Thursday, October 26, 2006

ఓ సిరివెన్నెల పాట

హృదయాన్ని కదిలించే మరొ ఆణి ముత్యం సిరివెన్నెల వారి కలం నుంచి...

ఓ సారి ఈ కింది లంకె ను నొక్కండి.


భారత రవి కిరణమా...

Tuesday, October 24, 2006

స్వర్గం - నరకం

అది 2025 వ సంవత్సరం....

శ్రీ శంకర్ యాదవ్ తను స్థాపించిన ధార్మిక సంస్థ కార్యాలయం లో పనులు చూస్తున్నాడు. తను రెండు కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన అనాధ శరణాలయం నుండి వచ్చిన శరణాలయ పర్య వేక్షణాధికారి అడిగిన పనులకు డబ్బులు మంజూరు చేసేసి అప్పటికే ఎంతో సేపటినుండి తన కోసం ఎదురు చూస్తున్న అభాగ్య జీవుల గాథలు విని తలో అయిదు వేలో పది వేలో ఇస్తున్నాడు. దాన్ని స్వీకరించిన వాళ్ళు ఎంతో అప్యాయంగా "నూరు కాలా ల పాటు చల్ల గా వుండు నాయనా!" అని దీవిస్తున్నారు. వారి ఆశీర్వాదాలను అందుకుని ఏదో ఊరి నుండి వచ్చిన వారికి గుడి కోసమని మరో యాభై వేలు ఇచ్చాడు. అక్కడ గుమికూడిన జనమంతా అయనకు జేజేలు పలికారు.

అది 2004 వ సంవత్సరం....

శంకరన్న పేరు చెబితే ఆ చుట్టుపక్కలున్న ప్రజలందరి కి హడల్. వయసులోవున్న ఆడవాళ్ళెవరూ అతని ఛాయలకు కూడ వచ్చేవాళ్ళు కాదు. అక్కడ సాగే గుడుంబా, కల్తీ సారా లన్నింటికీ అతనే నాయకుడు. అడ్డూచ్చినోళ్ళను అడ్డంగా నరకడమే పని. ఆ వూరి ఎమ్మెల్యే అండగా దగ్గరే వుండి అన్ని పనులూ చేయించే వాడు. అప్పటి దాకా ఓ మాదిరి గా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫ్యాబ్ సిటీ మరియూ రింగ్ రోడ్ వల్ల ఒక్క సారిగా వూపందుకుంది. ఇక ఎమ్మెల్యే గారి కళ్ళు రియల్ ఎస్టేట్ మీద పడ్డాయి. మందిని బెదిరించడం ఇళ్ళు పొలాలూ ఖాళీ చేయించటం పట్టా లు తన పేరు మీద రాయించుకునే పనులన్నీ శంకరన్న మీద పడ్డాయి. ఎకరా లక్షో లక్షన్నరో ఉన్న భూములు కూడ అమాంతం రెండు మూడు కోట్లు పలకటం మొదలయింది. ఇంకేముంది శంకరన్న సొంత జెండా ఎత్తుకొని ఆ ఎమ్మెల్యే ని ఓ మంచి సమయం చూసి పై లోకానికి పంపించాడు. ఆ వచ్చిన ఉప ఎన్నికల్లో శంకరన్న సత్తా చూసిన ప్రభుత్వం అతనికే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపించుకుంది.

ఒక ఏడాది తిరిగే సరికి శంకరన్న కు ఆ ఏరియా లో వెయ్యి ఎకరాలకు పైగా భూములు తన పేరు మీదకో లేక బినామి పేర్ల మీదకో రిజిస్టరు చెయ్య బడ్డాయి. అడ్డొచ్చిన వాళ్ళు కైలాసగిరి కి పంపబడ్డారు. బతికున్న కొంతమంది పిల్లా పాపల్తో బజార్న బడ్డారు. శంకరన్న కాస్తా అసలు పేరు తో శ్రీ శంకర్ యాదవ్ గా పిలవ బడ్డాడు. ఇరవై ఏళ్ళ తరువాత తన పలుకుబడిని ఇంకా పెద్దది చేసుకోవాలని తన అరాచకాలను కప్పిపుచ్చు కోవాలనే ఉద్దేశ్యం తో కొన్ని సేవా సంస్థలు కూడ మొదలు పెట్టాడు.

2026 వ సంవత్సరం....

శ్రీ శంకర్ యాదవ్ ఉరఫ్ శంకరన్న అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి మరణించాడు. యమ భటులు ఇద్దరు వచ్చి శంకరన్న ఆత్మ ను తీసుకును వెళుతుంటే శంకరన్న అడిగాడు "యమ కింకరులారా! నన్ను మీరిప్పుడు నరకానికి తీసుకు వెళుతున్నారు కదా అది ఎలా ఉంటుందో నాకు చెబితే నేను మెంటల్ గా ప్రిపేర్ అవుతా".
దానికి ఆ కింకరులు ఫక్కున నవ్వి "నువ్వు వెళుతోంది నరకానికి కాదు స్వర్గానికి" అన్నాడో కింకరుడు.
"అదెలాగబ్బా?"
"నువ్వు పిచ్చోడి లాగున్నావే యమ కింకరులు ప్రాణాలు తీసి నరకానికే తేసుకెళ్ళడమే కాదు, నరుడి తప్పొప్పులను బట్టి స్వర్గానికి కూడ తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేస్తాం "
"మరి నేను ఎన్నో మర్డర్లూ మానభంగాలు ఇంకా ఘోరమైన పనులు చేశా కదా నన్ను స్వర్గానికెందుకు తీసుకెళుతున్నారు"
"చూడు నరుడా నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా చచ్చే ముందు ఒకటో రెండో మంచి పనులు చేస్తే చాలు స్వర్గానికి బెర్తు కొనుక్కోవచ్చు. అలాగే చాలా సదుపాయాలు కల్పించారు మన దేవుళ్ళు"

శంకరన్న తన మనసులో " అలాగయితే స్వర్గం లో కొన్నాళ్ళుండి మళ్ళీ నన్ను ఈ గడ్డ మీదే పుట్టించమని ఇంద్రుణ్ణి అడుగుతా"

నీతి: ఎన్ని నేరాలు ఘోరాలు అయినా చెయ్యొచ్చు. స్వర్గానికి బెర్తులు జీవితం చివర్లో కొనుక్కో వచ్చు.

ఎక్కడో చదివా...కాపీ చేసి ఇక్కడ పెట్టా

Once upon a time a Washerman was bringing up two donkeys. Let us say Donkey-A and Donkey-B.

Donkey-A felt it was very energetic and could do better than the other. It always tried to pull the washerman's attraction over it by taking more load and walking fast in front of him.

Innocent Donkey-B is normal, so it will walk normal, irrespective of the washerman's presence. After a period of time, Washerman started pressurizing Donkey-B to be like Donkey-A. But Donkey-B unable to walk fast got continuous punishment from washerman. It was crying and told personally to Donkey-A "Dear friend, only we two are here, why to compete with each other.... we can carry equal load at normal speed".

That made Donkey-A all the more energetic and next day it told to washerman that it can carry more load and even it can run fast also.

Obviously happier washerman looked at Donkey-B.., his BP raised and he started kicking Donkey-B. Next day with a smile, Donkey-A carried more load and started running fast. But it was breathtaking for Donkey-B and it couldn't act that way. But the washerman was frustrated, so he harassed Donkey-B terribly, and finally it fell down hopelessly.

Then Donkey-A felt itself as a supremo and happily started carrying more load with great speed. But now the Load of the Donkey-B was also being carried by Donkey-A and still it had to run fast. For some period it did, finally due to fatigue it became tired and started feeling the pain. But the washer man expected more from Donkey-A. It also tried its best, but couldn't cope up with his owner's demand. The Washer man got angry with Donkey-A also and started harassing it to take more load. Donkey-A was crying for long time and then tried its best... But it couldn't meet the owner's satisfaction. Finally the day came when due to frustration the washer man killed Donkey-A; and went searching for some other Donkeys.

It’s an endless story....

But the moral of the Story in Corporate life is...,

"Think all colleagues are same and that everyone is capable... Always Share the Load equally... Don't ever act smart in front of your Boss and never try for getting over-credit. Don't feel happy when your colleague is under pressure… "

It doesn't matter if u are A or B, for theBoss u shall be always be aDONKEY

And most importantly, never Work hard... Work Cleverly  

Thursday, October 12, 2006

చికెన్ గున్యా తో ఎవరూ చనిపోలేదట....

http://www.telugupeople.com/news/news.asp?newsid=10275&catid=59

అవును చికెన్ గున్యా వచ్చి ఎవరూ చనిపొలేదు.
మందుల్లేక చనిపొయారు.
డాక్టర్లు దొరక్క చనిపొయారు.
చాంతాండంటి క్యూల్లో నించోలేక చనిపోయారు.
దోమలు కుట్టడం వల్ల చనిపోయారు.
వళ్ళు నొప్పుల వల్ల చనిపోయారు.
వేసుకున్న మందు వికటించడం వల్ల చనిపోయారు.
నొప్పులు తగ్గవనె బాధ తో చనిపోయారు.
దోమల్ని చంపలేక చనిపొయారు.
అవును చికెన్ గున్యా వచ్చి ఎవరూ చనిపొలేదు.


జిందాబాద్...జిందాబాద్..మన పరిశీలనా జ్ఞానానికి జిందాబాద్.
జిందాబాద్...జిందాబాద్..మన దేశ సౌభాగ్యానికి జిందాబాద్.

Tuesday, October 10, 2006

మా యవ్వ - 2

బాటెంబడి బోతాంటే చేన్లో పన్జేసుకునే వోళ్ళు, మడి కయ్యిల్లో పన్జేసుకునే వోళ్ళు అందురు మమ్మల్ని జూసి పల్కరిచ్చేటోల్లు.

మద్దిలో దిగిడు బాయి దగ్గిరికి రాంగానే మా యమ్మ నా చెయ్యి పట్టుకుని "చిన్నీ, పడిపోతావురా " అని దిగిడు బాయి దాటే దాంక నన్ను బట్టుకుని వుండేది.

ఇంగ వూరి కాడికి వొచ్చేసరికి రాగి మాను మింద పెద్ద పెద్ద చినిగి పొయిన జెండాలు కనిపిచ్చేటివి. అవి సాయిబూల జెండాలంట ఒగటేమో పచ్చగ ఇంగోటేమొ ఎర్ర వుండేటివి. ఆ రాగి మాను కిందనే పీర్ల పండగ చేసే వోల్లు. ఆ రాగి మాను కింద చినిగి పొయిన అంగీ తో చెడ్డీ లేకుండ నిలబడి ఉన్న పిల్లోడికి ఓ బువ్వమ్మ జెప్పేది " వో రామయ్యన్న బహన్ కో బచ్చేరే" అని. ఆ బువ్వమ్మే మా యవ్వకు బొంతలు కుట్టిచ్చేటిది.

మేం బొయ్యేది ఎండా కాలం లో అయితే ఇంగ చూడల్ల. దారెంబడి చెనెక్కాయలు ఒలిచే శబ్దాలే. చానా మంది ఇండ్ల ముందర, చెట్ట్లకింద చెనిక్కాయలు గుట్లు గుట్లగా పోసేసి ఉండే ఓల్లు. ఒగ గంప చెనిక్కాయలు ఒలిస్తే పది పైసాలిచ్చే ఒల్లు. ఎక్కువ గంపలు ఒలల్లని కొంత మంది నోట్లో చెనిక్కాయలు పెట్టుకుని కొరిక్కొరికి ఒలిచే ఒల్లు. వాల్ల పెదాలు తవుడుని ముద్దు పెట్టుకుణ్ణట్టుందేది. నీకు చాన డౌటొచ్చేది వీల్లు ఒలస్తా వుండారా లేక చెనిగ్గింజలు తింటావున్నారా అని. ఆ ఒలిచే వాల్లలో మా యవ్వో అత్తో వుంటే ఆ చెనిక్కాయలు పక్కనోల్లకి ఇచ్చేసి. " మా యమ్మి ఒచ్చింది నేను బోతాండ" అని ఒచ్చేసొటొల్లు.

ఇల్లు దగ్గిరికి రాంగానే మనము మా యవ్వా వాళ్ళ ఇంట్లోకి వురుకో వురుకు. రొడ్డు ఒరుసుకు పోకుండా రాళ్ళు, చిన్న చిన్న బండలు ఉన్నా గానీ లెక్క చేయకుండ గొడ్ల చావిడి దగ్గిర మెట్ట్లు దాటేసి ఇంటి అరుగు మీదెక్కి బొయ్యెవాడిని. ఇల్లు బీగం ఏసుంటే బీగం యాడుందో నాకు తెలుసు కాబట్టి బీగం కోసం ఇంటి చూరు బట్టుకుని బైకి బొయ్యి బీగం చెవి తెచ్చి మా యమ్మకి ఇచ్చే వోడిని. ఆ వూళ్ళొకెల్ల మా యవ్విల్లు స్పెషల్ ఎందుకంటే గుడిసయితే గోడల్ని మట్టి తో కొంచెం తక్కువ ఎత్తు లో కడతారు. దాన్ని ఎదో కసువు తో నో జమ్ము తోనో కప్పతారు. మిద్దయితే యిటిక తో నో రాయి తో నో కడతారు. దాని మీద్ సుద్ద గార లేకపోత సిమెంటేస్తారు. ఈ ఇల్లు మాత్రం మంచి యిటికల్తో ఎత్తుగా గట్టి దాని మీ కసువు గప్పినారు. యింట్లేకి పోంగానే మా యవ్వ యింట్లో గూడు మీద (మట్టి తో చేసిన బెంచీ లాంటిది) ఉన్న మట్టి కుండ లో నీళ్ళు మా మామ వాడే కంచు లోట తో ఇస్తాది. ఆ లోటా యెవుడు బడితే వాడు వాడ కూడదు. మనం కుంచెం స్పెషల్.

తరవాతా "యెండన బడి వొచ్చినారు..మజ్జిగ తాగతావా ప్పా" అంటుంది.
"ఒద్దు లేవ్వా మళ్ళ తాగుతాలే" అంటా ఇంట్లో ఉట్టి మీద కన్నేసి. " అవునవ్వా ఇబ్బుడు ఎన్నావులు పాలిస్తా వుండాయి" మన ప్రస్నలు మొదలవుతాయి.
"యాడప్పా! యిబ్బుడు తక్కువే ఇచ్చా వుండాయి..ఆ ఎర్రావు ఒట్టి బొయిందీ(ఇ). ఆ నల్లావూ, చారల్వావూ తక్కువే ఇచ్చా వుండాయి.".
"ఏంది సీనిగాడు(జీత గాడు) లేడా?"
"వుండాడు...ఓడు అడివికి బొయినాడు ఆవుల తోలుకునీ(ఇ)...మాపటేల కొచ్చే చ్చాడు."
"నా అత్తిరాసాలేడ?"
"ఆ దొంతి మీద సట్లో ఉండాయి ఇచ్చా వుండు ఆ దొంతి దించల్లుండు"
"ఆ డెందుకు పెట్నావు కింద ఆ పెట్లో పెట్టచ్చు గదా"
"ఎలకలెక్కువయి పొయినాయీ(ఇ)..ఇబుడు పంది కొగ్గొగటి గూడ వచ్చాంది. ఈ పిల్లులు బాగా మాజ్జిగన్నం తిని అటవలోకి బొయ్యి పండుకుంటాయి ఎలకల్ని పట్టేది లా..ఏమీ లా.."
మనకి అత్యంత ప్రీతి పాత్ర మైన వంటకం "అత్తిరాసాలు" (అరిసెలు). దాని తరవాత పాకం పప్పుంటలు.
"పాకం పప్పు జేసినావా?"
"జేద్దామనే బెల్లం గూడ దెచ్చినా.రేపు జేచ్చా ప్పా!".
"సర్లే అయితే నేను అదెప్ప మామొల్లింటికి బొతా ఈ అత్తిరాసాలు దినేసి. బొడోడు(ఇంకో మామ కొడుకు) ఇంటికాడ్ణే వుండాడా లేక యేటి కాడికి బొయినాడా ".
"వోడు యేటికాడికి బొయినాడు మడి కి నీల్లు గట్టేదానికి. నువ్వాడికి బొవద్దుప్పా! యేట్లొ నీల్లు బాగ వుండాయి".
"నాకెం గాదు లేవ్వా ..నేను బొతావుండా"
మనం యేటి కాడికి వురుకు...మా యమ్మ ఇంగ మా మామొల్లింటికి పరుగు. మా మామ కూతుర్ల లో ఒగర్ని మనకు సెంట్రీ గా పంపిస్తుందన్న మాట.

తరువాత మనం పాలెట్ల తాగే ఓల్లమో జబ్తా...అంతవరకు యేట్లొ చేపలు పడ్తా.

(సశేషం)

Monday, October 09, 2006

పోకిరి...పండు..బేబి పండు

ఏ ముహూర్తాన "పోకిరి" సినిమా వచ్చిందో గానీ. మా ఇంట్లో మాత్రం ఓ పోకిరోడు తయారయ్యాడు. ఇక్కడ (డెన్వర్) పొకిరి సినిమా వేస్తున్నారని తెలియగానే నేను మాయావిడా, మా అయిదేళ్ళ బుడ్డోడూ అందరూ వెళ్ళాం. మా బుడ్డోడి వల్ల ఎంత సినిమా మిస్సవుతామో అని అనుమానిస్తు వెళ్ళాము థియేటర్ లోకి. ఎందుకంటే బుడ్డోళ్ళకి కుదురుగా ఒక చోట కూర్చొవడం అలవాటు లేదు. ఇక సినిమా మొదలయినప్పటి నుండి స్క్రీనంతా తన్నులూ.. గన్నులే. ఇకే బుడ్డోడికి పండగే పండగ.

మేము ఒక సీను కూడ మిస్సు కాలేదు.

********************************************************************************

ఇంటికొచ్చి వేడి వేడి గా ఏదన్నా తిందామని సద్ది ఫుడ్డు ఫ్రిజ్ లోనుంచి తీస్తూ "రుషీల్, నువ్వేం తింటావ్ నాన్నా!" అని అడిగితే

"call me as పన్ డూ don't call me rushil". అని బుడ్డోడి నుండి సమధానం.

ఈ పండెవరబ్బ అని అలోచిస్తే అప్పుడర్థ మయింది పోకిరి లో మహేష్ బాబు పేరు పండు అని. ఇక ఆ సినిమా మహత్యమే మో గానీ వాణ్ణి పిలిచి "పండూ ఇది చేసి పెట్టావా" అంటే ఠక్కున చేసి పెట్టేస్తున్నాడు.

వాడి అసలు పేరు తొ పిలిస్తే " నన్ను పన్ డూ అని పిలవాలి ఓ.కే?" అని ఫోజు నడుం మీద చేతులు పెట్టుకుని. అప్పట్నించీ వాడి పేరు పండూ.

********************************************************************************

ఇప్పటికి ఆ సినిమా దర్శనం థియేటర్ లో మూడు సార్లు...ఇంట్లో లెక్కలేనన్ని సార్లు. వెరసి మాకు బోళెడు బుజ్జగింపులు...బోళెడు బూచాడి కతలు మిగులు. పండూ అని పిలవగానే ఠక్కున ప్రత్యక్ష్యం..ఠపీమని పని అయిపోవడం. తరవాత తొండ ముదిరి ఊసరవెల్లి అయింది. ఇదిగో ఇలాగ.

"పండూ! అమ్మ పేరేంటి?"
"అమ్మ పండు" (కిల..కిల..కిలా...బ్యాక్ గ్రవుండ్ లో)

"మరి నాన్న పేరేంటి?"
"నాన్న పండు" (కిల..కిల..కిలా...బ్యాక్ గ్రవుండ్ లో)

"మరి నీకు తొందర్లో తమ్ముడో చెల్లెల్లో పుడుతున్నారు కదా ఏం పేరు పెడదాం?"
"బేబి పండు".

(దబ్బు మని ....ఇద్దరు కింద పడ్డ శబ్దం)

Thursday, October 05, 2006

మా యవ్వ. - 1

***************************************************
ఏదో ఒకటి మొదలు పెట్టాలి..మొదలు పెట్టాలి అనుకుంటుంటే అనిపించింది. ఏదో ఒకటి ఎందుకు. ఎందుకైనా మంచిది ఓ మంచి దాన్తో మొదలు పెడితో సరిపోతుంది కదా అని. ఇక చిన్నప్పటి సంగతి తో మొదలు పెడ్తా.
***************************************************


నేను నా చిన్నబ్బుట్నుంచి పెరిగింది చిన్న చిన్నూళ్ళలో. ఏందుకంటే మా యమ్మ మా నాయినా జేసే పని టీచురు పని. అబ్బుట్లో సింగిల్ టీచర్ స్కూల్ లేదా ఇద్దురు పన్జేసే స్కూల్ వుంటే ఆడికి ట్రాన్స్పర్ చేసే వోళ్ళన్న మాట. నేను చాన చిన్న పిలకాయనని నాకన్న రొండేళ్ళు పెద్దోడయిన మాయన్న ని దగ్గరే బెట్టుకుని నన్ను మాయమ్మ మా యవ్వోళ్ళూరు లో పెట్టింది కొన్ని దినాలు .అబ్బుట్లో నే మా యమ్మ బేబి సిట్టింగ్ ని అవుట్ సోర్స్ చేసేసింది.మాయవ్వంటే మా యమ్మొళ్ళ అమ్మన్నమాట. మా యవ్వ నన్ను చాన బాగ జూసుకునేది. మా పెద్ద మామ గూడ నన్ను చాన బాగా జూసుకునేవాడు. పాపం ఆయనకు పిలకాయల్లేరు. ఆ వూరి పేరు జెప్పలేదు గదూ. ఆ వూరి పేరు యర్ర కోట పల్లి. చిత్తూరు జిల్లా కలకడ దగ్గిర ఓ చిన్నూరు. ఆ వూర్లో మా మామంటే మా మామే. అదే పెద్ద మామ. ఇంక ఇద్దురు మామలుండార్లే అందుర్లోకి చిన్న మామ కిట్ట మామ. ఆయనెబ్బుడు స్టయిలు గా ఉండే వోడు. ఆయన జేసే పనేమో దేశాలు తిరగడం ఎబ్బుడు జూసినా బొంబాయి కి బొయ్యేవాడు. వూళ్ళో అందురూ బొంబాయి కిట్టయ్య అనే వోళ్ళు. ఎబ్బుడూ నళ్ళద్దాలు పెట్టుకుని బొచ్చు టోపీ పెట్టుకునే వాడు. ఇంగో మామేమో మా పెద్ద మామ ఇంటి దగ్గిరే ఇంగో ఇంట్లో వుండే వోడు. ఆయనకు అయిదు మంది కూతుర్లు ఒగ్గొడుకు. కొడుక్కోసరం అంత మందిని కణ్ణాడంట. అందురూ సేద్యం జేసుకునేటొళ్ళే.అబ్బుడే జెప్పినా కదా మామామంటే మామామే అని. ఆయనకి రేషన్ షాపు, గుడ్డలంగిడి ఇంకా ఏవేవొ వుండేటివి. ఆయన వూళ్ళో అందరికి సహయం చేసే ఓడు. అందురికి తళ్ళో నాలికంట. నేనేమో ఆయన్ను పెద మామా అంటే వూళ్ళో వాళ్ళందరూ రామయ్యన్నా అనేవోళ్ళు. ఈ ముగ్గురి కొడుకులకి ఇంగొ ముగ్గురి కూతుర్లకి అమ్మే మా యవ్వ. మా తాత నేను బుట్టక ముందే చచ్చి పొయినాడంట. నేను చాన చిన్నగ వుణ్ణప్పుడు అంటే నేను చెడ్డీ లేకుండ పరిగెత్తే టబ్బుడన్న మాట చాన ఎర్రగా బుర్రగా బొద్దుగా వుండే వాణ్ణని వూళ్ళో వాళ్ళు నన్ని దీసుకోని పొయి వాళ్ళింట్లో ఆడిచ్చుకునే వాళ్ళంట. నాకు తరవాద్దెలిసింది లే నేను ఎర్ర గా లేనని. నేను కుంచెం పెద్దయిన తరువాత, అంటే ఇంట్లో వున్న నీళ్ళ బాయి బండ మీద నుంచి నిక్కి నిక్కి బాయి లోపలికి చూసేంత పెద్దన్నమాట, మా యవ్వ మా యమ్మని పిలిచి "అమ్మణ్ణీ, వీడు బాయి లోకి పారికి పారికి తొంగి జూచ్చా వుండాడు వీణ్ణింగ నువ్వు తీసుగోని బో " అని జెప్పింది. ఇంగేముంది మా యమ్మ నన్ను తాను పన్జేసే వూరికి దీసుకును పొయింది. ఆ వూరి పేరు నెల్లిమంద. ఇంగ జూసుకో మనికి ఇస్కూళ్ళో పండగే పండగ. మనం టేచురు కొడుకు కదా ఎవుణ్ణయినా తిట్టచ్చు గిల్లొచ్చు కొట్టొచ్చు. ఎవురు పుచ్చకాలైన(బుక్కుల్ని నేనట్లే పిలస్తా) చించొయ్యచ్చు. ఎవురి పలకలైన..ఎవురు తలకాయలైన పగలకొట్టచ్చు.ఆ వూళ్ళో పిల్లకాయలందరి పలకలు పగిలి బొయినంక మళ్ళీ ట్రాన్స్పరొచ్చి లద్దిగం లో యేసినారు. ఆడ్నే మనల్ని గూడా స్కూళ్ళో యేసినారు. మాయమ్మ స్కూల్లో ఒగటోతరగతి కి రెండో తరగతి కి పాటాల్ జెప్పేది. మా నాయినేమో మూడో తరగతి నాలుగో తరగతి అయిదో తరగతి కి బొయ్యే ఓడు. అబ్బుడు స్కూళ్ళంతే. ఇంగేముంది ఆ స్కూళ్ళో గూడ మనమే రాజులం. ఎవుడూ మనల్ని రేయ్ అనే వోళ్ళు గాదు. అందురు "య్యోవ్" అని పిలిచే వోళ్ళు. "య్యోవ్" అంటే అయ్యా అని అర్థమన్న మాట. పొద్దున్నే ఎవుడో ఒగడు ఒచ్చి మా ఇంట్లో నుండి నా బుక్కులు(పుచ్చకాలైన) దీసుకోని స్కూళ్ళొ నా క్లాసులో ముందు లైన్లో బెట్టే వోడు. మళ్ళీ ఇంగోడు మద్యానానికి ఇంట్లో తెచ్చి పెట్టే వోడు. ఎబ్బుడూ స్కూలుకు బోక పొయినా మనమె క్లాసు ఫస్టు.నా బుక్కులు స్కూళ్ళో వుంటే నేనేమో పల్లి లో చెరువులు కాడ బాయిల కాడ ఆడుకునే దానికి బోయే వోణ్ణి. మా యమ్మ ఎబ్బుడన్న స్కూళ్ళోఎ డిక్టీషన్ జెబ్బేటబ్బుడు ఇద్దుర్నో నలుగుర్నో పంపిస్తుంది మన కోసం. అబ్బుడు వాళ్ళందురు మన కోసం చింతోపుల్లోనో బాయికాడనో చెరువుకాడనో కుంట కాడనో ఎతుకుతారు. నేను దొరికితే ఒచ్చి చేతులు కట్టుకుని "య్యోవ్ మ్యాడం రమ్మంటా వుంది.డిక్టీషన్ జెబుతుందంట" అని జెప్తారు. మనమేమో "తరువతొస్తా పోరా" అని వాణ్ణి గాఠ్ఠి గా అరిచి పంపిచ్చేసేవాణ్ణి. ఇంగొంత సేపటికి మళ్ళీ ఇంగోడు ఒచ్చి జెబ్తే. సర్లే పదరా అని వురుకెత్తుకుని ఒచ్చి క్లాసులో మా యమ్మిచ్చిన డిక్టీషన్ గబగబ రాసేసి చూపిచ్చేస్తే మనకు పది కి పది మార్కులు ఒచ్చేవి. దొంగ మార్కులేమీ కాదు లేబ్బా. అబ్బుడు మనం బాగానే జదివి వేవాళ్ళం ఇంటికాడ స్పెషల్ క్లాసులుంటాయి గదా.నా క్లాసులో ఇద్దురో ముగ్గురో సీ గాన పెసూనాంబ లు వుండే ఓళ్ళులే.


ఇట్లే ఒగ తూరి స్కూలెగ్గొట్టి వూళ్ళో రమణప్పోళ్ళ మొక్క జొన్న తోట్లోకి దూరి మొక్క జొన్నలు తింటా వుంటే ఆ తోటాయనికి దొరికి బొయినా. ఇంగ చూడల్ల నా మొగం. ఆయన్నన్ను గుర్తు బట్టి "సిగ్గు లేదూ టీచురు కొడుకయ్యుండి దొంగతనం జేస్తావా, ఈ తూరికి వొదిలేస్తావుండా టీచురు కొడుకని..పో" అని తిట్టేసరికి నేను నా చేతిలో కంకి ఆడ పారేసి వురుకో..వురుకు. తరువాత మా నాయినకి జెబ్బినాడో లేదో నాకు తెలీదు.ఇంగ లీవులిచ్చినారంటే ఫస్టు బొయ్యేది మా యవ్వోళ్ళూరికి. లద్దిగం నుండి ఎర్రకోట పల్లి కి బోవాలంటే మొదట కలకడకు బొయ్యి ఆడ బస్సు మారల్ల. బస్సు ఎక్కితే మా యమ్మ కీ కండక్టర్ కీ గలాట. మా యమ్మేమో ఈడు చిన్నోడు టిగట్టక్కర్లేదంటే కండక్టరేమో లేదు ఆఫ్ టిగట్ కొనాల్సిందే అంటాడు. ఒగోతూరి మాయమ్మ గెలుస్తుంది ఇంగో తూరి కండక్టర్ గెలుస్తాడు. మేము కలకడలో బస్సు దిగ్గానే మాయమ్మ తెలిసినోళ్ళు చానా మంది కనిపిస్తారు. వోళ్ళు కనిపిచ్చగానే "ఏం అమ్మణ్ణీ వూరికి బోతావుండావా." అని అడగతారు. "అవును సుబ్బమ్మక్కా! నువ్వూ నీ కొడుకూ బాగానే వుండారా" అని అంటుంది మాయమ్మ. తరువాత ఆణ్ణే బస్టాండ్లో ఏ సాయుబూ అంగడి కాడికో బోయి అరిటి కాయలు బేరం జేసి పేపర్లో పొట్లం కట్టుకొని తీసుకొనొచ్చి సంచి లో పైన పెడతాది. ఇంగ బస్సు కోసం ఎంక్వయిరీ మొదలవుతుంది. అణ్ణే బస్టాండ్ లో ఎవుర్నన్నా "న్నా(అన్నా) బొజ్జు గుంట పల్లి కి బొయ్యే బస్సెప్పుడోస్తుంది" అని అడిగేది. "ఇబ్బుడే ఒక బస్సు ఎళ్ళి పూడిసింది. నేను ఆసందు కాడికొచ్చేసరికి ఆ డ్రైవరు గోడు అపకుండ పూడిసినాడు" అని చెప్పి."నువ్వు రామయ్య చెల్లిలు రంగమ్మ గదూ..ఏం అమ్మణ్ణీ అందురు బాగుండారా? ఈళ్ళిద్దురూ నీకొడుకులా..కూతుర్లు లేరా" అని పిల్చేసరికి ఇంగ మా యమ్మ గూడా "నువ్వా మునెంకటప్పన్నా ఎవురో అనుకుంట్నే బాగ సన్నగయి పోయినావే ఏమ్నా ఒళ్ళు బాగ లేదా ఎంది" అని మాటలు మొదలుపెడుతుంది. కొంజెపటికి బస్సొస్తే "పదమ్మా తిక్క బస్సొచ్చేసింది బిర్నే బోతే గానీ సీట్లు దొరకవు" అని. ఆ బస్సు కు తిక్క బస్సని పేరెందుకొచ్చిందంటే ఆ చుట్టు పక్కలున్న పద్నాలుగు పదైదు చిన్న పల్లిల్ని తిరుక్కుంటూ వచ్చేది. ఒగే రూట్లో చానా సార్లు తిరగడం వల్ల దానికి తిక్క బస్సు అని పేరు పెట్నారు.కలకడ నుండి బొజ్జుగుంట వారి పల్లి కి ఆరో ఏడో ఎనిమిదో కిలోమీటర్లు. ఆడ దిగేసి ఇంకా ఒగ కిలోమీటరు నడిస్తే గానీ మాయవ్వ వాళ్ళ వూరు రాదు. ఇంగ ఆడ దిగిన కాడ్నించి జూసుకో అందురూ అడిగే వాళ్ళే "నువ్వు రామయ్య చెల్లెలు రంగమ్మ గదూ. నీ కొడుకులా ఏమి చదవతాండారు" అని.(సశేషం)