Wednesday, December 10, 2008

ఈ వారం సిద్ధ - బుధ్ధ (లతోబా బాబా, లంబ కోణ దృక్కోణం)”

* * * * * * * *


"బాబా బాబా.... లతోబా బాబా.
ఇల్లా బాబా...ముల్లా బాబా.
లాహి..లాహి లతోబా..ఇల్లా ఇల్ల లతోబా"
"ఎవరండీ ఇక్కడ ఇంట్లో ఏవైనా పూజలు చేస్తున్నారా?"

"బల బల బల బల బాబా?...ఓ ఎవరు?.... పక్కింటి ఎంకట్రావు గారా? పూజ చేసుకుంటున్నామండి "
"ఓ ఈ బాబా నా. నాకు బాగా తెలుసు. ఈ లతోబా బాబా దయవల్లే మనం ఇంకా బతికి వున్నాం..నేను కూడా భజన చేస్తా
బాబా బాబా లతోబా ..బాబా బాబా లతోబా."

"మమ్ములను దయ చూచు లతోబా...
మమ్ములను కరుణించు లతోబా...
ఎవరక్కడ మళ్ళీ తలుపు కొడుతున్నారు?"
"నేను సిద్ధా! ఎదురింటి సుబ్బారావును. ఏవిటి ఇక్కడ భలే బజనలు వినిపిస్తున్నాయి."

"ఓ మీరా? రండి. మనమందరం సుఖంగా ప్రాణాలతో వుండాలని లతోబా బాబా కి పూజ చేస్తున్నాం"
"అయ్యో ఎంత మాట. నాకు చెప్పరే. నేనూ పూజలో కూచుంటా..
మామ్ములను కాపాడు లతోబా....
ఈ దీనులను కాపాడు లతోబా..."

"మీరూ బాగా పాడుతారు..ఇపూడు కొంచెం హెచ్చు స్వరం లో పాడాలి..బాబా..బాబా"
"లతో బాబా. లతో బాబా "

"బాబా బాబా... దీనుల బాబా…"
"లతో బాబా..."

"బాబా బాబ... దీవించు బాబా…"
"లతో బాబా..."

"బాబా..బాబా..
లతో బాబా.. బాబా..బాబా….
భూమ్మీద బాబా....లతోబా బాబా.
బూడిద లేని బాబా...లతోబా బాబా.
లతోబా...లతోబా... ఇల్లల్లా... జిల్లిల్లా....లతోబా"

* * * * * * * *"రేయ్ సిధ్ధా…ఒరేయ్..సిధ్ధా? ఒరేయ్ లేవరా? పద కొండు గంటలవుతోంది పోతే పోనీలే అని పడుకోనిస్తే మధ్యలో ఆ బాబా గోలేంటి?"
"బాబా బాబా ...లతోబా...
భాబా బాబా ... లతోబా.."

"ఆ నమస్కారాలేంది ఆ పాటలేంది నీ నెత్తిన ఓ బిందె నీళ్ళు కుమ్మరిస్తే కానీ ఈ లోకం లోకి రావు...ఆ నీళ్ళ బిందెక్కడ... ఇక లేచి చావు"
"అమ్మో..అయ్యో..ఓర్నాయినో లతోబా నీళ్ళు... లతోబా నీళ్ళు"

"లతోబా నీళ్ళు కాదు మున్సిపల్ నీళ్ళు...ఆ అరుపులాపి ఇప్పుడు చెప్పు ఈ లతోబా బాబా ఎవర్రా? కొత్తగా ఎవరైనా స్వాములొచ్చారా?"
"అయ్యో ఇదంతా కలా? అది కాదండీ మనం ఇన్నాళ్ళు బతికున్నామంటే కారణమెవరు? ఈ లతోబా బాబానే. ఈ లతోబా బాబా కన్ను తెరిచారంటే మనమందరం భస్మమయిపోతాం.."

"సరే ముందు ఈ బాబా ఎవరో చెప్పు తరువాత భస్మమవుతామో, చూర్ణమవుతామో చెబ్తా"
"అదేనండి లష్కర్-ఈ-తోయిబా. పట్టు మని పది మంది కూడా లేని వాళ్ళు ఇరవై మిలియన్ల ప్రజలున్న నగరాన్ని గడగడ లాడించారు కదా. వాళ్ళు ఓ 500 మంది వచ్చారనుకోండి మన వంద కోట్లు ఏమవ్వాలి? అందుకే ముందు జాగ్రత్త చర్య గా పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటున్నా."

"నీ లాంటి దద్ధమ్మల్లాంటి నాయకులుండ బట్టే ఇలా వాళ్ళు బరితెగించ గలుగుతున్నారు. వీళ్ళని ఖలిస్థాన్ టెర్రరిస్టులను అణిచినట్లు అణిచి వేసుంటే ఇప్పుడు ఇలా తెగ బడే వాళ్ళు కాదు. ఇలాంటి వెధవల్ని దయా దాక్షిణ్యం లేకుండా పిచ్చి కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పడెయ్యాలి. పట్టుకున్న ఆ ఒక్కణ్ణి కూడా ఇంకో కొన్ని రోజుల తరువాత వాడి సహధ్యాయుల దగ్గరికి పంపిస్తారు చూడు"

"ఊర్కోండి. ఆ ఒచ్చినవాడిని విడిపించేస్తారు చూడండి ఏ లింకో పెట్టేసి."
"ఓహో నువ్వు పాకిస్తాన్ వాళ్ళ వర్షను చదివావనుకుంటా"

"మళ్ళీ ఇందులో ఇంకో వర్షనా?"
"అవును. వాళ్ళుద్దేశ్యం లో ఆ పట్టు బడిన వాడి పేరు అమర్ సింగు. పంజాబు వాడు. అంతే కాదు గతం లో రా(RAW) ఆఫీసరు కూడా. వీడు బి.జె.పి. సానుభూతి పరుడు. అందుకే కర్కరే మాలెగావ్ కేసుల్లో హిందువులను ఇరికిస్తున్నాడని వీడే మొదట చంపేశాడట. మిగిలిన వాళ్ళందరూ కూడా బి.జె.పి. సానుభూతి పరులట. బి.జె.పి. ఈ సారి గెలవలేదని ఈ కుట్ర పన్నారట"

"అమ్మో నాకిప్పుడు ఫ్యూజు కొట్టేసింది. ఇంత బాగా ప్రచారం చేసుకుంటున్నారా వాళ్ళు?"
"అప్పుడే ఏమయ్యింది ఐక్య రాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టి దీన్ని కూడా భారత ప్రభుత్వం మీద తోసేస్తారు. మనోళ్ళు చెక్క భజన చేసుకుంటూ వుంటారు. వీలయితే ఎలక్షన్లలో దీన్ని వాడుకుంటారు."

"మొన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎలక్షన్లలో ఎవరు గెలిచినట్లు?"
"షీలా దెబ్బకు డిల్లీ బి.జె.పి. డీలా,
రాజస్థాన్ లో రాజే లీజుకు బూజు ,
చత్తీస్ గడ్ లో చితికిపోయి చిత్తయిన చెయ్యి,
మధ్య ప్రదేశంబునన్ కమల కలశం ప్రకాశించెన్ చౌహాన్ తోడన్ ,
లాల్ తన్వాలా మిజోరము వాలా చూపెను చెయ్యి జ్వాల"

".....డొంక తిరుగుడు రూట్లు ఇలానే పుట్టుంటాయనుకుంటా.."
"ఏంటా గొణుగుడు..."


* * * * * * * *"అయ్య గారూ నా మేనల్లుడు మొన్నొచ్చాడండి. వాడి ధోరణి చాలా విచిత్రంగా కనిపిస్తోంది"
"ఏమిటది"

"అందరికీ నచ్చింది వాడికి నచ్చటం లేదు. ఎవరికీ నచ్చనిది వాడికి నచ్చుతుంది."
"ఓస్..అంతే కదా"

"మంచి సినిమాలు బాలేవంటాడు. బాగాలేని సినిమాలు బాగున్నాయంటాడు"
"ఇదేదో కొత్తగా వుందే"

"వర్షం పడితే కవిత, వర్షం ఆగితే కవిత, ఎండొస్తే కవిత, నీడొస్తే కవిత."
"అహా...."

"ఇంకా బస్సు ఎక్కుతుంటే కవిత, దిగుతుంటే కవిత.."
"ఇంకా చాలానే వుండాలే"

"దానికి తోడు కంప్యూటర్ వాడాయా. కొత్తగా ఏదన్నా వస్తే దానిగురించే మాట్లాడతాడు."
"ఇక మిగిలిన లక్షణాలు నేను చెబ్తా. పుస్తకాలు చదివితే ఏదో రాయాలని పిస్తుంది. టెర్రరిస్టు కనిపిస్తే కాల్చేసి మసి చెయ్యాలని కూడా అనిపిస్తుంది. రాజకీయ నాయకులంటే అసలు పడదు కానీ మామో, బాబాయో రాజకీయ నాయకుడైతే వాడి గురించి అసలు మాట్లాడ బుద్దెయదు."

"భలే కనిపెట్టేశారు"
"ఎక్కడకు పోయినా అవినీతి వుండకూడదంటాడు. ఇళ్ళు, అపార్టుమెంట్లు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజులు ఎగ్గొడతాడు. పైరవీలు పోవాలంటాడు గుట్టు చప్పుడు కాకుండా పైరవీలతో తిరపతి కొండ మీద పనులు చేయించుకుంటాడు. పైరసీ పోవాలంటాడు. పైరసీ సినిమాలు చూస్తాడు. పైరసీ సాఫ్టువేర్ వాడతాడు."

"అవునండోయ్. "
"ఇంకా చెప్పుకుంటూ పోతే ఎవరికైనా పేరొచ్చిందని తెలిస్తే ఆ పేరొచ్చినోడి లాగే ప్రవర్తించాలనిపిస్తుంది. తనో వెరైటీ వ్యక్తి అని కూడా అనుకుంటాడు. అన్నింటికి మించి నా దృక్కోణం లంబ కోణం అంటాడు. అవునా?"

"అంత కరక్టుగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదేమైనా ఒక జబ్బా?"
"ఓ మాదిరి జబ్బే"

"దీనికి విరుగుడు"
"బ్లాగర్లనడుగు "

* * * * * * * *చదివిన వారికి, వ్యాఖ్యానిస్తే వ్యాఖ్యాతకు ముందస్తు ధన్యవాదాలు.


* * * * * * * *

Friday, November 28, 2008

ఈ దుశ్చర్యను ఖండించాలా?

ముంబైలో విదేశీ ముష్కరులు చేసిన మారణకాండను ఖండించాలా? ఎందుకు ఖండించాలి? ఖండించాల్సింది జరిగిన దుస్సంఘటనను కాదు.

ఈ సంఘటనకు శాయశక్తులా సహాయపడిన స్వదేశీ రాక్షసుల కుత్తుకలను ఖండించాలి.
వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీల గుట్టు మట్లు తెలుసుకోవడానికి చూపిస్తున్న స్వామి భక్తి పరాయణత ను దేశ భద్రత మీద పెట్టని ఇంటెలిజెన్సు అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
వస్తోంది మాదక ద్రవ్యమో, మందు గుండో తెలుసుకోకుండా లంచం తీసుకుంటూ ఆయుధ సామాగ్రి ని దేశం లోకి అనుమతిస్తున్న సరిహద్దు నిఘా విభాగం అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
ఒంటి మీది తెల్ల చొక్కా నలగకుండా నలుగురు ప్రజలు కనిపిస్తే రెండు వేళ్ళు పైకెత్తి చూపించే భ్రష్ట రాజకీయ నాయకులకి చూపిస్తోంది చేతకాని తనమని చెప్పి వాళ్ళ చేతులు ఖండించాలి.
సంక్షోభ సమయం లో సంఘీభావాన్ని ప్రకటించకుండా తగుదునమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభుత్వ వైఫల్యమని చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకుల కాళ్ళు ఖండించాలి.

Tuesday, November 25, 2008

ఈ వారం సిద్ధా - బుధ్ధ (వంశాలు, గర్జనలు, బ్లాగులు, ఆటలు)

* * * * * * * *


"రేయ్ సిధ్ధా!!!"
"......"

"రేయ్ సిధ్ధా!!! ఆ గంతులేమిటి ఇలా రా.. క్రికెట్ లో మనోళ్ళు బాగానే ఆడుతున్నారు. నువ్వు ప్రాక్టీసు చేసి దేశాన్నేమీ ఉద్ధరించక్కర్లేదు ఇటొచ్చి కాస్త పని చూడు"
"అయ్య గారూ, నేను క్రికెట్ ప్రాక్టీసు మానేసి చాలా కాలమయింది. ఇప్పుడు నేను ప్రాక్టీసు చేస్తోంది తొడ కొట్టి మీసం మెలెయ్యడం"

"ఏ సంక్రాంతికి కుస్తీ పోటీలు గానీ జరుగుతున్నాయా ఊర్లో?"
"వచ్చే సంక్రాంతి కల్లా ఈ కుచ్చు టోపీలొళ్ళంతా ఎలక్షన్లతో కుస్తీ పట్లు పడతారు కదా. మునెమ్మలా నాక్కూడా ఏదైన చాన్సు వుంటుందేమోనని ఇప్పట్నుండి తొడ కొట్టడం ప్రాక్టీసు చేసుకుంటున్నా. ఇప్పుడు తొడ కొట్టడం, మీసం మెలెయ్యడం, గాల్లో ముద్దులివ్వడం.. అదే కదా ఫ్యాషన్"

"నువ్వు తొడ కొట్టడం బానే వుంది గానీ. మీసాలు మెలెయ్యాలంటే నీకు వున్నవి మిడత మీసాలు అవి సరిపోవు"
"మీసాలు పెరగడానికి ఏవైనా స్టెరాయిడ్సు వున్నాయేమో కాస్త అంతర్జాలం లో వెతికి పెట్టండి. ఓ సాంపుల్ మా కిలారి పాల్ గారికి కూడా పంపిస్తా"

"అన్ని పార్టీలోళ్ళు అయిపోయారు ఇప్పుడు పాల్ మిగిలాడన్న మాట. ఈ గర్జన వంశం, తొడ కొట్టే వంశం, ముద్దులిచ్చే వంశం, సర్ప వంశం వాళ్ళతో ఎక్కడ పోటీ పడుతాడు"
"అరె! ఆ నాలుగో సర్ప వంశమేంది కొత్తగా?"

"ఆ నలుగురు హీరోల్లో మూడో హీరో వున్నాడు కదా. ఆయనదే సర్ప వంశం"
"అది అక్కినేని వంశం కదా?"

"కాదు. మొన్న కింగు ఆడియో విడుదలప్పుడు అక్కినేనే చెప్పాడు. నా పేరులో పాముంది, నా కొడుకు పేరు లో పాముంది, నా మనవడి (నాగ చైతన్య) పేరులో కూడా పాముంది అని. బుజ్జి సర్పం కూడా 'నేను ఇలా ప్రేక్షకుల మీద బుస కొట్టడానికి రెండేళ్ళ నుండి ఎదురు చూస్తున్నా' అని చెప్పింది. సో అది సర్ప వంశమన్న మాట"
"ఆ నలుగురు హీరోల్లో ముగ్గురు మూడు పార్టీల్లో ఫిక్సయిపోయారు కదా. నాలుగో ఆయన కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతే బావుణ్ణు. ప్రేక్షకులు నిశ్చింతగా చింత కాయల బదులు చింతాకు పులగూర చేసుకుని తింటారు. బహు జన సమాజ్ పార్టీలో చేరి బడుగు జనాలకు కీడు జరక్కుండా కాపాడుతూ వుంటే బావుంటుంది"

"ఆయనకి కొంచెం దైవ భక్తి ఎక్కువ, కొంచెం వేదాంతం మనిషి. బి.జె.పి. అయితే బావుంటుందేమో"
"'ప్రేమించుకుందాం రా', 'పెళ్ళి చేసుకుందాం రా' లా 'బి.జె.పి లో చేరదాం రా' అనే సినిమా తీసి రాజకీయ రాజ్యం లోకి రాకెట్ లో రోదశీలోకి వెళ్ళిన రాకేష్ శర్మ లా, రణ గొణ ధ్వనుల రాక్షస రహదారుల రాజధానిలో రివ్వున రాసుకు దూసుకు పోయే రీగల్ క్యాబులా, పీడిత తాడిత ప్రజలను ఆదరించి, అభిమానించి, పరిపాలించే ప్రభువులా వస్తే అందరినీ సంతోష పెట్టిన వాడవుతాడు"

"నువ్వు ఆశు కవివయిపోయావురో?"
"డైరెక్టుగా తిట్టమని మీకెన్ని సార్లు చెప్పాలి అయ్యగారూ? మీకు ఆ హక్కు వుందని ఎప్పుడో చెప్పానుగా. ఇలా డొంక తిరుగుడు గా మారెప్ప... చింతకాయల రవి... అని అనడమెందుకు"

"సడేలే. వెళ్ళి మిరపకాయలు బాగా దట్టించి ఓ పెసరట్టు వేసి కొబ్బరి చెట్నీ తో పట్టుకు రాపో.."
"ఇవిగోండి"

"అట్టు అదరగొట్టావ్ రో. ఏవిటి బ్లాగుల్లో కొత్త రెసిపీలు గానీ చూస్తున్నావా?"
"ఆయనెవరో భాస్కర్ రాజట నల భీమ పాకం అని మొదలు పెట్టి భలే ప్రయోగాలు చేస్తున్నాడు. నేను కూడా ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టా. వచ్చే వారం మీకు ఐస్ క్రీం పప్పు విత్ జామూన్ బిర్యాని. సైడ్ డిష్ గా ఉప్మా సూప్ చేసి పెడతా"

"హుం.... బ్లాగులు పెరిగిపోతున్నాయి."
"అవునండి ఏం జదివేట్టు లేదు..ఏం రాసేట్టు లేదు.."

"చంపేస్తా వెధవా... రాయక పోతే పోయావ్ చదివేదన్నా సరిగ్గా చదువు ఏడువు. లేకపోతే నేను ఎలాంటి వంటకాలు తినాల్సి వస్తుందో ఏమో. ఇంటర్నెట్ కనెక్షన్ పీకించేస్తా"
"ఊ..అలానే అంటారు. పీకించిందేం లేదు"

"ఆ బుంగ మూతేంటి? పదారేళ్ళ కుర్రాడిలా? కొత్త బంగారు లోకం రివ్యూ గానీ చదివావా?"
"ఆ మీరు మరీను, కుర్ర కారు బ్లాగులు చూస్తే కుర్ర తనంగానూ, చరిత్ర బ్లాగులు చూస్తే చరిత్ర కారులు గానూ, భక్తి బ్లాగులు చూస్తే భక్తులు గానూ, పాటల బ్లాగులు చూస్తే పాటగాళ్ళు గానూ, వంటల బ్లాగులు చూస్తే వంటవాడి గానూ, ఆవేశం బ్లాగులు చూస్తే.."

"ఇక ఆపెయ్. నా కర్థమయిపోయింది. ఈ రోజుకి నీ నోటి టపా కట్టెయ్."
"అలాగే"

* * * * * * * *


"అయ్యగారూ! మనమిద్దరం ఈ రోజు ఒక ఆటాడుకుందాం"
"సరే. నువ్వు తొడ గొట్టు. నేను మీసం మెలేస్తా"

"అబ్బే అదికాదండి. మనం తెలుగు సంఘమాట ఆడుకుందామా?"
"ఓ అదా! నువ్వు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు, నేను తిరుపతి ఎంపీ గా పోటీ చేస్తున్నట్టు ఆడుకుందాం.."

"మీ ఫ్యూజు ఒక పక్క బాగా పీకేసింది"
"ఏం. అమెరికా తెలుగు సంఘాలోళ్ళు చేసే పని అదే కదా"

"ఆ ఆట లో మజా ఏముంది. నేను చెప్పేది అది కాదు"
"మరి?"

"మీరు నన్ను బహిష్కరించండి... నేను మిమ్మల్ని బహిష్కరిస్తా... మీరొక పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వండి దానికి కౌంటర్ గా నేనొక స్టేట్ మెంట్ ఇస్తా"
"!!!"

"ఏం అలా అయిపోయారు"
"ఏం లేదు నేను వెళ్ళి రెస్టు తీసుకుంటా. ఎవరొచ్చినా డిస్టర్బ్ చెయ్యాకు"

"అలాగే. ఎవరన్నా వస్తే రామ కోటి రాసుకుంటున్నాడని చెబ్తా"

* * * * * * * *

Sunday, November 23, 2008

ఒబామా నాకెందుకు నచ్చలేదంటే...

* * * * * * * *


దేశంలో గరీబోళ్ళు ఎక్కువయ్యారని ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' అంది. పదవి లోకి రాగానే గరీబోళ్ళకు చాలా చేసింది...
గరీబోళ్ళు హ్యాప్పీ..
రాష్ట్రం లో బీదోళ్ళు ఎక్కువయిపోయారని రెండు రూపాయలకే బియ్యమిస్తానన్నాడు అన్న ఎన్టీఆర్. రాగానే ఇచ్చాడు...
బీదోళ్ళు హ్యాప్పీ...
రైతులు బ్యాంకు ఋణాలు కట్టలేరని మాఫీ అన్నాడు చెన్నా రెడ్డి. పదవిలోకి రాగానే ఋణాలు మాఫీ...
రైతులు హ్యాప్పీ...
కరెంటు మాఫీ అన్నాడు వై.ఎస్. పదవిలోకి రాగానే కరెంటు చార్జీలు మాఫీ...
మళ్ళీ రైతులు హ్యాప్పీ...
అమెరికా ఎకానమీ బుష్షు కాలం లో భ్రష్టు పట్టిపోయిందని,ఇంటి ఋణాలు(మార్టుగేజు) కట్టలేక కొంపలు కొల్లేరవుతున్నాయని(ఫోర్ క్లోజర్సు) అన్నాడు ఒబామా. పదవిలోకొస్తే ఇళ్ళ ఋణాలు మాఫీ అంటాడేమో ..నేను కూడా హ్యాప్పీ అనుకున్నా..ప్చ్..
ఇప్పుడు నేను నాట్ హ్యాప్పీ...


మీకు తెలుసా?: ఒబామా ట్రాన్సిషన్‌ టీము 15 మంది లో భారతీయ సంతతివారు నలుగురు.

* * * * * * * *

Thursday, November 20, 2008

ఎకానమీ సునామీ... దీనిక్కొంచెం మెంటల్.

* * * * * * * *

అన్ని దేశాల ఎకానమీలు సున్నా అయి సున్నకెంత విలువుందో చూపిస్తాం అని సునామీ సృష్టిస్తున్నాయి. దీనికి మెంటలా అంటే అవును. ఓ రోజు తారా జువ్వలా రివ్వున ఎగసి పడుతుంది ఇంకో రోజున తుస్సు తుపాకీ అని పుటుక్కుమని నేల పడుతుంది. అక్టోబరు మొదటి వారం లో రికార్డు స్థాయిలో అమెరికా డౌ జోన్సు ఇండెక్సు 800+ పాయింట్ల పతనం..(చరిత్ర సృష్టించింది) మళ్ళీ వారం తిరక్కుండానే రికార్డు స్థాయిలో 800+ పాయింట్ల వృద్ధి..(మళ్ళీ చరిత్ర సృష్టించింది). సహజంగా ఏ దేశం సంక్షోభంలో పడినా ఆ దేశపు కరెన్సీ చతికిల పడుతుంది.(సోవియట్ రష్యా కింద పడ్డప్పుడు రూబుళ్ళ విలువెంతుందో అందరికీ గుర్తుండే వుంటుంది. రష్యాకు రూబుళ్ళలో మనమివ్వాల్సిన డబ్బు ఏ అయిదో, పదో శాతానికి పడికిపోయింది). కానీ అమెరికా డాలర్ విలువ ప్రపంచం లోని ప్రతి కరెన్సీ తోనూ పెరుగుతోంది. గుడ్డిలో మెల్లంటే ఇదే. మతులు పోతున్న ఈ సమయములో దిగుమతులకు ఊరట. ఖజానా ఖాళీ అయితే ఇదేం ఊరట అంటే అయిసు ముక్క లేకపోయినా అయిసు పుల్ల చీక్కోడం లోని తృప్తి ఇదే. ఇక మన రూపాయి నువ్వెక్కడ అంటే నేను హాఫ్ సెంచురీ నాటవుట్ అంటోంది. జనవరిలో 21,000దాటి చుక్కల్లెక్కేసిన బొంబాయి స్టాకు ఇండెక్సు ఇప్పుడు ఎనిమిది వేల దగ్గర ఎగరలేక పీక్కు పోయిన రెక్కలతో బిక్క చచ్చి పోయింది.

ఈ దెబ్బలకి ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోవడం సంగతేమో గానీ ప్రాడక్టివిటీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రతోడూ పనిచ్చిన పదినిముషాలకు పూర్తి చేసి ఇంకా పనేమన్నా వుందా సార్ అని అడుగుతున్నారు. లేకపోతే ఉద్యోగానికి ఎసరొస్తుందని భయం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు ఎంత బాగా పని చేసినా పింకు స్లిప్పు బారి నుండి తప్పించుకోవడం సులభతరమే కాదు.

ఇప్పటికే భారత్ లో కొన్ని కంపెనీలు కొంత మందిని పిప్ (పర్ఫార్మెన్సు ఇంప్రూవ్మెంట్ ప్లాన్) లో పెట్టాయి.మరి కొంత మందికి శనక్కాయలకు బదులు సున్నలు చేతిలో పెట్టాయి. ఈ కేటగిరీల లో వున్న వాళ్ళ మీద మొదట దెబ్బ పడుతుంది. సాధారణంగా మొదటి దశ పింకు(ఉద్వాసన) స్లిప్పు ఇచ్చే ముందు సరీగా పని చెయ్యక పోవడం, తోటి ఉద్యోగులతో సఖ్యత గా లేకపోవడం, ఇంటర్నెట్ చూడ్డం, పని వేళల్లో కేఫిటేరియాలో చక్కర్లు కొట్టడం లాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఇందులో ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు కూడా వుంటారు. ఇక రెండో దశ లో ఎవరు మిగతా వారికన్నా తక్కువగా పని చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి వుంటుంది.

ఇప్పుడున్న పరిస్థితులతో ఉద్యోగం కాపాడుకోవాలంటే ఒంట్లోని మత్తును పక్కన పెట్టి ఒళ్ళు వంచి పని చెయ్యడం ఉత్తమం. ఒకప్పుడు "ఆఁ నన్నెవడు పీకుతాడు" అని మీసాలు మెలేసి నిమ్మకాయలు నిలబెట్టిన వీర సామ్రాట్టులు నీరసంతో ఆ నిమ్మకాయలు పిసికి జ్యూసు తాగి ఎక్ స్ట్రా గా పని చేస్తున్నారు పీరియెడ్. ఆఫీసులో బెస్టు ఇంటర్నెట్ యూజర్ అవార్డు రాక ముందే అంతర్జాల సందర్శనం పూర్తిగా ఆపేస్తే మంచిది. దాని బదులు ఆ సమయాన్ని కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కోసం కేటాయిస్తే మరీ మంచిది. ఎందుకంటే గ్రహ చారమో, ఉప గ్రహాచారమో బాలేక ఉద్యోగం ఉష్ కాకయితే బయట ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ. వాళ్ళతో పోటీ పడి కాకిలాగ కావు కావు మంటే వేరే ఉద్యోగాలు రావు. ఓ నెల క్రితం మా కంపీనీ వాళ్ళకు ఒక డి.బి.ఏ. (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) కోసం 140 రెస్యూమే లు వచ్చాయి. అంతకు ముందు ఒకటీ అరా కూడా వచ్చేవి కాదు. భారత్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి వుందనుకుంటున్నా.
* * * * * * * *

బాగా పని చేసినా పీకేస్తారు కదా అంటే ఒక్కోసారి నా ఫ్రెండుకు జరిగినట్లు జరగచ్చు. అతను కాలిఫోర్నియాలో పని చేస్తాడు. రెండు రూపాయల పనేదన్నా వుంటే పావలా జీతం తీసుకుంటున్న అతనికి ఇచ్చేవారు. పావలాలు తీసుకుంటూ శనాది వారాలు కూడా పని చేస్తూ వాళ్ళకు చాలా రూపాయలు మిగలబెట్టే వాడు. ఇంత చేసినా పరిస్థితి బాలేదని కంపెనీలో దశల వారీగా పింకు స్లిప్పులు ఇవ్వడం మొదలు పెట్టారు. కంపెనీ వాళ్ళేమో ఉదారంగా, పీకేసిన ప్రతోడికీ సంవత్సరం సర్వీసుకు ఒక నెల జీతం చొప్పున సెవెరన్సు ప్యాకేజీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ లెక్కన మనకూ ఎనిమిది నెలల జీతమొస్తుందని లెక్కలేసుకొని భారత్ కి తిరిగి వెళ్ళి పోదామని సంబరంగా వున్నాడు. తన ఇల్లు అమ్ముకోని భారత్ కు ఓ ట్రిప్పు వెళ్ళి వచ్చాడు. శని గ్రహం దాటొస్తే ఉపగ్రహం తీసుకెళ్ళి దింపొచ్చినట్లు ఓ ప్రమోషనిచ్చి రెండు సెనిక్కాయలు చేతిలో పెట్టి మూట సెనిక్కాయలు ఖర్చయ్యే చోటికి బదిలీ చేస్తామన్నారు. అసలే వున్న సెనిక్కాయలు భారత్ లో ఖర్చు పెట్టుకొచ్చాడు వాళ్ళిచ్చిన రెండు సెనిక్కాయలు ఒద్దని చెప్పేశాడు.పావలాకే బాగా పని చేస్తాడని ఉద్యోగం లో నుంచీ పీకనూ లేదు. ఇప్పుడు ఉప గ్రహాలను చూస్తే పారిపోతున్నాడు.

ఇంత ఎకానమీ తంతున్నా కొంత మంది తమ ఎంజాయ్ మెంట్ లు మాత్రం మానటం లేదు. ఇక్కడ నా ఫ్రెండోళ్ళ ఆఫీసులో ఎవడో వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఆ సాయంత్రం పెద్ద మందు పార్టీ ఇచ్చార్ట ఆఫీసు వాళ్ళందరూ కలిసి. ఇక మీడియా వాళ్ళయితే ఓబామా వైట్ హౌసుకు తీసుకెళ్ళడానికి ఏ కుక్కయితే బావుంటుంది అని కొన్ని కుక్కపిల్లలను సెలక్టు చేసి ఓటింగుకు పెట్టారు. ఈ కుక్క పిల్లల్లో కూడా తక్కువ అలర్జీ వున్న బొచ్చు కుక్క పిల్లల ఫోటోలు పట్టుకొచ్చి పెట్టారు. ఒబామా పిల్లల్లో ఒకరికి అలర్జీలున్నాయట మరి. రా.త.దె.కొ.

ఇంత జరుగుతున్నా షాపింగు చేసే వాళ్ళకోసం థాంక్సు గివింగు బ్లాక్ ఫ్రైడే వస్తోంది.కొనేవాళ్ళు కొంటూనే వుంటారు. ఇప్పుడే చాలా స్టోర్లవాళ్ళు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంటారు. మీరు అమెరికాలో వుండి అలాంటి డీల్సు కోసం ఎదురు చూస్తుంటే నేడే సందర్శించండి డీల్ అంకుల్..డీల్ అంకుల్..డీల్ అంకుల్... దీనికి నీకు ఏమి సంబంధం అంటే నేనే ఆ డీల్సు లోడర్ని, క్లీనర్ని, ఓనర్ని. ఎందుకు మొదలెట్టావ్ అంటే ఉద్యోగం పోతే బ్యాకప్ కోసం. మా ఆఫీసులో రెండు సునామీలు తప్పించుకున్నా ఇప్పటికి. పోయిన్నెల్లోనే ఒకటి జరిగింది. ఇంకోటొస్తే తప్పించుకుంటానో లేదో తెలీదు. అందుకే ఈ డీల్ మావయ్య.. ఇందులోంచి మీరు ఏ స్టోరు లో కొనాలంటే ఆ స్టోరు లింకు మీద నొక్కి ఆ స్టోరు నుండి కొనుగోళ్ళు చెయ్యొచ్చు. పన్లో పనిగా మీ స్నేహితులకు వాళ్ళ స్నేహితులకు కూడా చెప్పండి. హ్యాప్పీ డీల్సూ...

* * * * * * * *


చివరగా నా ప్రశ్న నా సమాధానం:
ప్రశ్న: 2001 లో కూడా ఎకానమీ తన్నింది కదా. అప్పుడు లేనిది ఇప్పుడెందుకంత పరిస్థితి వచ్చింది.
సమాధానం: అప్పుడు వాలు వీధి పెట్టుబడులలో నేను వున్నాను కాబట్టి ఒడ్డున పడింది. ఇప్పుడు నేను లేనుగా.
* * * * * * * *

Wednesday, October 15, 2008

ప్రపంచ చేతులు కడుక్కునే రోజు (Global handwashing day)

కంపెనీలు : ఉద్యోగులను ఇంటికి పంపించి
స్టాక్ మార్కెట్ : ఇండెక్సును కిందకి పంపి
చిరంజీవి: ప్రజాపర్యటన మధ్య లో ఆపేసి
వై.ఎస్.: 24 గంటలు బీరు తయారీకి అనుమతిచ్చి
భారతీయ రిజర్వు బ్యాంకు: ఒక శాతం వడ్డీ తగ్గించి
తమిళెంపీలు: 39 రాజీనామాలు కరుణా నిధి చేతిలో పెట్టి
నేను: ఒక టపా రాసి

Friday, October 10, 2008

ఎకానమీ సునామీ

* * * * * * * *


"అమెరికా తుమ్మితే మిగతా ప్రపంచానికి జలుబు చేస్తుందట కదా?"
"కాదు. ప్రపంచానికి జలుబు చేసే ముందే అమెరికా తుమ్ముతుంది."

* * * * * * * *


"ఇవాల్టికి మీ కంపెనీలో స్కోరెంత?"
"ఆ ఎంత ఓ ముప్పై!!!"
"ఓస్ అంతేనా మా దాన్లో యాభై"
"అయితే ఇక క్లోజన్న మాట"
"ఏవిటి అప్పుడేనా ఇంకా చాలా వుందట"
"మా కంపెనీలో కూడా"

* * * * * * * *


"మీ కంపెనీలో వ్యవహారమెలా వుంది?"
"కొందర్ని క్యూబు దాకా రానిస్తున్నారు."
"మీ కంపెనీ నే బెటరు.మా కంపెనీ లో గేటు వరకే"

* * * * * * * *


"నీ 401K లో ఎంతుంది?"
"పోయిన్నెల 100K వుండేది ఇప్పుడు 30K వుంది."

* * * * * * * *

Wednesday, October 01, 2008

అందాల ఆస్పిన్

* * * * * * * *


<:ఫోటోల మీద నొక్కితే బొమ్మలు పెద్దగా కనిపిస్తాయి.(ఒక్కోటి 10 మెగా పిక్సెల్స్):>


మరూన్‌ బెల్స్: అమెరికాలో విరివిగా క్యాలండర్ లలో వుండే చిత్రం ఇదే.


అమెరికా వచ్చిన కొత్తలో ఫ్లోరిడా లోనో, టెక్సాస్ లోనో పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు ఈ టి.వి. ల వాళ్ళు మదర్ నేచర్ కన్నెర్ర చేసింది, మదర్ నేచర్ మార్పులు తెచ్చింది అని అంటుంటే వీళ్ళు కూడా ఏంటబ్బా మనలా మదర్ ఇండియా, మాతృత్వం లాంటి పదాలు వాడతారు అని బోల్డాచ్చర్యపోయి అదంతా ఫోనులో పోసి భారత్ లో వినే వాళ్ళ చెవులు నింపే వాడిని. తరువాత్తరువాత ఆ వాడకం వినీ, వినీ బుర్రకలవాటయిపోయింది. అప్పట్నుండి ఎక్కడ ఏ కొండో, గుట్టో, చెట్టో, పుట్టో అందంగా కనిపించినా మదర్ నేచర్ అనే పదం బుర్ర మీద కిరీటంలా కూచుంటుంది. అలా ఈ మదర్ నేచర్ కిరీటం స్థానం ఆక్రమించినప్పుడల్లా కారు నోట్లో పెట్రోలు (గ్యాసు) పీపా పెట్టి ఊర్లు తిరగడం అలవాటయింది. అలాంటి తిరుగుళ్ళలో ఈ ఆస్పిన్ వెళ్ళి రావటమొకటి.


మరూన్‌ బెల్స్: వరుసగా బారులు తీరి వున్న ఫోటోగ్రాఫర్లు. ఈ ఫోటో తీసేటప్పుడు నా వెనక పెద్ద బెటాలియన్‌ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ వున్నారు. నాకు చోటు లేక ముందుకు వెళ్ళాల్సి వచ్చింది.


కొలరాడో రాష్ట్రం లోని ఆస్పిన్ అనే పట్టణం ప్రపంచం లోని స్కీయింగ్ ప్రియులను అమితంగా ఆకట్టుకునే అతి కొద్ది ప్రదేశాల్లో ఒక్కటి. ప్రతి హాలీవుడ్డు స్టారుకు, వాలువీధి (వాల్ స్ట్రీట్) వీరుడికి ఒక విడిది గృహం వుంటుంది ఇక్కడ. ధరలు కొంచెం ఘాటెక్కువ. ఓ మాదిరి ఇల్లు కొనాలంటే మినిమము మిలియను మదుపు చెయ్యాలి. ముదిరిన మిలియనోళ్ళు ఎక్కడెక్కడినుండో ఎగురుకుంటూ వచ్చి పగలంతా ఆయిసు ముక్కల మీద జారి రాత్రయితే వైను గ్లాసుల చేరి డాలర్లను కరిగించుకొని పోతారు. వాళ్ళు చలికాలం లో స్కీయింగు వెళితే నాలాంటి బడ్జెట్ బాబూ రావులు ఇలా ఆకులు రాలే కాలం లో వెళ్ళి పెన్నీలు కరిగించుకొని వస్తారు.మరూన్‌ బెల్స్


ఆస్పిన్ డెన్వర్ కు పశ్చిమాన 180 మైళ్ళ దూరం లో వుంటుంది. ఇక్కడ ఆస్పిన్ చెట్లు అధికంగా వుంటాయి. దారి మొత్తం దాదాపుగా ఘాట్ రోడ్డే. రోడ్డుకు రెండు వైపులూ కొండలు వుంటాయి. వెళ్ళాలంటే అంతర్రాష్ట్ర రహదారి I-70 తీసుకోవాలి. (అమెరికాలో తూర్పు పశ్చిమాలను కలుపుతూ వెళ్ళే రహదారి పేర్లు సరి సంఖ్యలు(I-40,I-70) గాను, ఉత్తర దక్షిణాలను కలుపుతూ వుంటే బేసి సంఖ్యలు(I-25,I-225) గానూ వ్యవహరిస్తారు ). ఈ కొండల్లోనుండి వెళ్ళడానికి 4 గంటలు పైనే తీసుకుంటుంది. ఒకే రోజులో వెళ్ళి రావాలంటే కాస్త ఒళ్ళు నొప్పులు తెచ్చే వ్యవహారమే. పిల్లా పీచు లేనప్పుడు రయ్యిమని వెళ్ళి వచ్చే వాళ్ళమే. ఇద్దరు బుడ్డోళ్ళున్నారని ఓ రోజు అక్కడే మకాం పెట్టాం. అబ్బో ఆస్పిన్ లోనే అని నోరు వెళ్ళ బెట్టుంటే జిప్పెట్టేయండి. ఆస్పిన్ లో వుందామని ఒక రోజు అద్దె ఎంతో తెలుసుకోవాలని హోటలోళ్ళకు ఫోను చేస్తే నా సంవత్సరం జీతం, 401K (పెన్షన్‌) డబ్బు అడగటం మొదలు పెట్టారు. కొంత మందయితే మా తాత ఎంత సంపాదించాడో అడిగారు. అసలే ఎకానమీ ఏడుకొండలవాడి నుదుటి మీద మూడు నామాలు చూపిస్తుంటే "గోవిందా..గోవిందా.." అని అరిచే శక్తి లేదని ఆస్పిన్ పక్కనే 8 మైళ్ళ దూరం లో వున్న స్నోమాస్ పల్లె (విలేజ్) లో రూము తీసుకున్నాం. వీడు సగం నెల జీతమే అడిగాడు. ఉదార స్వభావుడు.నీళ్ళలో మరూన్‌ బెల్స్ అందాలు


ఆసలెందుకు ఆస్పిన్ వెళ్ళటం అని చెప్పలేదు కదూ. ఫోటోలు చూసేశారు కదా మళ్ళీ ఉపోద్ఘాతమెందుకు అని చెప్పలేదు. ఈ సమయం లోనే చెట్ల ఆకులు రాలుతాయి. ఆకులు ఆకు పచ్చ రంగు నుండి పసుపు రంగులోకి, కొన్ని ఎరుపు రంగులోకి మారు తాయి. కొండల మీదనున్న చిన్న పొదలు వివిధ రంగుల్లో వుండి కొండకు రంగులద్దినట్లు వుంటుంది. అది చూడ్డానికి శోభాయ మానంగా వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రకృతి దృశ్యాలను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక్కసారి అనుభవించాల్సిందే. కారు నడిపే డ్రైవరు ఈ అందాలను చూడాలంటే ఇంకో డ్రైవరును చూసుకోవాలి.

స్నేమాస్ పల్లె అంతా ఎగుడు దిగుడుల మయం. ఎక్కడన్నా కారు బ్రేక్ మీద కాలు తీసామంటే నేరు గా కిందకెళ్ళిపోతాం. ఈ ఊర్ని చూస్తే నాకు తిరుమలే గుర్తొచ్చింది. అక్కడ హోటెల్ పేర్లను అంజనాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి అని పేరు పెట్టుకొని పిలుచుకున్నా. మేము శేషాద్రి కాటేజ్ లో వున్నాం. అంటే స్టోన్‌ బ్రిడ్జ్ ఇన్‌ లో వున్నాం. అక్కడ షాపులోని ఏ వస్తువును తాకాలన్నా షాక్ ప్రూఫ్ గ్లోవ్స్ వేసుకొని ముట్టుకోవాలి. బొమ్మలంగళ్ళు కనిపించినప్పుడల్లా బుడ్డోళ్ళని ఆకాశం లో చుక్కలు లెక్కపెట్టమనే వాళ్ళం. ఒక్క "శ్రీ.. శ్రీనివాసం.. శ్రీ వేంకటేశం.." అని పాట వినబడలేదు గానీ ధరలు మాత్రం అలానే వున్నాయి.ఊరేదైతేనేమి రాతలు ఒకటే


వెళ్ళిన రెండో రోజుకల్లా అన్నానికి మొహం వాచిపోయి ఏదీ లేక ఓ థాయ్ రెస్టారెంటుకు వెళ్ళాం. బుడ్డోడు ఆరంజ్ చికెనూ, మా ఆవిడ చికెన్ నూడుల్సూ చెబితే, వెరైటీ ఈజ్ స్పైస్ ఆఫ్ లైఫ్ అని ఏదో "కాన్యన్ క్రీక్ చికెన్" అని పేరుంటే అది ఆర్డరిచ్చా. (కాన్యన్ క్రీక్ అన్నది అక్కడ వున్న ఒక ప్రదేశం పేరు). నా కాన్యన్ క్రీక్ చికెన్ వచ్చాక ప్లేటు చూసి సొంతం సినిమాలో హోటల్ లో కొత్త వంటకం ఆర్డరిచ్చిన సునీల్ గుర్తొచ్చాడు. 15 సెంటీమీటర్ల వ్యాసంతో వృత్తం చేసి, చుట్టు కొలతంతా పచ్చని పచ్చి బ్రాకోలితో గోల్ఫ్ కోర్సు లా డెకరేట్ చేసి మధ్యలో ఆవ గింజంత సైజున్న చికెన్ ముక్కలు పది పెట్టున్నాయి. అందులో మళ్ళీ అయిదు ముక్కలు క్యాప్సికం. రెండు ముక్కలు బెల్ పెప్పర్. కనుగుడ్ల నుండా ఉబికి వస్తున్న నీరును కార్గిల్ సైనికుడిలా చాకచక్యంగా ఎదుర్కొని చికెన్ ముక్కలను బబుల్ గమ్‌ లా ఆస్వాదించి వదిలేసిన బ్రాకోలీ కనిపించకుండా పేపర్ న్యాప్కిన్ తో కప్పెట్టేశా. అక్కడ వడ్డించిన థాయావిడ బహు మర్యాదస్తురాలు. భారతీయుల టేబుల్ దగ్గర చంద్ర బాబు మొహం తో , అమెరికనుల టేబుల్ దగ్గర వై.ఎస్. మొహం తో సంభాషించేది. ఇది చూసి చిర్రెత్తుకొచ్చి టిప్పు మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ కు రైళ్ళిచ్చినన్ని ఇచ్చా.ఎక్కడ చూసినా పసుపు మయం.


వైల్డు లైఫు కనిపిస్తుందేమోనని ఆశగా చూసిన మాకు ఒక బుల్లి పాము, రెండు సీతాకోక చిలకలు, బోలెడు ఉడుతలు, వై.ఎస్. ఆస్తిలో రూపాయలకు సమానంగా తేనెటీగలు కనిపించాయి.మరూన్‌ బెల్స్ సీతాకోక చిలుక


వచ్చేటప్పుడు ఓ చోట ఆగి అక్కడున్న అందాలను చూసి వస్తుంటే ఒక తేనెటీగ కారులో దూరింది. అది ఊరుకుంటే తేనెటీగ ఎందుకవుతుంది. వెళ్ళి పెద్ద బుడ్డోడు తింటున్న అరటి పండు పై వాలింది. ఇక వాడేమో బాంబు పేలుళ్ళ తరువాత అద్వానీ అరిచినట్లు అరిచాడు. అసలే రైలింగు కూడా లేని ఒక లేన్‌ రోడ్డు. ఆపాలంటే లోయలోకి డైవ్ కొట్టి ఆపాలి. నాకయితే ఇప్పట్లో డైవ్ చెయ్యాలనే ఆలోచనలు లేవు. అప్పటికే అది కొంచెం అరటి పండు కొరికి వుందేమో వీడి అరుపులకు భయపడి నిద్ర పోతున్న చిన్న బుడ్డోడి కారు సీటు వెనక్కెళ్ళి పార్కింగ్ చేసింది. కాస్త దూరమెళ్ళాక కర్బ్ చూసుకొని ఆపి తలుపులు తెరిచి నీ స్టాపొచ్చింది దిగెయ్యమ్మా అనగానే దిగి వెళ్ళిపోయింది.

ఆస్పిన్‌ లో అదృష్టం :
నేనెక్కడికెళ్ళినా నా ఇష్ట దైవం అదృష్ట దేవత నా వెంటే వుంటుంది. ఈ అమెరికా నగరాల లోని రోడ్లన్నీ పారలల్, పర్పెండుకులర్ అని స్కేలు పెట్టి మరీ కడతారు. అందులో మళ్ళీ వన్‌వేలు. మనమెళ్ళాల్సిన చోటెప్పుడూ వన్‌వేకు వ్యతిరేక దిశలో వుంటుంది. పార్కింగు చెయ్యడానికి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా స్థలం లేక ఒక చోట వామ పాదం పెట్టేంత జాగా వుంటే అక్కడ పెట్టేసి తరువాత వచ్చి చూద్దునుకదా. డ్రైవరు డోరు దగ్గర తెలుగు దేశం పార్టీ అప్లికేషన్‌ ఫాములా పచ్చగా తళతళ లాడిపోతూ టికెట్ యభై డాలర్లకు. తీసి చదివితే " నువ్వు ఇంటర్ సెక్షన్‌ కు 20 అడుగుల దూరములో, స్టాపు సైనుకు ముప్పై అడుగుల దూరములో పార్కు చేసి వుంటివి. అది నా కంటబడినది. నీ చెక్కు పై చెవ్రాలు పెట్టి ఈ కింద చిరునామాకు బట్వాడా చేయుము".మరూన్‌ బెల్స్: బాల కౌబాయ్

ఇలాంటి ప్రదేశాలకు వెళితే నేను తీసుకునే ఫోటోలకు కాప్షన్‌లు ఇలా వుండేవి.
1. కొండ కింద నేను
2. కొండ పైన నేను
3. కొండ పక్కన నేను
4. కొండ మధ్యలో నేను
5. కొండ లోపల నేను
6. కొండ పిండుతూ నేను

ప్రదేశం మారితే కొండ బదులు బండో, చెట్టు ఖాండమో వుండేవి. ఇప్పుడు కొండ పక్కన నేను అని చెప్పుకోడానికి ఫోటోలు వుండట్లేదు.
1. బుడ్డోన్నెత్తుకొని నేను
2. బుడ్డోణ్ణి దించుతూ నేను
3. బుడ్డోణ్ణి సముదాయిస్తూ నేను
4. బుడ్డోడితో గిల్లించుకుంటూ నేను
5. బుడ్డోడితో తన్నించుకుంటూ నేను
6. బుడ్డోడు ముక్కు పిండుతుంటే నేను
.... ఇంకా చాలా నేనులు ప్లస్ ఇద్దరు బుడ్డోళ్ళు.విహారి సోదరుల కేరింతలు : సుహాస్ విహారి, రుషీల్ విహారి


ఆస్పిన్ లో తీసిన 380+ చాయాచిత్రాల్లో మరి కొన్నింటిని ఇక్కడ చూడ వచ్చు.

Aspen


* * * * * * * *

Friday, September 12, 2008

నన్నొగ్గెయ్యండి

నా కొత్త టపా, ఏ ప్రాజెక్టు బిడ్డింగులో ఎంతమంది పాల్గొన్నా చివరికి కాంగ్రేస్ సపోర్టర్ కే దక్కినట్టు, కూడలి లో పైన కనిపిస్తోంది. దానికి కారణం నేను చేసిన చిన్న తప్పిదం. అంతే కానీ కాంగ్రేసు పార్టీ లో చేరినట్టు కాదు. భారత కాల మానాన్ని అందుకొనే ప్రయత్నము లో ప్రచురించే సమయం 10 గంటలకు 12 కలపబోయి 10 తేదీని 12 వ తేదీ చేశా. అదే ఇప్పుడు కూడలి లో కపి రాజు లా రెప రెప లాడ్డానికి కారణం. ఇలా కనిపించినందుకు ఇప్పటికే మీరు నన్ను చాలా సార్లు(=కూడలికి వచ్చినన్ని సార్లు) శపించి వుంటారు కదా. మీరు నన్ను క్షమిస్తే శాపాలు పెట్టిన వాళ్ళందరూ మునిపుంగవులని, దైవ భక్తులని, మహా మహిమాన్వితులని భావిస్తాను. మీరు ఈ వర్గాలు నచ్చని వాళ్ళయితే మథర్ తెరెస్సా, మార్టిన్‌ లూథర్ కింగు, రాబిన్‌‌ హుడ్ అంతటి వరని గౌరవిస్తాను.

బ్లాగు బద్దమైన హెచ్చరిక: ఈ టెక్నిక్కు ను మళ్ళీ ఎవరైనా ప్రయత్నిస్తే అది పనిచేయదు. పైపెచ్చు మీ టపా పాతాళానికి వెళ్ళిపోతుంది.(కూడలోళ్ళకి తెలిసిపోయింది)

రాకీ పర్వత శ్రేణుల్లో హిందూ కుటుంబ శిబిరం.

* * * * * * * *హిందు జగేతో.... విశ్వ జగె

జై జై గీత భగవద్గీతవంటి నినాదాలతో శాంట మరియా క్యాంపు మారుమ్రోగింది. చాన్నాళ్ళ తరువాత ఎప్పటి వెప్పటివో తీపు గుర్తులు, ఉద్విగ్న క్షణాలు గుర్తుకు వచ్చాయి ఆ మూడు రోజులూ.

హెచ్.ఎస్.ఎస్., అమెరికా (హిందూ స్వయం సేవక్ సంఘ్) కొలరాడో విభాగం వారు ఆగస్టు 29-31 తేదీలలో హిందూ కుటుంబ శిబిరాన్ని నిర్వహించారు. డాదాపు ప్రతి సంవత్సరమూ జరిగే ఈ కుటుంబ శిబిరంలో ఈ సారి 45 కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ప్రవేశ రుసుము కట్టేస్తే మనము చెయ్యాల్సిన పనల్లా వాళ్ళు నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొని వాళ్ళు పెట్టే విందు భోజనాన్ని లాగించెయ్యడమే.

ఈ క్యాంపు (YMCA శాంట మారియా) డెన్వర్ కు తూర్పు దిశలో 60 మైళ్ళ దూరాన పచ్చని స్ప్రూస్, ఆస్పిన్ చెట్ల మధ్య ప్లాటె నదీ తీరాన వుంది. ఇక్కడికి సాయంత్రం 5 గంటలకే చేరుకోవాలని చెప్పడం వల్ల కార్యాలయానికి నాలుగు గంటలకే పెద్ద గంట కొట్టేసి ఇంటి నుండి 6 గంటలకు బయలు దేరాము. కొంత మంది తో కలిసి ర్యాలీ లాగా వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు. గమ్యానికి ఇరవై మైళ్ళ దూరంలో మా పర్మిషన్‌ లేకుండానే పెద్ద ర్యాలీ మొదలయింది కొన్ని వేల కార్లతో. ఆ ర్యాలీకి కారణం పెద్ద ట్రక్కు మామ. మామూలుగా పార్కు చేస్తే బాగోదని రోడ్డు మీద డై హార్డు బ్రూసు విల్లీసు లా పల్టీ కొట్టి అడ్డం తిప్పి సరదాగా పార్కు చేశాడు. ఎప్పుడో మధ్యాహ్నం 2:30 జరిగిన ఈ సరదా పార్కింగు రాత్రి ఎనిమిది గంటలకు కానీ క్లియర్ అవలేదు. ట్రక్కు మామ కే అంత సరదా వుంటే మాకు లేదా అని మేము కూడా కార్లు రోడ్డు మీద పార్కు చేసి "చెమ్మ చెక్కా చారడేసి మొగ్గ.." అని పాటలు పాడేశాం.

రాత్రి ఎనిమిదింటికి క్యాంపుసైటు కెళ్ళి "వచ్చేశామోచ్" అని అరవగానే ఇంటిల్లి పాదికీ డయపర్ బుడ్డోడితో సహా ఓ బ్యాడ్జి పెట్టి కొక్కీలేసేశారు. మా పేర్లున్న బ్యాడ్జి తిప్పి చూసుకుంటే ఆ మూడు రోజులు (రెండు రాత్రులు)మేముండాల్సిన క్యాబిన్ పేర్లు రాసున్నాయి. ఒక్కొకళ్ళు ఒక చోట. అవి చూసి ఆహా మా ఆవిడ పోరు లేదు.. మా ఆవిడ బెడ్డు ఈ రోజు సర్దక్కర లేదు అని మగాళ్ళందరూ చీర్సు చెప్పుకుంటూ బీరుంటే బావుందేది కదా అని బాద పడుతుండగా "తాజ్ మహల్ టీ, పార్లె-జి బిస్కత్తులు" అని అరిచారెవరో. లగెత్తుకెళ్ళి అవి లాగించి కూచున్నామో లేదో శాఖ జరుగుతోంది రండంటూ ఒక హాల్లోకి తీసుకెళ్ళారు.

ఆ హాల్లో, ఆ తరువాతి రెండు రోజులు ఏమి చెయ్యాలో చెప్పారు. ఏమేమి చెప్పారో గుర్తు లేదు గానీ పొద్దున ఆరింటికే లేవాలి అన్నది మాత్రం గుర్తుండి పోయింది. ఎందుకంటే జీవితం లో అత్యంత కష్టమైన పని పొద్దున 6 గంటలకు లేవడం. నయగరా జలపాతం లో దూకి ఆ జలపాత ధార ని పట్టుకొని పైకి పాకి రమ్మంటే వస్తా గానీ పొద్దున లేవడం అనేది..కష్టం.. కష్టం.. చాలా సార్లు. బాల గణ, స్త్రీ గణ, పురుష గణ అని వర్గాలు చేశారు. ఎప్పుడూ లైన్లో వుండవలసిందే. నేను ఇంత వరకు ఆర్.ఎస్.ఎస్., వి.హెచ్.పి. లాంటి వాటిలో కాలు, వేలే కాదు కన్ను కూడా పెట్టలేదు. అర్.ఎస్.యు. (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్) లో తల పెట్టే అవకాశం తప్పిపోయింది. అలాంటి నాకు ఈ కార్యక్రమాలు కొత్తగా, ఉత్సాహంగా అనిపించాయి.

ఈ క్యాంపు సైటు గురించి:

మొత్తం ఎనిమిది క్యాబిన్‌లు. ఒక చోటే అందరికీ భోజనాలు. సమావేశాలు జరుపుకోడానికి ఒక పెద్ద హాలు (సెయింట్ పాల్ హాలు). ఆడుకోడానికి చాలా పెద్ద స్థలం. పక్కనే ప్లాటే నది. ప్లాటే నది దాటగానే మరికొంత ఆట స్థలము, క్యాంపు ఫైర్ వేసుకునే చోటు. బోలెడంత పార్కింగు స్థలము. ఒక్క క్యాబిన్‌కు మాత్రం అతుక్కొన్న బాత్రూములు. మిగతా వాటికి విసిరేయ బడ్డ బాత్రూములు. అంటే దూరంగా వున్నవి అని అర్థం. ఈ క్యాబిన్‌లు కూడా ఒకదానికొకటి కనిపించవు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. అర్ధ రాత్రయినా అపరాత్రయినా ఆ చెట్లూ,పుట్టలూ దాటుకొని బాత్రూముకు వెళ్ళాల్సిందే. హైలైటెంటే దార్లో లైట్లుండవు. ఎలుగు బంట్లూ పాడూ కనిపిస్తే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ ఫ్రీ. పేరుకు ఎండాకాలమైనా చలి కాలం లా ఉష్ణోగ్రతలు పడి పోయాయి. ఈ క్యాంపు సైటు మొత్తం హిందూ ఫ్యామిలీ క్యాంపుకే బుక్ చేశారు.

క్రమ శిక్షణ..క్రమ శిక్షణ ఆల్ ద వే:

హెచ్.ఎస్.ఎస్. అంటే క్రమశిక్షణ కు మారు పేరు. సాయంత్రం పదింటికి నిద్ర పొమ్మని కంటి రెప్పలు కుట్టేస్తారు. పొద్దున ఆరింటికి వచ్చి మళ్ళీ కుట్లు విప్పి చెవిలో పీక ఊది నిద్ర లేపేస్తారు. భోజనానికి సమయమయిందంటే తీసుకెళ్ళి నోట్లో అన్నం పెట్టేస్తారు. ఇంక ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎలా జరుగుతాయో చెప్పనక్కరలేదు.

వెళ్ళిన రోజు మొదలయిన శాఖ మూడోరోజు మధ్యాహ్నానికి గానీ ముగియలేదు. రెండో రోజు సాయంత్రం క్యాంప్ ఫైర్ వేశారు. అక్కడ అందరూ పిల్లా పాపల్తో పాటలు పాడుకొన్నారు. మూడోరోజు కొండ మీదికి ట్రెక్కింగ్ వెళ్ళారు అందరూ. నేను వెళ్ళ లేదు. ఎందుకూ అంటే కొన్ని రహస్యాలు చెప్పకూడదు. కడుపు కట్ చేస్తే కాళ్ళ మీద పడుతుంది. అది బేబీ సిటింగ్ అని ఎవరికైనా అనుమానమొస్తే నేను చెప్పినట్లు కాదు. మీ తెలివి తేటలే. అద్దం ముందుకెళ్ళీ నిలబడి టోపీలు తీసేసుకోండి.

నా హిందీ:

ఓ సారి ఆటలు ఆడేటప్పుడు లైన్‌లో నుంచుని హిందీలో నంబర్లు చెప్పమన్నారు. నాకు హిందీ లో అంకెలు పాంచ్ దాటి చెప్పే పంచ్ లేదు. బాయ్ నయినా టాయ్ లా అన్న చిరంజీవి స్పీచ్ లా బిక్కు బిక్కు మంటూ నా ముందెంతమందున్నారో అని తెలుగు లో లెక్కేసుకున్నా. ఒకటి, రెండు, మూడు, నాలుగు.. అంతే. బతికి పోయా. పాంచ్ అయిదు..పాంచ్ అయిదు..అని వల్లె వేసుకొంటూ వుండగా నా నంబరు చెప్పమన్నారు. వెంటనే పాంచయిదు అని చెప్పేశా. ఏవరో చప్పట్లు కొట్టిన శబ్దం వినిపించింది వెంటనే. ఆవి కొట్టిన చేతులు మా ఆవిడవి , మా ఆవిడ ఒళ్ళో వున్న చిన్న బుడ్డోడివి. ఇంకొన్ని ఆటల్లో రెండు టీములు చెయ్యడానికి ఏక్, దో అని చెప్పమనే వాళ్ళు. అక్కడయితే కేకు నడకే. శాఖ జరిగేటప్పుడు సావధాన్, విశ్రామ్‌ అనే బదులు అదేదో ఆశిష్ట, వశిష్ట అన్నారు. అప్పుడైతే పుష్పక విమానంలో కమల్ హాసన్ ని మించిపోయా. తప్పు చేస్తే కర్ర తో కొడతారేమో నని లైను చివర్లో నిలబడే వాడిని.

ఆటలు..ఆటలు..:

ఆడే ఏ ఆటయినా రామాయణ భారతాలతో సంబంధం లేకుండా వుండదు. ఖో..ఖో బదులు, రాంఖో, లక్ష్మణ్ ఖో అనే వాళ్ళు.
రామ్‌ రావణ్ ఆట భలె వుంది. ఓక వైపు రామ్‌ టీము, ఇంకో వైపు రావణ్ టీము వుంటుంది. మధ్యలో ఓ గీతుంటుంది. ఫ్రచారక్ లు రామాయణ కథ చెబుతుంటారు. కథలో రామ్‌ అనే పేరు రాగానే రామ్‌ టీము వాళ్ళు రావణ్ టీమును వాళ్ళు సరిహద్దులు దాటక ముందే అంటుకోవాలి (టచ్ చెయ్యాలి). ఎంత మంది అంటుకో బడ్డారో వాళ్ళందరూ రామ్‌ టీం లో కొచ్చెయ్యాలి. అలాగే రావణ్ పేరు వచ్చినప్పుడు వాళ్ళు రామ్‌ టీమును అంటుకోవాలి. ఈ ఆటలో నేను రామ్‌ టీములో వున్నా. మా టీము గెలిచింది.

ఇంకోటి చేనా గోడ ఆట. రెండు టీములు అటూ ఇటూ వుంటే విజిల్ వెయ్యగానే ఒక టీము వాళ్ళు అవతలి టీమును దాటాలి. టీములొ ఒక్కళ్ళు దాట గలిగినా ఆ టీము గెలుస్తుంది. ఈ గేము మేమే గెలిచాం.

ఇంకోటి ఏ టీముకాటీము వృత్తాకారం లో చేతులతో లంకెలేసుకొని నడుస్తూ అవతలి టీము వాళ్ళ లింకులు పడ గొట్టాలి. ఇందులో కూడా మా టీమే గెలిచిందని సగర్వంగా చెప్పుకుంటున్నాను.

ఇంకోటి మాస్ గేం. నాలుగు టీములు తయారు చేశారు. వేదాలు నాలుగు చోట్ల దాచబడ్డాయి. ఒక్కో వేదం ఒక్కో చోట. ఒకటి శ్రీనగర్ లో, ఇంకోటి కలకత్త లో , ఇంకోటి బాంబే లో, ఇంకోటి కన్యా కుమారిలో. అన్నీ తీసుకొని చివరిగా నాగ్ పూర్ చేరుకోవాలి.కొంత మంది వాలంటీర్లు భారత దేశం పటం లో లాగా ఒక్కో చోటుకు(నగరానికి) ప్రతినిధి గా నిలబడి వుంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అవును, కాదు అని మాత్రమే సమాధానం చెబుతారు. మీకు బచ్చన్‌ తెలుసా, బాలకృష్ణ తెలుసా, ఇడ్లీలు తింటారా, చెట్నీ వేసుకుంటారా అని రక రకాల విసిగించే ప్రశ్నలు వేసి సమాధానాన్ని తెలుసుకొని ఇంకో దిక్కువైపుకు పకడ్బందీ గా వెళ్ళాలి. అలా అన్ని ప్రదేశాల్ని కనిపెట్టి అక్కడి వేదాల్ని తీసుకొని వాళ్ళిచ్చిన ఆ వేదాల్లోని కొన్ని శ్లోకాల్ని అక్కడే చదివి ఇంకో చోటుకి పరుగులు పెట్టాలి. వేదాలు చేతికి రావాలంటే మొత్తం టీమంతా అక్కడే వుండాలి. లెక్క పెట్టుకోని అందరూ వుంటే ఇస్తారు లేకుంటే లేదు. తొందరగా చేరాలని పరుగులు పెట్టి అన్నీ పూర్తి చేసుకోని చివరి మజిలీ హెడ్ క్యార్టర్సు నాగ్ పూర్ చేరుదామనుకుంటుంటే మా టీములో నున్న పెద్ద బుడ్డోడు నేను పరుగెత్తలేనని క్యాస్టింగేసిన చెయ్యి కూడా కలిపి చేతులు బారుగా పైకెత్తేశాడు. ఆంతకు ముందు వారమే మంకీ బార్ లోనుంచి తోసివేయబడి చెయ్యి ఫ్రాక్చర్ చేసుకొన్నాడు.ఇక వాడిని, వాడి క్యాస్టింగును భుజాల కెత్తుకోని పాము పూర్ చేరుకొని కప్పు కొట్టేశాం. ఎందుకంటే అప్పటికే విజయాలకు అలవాటు పడి పోయాం కదా.

శాఖ జరిగేటప్పుడు ఓ గ్రూపు డిస్కషన్ కూడా పెట్టారు. టాపిక్ ఏమో "What is hindu family means to you in America". ఇందులో మూడు టీములు గంగ, యమున , సరస్వతి అని. చాలా విలువైన విషయాలు చర్చించ బడ్డాయి. హిందూ ఫ్యామిలీ అంటే హిందూ సంస్కృతిని ప్రతిబింబ చేయడమని, పిల్లలకు గీత భోదించడమని, వసుదైక కుటుంబమని, అన్య మతస్తులను గౌరవించడమని.. ఇలా చాలా అర్థవంతమైన విషయాలు మాట్లాడుకోబడ్డాయి. ఇందులో గంగ టీము గెలిచింది. నేను గంగ టీములో లేను. ఇందాకా తీసేసిన టొపీ నెత్తి మీద బోర్లించుకోండి. మిమ్మల్ని డిసపాయింట్ చేసినందుకు బాధ పడుతున్నాను. కప్పులు తీసుకోవడం చిరాకు పుట్టి ఈ సారి వాళ్ళకు ప్రసాదించేశాం. ఇది నా దాతృత్వం అనుకుంటే మళ్ళీ అద్దం ముందుకెళ్ళి టోపీ తీసెయ్యండి. మళ్ళీ పెట్టుకునే అవసరం లేదు.

ఈ గ్రూపు డిస్కషన్ ని జయసింహ గారు తన హాస్యపు చణుకులతో ఆసక్తి కరంగా నిర్వహించారు.

నలుగురు తల్లులు, నలుగురు తండ్రులు కంగారు పడ్డ వేళ:

రెండో రోజు మధ్యాహ్నం ఒక వైపు శాఖ నడుస్తోంది. ఇంకో వైపు బాలగణ వాళ్ళ ఆట పాటల్లో మునిగి పోయారు. నాలుగు తెలుగు కుటుంబాలకు చెందిన 5 మంది పిల్లలు అదృశ్యం. ఆట స్థలం లో లేరు. శాఖ దగ్గర లేరు. బాలగణ వున్న చోట లేరు. ఇక ఆ నది వెంట పరుగులు, చెట్ల కిందకు ఉరుకులు. చివరిగా క్యాబిన్‌ ల వైపు వెళ్ళి వెదికారు. ఓ క్యాబిన్ లో ఈ అయిదు మంది పిల్ల పిడుగులు కూచోని క్రాక్ జాక్ బిస్కట్లు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.ఎవరి పిల్లల్ని వాళ్ళు కళ్ళతో కాల్చేసారు.నేను కళ్ళతో కాల్చలేదు ఎందుకంటే మా వాడి క్యాస్టింగు ఊడొస్తుందని.

* * * * * * * *


క్యాంపులో 'ఖండ ముదురు':

ఈ క్యాంపులో రెండేళ్ళు కూడ నిండని బుడ్డోడొకడు శాఖ లో వున్నప్పుడు ధ్యానం లో వున్నప్పుడు ప్రతి ఒక్కర్నీ కొట్టి పలకరిస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడ్డం ఒక తంతు. పాదరసం మింగినోడి లా ఎక్కడ బడితే అక్కడికి పరుగులు పెట్టేవాడు. రెండు మూడెళ్ళున్న పిల్లలు వాళ్ళ తల్లులతోనే వుండేవాళ్ళు. నాన్నలతో కూడా వుండచ్చు. అలాంటి నాన్నలు నాకు కనిపించలేదు. చాలా మంది తెలుగు నాన్నలు వున్నారు. ఈ పిల్లా పీచూ క్యాబిన్ లో వున్న బుడ్డోడు పడుకుంటే అందరూ పడుకున్నట్టే వాడు. లేస్తే అందరూ లేచినట్లే. రోజూ పొద్దున్నా 6 గంటలకు హెచ్.ఎస్.ఎస్. వాలంటీర్లు పీకలు పట్టుకొని క్యాబైన్ ల దగ్గరకొచ్చి ఊదేవాళ్ళు అని చెప్పాగా. పీక ఊది తాయిలాల పేరు చెబుతూ "చాయ్..కాపీ తయార్..ఉటో..ఉటో.." అని అరిచేవారు. ఒక్కో చోట చాలా కష్టపడే వాళ్ళు లేపడానికి. ఈ బుడ్డోడి క్యాబిన్ దగ్గర వీళ్ళకు చాలా టైం సేవ్ అయ్యేది. వచ్చి వీడిని మాత్రం లేపేవాళ్ళు. వాడేమో పెద్ద చిన్న తేడా లేకుండా అందర్నీ "గో..గో..” అని జుట్టు పట్టుకుని లేపేసే వాడు.

సంతూర్ సబ్బు:

చివరి రోజు ట్రెక్కింగ్, ఒకటిన్నర మైలు దూరం కొండ ఎక్కుతున్నారు. దేశ భక్తి గీతాలు, రామాయణ భక్తి గీతాలు పాడుకుంటూ ఉత్సాహంగా వున్నారు. మా పుత్తూరు కట్టు క్యాస్టింగు కూడా ఎక్కేసింది. ఈ ట్రెక్కింగులో ఓ అరవై ఏళ్ళ ఆవిడ కూడా పాల్గొంది. ఈ తెలుగు ముసలావిడ కొన్ని చోట్ల నడవలేక పోతే ఇద్దరు బుడ్డోళ్ళున్న ఒకావిడ సహాయం చేసింది చేతులు పట్టుకొని. అప్పుడు జరిగిన సంభాషణ.

"నువ్వు చాలా ముచ్చటగా వున్నావమ్మా"
"హీ.. హీ.. థ్యాంక్స్"
"నువ్వేకాలేజీ లో చదువుతున్నావమ్మా?"
"నేనేమీ చదవడం లేదండి"
"నీకు మంచి మొగుడు దొరుకుతాడమ్మా"

జెజ్జినక..హా.. జెజ్జినక..హా..జెజ్జినక...జెజ్జినక

ఇప్పుడు ఈ చిన్నావిడ ఈ క్యాంపును ఎంత కాలం గుర్తు పెట్టుకుంటుంది?

అ) రెండేళ్ళు
ఆ) పదేళ్ళు
ఇ) జీవితాంతం

* * * * * * * *


ఇప్పుడు అక్కడికెళ్ళొచిన బుడ్డోళ్ళని పలకరించి "వన్ టూ..వన్ టూ.." అంటే "వుయ్ ఆర్ హిందూ .."అంటారు. అంతే కాదు..బోలెడన్ని 'నార'లు చెబుతారు.

జై జై మాత...భారతమాత
జై జై గీత... భగవద్గీత
జై భవాని..వీర్ శీవాజి

అక్కడికి ముఖ్య అతిధి గా కాలిఫోర్నియా నుండి వచ్చిన తెలుగు వాడైన జయసింహ గారు చెప్పిన సందేశాల్లో నాకు నచ్చిన కొటేషన్.

"Repeated actions are hobbies, repeated hobbies are character"

మనవి: ఫోటోలు లేవా? అని అడక్కండి. వెళ్ళడమైతే డిజిటల్ ఎస్సెల్లార్ తో పాటు రెండు లెన్సులు కూడా తీసుకెళ్ళా. ఒక్కో సారి కడుపు కట్ చేసుకోకూడదు అంతే.

* * * * * * * *


కొన్ని 'మై'లు స్టోన్‌ లు:
ఈ బ్లాగుకు హిట్లు: 50,000+
యునీక్ హిట్లు: 28,000+
కామెంట్లు : 1000+
'సబ్బు' స్క్రైబర్లు: 84

మొదటి 10,000 చేరుకోడానికి రాసిన టపాలు :100
తరువాతి 18,000 చేరుకోడానికి రాసిన టపాలు :64

మీ ఆదరాభిమానాలకు నా హృదయపూర్వక వందనాలు.
వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న పాఠకదేవుళ్ళకు నమోన్నమః (ఎన్టీఆర్ స్టయిల్).

కూడలికి ప్రత్యేక కృతజ్ఞతలు.


* * * * * * * *

Wednesday, August 27, 2008

ఆ రెండు 'పుండు' పత్రికలు - మా మెండు 'దిండు' పత్రిక


పార్టీ పేరు బానే వుంది కానీ 'ప్రజ' బాగా అతుకున్నేట్టు చూడు. మిగతా పార్టీల్లో అది లేకనే నీ అవసరం వచ్చింది

:::::::::::::::

:::::::::::::::
టి.డి.పి. లో నుండి వలసలకు గుర్తుగా పసుపు రంగు పెట్టడం బాగానే వుంది బావా.

:::::::::::::::

Tuesday, August 26, 2008

బ్లాగు వ్యాసం అల్లరా లేక బ్లాగు వ్యాసంతో అల్లరా?

బ్లాగుకి టపాకి మధ్య అనుసంధానమైంది ఈ బ్లాగు

* * * * * * * *

రండి బాబూ...రండి.
కాయ్ రాజా కాయ్..
మాడి పోయిన బుర్రలు వెలుగుతాయి బాబు..
వీడి పోయిన మనసులు కలిసి పోతాయ్ బాబూ..
ఒక్క లుక్కు వేసుకోండి బాబూ..
ఒక్క క్లిక్కు పది పేజీల టపా బాబూ..
కాయ్ రాజా కాయ్..
రండి బాబూ రండి....

హమ్మయ్యా వచ్చేశారా.
ఈ జాతర్లో పాటలేంటంటారా? ఒక్కో సారంతే. కొన్ని సంవత్సరాల తరువాత బ్లాగులకు కాప్షన్‌ లు ఇలానే వుంటాయ్.అదే నా అవుడియా. ఎవరికీ పుట్టదు, తట్టదు, కలగదు, వెలగదు, రాదు, లేదు.

ఇప్పుడు విషయం లో కొద్దాం. ఈ విషయం చదివిన తరువాత ఈ ఉపోధ్ఘాతం మతలబు మర్చి పోదాం.

* * * * * * * *


ఈ సారి బ్లాగు వ్యాసం 'అల్లరి' అంటే ఎవరో ఒకర్ని బకరా చెయ్యడం లేదా తామే అల్లరయి బకరా అవడం. అలాంటి దేమన్నా రాద్దామనుకుంటూ వుంటే నేను అల్రెడీ రాసేసినానని అర్థమయింది. ఇందులో నేను ఒక బకరా అనుకుంటే పోలా. బోల్డంత సానుభూతి కూడా. కానీ నాకు తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో నచ్చని ఒకే ఒక పదం సానుభూతి. మీరు ట్యాగ్ లైన్లకు అలవాటు పడి పోయుంటే ట్యాగ్ లైన్‌ 'సంస్కృతంలో కూడా'. అదే "నా ఏడో తరగతి మొట్టికాయలు".

నేను మీ ఎదురుగా నిలబడి మాయలోడు సినిమాలో ఆలీ లా నాలుక బయట పెట్టి వె.. వ్వె.. వ్వె అన్నట్లుందా. అదంతా హాలూసినేషన్ నమ్మకండి. మీ చెవుల్లో హాట్ హాట్ స్టీమ్‌ ఇంజెను కూ..చుక్..చుక్.. అనుకుంటూ రౌండ్లేసుకుంటూ,మీ శరీరం లో రక్తం కుత కుత లాడుతూ స్ప్రింటరు ఉస్సేన్‌ బోల్ట్ లా పరుగులు పెడుతూ దొరికితే నా బోల్టూ నట్టూ రెండంకెలు లెక్క పెట్టే లోపల పీకెయ్యాలనిపిస్తే అది నా హాలూసినేషన్‌. నేను కూడా నమ్మను. ఈ హెడ్డింగ్ చూసి ఇంతవరకు చదివారంటే నా మీద మీకు టి.వి. మీద రీమోట్ కున్నంత, కంప్యూటర్ మీద మౌసు కున్నంత అభిమాన ముందని అర్థం.

ఈ టాపిక్ వచ్చింది కదా ఏదైనా వెరైటీ గా రాద్దాం అని ధారపుండ చేత్తో పట్టుకొని బుర్రకు తకిధిమి తాళం వేస్తుంటే ఒక కొస చేతిలో వుండిపోయి ధారపుండ జ్ఞాపకాల సుడిగుండం లో పడిపోయింది. అప్పుడే బుడ్డోడు "ఉరే! మట్టి నాన్నా! నా గాలీ పటం దారం పోయిందిరో " అని పక్కిల్లు, ఎదురిల్లు, వెనకిల్లు ఎగిరి పోయేట్టు ఏడుపులంకించుకున్నప్పుడు కానీ ఈ లోకం లోకి రాలేదు. కాసేపు ధారపు మధనం చేస్తే వణుకుతూ వడికిన ధారం బయటికొచ్చింది. సురులు అసురులు సాగర మధనం చేసినప్పుడు కామ ధేనువు, కాలకూట విషమూ, అమృతమూ ప్యాకేజీ డీల్ లా వచ్చినట్లు నాక్కూడా ఓ సంఘటన ధారపు పోగు చివరన కొబ్బరికాయకు పీచులా, కాంగ్రేసుకు న్యూక్లియార్ డీల్లా అతుక్కొని వచ్చింది. అదే ఈ టపా. దీన్ని అల్లరి కింద కానీ బకరా అనే దృష్టితో కానీ చూడకండి. కొంచెం సీరియస్ టపా.(అని రాసేప్పుడు అనుకున్నా కానీ రాసిన తరువాత అలా అనిపించలా. ప్చ్...కొన్ని సార్లు లైఫ్ బాయ్ సబ్బు, గ్రైప్ వాటరూ, వై.ఎస్. నవ్వూ, చంద్ర బాబు రెండు వేళ్ళూ, చిరంజీవి చారిత్రాత్మక తప్పిదం, నేనూ అంతే.)

:::::::::::::::


ఊరు: రాయలసీమ లో ఓ చిన్న పట్టణం.
సమయం: కాలేజీ కుర్రోళ్ళు మెస్ లో మధ్యాహ్నం మత్తొచ్చే మజ్జిగన్నం మూడు కుంభాలు లాగించి ఆ తరువాత కదళీ ఫలాన్ని కదనోత్సాహంతో ఆరగించి భుక్తాయాసంతో ఉబ్బసం రోగిలా రూముకెళ్ళే సమయం.

పరీక్షలొస్తే మెస్సు భోజనమే. అలా ఓ సారి పరీక్షలొచ్చినప్పుడు వి.కె.మెహతా రాసిన పుస్తకం లోని మొదటి పేజీ లోని "ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజినీరింగ్ విచ్ డీల్స్ విద్ ద ఫ్లో ఆఫ్ ఎలక్రానిక్స్ త్రూ వాక్యూం ఆర్ ఏర్...." అనే ఎలక్ట్రానిక్స్ నిర్వచనాన్ని బట్టీ వేసి వేసి అట్ట నలిగి పోయి, మనసు అలసి పోయి, మెదడు కుళ్ళి పోయి, పేగులు అలసి పోయి మెస్సు కెళ్ళి భోంచేసి నడచి వస్తున్నా. అలా వచ్చేటప్పుడు మధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ వస్తున్నా. అలా చూస్తుంటే పంచ కట్టుకున్న ఓ యువకుడు (నా వయసే వుంటుందేమో) ఒకతను నా దగ్గర కొచ్చాడు.
"ఏంలే(ఏంరా) అట్లా జూస్తా వుండావు" అన్నాడు.
"నువ్వెవర్రా" నేను.
"నేనెవుడైతే నీకెందుకు గ్గానీ . ఎందుకు నువ్వట్లా ఎనక్కి దిరిగి సూస్తావుండావ్"
"నా ఇష్టం. నీకెందుకు చెప్పాల్ల"
"ఏ గల్లీ నీది"
"గల్లీనా. నా గల్లీ నీకెందుకురా "
అంతలోనే అక్కడ బంకు దగ్గరున్న నా క్లాస్ మేట్ ఇది చూసి వచ్చాడు. "అలే (అరేయ్). ఈ యబ్బి నా క్లాస్ మేటే. ఎందుకలే ఆపినావ్?"
"ఏం లేదలే ఈడు మాటి మాటికీ ఎనక్కి దిరిగి జూస్తాండాడు. మొన్న ఆ గల్లీలో వానితో గలాటా జరిగితే నా సంగతి జూస్తా అణ్యాడు. వాళ్ళోడేమో నని ఆపినా"
"అట్టాంటి దేమీ లేదు మన పిల్లోడేలే"
"అట్నా. అయితే మనోడే గదా. సారీ అప్పా"
"ఫరవాలేదులేప్పా!!!" నేను చెప్పా.

పైన నిజంగా జరిగిన సంభాషణ రాయటం కేవలం పరిస్థితులెలా వుంటాయో చెప్పడానికే కాదు భవిష్యత్తులో ఓ టపా రాయటానికి కూడా.
:::::::::::::::


మా రూములో(అది పెద్ద ఇల్లే. ఈ భూమ్మీద శత మర్కటాలుండే దేన్నయినా తెలుగు భాషలో రూమే అంటారు.) ఎప్పుడూ కనిష్టంగా ఓ ఆరు మంది వుండే వాళ్ళం. గరిష్టానికి లెక్కల్లేవ్. ఎప్పుడు ఎవడికి రూము కావాలన్నా రాజు గారి ధర్మసత్రం వున్నట్టు జోలె భుజానేసుకుని రూములో వాలి పోయే వాళ్ళు. వాళ్ళు ఎగిరిపోవడానికి రెక్కలు, ఈకలు సమకూర్చడం మా రూములో వాళ్ళ పని. మా కాలేజీ యాజమాన్యం వాళ్ళ సంస్థలన్నీ మా రూముకు దగ్గరే అక్కడే వుండేవి. అందులో ఓ జూ: కాలేజీ వుండేది. అందుకని ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణం లా వెలిగి పోయేది.నిత్య, కళ్యాణి, తార పేర్లు గుర్తు రాక పోతే మీరు కళా ప్రియులు, కళాభిమానులు, కళా పోషకులు కాదు. అలాంటి వాళ్ళు పాండు రంగడు సినిమా భోజనానికి ముందు ఇంటర్వెల్ వరకు, భోజనం తరువాత అశుభం వరకు రోజుకు రెండు సార్లు వరసగా ఏడు రోజులు లేదా వారం రోజులు అలా కాదంటే అట్ లీస్టు వన్‌‌ వీక్ ఐనా నిష్టా గరిష్టులై చూసి తరించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. కాలేజీ వదిలిన తరువాత "రామ చిలకలు", "పంచ దార చిలకలు", "సీతా కోక చిలకలు", "చిలిపి చిలకలు", "కొంటె చిలకలు" మా రూము ముందు నుండి వయ్యారంగా రెక్కలు విరుచుకుంటూ, వింజామర వీచికలా వెళ్ళేవి. అలా వుంటే ఇక మా కాలేజీలో క్లాసు అయిపోయిన ప్రతి జిడ్డు మొహమూ రూము తాళం చెవులు తీసుకొని ఇంటికొచ్చి పియర్సు సోపు అరగదీసి, ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబు చిదిమేసి, పాండ్స్ పౌడర్ డబ్బా తో మొహం మీద డబ్బా మధనం చేసి పౌడర్ వర్షం కురిపించుకొని ఇస్త్రీ చేసిన లాకోస్టే టి-చొక్క వేసుకొని ఇంటి ముందు గారడీ బొమ్మల్లా, హోం మినిస్టర్ లా నిలబడి వచ్చే పోయే "తళుకు తార"లను బెదర గొట్టే వాళ్ళు. అలా బెదర గొట్టబడిన వాళ్ళకు తొడలు కొట్టే అన్నయ్యలో, చిటికలేసే నాన్నలో వుంటే అదర గొడదామని మా రూముకు దండ యాత్రకొచ్చేవాళ్ళు. అలాంటి ఉద్రిక్త వాతావరణం వున్న రోజుల్లో దిండు కింద కత్తులు మెత్తగా పెట్టుకొని బజ్జోని, కాలేజీకి జేబులో న్యూట్రిన్‌ చాకులెట్టులు,సాక్సుల్లో నన్ చాకులెట్టుకొనీ, బుక్కుల్లో బాకులు భద్రపరుచుకుని వెళుతూ పూంచ్ సరిహద్దుల్లో వున్న వాళ్ళలా జీవించే వాళ్ళం.

ఉపమానాలు పలు రకాలు. ఇందాకా గాల్లో ఎగిరే చిలకలు చెప్పుకున్నాం కదా. అలాగే గాల్లో వేలాడే పళ్ళు బాధ పడకుండా వాటి గురించి కూడా చెప్పుకుందాము. ఎన్ని పళ్ళున్నా అందులో దొండ పండు, ద్రాక్ష పండు, ఆపిల్ పండు లాంటి కేటగిరీలు లేకపోతే రసాస్వాదన లేనట్టే. దొండ పండు లాంటి ముక్కు, ఆపిల్ పండు లాంటి బుగ్గలు, ద్రాక్ష పండు లాంటి సిగ్గులు వున్న ఒక అమ్మాయి కూడా వుండేది. ఆ అమ్మాయిని కొంత మంది 'బ్యూటీ క్వీన్' అనే వాళ్ళు, ఇంగ్లీషు అంతంత మాత్రమే వచ్చి Psychology అనమంటే 'పిస్కాలజీ' అనే నా లాంటి తెలుగు మీడియం ధీరాగ్రేసులు 'బూటీకీ' అనే వాళ్ళం. చాలా అడ్వాన్స్డ్ ఇంగ్లీషు తెలిసిన హిగ్గిన్‌ బోథాంసు గాళ్ళు అంటే అప్పటికే షేకవుతున్న స్పియరూ, అండూ ఆర్ కె నారాయణన్నూ బుక్కులు చదివినోళ్ళు మాత్రం 'బుటిక్' అనే వాళ్ళు. వీళ్ళతో మాకెప్పుడూ పడేది గాదు. భార్యా భర్తల్లా వుండే వాళ్ళం. అలా బూటీకీ ఇంటి ముందు నుండి పాసయి పోగానే పిట్ట గోడ మీదున్న అందరూ ఇండియన్ క్రికెట్ టీము క్రీజ్ నుండి పెవిలియన్ లోకి టీమ్‌ స్పిరిట్ తో వచ్చినట్టు రూములోకొచ్చి మసాలా టీ తాగి బాలేదని చెప్పి కప్పు కడక్కుండా వెళ్ళి పోయే వారు. ఈ బూటీకీ గురించి ఒక స్పెషల్ ఎపిసొడ్ రాయాలనుంది కానీ ఇప్పుడు రాస్తే మా ఆవిడ చూసే ప్రమాదముంది. మళ్ళీ జ్యోతక్క బ్లాగులో నా 99 వ జన్మ దిన శుభాకాంక్షలు చూసిన తరువాత రాస్తా. అంత వరకు దాన్ని అధికార రహస్యాల చట్టం కింద అట్టి పెడతా. 99 వరకు ఎవరన్నా బతుకుతారా అంటే ఇక్కడ మా ఊళ్ళోనే వున్న డాక్టర్ చేత చెప్పిస్తా. ఆయన ఆయుర్వేదిక్ మందులు వాడితే 120 గ్యారంటీ అంటున్నాడు. ఇంకా అనుమాన ముంటే వెళ్ళి భాషా ను అడగండి. ఆయన సంవత్సరానికి ఒక సారి హిమాలయాల కు వెళ్ళి వస్తాడు కదా ఎందుకనుకుంటున్నారు? స్కీయింగ్ కు అనుకుంటే వేడి చద్దన్నంలో నాలుక పెట్టి సర్రున కాల్చుకున్నట్లే. అక్కడ మూడు వందలు, నాలుగువందలు సంవత్సరాలు నిండి వున్న వారు చెట్లకు పుట్లకు వేలాడుతూ కనిపిస్తారట. అలా (వేలాడ్డానికి) నాక్కూడా పెద్ద ప్రణాళికుంది. అరవై దాటిన తరువాత అక్కడి కెళ్ళి ఎనభై దాటిన తరువాత తిరుపతి కి తిరిగొచ్చి అంటే తిరుమలకి తిరిగొచ్చి పేద్ద మల్టిప్లెక్సు ఆశ్రమం కట్టి అక్కడ ఏ.సి రూము నుండి అదేందది సామాజిక స్పృహ.. ఆఁ.. దాని గురించి కూడా బ్లాగుతా ఇప్పటి ట్రెండు ప్రకారం.

మంచు పల్లకి సినిమాలో పిట్ట గోడ మీద కూర్చున్న హీరోల్లా వున్న మా బాంగ్లా దేశ కాందిశీకుల శిబిరంలో ఓ సారి కలకలం బయలు దేరింది. కలలు కనే కసి వయసులో అలా కలకలానికి కారణమైంది బ్యూటీ క్వీన్ . ఎక్కడైనా కాలేజీ అబ్బాయిల్లో కలకలం బయలు దేరిందంటే ఏ అందమైన అమ్మాయో లేక అందంగా లేని అమ్మాయో అయుంటుందని అర్థమై పోతుంది. మరి దొండ, ద్రాక్ష, ఆపిల్ కాంబినేషన్‌ అమ్మాయుంటే ఏం జరగాలి? బొబ్బిలి యుద్ధమో, పాణి పట్టు యుద్ధమో, హాకీ యుద్ధమో జరగాలి. అలా అనుకునే వాళ్ళయితే రాంగోపాల వర్మ తీసిన 'ఫూంక్' సినిమాని అయిదు లక్షల కోసం ఒంటరిగా చూడ్డానికి అర్హులు కాదు. ఇక్కడే మూడు మార్కులు మైనస్. ఈ అతలాకుతల కల కలానికి కారణం 'బ్యూటీ క్వీన్' కాదు. సరే సస్పెన్సు వీడ గొడుతున్నా. ఓ రోజు ఎవడి చొక్కా జేబులోనో ఇరవై రూపాయలు మాయం. ఇంకో రోజు ఎవడిదో డొక్కొచ్చేంటీ వాచీ మాయం. ఇంకో రోజు నా జేబులో రెండు గాంధీ నోట్లు మాయం. చూస్తూ వుండగానే ఓ రోజు మూడు సైంటిఫిక్ క్యాలికులేటర్లు మాయం. అందరూ ఒకటే గగ్గోలు. మనలోనే ఎవడో దొంగ వెధవ వున్నాడు. వాడే ఈ పని చేస్తున్నాడని అందరూ తలా ఇరవై వేళ్ళు పైకెత్తి వందల కొద్దీ వోట్లేసి ఆ దొంగ వెధవను ఎవరి సహాయం లేకుండా మనమే పట్టుకోవాలని తీర్మానించేశాం.

ఈ తీర్మానం విషయం కాలేజీలో బెంచీలకు, కుర్చీలకు, చెట్లకు, చెట్టు మీదున్న పక్షులకూ, టీ వేసే వెంకట సామికి, టీ పొడి తెచ్చిచ్చే ఈరప్పకు, టీ గ్లాసులు కడిగే ఉబేదుల్లాకు, టీ నీళ్ళు తాగే మేధావులకు కూడా తెలిసింది. మేధావి వర్గమంతా ఒకే చోట వుంటుంది. వాళ్ళంతా మా రూములో నా పియర్స్ సోపు వాడుంటారు కదా.

ఇప్పుడు... అప్పటి పియర్స్ సోపు ప్రకటన(మీ కోసం): ఒక చిన్న పాప వాళ్ళమ్మ సోపు రాస్తుంటే "పేర్స్..పేర్స్..నన్నూ అమ్మలా చేయవూ" అంటుంది.నా సోపు మొహానికి రాసుకునేవాళ్ళు "పియర్సూ..ఓ నా పియర్సూ నన్నూ విహారీలా చేయవూ?" అని మూడు సార్లు రాసేవాళ్ళు.

ఒక్కోడూ నెత్తిన హ్యాటూ, జేబులో భూతద్దం, చేతిలో పెన్సిలూ పెట్టుకొని డికేస్టీ ఉద్యోగం లో జాయిన్ అయిపోయారు. వాళ్ళ చొక్కా బ్యాడ్జిల మీద షెర్లాక్ హోమ్స్ , మైక్ హ్యామర్, యుగంధర్, షాడో, రాడో, ర్యాంబో, చంటబ్బాయ్, చిరంజీవి, గూండా, రాక్షసుడు, సన్నాసి గాడు లాంటి పేర్లు రాసుకోని మరీ రూముకొచ్చేశారు. అలా చాలా మంది యుగంధర్ లూ, షాడోలు, షెర్లాక్ హోమ్‌సూ కలిసి సమావేశం ఏర్పాటు చేసారు. అంతవరకు డబ్బులు, వాచీలు వగైరా పోగొట్టుకున్న వాళ్ళనందరిని లైన్లో రమ్మని చాలా ప్రశ్నలు వేసి మా రూములో టీ డబ్బాలు, చక్కెర డబ్బాలు , పాల డబ్బాలు ఖాళీ చేసి పోగొట్టుకున్నోళ్ళ వంట్లో శక్తి ని కరగదీసి, మా కంట్లో కన్నీళ్ళు కార దీసి సంతోషించారు. వేసే ప్రతి కొత్త ప్రశ్నకి హైఫైవ్ లు చెప్పుకున్నారు కానీ దొంగెవరో ఏ బ్యాడ్జి గాడికి అర్థం కాలేదు. కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన మీదట దొంగెవరో కనుక్కోవాలంటే ఒకే ఒక డిటెక్టివ్ వుండాలి వాడికే అన్ని అధికారాలు అప్పగించాలి అని బ్యాడ్జిలన్నీ పీకేసి ఫ్లాస్కులో సెట్టన్న అంగడి నుండి తెచ్చుకున్న కాఫీ తాగి తీర్మానించారు. డిటెక్టివ్ అంటే కొంచెం మతిమరుపు, కొంచెం తెలివి తేటలు, కొంచెం అతి తెలివి తేటలు, కొంచెం గూండాయింజం, కొంచెం నీరు, కొంచెం ఉప్పూ,కొంచెం గరళం... అప్పుడప్పుడూ చంద్ర లేఖ వుండాలని అందరి బుర్రలూ చెక్ చెయ్యాలి ఓపెన్‌ చెయ్య మన్నారు. అందరూ బుర్ర మీద జిప్పులు సర్రు సర్రుమని ఓపన్‌ చేసి పెట్టుకున్నారు. ఎవడి బుర్ర చిప్ప ఓపన్ చేసి చూసినా ట్రిగనామెట్రీ, ఎలక్ట్రానిక్సూ, స్ట్రెంక్త్ ఆఫ్ మెటీరియల్సూ, హిగ్గిన్‌ బోథాంసూ కనిపిస్తాయి తప్ప స్కాట్లాండ్ యార్డు మట్టి ఒక్క బుర్రలో కూడా కనిపించలేదు. ఒకడి బుర్ర చూస్తే కౌరవుల్లో విదురిడిలా, లంకలో విభీషణుడిలా అందులో వాక్యూం కనిపించింది. గాలి కూడా లేదు. అది తెలిసి ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు పెళ్ళి చూపుల్లో అమ్మాయి అబ్బాయి చూసుకున్నట్లు(ఒలంపిక్సు ఫాలో అయ్యేవాళ్ళు అభినవ్ భింద్రా కు స్వర్ణం రాగానే సురేష్ కల్మాడి చూసినట్టు). తరువాత అందరూ కలిసి భుజాల మీద భుజాలు వేసుకోని మిద్దె మీదకు నిచ్చెన వేసుకొని వెళ్ళి పోయారు. పైకెళ్ళిన తరువాత నిచ్చెన తీసేశారు. ఎవరూ పైకి రాకుండా. సరే నన్ను మర్చిపోయారని నేను కిందనే వుండిపోయా.

కాసేపటికి అందరూ కిందకు వచ్చి నా చేతిలో రెడీగా నున్నడబ్బు అప్పు గా తీసుకొని చందాలు పోగు చేశారు. ఆ డబ్బుతో తంతి తపాలా ఆఫీసుకు వెళ్ళి స్పెషల్ బుకింగ్ చేసి స్కాట్లాండ్ యార్డు నుండి మట్టి తెప్పించారు. ఎవడి బుర్రలో వ్యాక్యూం వుందో మళ్ళీ రెండో సారి పరీక్షించి ఆ బుర్రలో ఆ మట్టిని వేసి మైదా పిండి తో చేసిన బంకతో సీలు చేసి లక్కతో స్టాంపు వేశారు "డీకేస్టీ" అని. వాడి బుర్ర చురుగ్గా పని చెయ్యడం మొదలు పెట్టింది. వాడే షాడో అలియాస్ యుగంధర్ అలియాస్ డీకేస్టీ అలియాస్ దళపతి అయిన..... మీ ఊహ కరక్టే. మీకు మూడు మార్కులు ప్లస్సు. మీరు చాలా తెలివయినవారు.

(బ్యాక్ గ్రౌండ్ చప్పట్లు.. తరువాత జేమ్స్ బాండ్ మ్యూజిక్... ద మ్యాన్‌ విత్ ద ఇనప గన్‌... ద మ్యాన్‌ విత్ ద ఇనప గన్‌...)

మ్యూజిక్ అయిపోగానే ఫ్లూటు కృష్ణ దగ్గర సైకిలప్పు తీసుకొని కత్తెర కాలేసుకుని బషీర్ బుక్ స్టాలుకు పొయ్యి రోజుకు మూడు పుస్తకాలు మంత్లీ మెంబర్షిప్పు కట్టి మూడు పుస్తకాలు అద్దెకు తీసుకొచ్చా. ఒకటి యుగంధర్ ది, ఇంకోటి షాడో ది, మూడోది నటశేఖర కృష్ణది. వాటిని పగలు బల్లిలా రాత్రి నల్లిలా,ఎండలో ఎలకలా, వానలో నక్కలా మూడు రోజుల పదకొండు సెకండ్లలో చదివేసి ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకున్నా. ఏడమ చేత్తో బట్టలుతకడం, వంట చెయ్యడం, బిందెతో నీళ్ళు తేవడం, కుక్కల్ని, పిల్లుల్ని, ఈగల్ని తరమడం, దోమల్ని చంపడం లాంటి అన్ని పనులు చెయ్యగలననే నమ్మకం కుదిరిన తరువాత దేవుడి ముందు కర్పూరం వెలిగించి, తమలపాకులో చక్కెర పెట్టి, రెండున్నర గుంజీలు, మూడు బస్కీలు తీసి మొక్కుకుని కుట్లూడిపోయిన కోటేసుకున్నా. కోటు మహత్యమో బస్కీల మహత్యమో దొంగతనం జరిగిన సన్ని వేశాల్ని మొత్తం విశ్లేషణ చేసి ఒక్కొకళ్ళనీ ఎలిమినేట్ చెయ్యగా చెయ్యగా ఒకతని పేరు బయటికి వచ్చింది. అతనే కదిరప్ప (పేరు మార్చబడింది). బాడీ మైక్ టైసన్ లా, చూడ్డానికి చంద్ర మోహన్ లా వుంటాడు. మాట్లాడితే చెప్పనక్కర లేదు. అందరికీ తెలిసినంత వరకు మనిషి మాత్రం మంచోడే. సరే ఎటూ దొరికి పోయాడు కదా అని ఓ రోజు దగ్గరకు పిలిచి ఫోనులో చెప్పి చూశా "దొంగెవరో తెలిసి పోయింది. నువ్వు ఇంత వరకు కొట్టేసిన డబ్బులన్నీ వెనక్కిచ్చెయ్ లేక పోతే ప్రిన్సిపాలుకు చెప్పి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. తరువాత నీ చదువు మటాష్. నీ జీవితం మటాష్." అని. విన్లేదు. మళ్ళీ ఓ రోజు 'అంటేసే ఆట' సాబ్జ ఆడేటప్పుడు చెప్పా "నీ లైఫు మటాష్. నీ స్టడీస్ మటాష్." అని అయినా విన్లేదు. మేము కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కుడి వేపుకు తిరగాలి కదిరప్ప మాత్రం ఎడమ వైపుకు తిరగాలి. అందుకే ఎడమ వైపు మార్గం లో మాటు వేసి (బ్యాక్ గ్రవుండ్ లో ..ద మ్యాన్‌ విద్ ద ఇనప గన్‌..) చెప్పి చూసా. సైకిల్ స్టాండుకు వెళ్ళే మార్గం లో (బ్యాక్ గ్రవుండ్ లో మీకు తెలుసు. మీకు ఇంకో రెండు మార్కులు)చెప్పి చూశా. బాత్ రూమ్‌ వెళ్ళే మార్గం లో (బ్యాక్.. మీరు చాలా షార్ప్ ఇంకో మూడు మార్కులు) అడ్డు పడి చెప్పా. చివరికి సినిమాకెళ్ళే దారిలో కూడా చెప్పా. అలా చాలా చాలా మార్గాల్లో విభిన్నరీతుల్లో..ప్యాంటు జేబు లో చేతులు పెట్టుకొని, బెల్టులో చేతులు పెట్టుకొని, చొక్కా జేబులో చేతులు పెట్టుకొని, భుజాల మీద చేతులు పెట్టుకొని, క్రాపు సరి చేసుకుంటూ చెప్పి చూశా. (నా జేబులో, నా క్రాపు ..వగైరా..వగైరా అని అనుకుంటే మీకు అర మార్కే. పక్కోళ్ళ జేబులో, పక్కనోడి క్రాపు... వగైరా వగైరా అనుకుంటే మీకు నాలుగు మార్కులు ) పలితం మాత్రం నిల్లు. ఇక మిగిలిన అంకం రానే వచ్చింది.సాబ్జ (ఐస్ పాయ్) ఆట కొస్తే బెదిరిస్తాడని రావడం మానేసిన వాడు ఓ రోజు టైము బ్యాడయి పోయి బ్యాడ్ మింటన్ ఆడ్డానికి ఆప్కో వారి చారల లుంగీ కట్టుకోని మా రూము దగ్గరకు వచ్చాడు. నేను ఇంద్ర సినిమా లో చిరంజీవి లా కంటి రెప్ప మీద మూడు వెంట్రుకలతో సైగ చెయ్యగానే అసిస్టంట్ డీకేస్టీలు అలర్టుగా వెంటనే పట్టుకెళ్ళి రూములో వేసేశాం.

మధ్యలో అతన్ని కూచో పెట్టి అప్పటి ట్రెండు (శివ లా) ప్రకారం సైకిల్ చెయిన్ తీసుకున్నా.(శివ చూడని వారు పోకిరి లో బండ గణేష్ ను చంపే రీలు వేసుకోండి) పద్దతిగా చెప్పి చూశా.
"చూడు.. నీకు ఇన్ని దినాలు చెప్తానే వుణ్యాం. నాకు గ్యానీ కోపమొస్తే మనిషిని గాదు తెలుసు గదా. ఇన్నాళ్ళూ మాతో పాటే దిరిగినావ్ కదా పోతే పోనీలే అని నీకు చాన్సు ఇస్తావుండాము. ళేకపోతే నా..(బూతులు మార్చ లేదు మూర్చ బోయాయి) నిన్నేం చేసిండే వాణ్ణో తెలుసా."
"నువ్వెన్నన్నా చెప్పుకో నేను ఆ పని చెయ్యల్యా. "
"రేయ్ వీనికి సైకిల్ చేన్ సరి పోదు గానీ ఆ నన్ చాక్ తీసుకొని రారా.."
"నువ్వు నన్ను కొత్తు, కొయ్యి, సంపు గానీ నేనీపని చెయ్యలేదంటాడా గా"
"ఇట్లొద్దు గానీ. నీకు డబ్బులవసరమైతే నాకు జెప్పు. నేనెబ్బుడన్నా ఎవుడన్నా అడిగితే కాదణ్యానా? ఆ క్యాలికులేటర్లు యాడ బెట్నావో జెప్పు. లేకపోతే రేయ్ నా.. నీ .. నీ .."

అతని చేతిలో వాచీ పీక్కున్నాం. ఊహూ! చొక్కా పీకేశాం. లుంగీ పీకేశాం. బనీను పీకేశాం. చివరికి వి.ఐ.పి. వారి మాడల్ లా చేతులు పైకెత్తించి నిలబెట్టాం. మ్యాన్‌ హండ్లింగుకు దూరంగా మానసిక హ్యాండ్లింగుకు దగ్గరగా ప్రయత్నించా. ఏవీ సఫలం కాలేదు. పోనీలే మనోడే కదా అని ఆ రోజుకు వదిలేశాం.

కొద్ది రోజుల తరువాత బ్యాంగ్.. బ్యాంగ్.. ఏమీ లేదు. ఓ రోజు సూరీడు(వై.ఎస్. వెనకోడు కాదు) మామూలుగానే లేచాడు. మేము కూడా అంతే మామూలుగా లేచాం. క్లొజప్ పేస్టుతో పళ్ళు తోముకున్నాం, పియర్సు సోపు తో ఒళ్ళు రుద్దుకున్నాం. ఉగ్గానీ తింటున్నాం. కాసేపటికి... బ్యాంగ్.. బ్యాంగ్..

ఒకడు ఎర్ర హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు గోడకు తగిలించిన చొక్కా లోనుండి డబ్బు తీస్తూ. నేను ఉగ్గానీ ప్లేటు అక్కడే వదిలేసి కోటు వేసుకోని అక్కడ వాలిపోయా. వాడికి జరగాల్సిన శాస్తి జరిగాక (వి.ఐ.పి. ఫోజుకు కూడా నోచుకోలేదు వాడు) ఎక్కడెక్కడ ఎవరిదగ్గర డబ్బులు కొట్టేసింది వివరించాడు. అన్నీ ఒక హైలైట్ అయితే వాడు క్యాలిక్యు లేటర్లు కొట్టేసిన విధానం చాలా హైలైట్. ఎండా కాలం రాగానే మిద్దె పైకి ఒక సిల్కు వైరు లాగి బల్బు పెట్టుకొని చదువుకోవడం అలవాటు. అలా చదువుకుంటూ కాలిక్యులేటర్లు అక్కడే పెట్టి నిద్ర పోయే వాళ్ళు. ఏవరన్నా ఊరికి వెళ్ళి రావాల్సి వస్తే ట్రెయిన్ లో వచ్చేవాళ్ళు. ఆ ట్రెయిన్ ఏ అర్ధ రాత్రో రెండు గంటలకు వచ్చేది. అలా రాత్రి వచ్చిన వాళ్ళు నేరుగా మిద్దెక్కి ఎవర్నో ఒకర్ని నిద్ర లేపి తాళం చెవులు ఎక్కడున్నాయో కనుక్కుని రూములో కొచ్చేవాళ్ళు. ఈ 'దొంగ' అలా వచ్చినపుడు మిద్దెక్కి వచ్చి ఎవర్నీ లేపకుండా కాలిక్యులేటర్లు,డబ్బు లేపేసి మళ్ళీ ఊరెళ్ళి పోయి రెండు రోజుల తరువాత దర్జాగా వచ్చేవాడు. వాడి తెలివికి అందరూ గ్రూపుగా తల్లి పిచుక మేత తెస్తే పిల్ల పిచుకలు నోళ్ళు వెళ్ళబెట్టినట్టు నోళ్ళు వెళ్ళబెట్టాం.

అఫ్ కోర్సు, మొదట చెప్పిన కదిరప్పను మనస్పూర్తిగా క్షమించమని కోరా.

గిల్టీ ఫీలింగుతో అతను కనిపించినప్పుడల్లా స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లా ప్రతిసారీ "సారీ అప్పా కదిరప్పా" చెప్పేవాడిని. అది తెలిసి చాలా సార్లు తప్పించుకుని తిరిగాడు. చివరికి ఓ రోజు పరీక్ష హాల్లో ఆన్సర్ షీటు మీద ఓం అని రాసి సమాధానాలు రాసే లోగానే అటు తిరగి "సారీ అప్పా కదిరప్పా" అని చెప్పా. అది చూసి తట్టుకోలేక "ఇలా చేసావంటే నేను టి.సి. తీసుకోని పక్కనున్న హైస్కూల్లో ఆరో తరగతి లో చేరిపోతా" అని బెదిరించాడు.పాపం మళ్ళీ ఆరో తరగతి నుండి కాలేజీ వరకు చదివొచ్చేసరికి చిరంజీవి తో పోటీ పడిన సుమన్‌ లా కేరక్టర్ పాత్రలు వేసే స్థితికి వచ్చేస్తాడని సారీ చెప్పడం మానేశా. కాలేజీ చివరి రోజు ఆటో గ్రాఫ్ ఇచ్చేటప్పుడు "సారీ బై విహారీ" అని రాసిచ్చా. ఆ తరువాతే "ఏ ఫిల్మ్ బై అరవింద్" వచ్చిందని మీరు కనిపెడితే ఇంకో నాలుగు మార్కులు కూడుకోండి టొటలేసుకోని ఎన్నొచ్చాయో చెప్పండి.

మళ్ళీ బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్... ద మ్యాన్‌ విత్ ద హ్యామర్ గన్‌...ద మ్యాన్‌ విత్ ద హ్యామర్ గన్‌.

:::::::::::::::


ఇప్పుడు మీకో అపరాధ పరిశోధన ప్రశ్న:
అందరూ మిద్దె మీదకు వెళ్ళగానే నేను డబ్బు ఎందుకు చేతిలో పట్టుకొని వున్నానో చెప్పగలరా? ఛెప్పలేక పోతే కిందనే సమాధానం ఇచ్చేశా. చూసి మీ సమాధానం సరైందో కాదో చూసుకోండి.

సమాధానం: అందరు వెర్రి డికేస్టీల్లాగా వాళ్ళు మిద్దె మధ్యలో మాట్లాడుకోకుండా సింబాలిక్ గా పైనున్న పిట్ట గోడ మీద కూచుని మాట్లాడుకున్నారు. నేను ఇంటి బయట నున్న కిటికీ కమ్మీల మీదకి ఎక్కి చెవులు పిట్ట గోడకు ఆనించి వినేశా. వాళ్ళు కిందకొస్తున్నారనగా లోపలికొచ్చేసి సూట్ కేసులో నుండి డబ్బు తీసి చేతిలో పట్టుకొనున్నానన్నమాట :-)
:::::::::::::::

Thursday, August 21, 2008

అమెరికాలో తెలుగు వారి పిల్లలకు తెలుగు పాఠాలు

* * * * * * * *


సిలికానాంధ్ర : కాలిఫోర్నియాలోని ఈ తెలుగు సంస్థ పేరు చెప్పగానే అమెరికా లో తెలుగు భాష మీద, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద అభిమాన మున్న ప్రతి వ్యక్తి అనుకునే ఒకే ఒక మాట " ఇలాంటిది మా ఊర్లో కూడ ఒకటి వుంటే బావుండు". ఈ సంస్థ ప్రతి సంవత్సరము తమ సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. వీరి ప్రత్యేకత ఏంటంటే సినిమా పాటలు లేక పోవడమే కాదు రికార్డు చేసిన ఏ కార్యక్రమమూ వుండదు. అంటే సి.డి.లు, క్యాసెట్లు పెట్టి తైతక్క లాడే దృశ్యాలుండవు. ఈ మధ్యనే గిన్నీసు రికార్డు కెక్కిన అంతర్జాతీయ కూచి పూడి నాట్య సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇదే సంస్థ వారు సుజనరంజని అనే అంతర్జాల సాహిత్య పత్రిక కూడా నడుపుతున్నారు.

లక్షల దానం కన్నా అక్షర దానం మిన్న.


పోయినేడు కాలిఫోర్నియా రాష్ట్రం లోని తెలుగు వారి పిల్లలకు తెలుగు నేర్పడం మన బడి తరగతులు ద్వారా మొదలు పెట్టారు. అది విజయవంతమవగానే అమెరికా లో కొన్ని రాష్ట్రాలకు విస్తరించారు. ఆ విస్తరణలో భాగంగా కొలరాడో రాష్ట్రం లో కూడా మన బడి తరగతులు ప్రారంభించబడ్డాయి. దాదాపు 9 నెలలు గా నేనే ఉపాధ్యాయుడిగా పనిచేశా(స్తున్నా)ను. ఇందులో పది మంది పిల్లలు నాలుగేళ్ళ కోర్సు గల ఈ మనబడి లో మొదటి సంవత్సరము 'ప్రవేశము' తరగతి ని విజయవంతంగా పూర్తి చేశారు. దేశం మొత్తం మీద ఇప్పటికి 350 మందికి పైగా విద్యార్థులు వున్నారు.

దీనికి వస్తున్న స్పందన అపూర్వం. ఈ సంవత్సరం దీన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. తరగతులు వచ్చే సెప్టంబరు మొదటి వారం లో మొదలవుతున్నాయి. మా కొలరాడో లో కూడా మరిన్ని చోట్లకు విస్తరిస్తున్నాము. అమెరికాలో వున్న వారెవరైనా వారి ఊళ్ళలో ఈ మనబడి ప్రారంభించాలంటే రాజు చమర్తి గారిని(408-685-7258 raju@chamarthi.com) లేదా శంకర్ తుములూరు గారిని(650-430-5958 shan_Tumuluru@yahoo.com) లేదా కూచిభొట్ల ఆనంద్ గారిని గానీ సంప్రదించండి. శంకర్ గారు డెట్రాయిట్ లో వుంటారు.

కొన్ని వివరాలు:

1. చేరాలంటే 2008 సెప్టెంబర్ 1 కి ఆరు సంవత్సరాలు నిండి వుండాలి.

2. వారములో రెండు గంటలు తరగతులు వుంటాయి.

3. పిల్లలకు పెన్సిల్ దగ్గర నుండి పుస్తకాల వరకు ఈ సంస్థ వారే ఇస్తారు.

4. పాఠాలు భోదించే ఉపాధ్యాయులకు భోధనాంశాలు కూడా ఏ వారానికి ఆ వారం సులభంగా చెప్పేటట్లు వుంటాయి.

5. ప్రవేశం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అని నాలుగు సంవత్సరాల తరగతులు వుంటాయి.

6. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తీర్ణతా పత్రాలు ఇవ్వబడతాయి.మీరు అమెరికాలో వుండి మీ ఊళ్ళో ప్రారంభించాలంటే ఈ మన బడి లంకె కు వెళ్ళండి. అక్కడ మరిన్ని వివరాలు దొరుకుతాయి.

* * * * * * * *


మా వూరి సమాచార కరపత్రం కింద ఇవ్వబడింది.

Wednesday, August 13, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (ఒలంపిక్స్, పట్టుకుంటే పదివేలు, దేవుడు)

* * * * * * * *


"అయ్యా!"
"సిద్ధా!"

"ఈ సారి మనకు ఒలంపిక్స్ లో ఓ స్వర్ణం తెచ్చి మన త్రివర్ణాన్ని రెప రెప లాడించాడు గదా మన బింధ్రా."
"అవును. అభినవ్ భింద్రాను చూసి ఆసేతు హిమాచల మంతా ఆనంద డోలికల్లో మునిగి అణువు అణువునా పులకరిస్తోంది."

"ఇరవై నాలుగేళ్ళ కుర్రోడు, స్వతంత్ర భరతావని చరిత్రలో మొదటి సారి వ్యక్తిగత పతకమొస్తే అనిర్వచనీయమైన అనందంతో గంతు లేయకుండా స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంతంగా ఎలా వుండగలిగాడు"
"పోయినేడు రాథోడ్ కు రజితమొచ్చినప్పుడు ఆనందంతో గంతులెయ్యకుండా కుళ్ళు కున్నాడని అన్న వాళ్ళ నోళ్ళు మూయించడానికనుకుంటా"

"తనెప్పుడూ ఇలాగే వుంటాడేమో"
"అవును నాలాగా"

"ఇంకో మాట చెప్పండి"
"నీ ఎదుట నున్న వాడిలా"

"అది కూడ ఒద్దు గానీ ఇంకో మాట చెప్పండి"
"బుధ్ధా లా"

"సద్ది ముద్దేం కాదూ..?"
"ఏంట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావ్?"

"ఆఁ ఏం లేదు. మీలా ముద్దుగా సుద్దులు చెప్పే బుద్ధులు లేరంటున్నారు"
"ఇప్పటికి నిజమొప్పుకున్నావ్ రా. నిన్ను చూస్తుంటే సొంత డబ్బుల్తో బీజింగ్ కు పంపించాలనిపిస్తోంది"

"అలానే అంటారు. మిమ్మల్ని నమ్ముకునేదానికన్నా ఏ వైయెస్సునో, సోనియాను నమ్ముకొనుంటే బావుండేది"
"నీకు సోనియాను, రాహూల్ ను బీజింగులో చూసినప్పటి నుండి ఎవేవో కోరికలు కలుగుతున్నాయిరా"

"భుట్టో ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ బీజింగ్ లో కలిశారు కదా ఏం మాట్లాడుకొనుంటారు?"
"మీ ఇంట్లో ఇద్దరు, మా ఇంట్లో ఇద్దరు"

"అంటే హత్య కావించ పడ్డవారనా?"
"ఈ బాంబులు, రైలు ప్రమాదాలు, వరదలు చూసి నువ్వలా అయిపోయావ్. నేను చెప్పింది అది కాదు. ప్రధాన మంత్రులు"

"భవిష్యత్తులో మన దేశానికి రాహుల్ ప్రధాన మంత్రయి, బిలావల్ జర్దారి పాకిస్తాన్ ప్రధాన మంత్రయితే ఏమవుతుంది?"
"వాళ్ళిద్దరూ ఒలంపిక్సులో మళ్ళీ ఓ టీ తాగుతారు.మనిద్దరం రెండు ఇడ్లీలు తింటుంటాం."

"అలా వాళ్ళిద్దరూ తాపీగా మాట్లాడుకుంటుంటే మనమెందుకు శతృ దేశం అని కొట్టుకోవాలి?"
"వాళ్ళని దేశాధినేతలుగా చూసి తరించుకోడానికి"

"మనోళ్ళు 56 మంది బీజింగ్ ఒలంపిక్స్ కు వెళ్ళారు కదా ఎన్ని పతకాలొస్తాయంటారు"
"వస్తాయి రెండో మూడో"

"ఓ వెయ్యి మంది ని పంపించుంటే ఇరవయ్యో ముప్పయ్యో వచ్చేటివి గదా?"
"అలా రావాలంటే కమల్ హాసన్ నో రజనీ కాంత్ నో పంపించాలి. ఒక్కోరు పది, వంద పతకాలు పట్టుకొచ్చే వాళ్ళు.”"

"అప్పుడు బుష్షూ, కమల్ హాసనూ కలిసుండే వాళ్ళు"
"ఎందుకు? దశావతారాల్లో బుష్షావతారం చూసేందుకా?"

"కాదులెండి. బుష్షు అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవయ్యాడు కదా?"
"ఏఁ ఇండియాకు ఏమన్నా గ్రాంటులిచ్చాడా?"

"గ్రాంటు ఇస్తే మారిన వాడు అవుతాడు కానీ ఇంప్రూవ్ అయినవాడు కాదు. చాన్నాళ్ళ కింద ప్రిట్జల్ తిని కళ్ళు తిరిగి కార్పెట్ మీద పడుకున్నాడు కదా. ఈ సారి ఒలంపిక్స్ చూస్తా నీళ్ళు తాగి కింద పడకుండా తమాయించుకున్నాడు."
"అదా. అవును చాలా చాకచక్యంగా, సాహసంగా, నైపుణ్యంగా, ఆత్మవిశ్వాసంతో తమాయించుకున్నాడు బాడీ గార్డుల సాయం తో. ఎంతయినా ఒలంపిక్స్ చూస్తున్నాడు గదా. కొంచెం లీనమయి పోయుంటాడు"

"వచ్చే ఏడు ఒలంపిక్సుకు మనము కూడా వెళ్దాం"
"అలాగలాగే. దానికి ఇప్పటి నుండే డబ్బు సంపాదించాలి గదా."

"నన్నపనేని రాజకుమారి పట్టుకుంటే రెండు పది వేలు బహుమానం ప్రకటించారు గదా ట్రై చేద్దామా?"
"ఎవర్ని"

"వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి ని"
"ఏం పర లోకాలకు బెర్తు గానీ రిజర్వ్ చేయించుకున్నావా? ఈ రోజుల్లో మంచి సంపాదన వచ్చేది రాజకీయ పార్టీల్లోనే.ఏ పార్టీ లో చేరుదాం చెప్పు"

"కొత్త పార్టీ లో చేరితే?"
"చిరంజీవి పార్టీనా? అది ప్రస్తుతానికి గిట్టు బాటు కాని వ్యవహారం. వాళ్ళు పదవిలోకొచ్చినా మొదటి సారి కదా డబ్బులు తినటానికి కొంచెం సంకోచిస్తారు. తెలుగు దేశం మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అన్నారు కదా. అలాగే కాంగ్రేస్ పార్టీ ఫరెవర్. అందులో దూకేద్దాం."

"జీవితం లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పార్టీలో చేరాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. మీ ఇంట్లో మీ పూర్వీకులు ఎక్కడన్నా, లంకె బిందెలు కానీ, వజ్రాలు దాచి పెట్టారేమో చూడండి. వాటి కోసం వెతుకుదాం"
"వజ్రాలుంటే ఎప్పుడో సూరత్ వెళ్ళి వ్యాపారం పెట్టుకొనుండే వాడిని"

"ఇప్పుడు సూరత్ లో కూడా వజ్రాలు దొరకడం లేదు. ఎక్కడ బడితే అక్కడ మిల మిల మెరిసే బాంబులే దొరుకుతున్నాయట"
"అలా అయితే మన అనంతపురం లోని వజ్ర కరూర్ లో వజ్రాలు దొరుకుతాయి కదా అక్కడ వెదుకుతాం"

"వెతుకుతారు... వెతుకుతారు... వుంటే గింటే మన దాకా రానిస్తారేంటి? ఇప్పుడు అక్కడ సీజ్ చేసిన బస్సులే దొరుకుతాయట"
"అనవసరంగా సీజ్ చేస్తున్నార్రా. చూడు జె.సి. ప్రభాకర్ రెడ్డి మనసెంత గాయపడి విల విల లాడిందో."

"అవునా?"
"అవున్రా.ఆయన మాట్లాడిన ప్రతి మాటని ఈ మీడియా వాళ్ళు వక్రీకరించారు. ఆ రోజు మాట్లాడిన టేపును తెప్పించి అందరికీ చూపించాడు. ఈ మీడియా వాళ్ళు కళ్ళున్న కబోది వాళ్ళు."

"అయ్యో పాపం. ఎంత పని జరిగింది. ఈ పేపరోళ్ళకు ఎప్పుడూ నీతి , నిఖార్సయిన వాళ్ళ మీదనే కళ్ళుంటాయి. కాంగ్రేసు లో నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడేవాళ్ళెంత మంది లేరు"
"కదా? కాంగ్రేస్ లో వుంటూ చిరంజీవి పార్టీ కోసం పని చేసే నీతి మంతులు కూడా వున్నారు"

"అనవసరంగా ఆయన్ని ఆడి పోసుకుంటారే. అమర్ నాథ్ దేవాలయం గొడవలో రాజీనామా చేసిన మంత్రుల్లేరా? వాళ్ళు మన దేశం లోనే వుండి ఎవరికో పని చెయ్యట్లా?"
"ఆ రూట్లో వచ్చావా? అయితే జోగయ్యా జిందాబాద్"

* * * * * * * *"అయ్య గారూ, దేవుడి పాలన లో వరుణ దేవుడు కూడా వాళ్ళ పార్టీనే నటగా"
"అవును"

"మరి ఇలా వరదలెందుకొస్తున్నాయంటారు"
"అందరూ ఎమ్మెస్ సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి లా ఊరుకుంటారేంట"

"సొంత పార్టీ వాళ్ళు ఏం చేస్తారండి"
"మర్రి చెన్నా రెడ్డి ముఖ్య మంత్రి గా వున్నప్పుడు ఏం జరిగింది?"

"అంటే ఈ వాన"
"మరో దేవుడు నాయినా"

* * * * * * * *


"డాలర్లు ఎవరు సంపాదిస్తారు?"
"అమెరికా పోయినోళ్ళు, అమెరికా పోలేక టి.టి.డి.లో ఉద్యోగం సంపాదించుకున్నోళ్ళు"

* * * * * * * *

Friday, August 08, 2008

08/08/08 08:08:08 (అన్నీ ఎనిమిది లే)

ఇందులో విషయం లేదు కానీ ప్రచురించే సమయానికి ప్రత్యేకత వుంది.(చిరంజీవి ఈ సమయానికే పార్టీ పేరు ప్రకటిస్తాడేమో)
సమయం రెండువేలలో 8 వ సంవత్సరం, 8 వ నెల, 8 వ రోజు , 8 గంటలు, 8 నిముషాలు, 8 సెకన్లు.
నా జీవితకాలం లో మళ్ళీ ఇంకో సారి దీన్ని చూడను.

ఇంతకు ముందు చూసిన ప్రత్యక మైన తేదీ.

12:34:56 7-8-90

Wednesday, August 06, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (బ్లాగు సమీక్ష)

"అయ్య గారూ"
"హాయి హాయిగ జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి ..."

"ఎక్కడున్నారు?"
"హాయ్ హమ్మా హాయ్ హాయ్ హమ్మ..."

"ఏమైంది మీకు?"
"చికు బుకు చికు బుకు రైలే...అదిరెను దీని స్టైలే.."


"అంత సంబరమెందుకో".
"ఇదిగో ఇందుకు"

"ఓసోస్ ..దానికే ఇంత ఆనందమా?..ఇప్పుడూ...నేను చెప్పేదేంటంటే ... అలాంటివి చాలా వస్తూ వుంటాయ్.... గదా.. ఆఁ..వస్తుంటాయ్ గదా..అందుకని...ఏరీ మళ్ళీ ఎక్కడికెళ్ళారు? కిందెక్కాడా కనబడ్డం లేదు."
"బీట్ ఇన్‌ మై హార్ట్...మేఘాలలో తేలి పొమ్మన్నది ..."

"మహాను భావా ఆ మేఘాలేంటి ..ఆ విహరించడమేంటి? కాస్త కిందకొస్తారా?"


"మళ్ళీ ఆ చూపేంటి? సరే ఇప్పుడు నన్నేం చేయమంటారు?"
"ఏవిటేవిటి నేను ఇప్పుడు టోపీ తియ్యాలా? ఈ మాత్రం దానికే?"
"పెద్ద తిప్పార్లే మూతి.తియ్యక పోతే ఏం జరుగుతుందంట?"

"ఓ యబ్బో...ఇలాంటివి చాలా చూశాం "
"హాం ఫట్ .."

"నన్నొగ్గెయ్యండి బాబో..నన్ను సాండ్విచ్ చెయ్యకండి కావాలంటే మీకు టొపీలేం కర్మ,గంగూలీ లా చొక్కా కూడా తీసేస్తా..""అలా రా దారికి కూర్మాంఢం బద్దలవుతుంది. ఏమనుకున్నావో ఏమో ..డల్ల డర్కి వెధవా ."
"ఆ తిట్లేంది? ఇదిగో తీసేస్తున్నా అలా చూడకండి."
"హూ తొందరగా కానీ..డేగ డస్కి."
"కొత్త తిట్లు కూడానా ... తప్పదా?"


"తప్పదు సిడ్కాల సిత్తి!..."


"సరే చేసుకున్నోడికి చేసుకున్నంత. మీ ఖర్మ"

"ఓలమ్మో...ఓరయ్యో..ఓలప్పో..."
"అందుకే అప్పుడే చెప్పా వింటారా? "

Wednesday, July 23, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ ( అవిశ్వాసం, బ్లాగులు,ఊకదంపుడు)

* * * * * * * *


రేయ్ సిద్ధా!!!
అయ్య గారూ

ఎక్కడ అఘోరిస్తున్నావ్ రా
ఇక్కడే అఘోరిస్తున్నా

ఇక్కడికి వచ్చి చావు. ఈ చీకట్లో నన్నెవరో కట్టేశారు.
మిమ్మల్నీ కట్టేశారా?

ఏవిటి నిన్ను కూడా కట్టేశారా?ఇలా మనిద్దర్నీ ఎందుకు కట్టేసార్రా?
నాకేం తెలుసండీ. మీకెవరైనా శతృవులు వున్నారా?

నాకు తెలిసి ఎవరూ లేరు. తెలీకుండా ఎవరన్నా వున్నారేమో?
అయ్యగారూ నాకో అనుమానం.

నీ అనుమానం పార్లమెంటు కెళ్ళా. నువ్వు అనుమానమంటున్నావా? అణుమానం అంటున్నావా? ఏవరి నోట్లోంచి అను అని విన్నా అణు ఒప్పందం అనే అనిపిస్తోంది.తమరు నోరు తెరిస్తే మేము విని తరిస్తాం.
మీరు గానీ వై.ఎస్.ను గానీ ఏమన్నా అన్నారా?

ఏం ఏమీ అనకూడదా?.
నిన్న రేణుకా చౌదరి ఏమందో తెలుసా?

మొన్నేమందో తెలిస్తే గదా నిన్నేమందో చెప్పడానికి
సరే నేనే చెబుతా వినండి. మీకు చీకట్లో ‘టింగు’ వెలగడం లేదు

మళ్ళీ ఈ టింగేవిట్రా? అసలే ఎవరో కాళ్ళూ చేతులూ కట్టేశారని ఏడుస్తుంటే
అదే మీ బుర్ర టింగుమని వెలుగుతుంది గదా. దానికి టింగని పేరు పెట్టా.

కొంపదీసి నిన్ను నా వారసుడికి ప్రకటించ మంటావా ఏంటి?
అంతొద్దు. నా టింగు మీ టింగు కన్నా పెద్దది. నేను చెప్పేది వినండి. అసలే కట్టేసున్నారు.

వినక చస్తానా. ఆ కట్టేసినోళ్ళు నోరు, చెవులూ కూడా కుట్టేసుంటే బావుండేది
అక్కడే మీరు ఎదగ కుండా పోయారు. సృష్టి లో జరిగే ప్రతి కార్యానికి ఒక అర్థం పరమార్థం వుంటుంది.

నన్ను కట్టి పడెయ్యడం లో కూడా ఒక పరమార్థం వెతుక్కోమంటావ్. గుడ్డి పిల్లిని చూస్తే కుంటి ఎలుకకు కూడా లోకువ.
ష్. కుంటి, గుడ్డి అని చీకట్లో కూడ అనకండి. మా మంద కృష్ణ వింటే తన బృందంతో వచ్చి మీ మొహంలో మంద హాసం లేకుండా చేస్తాడు

సరే. మారెప్పకు చిరంజీవి లోకువ
భలే మారిపోయారు మంద పేరు వినంగానే. అలా వుండాలి భయమంటే.ఆంధ్ర జ్యోతోళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో.అదే దాని గురించే ఇందాకే చెబుతుంటే సరీగా విన్లా.

నువ్వేదో రేణుకా చౌదరి అన్నావ్
ఆవిడ గురించే. నిన్న పార్లమెంటులో ఓట్లేసారు గదా. అప్పుడు ఎం.పి. ఆది కేశవులు నాయుడు ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ దగ్గరకెళ్ళి వోటెయ్యకుండా నిలిచిపోయాడా?

అవును. తరువాత ఎర్రం నాయుడు ఆయన చేత పేపర్ లో సంతకం పెట్టించుకొని ఎర్రింకుతో నో అని రాసి స్పీకర్ కు ఇచ్చేశాడు.
అప్పుడు ఆ పేపర్ లాక్కోబోతూ ఏమందో తెలుసా. "మళ్ళీ ఓ సారి ఆలోచించుకో వై.ఎస్. సంగతి నీకు తెలుసు గదా. తరువాత నీ బిజినెస్ నువ్వు సరీగా చేసుకోలేవు" అందిట.

నువ్వు ఈనాడు చదివావు. వెళ్ళు. వెళ్ళి సాక్షి చదువుకో
మీరు సాక్షికి ఫ్యానా?

నేను సాక్ష్యానికి ఫ్యాను
కట్టి పడేసారనే టెన్షన్‌ నుండి రిలీవ్ కావడానికి మీకో పజిల్. ఈ ప్రభుత్వం ఓడినట్టా? గెలిచినట్టా?

కాంగ్రేస్ గెలిచినట్టు, మన్మోహన్‌ ఓడినట్టు
ఈ తిరకాసేంటి?

మన ప్రధాన మంత్రెవరు
మన్మోహన్ సింగు

నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి?
ప్రధాన మంత్రి

తీసుకుంటున్నదెవరు?
సోనియా

అక్కడ లేని తిరకాసు ఇక్కడెందుకోయ్. వెళ్ళి తెలుగు సినిమాలు చూడు
అయ్య గారూ మీరే గనుక ఇండిపెండెంట్ ఎం.పి. అయుంటే ఏమి చేసుండే వారు

వంద కోట్లు తీసుకొని అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసుండే వాడిని

* * * * * * * *

అయ్య గారూ. ఈ మధ్య బ్లాగులెలా వున్నయ్
వాటర్ వాటర్ ఎవ్వెరీ వేర్ లా ఎక్కడ చూసినా టపా టపా ఇన్ ఎవ్వెరీ కార్నర్

అన్నీ చదువు తున్నారా?
అన్నీ చదవాలంటే రోజుకు 72 గంటలు కావాలి. తరువాత చదువుదాం లే అనుకుంటే ఆ టపా కూడలి నుండి గాయబ్.

చాలా వెరైటీలున్నాయా?
ఏవిటో సంవత్సరం కిందటి తో పోలిస్తే రాసే వాళ్ళు నాలుగింతలు ఎక్కువయ్యారు. అప్పుడు అన్నీ దేనికవే వైవిధ్యంగా కనిపించేవి. అప్పుడు ఒక్కోరు ఒక్కో రకంగా రాస్తుంటే శైలిలో, దృక్పథం లో, ఆలోచనలో తేడా స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు దాదాపుగా అందరి టపాలు ఒక్క లాగే కనిపిస్తున్నాయ్.

మీ కంటికి అలా కనిపించచ్చేమో. మిగిలిన బ్లాగర్లకు వేరేగా అనిపించొచ్చుగా
అయుండచ్చు. ఇది నా అభిప్రాయం అని మళ్ళీ చెప్పాలా?

అవును. ఆది బ్లాగరి అస్త్ర సన్యాసం పుచ్చుకొన్నారు. ఎందుకంటారు?
ఆయనకి కూడా రాసి రాసి బోరు కొట్టిందేమో. అందుకే తన ఓపికను ఎలా చూపించాడో తెలుసా? కీబోర్డు లోని అక్షరాలు నొక్కకుండా 1,2,3.. అంకెలున్న లైను మాత్రమ ఉపయోగించాడు కామెంట్లలో.

అంటే
!, 10/10.. లా అన్నమాట

ఇంకొంత మంది ఏకంగా ఇంగ్లీషులోనే రాసేస్తున్నారు గా
కొత్త సంవత్సరం రోజు అన్ని గుళ్ళూ తిరగటానికి తొందరగా ప్రసాదం తినేసి బయలు దేరినట్టు ఎక్కువ బ్లాగులు చూడాలని దానర్థం

మీ బ్లాగుకు కూడా జనాలు బానే వస్తున్నారన్నమాట.
ఇప్పుడు కూడలండ్రెడ్ వుండబట్టి రిజర్వేషన్ లతో నెట్టుకొస్తున్నాం గానీ. గుంపులో వుండుంటే ఆ కొన్ని క్లిక్కులు కూడా మిస్సు

ష్.. గట్టిగా అనకండి దాన్ని పునః పరిశీలన అని ఉద్యమాలు లేవ దీయ గలరు.
ఓరే.. ఇలా రిజర్వేషన్ తో ఎంత కాలం నెట్టుకొస్తాం రా. విషయముంటే ముందుంటాం. లేకుంటే వెనకుంటాం అంతే.

బాగా పాపులారిటీ రావాలంటే ఏం చెయ్యాలి
బ్లాగుల్లో యూత్ ఎలిమెంట్ బాగా నింపాలి

* * * * * * * *

మంచిది రా ఎలాగోలా నువ్వు కట్లు విప్పుకోని నా కట్లు విప్పుతున్నావ్
నేను కట్లు విప్పడమేమిటి?

మరి నా కట్లు విప్పుతుందోందెవరు?. ఎవరో నా కట్లు విప్పేశారు
అయ్య గారు నా కట్లు కూడా విప్పేశారు. వుండండి లైటు వేస్తా. అరె ఈయనెవరో కొత్త వాడి లాగున్నాడే. అయ్య గారూ ఈయన మీకు తెలుసా?

తెలీదే
నమస్కారమండి నా పేరు ఊకదంపుడు. ఊకదంపుడు అనే బ్లాగు వుంది. మిమ్మల్ని కట్టేసి వెళ్ళింది నేనే. మిమ్మల్ని కట్టేసి మీకు పోటీగా ఓ టపా రాసాను.

రాస్తే రాశారు గానీ దానికి మమ్మల్ని కట్టెయ్యడమెందుకు?
కట్టెయ్యక పోతే మళ్ళీ ఓ టపా రాసేస్తారేమో అని.

చెబితే మానేస్తాం గదా అంతోటి దానికి ఇలా చెయ్యాలా మమ్మల్ని. ఏం మీకు 'ఇంగ్లీషు యూ లివ్ లాంగా' కి కొత్త కాన్సెప్టు దొరకలేదా?
ఏదో సరదాకి రాసానండి.మనసులో ఏమీ పెట్టుకోకండే

ఎక్కడ పెట్టుకుంటాం లెండి అసలే వర్చ్యువల్ బ్లాగు లోకం.ఎవరికెవరో.
అలాగయితే మంచిదండి. ఇక నే వెళ్ళి రానా!!!

ఆగండి. ఓ చిన్న విన్నపం.ఈ సారి మీకు ఇలా డూప్లికేట్ సిధ్ధ బుద్ద రాయలనిపిస్తే నాకు చెప్పండి.
ఏం మిమ్మల్ని మీరే తాళ్ళతో కట్టేసుకుంటారా?

లేదు. మీకు ఇలా రాయాలనిపించినప్పుడు మా ఇంటిల్లి పాదికి ఏ హవాయి దీవులకో స్విట్జర్ల్యాండ్ పర్వత శ్రేణులకో రెండు వారాలు ప్యాకేజ్ ట్రిప్పు బుక్ చేసి పంపించండి చాలు. అప్పుడు ఎంచక్కా మీరేమైనా రాసుకోవచ్చు.

* * * * * * * *

Monday, July 21, 2008

లోకం లో జనాలు రెండు రకాలు.

లోకం లో జనాలు రెండు రకాలు.
చదవడం తెలిసిన వాళ్ళు, చదవడం రాని వాళ్ళు.
చదవడం రాని వాళ్ళతో హ్యాప్పీస్.

చదవడం వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు.
తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు.
తెలుగు రాని వాళ్ళతో హ్యాప్పీస్

తెలుగొచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
బ్లాగులు చదివే వాళ్ళు, బ్లాగులు చదవని వాళ్ళు.
బ్లాగులు చదవని వాళ్ళతో హ్యాప్పీస్.

బ్లాగులు చదివే వాళ్ళు రెండు రకాలు.
నా బ్లాగు చదవని వాళ్ళు, నా బ్లాగు చదివే వాళ్ళు.
నా బ్లాగు చదవని వాళ్ళతో హ్యాప్పీస్.

నా బ్లాగు చదివే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
మొత్తం చదివే వాళ్ళు, పై పైన చదివే వాళ్ళు
మొత్తం చదివే వాళ్ళతో హ్యాప్పీస్.

పై పైన చదివే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు.
కామెంటు రాసే వాళ్ళు, కామెంటు రాయని వాళ్ళు.
కామెంటు రాయని వాళ్ళతో హ్యాప్పీస్.

కామెంటు రాసే వాళ్ళు రెండు రకాలు
బాగుందని రాసే వాళ్ళు, బాలేదని రాసే వాళ్ళు.
బాలేదని రాసే వాళ్ళతో హ్యాప్పీస్.

బాగుందని రాసే వాళ్ళు రెండు రకాలు
బ్లాగుండి రాసే వాళ్ళు, బ్లాగు లేక రాసే వాళ్ళు
బ్లాగుండి రాసే వాళ్ళతో హ్యాప్పీస్

బ్లాగు లేక రాసే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
బ్లాగు మొదలు పెడదామని రాసే వాళ్ళు, బ్లాగు అలోచన లేకుండా రాసే వాళ్ళు
బ్లాగు మొదలు పెడదామని రాసే వాళ్ళతో హ్యాప్పీస్

బ్లాగు ఆలోచన లేకుండా రాసే వాళ్ళు రెండు రకాలు.
చేనీస్ వచ్చిన వాళ్ళు, చైనీస్ రాని వాళ్ళు.
చైనీస్ రాని వాళ్ళతో హ్యాప్పీస్.

చైనీస్ వచ్చిన వాళ్ళు రెండు రకాలు
తెలుగు బ్లాగుల్లో చైనీస్ రాసేవాళ్ళు, చైనీస్ బ్లాగులో చైనీస్ రాసే వాళ్ళు.
చైనీస్ బ్లాగుల్లో చైనీస్ రాసే వాళ్ళతో హ్యాప్పీస్

తెలుగు బ్లాగుల్లో చైనీస్ రాసే వాళ్ళు రెండు రకాలు కాదు. ఒకే రకం. అదే కనిపించకుండా పోయిన రకం.
ఒక రకమే కాకుండా మనిషి కూడా ఒకడే.వాడే కూడలి ని వ్యాఖ్యలతో స్పాం చేసేవాడు
వాడి అదృశ్యం తో ఇప్పుడు కూడలి హ్యాప్పీస్, నేను హ్యాప్పీస్, ఆల్ హ్యాప్పీస్.

Friday, July 18, 2008

బ్లాగు వ్యాసం

ఈ నెల బ్లాగు వ్యాసం : జ్ఞాపకాలు
ఇలాంటిదేదో వస్తుందని ముందే ఊహించి ముందే రాసేశా. అదే ఈ చెనిక్కాయిలు ఉడకేసుకుందాం రా రా..

పోయిన నెలో అంతకుముందు నెలో ఇచ్చిన వ్యాసం: ఈత
ఇలాంటిదేదో వస్తుందని ముందే ఊహించి రాసేశా. అదే ఈ "డబుక్కు జర జర డుబుక్కు"

వచ్చే నెల ఏదొచ్చినా నేను రాసిందే వుంటుంది.అదే మరి ముందు చూపంటే.బ్లాగుల్లో ఎవరికీ తట్టని అవిడియాలు ఎవరికి తడుతాయంటే అది విహారికే.

Tuesday, July 15, 2008

ఎవడు గాలమేస్తే చేపలు పారిపోతాయో ఆడే ఈడు


ఒరేయ్! అన్నాయ్! చేపలు అలా పట్టర్రా. నాకివ్వు నే చూపిస్తా...
ఇదిగో ఇలా బాగా వెనక్కు లాగి .....
అలా విసిరి నీళ్ళళ్ళో వెయ్యాలి...
అన్నోయ్ చేప పడింది చూడ్రోయ్...
అమ్మోయ్ ఇది పట్టుకొనెళ్ళి మసాలా రాసేసి ఫ్రై చేసి పట్టుకొచ్చెయ్. నే తిని పెడతా.

(బొమ్మల మీద నొక్కితే విశ్వరూప ప్రదర్శన జరుగుతుంది)

Friday, June 27, 2008

మా యవ్వ -- 4

* * * * * * * *


మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం

* * * * * * * *


చానా తూర్లు మాదిరి ఒగ తూరి మా మామంగడి కాడికి బొయినా మా యత్త చక్కిరి దెచ్చుకోవల్లంటే. చక్కిరి మూట్లు ఆణ్ణే వుంటాయి. మామెవురిదో చేను రిజిస్ట్రేషనుంటే వాళ్ళకి సాయింగా వాయిల్పాడుకి బొయినాడు. మాముంటే "ఆడ చెయ్యి పెట్టగాకప్పా.. అది షాక్ కొడుతుందప్పా.. బీరువా అద్దం పగులిపోతుందప్పా.. పగిలితే దెబ్బ తగుల్తుందప్పా.." అని అంటానే వుంటావుడు అయనకింగేంపన్లా పిలకాయిలంటే కింద పడకుండా, మూతో, ముక్కో పగలగొట్టుకోకుండా వుంటారా ఏంది. ఈ పెద్దోళ్ళకేం తెలీదు. అందుకే మా యత్త అంగిడి కాడికి బోతా వుందంటే యాడికీ బోకుండా ఆణ్ణే వుంటా. అబ్బుడబ్బుడూ మా యత్తేమో "ఆడెక్కబాకప్పా... ఈడెక్కబాకప్పా... పడతావప్పా.." అంటుంది. ఏందో ఈమె గూడా అంతే పిళ్ళోళ్ళనింతర్వాత దెబ్బలు తగిలిచ్చుకోకుండా వుంటారా? మా మామకి సరైంది దొరికింది. యీళ్ళకన్నా మా యవ్వే చానా మేలు. ఏం జేసినా "జాగ్రత్తప్పా.. తగుల్తుందప్పా.." అంటుంది. తగిలిచ్చుకున్యాక ఏ తంగేడాకో ఏసి కట్టు గడుతుంది. కుంటితే ఎత్తుకోని తిరుగుతుంది.

అట్ల మా యత్త అంగిడి తెరిచిందో లేదో ఎదురింటి బువ్వమ్మొచ్చె నాకు కొంజేపు పోలీసు లేకుండా జేసేదానికి. బయట్నే బువ్వమ్మతో అరట్లు కొడతావుంటే ఇదే సందు రా నాయినా అని సర్రమని నేను లోపలికి దూరి బొయినా. ఆ మిద్ది లోనే చెనిక్కాయి మూట్లు, ఒడ్లు మూట్లు, చక్కిరి మూట్లు ఏసుంటారు. మన కన్ను మిద్ది లో ఈ మూల నుండి ఆ మూలకు ఏలాడ దీసిన రాగి రిబ్బను యాంటెన్నా మింద పడె. ఇస్టూలు దెచ్చి దానిమిందెక్కి ఒగ కాలు బెట్టి ఇంగో కాలు ఆడుండే చెనిక్కాయిల మూటల మింద బెట్టి ఆ యాంటెన్నాను పట్టుకుంటే అది పుటుక్కుమని తెగి పాయె. ఇట్లాంటియ్యన్నీ ఎబ్బుడూ కాసింత చేతులుండే పిళ్ళోళ్ళ చేతుల్లోనే ఎందుకు తెగి పోతాయో నాకర్థం కాలా. ఏమి జెద్దాం రో యబ్బో.. మామయితే తిడతాడు, అవ్వయితే పడితే కట్లు గడతాది, అమ్మయితే ఇంగేం ల్యా ఓనిమెంబడి పరిగెత్తిచ్చి చింత బరస తో గొడుతుంది. టీచురు గదా ఆ బుద్దులేడ పోతాయీ. చిన్నగ సౌండు జెయ్యకుండా కిందకు దిగేసి యాడుండే ఇస్టూలు ఆడే బెట్టేసి తేలు గుట్న దొంగలా బయటకొచ్చేస్తి. ఆడ జూస్తే ఏముంది మా యత్త ఇంగా బువ్వమ్మతో కచేరి పెడతా వుంది. వాల్ల కొడుక్కి మాల్లో (మహల్ - ఊరి పేరు) పెండ్లయిందంట. దాని గురించి జెబతా వుంటే ఇంటా వుంది. అబ్బుటికి ఇంగా పెండ్లి సీను కాడికి గూడా రాలా పెండ్లి కోసరం ఏమేమి గొన్యారో జెబ్తా వుంది. వోళ్ళు సాయిబూలు గదా ఆ జుంకీలు, పూసల నగల గురించి జెబ్తా వుంటే ఇంటా వుంది. ఈ ఆడోళ్ళింతే రోల్డు గోల్డు నగల గురించి జెబ్తా వున్యా చెవులకు సమ్మగా వుంటాది.

రామాయిణం కథ ఇంగా చానా వుందని మనం మల్లా లోపలికి బొయి చక్కిరి మూట తెరిచి రొండు సార్లు బొక్కాలాడేస్తిమి. ఒగ పక్క చక్కిరి మీసమొచ్చె. దాన్ని చోక్కా పైకెత్తి తుడుచుకుంటా వుంటే ఎంబ్రాయిడరీ తెల్ల గుడ్డ గప్పిన పెద్ద రేడియో కనిపిచ్చే. ఏందో మా మాముంటే ఏమీ కనిపిచ్చవ్ ఆయన జెప్పే మాట్లే ఇనిపిస్తాయ్. మల్లా ఇస్టూలేసుకోని రేడియో నాబు బట్టుకోని రొండు మూడు సార్లు తిప్పితి. సౌండు రాలా. రేడియో కొంజెము ముందుకు లాగితి. ఎనకాల క్లిబ్యాడు (ప్యాడ్) మాదిరి చెక్క కనిపిచ్యా. చిటికెనేలు బెట్టి దాన్ని లాగితే మొత్తం అట్ట ఊడి చేతిలోకొచ్చె. లోపలంతా జంతర్ మంతర్. పెద్ద పెద్ద బల్పులు కమ్మర కట్ల మాదిరి, ట్రాన్స్ ఫార్మర్లు మైసూర్ పాకుల మాదిరి , ఇంగొన్నేమో కజ్జి కాయిల మాదిరి , కెపాసిటర్లు చిన్న అత్తిరాసాల మాదిరి , సీసం ముద్దలు ఎన్న ముద్దల మాదిరి కనిపిచ్చినాయి. తీపి తినే వోళ్ళకు అన్నీ అట్లే కనిపిస్తాయని మా యవ్వ ఎబ్బుడూ జెప్పేది. అన్నీ ఓ తూరి చేత్తో నిమిరి కొన్నింటిని లాగి మల్లా ఆణ్ణే పెట్టేసినా. ఏన్ని జేసినా సౌండు రాలా. మా మామ షోక్కోసరం పాడై పూడిసిన రేడియో పెట్టుకొనుండాడ్లే అని అట్ట పెట్టి మూసేసి కిందకొచ్చేస్తి. సౌండు లేని రేడియోలెందుకు బెట్టుకుంటారో ఈ పెద్దోళ్ళు అనుకున్యా. సౌండ్యాలొస్తుంది వాన బడితే కరంటు షాకు గొడుతుందని మా మామ కరంటు ప్లగ్గు పీకి పాయె. అది మనకు తెలక పాయె.

సాయింత్రమయినంక వాయిల్ పాడ్నుంచి మా మామొచ్చె. రాంగానె బొయ్యి చేతిలో సంచీ పీకేస్తి. "వుండుప్పా నీ కోసం కలకండ తెచ్చినా" అని పెద్ద పెళ్ళ ఒగటిచ్చె. మిగిలింది దాంపెట్టేదానికి అంగిడికి కాడికి బాయె. ఇంట్లో వుంటే మనం చప్పరిచ్చేస్తామని మామకు చానా బయిం. ఈ బయిము అన్ని చోట్లా వుంటే బాగుండె అనుకుంట్ని గానీ అది మన చేతుల్లో లేకపాయెనె. అంగిడి కాడి నుండి తిరిగొచ్చినంక ఇంగ జూసుకో నా సామిరంగ.ఱంకెలెయ్య బట్టె.

"మ్మేయ్. ఎవురు రేడియో ని కలబెట్టింది. ఈణ్ణి గానీ అంగడికి కాడికి దీస్కోని బొయింటివా. ఈడు దుడుకోడు. ఈణి చేతులెబ్బుడూ చిమ చిమ లాడతా వుంటాయి. ఈణి చెయ్యి నిమ్మళంగా వుండదు. ఇబ్బుడది రిపేరీ జెయిచ్చల్లంటే కలకడ పోవల్ల " అని అత్తనడగతా వుంటే నా చెవుల్లో బడె. ఆడుంటే మనకి పెండ్లి జేస్తార్రా సామి అని గోడ మింద నుండి ఎరువుదిబ్బ మిందకు దూకేసి గానిగ తోపులోకి వురుకో వురుకు.

ఇంటికొచ్చినంక అవ్వ సపోర్టుతో ఈపు సాపుగానె వుండిపాయె.

* * * * * * * *


ఈ పెద్దోళ్ళకు బయిమూ లేదూ ఇంగా ఏమీ పనీ లేదు లీవూల్లో పిల్లోళ్ళు ఏట్లంబడి, బాట్లంబడి, చెట్లంబడి, పుట్లంబడి తిరక్కుండా వుంటారా ఏంది? సందు దొరికితే సొక్క కాలరు బట్టుకొని కూసోబెట్టిస్తారు. అవ్వలు తాతలు అయితే పరవాలా. వాళ్ళ కింద నుండే తరముంది గదా ఈళ్ళే ఈళ్ళ సొమ్మంతా బోయినట్టు మనల్ని కూసోబెడతారు. అట్లా కుదరకపోతే వాళ్ళకన్నా పెద్దోళ్ళకు జేబ్తారు పిలకాయిలకు ఏమన్న నేర్పిచ్చచు గదా అని. ఇట్లే వాళ్ళ మాయ దారి మాటలు నమ్మి మా యవ్వ నన్నోసారి "ఎండన బడి పోగాకు నాయినా. ఇట్లా ఒచ్చి ఆ సింత సెట్టుకిందేసిన నులక మంచెం మింద కూసో. దాని మింద పరుపేస్తా గొంచెముండు" అనే. చింత చెట్టు కింద సల్లగా గాలోస్తా వుంది. ఆ ఎండకి సల్ల గాలికి సగిచ్చినట్టుగా వుంది. ఒగ సారి పండుకుంటే చింత సెట్టెగిరిపోయేట్టు గురకలు బెట్టి నిద్దర బోతా. అబ్బుటికి ఆడుకునే దానికి ఎవుడూ రాలా. ఇట్లా మా యవ్వ సట్లు కడిగేసి నార పరుపెత్తుకొని సెట్టికిందకొచ్చె అట్ల ఆడుకునేదానికి బోడోడొచ్చె. ఏందిరాయబ్బో ఎట్ల తప్పిచ్చుకునేదని పిల్లి ముందర ఎలక మాదిరి దిక్కులు జూడబెడ్తి. ఇంగే ముంది మా యవ్వ నులక మంచమ్మింద గూచెబెట్టె. కూసోని ఊరికే వుంటుంద్యా ల్యా. ఏ జెక్కీకి పాటో పాడితే నేను డ్యాన్సేస్తా ల్యాకుంటే కావమ్మ కథ జెబ్తే ఇంటా. అట్లా గాకుండా ఏందో శ్లోకం జెబ్తా పాయె. అదేందో "ఓం సిద్ధమ్న మహః" అంట. జెప్పేసి చెంబులో నీళ్ళు తాగి ఆపక్కన తిరిగి పండుకోకుండా నువ్విబ్బుడు జెప్పుప్పా అనె. "ఓం సిద్ధమ్న మహః సిద్ధమ్మని గద్దలెత్తుకుని పాయె.. సిద్ధప్ప కట్టె బట్టుకుని వాటెంబడి పరిగెత్తా పాయె.. నేను గూడా పరిగెత్తా పోతా " అని నేను నాలుగు దుముకు లేసి పరిగెత్తు కుంటా వురుకో వురుకు. "ఏం బిడ్డలురా నాయినా మీరు" అని ఆ మంచమ్మిందనే కునుకు తీసె ఇంగ. అట్లన్యా మనకు తెలుసు సాయంత్రం మనం గుడ్డలు గలీజు జేసుకోని రాంగానే టెంకాయి బొచ్చుతో మురికంతా రుద్ది రుద్ది నీళ్ళు బోసి ఏరే గుడ్డలేసి మెట్ల మింద గూసోబెట్టి మచ్చల కోడి పెట్ని గుడ్డు తో మనకు అట్టేసి పెడుతుందని. ఇంగంతే కదా అవ్వలంటే.

* * * * * * * *


ఇట్లే ఒగ సారి ఏట్లోకి బొయ్యి నీళ్ళల్లో ఈత గొట్టి అంటే కాళ్ళు నీళ్ళలో, చేతులు గడ్డ మింద పెట్టి నీళ్ళలో బాగా మునిగి ఇంటి కొచ్చినా చీగటి బడి గొడ్లు ఇంటిగొచ్చేటబ్బుడు. ఏమీ తినకుండా పండుకోని నిద్దర బోతి. అబ్బుడు మనకు అయిదెండ్లుంటాయేమో.స్పారకం లేకుండా నిద్దర బొయినా.కడుపుకేం దెలుస్తుంది స్పారకమేందో. అది కోడు గుడ్డు జాములో లేసి కోలాటమేసె. నేన్‌ లేసి "నా కన్నమో.. నా కన్నమో.. నా కన్నమో.." అని గలాట జేస్తి చేతుల్ని ఏతాము మాదిరి తిప్పుకుంటా. మా యమ్మకు కోపమొచ్చె. "ఎన్ని తూర్లు జెప్పినాన్రా నీకు కాసింత అన్నం తిని పండుకోమని ఇంటావా నువ్వు" అనె. అర్ద రేత్తిరి కాడ లేసి అరిస్తే ఎవురికి కోపం రాదు. చానా మందికొస్తుంది గానీ మా యవ్వకు రాదు. "అరె పా..నువ్వూర్కో అమ్మణ్ణీ. పాపం పిలగాడు అర్ద రేత్తిరికాడ అన్నమంటావుంటే కసురు కుంటావే. నేను రూంత ముద్దలు కలిపి పెడతా. నువ్వు పండుకో " అనె.

కన్ను బొడుచున్యా ఏమీ గనిపిచ్చదు. కిరసనాయిలు బుడ్డీ ఎలిగిచ్చుకోని అన్ని సట్లల్లో జూసె. యాడా ఒగ మెతుగ్గూడ దొరకలా. పులుగూ బూసి వుంటాయణ్యా ఇనకుండా ఆ చీగట్లోనే గాడ్డామి కాడికి బొయ్యి కొంచెం ఎండు గడ్డి దెచ్చి దాని మింద కిరసనాయిలు బోసి పొయ్యిలో ఏసి జొన్న కర్రల్తో పొయ్యెలిగిచ్చె. కొంచెం అన్నమూ, కొంచెం చిన్నెరగడ్ల తాళింపు చేసి పెట్టె. మనమేడ? ఎబ్బుడో ఎరగడ్లు పొట్టు ఒలిచేబ్బుడే నిద్దర్లోకి జారుకుంటిమి. లేపి "తిన్నాయినా. నీకిష్టమని ఎరగడ్ల తాళింపు జేసినా" అనె. నేనేమో "నా కొద్దో.. నా కొద్దో.." అనబడితి. "కొంజిము తినుప్పా.. లేగపోతే నిద్దర బట్టదు.మా చిన్ని కదా..లే నాయినా.." అనె మల్లా. మనమేమో దుప్పటి గప్పుకోని "నా కొద్దో..నా కొద్దో.." అని రికార్డు ఎయ్యబడ్తిమి. మా యమ్మకు మళ్ళీ కోపమొచ్చె. మా యవ్వేమో "పొన్లేమ్మా. బిడ్డకు నిద్దరొస్తా వుంది. పండుకోనీలే" అని కాపాడె. నన్నెనకేసుకొచ్చే దానికే అవ్వ బుట్టిందేమో.

* * * * * * * *


అబ్బుడెబ్బుడో జెప్పినా గదా ఒగ తూరి మనం చానా చిన్నగా వుణ్ణప్పుడు మనల్ని ఆస్పత్రిలో జేరిపిచ్చినారని. మదనపల్లి గౌషాష్పత్రి ఓళ్ళు నన్ను జూసి "అయ్యో ఈ పిల్లోనికి ఎన్ని మందులేసినా తగ్గ లేదే. మా వళ్ళ కాదు గానీ వేలూరి పెద్దాసుపత్రికి తీస్కోని పొండి. నేను జెయ్యాల్సిందంతా జేసినా. ఈ రోగమేందో నాకు తెల్లా. ఆడ పెద్ద డాక్టరు, ముత్తయ్య డాక్టరుండాడు ఆయినికి చీటీ రాసిస్తా" అని డాక్టర్ జెప్పె. ఇంగ జూసుకో మా యమ్మేడిశా, మా నాయినేడిశా, మా మామేడిశా, మా పెద్దమ్మేడిశా. ఇంగ మాయవ్వుంటుంద్యా "అయ్యో మారాజట్ల పిలగోనికి ఏమి రోగమొచ్చినో ఏమో" అని చీర కొంగు నోట్లో దోపుకునే.

(సశేషం)

* * * * * * * *