నో, ఆఫ్రికన్ బ్రో నో త్యాగానికి గుర్తుగా చూపించేస్తుంటారు. ఈ సినిమాలో ఆఫ్రికనాయన హీరో కాబట్టి వేరే త్యాగాలేమీ వుండవ్.

హెడ్డింగేంటి? ఈ లెజెండేంటి? అని మీకు అస్సలు అనుమానం రాలేదనే విషయం బాగా అర్థమై పోయింది (ఇంకా చదువుతున్నారంటే). ఇప్పుడు చెబుతోంది నేను సినిమా గురించి కాదు. గడియారము, వైరస్ గురించి మాత్రమే. సినిమాలో సాయంత్రం ఆరు గంటలకు విల్ స్మిత్ ఇంటికెళితే నేను (మేము) మాత్రం ఇంట్లోనే ఆరు గంటల కోసారి మందులేసుకుని, ఆరు సెకండ్ల కోసారి ముక్కు చీదుకుంటూ కాలం గడిపేశాం. మరి ఈ లెజెండు గొడవేంటి? ఇంట్లో అందరికీ వైరస్ వచ్చి ముక్కుతూ మూలుగుతూ వుంటే నేను మాత్రం కొన్ని రోజులు "ఐ యాం లెజెండ్" అని విర్ర వీగా.ఓ ఫైను మార్నింగు ఆ వైరస్ కాస్తా నా వొంట్లోకి రాగానే "ఐ యాం నాటే లెజెండ్" అని డిక్లేర్ చేశా. అదీ హెడ్డింగులోని సారాంశం.

అలా ఫ్లూ వైరస్ సోకిన తరువాత జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు యధాతథంగా మీముందు..

:::::::::


జీవితం మన్మొహన్ సింగు లాగా నడుస్తోంది నా ప్రమేయమేమీ లేకుండా. దగ్గు మందులూ, తుమ్ము మందులూ, జ్వరం మందులూ అని పేర్లు రాసుకోని నాలుగు బీరువాలు కొనుక్కోని ఒక్కో బీరువాకు ఒక్కొక్కరి పేరు రాసుకొని అవసరమైనప్పుడల్లా బీరువా తలుపులు తీసి సీసా మూతలు ఓపన్ చేసి ఒకరికి ఒక మూత, ఇంకొకరికి అర మూత, ఇంకొకరికి కాల (పావు) మూత పోసి మందులు తాగుతూ ఆనందంగా గడిపేస్తున్న రోజులవి.

"దగ్గేరా అన్నిటికి మూలం..." అని నే పాడితే

"చిట్టి చిలకమ్మా! దగ్గు వచ్చిందా...ఎక్కడికొచ్చింది ? నా గొంతులోకొచ్చింది..." అని చిన్నోడు కోరస్ ఇచ్చేవాడు. అదేంది నువ్వు దగ్గట్లేదు అని మా ఆవిడనడగటమాలస్యం.

"దగ్గమని నన్నడగ వలెనా పరవశించి దగ్గనా.." అని మా ఆవిడ.

"రబ్బరు దగ్గులు.. రబ్బరు దగ్గులు తెచ్చానే...రిబ్బను దగ్గులు..రిబ్బను దగ్గులు తెచ్చానే..నువ్వంటే దగ్గి..దగ్గి చస్తానే..." అని ఇంకో బుడ్డోడు. ఇప్పుడు వీడు లేటెస్ట్ గా యమ దొంగ ఫ్యాను కూడా.

అలా దగ్గుల పాట ఫ్యామిలీ సాంగు గా ఫిక్సయిపోతుందేమో అని భయపడున్న రోజులు. రమ్యమైన రెండవ రోజు, ముచ్చటైన మూడో రోజూ, నాణ్యమైన నాలగవ రోజు అయిపోగానే అందమైన అయిదో రోజు ఇంట్లో ఫోను "ట్రింగు.. ట్రింగు.." మంది "ఖళ్ళు.. ఖళ్ళు.." శబ్దాల్ని చేదిస్తూ.

"హలో మిస్టర్ దోని!!! థ్యాంక్స్ ఫార్ యూసింగ్ అవర్ క్లీనెక్స్ ప్రాడక్ట్స్.(కిసుక్...) ట్రూ యువర్ గార్బేజ్ డిస్పొసల్ వ్యాన్ వుయ్ కేం టూ నో దట్ యువర్ గార్బేజ్ బిన్ టోటలీ ఫిల్లెడ్ విద్ అవర్ క్లీనెక్స్ ప్రాడక్ట్స్. వుయ్ ఈవన్ డిడ్ అ సీక్రెట్ సర్వే. ఆల్ యువర్ నోసెస్ ఆర్ రెడ్డిష్ లైక్ ఆపిల్ (కిసుక్...) పర్టిక్యులర్లి యువర్ బుడ్డోడి ముక్కు (కిసుక్...) డూ యూ నీడ్ ఎనీ మోర్ బాక్సస్.. కిసుక్.." అన్నది ఒక మగ గొంతు.

"నో థ్యాంక్స్. కిసుక్.. వుయ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్టాక్ అండ్ వుయ్ హ్యావ్ కాస్ట్కో స్టోర్స్ నియర్ బై. కిసుక్.." అన్నా.

"సార్ యాక్చువల్లీ అవర్ సి.ఈ.ఓ. వాంటెడ్ టూ మీట్ యూ పెర్సనల్లీ. బట్ అన్‌ఫార్చునేట్లీ హీ హ్యాస్ టూ గో టూ ఒలింపిక్ టార్చ్ రన్. వుయ్ ఆర్ గివింగ్ స్పెషల్ డిస్కౌంట్స్ ఫార్ యూ, 10% ఫార్ బీయింగ్ యాన్‌ఇండియెన్ ఇన్ అమెరిక అండ్ 10% ఫార్ టెలుగు పర్సన్ అండ్ 5% ఫార్ చౌడేపల్లి పర్సన్"

అదేంటో ఆశ్చర్యంగా మొదటి సారిగా ఒక తెలుగు వాడు ఇంగ్లీషు మాట్లాడినా ఇంకో సారి రిపీట్ చెయ్యమనకుండా అర్థమయిపోయి వెంటనే తిరుగు సమాధాన మొచ్చింది. ఈ మధ్య ఒక గుడి కూడా లేని ఊళ్ళో పోటా పోటీగా రెండు గుళ్ళొస్తున్నా ఏ గుడి కెళితే ఏమి దొబ్బులో అని దేనికి కూడా వెళ్ళలేదు. కాబట్టి దేవుడు తన హస్తం తిప్పి కొత్త వరాలిచ్చే చాన్సు లేదు. ఎక్కడో ఏదో మతలబుంది.

"నో...నా కొద్దు."

"సార్ అలా అనకండి సార్.."

"నాకొద్దన్నాను కదా"

"అలా అంటే ఎలా సార్? ఒక్క మగాడు,జై చిరంజీవ లాంటి సినిమాలు చూడని వాడిలాగా అంత కఠినంగా మాట్లాడ కూడదు సార్. కాస్త పెద్ద మనసు తో కనికరించండి"

...... అరే తెలుగు లో మాట్లాడుతున్నాడు.....

"తెలుగొచ్చా.."

"అవును సార్..అమెరికా ఎకానమీ బాగ దొబ్బింది కదా. ఈ మధ్య అన్నీ ఇండియాకు అవుట్ సోర్సు చెయ్యడమే కాకుండా అమ్మకాల్ని పెంచుకోడానికి కస్టమర్ ప్రోఫైల్ చూసి ఏ భాష మాట్లాడితే బుట్ట లో పడి పోతాడో ఆ భాష వాడిని ఇందుకు పురమాయిస్తున్నారు. తొందర్లో బ్లాగులోళ్ళను బుట్టలో వేసుకోడానికి కూడలి ట్రైనింగు కూడా పెట్టబోతున్నారు సార్ "

"బాత్ రూం లో వుంటే కిటికీ తలుపులు తెరిచి 'ఐడియా' అనేదానికన్నా ఇదేదో బానే వుందే..సరే నువ్వు నాకు నచ్చినట్లు మాట్లాడ తావా?"

"అవును సార్.."

"మీదే వూరు?"

"... సార్"

"మాదే ఊరు..?"

"చౌడే పల్లి సార్. అందుకే మీకు అయిదు శాతం అదనపు తగ్గింపు"

"అదే? ఎందుకలా.."

"మీ ఊరోళ్ళు సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా నలుగురితో పంచుకుంటారట కదా. అలాగే మీకొచ్చిన రోగాన్ని ఇంకో పది మందికి పంచితే మా వ్యాపారం బావుంటాది కద్సార్. అందుకనే మీరు మా ప్రిఫర్డ్ కస్టమర్."

"బానే వుంది కానీ నువ్వు మా వూరి యాస లో మాట్లాడితే ఆర్డర్ ప్లేస్ చేస్తా.."

......గీక్…గీక్….గీక్….గీక్....

"ఏంటీడు ఫోను పెట్టేసి నట్టున్నాడు. మరదే నా తో పెట్టుకుంటే ఇలానే వుంటుంది. "

:::::::::


అన్ని అనారోగ్య సెలవులు అయిపోయాయి ఇక నువ్వు ఆఫీసు కొచ్చి ఏడువు అన్నారు ఆఫీసు వాళ్ళు.

ఏలాగోలా గుండెను(ఊపిరి తిత్తులు అని చదువు కోవాలి) చిక్కబట్టుకొని ఆఫీసుకొచ్చా ఖళ్ళు ..ఖళ్ళు .. మని దగ్గుకుంటూ. బ్యాడ్జి స్కాన్ చెయ్య గానే సెక్యూరిటీ వాడు కెవ్వు మని కేకేసి పానిక్ బటన్ నొక్కబోయి తమాయించుకుని ఇది తెలిసిన ఫేసే అని వంటికున్న బ్లూ కోటు మొహాని కేసుకొని దూరంగా జరిగి 'హాయ్' అన్నాడు. టెన్సింగ్ నార్వే కాంచనజంగా చివరి కాలు (లాస్టు లెగ్గు) కష్టపడి ఎక్కినట్లు ఒక్కో మెట్టుకో దగ్గును దానం చేసి మెట్లు ఎక్కేసి వస్తుంటే ఫ్లోర్ మొత్తం కుర్చీలు జరుపుకుని ఒక వైపు కు వెళ్ళి పోయారు. ఏమంటే 'మాకందరికి ఇక్కడే సుఖంగా వుంటుంది ఇంకో రెండు వారాలు' అన్నారు. వీళ్ళ సుఖానికి సుఖ వ్యాధులు వచ్చి తగలబడి పోనూ అని ఒక్కడే కుర్చీలో కూలబడి పని చేసుకున్నా.

సద్ది పెట్టె లోనుండి తీసిన అన్నం వేడి చేసుకొద్దామని క్యాంటీనుకు వెళితే అక్కడున్న వాళ్ళు కొత్తగా కట్టిన బ్రిడ్జి కూలిపోతున్నట్టు హాహా కారాలు చేసుకుంటూ దారిచ్చేశారు నెత్తిన తట్టలో పిల్లంగట్టె ఓనరును పెట్టుకుని యమునా నదిని దాటుతున్న వసుదేవుడికి దారిచ్చినట్టు. (హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు టెన్ కమాండ్మెంట్స్ సినిమాలో క్లైమాక్స్ లో మోసస్ ఎర్ర సముద్రం దాటే సీను గుర్తుకు తెచ్చు కోవాలని హింటు). ఇక మీటింగుల్లో అయితే రైల్వే ఎంక్వయిరీ లో అడినట్లు కొచ్చెన్లు వేసే వాళ్ళు. నేనేమో కౌంటర్ లో కూచున్న ఎంక్వైరీ ఆఫీసర్ లా పది ప్రశ్నలకు ఒక సమాధానం చెప్పే వాడిని. అలా నాఖ్యాతి ఈ నోటా ఆ నోట బడి ఖండాంతరాలకు వ్యాపించింది.

చాలా మంది డబ్బు యావ తో కె.సి.ఆర్. కూలి పనితో అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకుందామని వేరే చానల్సు చూస్తునప్పుడు "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" లో వచ్చిన నా ఇంటర్వూ యధా తథంగా.

న్యూస్ రీడర్ న్యూటన్ రమేష్ : అమెరికాను కుదిపివేస్తున్న మహమ్మారి ఫ్లూ వైరస్.ట్రింగ్..ట్రింగ్..బుడక్..బుడక్.. ఈ వ్యాధి బారిన ఎన్నో అమెరికన్ల కుటుంబాలే కాకుండా మన ప్రవాసాంధ్రులు కూడా దీని బారిన బడ్డారు. దీని రుచి మరిగి తమ జేబుకు చిల్లు వేసుకోవడమే కాకుండా క్రెడిట్ కార్డుకు పెద్ద పెద్ద రంధ్రాలు వేసు కుంటున్నారని తెలుస్తోంది. దీని గురించి మా "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" ప్రత్యేకంగా అందిస్తోన్న ప్రత్యేక కథనం. దీని కోసం ప్రత్యేకంగా మా రిపోర్టర్ రియాజ్ మరియూ ప్రత్యేక కెమరా తో కెమరామెన్ కరీం అమెరికా నుండి అందిస్తున్న సంచలన కథనం. హలో! రియాజ్! మీరు అక్కడ మన ప్రవాసాంధ్రుని ఇంట్లోనే వున్నారా? అక్కడ మీరు గమనించిన విశేషాలేంటి చెప్పండి. రియాజ్? రియాజ్??? ఏదో సాంకేతిక లోపం అనుకుంటా. హలో కెమరామెన్ కరీం మీరు ఇప్పుడు మీ కెమరాని మన ప్రవాసాంధ్రుని ఇంట్లోకి జూం చేసి చూపించగలరా? వీలయితే వారు ముక్కు చీది పడేసిన న్యాప్కిన్లు, వాడేసిన టాబ్లేట్ కవర్లు, తాగేసిన టానిక్ బాటిళ్ళూ లాంటి వాటి మీద ఫోకస్ చేసి చూపించండి. ఇంకా వీలయితే ఎవరి మొఖమయినా వాడి పోయుంటే వారి ముఖాన్ని మరింత దీనంగా చూపించండి. ఆ దృశ్యాలను కళ తప్పించడానికి మళ్ళీ మన గ్రాఫిక్స్ టీముకు పని కల్పించకండి.

ఫోనులొ: హలో..న్యూస్ రీడర్ న్యూటన్‌ రమేష్?...న్యూస్ రీడర్ న్యూటన్‌ రమేష్?

న్యూస్ రీడర్: హలో? ఇది బ్యాకప్ భజ గోవిందం గొంతు లాగుందే?

భజ గోవిందం: అవును నేను బ్యాకప్ భజ గోవిందన్నే.

న్యూస్ రీడర్: అదేమిటి మీరు వాళ్ళకు బ్యాకప్ గా వుండాలి గానీ మీరే ఫ్రంట్ లైనులో కొచ్చారేమిటి?

భజ గోవిందం: విషయమేంటంటే రమేష్ వాళ్ళు అమెరికాలో దిగ గానే అక్కడి కస్టం ఆఫీసర్ మన వాళ్ళ పాస్ పోర్ట్ మీద తుమ్మాడు రమేష్ . ఆ పాస్ పోర్టును మన వాళ్ళు తుడుచు కోకుండా పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చిన ఆనందం లో ముద్దు పెట్టుకున్నారు రమేష్. ఆ దెబ్బకు వాళ్ళక కూడా ఫ్లూ వచ్చి మందులేసుకుంటూ హోటల్ రూములోనే వుండి పోయారు రమెష్ .

న్యూస్ రీడర్: అలాగయితే మన ప్రొడ్యూసర్ కు చెప్పి వాళ్ళ పాస్ పోర్ట్ క్యాన్సిల్ చేయించమని చెబుతాను. మీరు ఇప్పుడు అక్కడే మన ప్రవాసాంధ్రుని ఇంట్లోనే వున్నారా భజ గోవిందం ?

భజ గోవిందం: అవును రమేష్, ఇప్పుడు నేను ఆ ఇంటి యజమానితో మాట్లాడు తున్నాను. మీరందరు కాఫీ తాగకుండా శ్ర్ధ్ధద్ధగా వినండి రమేష్. చూడండి విహారి గారు, మీకు ఇలా ఈ ఫ్లూ వైరస్ రావడానికి కారణమేమనుకుంటున్నారు?

విహారి: ఖళ్...ఖళ్...

భజ గోవిందం: అర్థమయింది మీ మీద ఎవరో తుమ్మడం వల్ల వచ్చింది కదా? ఈ సారి ఫ్లూ షాట్ వేయించుకోలేదా?

విహారి: నేను... ఖళ్...ఖళ్...ఒక సారి..ఖళ్ .. మా డాక్టర్...ఖళ్..

భజ గోవిందం: మీరు ఫ్లూ షాట్ వేయించుకున్నా రావడానికి కారణం ఈ సంవత్సరం ఫ్లూ షాట్ మందులో పవర్ తక్కువ వుండటం వల్ల అని మీ డాక్టర్ చెప్పారు కదా. మీరు దీనికి ఏ మందులు వేసుకుంటున్నారు.

విహారి: ఖళ్...

భజ గోవిందం: మీరు టమీ ఫ్లూ వేసుకుంటారని తెలిసింది. మీ బుడ్డోళ్ళను ఇంటర్వూ చెయ్యొచ్చా?

విహారి: ఖళ్ లాగే.

భజ గోవిందం: చిన్న బుడ్డోళ్ళిద్దరూ కెమరాలు కనిపించగానే బేస్ మెంట్ లోకి పారి పోయారు రమేష్. ఆందువల్ల వాళ్ళను ఇంటర్వూ చెయ్యడానికి కుదర్లేదు. ఇక మీరు ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏమన్నా వున్నాయా?

విహారి: అవేంటంటే ..ఖళ్..

భజ గోవిందం: రమెష్, ఇప్పుడు ఈయనేం చెబుతున్నారంటే. మన "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" మరింత అభివృధ్ధి చెందాలని, నాలాంటి రిపోర్టర్ లు ఎక్కువ మంది వుండాలని, నాలాంటి వాళ్ళు మాత్రమే అంకిత భావంతో పని చేస్తారని, నా రాక ఆయనని ఎంతో ఆనందానికి గురి చేసిందని, భవిష్యత్తులో నా చేతే ఇంటర్వూ చేయించుకోవాలని వుందని అంటున్నారు. చివరిగా న్యూస్ రీడర్ న్యూటన్ రమేష్కు ధన్యవా దాలు తెలుపుతూ బ్యాకప్ భజ గోవిందం ఫ్రం అమెరిక.

న్యూస్ రీడర్: థ్యాంక్యూ బ్యాకప్ భజన గోవిందం,క్షమించాలి భజ గోవిందం! "టి.వి. తొంభై తొమ్మిది సార్లు" ను విష్ చేసిన మన ప్రవాసాంధ్రుడు తొందరగా కోలుకోవాలి కోరుకుంటూ. ఇక "మీ కోసం" రథాన్ని నడిపేప్పుడు టైరు పంక్చరయితే చెయ్యాలి,ఎవర్నన్నా గుద్దేసి బుర్ర లో పుర్రె పగిలిపోతే ఏం చెయ్యాలి లాంటి వాటి గురించి తెలుసుకోడానికి ఫ్రాన్సు నుండి వచ్చిన ట్రైనర్ నుండి మెళకువలు నేర్చుకుంటున్న హరికృష్ణ పై ప్రత్యేక కథనం బ్రేక్ తర్వాత...

:::::::::


అన్నీ సమసి పోయాయి ఇక నేను మామూలు మనిషి నవుతున్నా అని డిక్లేర్ చెయ్యడానికి స్టేట్మెంట్ రాద్దామని పెన్నూ, పేపర్ తీసుకోబోయేంతలో ఊపిరి తిత్తులు చాలా ఉద్వేగానికి లోనయి ఎపిగ్లాటిస్ ను ఉరకలు పెట్టించింది. ఏపిగ్లాటిస్ అనందం పట్టలేక జగదేక వీరుని కథలో ఎన్టీఆర్ లాగా డోలు, మద్దెల, వీణ, ఘటం అన్నీ కలగలిపి "నా దిరి..దిరి..నా దిరి.. దిరి.. దిరి ..దిరి.. దిరి.. దిరి.." అని స్వర పేటికను సాక్షి పత్రిక రామోజీ రావును వాయించినట్లు వాయించింది. అలా పలు రసాయనిక, భౌతిక చర్యలకు లోనై అమ్రీష్ పురి గొంతు, సి.ఎస్.ఆర్. గొంతు రెండూ మిక్సీ లో క్రష్ చేసి వెడల్పాటి బాణలిలో పోసి కో వై సరళ గొంతుతో డ్రెసింగ్ చేసినట్లయింది నా గొంతు. నా గొంతులోనుండి వచ్చిన ఒక సాంపిల్ డైలాగ్ "హేయ్ రాజన్!!! మహా ద్రష్టా కాల్ భైరవా!!! ఓరేయ్ పొట్టి బ్రహ్మం, నీ గ్రుండు పీకేస్తాన్రో!!!"

వైరస్ వచ్చిందని వార్షికోత్సవాలు ఆగవు కదా. ఏ ముద్దూ ముచ్చటా లేని ఆ రోజు వచ్చిందని మేమేడుస్తుంటే ఓ ఫ్రెండు భారత్ నుండి ఐడియా సెల్ ఫోనులో నుండి కాల్ చేశాడు విష్ చేద్దామని. నీ ఐడియా సెల్ ఫోనుకి బిల్లెక్కువొస్తుంది అని నేను బ్రిలియంట్ ఐడియా తో రిలయన్సు నుండి ఫోను చేస్తానని ఫోను పెట్టేసా. ఆ ఫోను పెట్టేసిన వెంటనే గొంతు రీ-రికార్డింగుకు గురయిందని, మిక్సింగులు జరిగాయని అర్థం చేసుకుంటారనుకుంటాను. అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడొచ్చిన ప్రమాదమేమీ లేదు గానీ ఇప్పుడు అర్థం చేసుకోమని మనవి.

తీరిక చేసుకుని భారత్ కు ఫోను చేశా.

"హలో.." నేను

"హలో..ఎవరూ?" అవతల భారత్ నుండి.

"హలో.. నేనే"

"హలో కస్తూరీ నువ్వా. ఎలా వున్నావ్. ఎన్నాళ్ళయింది నీ గొంతు విని. అప్పుడెప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కాలేజీ లో నేనిచ్చిన ప్రేమ లేఖకి సమాధానంగా ఇప్పుడు ఫోను చెస్తున్నావా కస్తూరీ...ఇప్పుడు ఫోను చేస్తున్నావా కస్తూరీ..." వాడి గొంతు గద్గదంగా మారిపోయింది.
నా కెందుకో మూగ మనసులు సినిమాలో ఏఎన్నార్ గుర్తు వచ్చాడు.

"ఒరేయ్..ఒరేయ్.."

"అవును కస్తూరి...నువ్వు ప్రేమగా ఒరేయ్ అనే పిలుపు వినే నేను నిన్ను ప్రేమించాను. ఎంతో మంది కాంపిటీషన్ వున్నా ఈ ప్రేమ పిలుపు కోసమే నీ వెంట పడ్డాను. నీకు గుర్తుందా ఆ మహేష్ గాడు నిన్ను బైక్ మీద తీసుకెళ్తానని అన్నా వినకుండా నాతో నా సైకిల్ మీద వెనక క్యారియెర్ మీద కూర్చుని వచ్చిన రోజు? క్యారియర్ స్ప్రింగు ఊడి పోయి నీ పైట అందులో ఇరుక్కుపోయి చిరిగి పోతే ఆ చిరిగిన ధారపు పోగులను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా. మళ్ళీ ఇన్నాళ్ళకు.." అవతల వాడు గుమ్మడి లాగా కళ్ళు తుడుచుకోవటం మొదలు పెట్టాడు.

"నువ్వా ఏడుపు కాస్త ఆపుతావా"

"ఎలా ఆపగలను కస్తూరీ? జయంతి కి కన్నీళ్ళు, ఆర్.నారాయణ్ మూర్తికి ఆవేశం ఆగుతుందా చెప్పు.. కస్తూరీ చెప్పు..కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇప్పుడు నువ్వు నా ప్రేమను అంగీకరిస్తున్నావని మాత్రం చెప్పకు. నేను పాత సినిమాల్లో శోభన్ బాబు లా, కొత్త సినిమాల్లో జగపతి బాబు లా మారే మనిషిని కాదు. నాకు పెళ్ళయి పోయింది. ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు కూడా. నిన్ను నా హృదయం లో మాత్రమే వుంచుకోగలను. ఏ అపార్ట్మెంట్లోనూ వుంచుకోలేను. నీకు రెండు రూపాయిల బియ్యమైతే కొనగలను కానీ. ఏ కూరగాయలూ కొనలేను"

"అలా అనకు ప్రియతమా. కావాలంటే బియ్యం సాంబార్, బియ్యం చట్నీ, బియ్యం పెరుగు, బియ్యం వేపుడు, బియ్యం కుర్మా చేసి పెడతా.."

"నన్ను తీవ్రమైన సంఘర్షణకు లోను చేస్తున్నావ్ కస్తూరి. కావాలంటే అంభికా దర్భార్ అగర్బత్తి పెట్టి మనస్సు లో పూజించుకుంటా?"

"అలాగంటే ఎలాగండీ.. నా జీవితం అడవి కాచిన వెన్నలయిపోతుందే? మిమ్మల్నే నమ్ముకొన్నానే... చా ఆపు ఎదవ నాకొడకా. నువ్వూ నీ ఫ్ల్యాష్ బ్యాకూ. నీకు ఫోనొచ్చింది అమెరికా నుండి. కస్తూరి నుండి కాదు"

"అయ్యో... నువ్వు నా పాత కస్తూరి కాదా.?"

"పాత కస్తూరి కాదు. కలకండా కాదు"

"నువ్వా రా? ఎలా వున్నావ్?"

"ఇదిగో విన్నావు కదా గొంతు. అలా వున్నాను"


:::::::::

Monday, April 07, 2008

సర్వ ధారి నామ యుగాది శుభాకాంక్షలు (మరి కొన్ని ఎగస్ట్రాలు)

:::::::::

తెలుగు లోక జనులందరికి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటికే దాదాపు అందరి ఇళ్ళల్లో పోళీలు(బొబ్బట్లు), పచ్చడి తయారు చేసిన గిన్నెలు కడగడానికి సిధ్ధమయి పోయుంటాయ్. భూమికి ఇంకో వైపున వున్న తెలుగు వారిళ్ళలో వచ్చే వారాంతం దాకా వంట గిన్నెలు ఫ్రిజ్వాసనలు వెదజల్లుతూ వుంటాయి. మా ఇంట్లో అయితే ఉగాది ఇలా జరిగింది.

" ఊ...వూ....ఊ యా..వూ వూ యా యా...."
" గ్యా ..గెగెగ్గే.....గేగెగ్గే...గ్యా..గ్యా..గ్యా గెగ్గెగ్గే.."
" ది...దిద్ది..దెద్ధే ద్దే..దే..దే...దీ...దీ..దే..."

ఇది మా చిన్న బుడ్డోడు ఏడ్చేప్పుడు ఇచ్చే సౌండు. ఊరూరా,ఇల్లిల్లూ తిరుగుతూ ఉత్తర అమెరికా ఖండాన్ని పావనం చేస్తూ వస్తోన్న రక రకాల వైరసమ్మలు మా ఇంటిని కూడా పావనం చేశాయి. దీని పేరు 'స్టమక్ వైరసమ్మ'. సేవించు విధానం. ఏవీ లేదు ఏదీ(లోనికి) సేవించకుండా వుంటే చాలు. ఈ సందర్భంగా టైలనాల్,విక్స్,ధర్మా మీటర్ అన్నీదగ్గర వుంచుకొని పరమ పవిత్రంగా సేవిస్తున్నాం. పొరపాటున వళ్ళోంచి కిందకు దింపితే మా బుడ్డోడు ఉగాదిని గుర్తు చేస్తున్నాడు.

మొదటి లైను ..ఊ : వార్నింగ్ రాగం
రెండో లైను ....గ్యా : ఆరున్నొక్క రాగం
మూడో లైను...దెద్ధే : ఊర్లో వాళ్ళొచ్చే రాగం

:::::::::


ఉగాది సందర్భంగా నేను తీసుకున్న నిర్ణయాలు: భవిష్యత్తులో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు.

(మీ మనసులో 'హమ్మయ్య వీడు బ్లాగులు మానేస్తానని నిర్ణయం తీసుకుంటే బావుండు' అనిపించింది గదా. ఎప్పుడన్నా అలాంటి నిర్ణయం తీసుకుంటే నమ్మొద్దని ముందే వార్నింగ్ )

:::::::::

Friday, April 04, 2008

భూ తో మొదలయ్యే పదాలు...

:::::::::


మనబడి రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి. మూడో త్రైమాసికం మొదలయ్యే రోజు గతం లో జరిగిన పాఠ్యాంశాలు పిల్లలు గుర్తు పెట్టుకున్నారో లేదో చూద్దామని ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టా. అడిగిన వాటిలో చాలా మటుకు ఠకీ ఠకీ మని చెప్పేశారు. ఇక చివరగా కొన్ని అక్షరాలు చెబుతూ ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు చెప్పమన్నాను. ఒక్కో దానికి తమకు గుర్తున్న వన్నీ చెప్పేశారు. ఇన్ని అడిగాం కదాం నా పేరు గుర్తు పెట్టుకున్నారో లేదోనని ఓ అక్షరం చెప్పా.

"భూ తో మొదలయ్యే పదాలు చెప్పండి"

మొదటగా చెయ్యెత్తింది మా బుడ్డోడు. ఇక వెంటనే ఇంకో అయిదు చేతులు పైకి లేచాయి " నేను చెబుతా..నేను చెబుతా.." అని.మా బుడ్డోడు ఏమి చెబుతాడో నాకు తెలుసు. అనుమానం లేదు ఖచ్చితంగా వాడు నా పేరే (భూపతి విహారి) చెబుతాడు అనే నమ్మకంతో వాడి నడక్కుండా మిగతా అందర్ని అడిగా.

ఒక్కొకళ్ళు భూమి, భూదేవి, బూంది (శబ్దం అదేగా)..... అని చెప్పేశారు. చివరగా మా బుడ్డోడి నడిగా.

"భూమిక.." ఎగిరి గంతేసి చెప్పాడు.

చుక్కలు నా కళ్ళ ముందు ఎగురుకుంటూ కనిపించాయి. క్లాసయిన తరువాత వళ్ళో కూచోబెట్టుకుని
"చిట్టి కన్నలూ!!! నువ్వు నా పేరెందుకు చెప్పలేదురా?"
"కావాలనే చెప్పలేదు"
"నీ కావలనే దొంగ లెత్తుకెళ్ళా. నీకు భూమిక ఎలా తెలుసురా దొంగ భధవా (భడవ+వెధవ)? ఆవిడ నెక్కడ చూశావ్"
"టి.వి. లో వచ్చిన మిస్సమ్మ సినిమా లో చూశా"
"!!!"

మా టీవికీ జై

:::::::::

Wednesday, April 02, 2008

కోతికి కొబ్బరి చిప్ప

:::::::::


నాడు: మీరు చేసేది సరీగా లేదు. దురదృష్టవశాత్తు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు.మీరు దాన్ని ఆచరించాలి -- కాంగ్రేస్ గొంతు

నేడు: (స్పీకర్ బదులు డెప్యూటీ స్పీకర్ గా వున్న దళిత మహిళ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు) స్పీకర్ తప్పని సరిగా సభలోకి రావాలి. అంత వరకు ఊరుకునేది లేదు -- తెలుగు దేశం గొంతు


కొసమెరుపు: జూలకంటి రంగా రెడ్డి విలేఖర్ల ముందే బాబు మాట్లాడిన దాన్ని సి.డి. లో చూసి, అవును తప్పు లేదు అని చెప్పి అసెంబ్లీ లో కెళ్ళగానే " బాబు తన మాటలను ఉపసంహరించుకోవాలి" అనటం వామ పక్షం వానర పక్షమై జంపింగు నేర్చుకోవటమే.

ప్రజల చెవుల్లో పూలు ఏప్రిల్ లో మరో సారి ప్రజలు ఫూలు.

:::::::::

Tuesday, April 01, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ ( ఫోటో సాక్షి )

:::::::::


"అయ్య గారూ, మీరు కారు డ్రైవింగ్ టెస్టు పాసయ్యారా?"
"పాసవకుండా లైసెన్సు ఎలా ఇస్తార్రా? నువ్వా ఈనాడు చదవడం మానేసి సాక్షి చదువు నిస్పక్షపాతం అంటే ఏంటో తెలియచెబుతోంది.రేపో మాపో ఎన్టీఆర్ గండి పేట ఆశ్రమం లో కట్టించిన గుడిసెకు వాడిన బోద బంగ్లాదేశ్ నుండి ఎలా అక్రమంగా తరలించారో సవివరంగా, సచిత్రంగా ఒక పరిశోధనాత్మక వ్యాసం రాస్తారు. అది చూసయినా ఈ ప్రభుత్వంలో నిజాయితీ ఎంత వుందో తెలుస్తుంది. ప్రతి దానికీ డౌటే నీకు.కష్టపడి పరీక్ష రాసి లైసెన్సు తెచ్చుకున్నా.సరే డ్రైవింగ్ గురించి ఇప్పుడెందుకడిగావ్?"
"ఏం లేదు. యు టర్న్ ఎలా తీసుకుంటారో చెబ్తారా? "
"వెళ్ళి ఈయన్ని కానీ ఈయన్ని కానీ అడుగు."
"అదే ఎందుకలా జరిగింది?"
"రెండో మూడో ప్రాజెక్టులొచ్చుంటాయి లేదా నాలుగో అయిదో కాళ్ళు విరుగుంటాయి. కొంత మందికి డిసెంబర్ లో క్రిస్మస్ కి రావాల్సిన కానుకలు ఉగాదికి కొంచెం తొందరగా వచ్చాయి అంతే."
"ప్రతి సారి డిసెంబరు లోపల తెస్తా ఇస్తా.. డిసెంబరు లోపల తెస్తా ఇస్తా .. అన్నది ఎవరండి?"
"ఇదిగో ఈయనే . ఈయన అన్న ప్రతి సారి జనవరి వచ్చింది కానీ ఆయన చెప్పిందేమీ రాలేదు."
"మీరు కూడా ఇవ్వటం మొదలు పెట్టినట్టున్నారు. మొన్న మన పొలం దున్నుతున్నప్పుడు కొన్ని పురాతన విగ్రహాలు దొరికాయి కదా వాటిని ఎక్కడ ఇచ్చేశారు?"
"ఇదిగో ఇందులో పనిచేసే వాళ్ళకు ఇచ్చేశా. వాళ్ళు ఇటువంటి పరిశోధనల్లో మహా ఘటికులు."

"హజ్ యాత్ర చేసేవాళ్ళకు సౌకర్యాలు, జెరూసలం వెళ్ళే వాళ్ళకు సదుపాయాలు కలుగచేస్తున్నారు కదా మరి తిరపతి వెళ్ళే వాళ్ళకు ఏమి ఇస్తున్నారు."
"ఇదిగో ఇవి ."
"మీరు మరీనూ అది తిరపతి వెళ్ళని వారిక్కూడా ఇస్తున్నారు.రేపో మాపో రాష్ట్ర ప్రజలకు మిగిలేది అదే.దానిక్కూడా ఇందిరమ్మ పథకం పెడతారేమో.ఇరవై నాలుగ్గంటలూ ప్రజలకు వేద్య సేవలు, విద్యుత్ సేవలు అందిస్తామన్నారు కదా చాలా విద్వత్తు వున్న ఈ ప్రభుత్వం వాళ్ళు. ఈ ఇరవై నాలుగ్గంటల మీద మీ అభిప్రాయమేమిటో..."

"బార్ల దార్ల డోర్లు బార్లా
బీర్ల వీర్లు రోడ్ల బోర్లా "

"నేను సౌకర్యాల మీద అడిగితే మీరు 'నిషా'కార్యాల మీద చెబుతున్నారు."
"నేను చెబుతోన్నది అదే 24 గంటల సౌకర్యాల గురించే. అదీ నిఖార్సుగా నడుస్తున్న వాటిగురించి. నా మీద కొంచెం విశ్వాసముంచరా "
"లేకుండా ఎక్కడా పోలేదు.నేను మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అంతటి వాడిని కాను."
"పాపం బాబు"
"ఇప్పుడు బాబు కేమయింది?"
"అవిశ్వాస తీర్మానం నెత్తిన పెటుకున్నాడు కదా."
"ఏనుగు నెత్తిన వాన కురిపిస్తున్నాడు."

"మన బ్లాగులోళ్ళు బాబు పక్షమా, వై.ఎస్. పక్షమా?"
"కొంత మంది బాబు, కొంత మంది వై.ఎస్."
"మరి మీరో?"
"నేను వీరి పక్షం."
:::::::::

"అయ్యా, ఈనాడు ను న్యూస్ టుడే,ఆంధ్ర జ్యోతిని స్పాట్ న్యూస్ అని అంటారు కదా. అలాగే సాక్షిని ఏమంటారు."
"నేను చెప్పడమెందుకులే నేను ఏ unbiased న్యూసో అంటాను నువ్వేమో నేను లడ్డూలు తిన్నా జాంగ్రీలు తిన్నా అంటావు అవన్నీ ఒద్దు కానీ నువ్వే చెప్పేసెయ్."
"Witchy News అంటారు."

:::::::::