Tuesday, September 29, 2009

మన బడి గడుగ్గాయిలు

* * * * * * * *

వేసవి సెలవులు అయిపోయిన తరువాత వచ్చిన పిల్లలను సెలవుల్లో ఏమి చేసారో రాసుకొని రమ్మన్నాను. ఒకళ్ళేమో డిస్నీకెళ్ళామంటే ఇంకొకళ్ళు డకోటా(సౌత్ డకోటా) కెళ్ళామని రాసుకొచ్చారు. ఒక గడుగ్గాయి భారత్ వెళ్ళొచ్చాడు. పేపర్ లో రాసుకొచ్చింది నా చేతిలో పెట్టి నా పక్కన నుంచున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింట్లో ఆవు ఈనిందట. ఒక దూడ పెయ్యని ఈనిందట. అమ్మమ్మ జున్ను చేసి ఇచ్చిందట. జున్ను.. జున్ను అనగానే మనసు రాకెట్ ఎక్కి మా అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ నేను ఆవు పొదుగు నుండి పాలు తాగుతున్న సీన్ ని 70 MM లో "క్షీర క్షీర క్షీర.. మనసార గ్రోలరా.. " అన్న పాట ను బ్యాక్ గ్రౌండు లో పెట్టి ఫ్రంట్ గ్రౌండ్ మర్చిపోయా. యాంత్రికంగా రాసింది చదువుతూ వుంటే భారత్ లో వున్నప్పుడు మొట్టికాయల ఆట ఆడాను అన్నది కనపడింది. బ్యాక్ గ్రౌండ్ పాట తారాస్థాయిలో వుండగా ఆ గడుగ్గాయిని మొట్టికాయల ఆట ఎలా ఆడుతారు అని పొరపాటున అడిగా. నా కళ్ళు ఒక చేత్తో మూసి ఇంకో చేత్తో టెంకి జెల్ల ఇచ్చుకున్నాడు. ఆ దెబ్బకి నా ఏడో తరగతి మొట్టికాయలు గుర్తుకు తెచ్చుకుంటుంటే నా ముందున్న మూడో తరగతి పిలకాయలు "ఎన్నాళ్ళో వేచిన ఉదయం... " అన్న పాటకి మైఖేల్ జాక్సన్ స్టెప్పు లేస్తూ కనిపించారు.

* * * * * * * *


కొత్తగా మొదలయిన క్లాసు లో పిల్లలు రెండో సెషన్ కు వచ్చినప్పుడు పోయిన క్లాసు లో చెప్పిన హోము వర్కు చేసుకొచ్చారా అని అడిగితే అందరూ చూపించారు. ఒకడు మాత్రం చూపించలేదు.
"హోం వర్కు చేసుకొచ్చావా ?"
"ఎస్!"
"అయితే చూపించు?"
"వై?"

ఈ బుడ్డోడు పైన చెప్పిన మొట్టికాయల బుడ్డోడి తమ్ముడు. వయసు ఆరేళ్ళు

* * * * * * * *


కొత్త క్లాసులో కొత్తగా చేరింది ఓ పిల్ల పిడుగు. నేను ఒకటి చెబితే తను నాలుగు చెబుతుంది. ఎంత ఊర్కోమన్నా ఊర్కోలేదు. సరే ఇలా కాదని నేను వెళ్ళి తన పక్కన కూర్చుని నేను పాఠాలు చెప్పను నువ్వే వెళ్ళి చెప్పు అన్నా. నదురు బెదురు లేకుండా లేచి నేను నుంచునే చోటుకు వెళ్ళి.

"బ్రేక్..." అని చెప్పింది ఆరేళ్ళ పిల్ల పిడుగు.
* * * * * * * *

Friday, September 04, 2009

ఈ వారం సిధ్ద -- బుద్ధ(సాహస యోధుడు )

***

"అయ్య గారూ"
"ఏం సిద్ధా?"

"దేవుడెక్కడున్నాడు?"
"కాంగ్రేస్ పార్టీ లో వున్నాడు కదా?

"మరిప్పుడు వై.ఎస్ ఎక్కడున్నాడు?"
"దేవుడి దగ్గర కెళ్ళిపోయాడు?"

"ఏ దేవుడి దగ్గర కెళ్ళాడు?"
"వరుణ దేవుడు వచ్చి అసలు దేవుడి దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు."

"అదే ఎందుకు అని?"
"సకాలం లో వర్షాలు పడనందుకు ఆందోళన చెందిన దేవుళ్ళు తమ ధైర్యం కోసం మొండి ధైర్యం కల వై.ఎస్. తోడుంటే బావుంటుందని."

***

నీకెలాంటి స్నేహితుడు కావాలని నన్నెవరైనా అంటే "నాకు వై.ఎస్. లాంటి స్నేహితుడు కావాలి" అంటాను.ఓ ఫ్రెండ్షిప్ డే నాడు వై.ఎస్. కు బెస్ట్ ఫ్రెండ్ అవార్డు ఎందుకివ్వాలో సరదాగా రాసినా అదెంత నిజమో ఈనాడు ఆయనను అభిమానించే వాళ్ళ సంఖ్య చూస్తే తెలుస్తోంది.

నిత్య అసమ్మతి నాయకుడైనా, అను నిత్యం తనను నమ్మే వాళ్ళను పేరుతో సహా గుర్తుపెట్టుకోవడం, ఆవేశం తో అసెంబ్లీ లో మైకులు విరగ్గొట్టినా, అవసరమొచ్చినప్పుడు అనుచర గణాన్ని ఆప్యాయంగా ఆదుకోవడం లోనూ ఈ మేరు నగ ధీరుడిని మించిన వారు లేరు. ముఖ్యమంత్రయినా పల్లెటూరి బిడ్డలోని ఆప్యాయతను మరిచిపోని ప్రజా నాయకుడు 'రాజస' శేఖరుడు .కట్టు బానిసల కాంగ్రేస్ లో కట్టి పడేసే కనికట్టు విద్య వున్న అసలు సిసలు నాయకుడు మరిక పుడతాడో లేడో.అచ్చ తెనుగు పంచ కట్టుతో చిద్విలాసంగా నవ్వుతూ చెయ్యి ఊపుతూ సాగే ఆ నడక ఇక కనిపించదంటే జీర్ణించుకోవడం కష్టం. పాద యాత్రతో రాష్ట్రాన్ని సృజించిన ఈ మడమ తిప్పని సాహసి దైవ యాత్ర లోని ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ.

**

Monday, August 31, 2009

మరొక్క సారి... అంటే మూడో సారి.. తెలుగు బడి మన బడి గురించి ..

* * * * * * * *


సిలికానాంధ్ర అని పేరు చెబితే అమెరికాలో కొంత మందే గుర్తుపట్టే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ఏ కూచిపూడో, శాస్త్రీయ సంగీతమో, జాన పద కళో చప్పున గుర్తుకు వస్తుంది అమెరికా తెలుగోడి కైనా, తెలుగు దేశం లో తెలుగు మాట్లాడని వాడికైనా. ఆ సంఘం తెలుగు బాషకు చేసే సేవల్లో మన బడి ఒకటి. మన బడిని పిల్లలకు తెలుగు భాష నేర్పటానికి మొదలు పెట్టారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ మన బళ్ళు ఉత్తర అమెరికా దేశం లోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికి 14 రాష్ట్రాల్లో వేళ్ళూనింది. ఈ సంవత్సరం మరిన్ని రాష్ట్రాలు జత కలుస్తున్నాయ్. ఈ మన బడి ప్రయాణం లో మా కొలరాడో మన బడి కూడా విజయవంతంగా మూడో సంవత్సరం లోకి అడుగుపెడుతోంది. మా మన బడి పిల్లలతో పాటు నేను కూడా 'ప్రవేశం', 'ప్రకాశం' తరగతులు దాటుకొని పరీక్షలు రాయకుండా(దిద్దుకుంటూ)'ప్రమోదం' తరగతి లోకి అడుగు పెడుతున్నా నా మూణ్ణెల బడి సెలవులు ముగించుకొని. వాఁ..బ్యాక్ టూ స్కూల్. మళ్ళీ పలకా బలపాలూ..గోడ కుర్చీలూ..

సంవత్సరం తరగతులు వచ్చే సెప్టెంబరు రెండవ వారం లో మొదలవుతున్నాయి. మీ పిల్లలను ఇందులో చేర్పించాలంటే లేదా వారి ఊళ్ళలో ఈ మనబడి ప్రారంభించాలంటే రాజు చమర్తి గారిని(408-685-7258, raju@siliconandhra.org) లేదా శంకర్ తుములూరు గారిని(650-430-5958 sankar@siliconandhra.org) గానీ సంప్రదించండి.

కొన్ని వివరాలు:

1. చేరాలంటే 2009 సెప్టెంబర్ 1 కి ఆరు సంవత్సరాలు నిండి వుండాలి. (మా బుడ్డోడు కుడి చేత్తో నెత్తి మీదుగా ఎడమ చెవిని పట్టుకుంటాడు అది సరిపోద్దా అంటే కుదరదు.)

2. వారానికి రెండు గంటలు తరగతులు వుంటాయి. (మా బుడ్డది తైతక్కలాడ్డానికి వెళ్తుంది దీన్ని ఎగ్గొడితే మళ్ళీ క్లాసులు చెబుతారా అని అడక్కూడదు. ఎగ్గొడితే మార్కులు కోసేస్తారు.)

3. పిల్లలకు పెన్సిల్ దగ్గర నుండి పుస్తకాల వరకు ఈ సంస్థ వారే ఇస్తారు. (బజ్జి బువ్వ కూడా పెడతారా, పరీక్షలు కూడా మీరే రాసిస్తారా అని డవుట్లు వస్తే మీరు నాలుగణాలు ఆదా చేద్దామనుకునే పదహారణాల తెలుగు వారే.)

4. పాఠాలు భోదించే ఉపాధ్యాయులకు భోధనాంశాలు కూడా ఏ వారానికి ఆ వారం సులభంగా చెప్పేటట్లు వుంటాయి.(ఉపాధ్యాయులు కొన్ని తెలుగు పదాలను ఇంగ్లీషులో తర్జుమా చేసి చెప్పటానికి క్లాసుకు 372 వెంట్రుకలు సులభంగా పీక్కుంటారు)

5. ప్రవేశం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అని నాలుగు సంవత్సరాల తరగతులు వుంటాయి.(హమ్మయ్యా అని అనుకోవడం తల్లి దండ్రుల వంతు.)

6. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తీర్ణతా పత్రాలు ఇవ్వబడతాయి.

ఇది ఉచిత విద్య కాదు. కొద్దో గొప్పో ఫీజులు గట్రాలుంటాయ్. పాఠాలు చెప్పే పంతుళ్ళందరూ వాలంటీర్లే.


* * * * * * * *ఇంతకూ అంత చదివితే ఏమొస్తుందట అంటే.... మొన్న మా బుడ్డోడు తెలుగు లో తన చేతి వ్రాత తో ఓ ఉత్తరం,పంతుళ్ళయిన నానమ్మకు, తాతయ్యకు రాశాడు. వాళ్ళు ఎన్ని సార్లు దాన్ని చదువుకున్నారో ఎంత మందికి చెప్పుకున్నారో కనుక్కుంటే తెలుస్తుంది.

* * * * * * * *

Wednesday, August 19, 2009

ఏ ఫిల్మ్ బై RGV

* * * * * * * *


అనగనగా ........
ఓ చంద్రుడు లేని రాత్రి
అదే కాళ రాత్రి.....
అమావస్య రాత్రి....

చిమ్మ చీకటి రాత్రి
చీమ చిటుక్కు మనే రాత్రి

కటిక చీకటి
చీకటి....
కటి.....

కట్.....

రెండు కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్.అబగా ఆర్తిగా ఆకలిగా..
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తీక్షణంగా చూస్తూ..

ఆ కాళ్ళు వెనక్కి నక్కాయి.
ఏండుటాకుల మీద అడుగుల చప్పుడు.

అలికిడి..
అలజడి..

వెతుకుతున్నది కళ్ళ బడింది.నిగ నిగ లాడుతూ నవ యవ్వనంతో రాజ కుమారి లా తొలి ప్రేమలో కీర్తి రెడ్డిలా గెంతుతోంది.
ఎంతో కాలం నుండి తను వెతుకుతున్నది తన సొంతం కాబోతోంది.

అంతే ఆ రెండు కళ్ళూ పెద్ద రెండు కళ్ళు అయ్యాయి.
పిడికిలి బిగిసింది.

భూన భోంతరాలు దద్దరిల్లిన చప్పుడు
ఆకాశం లో పెళ పెళ ఉరుముల మెరుపుల డప్పుడు

సముద్రం లోనుండి ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు.
దెయ్యం లా మర్రి చెట్టు ఊడ ఊగటాలు.

గుడ్ల గూబలు అరవటాలు
గబ్బిలాలు ఎగరటాలు

ఒక్క సారిగా లంఘించి.
ఒడిసి పట్టుకుని తన కబంధ...

అంతలో....

జూమ్.... మైనస్
కెమెరా క్రమషడ్భుజాకారం లో తిరిగింది.

జూమ్ జూమ్.. మైనస్ మైనస్
ఈ సారి దీర్ఘ చతురస్రాకారం లో తిరిగింది.

జూమ్ జూమ్ జూమ్.. మైనస్ మైనస్ మైనస్
ఈ సారి వృత్తాకారం లో తిరిగింది.

(ప్రేక్షకుల కోసం: తెలుగు మరచిపోయినోళ్ళు ఈ జూమ్‌ జూమ్‌ నే సింహాసనం సినిమా లో 'ఝుం..ఝుం..ఝుం..ఆకాశం లో ఒక తారా..' అనే పాట అనుకుంటారు. ఇది అది కాదు, మైనస్ లు ఉష్ణోగ్రతలు కాదు. కెమెరా జూమ్ చేస్తే దూరం తగ్గే మైనసులు)

ఇక కెమెరా కే కళ్ళు తిరిగి తిరగలేక ఆ "దృశ్యం" మీద ఆగింది.

పెద్ద మెరుపు.
మెరుపుల జన్మలలో అతి పెద్ద మెరుపు.(గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోది)

ఆ మెరుపు తెలుపులో....స్క్రీన్ మీద తెలుగక్షరాలు

ఇదే
అనాదిగా జరుగుతున్న వికృత క్రీడ
మరో సారి మరో చోట

స్క్రీన్ మీద ఎడమ వైపున క్లిక్ క్లిక్...

A   క్లిక్     క్లిక్     F     క్లిక్     I     క్లిక్     L     క్లిక్     M     క్లిక్
మళ్ళీ ఎడమ వైపుకి..ఒక లైనంతా క్లిక్     క్లిక్     క్లిక్.
రెండో లైనంతా క్లిక్     క్లిక్     క్లిక్.
మూడో లైను పై లైనే
చివరి లైను....

పది క్లిక్కుల తరువాత.. B     క్లిక్     Y         క్లిక్     క్లిక్     R     క్లిక్     G     క్లిక్     V     క్లిక్
3 నిముషాలు స్క్రీన్ మీద అదే.

ఇప్పుడు ఫోకస్ ఆ "దృశ్యం" మీద.
అడవి పిల్లి నవ యవ్వనం లో వున్న చుంచెలుకను తన పంజా తో ఒక్క దెబ్బ వేసి ఒడిసి పట్టుకుని లొట్టలేసుకుంటూ ఆరగించడం మొదలు పెట్టింది.

తరువాత ఒకే క్లిక్కు.

మాకు మేమే సమర్పించు
"అడవారణ్యం"
(గొప్ప సస్పెన్స్, యాన్, స్పైన్, థ్రిల్లర్)


(ప్రేక్షకుల కోసం: యాన్ అచ్చు తప్పు కాదు. ఇది యాక్షన్ సినిమా కాదు యానింగ్ సినిమా. ఈ సినిమా చూస్తుంటే అందరూ నోరు వెళ్ళ బెట్టాల్సిందే. ఆవులించేప్పుడు నోరు వెళ్ళబెడతారు కాబట్టి యాన్ అని పెట్టడం జరిగింది. తెలుగు మరియు ప్రపంచ చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి అద్భుత పద ప్రయోగం. తెలివైన వాళ్ళకు స్పైన్ గురించి వివరించక్కర లేదు. ఈ బ్లాగు చదివే వాళ్ళందరి ఐక్యూ 111 వుంటుంది. నా ఐక్యూ 7. అంతా ఏడు కొండల వాడి దయ.)

ఆ అడవి లోని గుబురు పొదల మధ్యలోని ఇసుక మేటల లోపలినుండి పొడవాటి గడ్డం తో చెతిలో వంకర టింకర కర్ర పట్టుకుని ఒక దృఢకాయుడు బయటికొచ్చాడు. ఆకాశం వంక ఓ సారి చూసి రోడ్డు మీద కొచ్చాడు. ఒంటి మీద ఒక్క ఇసుక రేణువు లేదు. మేటలు వేసిన గడ్డం లో కూడా.

నడుస్తున్న అతని పక్కన ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది నిశ్శబ్దంగా. అంత వరకు కునికి పాట్లు పడుతున్న ఎస్సై అందులో నుండి కిందకు దిగి గడ్డం అతన్ని ప్రశ్నించాడు.

"ఎవడ్రా నువ్వు ఈ రాత్రి ఇక్కడెందుకున్నావ్?"
"......" సమాధానము చెప్ప లేదు.

"రేయ్ నిన్నే రా అడిగేది.నీ పేరేంటి? ఊరేంటి? చెప్పు. "
"కడప"

"సార్. మీది కడపా. క్షమించండి సార్ ఎవరో అనుకున్నా. ప్రమోషన్ కోసం చూస్తున్నా నా పొట్ట కొట్టకండి సార్" అని చేతులు జోడించాడు.
దృఢకాయుడు సీరియెస్ గా ఫేసు పెట్టి "మాది కడప కాదు. నా పేరు కడప"

"ఓస్ పేరా? అనవసరంగా భయపడ్డానే. అలా అయితే ఇంత అర్ధ రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావ్. తిరపతోళ్ళు తిరపతని పేరుపెట్టు కోవడం చూశాను గానీ కడప అని పేరు వినలేదే. కడప పేరేంది?"
"నా పేరు కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీన్. ఇంటి పేరు కమాలుద్దీన్. అసలు పేరు డమాలుద్దీన్. నకిలీ పేరు పకాలుద్దీన్. అందరూ నన్ను కడప అని పిలుస్తారు"

"ఇక్కడేం చేస్తున్నావ్?"
"అదిగో అక్కడ ఆకాశం లో చూశావా? అష్ట గ్రహ కూటమి. ఏం జరుగుతుందో తెలుసా?"

"పెద్ద చెప్పొచ్చావ్ లే. ఇక్కడ ఆల్రెడీ మహా కూటమి ఫెయిలయింది. అక్కడ అష్ట గ్రహ కూటమి ఏం చేస్తుంది?"
"ఎందుకు చెయ్యదురా మూర్ఖా? ఆ అష్ట గ్రహ కూటమి అలా ఫామ్‌ అవడం వల్లే ఈ రిసెషనూ, స్వైన్ ఫ్లూ వచ్చింది."

"ఇంకా నయం కాంగ్రేస్ పార్టీ వచ్చింది అన్లేదు. రేయ్! నీకు ఎగస్ట్రాలెక్కువయ్యాయి బండెక్కు."
"నేను బండెక్కనురా! నిన్నే కొండెక్కిస్తా" అని తన చేతిలోని కర్ర లో వుండే కత్తి తీసి ఎస్సై ని రెండు క్షణాల్లో కసా పిసా పొడిచేశాడు.కత్తికంటిన రక్తాని ఎస్సై బట్టలకు తుడిచేసి రొడ్డు మీద నడవసాగాడు "మేరా జూతా హై జపానీ..ఏ పత్లూ ఇంగ్లీస్థానీ..." ఆని పాట పాడుకుంటూ.

తరువాత రాజ్ కపూర్ పాటలు పదకొండు, షమ్మీ కపూర్ పాటలు మూడు, శివాజీ గణేషన్ డబ్బింగ్ పాటలు రెండు, ఎన్టీయార్ పాటలు ఎనిమిది, వై.ఎస్. పాటలు ముప్పై తొమ్మిది పాడుకుంటూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కొచ్చి అక్కడ పోలీస్ గుర్రాన్ని చూశాడు. ఆ పోలీస్ గుర్రం ఆటో లో కూచుని టిఫిన్ బాక్సు లో ఉప్మా తింటున్న తాకమతి ఉప్మా చేతిని నాకుతోంది. అది తెలీని కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీన్ గుర్రం రోడ్డుకు అడ్డుగా వుందని "హట్..హట్.." అన్నాడు. గుర్రానికి కోపం వచ్చింది.

తాకమతి చేతి ఉప్మా
గుర్రం మూతి మీద ఉప్మా

ఉప్మా చెత్తో తాకమతి
ఉప్మాతో గుర్రం మూతి

గుర్రం తోక మీద ఏమిటి చెప్మా
తోకలో ఉప్మా.. కాదు కాదు కోపం. ఆ కోపం ఆ తోక లో లేకపోయుంటే ఈ టపా రాసే అవసరం వుండేది కాదు.

తాకమతి ఉప్మా చేతిలోని కరంటు గుర్రం తోక ద్వారా కడప చెంపని తాకింది అమెరికా నుండి స్వైన్ ఫ్లూ అలిమేలు మంగాపురానికి వచ్చినట్టు.

సరిగ్గా అదే సమయానికి పానీ పూరీలు అమ్ముకునే వాళ్ళ మధ్య పానీ పూరీ పోటీలు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కువ ఎత్తు పానీ పూరీలు పేర్చి, దాన్ని వాళ్ళ తోపుడి బండితో ఎగిరి దూక గలిగితే వాళ్ళే గెలిచినట్లు.

వెండి తెర నల్లగా అయిపోయింది.

(తెర మీద తెలుగక్షరాలు తెలుపు రంగు తెలుగులో. తెలుగక్షరాలు తెలుగులో మరో అద్భుతమైన ప్రయోగం)

కడప ఎస్సైని ఎందుకు చంపాడు. దాని వెనుక వున్న కారణాలేంటి? ఎందుకంత పగ? కడప అసలు పేరు కమాలుద్దీన్ డమాలుద్దీన్ పకాలుద్దీనేనా? అతనికి పునర్జన్మ ఙ్ఞాపకాలేమైనా గుర్తుకు వస్తున్నాయా? తాకమతి నుండి కరంట్ కట్ వున్న సమయం లో కరంట్ ఎలా వచ్చింది? అతను అష్ట వంకర్ దృవ వంశ యోధుడా? అందుకే అతని కర్ర వంకరగా వుందా? తెలుసుకోవాలంటే "అడవారణ్యం - 2" చూడండి.


పాఠకుల కోసం:

ఇది నేను త్వరలో తీయ బోయే సస్పెన్స్, యాన్, స్పైన్, థ్రిల్లర్, క్షుద్దర్, భూతాల్ , ప్రేతాల్, పిశాచాల్, పునర్జన్మల్ టి.వి. సీరియల్ కి సినిమా శాంపిల్. టైటిల్ కి, కంటెంట్ కి సంబంధం లేకుండా అంతా సస్పెన్స్...

RGV అనగా R రాయల్ G గాబ్రియేల్ V విహారి

* * * * * * * *

Monday, August 17, 2009

ఈ వారం సిధ్ద -- బుద్ధ(మగాడు, మగ ధీరుడు)

"అయ్య గారూ...అయ్య గారొ...."
"...."

"అయ్య గారూ...ఎక్కడున్నారు?"
"ఏవిట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు. పొద్దున్నుంచీ కనిపించ లేదు ఎక్కడ చచ్చావ్."

"ష్. గట్టిగా అరవకండి."
"ఏవిటి మగ ధీర సినిమా టికెట్లు గానీ దొరికాయా?.. నెత్తిన ఆ మూటలేంటి?"

"ముందు మీరా తలుపులేసేసి బీరువా దగ్గరకు రండి."
"బీరువా దగ్గరకా? ఏవన్నా లంకె బిందెలు దొరికాయా?"

"లంకె బిందెలు ఎవడిక్కావాలి..ఇవి వాటి కన్నా విలువైనవి. మీరు బీరువా లో వున్న డబ్బు బయటెక్కడన్నా పెట్టి ఈ మూటలు లోపల పెట్టండి."
"ముందా మూటలో ఏముందో చెప్పు. అప్పుడు బీరువా తెరుస్తా."

"అయ్యో .మీకు ఇలా చెబితే అర్థం కాదు. ఎవరన్నా వింటారు కాస్త దగ్గరకు వచ్చి ఆ చెవి ఇలా పడేయండి."
"వార్నీ.. అవా?..ఆ మాట కొంచెం ముందుగా చెప్పొద్దూ..వుండు కిటికీలు కూడా మూసేసి వస్తా. ఇదిగో ఆ బంగారూ,డబ్బూ చావిట్లో పెట్టేసిరా.ఇవి మాత్రం జాగ్రత్త.రేపటి నుండి నువ్వు ఇక్కడే కాపలా పడుకోవాలి. తెలిసిందా?"

"అలాగేనండీ. ష్ ...అమ్మా..అబ్బా.. ఎక్కడెక్కడో వెతికి అంత దూరం నుండి తీసుకుని వచ్చేసరికి భుజాలు పడిపోయాయి. కాస్త మంచి నీళ్ళు ఇస్తారా?"
"మంచి నీళ్ళేం ఖరమ. ఈ రోజంతా నీకు నచ్చిన జ్యూసులు తాగు. ఇప్పుడే తీసుకు వస్తా."

"అవునొరేయ్. ఇవి ఎన్నాళ్ళొస్తాయంటావ్? ..ఇదిగో సపోటా జ్యూస్ తాగు."
"ఇంకో ఆరు నెలలు ఫరవాలేదు మీరు గారెలు, వడలు, మిరప కాయ బజ్జీలు అనకపోతే."

"మిరప కాయ బజ్జీలు తినే భాగ్యం కూడానా? ఆ రోజులే వేరు. అప్పట్లో మిరపకాయ బజ్జీలు ఆపకుండా పది లాగించేసే వాడిని."
"అప్పట్లో వీడియోలు తీసుంటే ఇప్పుడు వాటిని చూసైనా సంతోషించే వాళ్ళు.. ఇప్పుడు ఇలా ధరలు పెరిగిపోవడానికి కారణమెవరు?"

"దేవుడు."
"దేవుడా? ప్రభుత్వం కాదా?"

"మరి పంటలు ఇలా ఎండి పోవడానికి కారణం?"
"దేవుడు."

"అంటే మీరనేది.దేవుడు వై.ఎస్సా?"
"కాదు. అసలు దేవుడే? "

"కాంగ్రేసోళ్ళు.... దేవుడు వాళ్ళ పార్టీలో చేరాడన్నారు కదా? "
"అది తప్పు. కాంగ్రేసే దేవుడి పార్టీలో చేరిపోయింది. అందుకే గెలిచింది.ఇప్పుడు చూడు ఇన్నాళ్ళకు ఊరించి ఊరించి వర్షం పడింది."

"వుండండి మీకు కంది పప్పు పరమాణ్ణం చేసి పెడతా. కంది పప్పు తినక ఇలా అయిపోయారు."

****

"మీరు ఈ మధ్య సాక్షి పత్రిక చూసారా?"
"చూళ్ళేదే! ఏం పేజీలు గానీ తగ్గాయా?"

"రాబడి తగ్గితే గదా పేజీలు తగ్గేది. మొన్న పులివెందుల మీద రివర్స్ గోల్ వేసుకున్నారు.వై ఎస్ మావోడే, జగన్ మా వోడే అని అన్ని చోట్లా రేట్లు పెంచేసుకుంటున్నారట."
"రాజా వారు, యువ రాజా వారు ఏదో పెద్ద ప్లాన్ లో వుండి వుంటారు. అయినా అమెరికన్ సిస్టం లాగా డబ్బున్న పులి వెందుల రాజులందరూ మనీ సర్క్యులేషన్ చేసుకుంటుంటే జనాలకు బాధేందుకో. "

"అది సామాన్య ప్రజానీకానికానికి ఇబ్బంది కాదా? ప్రభుత్యం ధరలు నియంత్రించాలి కదా."
"ప్రభుత్వం నియంత్రించాల్సినవి నియంత్రిస్తుంది."

"ఏంటి డబ్బులు పోనాయి మేమేటి సేత్తాం అన్న మంత్రి గారు తన జిల్లా లో మగధీర సినిమాను నిలిపేసినట్టా?"
"మరి! ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అంటారా? అయిదేళ్ళు అనుభవమయిన తరువాత ఇంకా అలా మాట్లాడ్డానికి ఎంత ధైర్యం.అది సాంపిల్ మాత్రమే.ఎక్కువ మాట్లాడితే స్టేటంతా నిలిపేస్తారు."

"అంత లేదు లెండి. పవన్‌ కళ్యాణ్ తో సినిమా తీయడానికి అలా డ్రామా లాడారు. "
"అందులో విలన్‌ రోల్ ఎవరు చేస్తున్నారు."

"నాకేటి తెలుస్తాది.. సినేమా వచ్చినప్పుడు గానీ తెల్వదు."

****

"అయ్యగారు, చారిత్రాత్మక తప్పిదం అంటే ఏంటి?"
"చిరంజీవి రాజకీయల్లోకి రాకపోయుంటే చారిత్రాత్మక తప్పిదం. దేవేందర్ గౌడ్ తెలుగు దేశాన్ని వదిలి రావడం చారిత్రాత్మక తప్పిదం. కమ్యూనిస్టులు ప్రధాని పదవిని వద్దనటం చారిత్రాత్మక తప్పిదం.ఎల్టీటిఈ రాజీవ్ ను చంపడం చారిత్రాత్మక తప్పిదం."

"చాలు ఇంకొద్దు.అయితే పవన్ కళ్యాణ్ చాలా తెలివైనోడు. "
"అదెలా?"

"ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సొస్తుందని తెలుసేమో. ప్రజా రాజ్యానికి 160 రాకపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్తా నన్నాడు ఎలక్షన్లప్పుడే."
"నాగ బాబు ఇంకా తెలివైనోడు. స్టేట్మెంట్ లేకుండానే గుడ్ బై చెప్పాడు."

"తెలివైన మగాళ్ళు అలానే చేస్తారు."
"తెలివైనోళ్ళు అనొచ్చు గదా అలా మగాళ్ళు అని లింకు పెట్టడం దేనికి."

"ఏవిటో ఒక్క మగాడు సినిమా చూసి ఆ మాట మర్చిపోయినా మన నాయకుల మాటలు చూసి అది తప్పకుండా వాడాల్సిన పదమేమో అని వాడుతున్నా."
"అంత మగ మాటలు మాట్లాడు తున్నదెవరు?"

"ఇంకెవరు రోశయ్య గారు, నన్నపనేని గారు. రోశయ్య గారు 'ముద్దు' ని మగాడివా అన్నారు. నన్నపనేని గారేమో దగ్గుపాటి గారినన్నారు."
"నువ్వు పెద్ద మగాడివి రా."

"నామీదేవో బాణాలు వేస్తున్నట్టున్నారు. "
"నీ మీద బాణాలెయడానికి నేనేమన్నా వైఎస్సా, నువ్వేమన్నా చంద్ర బాబా?రాఖీ పౌర్ణమి రోజున వై.ఎస్. కు రాఖీ కట్టిన వాళ్ళెవరో తెలుసా?"

"ఇంకెవరు చేవెళ్ళ చెల్లెమ్మ సబితమ్మే కదా?"
"ఒక్కరేనా?"

"ఇంకా కొండా సురేఖ, గీతా రెడ్డి కట్టినట్లు వున్నారు."
"వచ్చే రాఖీ పౌర్ణమి కి ఈ లిస్టులో చేరే కొత్త చెల్లెమ్మెవరో చెప్పుకో చూద్దాం? తెలిసీ చెప్పక పోతే నిన్ను అమెరికన్‌ ఏయిర్ లైన్స్ లో అమెరికా పంపిస్తా."

"అంత పని చెయ్యకండి. ఆ టార్చర్ భరించలేను. రాబోయే కాలం లో కాబోయే కొత్త చెల్లెమ్మ మెదక్ మెరుపులమ్మ రాములమ్మ."
"కరక్టుగా చెప్పావు. నువ్వు తెలివైన మగాడివిరా "

"అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్నేస్తా దానికి సమాధానం చెప్పండి చాలు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల సమయానికి ఎంత మంది ప్రజా రాజ్యం పార్టీ లో మిగులుతారు. "
"..."

"సమాధానం చెప్పమంటే అలా బెంచీ మీద లేచి నిలబడి చేతులు పైకెత్తారేంటి. "
"సింబాలిక్ రా మట్టి వెధవా.వెళ్ళి పది అరవ సినిమాలు చూసిరా."

"మీరు గొప్ప మగాడు. అయితే ఆపరేషన్‌ ఆకర్ష్ అంత స్ట్రాంగంటారు. "
"పాపం ప్ర.రా.పా. కి ఎలక్షన్ల ముందున్న ఆకర్ష్ ఇప్పుడు వికర్ష్ అయిపోయింది."

***

"అయ్య గారూ మగధీర చూశారా?"
"అంతగా హైపిన తరువాతా చూడక చస్తామా?"

"అరుంధతి చూశారా?"
"చూసి తరించాం"

"ఈ సినిమాలు చూస్తుంటే మీకు ఎవరు గుర్తొచ్చారు?"
"అరుంధతి చూస్తుంటే శ్యాం ప్రసాద్ రెడ్డి, కోడి రామ కృష్ణ గుర్తొచ్చారు. మగ ధీర చూస్తుంటే రాజ మౌళి గుర్తొచ్చాడు.

"ఈ రెండిట్లో వున్న తేడా ఏంటి?"
"తేడాలేమీ లేవు రెండూ ఒకటే?"

"అదెలా?"
"అరుంధతి లో పిల్ల హీరోయిన్ కోనేట్లో మునిగి లేచిన తరువాత యాక్షన్ మరిచిపోతుంది. ఇందులో హీరో లోయలో పడి పోయిన తరువాత యాక్షన్ మరిచిపోతాడు."

"???"
"నేను కూడా ఆరు ??? ???"

--

Tuesday, February 03, 2009

నా ఆరు పెట్టెలు

* * * * * * * *


ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే రోజు ఏదో ఒకటి వుంటుంది. అదే జీవితాన్ని, కుదరకపోతే శరీరాన్ని మలుపులు తిప్పుతుంది. అమెరికా వచ్చినప్పుడు తెచ్చింది రెండు పెట్టెలు. ఇప్పటికీ ఆ రెండు పెట్టెలను నా "రెండు పెట్టెలు" అని అప్పుడప్పుడూ బయటకి తీసి ఊడిపోయిన నట్లు బిగించి, సంక్రాంతి అప్పుడు ఎద్దు కొమ్ములకు రంగులేసినట్టు రంగులేసి ఆరబెట్టి మళ్ళీ ప్లాస్టిక్ సంచుల్లో దూర్చేస్తా. అలా నా రెండు పెట్టెలు కాస్త నా ఆరు పెట్టెలు అనే 'ఓ రోజు' వస్తుందని అనుకోలేదు. అలా 'ఓ రోజు' రావడానికి స్పూర్తి నిచ్చిన చాలా 'ఓ రోజ'లు లో ఒక రోజు.

ప్రపంచమంతా(అమెరికా లో తెలుగోళ్ళు) ఒబామాలో చిరంజీవిని చూసుకుంటున్న రోజులవి. అంధ్రాలో(అమెరికా వెళ్ళాలనుకుంటున్న తెలుగోళ్ళు) అంతా చిరంజీవిలో ఒబామాను చూసుకుంటున్న రోజులు.
వేస్తే ....

ఏడున్నర కోట్ల తెలుగు జీ(వచ్చ)వాలకు ఇంకోటి కలిపి తలకు హెల్మెట్ లేకుండా జెమినీ "జాణవులే నెరజాణవులే" చూస్తున్నా. టి.వి చూడకుండా అన్నమన్నా తినాలి లేదా అన్నం తినకుండా టి.వి. అన్నా చూడాలి. టి.వి. చూస్తూ ప్లేటు వైపు చూడకుండా అన్నాన్ని ముక్కు మీదకు, మీసాలమీదకు ట్రాన్‌స్ఫర్ అవకుండా నేరుగా నోట్లో లోడ్ చేసే కళను జెమిని సీరియల్స్ చూసే నేర్చుకున్నా. మా ఆవిడ చేసిన చింతాకు పులగూర తింటూ "నువ్వు చేసిన చింత చిగురు కొంచెం ముదురోయ్ " అన్నానో లేదో తెర మీద దేశ ముదురు అడ్వర్టైజ్మెంట్.

అల్లు అర్జున్ చాలా బీదబ్బాయి.

పాపం..ఒంటి మీద చొక్కా లేదు. పాంటు కూడా శ్రీ420 లో రాజ్ కపూర్ వాడిన పాంటు.

తలకు తైలం లేదు.

రాసుకోవాల్సిన నూనె వొంటికి రాసుకొని వాతమొచ్చినోడిలా తల అటు వైపెక్కడో పెట్టాడు. కెమరా రెండు మూడు సార్లు పొట్టలోకి, జబ్బల్లోకి వెళ్ళొచ్చిన తరువాత అర్థమయింది రెండు సార్లు మిస్టర్ యూనివర్స్ అయిన ప్రేమ్‌ చంద్ డోగ్రా లా తయారయ్యాడని.

అది చూసి పెద్ద బుడ్డోడు "నాన్నా! పాపం అంకుల్ కి నూనె రాసుకోడానికి చేతులు అందక ఒంటికి రాసుకున్నట్టున్నాడు. బాడీ అంతా బంక మన్ను పూసిన మర్రి చెట్టయిపోయింది..యాక్ " అన్నాడు.
"చా. అది కాదురా ఒళ్ళు అలా పురులు తిరిగితే పురుల వీరుడు అని పిలుస్తారు.వాటిని చూపిస్తే కురులున్న సొగసరి అమ్మాయిలు కళ్ళు తిరిగి వెంట పడతారు. దాన్నే ఆరు పెట్టెలు అంటారు. నువ్వు బాగా తింటే అలా ఒళ్ళు పెంచొచ్చు. అప్పుడు 'హీ బాయ్' అని అందరూ నీ చుట్టూ తిరుగుతారు. గాబ్రియేలాకి నువ్వు చాక్లెట్ ఇస్తే డేవిడ్ గాడికి హ్యాప్పీ వాలెంటైన్‌ డే చెప్పింది కదా. అలా కాకుండా డేవిడ్ గాడు చాక్ లెట్ ఇస్తే తెచ్చి నీకు ఇస్తుంది." అన్నా.

వాడు కళ్ళు స్కైల్యాబంత చేసుకోని "అలా అవాలంటే ఏమేమి తినాలి?"
"గుమ్మడి కాయలు, కాకరకాయలు, వేప కాయలు, కుంకుడు కాయలు,శీకాయలు ...."

"సరే. తింటా కానీ అన్ని కూరగాయలు కొంటానికి నీ దగ్గర డబ్బుల్లేవన్నావ్ కదా.అన్ని కొనాలంటే రాత్రిళ్ళు మెక్ డోనాల్డ్స్ లో పనిచెయ్యాలన్నావు కదా. తాత ఇచ్చిన డబ్బుల్తో ఇవన్నీ కొని నువ్వెప్పుడైనా ఈ ఆరు పెట్టెలు తయారు చేశావా?" అన్నాడు.

అప్పుడే ఉదయభాను "జాణవులే నెరజాణవులే" అనగానే గొంతునొక్కేసా.

ఫ్ల్యాషు బ్యాకులో కెళ్ళి పోదామని గొంతు సవరించుకున్నా.

మా ఆవిడ."అయ్యో నేను బట్టలు మడత పెట్టడం మరిచి పోయా. మిద్దె పైకెళ్ళి అక్కడే టి.వి. చూస్తూ మడత పెట్టుకుంటా" అని వెళ్ళి పోయింది.

చిన్న బుడ్డోడు చాలా 'ఖండ' ముదురు. "అమ్మోయ్! నేనూ పైకొత్తా...బత్తలు మలత బెత్తా.." అని మెట్లు ఎక్కకుండా ఎగిరి వెళ్ళి పోయాడు.

మిద్దె పైన:

"ఎందుకురా వచ్చేశావు.నాన్న ఏదో చెబుతున్నాడుగా"
"అమ్మో నా వల్ల కాదే!. నా బుజ్జి సళీళాన్ని నాన ఫ్ల్యాషు 'బాకుల్తో' చంపేత్తాలు"

"మా నాయినే నీకు రెండేళ్ళకే ఇన్ని తెలివి తేటలు వచ్చేశాయిరా.నాకు చూడు ఇన్నేళ్ళొచ్చినా బల్బు వెలగదు."

మిద్దె కింద:

అడిగిన పెద్ద బుడ్డోడిని వళ్ళోకి తీసుకుని.

"నన్ను కాలేజీ రోజుల్లో సిల్వస్టర్ స్టాలిన్ అనే వాళ్ళు నాకున్న ఆరు పెట్టెలు చూసి."
"అవును, నువ్వు అప్పుడు రోజూ లీటరు పచ్చి పాలు తాగి, రెండు గుడ్లు తిని తిఫిన్ చేసే వాడివి."

"అరే భలే కనిపెట్టేశావే నీకు భలే జ్ఞాపక శక్తి వుందే.."
"అవును మరీ! నేను అమ్మ బొజ్జలో వున్నప్పుడు కూడా ఈ కథలే చెప్పేవాడివి..పాపం అమ్మ..."

"పాపం అమ్మ కాదు. అలా కండలు పెంచక పోవడం పాపం. నువ్వు సిల్వెస్టర్ స్టాలిన్ సినిమాలు చూశావు కదా"
"ఎవరు?"

"అదే రా. ర్యాంబో, ఫస్ట్ బ్లడ్ సినిమాలు."
"నేను చూళ్ళేదు."

"మొన్న టి.వి. లో వచ్చింది కదా టాంగో అండ్ క్యాష్ అందులో వున్నాడు కదా'
"ఓ దట్ ఓల్డ్ మ్యాన్?"

ఓల్డ్ మ్యాన్?.... పీకేసిన ఫ్యూజులకు కొత్త రాగి వైరు తిరిగి పెట్టి.

"ఇప్పుడు ఓల్డు కానీ అప్పుడు చాలా యంగ్ రా. ఆ బాణాలు..అవీ.. భుజమ్మీద పెట్టుకొని..నన్‌ చాకు గాల్లో తిప్పుతుంటే...నా సామి రంగా.."
"నాన్నా నువ్వు అలా నన్‌చాకు తో ఎవరినన్నా కొట్టావా?

"ఆ కొట్టాను?
"ఏమైంది."

"పగిలింది"
"అంటే అశోక్ సినిమాలో ఎన్టీఆర్ కొట్టినట్లు ఎవరి నెత్తి మీద నైనా కొట్టి బద్దలు చేశావా?"

"బద్దలైంది బుర్ర కాదు. నూనె సీసా. రూములో పెరుగు కోసం పెట్టుకున్న పాలు ఓ పిల్లొచ్చి తాగేస్తుండేది. ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి పోయింది. దాని సంగతి చాడాలని నన్ చాక్ దానిమీద ప్రయోగించా. అది దానికి తగలకుండా నూనె సీసా కి తగిలి పగిలింది. మూడు స్పూన్ల నూనె వేస్టవడానికి నేనే కారణమని నా చేత మూడు లీటర్ల నూనె కొనిపించారు.నా రూమ్మేట్ దొంగ నాయాళ్ళు."
"బాగా శాస్తి జరిగింది. నేను ఎక్స్ బాక్సడిగితే నింటెండో కొనిస్తావా?..."

"సిక్సు ప్యాక్ గురించి మాట్లాడుతుంటే ఎక్సు బాక్సంటావేంది రా.."
"అల్పుడెపుడు బలుకు నాడంబరముగాను పద్యం మొన్న క్లాసులో చెప్పావు గదా అది నేర్చుకోవాలి.నే వెళతా.."

ఛా... ఇంతున్న ఈ బుడ్డోడే సెటైరెయ్యడం మొదలు పెట్టాడు. ఇక తప్పదు సమయం వచ్చేసింది...వచ్చేసింది..

అప్పుడే ఎవరూ ఊహించనిది జరిగిపోయింది.

ప్రపంచంలోని యురేనియం...థోరియం...ప్లూటోనియం...ఇండాలియం అన్నీ ఒక్క చోట కలిశాయి........
ఎలక్ట్రాన్లు...న్యూట్రాన్లు...ప్రోటాన్లు...పవన్‌ కళ్యాన్లు...అన్నీ ఒక్క సారిగా ఒక దానికొకదానికి గుద్దుకున్నాయి.
ఆల్ఫా రేస్...బీటా రేస్...గామా రేస్...ఒబామా రేస్...అన్నీ ఒక్కసారిగా ఉద్భవించాయి.............

అంతా గాఢాంధకారం.....అంత లో ఓ చిన్న వెలుగు. ఆ వెలుగు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళి పోయింది.
మళ్ళీ అంధకారం........అక్కడ ఎవరెడే బ్యాటరీ లైటేస్తే...

రేలంగి ముందు మాట తో మొదలై రమణా రెడ్డి రాసిన "కండలు పెంచడం ఎలా?" అన్న పుస్తకం చదువుతూ నేను.
పక్కన ఇంకా "బండ లాంటి కండలేలా పెంచాలి","పురులు తిరిగే కండల కోసం", "దేహ దారుఢ్య వడ్డన", "కండ కండ మధ్య గుండె", "బై బై బక్క బర్రెలు..", " సిరులొలికించే పురులకోసం" లాంటి పుస్తకాలెన్నో....

* * * * * * * *


భారతీయుడన్న వాడెవడైనా సరే కండలు పెంచాలంటే ముందు వాడాల్సింది జీవన్ టోన్. భారతీయురాలెవ్వరైనా సరే అందంగా కనపడాలి అంటే లక్సు సోపు వాడాల్సిందే. జీవన్ టోన్ గుర్తుకు రాకపోతే వాడు మొగాడే కాదు. గుర్తుకు రావడం ఆలస్యం ఈ ఎకానమీలో మంచి డిస్కౌంటుకు నూరు డబ్బాలు కొనేసి నా మనవళ్ళకు కూడా కొని దాచి పెడదామని నంబరు సంపాదించి వాళ్ళకు ఫోన్ చేశా.

"హలో జీవన్ టోన్ ఆఫీసా?"
"అవున్రా...చెప్పు ఏం కావాలి"

చా.. ఇంత బతుకు బతికి వీడెవడో సన్నాసి గాడి దగ్గిర మాటలనిపించుకోవాలా. బాగా కండలు పెంచిన తరువాత వీడి దగ్గరి కెళ్ళి వుతికి పారెయ్యాలి అని నిర్ణయించుకొని ఫోను పెట్టేశా. భారత్ లో ఆడవాళ్ళకు కాస్తో కూస్తో విలువిస్తూ గిఫ్టులు కూడా కొనిపెడితున్నారు గదా ఎలాగైనా గొంతు మార్చి మాట్లాడదాం అని అద్దం ముందుకెళ్ళి నిలుచున్నా. ఏది చేసినా నిష్టగా ఇన్వాల్వ్ అయి చెయ్యమని మా బాస్ బురఖేష్ చెప్పాడు. ఆందుకనే అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకొని బుగ్గల మీద నొక్కుని జగదేవక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి లా కాళ్ళు మిటకరిస్తూ "మానవా...వామ హస్తాన్నీయవా.." అనే డైలాగు భారీగా ప్రాక్టీసు చేసి కాన్ఫిడెన్సు వచ్చాకా ఫోను తీసుకుని మళ్ళీ జీవన్ టోన్ ఆఫీసుకు ఫోను చేశా.

"మానవా... " నాలుక్కరుచుకుని. కాలి బొటన వేలితో గుండ్రాలు వేస్తూ శ్రావ్యంగా .."హలో..జీవన్ టోన్ ఆఫీసాండీ.."
"అవునుమ్మె... సోది లేకుందా విషయం చెప్పుమ్మే.."

హా.. హృదయ కవాటాన్ని తెరిచి సిరల్ల్లో ఎక్కడో దూది మొనతో సుర సుర పొడిచినట్లయింది.(దూది మొనే అచ్చు తప్పు కాదు). ఒకానొక జనవరి ఒకటిన స్వర్ణ ముఖి నది నీళ్ళలో ఉత్కంఠగా జరుగుతున్న 'ఆల్ ఆంధ్రా పెంకుల బంపుల చాంపియన్‌' పోటీలో ఎక్కువ బంపులు వీరుడిగా అవార్డు వచ్చే టైములో నా కాన్‌సంట్రేషన్‌ దెబ్బతియ్యటానికి న్యూట్రిన్ చాకలెట్ చేతిలో పెట్టి న్యూ ఇయర్ విషస్ బదులు 'ఐ లవ్ యూ' అని లటాషా చెప్పినప్పుడు కూడా బాధపడలేదు. (మా ఆవిడ చూస్తుందేమోనని లటాషా అని పేరు మార్చడమైనది. అసలు పేరు నీరోషా. ఇంకో విషయం. అందమైన ఆడవాళ్ళు బ్రాకట్లలలో వున్నది చదవరు. ఏవరైనా చదివేసి అందమైన వాళ్ళు కాదని ఫీలయితే నాది బాధ్యత కాదు). సరే గుండెను టెర్రరిస్టు చేసుకొని మళ్ళీ డయల్ చేసి ఇంగ్లీషులో అమెరికను యాక్సెంట్ లో మాట్లాడా.

"హె...వాస్సప్..డ్యూడ్.. ఈజ్ దిస్ జీవ టో..?"
"ఒరేయ్ విహారిగా ఫోను పెట్టరా. ముందు కాలర్ ఐడీలో పేరు రాకుండా ఎలా చెయ్యలో తెలుకోరా"

గుడ్ల నుండి ఉబికి వస్తున్న నీళ్ళను గ్లాసులో పోసుకొని ఎర్ర మార్కర్ తీసుకొని గ్లాసు మీద 'ఆనంద భాష్పాలు' అని రాశా. అయిపోయింది అంతా అయిపోయింది అమెరికా ఫుట్ బాల్ ఆట రాకపోయినా అమెరికన్ తెలివితేటలొచ్చేశాయి. ఇక సిటిజెన్‌షిప్ తీసుకోవాల్సిన తరుణమిదే.

లిస్టులో నుండి జీవన్‌ టోన్ పేరు కొట్టేసి తరువాతి నంబరుకు ఫోను చేశా మామూలుగానే.

"హలో డాబర్ వారి చ్యవన్ ప్రాశాండి?"
"అవునండీ షుబోదయం షుష్వాగతం... మీక్ ఏం కావాలి"

"మాకు ఉదయమని మీకెలా తె్లుసు?"
"మాద్ నడుము సమయం. మీద్ కొండ సమయం. అదే మాద్ సెంట్రల్ టై జోన్."

"నేను ఫోను చేసింది ఇండియాకు కదా. అక్కడ నడుము సమయం అదే సెంట్రల్ టై జోన్ ఎక్కడుంది?.ఇప్పుడు ఉదర సమయం, పాద సమయం అని టైమ్‌ జోన్లు పెట్టేరా?"
"ఓహ్ మీర్ వార్తల్ సరిగ్గా సదువుతున్నటు లేదు. ఇప్పుడు ఇండియెన్‌ ప్రాడక్టు కస్టమర్ సపోర్టు, సేల్స్ అణ్ణీ అమెరికా నుండే. ఇక్కడే చీప్ గా దొరుకుతున్నారు."

"అంటే.."
"ఇన్ సోర్సింగ్"

"మీకు జీతం కింద డబ్బులు బాగా వస్తున్నాయన్న మాట."
"నెలకు ముప్పై బాక్సులు చ్యవన్‌ ప్రాశ ఇస్తారు..వాటిని ఇక్కడ అమెరికాలో మీలాంటోళ్ళకు బ్లాక్ లో అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నాం"

"అయితే చ్వవన్‌ ప్రాశ్ నాకొద్దు."
"సార్..సార్.."

ఫోన్ పెట్టేశా.

లిస్టులో మూడో పేరు వీకో వజ్ర దేహ కు ఫోను చెయ్యకుండానే పేరు కొట్టేశా ఎలాగైనా ప్రకృతి వైద్యం తో సొంతంగానే కండలు పెంచాలని నిర్ణయానికొచ్చి కళ్ళు మూసుకున్నా. మూడు 'సుత్తి'లు గాల్లో ఎగురుకుంటూ వచ్చి నా బుర్రకాయ్ మీద మూడు దెబ్బలు వేసాయి. మూడు పేర్లు గుర్తుకు వచ్చాయి. మొదటి దెబ్బకు మంతెన సత్యనారాయణ రాజు గుర్తుకొచ్చాడు. రెండో దెబ్బ.. మూడో దెబ్బ.. మొదటి దానికి డూప్ లు.

* * * * * * * *


వున్నట్టుండి సత్యనారాయణ రాజు గారి పుస్తకాలు, వీడియోలు దొరకవు కదా. అందుకనే సతీమణి నడిగా "నేను కాలేజీలో వున్నప్పటి లాగా ఆరు పెట్టెలు పెంచాలనుకుంటున్నాను. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ల లాగా స్టెరాయిడ్లు వాడకుండా ప్రకృతి వైద్యం తో పెంచాలనుకుంటున్నా. దానికి నీ సహకారం కావాలి" అని అడిగా.
"దానికేం భాగ్యం తప్పకుండా" అని టి.వి. రీమోట్ చేతికిచ్చి "నా సహకారాన్నందిచేశా. ఇక నన్నేమీ అడక్కండి."

"అలాగంటే ఎలా చెప్పు.?"
"అదే మరి ఒళ్ళు మండుద్ది. రీమోట్ ఇచ్చింది డి.వి.ఆర్.(డిజిటల్ వీడియో రికార్డర్) లో రికార్డయిన మంతెన సత్యనారాయణ 'మీ ఆరోగ్యం మీ చేతిలో' ప్రోగ్రాం చూసుకోమని"

తప్పు లెప్పుడైనా చెయ్యొచ్చు. సతీమణి దగ్గర, ప్రియురాలి దగ్గర చెయ్యకూడదు. చేసినా చేసినట్టు కనిపించకూడదు. లేకపోతే ఋతురాగాలు ముదిరి రాధ మధు అయినట్టు విషయం చాలా దూరం పోతుంది. ఇది మా బాస్ బురఖేష్ చెప్పిన ఫిలాసఫీ.

"థ్యాంక్యూ సో మచ్. యువ్ ఆర్ సో ఆసం" అని చెప్పా. ఏదన్నా అర్థం కాకపోతే 'ఆసం' అనే పదాన్ని ఎప్పుడన్నా వాడచ్చు. పేకాటలో జోకర్ లాంటి ఈ పదం ఎప్పుడూ మరిచి పోకూడదని మా బాస్..(ఇప్పటికే మా బాస్ పేరు అర్థమయిపోయుండాలి..)చెప్పాడు.

ఇలాంటి మరి కొన్ని పదాలు...మారెప్ప, ఒక్క మగాడు.

* * * * * * * *


రెండు రోజులు ఆఫీసుకు లీవు పెట్టి తలుపుకు గడియ పెట్టి పక్కన పెన్నూ పేపరూ పెట్టుకొని మంతెన సత్యనారాయణ వీడియోలన్నీ చూసేసి ముఖ్యమైన పాయింట్లన్నీ పేపర్ లో నోట్ చేసుకోని తెలుగోళ్ళు పెట్టిన ఇండియన్‌ స్టోర్సు కెళ్ళి లిస్టు చూపించి అవున్నాయేమో చెప్పమని అడిగా. అది చూసిన ఆయన బాత్రూములో కెళ్ళాడు.ఏదో సౌండొస్తోంది కానీ ఏమీ వినపడలేదు. అయిదు నిమిషాల తరువాత బయటకు వచ్చాడు.

తరువాత లిస్టు చూసి "మా దగ్గర లేవు సార్" అన్నాడు. ఈ సారి రెండో లిస్టు చూపించా.. దాన్ని పట్టుకోని మళ్ళీ బాత్రూములో కెళ్ళి పోయాడు. డౌటొచ్చి దగ్గర కెళ్ళా. తలుపులేసుకొని తనలో తనే నవ్వుకుంటున్నాడు. కాసేపటికి బయటికొచ్చాడు. నేను పరుగెత్తుకొని కౌంటర్ దగ్గరరకెళ్ళా.

"ఈ లిస్టులోవి ఇక్కడ దొరకవు సార్."
"సరే ఈ లిస్టు చూడండి.."

అది కూడా పట్టుకొని పరిగెత్తుకుంటూ బాత్రూములో కెళ్ళి పోయాడు. ఇదేదో వ్యవహారం చూద్దామని బాత్రూమ్‌ కిటికీ దగ్గరకెళ్ళి లోపలకు చూశా..

నేనిచ్చిన లిస్టు చూసి "వార్నీ వీడికెవరిచ్చారా వీసా?.. గుల్ మొహర్ బెరడు..హా..హ్హ ..బోగన్‌ విల్లియా కాండము.....అబ్బో..అబ్బో.. " అని కింద పడి దొర్లుతున్నాడు.."వేప గింజల గుజ్జు.. వెలక్కాయ వెలుపలి పొట్టు...బ్లాక్ అండ్ వైట్ పచ్చి గడ్డి...." అని పొట్ట పట్టుకొని నొప్పి తగ్గాక బయటికి వచ్చాడు.

"ఇవి కూడా మా దగ్గర లేవు సార్.." అని కస్టమర్ ఎక్కడ రాకుండా పోతాడో అని బయటకు నవ్వకుండా నవ్వును ఆపుతున్నాడు.
అప్పటికప్పుడు స్టెరాయిడ్సు తీసుకొని కండలు పెంచి గాడ్జిల్లా కారు ని తిప్పినట్లు వాడిని గాల్లో గిర గిరా తిప్పి బయటకు విసిరి వేయాలనిపించింది.

ఇంకో లిస్టు ఇచ్చి "ఇవున్నాయమో చూడండి"
లిస్టు చూడకుండా బాత్రూమ్‌ వైపు వెళ్ళబోతుంటే కాలర్ పట్టుకొని ఆపి. "దీనికి బాత్రూములో కెళ్ళక్కర లేదు.ఇది మా ఆవిడిచ్చింది."

అప్పుడు లిస్టు చూసి "ఓహ్.. అప్పడాలు, బిర్యానీ మషాలాలా?..ఇదిగో ఇక్కడున్నాయి." చూపించాడు.
అన్నీ తీసుకోని డబ్బు కట్టేసి రాబోతుంటే..

"సార్.. మీరు మొదటిచ్చిన మూడు లిస్టులు ఎక్కడినుండి తెచ్చారో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది సార్. కాస్త చెబుతారా?"
"మీకు మా టి.వి. వస్తుందా?"

"లేదు సార్."
" అయితే ఈ లింకుకెళ్ళి డిష్షు పెట్టుకోని మా టి.వి. తీసుకో...వస్తా.."

ఈ మంతెన తో పెట్టుకుంటే మన వంతెన విరిగి పోతుందని ఆ లిస్టు అక్కడే చించేసి రెడీమేడ్ గా ఏవన్నా దొరుకుతాయేమో కనుక్కుందామని అమీర్ ఖాన్‌ కి ఫోను చేశా..

"హలో అమీర్ ఖానా?"
"నో గజిని.."

"యా..ఐ నో గజిని. అమీర్ ఖాన్‌ హైనా?"
".. నామ్‌ గజిని."

"రామ్‌ నామ్‌ సత్య్ హై...అమీర్ ఖాన్‌ హే..?"
"హమ్‌ గజని హై.."

"నయ్ ..రామ్‌ నామ్‌ సత్య్ హై.."
"గజని హై.."

"ఓకే.... ఆప్కో బ్లాగ్ హే.."
"హై.. షారూఖ్ ఖాన్‌ కుత్తే బీ హై.."

"అమీర్ ఖాన్‌ హై..?"
"నో గజిని.."

"యువ్ గజని. ఐ యాం రజని. ఏక్ బార్ బోల్ తో సౌ బార్ బోల్ నట్లే. కీప్ ద ఫోన్‌ డౌన్‌ " అని వేలును గాల్లో పెట్టి నేను గిర గిర తిరిగా. ఫోను కింద పడి పగిలింది.మా ఆవిడకు తెలియకుండా కొత్త ఫోను తీసుకొచ్చి పెట్టేశా.

అన్ని తీరాలను దరిచేర్చే గూగులమ్మ కు మొర పెట్టుకుంటే బాడీబిల్డింగ్ డాట్ కామ్‌ లింకిచ్చింది. అక్కడికెళ్ళి కండరాల శక్తికి మూడు బాక్సులు, నరాల శక్తి మూడు బాక్సులు, గోళ్ళ శక్తికి 11 బాక్సులు, వెంట్రుకల శక్తికి 147 బాక్సులు ఆర్డర్ చేశా. అన్ని పెట్టెల తో పాటు సాక్షి న్యూస్ పేపర్ పరిచినంత వైశాల్యంతో ఒక పెద్ద పుస్తకం కూడా వచ్చింది. అందులోని ఫోటోలలో సొట్టలున్న ప్రతి బాడీ బిల్డర్ మీద చేతులేసుకొని సొట్టలు పోతూ ఒక అందమైన అమ్మాయి వుంది. ఆ బొమ్మ కింద చిన్న అక్షరాలతో : పెళ్ళి కాని వారికి మాత్రమే. పెళ్ళయిన వాళ్ళకు దీని ప్రతులు పంపబడవు. వారికి ఒక వేళ అలా వచ్చినట్లతే వెనక్కి తిరిగి పంపండి అని. నేను తిరిగి పంపలేదు.

ఆ పుస్తకం లో వాళ్ళు పంపిన మందులతో పాటు వాళ్ళు చెప్పినట్లు శరీర వ్యాయామం చెయ్యాలిట. లేక పోతే మందులు పనిచెయ్యవు అని చెప్పారు. సరే అని రెక్ సెంటర్ కు(జిమ్ము) వెళ్ళాలని తీర్మానించా.

రెక్ సెంటర్ అంటే రిక్రియేషన్ సెంటర్. దీన్లో ఈత కొట్టుకోవడం, వాత పెట్టుకోడం, కాళ్ళు విరగ్గొట్టుకోడం (టెన్నిస్ ఆడి)లాంటి సదుపాయాలన్నీ వుంటాయి. కాక పోతే కొన్ని ఫీజులు కూడా వుంటాయి. ఇల్లు కొన్నప్పుడు బడితె పూజ అయిపోయిందనుకుంటే నెలకో సారి గోడ కుర్చీ వేయించే పనిష్మెంట్లే ఈ రెక్ సెంటర్ ఫీజులు. ఇక్కడికి వెళ్ళినా వెళ్ళక పోయినా నెలకు యభయ్యో వందో చదివించుకోవాలి.

* * * * * * * *


జిమ్ము కెళ్ళాలంటే కొన్ని గెటప్పులుంటాయి. అవి లేకుండా వెళితే ఎడారిలో ఎస్కిమోను చూసినట్లు చూస్తారు. నైకీ షాపు కెళ్ళి షూసు, రీబాక్ కు వెళ్ళి రీబాక్ అనే పెద్ద లోగో అన్ని వైపుల నుడి కనిపించేలా వున్న జాగింగ్ పాంటు, మ్యాచింగు చొక్కా, ఆదిదాస్ కెళ్ళి రిస్టు బ్యాండు, ఆపిల్ స్టోరు కెళ్ళి ఐపాడు కొనుక్కొని జిమ్ముకెళ్ళా. ఇవేవీ లేకుండా జిమ్ము కెళితే వాడు జిమ్మరే కాదు.

ఐపాడ్ లో "అయ్యో పాడూ..నువ్వు నాకు తోడా..చీ పాడు.." అనే పాటకు అనుగుణంగా వీపు మీద గోక్కుంటూ డ్యాన్సు చేసుకుంటూ లోపలికి అడుగు పెట్టా. లోపల ఇసుక వేస్తే రాలనంత జనం. మా బుడ్డోళ్ళకు ఈత నేర్పేటప్పుడెప్పుడూ అంత జనం చూళ్ళేదు.

ఎక్కడ చూసినా ఏతాము తొక్కే వాళ్ళు (స్టెప్స్), కపిల తోలే వాళ్ళు (తాడు తో బరువులు లాగే వాళ్ళు),దొంగ కోళ్ళు పట్టే వాళ్ళు (పెద్ద బాలును పొట్ట కింద పెట్టుకొని అటూ ఇటూ ఊగే వాళ్ళు) కనిపించారు.

అమెరికాలో అవ్యయాలు బాగా వాడాలి. (ఓయీ...ఓరీ...ఓసీ...ఒసేయ్ లటాషా లాంటివన్నీ అవ్యయాలు అని పిలవబడతాయి.). అవకాశాలు మిథ్య అని తెలిసి ఈ మధ్యనే అమెరికా వచ్చిన వాళ్ళెవరైనా వుంటే వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాల్సినవి. ఆఫీసులో ఎవడైనా మౌసు తో గానీ మానిటర్ తో గానీ నెత్తిన బాదితే వెంటనే "ఒరేయ్ నీ యామ్మ..." అని బూతులంకించుకోకూడదు.
"వావ్..ఊ.. యువ్ హ్యావ్ అల్మొస్ట్ కిల్డ్ మీ మ్యాన్." అని అనాలి. అప్పుడే అమెరికన్లతో కలిసిపోయినట్టు. లేకపోతే గ్రీను కార్డు రాదు.

రెక్ సెంటర్ లోపలికెళ్ళగానే ..
"వావ్. వాటే క్రౌడ్ మ్యాన్ .." అని నేను ఓ నోరేశా పక్కన భారీ కాయంతో అపసోపాలు పడుతున్న కల్పనా రాయ్ లా వున్న ఒకావిడతో
"ఊ.. వాట్ ద హెక్...ఐ నోటీస్డ్. ఐ కేం లాస్ట్ వీక్ టూ. టు డేస్ క్రౌడ్ ఈజ్ అమేజింగ్."

"వావ్.. సో మెనీ న్యూ ఇయర్ రెసొల్యూషన్స్ ఐ థింక్..దట్స్ వండర్ఫుల్..థిస్ ఈజ్ వండర్ఫుల్. యువర్ అబ్సర్వేషన్ ఈజ్ వండర్ఫుల్... యువ్ ఆర్ ఆసం.." అంతలో అమ్మాయి మహేష్ బాబు లా వున్న బాయ్ ఫ్రెండు దగ్గరకు వెళ్ళిపోయింది.

జిమ్ములో కోడి రామ్మూర్తి లు వున్న చోటుకు వెళ్ళి డంబెల్స్ ఎత్తడం మొదలు పెట్టా. ఎన్ని ఎత్తానో, ఎన్ని సార్లు ఎత్తానో గుర్తులేదు. భారత్ లో నేను వెళ్ళిన హనుమాన్‌ వ్యాయామ శాలను, నేను వాడిను బుల్ వర్కర్ ను గుర్తుకు తెచ్చుకొని అక్కడ వున్న అన్ని బరువులు(1267 గ్రాములు) ఎత్తేశా. అలా క్రమం తప్పకుండా రోజుకో గ్రాము ఎక్కువ ఎత్తుతూ కండలు పెంచడం మొదలు పెట్టా. (విజిట్ కు విజిట్ కు మధ్య సంవత్సరం విరామ మిచ్చే అవకాశమున్నా పది రోజులు మాత్రమే విరామ మిస్తూ)

* * * * * * * *కండెలా పెరిగాయో అందరికీ చూపించక పోతే కండల జన్మ వృధా అయిపోతుంది. ప్రజలకు చూపించడానికి, వార్నర్ బ్రదర్సు, బర్నర్ అరవిందూ నాకు తెలీరు. కనీసం ఆఫీసులో చూపించచ్చు కదా అని ఘర్షణ సినిమాలో వెంకటేష్ వేసుకున్నట్లు పొట్టి చొక్కా వేసుకొని ఆఫీసుకెళ్ళా. ఫ్రంటు డెస్కు దగ్గరున్న సోఫియా చూసి ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తుందేమోనని బ్యాడ్జి కోసం వెతుకుతున్నట్లు జేబులో చెయ్యి పెట్టి వెతుకుతూ నిలబడ్డా. నా వెనకల వచ్చిన రమణా రెడ్డి కి హాయ్ చెప్పింది కాని నాకు చెప్పలేదు. సరేలే చూళ్ళేదు కాబోలు అనుకుని నా డెస్కు దగ్గర్కు వెళ్ళా. కాసేపు పని చేసి పనుంటే పక్క డెస్కు భటాష దగ్గరకు వెళ్ళా(పేరు మార్చడమైంది. అసలు పేరు బీరోషా. బీరోషా అంటే బీరు ప్లస్ షా కాదు. రణబీర్ వంశానికి చెందినది కాబట్టి బీరోషా అని పేరు పెట్టుకుంది).

"ఏమిటి మీ ఆవిడకు చొక్కా గుండీలు కుట్టడం రాదా?"
అప్పుడు గుర్తొచ్చింది కండలు కనిపించాలని నేను గుండీలు పెట్టుకోలేదని.

"ఓహ్ సారీ.." అని డెస్కు దగ్గరకొచ్చేశా.

భటాషాది చాదస్తపు కుటుంబం. ఇంట్లో మొగుడి చొక్కా గుండీలు తనే కుడుతుంది, వంట తనే చేస్తుంది. మొగుడి తల దువ్వుతుంది. పిల్లలను తనే స్కూల్లో వదిలి వస్తుంది.ఇడ్లీ పిండి తనే రుబ్బుకుంటుంది. ఈవిడని అందుకే దేశీ ఆడవాళ్ళు దూరంగా పెడతారు తమ మొగుళ్ళు ఎక్కడ పాడయిపోతారో అని.

అందుకనే ఆవిడను ఏ ఫంక్షన్లకు పిలవరు. ఊళ్ళో వున్న గూగుల్ గ్రూపుల పేర్లన్నీ నాన్-భటాష లలిత సహస్ర నామ గ్రూపు, నాన్-భటాషా సాయి బాబా గ్రూపు, నాన్-భటాషా కొత్త దేవుడి గ్రూపు, నాన్-భటాషా పాత దేవుడి గ్రూపుఅని వుంటాయి.

మా టీములో నన్నెవరూ గుర్తించడం లేదని కేఫిటేరియా కెళ్ళా. అక్కడ అన్నము వేడి చేసుకోవాలంటే పెద్ద లైను వుంది. వెళ్ళి లైనులో నిలబడ్డా. తెలిసిన వాళ్ళు కూడా హాయ్ అన్నారు కానీ నా ఆరు పెట్టెల గురించి ఒక్కరూ మాట్లాడలేదు. నా వంతు వచ్చినా కానీ అన్నం డబ్బా వేడి చేసుకోకుండా నా తరువాత వాళ్ళను ముందుకు పంపించేశా. చివరకు నా తరువాత వాళ్ళు ఎవరూ లేకపోయేసరికి ఉస్సూరుమని అన్నం వేడి చేసుకోక తప్పలేదు.

భాధాపరితప్త హృదయంతో ఇంటికి వచ్చేశా. రాగానే జిమ్ము డ్రస్సు వేసుకోని రెక్ సెంటర్ కు వెళ్ళి పోయా. అక్కడ ఒక పౌండు నుండి వంద, నూట యాభై, రెండు వందలు పౌండ్లున్న బరువులన్నీ ఎత్తేశా. ట్రెడ్ మిల్లు మీద పది మైళ్ళు పరిగెత్తా. ఎక్సర్ సైజు మెషీను మీద వున్న మాక్జిమం లెవల్లన్నీ అవలీలగా పూర్తి చేసేశా. ఇక రెక్ సెంటర్ క్లోజ్ చేస్తాం ఇంటికెళ్ళండి సార్ అని చెబ్తే గానీ ఇంటికి బయలు దేర లేదు.

ఇంటికొచ్చి చొక్కా విప్పి పెద్ద అద్దం ముందు నిలబడి ఊపిరి బిగబట్టి నా ప్రతిబింబాన్ని చూసుకున్నా...నా గురించి ఎవరూ పొగడలేదని.. నాకు నేనే.
"వావ్...వావ్.. సూపర్ బాడీ...ఆసం బాడీ...సిక్స్ ప్యాక్..ఎయిట్ ప్యాక్...టెన్‌ ప్యాక్..హా.. టెన్‌ ప్యాక్..ఐ డిడ్ టెన్‌ ప్యాక్..
ఐ డిడ్ టెన్‌ ప్యాక్.
ఐ డిడ్ టెన్‌ ప్యాక్.
ఐ డిడ్ టెన్‌ ప్యాక్."

* * * * * * * *


" నాన్నా!..నాన్నా.. లే టైమయిపోతోంది.ఆ టెన్‌ ప్యాకేంది..నాకు టెన్‌ ప్యాక్ సాక్సులు తీసుకొని రావాలి. వెళదాం లే.."


* * * * * * * *