కాదరయ్యా vs బ్లాగరయ్యా
పొద్దున్నే లేసినాడు బ్లాగరయ్యా వాడు కూడలి జల్లెడ తెరిచినాడు బ్లాగరయ్యా
కూడలి- జల్లెడ తెరిచినాడు బ్లాగరయ్యా వాడు వేడి టపా జదివినాడు బ్లాగరయ్యా
వేడి టపా జదివినాడు బ్లాగరయ్యా వాడు దొంగనేము బెట్టినాడు బ్లాగరయ్యా
దొంగనేము బెట్టినాడు బ్లాగరయ్యా వాడు బ్లాగు బంకసూసినాడు బ్లాగరయ్యా
బ్లాగు బంకసూసినాడు బ్లాగరయ్యా వాడు కవితల్ దోవ బట్టినాడు బ్లాగరయ్యా
కవితల్ దోవ బట్టినాడు బ్లాగరయ్యా వాడు భావుకత లేక బేర్మనె బ్లాగరయ్యా
భావుకత లేక బేర్మనె బ్లాగరయ్యా వాడు బుడ్డ బ్లాగు బట్టినాడు బ్లాగరయ్యా
బుడ్డ బ్లాగు బట్టినాడు బ్లాగరయ్యా వాడు తేనెగూళ్ళో బణ్ణాడు బ్లాగరయ్యా
తేనెగూళ్ళో బణ్ణాడు బ్లాగరయ్యా వాడు తేన్టపాలు జూసినాడు బ్లాగరయ్యా
తేన్టపాలు కాంచినాడు బ్లాగరయ్యా వాడు కాపీచేసి బ్లాగ్లోబెట్టె బ్లాగరయ్యా
కాపీ చేసి బ్లాగ్లోబెట్టె బ్లాగరయ్యా వాణ్ణి బ్లాగ్గుంపు కేకలు బెట్టె బ్లాగరయ్యా
బ్లాగ్గుంపు కేకలు బెట్టె బ్లాగరయ్యా వాడు గూగుల్ దవ్తాడనుకుండె బ్లాగరయ్య
గూగుల్ గాదు ఫ్రూగుల్ గాదు బ్లాగరయ్య వాణ్ణి బ్లాగు ముయ్యమనే బ్లాగరయ్యా
బ్లాగు ముయ్యమనే బ్లాగరయ్యా వాడు హిట్లు జాస్తాడనుకునే బ్లాగరయ్యా
హిట్లు గాదు ఫట్లు గాదు బ్లాగరయ్యా వాణ్ణి ఫ్లాగ్ గుంజకు యాలదీసె బ్లాగరయ్యా
ఫ్లాగ్ గుంజకు యాలదీసె బ్లాగరయ్యా వాడు గూగులయ్య రాంకన్కుండే బ్లాగరయ్యా
ర్యాంకూ కాదు బ్యాంకూ గాదు బ్లాగరయ్యా వాడు చీదరింపులు దెచ్చినాడు బ్లాగరయ్యా
చీదరింపులు దెచ్చినాడు బ్లాగరయ్యా వాడు యాడ్లు తెస్తాడనుకుండే బ్లాగరయ్యా
యాడ్లు గాదు గీడ్లు గాదు బ్లాగరయ్యా వాణ్ణి రాతలు గీతలు మాన్మనే బ్లాగరయ్యా
రాతల్ గీతల్ మాన్మనె బ్లాగరయ్యా వాడు దిగులు పట్టి వురికినాడు బ్లాగరయ్యా
దిగులు పట్టి వురికినాడు బ్లాగరయ్యా .... అంతర్జాలమొదిలి వురికినాడు బ్లాగరయ్యా ....
రాయల సీమ పల్లెల్లో పాడుకునే అసలు సిసలు జానపద కాదరయ్య పాట :
పొద్దున్నే లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళూ-మొగం గడిగినాడు కాదరయ్యా
కాళ్ళూ-మొగం గడిగినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా
సద్ది సంగటి దిన్నాడు కాదరయ్యా వాడు పంగనామం బెట్టినాడు కాదరయ్య
పంగనామం బెట్టినాడు కాదరయ్యా వాడు బుట్ట సంకనేసినాడు కాదరయ్యా
బుట్ట సంకనేసినాడు కాదరయ్యా వాడు పల్లే దోవ బట్టినాడు కాదరయ్యా
పల్లే దోవ బట్టినాడు కాదరయ్యా వాణ్ణి పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా
పల్లె కుక్క భౌ మనె కాదరయ్యా వాడు అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా
అడ్డ దోవ బట్టినాడు కాదరయ్యా వాడు జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా
జొన్నసేలో బణ్ణాడు కాదరయ్యా వాడు జొన్నకంకులు జూసినాడు కాదరయ్యా
జొన్నకంకులు తుంచినాడు కాదరయ్యా వాడు యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా
యిరిసిరిసి బుట్లోబెట్టె కాదరయ్యా వాణ్ణి సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా
సేన్రెడ్డి కేకలుబెట్టె కాదరయ్యా వాడు గువ్వల దోల్తాండనుకొండె కాదరయ్యా
గువ్వల్ గాదు గివ్వల్ గాదు కాదరయ్యా వాణ్ణి జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా
జుట్టుబట్టి వొంగదీసె కాదరయ్యా వాడు పేండ్లు జూస్తాడనుకొండె కాదరయ్యా
పేండ్లుగాదు గీండ్లుగాదు కాదరయ్యా వాణ్ణి మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా
మంచె గుంజకు యాలదీసె కాదరయ్యా వాడు ఉయ్యాలూప్తాడనుకొండె కాదరయ్యా
ఉయ్యాల్గాదు గియ్యాల్గాదు కాదరయ్యా చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా
చింతమల్లెలు దెచ్చినాడు కాదరయ్యా వాడు పెండ్లి జేస్తాడనుకొండె కాదరయ్యా
పెండ్లిగాదు గిండ్లిగాదు కాదరయ్యా వాణ్ణి వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా
వాతల్ వాతలు పెరికినాడు కాదరయ్యా వాడూ దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా
దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా... దోవల్ దోవలు ఉరికినాడు కాదరయ్యా...