Saturday, December 30, 2006

మంచు కురిసే వేళలో...వెన్ను నొప్పి వచ్చేవేళలో..

click on the images for bigger picture
అమెరికా లోనున్న తెలుగు వాళ్ళకు జెమిని టీ.వి. తేజ టీ.వి లాంటివి మేమే ఇస్తున్నాం గదా ఇక ఇంటికెళ్ళి సినిమాలు చూసుకో నీ సెలవులు తరువాతి సంవత్సరానికి బట్వాడ గిట్వాడా జాంతానై అన్నారు మా కంపెనీ వాళ్ళు.సరేలే ఈ రెండు వారాలు ట్రిప్పులేసేసి తెగ అమెరికా దున్నేద్దామనుకుంటే పిడుగు లా ఒక దాని తరువాత ఒకటి వచ్చి పడ్డాయి ఆటంకాలు. మొదటేమో బుడ్డోడికి "stomach flu" వచ్చి సెలవుల్ని అశుభారంభం చేసింది. హమ్మయ్య అది తగ్గి పోయింది ఇక ట్రిప్పులెయ్యొచ్చు అనుకుంటుంటే "నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానా" అన్నట్లు "మంచు కురుస్తుందోచ్" అని టీ.వీ.లో వార్త. వీళ్ళ టెక్నాలజీ ఎక్కువ కదా చెప్పినట్టు వచ్చేస్తుంది(అని గట్టి నమ్మకం) "ఆ మనకు మంచు పడ్డం కొత్త కాదు కద ఆ మాత్రం పడకపోతే ఆ స్కీ రెసార్ట్ వాళ్ళు ఎలా బతుకుతారు పాపం అని వీర లెవెల్లో టావోస్ కు, న్యూ మెక్సికో వెళ్దామని చుక్కలు పెట్టేసి గ్రాఫులు గీసేసి బొమ్మలు చూసుకుని తెగ సంబరపడి పోయాం.
** ** ** **
మంగళ వారం సాయంత్రానికి (19-డిసెంబరు-06) టీ.వీ. వాళ్ళు గొంతు మార్చేశారు....అదే వాతావరణ పరిశోధనా శాఖ నుంచి వచ్చిన సందేశం తో. "తూచ్...అది ఒట్టి మంచు కురవడం మాత్రమే కాదు అది ఒక మంచు తుఫానోచ్(snow blizzard)" అని. అయినా ఇది ఒస్తే ఏమయింది ఈ దేశం చాలా అభివృద్ది చెందింది కదా మంచు కరగడానికి ఎండ కోసం ఎదురు చూడరు పెద్ద పెద్ద పలుగు యంత్రాలు ఉంటాయి. దాంతో మంచు ని "ఉఫ్" మని ఊదేస్తారని గట్టి నమ్మకం.ఇంకేం మంచు తుఫాను ఎలా వుంటుందో చూద్దామని( పోయిన సారి, ఎనిమిదేళ్ళ క్రితం, వచ్చి నప్పుడు అదృష్టం కొద్దీ ఆ తుఫాను రోజు ఎయిర్ పొర్ట్ నుండి ఎగిరిన చివరి విమానంలో భారత్ కు ఎగిరి పోయా) ఎదురు చూడ్డం మొదలయింది. బుద్ది గా బుధ వారం వచ్చింది. పది గంటల్నుండి మొదలయింది ధవళ వర్ణం తో ధగ ధగ మెరిసి పోతూ నింగి నుండి కిందకు పడ్డం. కవుల హృదయాల్ని తట్టి లేపే అందమైన దృశ్యాన్ని కళ్ళముందుంచుతూ నల్లటి రోడ్లను తెల్లటి తివాచీ లాగా మార్చే తన ధర్మాన్ని తను నిర్వహించడంలో నిమగ్న మైంది ప్రకృతి మాత. పదుకొండు గంటలకు టీ.వీ. వాళ్ళు తమ వృత్తికి న్యాయం చేస్తూ మిగిలిన కార్యక్రమాలన్నింటిని పక్కన పెట్టి ప్రత్యేక కార్యక్రమాల్ని అందించడం మొదలు పెట్టారు పరిస్థితి తీవ్రతను గమనించి. "అవసర మైతే తప్ప బయటికి పోవద్దు". "ఇంట్లో నే వెచ్చగా వుండండి" మొదలయిన చిన్న పాటి హెచ్చరికలతో మొదలయింది హడావుడి. అప్పుడే గమనించా ఈ తుఫానుకు వారు పెట్టిన పేరు "సెలవు తుఫాను"(holiday blizzard). ఇది క్రిస్మస్ మరియూ కొత్త సంవత్సరం సెలవుల్లొ వచ్చింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు.

** ** ** **
మూడు గంటలకల్లా గవర్నర్ "రాష్ట్ర అత్యయిక పరిస్థితి" (state emergency) ప్రకటించేశారు. నేషనల్ గార్డు లను రంగంలో దించారు.చాలా ఆఫీసుల్లో పని చేసే వాళ్ళను తొందరగ ఇంటికి వెళ్ళమని చెప్పేశారు. అలా బయలు దేరిన వాళ్ళలో చాలా మంది దార్లో చిక్కుకు పోయారు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయింది. ఎక్కడ చూసినా మంచులో ఇరుక్కుపోయి ఆగిపోయిన కార్లు, ట్రక్కులు. ఎయిర్ పొర్టు చరిత్రలో మొదటి సారిగా 40 గంటలకు పైగా మూసేశారు. రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగ జాతీయ రహదారి I-25 మరియు I-70 లు మూసేసారు. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కొన్ని ఎక్కడివక్కడే ఆగి పోయాయి. ఆగి పోయిన కార్లు అక్కడే వదిలేసి కొంత మంది ఇళ్ళకో లేక దగ్గర్లోని హోటల్ కో నడక మొదలు పెట్టారు. ఉష్ణొగ్రతలు 20 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు కు పడిపొయాయి. గాలులు గంటకు 40 మైళ్ళ వేగానికి చేరుకున్నాయి.
** ** ** **

రాష్ట్రం మొత్తానికి మంచు శుభ్రపరచే యంత్రాలు 600 మాత్రమే వున్నాయి. ఒక రహదారిలో బస్సు 7 గంటలకు పైగా ఆగిపోయింది. అందులోనుంచొ కావిడ టీ.వి. కెంద్రానికి ఫోన్ చేసి నేను 6 గంటలకు పైగా ఉన్నానని చెప్పింది. ఆ విషయం మీద బస్సు సంస్థ ప్రతినిధి నడిగితే వచ్చిన సమాధానం." ఆ రూట్లో మాగ్జిమం మూడు గంటలు మాత్రమే తీసుకుంటుంది. ఆ పాసింజెరెవరో వెయిట్ చెయడం వళ్ళ అలా మాట్లాడు తున్నారు" అని. ఈ మాటలు మన చినంప్పట్నుంచి వింటున్నట్టు వుంది కదా. మళ్ళీ ఇంకో ప్రభుత్వ ప్రతినిది మాట్లాడుతూ మొదట మెయిన్ రోడ్డు శుభ్రం చేస్తాం తరువాత ఇళ్ళ దగ్గర ఒక అడుగు కు మించి పడితే వచ్చి శుభ్ర పరుస్తాం అని. ఇళ్ళ దగ్గర రెండున్నర అడుగులు పడ్డా ఇప్పటికి పట్టించు కున్న నాధుడు లేడు. పోన్లే క్రిస్మస్ కదా శుభ్రం చెయ్యలేదు అని సర్దు కుంటే. ఆ తుఫాను ఆగి వారం రోజులయినా ఇళ్ళ దగ్గరకి ఒక్క snow plower రాలేదు. ఎయిర్ పొర్టు అయిదు వేల మంది తో మెగా హోటల్ అయిపోయింది. అక్కడ వున్న వాళ్ళకి భోజనం దొరకడం కష్టమయి పోయింది. ఎందుకంటే బయటి నుండి ఒక్క వాహనం కూడ అక్కడికి వెళ్ళ లేక పోయింది. ఏదయితేనేం ప్రకృతి మాత ఎట్టకేలకు గురు వారం సాయంత్రానికి శాంతించింది మూడు నుండి నాలుగు అడుగుల మంచు తెచ్చిన తరువాత.
** ** ** **
ఈ తుఫాను వెలిసే అంత వరకు టీ.వీ. ని ఏదో సస్పెన్స్ సినిమా చూసినట్టు చూశాను గుండెలు అర చేతిలో పెట్టుకుని. ఇంట్లో అప్పుడే ఓ చిన్న జబ్బు నుండి కోలుకుంటున్న అయిదేళ్ళ కొడుకు ఒక పక్క, రెండు నెలలు నిండిన చిన్నారి ఇంకో పక్క ఉంటే ఎవరికైనా ఇలానే వుంటుంది.
** ** ** **

గురు వారం ఊపిరి పీల్చుకోవడం అయ్యింది. శుక్ర వారం ఊపిరి వదుల్తూ..పీలుస్తూ ఇంటి ముందు మంచు శుభ్ర పరిచే కార్యక్రమం మొదలయింది. ఇక్కడ కొన్ని పద్దతులు, సూత్రాలు వుండి ఏడ్చాయి. ఇంటి ముందు పక్క బాట (side walk) ఎవడిది వాడే సుభ్రం చేసుకోవాలి. ఇటు వైపు అటు వైపు ఇల్లు వుంటే అటు రెండడుగులు ఇటు రెండడుగులు చేస్తే సరిపోతుంది.నా అదృష్టం కొద్దీ మా ఇల్లు కార్నెర్ ఇల్లు అయ్యింది. నాకు ఓ నలభై అడుగులు దూరం శుభ్రం చేసే అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. కార్ గరాజ్(garage) ముందు చేసింది చాలక ఈ పక్క బాట జన్మ భూమి కూడా దక్కిందన్న మాట. బోనస్ గా మా ఇంట్లో కి వెళ్ళే ధారి L ఆకారం లో వుండి ఇంకో 15 అడుగులు జన్మ భూమి కార్యక్రమం. వెరసి నాకు వెన్ను నొప్పి మిగులు. అమెరికా రాక ముందు "మంచు కురిసే వేళలో మల్లె విరిసే నెందుకో.." అని పాడుకొంటే ఇప్పుడు " మంచి కురిసిన వేళలో...వెన్ను నొప్పి వచ్చేనెందుకో" అని పాడు కోవాల్సి వస్తోంది.

** ** ** **

అలా మంచు తొలగిస్తూ వుంటే నాకు గుర్తు కొచ్చిన పాటల్లో మొదటిది నాగేశ్వర రావు, సావిత్రి చేనుకు నీళ్ళు తోడుతూ (గూడ వేస్తూ) పాడుకొన్న "ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపే మున్నది". తరువాత గుర్తు వచ్చిన పాటలు."జయమ్ము నిశ్చయమ్మురా..జంకు బొంకు లేక సాగి పొమ్మురా..?" మూడడుగుల ఎత్తు నున్న మంచు తొలగించాలంటే ఆ మాత్రం ఇన్స్పిరేషన్ వుండాలి కదా. ఇంకా "ఎవరేమన్ననూ తోడు రాకున్ననూ..నీ ధారి నీదే...సాగి పోరా నీ గమ్యం (రోడ్డు చివరి snow) చేరుకోరా".
** ** ** **

ఉ(బు)డత సాయం.

ఉ(బు)డత సాయం.

మా నాన్న పక్క బాట(side walk) శుభ్రం చేశాడోచ్

కొస మెరుపు పాట "జన్మ మెత్తితిరా అనుభవించితిరా..."
** ** ** **
నేనిలా బ్లాగుతుంటే ఇంకో పక్క రెండో మంచు తుఫాను వస్తున్నట్టు చల్లగా చెబుతున్నారు టీ.వీ. వాళ్ళు. మళ్ళీ పైన చెప్పిన పాటలన్నీ ఓ సారి గుర్తుకు తెచ్చు కోవాలి తప్పుతుందా. గీత లో కృష్ణుడు చెప్పిన కర్మ కాండ కూడ జతవుతుందేమో ఈ సారి.

5 comments:

cbrao said...

మీ కష్టాలు చూస్తుంటే మంచు ఇలాంటి తిప్పలు తెస్తుందా బాబోయ్ అనిపించింది. చిత్రాలు, అక్షర చిత్రాలు మీ విచిత్ర పరిస్థితి ని కళ్ళకు కట్టినట్లుగా తెలిపాయి. మంచు అంటే ఎదో romantic mood లోకి వెళ్ళిపోయే మా మనసులో ఉన్న మంచు తెర తొలిగింది. మీ కథనం మేమే డెన్వర్లో ఉండి మంచు బాధితులైన అనుభూతి మిగిల్చింది.

radhika said...

maa trip kuudaa maa baabu ki fever valla aagipoayindi.snow padutundi gaani own house kaadu kaabatti memu clean chesukonavasaram ledu.ayina marii manishi kuurukupoaye anta snow maaku padaledu.mii baabu bhalevunnadu uduta saayam leakapoate mii pani[raamulavaari pani]jarigedi kaademo?anta kashtaanni kuudaa haasyam joadimci bhale raasarandi

రవి వైజాసత్య said...

బాబోయ్..ఈ సారి మా మంచు కూడా మీరే దోచుకున్నట్టున్నారు. త్వరగా తీసి ఇచ్చెయ్యండి.. లేకపోతే నేను టెక్సస్లో చేసింది చేయ్యాల్సొస్తుంది.
బుడ్డొడికి ఇక సెలవులు పండగనుకుంటా కదా? ఎంజాయ్

Anonymous said...

రావ్ గారు,

మంచు కవితాత్మకంగా బాగానే వుంటుంది. సినిమాల లో చూసినప్పుడు బాగానే వుంటుంది. అప్పుడప్పుడూ ఏ పర్యాటక ప్రదేశానికో వెళ్ళి చూసొస్తే బాగనే వుంటుంది. ఆ మంచు దాని వల్ల వచ్చే చలి చూస్తే వళ్ళు వణుకు పుట్టుతుంది.

మీ అభిమానానికి ధన్యుణ్ణి.

రాధిక గారు,

మీరు చాలా అదృష్టవంతులు. మీకు కూడ మంచు పడుతుందా. అయితే బహుశా మా మంచు తుఫాను మీ వైపు వచ్చుంటుంది.

రవి గారు,

మీరోసారొస్తే మీ మంచు భద్రంగా మీకు ఇచ్చేస్తాం :-) మేము ఇతరుల వస్తువులు వుంచుకోము :-)


విహారి

puttagunta said...

Vihaari garu..mee "Pandu..baby pandu" vyasamtho meeru Denver lo vunnarani thelisindhi.

Ippudu ee tapaatho (అమెరికా లోనున్న తెలుగు వాళ్ళకు జెమిని టీ.వి. తేజ టీ.వి లాంటివి మేమే ఇస్తున్నాం గదా) meeru echostar office loney vunnarani ardham ayyindhi. Meeru FTE ayyuntaaru. Nenu consultant ni.