Wednesday, January 16, 2008

___ని వశ పరచుకోవడమెలా? (మగ వాళ్ళకు మాత్రమే)



డ్యాష్ లో అమ్మాయి అని పూరించుకోండి లేదా భార్య అని పూరించుకోండి మీ వయసును బట్టి.



అమ్మాయిల్ని వల్లో వేసుకోవడం అనే మహా మెగా కళ ను అవపోసన పట్టాలని అనుకోని మగవాళ్ళు ఎవరూ వుండరనేది అందరికీ తెలియక పోయినా తెలియచెప్పాలనే ఈ టపా ఉద్ధేశ్యం, లక్ష్యం, ధ్యేయం. వయసులో వున్నప్పుడు కాకపోయినా పెళ్ళయిన తరువాతనయినా భార్యను ఎలా వల్లో వేసుకోవడం అని కల్లో కూడా ఆలోచిస్తూ ఈ కళ మీద మనసుపెట్టి బుద్దిగా మమకారం పెంచుకుంటారు. సాధన చెయ్యగా చెయ్యగా పట్టుబడే కళ కాదు అది. సాధన చేసే కొద్ది మరింత మొద్దు పారిపోయి మైండ్ బ్లాంక్ అయి మాడు మాడి పోయి ఫ్యూస్ కొట్టేసే ప్రమాదం కూడా ఉంది. అందుకనే దాన్ని ఒక పద్దతి ప్రకారం సాధన చెయ్యాలి. నేను కూడా ప్రయత్న లోపం లేకుండా నా శక్తికి మించి ఎన్నో పరిశోధనలు చేసి కొన్ని మర్మ రహస్యాలు వంట బట్టించుకొన్నా. మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎన్నో విపత్కర పరిస్థితులను ధైర్య సాహసాలతో ఎదుర్కొని గడించిన అనుభవ సారాన్నంతా అందరితో పంచుకోవాలనే ఈ టపా.

:---::---::---::---::---::---::---::---:========>O~:~O<========:---::---::---::---::---::---::---:

ప్రకటన: ఈ బ్లాగు చదువుతున్న వాళ్ళకు మాత్రమే భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. ఈ సందర్బంగా ఈ బ్లాగుకు నిరంతర సెలవు ప్రకటిస్తున్నాను. పునర్దర్శనం మళ్ళీ ఎప్పుడో బ్లాగు పాఠకుల దుర్దినం రోజు.

:---::---::---::---::---::---::---::---:========>O~:~O<========:---::---::---::---::---::---::---:




అందులో వశీకరణ విద్య ఒకటి. బి.వి. పట్టాభిరాం హిప్నాటిజం చూసినప్పుడల్లా వశీకరణ విద్యే బుర్రలో మర్రి చెట్టు లా ఊడలు వేసి వుండేది. వశీకరణ విద్య అంగానే మర్రి చెట్టు తొర్రలో జఠాజూటుడు తపస్సు చేసి విద్య అలవరచుకొన్న విఠలా చార్య సినిమా మీకు గుర్తు కు రాకపోతే హాలీవుడ్ సినిమా మిమ్మల్ని వశపరచుకున్నట్లే. మర్రి చెట్టూ, బుర్రా లాంటి పదాలు ఎక్కువున్నాయనిపిస్తే ఇది గొప్ప భయంకరమైన, వళ్ళు గగుర్పొడిచే టపా అని అర్థం చేసుకోవాలి.

సిద్ధ విద్యల కాలం:

ఇలాంటి మంత్ర, తంత్ర, టక్కు, టమారా మళయాళీ విద్యలు నేర్వాలంటే విఠలా చార్య దగ్గరకు వెళ్ళాలి. ఆయనెక్కడుంటో తెలీదు కానీ అలాంటి విద్యల గురించి తెలియాలంటే నుదురు కనిపించకుండా వీబూదో, కుంకుమో, కాటుకో, బురదో రాసుకున్న ఏ అవ్వనో తాతనో పట్టాలి. వాళ్ళని పట్టినా మనకు విద్యాదానం చేస్తారని గ్యారంటీ లేదు. అందుకనే మా అవ్వొళ్ళింట్లో తాళ పత్ర గ్రంధాలేమన్నా వున్నాయేమో నని అటవ మింద వెతికా. ఆ అటవ లో రెండు తేళ్ళని చంపాకా తాటాకుల మింద రాసిన తాళ పత్ర గ్రంధాలేమీ కనిపించలేదు గానీ తాతల కాలం నాటి సిద్ధ విద్యల పుస్తకం ఒకటి దొరికింది. దాన్ని బనీనులో దాపెట్టుకోని కిందకు తెచ్చి ఆంధ్రప్రభ దినపత్రిక అట్ట వేసి మా ఊరు తెచ్చుకున్నా. తెచ్చినప్పట్నుండి ఎవరికీ కనపడకుండా మిద్దె మింద బోర్లిచ్చిన కుండకింద పెట్టి వీలయినప్పుడల్లా చదివే వాడిని.


అందులో శాఖిని, డాకిని, కామిని, మోహిని, చిత్తిని, పద్మిని, సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద లాంటి మంత్రాలతో పాటు వశీకరణ విద్య గురించి కూడా విపులంగా వుంది. ప్రతిదీ కఠోర నియమ నిష్టలతో చెయ్యాలని వుంది. కొన్నింటికైతే నీళ్ళలో మునిగి లేదా నీళ్ళలో తేలుతూ లేదంటే చెట్టుకు వేళ్ళాడుతూ మంత్రాలు చదవాలని రాసివుంది. అన్‌కాంప్లికేటడ్ మనుషులు కాంప్లికేటెడ్ పన్లు చేపట్టరు కదా అలానే తక్కువ కాంప్లికేషన్స్ వున్న చెట్టు మీదెక్కి జపించే మంత్రాన్ని సెలక్టు చేసుకున్నా. జపించే టప్పుడు ఎవ్వరూ తాకని కట్టె పుల్ల ఒకటి చేతిలో వుంచు కోవాలని వుంది. ఇంకా నయం కపాలం, తుంటి ఎముక గురుంచి చెప్పలేదు. దాని అన్వేషణలో ఊరికి మూడు క్రోసుల దూరంలో ఒక చింత చెట్టు, దాని మీద కాకి గూడు కనిపించాయి. ఇంకేం ఫ్రీ ఫినాయిలు తాగేవాడికి ఫినాయిలు కంపెనీలో మ్యానేజరు ఉద్యోగం ఇచ్చినట్టు వెంటనే చెట్టెక్కేసి కాకి గూడు పీకి అందులో పొడవుగా వున్న పుల్ల తీసుకొని పాతాళ భైరవి సినిమాలో మాయల ఫకీరును గుర్తుకు తెచ్చుకొని మంత్ర దండం లాగా తిప్పి రిహార్సల్ చేసుకున్నా. ఇక చెట్టు మీద కూర్చొని కళ్ళు మూసుకుని మంత్ర దండాన్ని చేత్తో పట్టుకుని మంత్రాలు చదవడం మొదలు పెట్టా.


"ఓం క్రీం..డ్రీం..ఖ్లేం...డ్లేం....."

వెనక నుండి ఏవో శబ్దాలు భయంకరంగా వినిపించసాగాయి. మంత్రాలు చదివేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాటిని ధైర్యంతో, సాహసంతో, నైపుణ్యంగా ఎదుర్కోవాలి అని ఉపోద్ఘాతంలో చదవడం వల్ల ఎంతకూ చలించలేదు.

"ఓం క్రీం..డ్రీం..ఖ్లేం...డ్లేం.....
ఓం క్రీం..డ్రీం..ఖ్లేం...డ్లేం.....భూత.." అని కంటిన్యూ చేస్తుంటే వెనక నుండి ఏవో అరుపులు ఈ సారి మరింత బిగ్గరగా.

"కా....కా....కా..." అని ఒక పెద్ద నల్లని కాకి గాల్లో నుండి అరుస్తోంది.


ఏవరైనా కొత్త శక్తులకోసం ఘోర తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వెంటనే తన స్టాఫ్ లోనుండి ఒక ఐటం సాంగ్ గాళ్ ని పంపిస్తాడు. నేను ఇంద్రున్ని జయించడానికి తపస్సు చెయ్యలేదు కాబట్టి రంభో, మేనకో వచ్చేచాన్సు లేదు. మరి ఈ కాకేంటి అని తలకిందులుగా ఓ సారి ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. సరేలో ఇదేదో వట్టి భ్రమ అనుకొని మళ్ళీ మంత్రాలు చదవడం మొదలు పెట్టా.


"ఓం క్రీం..డ్రీం..ఖ్లేం...డ్లేం.....ప్రేత....
ఓం క్రీం..డ్రీం..ఖ్లేం...డ్లేం.....పిశాచ...."

"కా....కా....కా..." ఈ సారి నా మెడ మీద ముక్కుతో పొడుస్తోంది.

ఆ ముక్కు పొడుపుతో పెద్ద సెర్చి లైటు వెలిగింది ఆకాశంలో నుండి కాదు నా బుర్రలోని రెండు మీటర్ల ఖాళీ స్థలంలో. ఈ కాకి నేను పీకేసిన గూడు ఓనరు. దానిక్కోపమొచ్చి నన్ను పొడుస్తోంది. ఇక క్షణం ఊరుకోలేదు. చేతిలో కాకి గూడు పుల్లతో దాన్ని కత్తి కాంతారావు లాగా కస, పిస, మస అని ఫైట్ చేసేశా. ఆ దెబ్బకి కాకి వెనక్కి వెళ్ళి పోతూ.

"ఓరేయ్ తెలుగు దుర్మార్గుడా !!! నీ చెడ్డీ ఊడిపోనూ, నీ చొక్కా చినిగి పోనూ, నీ మళయాళీ మంత్రాలకోసం నా గూడు పాడు చేస్తావా? నేనిప్పుడే ఒరిస్సా బయలు దేరి వెళుతున్నా. కాద్ర,దార్కా ల దగ్గర ఒరియా మంత్రాలు నేర్చుకొచ్చి నీ గుండు పగలగొడతా " అని తిట్టి వెళ్ళి పోయింది.


"వేటికీ చలించ కూడదు.
వేటికీ భయ పడకూడదు.
వేటినీ ఖాతరు చేయకూడదు " అని పుస్తకం అట్ట వెనక భాగంలో రాసున్న దాన్ని గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ మంత్రాలు పఠించడంలో మునిగిపోయా.


అలా ఎన్నో సోమవారాలు, మంగళ వారాలు, బుధ వారాలు, గురు వారాలు, శుక్ర వారాలు, శని వారాలు, ఆది వారాలు ప్రాక్టీసు చేశాను. అలా ఎప్పుడు ప్రాక్టీసు చేసినా మా మందుల షాపు లింగడు (పేరదే) ఇచ్చే డైజీపాం కన్నా ఎక్కువ మత్తు వచ్చేసేది. ఈ మంత్రాన్ని ఎలాగైనా మా క్లాసు లో మొట్టికాయల సుందరీమణి మీద ప్రయోగించి రివర్సు మొట్టికాయలని వేయించాలనే ప్రణాలికతో ఎంతో దీక్షగా, నిష్టగా అయ్యప్ప మాల వేసిన భక్తుడి లాగా చదివే వాడిని. ప్రతిఫలం మాత్రం వెంటనే కనిపించేది నిద్ర రూపంలో. ఏ దేవి మీదా ప్రయోగించకుండా నిద్రా దేవి అమాంతం నన్ను వశ పరచుకోవడం మొదలు పెట్టింది. ఇక నేర్చుకునే టప్పుడల్లా చేతులు తిప్పి తిప్పి నొప్పి పుడుతోంది తప్పా వశీకరణ విద్య వంట బట్టలేదు. ఓ సారి చింత చెట్టు మీద కూర్చొని ప్రాక్టీసు చేస్తుంటే చేతులు జారి కింద బడి నా చెయ్యి వారం రోజులు నా వశం తప్పి డాక్టరు కట్టుతో మెళ్ళో వాలింది. బహుశా ఈ విద్యలు టైం సెన్సిటివ్ అయుంటాయి ఇవన్నీ ఆ కాలానికి పనికి వచ్చేవి కానీ ఈ కాలం లో పనికి రావు అని విఠలాచార్య సినిమా టికెట్ దొరకని రోజున తీర్మానించా. మళ్ళీ ఏ భావితరాల యువత కంట పడకూడదని ఆ చింత చెట్టు దగ్గరకు వెళ్ళి తొర్ర కింద గొయ్యి తీసి భూస్థాపితం చేశా.


మాడ్రన్ యుగం :


టైం సెన్సిటివ్ మంత్రాలు పని చెయ్యవు అని డిసైడ్ అయ్యాం కానీ వశీకరణ అసాధ్యం అనుకోలేదు కదా. అప్పుడే పెను మార్పులు సంభవించాయి. మా ఊర్లో లైబ్రరీకీ చాలా పుస్తకాలు రావడం మొదలుపెట్టాయి. ఎలాగైనా వశీకరణ విద్యను(మాడ్రన్ గా అని అర్థం చేసుకోలేక పోతే టపా చదవడం మానేసి “ఒక్క మగాడు” సినిమాకు సగం దూరం నడుచుకొని, సగం దూరం సైకిల్లో, మిగిలిన సగం కుంటుకుంటూ వెళ్ళి సెకండ్ షో చూసి ఆనందించండి) వంట బట్టించుకోవాలి అని రెట్టించిన ఉత్సాహంతో లైబ్రరీకి వచ్చే యువ, విపుల, చతుర, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలన్నీ చదివే వాడిని. ఏ రంగనాయకమ్మ మహత్యమో, యుధ్ధన పూడి సులోచనారాణి మహత్యమో కానీ వుంగరాల జుట్టు, గోల్డ్ ఫ్రేం రేబాన్ కళ్ళజోళ్ళు, ఎర్రని ప్లిమత్ కారు లేకపోయినా అమ్మాయిలు బాగా కథలు ఉరఫ్ కబుర్లు ఉరఫ్ సొల్లు చెప్పే వాళ్ళను ఇష్టపడతారని తెలుసుకున్నా. అందుకోసం లైబ్రరీలో చదివే ప్రతి ముఖ్యమైన పాయింటును మాడులో(ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మెదడు అని చదువు కోవాలి) ఓ మూల అండర్లైన్ చేసుకొనే వాడిని వాటిని ఎప్పుడైనా ప్రయోగిద్దామని. యండమూరి వెన్నెల్లో ఆడ పిల్ల చదివిన తరువాత మంత్రాలు కాదు గానీ కథలు బాగా చెప్పాలని పాంటింగ్ వేలెత్తితే అదే ఫైనల్ అన్నంత రూడీ అయ్యింది.


అభ్యాసం కూసు విద్య అన్నారు కదా అని నేటివిటీ దగ్గరగా కథలు చెప్పడం కోసం దొరికిన బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, చంద మామా కూడా చదివే వాడిని. ఇంకా కొత్త అవిడియాలకోసం బుడుగు, చిట్టి, ఆంధ్ర ప్రభలో వచ్చే రాము-శ్యాము తప్పకుండా చదివే వాడిని. అలా అన్ని పుస్తకాలు చదివినా మన తెలివి తేటలకు పరీక్ష పెట్టుకోడానికి ఎక్కడా అభ్యాసం అనే పదం కనపడలేదు.


బుర్ర వైశాల్యం ఎక్కువై అభ్యాసం లాంటి చిన్న విషయాలను అర్థం చేసుకోలేని వారికోసం: మీ డిప్ప మొహానికి అమ్మాయిల్ని ఆకర్షించే తెలివి తేటలు ఉన్నాయా వుంటే పరీక్షించుకోండి అనే అభ్యాసాలు. ఇంకా అర్థం కాకపోతే "కోన్ క్యాచేగా అమ్మాయిని" అనే బుద్ది కుశలత ప్రోగ్రాములు.


బళ్ళో గణిత శాస్త్రంలో వుండే త్రికోణమితి పాఠంలో చాలా ఆభ్యాసాలు లెక్కల అయివోరు భుజమ్మీద చెయ్యేసి మెచ్చుకునే అంత గా పూర్తి చేసే వాడిని. క్లాసులో ఆడ పిలకాయలు డౌట్లొచ్చి అడిగితే వాళ్ళను చూడకుండా, థర్డంపైర్ బదులు పాంటింగ్ ను చూసి వేలెత్తే అంపైర్ బెన్సన్ లా పక్కనున్నోడికి సమాధానం చెప్పేవాడిని. ఎందుకంటే లెక్కల్లో కథలు చెప్పడం కుదరదు కదా. ఆడాళ్ళకు చెబితే కథలే చెప్పాలి అనే నా ప్రతిజ్ఞను మీరు నిశిత దృష్టితో గమనించే వుండాలి(ఇది మీ బుద్ది కుశలతను తెలియజెప్పే ప్రామాణికం).


స్కూల్లో కుదర్లేదు కానీ కాలేజీలో అయినా అమ్మాయిలకు కథలు చెబ్తామని ప్లాటు రడీ చేసుకునే సరికి ఇంకొకళ్ళెవరో పెద్ద పెద్ద నవలలు చెబుతూ కనిపించే వాళ్ళు. వాళ్ళను చూసినప్పుడల్లా ఎన్నో ఏళ్ళు ఎదురు చూసి చిరంజీవి పార్టీ పెట్టబోయే ముందు రోజు వేరే పార్టీలో చేరిన ఏ సంకర జాతి రాజకీయనాయకుడి లాగనో ఫీల్ అయి బాధ పడే వాడిని. ఎలాగైనా ఎవరికైనా కథలు చెప్పి బుట్టలో వేసుకోవాలనే కోరిక ప్రగాడంగా మిగిలి పోయింది. నా కోరిక ఫలించేటట్లు చూడు సామీ అని మొక్కుకోడానికి తిరపతి కొండకు చాలా సార్లు వెళ్ళే వాడిని. గర్భ గుడి దగ్గర కెళ్ళేసరికి పోటు లోనుంచి లడ్డూలు తయారు చేస్తున్న ఘుమ ఘుమలు నన్ను వశపరచుకుని నా మనసంతా లడ్డూల మీద పొయ్యి విషయం మర్చిపోయే వాడిని. దేవుడికి కోరికల లోడు తగ్గించడానికి ఇలా డైవర్టు పద్దతులు పెట్టారేమోనని నాకు ఇప్పటికీ అనుమానం. నా లడ్డూ మమకారం అందరికీ తెలుసేమో తిరపతి లో ఇంజినీరింగు చదివే రోజులన్నీ ఇలా లడ్డూలతో గడిచిపోయేవి.


"లడ్డే రా అన్నిటికి మూలం..ఆ లడ్డు విలువ తెలుసుకొనుటే బొక్కువాడి ధర్మం..లడ్డేరా..అన్నిటికి.." అని పాట పాడుకుంటూ కాలం గడిపేవాడిని.

కొండ కొచ్చిన ప్రతోడూ ద్రాక్ష, జీడి పప్పూ పీకేసిన అర లడ్డో, పావు లడ్డో చేతిలో పెట్టి "లడ్డు వీర లేవరా... ద్రాక్ష లేని లడ్డు బొక్కరా" అని నా చేత కొత్త సినిమాలకు బ్లాకులో టికెట్లు కొనిపిచ్చేవాళ్ళు.


కనీసం లడ్డూలిచ్చయినా అమ్మాయిలను పడేద్దామనుకుని ఎప్పుడు లడ్డూ ఇచ్చినా "మా రూమ్మేటు వాళ్ళ డాడీ వచ్చి కళ్యాణోత్సవం చేయించిన పెద్ద లడ్డూ ఇప్పుడే ఇచ్చారు. దాన్ని తిన్న తరువాత వడ కూడా తిన్నా. ఇదిగో బ్రేవ్..సౌండు చూడు" అనే వాళ్ళు. అలా కాలం రాష్ట్ర పతి పదవి రాని కాకా లాగ విరహ వేదనతో రెండో ఎస్సార్సీ వేస్తే రాజీనామా చేస్తా అన్నంతగా రగిలిపోతున్న రోజుల్లో స్టీవ్ బక్నర్ వున్నా కానీ ఇండియా ఇన్నింగ్స్ తేడా తో ఆస్ట్రేలియా మీద గెలిచినట్టు అద్భుతం కాలేజీ చివరి రోజుల్లో జరిగింది.


ఎప్పుడూ పుస్తకాల్లో మునిగి తేలే వెంకట లక్ష్మి దగ్గరకెళ్ళి ధైర్యం చేసి "కాసేపు కబుర్లు చెప్పుకుందామా " అని అడిగా. ఆ అమ్మాయి సరే అంది. అప్పట్లో పీట్జా హట్లు, ఐమాక్స్ థియేటర్లు లేవు లేకుంటే తిరపతిలో ఏ సత్రం లోనో గుండు కొట్టుకున్నోడి సూట్ కేస్ కొట్టెయ్యాల్సి వచ్చేది. క్యాంటీన్ లో వేడి నీళ్ళ కాఫీ తాగటానికి "ఓకే..." అంది. ఇంకేం ఆకాశంలో రంగు రంగుల టపాసులు, మతాబులు, చిచ్చు బుడ్లు. దీపావళి ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పది నిముషాలు చూశా.


దొరక్క దొరక్క లక్ష్మణ్ కు వన్డే టీములో చోటు వచ్చినట్టు సంబరపడి పోయి ఎలాగయినా ఈ అవకాశాన్ని ప్రాక్టీసు మ్యాచు లాగా సద్వినియోగం చేసుకోవాలని "నన్ను మధ్యలో ప్రశ్నలు వెయ్య కూడదు. ప్రశ్నలేస్తే నేను మరిచిపోతా" అని చెప్పి ఆప కుండా ఒక మంచి పవర్ఫుల్, సస్పెన్స్, యాక్షన్, స్పై, త్రిల్లర్ విషయాన్ని కథలు కథలుగా చెప్పడం మొదలు పెట్టా.


ఒక నిముషం.. రెండు నిముషాలు.. అబ్బా నా ప్రయత్నం ఫలిస్తోంది. అమ్మాయి మొహంలో రంగులు మారుతున్నాయి. శోభన్ బాబు మీద మనసుపడ్డ శ్రీదేవి లాగా నన్నే చూస్తోంది. ఆర్.నారాయాణ మూర్తి ఎర్ర జెండా లాగా అమ్మాయి బుగ్గలు ఎర్రగా మారిపోతున్నాయి. ఇక ఈ అమ్మాయి మన బుట్టలో పడిపోయినట్టే మన సస్పెన్స్, త్రిల్లర్ కథ విని అని అనుకుంటుండగా ఆ అమ్మాయి బ్రేక్ వేసింది.

"ఈ కథ నాకు తెలుసు" అంది తాగబోతున్న టీ కప్పు కిందపెట్టి.

"అదేంటమ్మా.. ఎలా తెలుసమ్మా.. ఆ తరువాతేమవుతుందో చెప్పుకో చూద్దాం.." అన్నా తిక్క శంకరయ్య సినిమాలో ఎన్టీఆర్ లాగా.

"ఆ ఏముంది? కుందేలు చెట్టు కింద నిద్ర పోతుంది తాబేలు ముందుగా గీత దాటేసి గెలుస్తుంది"

అంతే అదే చివరి సారిగా ఎవరికన్నా కథలు చెప్పడం.


అసలు ఈ టపా రాయడానికి ప్రేరణ:

మొన్నా మధ్య ఒకటో తరగతి చదువుతున్న మా పెద్ద బుడ్డోడిని స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్తే ఎవరో చాలా మంది వాడి పై తరగతి అమ్మాయిలు వాడికి హలో చెబుతున్నారు. చెప్పడమే కాదు వాళ్ళ క్లాసు అమ్మాయిలకు వీడిని చూపించి మరీ పరిచయం చేస్తున్నారు. ఏంటబ్బా వీడి ఫాలోయింగు అని ఆలోచిస్తుంటే కొంత మంది అమ్మాయిలు వాళ్ళ అమ్మలకు కూడా పరిచయం చేస్తున్నారు. వాడు ఇంటికి వచ్చిన తరువాత అడిగా ఏంట్రా వాళ్ళందరూ నీకెలా తెలుసు అని. అందులో ఒకమ్మాయి వాడి బుక్ బడ్డీ అట (ఇక్కడ పిల్లల్ని కథల పుస్తకాలు చదివించడానికి సీనియర్ క్లాసు స్టూడెంట్ ఒకరిని పంపిస్తారు ప్రతి స్టూడెంట్కి). వాళ్ళు వీడికి కథలు చదివి వినిపిస్తున్నారో లేక వీడే వాళ్ళకు కథలు చెబుతున్నాడో అర్థం కాలేదు ఆ రోజు.


కొన్ని ఇరవైనాలుగ్గంటల తరువాత:


ఇక్కడ సిలికానాంధ్ర మన బడి క్లాసులో నేనే టీచరు వాడు క్లాసులో ఒక విద్యార్థి. వారాంతంలో రెండు గంటల నా వాగింగ్ ఈ క్లాసులోనే. పాఠ్యాంశం లో భాగంగా ఎవైనా బొమ్మలు చూపించి పేరు చెప్పమంటే పిల్లలు అందరూ పేరు చెబుతారు ఇంగ్లీషులో. దాన్ని నేను తెలుగు చెప్పి వాళ్ళకు వివరిస్తా. అలా అడిగినప్పుడు వీడు పేరు చెప్పడు కానీ మిగతా విషయాలన్నీ చెబుతాడు. ఆ క్లాసులో ఎద్దుల బండి బొమ్మ చూపిస్తే దాని పేరు చెప్పలేదు కానీ
" I know this thing. It has big wheels and it has bulls and man sits on it and it goes on the road and sometimes people ride on it and when I went to India I ride on it and I enjoy it and it is fun and you know maasTaaroo I want to ride on it again." అన్నాడు. అప్పుడర్థమయింది వీడు కథలెల చెపుతున్నాడో.

వీడి సంగతి సరే చిన్నోడన్నా బుద్దిగా తెలుగు మాటలు నేర్చుకుంటాడని మాటలు నేర్పిస్తూ "తాతా అనమ్మా" అంటే.

"పాప" అని సమాధానమొచ్చింది.


****************************************
భీషణమైన నా రేటింగ్ : 5/10
****************************************