Saturday, December 30, 2006

మంచు కురిసే వేళలో...వెన్ను నొప్పి వచ్చేవేళలో..

click on the images for bigger picture
అమెరికా లోనున్న తెలుగు వాళ్ళకు జెమిని టీ.వి. తేజ టీ.వి లాంటివి మేమే ఇస్తున్నాం గదా ఇక ఇంటికెళ్ళి సినిమాలు చూసుకో నీ సెలవులు తరువాతి సంవత్సరానికి బట్వాడ గిట్వాడా జాంతానై అన్నారు మా కంపెనీ వాళ్ళు.సరేలే ఈ రెండు వారాలు ట్రిప్పులేసేసి తెగ అమెరికా దున్నేద్దామనుకుంటే పిడుగు లా ఒక దాని తరువాత ఒకటి వచ్చి పడ్డాయి ఆటంకాలు. మొదటేమో బుడ్డోడికి "stomach flu" వచ్చి సెలవుల్ని అశుభారంభం చేసింది. హమ్మయ్య అది తగ్గి పోయింది ఇక ట్రిప్పులెయ్యొచ్చు అనుకుంటుంటే "నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానా" అన్నట్లు "మంచు కురుస్తుందోచ్" అని టీ.వీ.లో వార్త. వీళ్ళ టెక్నాలజీ ఎక్కువ కదా చెప్పినట్టు వచ్చేస్తుంది(అని గట్టి నమ్మకం) "ఆ మనకు మంచు పడ్డం కొత్త కాదు కద ఆ మాత్రం పడకపోతే ఆ స్కీ రెసార్ట్ వాళ్ళు ఎలా బతుకుతారు పాపం అని వీర లెవెల్లో టావోస్ కు, న్యూ మెక్సికో వెళ్దామని చుక్కలు పెట్టేసి గ్రాఫులు గీసేసి బొమ్మలు చూసుకుని తెగ సంబరపడి పోయాం.
** ** ** **
మంగళ వారం సాయంత్రానికి (19-డిసెంబరు-06) టీ.వీ. వాళ్ళు గొంతు మార్చేశారు....అదే వాతావరణ పరిశోధనా శాఖ నుంచి వచ్చిన సందేశం తో. "తూచ్...అది ఒట్టి మంచు కురవడం మాత్రమే కాదు అది ఒక మంచు తుఫానోచ్(snow blizzard)" అని. అయినా ఇది ఒస్తే ఏమయింది ఈ దేశం చాలా అభివృద్ది చెందింది కదా మంచు కరగడానికి ఎండ కోసం ఎదురు చూడరు పెద్ద పెద్ద పలుగు యంత్రాలు ఉంటాయి. దాంతో మంచు ని "ఉఫ్" మని ఊదేస్తారని గట్టి నమ్మకం.ఇంకేం మంచు తుఫాను ఎలా వుంటుందో చూద్దామని( పోయిన సారి, ఎనిమిదేళ్ళ క్రితం, వచ్చి నప్పుడు అదృష్టం కొద్దీ ఆ తుఫాను రోజు ఎయిర్ పొర్ట్ నుండి ఎగిరిన చివరి విమానంలో భారత్ కు ఎగిరి పోయా) ఎదురు చూడ్డం మొదలయింది. బుద్ది గా బుధ వారం వచ్చింది. పది గంటల్నుండి మొదలయింది ధవళ వర్ణం తో ధగ ధగ మెరిసి పోతూ నింగి నుండి కిందకు పడ్డం. కవుల హృదయాల్ని తట్టి లేపే అందమైన దృశ్యాన్ని కళ్ళముందుంచుతూ నల్లటి రోడ్లను తెల్లటి తివాచీ లాగా మార్చే తన ధర్మాన్ని తను నిర్వహించడంలో నిమగ్న మైంది ప్రకృతి మాత. పదుకొండు గంటలకు టీ.వీ. వాళ్ళు తమ వృత్తికి న్యాయం చేస్తూ మిగిలిన కార్యక్రమాలన్నింటిని పక్కన పెట్టి ప్రత్యేక కార్యక్రమాల్ని అందించడం మొదలు పెట్టారు పరిస్థితి తీవ్రతను గమనించి. "అవసర మైతే తప్ప బయటికి పోవద్దు". "ఇంట్లో నే వెచ్చగా వుండండి" మొదలయిన చిన్న పాటి హెచ్చరికలతో మొదలయింది హడావుడి. అప్పుడే గమనించా ఈ తుఫానుకు వారు పెట్టిన పేరు "సెలవు తుఫాను"(holiday blizzard). ఇది క్రిస్మస్ మరియూ కొత్త సంవత్సరం సెలవుల్లొ వచ్చింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు.

** ** ** **
మూడు గంటలకల్లా గవర్నర్ "రాష్ట్ర అత్యయిక పరిస్థితి" (state emergency) ప్రకటించేశారు. నేషనల్ గార్డు లను రంగంలో దించారు.చాలా ఆఫీసుల్లో పని చేసే వాళ్ళను తొందరగ ఇంటికి వెళ్ళమని చెప్పేశారు. అలా బయలు దేరిన వాళ్ళలో చాలా మంది దార్లో చిక్కుకు పోయారు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది. ఎక్కడ చూసినా మంచులో ఇరుక్కుపోయి ఆగిపోయిన కార్లు, ట్రక్కులు. ఎయిర్ పొర్టు చరిత్రలో మొదటి సారిగా 40 గంటలకు పైగా మూసేశారు. రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగ జాతీయ రహదారి I-25 మరియు I-70 లు మూసేసారు. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కొన్ని ఎక్కడివక్కడే ఆగి పోయాయి. ఆగి పోయిన కార్లు అక్కడే వదిలేసి కొంత మంది ఇళ్ళకో లేక దగ్గర్లోని హోటల్ కో నడక మొదలు పెట్టారు. ఉష్ణొగ్రతలు 20 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు కు పడిపొయాయి. గాలులు గంటకు 40 మైళ్ళ వేగానికి చేరుకున్నాయి.
** ** ** **

రాష్ట్రం మొత్తానికి మంచు శుభ్రపరచే యంత్రాలు 600 మాత్రమే వున్నాయి. ఒక రహదారిలో బస్సు 7 గంటలకు పైగా ఆగిపోయింది. అందులోనుంచొ కావిడ టీ.వి. కెంద్రానికి ఫోన్ చేసి నేను 6 గంటలకు పైగా ఉన్నానని చెప్పింది. ఆ విషయం మీద బస్సు సంస్థ ప్రతినిధి నడిగితే వచ్చిన సమాధానం." ఆ రూట్లో మాగ్జిమం మూడు గంటలు మాత్రమే తీసుకుంటుంది. ఆ పాసింజెరెవరో వెయిట్ చెయడం వళ్ళ అలా మాట్లాడు తున్నారు" అని. ఈ మాటలు మన చినంప్పట్నుంచి వింటున్నట్టు వుంది కదా. మళ్ళీ ఇంకో ప్రభుత్వ ప్రతినిది మాట్లాడుతూ మొదట మెయిన్ రోడ్డు శుభ్రం చేస్తాం తరువాత ఇళ్ళ దగ్గర ఒక అడుగు కు మించి పడితే వచ్చి శుభ్ర పరుస్తాం అని. ఇళ్ళ దగ్గర రెండున్నర అడుగులు పడ్డా ఇప్పటికి పట్టించు కున్న నాధుడు లేడు. పోన్లే క్రిస్మస్ కదా శుభ్రం చెయ్యలేదు అని సర్దు కుంటే. ఆ తుఫాను ఆగి వారం రోజులయినా ఇళ్ళ దగ్గరకి ఒక్క snow plower రాలేదు. ఎయిర్ పొర్టు అయిదు వేల మంది తో మెగా హోటల్ అయిపోయింది. అక్కడ వున్న వాళ్ళకి భోజనం దొరకడం కష్టమయి పోయింది. ఎందుకంటే బయటి నుండి ఒక్క వాహనం కూడ అక్కడికి వెళ్ళ లేక పోయింది. ఏదయితేనేం ప్రకృతి మాత ఎట్టకేలకు గురు వారం సాయంత్రానికి శాంతించింది మూడు నుండి నాలుగు అడుగుల మంచు తెచ్చిన తరువాత.
** ** ** **
ఈ తుఫాను వెలిసే అంత వరకు టీ.వీ. ని ఏదో సస్పెన్స్ సినిమా చూసినట్టు చూశాను గుండెలు అర చేతిలో పెట్టుకుని. ఇంట్లో అప్పుడే ఓ చిన్న జబ్బు నుండి కోలుకుంటున్న అయిదేళ్ళ కొడుకు ఒక పక్క, రెండు నెలలు నిండిన చిన్నారి ఇంకో పక్క ఉంటే ఎవరికైనా ఇలానే వుంటుంది.
** ** ** **

గురు వారం ఊపిరి పీల్చుకోవడం అయ్యింది. శుక్ర వారం ఊపిరి వదుల్తూ..పీలుస్తూ ఇంటి ముందు మంచు శుభ్ర పరిచే కార్యక్రమం మొదలయింది. ఇక్కడ కొన్ని పద్దతులు, సూత్రాలు వుండి ఏడ్చాయి. ఇంటి ముందు పక్క బాట (side walk) ఎవడిది వాడే సుభ్రం చేసుకోవాలి. ఇటు వైపు అటు వైపు ఇల్లు వుంటే అటు రెండడుగులు ఇటు రెండడుగులు చేస్తే సరిపోతుంది.నా అదృష్టం కొద్దీ మా ఇల్లు కార్నెర్ ఇల్లు అయ్యింది. నాకు ఓ నలభై అడుగులు దూరం శుభ్రం చేసే అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. కార్ గరాజ్(garage) ముందు చేసింది చాలక ఈ పక్క బాట జన్మ భూమి కూడా దక్కిందన్న మాట. బోనస్ గా మా ఇంట్లో కి వెళ్ళే ధారి L ఆకారం లో వుండి ఇంకో 15 అడుగులు జన్మ భూమి కార్యక్రమం. వెరసి నాకు వెన్ను నొప్పి మిగులు. అమెరికా రాక ముందు "మంచు కురిసే వేళలో మల్లె విరిసే నెందుకో.." అని పాడుకొంటే ఇప్పుడు " మంచి కురిసిన వేళలో...వెన్ను నొప్పి వచ్చేనెందుకో" అని పాడు కోవాల్సి వస్తోంది.

** ** ** **

అలా మంచు తొలగిస్తూ వుంటే నాకు గుర్తు కొచ్చిన పాటల్లో మొదటిది నాగేశ్వర రావు, సావిత్రి చేనుకు నీళ్ళు తోడుతూ (గూడ వేస్తూ) పాడుకొన్న "ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది". తరువాత గుర్తు వచ్చిన పాటలు."జయమ్ము నిశ్చయమ్మురా..జంకు బొంకు లేక సాగి పొమ్మురా..?" మూడడుగుల ఎత్తు నున్న మంచు తొలగించాలంటే ఆ మాత్రం ఇన్స్పిరేషన్ వుండాలి కదా. ఇంకా "ఎవరేమన్ననూ తోడు రాకున్ననూ..నీ ధారి నీదే...సాగి పోరా నీ గమ్యం (రోడ్డు చివరి snow) చేరుకోరా".
** ** ** **

ఉ(బు)డత సాయం.

ఉ(బు)డత సాయం.

మా నాన్న పక్క బాట(side walk) శుభ్రం చేశాడోచ్

కొస మెరుపు పాట "జన్మ మెత్తితిరా అనుభవించితిరా..."
** ** ** **
నేనిలా బ్లాగుతుంటే ఇంకో పక్క రెండో మంచు తుఫాను వస్తున్నట్టు చల్లగా చెబుతున్నారు టీ.వీ. వాళ్ళు. మళ్ళీ పైన చెప్పిన పాటలన్నీ ఓ సారి గుర్తుకు తెచ్చు కోవాలి తప్పుతుందా. గీత లో కృష్ణుడు చెప్పిన కర్మ కాండ కూడ జతవుతుందేమో ఈ సారి.

Friday, December 15, 2006

నా భాషా పరిజ్ఞానం.

పదవ తరగతి వరకు చదివింది చక్కనైన తేట తెలుగు మాధ్యమం లో. అది కూడా మా వూరు చౌడేపల్లి లో (చిత్తూర్ జిల్లా). మన కష్టాలు ఇంటెర్మీడియెట్ తో మొదలయ్యాయి. పదవ తరగతి పాసవగానే ఎలగోలా తంటాలు పడి మదనపల్లె లోని బెసంట్ దివ్యజ్ఞన కళాశాల లో సీటు సంపాదించేశాం. అది కూడ యం.పి.సి. ఇంగ్లిపీసు మీడియం. అది రావడానికి కూడా నానా తంటాలు పడాల్సి వచ్చింది. పదిలో వచ్చింది ఫస్టు క్లాస్. సీటు మాత్రం వెయిటింగ్ లిస్టులో వచ్చింది. మన వెయిటింగు నంబరు మూడు. అంతే మరి అరవై మంది వున్న క్లాసు లో నాకన్నా మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు వుండరా ఏంది. అడ్మిషన్ రోజు యెంకటేశులు సామికి ఏడు సార్లు మొక్కి బిక్కు మంటు ఎదురు చూశాం కాలేజ్ లో. నా తరువాత వెయిటింగ్ నంబరు వున్న వాళ్ళు కూడా అడ్మిషన్ పూర్తి చసుకుని ఫీజు కట్టి వెళ్ళి పోయారు. అక్కడ ఏదో జరుగుతోందని అర్థమయింది. ఇక కుదరదని మా నాన్న వెళ్ళి ప్రిన్సి పాల్ తో మాట్లాడి రాగానే సీటు వచ్చేసింది.

మొదటి సారిగ ఇల్లు వదిలి వేరే వూరిలో చదవటానికి రావటం అదే మొదలు. ఆ రోజు బుధ వారం. ఆఫీసు రూముకు వెళ్ళి గబ గబా టైం టేబుల్ రాసుకుని క్లాస్ ఎక్కడుందో కనుక్కుని క్లాసు లోకి దూరా. క్లాసు నిండా కిట కిట లాడే జనం. ఎక్కడో దూరి కాస్త కూచోడానికి సీటు పట్టా. ఇక పక్క వాళ్ళతో పరిచయ వ్యాక్యాలు మొదల్య్యాయి.
"మీ పేరేంటంది" నా పక్క వాడినడిగా.
"రామ కృష్ణ"
"నా పేరు భూపతండి. మీదే వూరండీ" మళ్ళీ ప్రశ్న.
"పెద్ద మండ్యం. మీది"
"మాది చౌడేపల్లండి.". నా సమాధానం.
"అదే బొరుగులకు(మర మరాలు) ఫేమస్..ఆ వూరా?"
"ఆ అదే. అంతే కాదు మా వూరి నుండే మాబడి(7 వ తరగతి) పాఠశాల(10 వ తరగతి) బుక్కులు వస్తాయండి".
ఇక అమ్మేం చేస్తుంది.నాన్నేం చేస్తాడు ప్రశ్నలయిపోయాక ఇంకో వైపు తిరిగి ఇంకొకతన్ని అడిగా.
"నా పేరు భూపతండి.మీ పేరేంటండీ".
"నా పేరు ప్రకాష్ అండీ.మేము కొత్త గా ఈ వూరు వచ్చామండీ".
"అలాగాండీ, మీ నాయిన ఏమి చేస్తాడండీ". మనకు అప్పటికి ఇంకా నాన్నలని సగౌరవంగా పిలిచే, పిలవాలనే తలంపు కలగలేదు.
"మా నాన్న గారు ఇక్కడే ఉద్యోగం చేస్తారండీ. మా అమ్మగారు ఇంట్లో హౌసు వైఫండీ".
ఇదేంటింది ఈ అబ్బాయి అమ్మను పట్టుకుని అమ్మ గారు అంటున్నాడు బహుశా రాజుల వంశమేమో ఆ భాష ఇంకా పోలేదనుకున్నా.
"మా అమ్మా అప్పా ఇద్దురూ టీచర్లేనండీ." అదోరకంగా చూశా నా భాష కు భయపడినాడేమోనని. అదేం జరగలా.
"మీరు మీ నాన్న గారిని అప్పా అంటారాండీ?"
ఇదేం ప్రశ్న రా బాబూ అనుకుంటూ "అవునండీ" అన్నా. అంతే మరి మనది శ్రీ కృష్ణ దేవరాయలు టైపు. తిమ్మరుసును "అప్పా(జీ)" అనే పిలిచేవాడు కదా.
తరువాత క్లాసులోని స్టూడెంట్స్ మీదికి మళ్ళింది టాపిక్.
"అదేంటండీ ఇంత మంది వున్నారు క్లాసులో" అన్నాడు ప్రకాష్ చివరి లైన్లో ఒకరి మీద ఒకరు కూర్చోవడం చూసి.
"నాకూ తెలీదండీ.అరవై మందే అన్నారు క్లాసుకు".
"లేదండీ నూరుమందికన్నా ఎక్కువు మంది వున్నారు ఇక్కడ" అన్నాడు ప్రకాష్.
అప్పుడర్థమయింది నాకు. నా తరువాత వెయింటింగ్ లిస్టు నంబరు వున్న వాళ్ళకు ఎలా సీటొచ్చిందో.
మా నాన్న వెల్లి ప్రిన్సిపాల్ ని అడిగిన తరవాత నాకు ఎలా వచ్చిందో. అప్పుడు లెక్కపెట్టా ఎంత మంది వున్నారో అని. అప్పుడు తేలిన సంఖ్య 152. అది మన మొదటి పరిశీలనా శక్తికి బీజం వేసింది.

అంతలో క్లాసులోకి ఒక అందమైన ఆవిడ ప్రవేశించింది. రాగానే "గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్" అని మొదలు పెట్టింది. ఆవిడ లెక్చరర్ అని అర్థమయ్యేసరికి పాఠం మెదలు పెట్టింది మనకు అన్ని సబ్జక్టులలోకి తక్కువ మార్కులు వచ్చిన ఇంగ్లీష్ భాష లో. ఇదేంట్రా దేవుడో ఇంగ్లీషు సబ్జక్టు తో నా ఇంటర్మీడియెట్ చదువు మొదలెట్టావు రో అనుకున్నా. ఒక్క ముక్క బుర్రకెక్కితే ఒట్టు. ఒంటి మీద తేళ్ళు జర్రులు పాకినట్టు, శరీరం వికారమైన భ్రాంతి కి గురయ్యి ఏదో తెల్లవాళ్ళ సామ్రాజ్యంలో పడ్డట్టు అయ్యింది. మా పదో తరగతి టేచరు ఇంగ్లీషు ఎంత బాగ తెలుగు లో చెప్పేవోడో అనుకుంటు టైంటేబుల్ చూశా. అమ్మయ్య ఈ ఇంగ్లీష్ క్లాసు అయిపోయిన తరువాత లెక్కల క్లాసు వుంది. మన కిష్టమైన సబ్జక్టు అనుకుంటూ పక్కనోళ్ళను చూశా. దాదాపు అందరిదీ నా పరిస్తితే. కొంత మందయితే ఆముదం తాగిన ఫేసూ, మరి కొంత మందయితే క్లాస్ వదిలేస్తే పారిపోదామనే ఫేసూ. కొంత మంది మాత్రం రాజకీయ నాయకుడి లెఖ్కన పేద్ద అర్తమయినట్టు ఫోజు పెట్టడమూ గమనించా. బహుశా వాళ్ళిప్పుడు రక రకాల రాజకీయ పార్టీల్లో చేరా రనుకుంటా.

ఎలాగయితేనేమి ఆ కాలేజీ గంట గొట్టే మహాను భావుడి పుణ్యమా అని నా మనో వికారాలన్నింటికి గంట కొట్టడం జరిగిపోయింది ఆ పీరియెడ్ అవగానే. ఆవిడ పేరు మాత్రం ఇప్పటికి మరిచి పోలేది. ఆవిడ పేరు శశి కళ.
అమ్మయ్య! బతుకు జీవుడా అనుకుంటూ పక్కనోడిని అడిగా. మనకు తరువాత క్లాసు మ్యాథ్స్ కదా అని. వాడు నన్ను వింత చూసి తరువాత పీరియెడ్ ఇంగ్లీష్ అన్నాడు.
"మరిదేంటి నా టైం టేబుల్ లో మ్యాథ్స్ అని వుంది."
"అది సోమ వారం టైం టేబులు ఈ రోజు బుధ వారం. సరీగా చూడండి".
మన బుర్ర అప్పుడు వెలిగింది. ఆ రోజు బుధ వారం, నేను కొత్త గా కాలేజీ లో చేరిన సంబరంలో వారం మర్చి పోయి సోమ వారం టైం టేబుల్ ను ఫాలో అయ్యానని.
"మరి ఈ రోజు బుధ వార మైతే ఇందాక అయిపోయిన క్లాసేమిటి" అనుకుంటూ పక్కనోడినడిగితే మనల్ని "బభ్రాజమానం" అనుకుంటాడని నేను టైం టేబుల్ చూశా. వింతల్లో కెల్లా వింత ఇందాకా అయిపోయిన క్లాసు "లెక్కలు" అంటే మనకు ఇష్టమైన లెక్కలు ఇంటర్మీడియెట్లో అంత కష్టం అని బుర్ర గోక్కోవడం మళ్ళీ మొదలు. తేళ్ళు జర్రులు పాకి వెళ్ళి పోయాయి కాబట్టి (ధారి తప్పి) మళ్ళీ రాలేదు. మన పరిశోధన లో తరవాత్తేలిందేమింటంటే ఇందాక వచ్చిన మేడం లెక్కల చెప్పే లెక్చరర్. ఆ విడ చెప్పిన సబ్జెక్ట్ "Set theory". ఆ రోజు మొదటి రోజు పొరపాటున(మొదటి రోజు కదా) చాక్ పీసు తీసుకుని రాలేదు. అందుకని నల్ల బల్ల మీద ఏమీ రాయలేదు. మొత్తం లెక్కలన్నీ "theory" లాగానే చెప్పింది. అది మన ఆంగ్ల భాషా పరిజ్ఞానికి చిన్న మచ్చుతునక.

దాని ఫలితమే మొదటి సంవత్సరం తెలుగు మరియూ ఇంగ్లీషు సబ్జక్టు లలో "రీసెర్చ్" చెయ్యటం జరిగిపోయింది. నా వ్యహారిక భాషలో "రీసెర్చ్" అంటే ఆ సబ్జక్టు లో గుడ్డు పెట్టడం అనగా ఫెయిల్ అవడం. రెండో సంవత్సరం మాత్రం "రీసెర్చ్" లేకుండా గట్టెక్కాం.

* ** * ** *

ఎలాగోలా ఇంజినీరింగ్ లో సీటు సంపాయించి తిరపతి శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీ లో పడ్డా. ఇక తిరపతి (తిరుపతి, ఆ చుట్టు పక్కల వాళ్ళు అలాన పిలుస్తారు) లో ఎవడన్నా వున్నడంటే సందడే సందడి. వూర్లో తెలిసిన వాళ్ళందరూ వచ్చి కొండెక్కి దేవుడ్ని దర్శనం చేసుకుని రూము కొచ్చి ఓ లడ్డు ఇచ్చి (రూములో పడుకొంటారు కదా) తరువాత తెలుగు సినిమాల మీద దండయాత్ర చెయ్యడం సాధారణంగా జరిగే తంతు. అలా జరిగే వాటిలో మన గ్యాంగ్ వాళ్ళు ఎక్కువుంటారు.

ఇక సొంత గ్యాంగ్ వచ్చిందంటే తిరపతి కొండకు మనం కూడా వెళ్ళాల్సిందే. అలా ఓ సారి ఉదయం నాలుగు గంటలకు కాలి నడకన బయలు దేరాం దిగవ తిరపతి నుండి. కొండ పైకి వెళ్ళేసరికి తెల్లవారింది.

అలా కొండ మీదకు చేరామో లేదు ఒక ఉత్తర భారతీయుడు నా దగ్గర కొచ్చి, మనకు ఆంగ్లం సరీగా రాదని ఎలా కనిపెట్టేశాడో, "జీ" అన్నాడు. మన ప్రావీణ్యం హిందీ లో కూడా అంతంత మాత్రమే. ఆరో తరగతి లో "ఇంలీ -- ఈక్", పదో తరగతి లో తెలుగు లో చదువున్న దాన్ని హింది లో అంటే హింది అక్షరాల్లో అచ్చు గుద్దేయడం తప్ప మనకు ఇంకేం రాదు.

"క్యా" అన్నా "షోలే" సినిమా చూసిన తెలివితో.
"పేపర్ కిదర్ మిల్తే" అన్నాడు.
"అదర్" అన్నా ఓ బంకు వైపు చెయ్యి చూపించి.నాకు తెలీదు ఉదర్ అనాలో ఇదర్ అనాలో.అది విన్న హిందీ వచ్చిన ఫ్రెండ్సంతా పగల బడి నవ్వారు.

తరువాత ఇంకో సారి అదే ఫ్రెండ్స్ గ్యాంగ్. ఊరు కూడా తిరుమలే. ప్రదేశం మాత్రం 25 రూపాయల టికట్ట్లు అమ్మే విజయా బ్యాంక్ దగ్గర (అప్పుడు అక్కడే అమ్మేవారు)."హిస్టరీ రిపీట్స్" అని ఎవడన్నాడో గానీ ఒక ఉత్తర భారతీయుడు నా దగ్గరకే వచ్చి (వాడి దుంప తెగ హిందీ తెలిసిన నా ఫ్రెండ్స్ అంత మంది వుండగా నా దగ్గరకే ఎందుకు వచ్చాడో).
"భాయ్, పచ్చీస్ రుపియే టికెట్స్ కిదర్ మిలేగా".
కరక్టుగా విజయ బ్యాంక్ వెనుక వున్నాం. దీని వెనుక అని చెప్పాలి.ఆ బిల్డింగ్ వెనుక వైపు చూపిస్తూ "దిస్ కే పీచే". అన్నా.
చెప్పాగా "షోలే" చూసిన అనుభవం.

నా ఫ్రెండ్స్ ను గురుంచి చెప్పక్కర్లేదనుకుంటా.

* ** * ** *

కన్సులేట్ లో నా భాష పరీక్ష సరీగనే సాగిపోయింది. అమాయకులు తొందర్లో ఉన్నారేమో అమెరికా వీసా ఇచ్చేశారు.

అమెరికాలో పడ్డ తరువాత మొదట చెయ్యల్సిన పన్లు. సామాజిక రక్షణ సంఖ్య("Social Securiy Number) తెచ్చుకోవడం తరువాత వాహనాలు నడిపే పత్రం తెచ్చుకోవడం. మొదటిది నిర్విఘ్నంగా జరిగిపోతుంది. రెండోది చాలా క్లిష్టమయింది అందునా కాలిఫొర్నియాలో (ఇక్కడ కొలరాడోలో అయితే ఇన్ స్ట్రక్టరే ఇచ్చేస్తాడు). మనం ఇక్కడికి వచ్చింది "పరిగిలి పోయిన కాలం" లో అంటే పంట అంతా అయి పోయి ఇక ఏమీ వుండదన్న మాట మళ్ళీ వానలు పడే వరకు. అంటే డిసెంబర్ లో వాలాం. అందరూ "హ్యప్పి హాలిడేస్" అంటు చెప్తారే కానీ ఉద్యోగాలివ్వరన్న మాట. సో ఖాళీగా ఆఫీసులో కూర్చోవడం కబుర్లు చెప్పుకోవడం. దాన్నే మన భాష లో "బెంచీ" అంటాం. అక్కడ "బెంచీ" మీద చాలా మంది వుండే వాళ్ళుం. రోజు ఆఫీసుకెళ్ళడం ఇంటికి రావడం. పనిలో పనిగా "వాహనం నడిపే పత్రం" తెచ్చుకోమన్నారు.

దానికే భాగ్యం అని ముందు పరీక్ష రాయడానికి సిధ్ధమయి పోయా. అక్కడే మన "బెంచీ" వీరులు చాల సాయ పడ్డారు. కాలిఫోర్నియా వ్రాత పరీక్ష చాల తెలివిగ నిర్వహిస్తారు. ఎంత తెలివంటే పరీక్ష అయిపోయిన తరువాత మనకు సమాధానాలున్న పేపర్ ఇవ్వరు. కేవలం ప్రశ్నలున్న పత్రం మనకు ఇచ్చేస్తారు. సమాధానాలు మాత్రం మనం కని పెట్టలేమనుకుంటారు. అలా ఇచ్చేసిన ప్రశ్నా పత్రాలన్నీ మనకన్నా ముందొచ్చిన బెంచన్నయలూ, బెంచక్కయ్యలూ సేకరించి తాళ పత్ర గ్రంథాలు లాగా "బెంచీ" ఆఫీసు లో భద్ర పరుస్తారు. అలా మొత్తం కేవలం ఎనిమిద వున్నాయి కాలిఫోనియా DMV వాళ్ళవి. అలా భద్ర పరిచిన వాటిని జాగ్రత్త గా బట్టీ వేసి బెంచీ అన్నయ్యల(అక్కయ్యలెవరూ లేరు) దగ్గర ఆశీర్వాదం తీసుకొని DMV కార్యాలయానికి వెళ్ళివ్రాత పరీక్ష రాశా.

అక్కడున్న ఆవిడ నా పత్రాన్ని దిద్ది నా వంక అదోలా చూసింది.
ఇదేమిట్రా బాబు నేను ఆవిడతో ఏమీ మాట్లాడకుండానే ఏదో అపార్థం చేసుకుందనుకోని. ఓ "యస్వీఆర్" నవ్వొకటి పారేశా ఎందుకయినా మంచిదని. తరువాత ఆవిడ నవ్వి
"కంగ్ర గాటెండ్ర పర్సె".
నా మనసు ఏదో కీడు శంకించింది.మనసౌ పరి పరి విధాలు గా పోతుంటే నా సమాధాన పత్రాన్ని నా ముందుకు తోసింది. ఈ బెంచన్నయలు(బెంచక్కయలు కూడా) ఎదో మోసం చేశారు. నా సమాధానాలన్నీ తప్పనుకుంటూ ఆ పత్రాన్ని చూశా. దాని మీద 100% అని రాసుండటాన్ని చూసి ఎగిరి గెంతు దామనిపించింది. అక్కడ గెంతితే అరెస్ట్ చేస్తారన్ని సంబరాని ఆపుకుని ఆమె మాట్లాడిన దాని మళ్ళీ రీవైండ్ చేసుకున్నా. "కంగ్ర గాటెండ్ర పర్సె" అంటే "కంగ్రాట్స్ యు గాట్ హుండ్రెడ్ పర్సెంట్" అని అర్థమని.
పళ్ళికిలించి చెప్పా "త్యాంక్యూ" అని.
"కవావొన్నే" ఆవిడ మళ్ళీ ఏదో చెప్పింది. ఈ సారి పేపర్ లాంటిదేమి ఇవ్వలేదు అర్థం చేసుకోవడానికి. నా అశ్చర్యార్థకమైన మొహాన్ని చూసి అర్థం చేసుకుందేమో కరుణించి తనే అంది మళ్ళీ.
"కవావొన్నే".
మా నాన్న చిన్నప్పుడు నా చేత బలవంతంగా రోజుకో పది పేజీల చొప్పున చదివించిన "రెన్ అండ్ మార్టిన్" గ్రామర్ పుస్తకాన్నోసారి, "లిఫ్కో" డిక్షనరీ నోసారి వాయు వేగంతో రీవైండ్ చేసుకున్నా దాని అర్థం ఎక్కడన్నా దొరుకుతుందేమోనని. బోఫోర్సు కుంభకోణం లో ఎవరూ దొరకనట్టు వెనక్కు వచ్చేసింది బ్లాంక్ గా.
పాపం ఈ దీనుణ్ణి ఇంక కరుణిద్దామని ఆవిడ మన ఆదివారం బధిరుల వార్తలు చదివే న్యూస్ రీడర్ లాగ పరకాయ ప్రవేశం చేసి ఒక చేత్తో తన ఎడమ కంటిని మూసి ఆ పైనున్న అంగ్ల అక్షరమాలికను చూపించింది.
"కవావొన్నే" అంటే "కవర్ ఒన్ ఐ" అని అర్థమన్న మాట.ఆహా ఎంత చక్కగ చెప్తున్నా నేనే అర్థం చేసులేక పోయానే. వీళ్ళు ఎంత చక్క సందేశాలిస్తారో అని మెచ్చుకోకుండా వుండ లేక పోయాను. వెంటనే ఒక కన్ను మూసేసి గబ గబా మొదటి లైని చదివేశా.
"నారీ సెకాలై".
మళ్ళీ బుర్రగొకుడు ఒంటి కన్నుతో.
"నారీ సెకాలై".
ఓహో.."నౌ రీడ్ సెకండ్ లైన్" అన్న మాట. మనకు అమెరికన్ ఇంగ్లీష్ అర్థమయిపొయిందోచ్.ఇక మూడో లైన్ చదవమంటుంది "నారీ థాలై" అని అంటుందని ఎదురు చూశా.
"నా విధాదై".
పిడుగు పడ్డట్టు అయింది. మళ్ళీ "రెన్ అంద్ మార్టిన్", "లిఫ్కో" డిక్షనరీ తిరగేశా బుర్రలో. సమాధానం ఖాళీ గా వచ్చింది.
"నా విధాదై" ఈ సారి గొంతు హెచ్చింది.
నాకు అమెరికన్ ఇంగ్లీష్ అర్థం కాదని అర్థమయ్యింది. ఎందుకైనా మంచిది ఈ సారి శంకర్ నారాయణ డిక్షనరీ తిరగేద్దామనుకుంటూ వుంటే తను ఆదివారం వార్తల్లోకి పొయ్యి ఈ సారి కుడి చేత్తొ కుడి కన్ను ని మూసుకుంది.
నాకు చచ్చేంత సిగ్గొచ్చి కుడి కన్నుని కుడి చేత్తో మూసేసా.
"నా విధాదై" అంటే "నౌ విత్ ద అదర్ ఐ" అని అర్థం. ఈ సారి అన్ని లైన్లు చివరి నాలుగో లైను దాక గబ గబా చేదివేశా. చెయ్యి మాత్రం కంటి మీద నుంచి తియ్యలేదు.
"నా ఉకెగ" అంది.
"నాకు ఉక్కగా ఉందా? అది ఈవిడకెలా తెలిసింది? ఆఫ్రికన్ భాష తెలుగు కలిసినట్టు ఎక్కడో చదివిన గుర్తు." నాకు కాళ్ళకింద భూమి కంపిస్తున్నట్టు చూచాయిగా తెలిసింది. వెధవది బ్రిటీష్ వాళ్ళు మనకు వాళ్ళ ఇంగ్లీష్ నేర్పించి పొయ్యారు. ఏ లండన్ కో పోకుండా ఇక్కడికెందుకొచ్చాన్రా . అంతలో నా వెనుక లైన్లో నున్న ఒకవిడ నన్ను గుర్రు గా చూసుకుంటు దగ్గర కొచ్చింది. నా ఆరిపోయిన బల్బు మళ్ళీ వెలిగింది. అంటే ఇందాక ఆవిడ అన్నది
"నౌ యు కెన్ గో" అని.
నేను ఇంకా వెళ్ళనందుకు ఈ వెనుకనున్నావిడ నన్ను గుర్రుగ చూసిందన్న మాట. నేను " థా " అని ఆ క్లెర్క్ కు, "సా" అని వెనక నున్న ఆవిడకు చెప్పి ఆ DMV ఆఫీసులో నుండి బయటపడ్డా బతుకు జీవుడా అనుకుంటూ.