Wednesday, August 27, 2008
Tuesday, August 26, 2008
బ్లాగు వ్యాసం అల్లరా లేక బ్లాగు వ్యాసంతో అల్లరా?
బ్లాగుకి టపాకి మధ్య అనుసంధానమైంది ఈ బ్లాగు
రండి బాబూ...రండి.
కాయ్ రాజా కాయ్..
మాడి పోయిన బుర్రలు వెలుగుతాయి బాబు..
వీడి పోయిన మనసులు కలిసి పోతాయ్ బాబూ..
ఒక్క లుక్కు వేసుకోండి బాబూ..
ఒక్క క్లిక్కు పది పేజీల టపా బాబూ..
కాయ్ రాజా కాయ్..
రండి బాబూ రండి....
హమ్మయ్యా వచ్చేశారా.
ఈ జాతర్లో పాటలేంటంటారా? ఒక్కో సారంతే. కొన్ని సంవత్సరాల తరువాత బ్లాగులకు కాప్షన్ లు ఇలానే వుంటాయ్.అదే నా అవుడియా. ఎవరికీ పుట్టదు, తట్టదు, కలగదు, వెలగదు, రాదు, లేదు.
ఇప్పుడు విషయం లో కొద్దాం. ఈ విషయం చదివిన తరువాత ఈ ఉపోధ్ఘాతం మతలబు మర్చి పోదాం.
ఈ సారి బ్లాగు వ్యాసం 'అల్లరి' అంటే ఎవరో ఒకర్ని బకరా చెయ్యడం లేదా తామే అల్లరయి బకరా అవడం. అలాంటి దేమన్నా రాద్దామనుకుంటూ వుంటే నేను అల్రెడీ రాసేసినానని అర్థమయింది. ఇందులో నేను ఒక బకరా అనుకుంటే పోలా. బోల్డంత సానుభూతి కూడా. కానీ నాకు తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో నచ్చని ఒకే ఒక పదం సానుభూతి. మీరు ట్యాగ్ లైన్లకు అలవాటు పడి పోయుంటే ట్యాగ్ లైన్ 'సంస్కృతంలో కూడా'. అదే "నా ఏడో తరగతి మొట్టికాయలు".
నేను మీ ఎదురుగా నిలబడి మాయలోడు సినిమాలో ఆలీ లా నాలుక బయట పెట్టి వె.. వ్వె.. వ్వె అన్నట్లుందా. అదంతా హాలూసినేషన్ నమ్మకండి. మీ చెవుల్లో హాట్ హాట్ స్టీమ్ ఇంజెను కూ..చుక్..చుక్.. అనుకుంటూ రౌండ్లేసుకుంటూ,మీ శరీరం లో రక్తం కుత కుత లాడుతూ స్ప్రింటరు ఉస్సేన్ బోల్ట్ లా పరుగులు పెడుతూ దొరికితే నా బోల్టూ నట్టూ రెండంకెలు లెక్క పెట్టే లోపల పీకెయ్యాలనిపిస్తే అది నా హాలూసినేషన్. నేను కూడా నమ్మను. ఈ హెడ్డింగ్ చూసి ఇంతవరకు చదివారంటే నా మీద మీకు టి.వి. మీద రీమోట్ కున్నంత, కంప్యూటర్ మీద మౌసు కున్నంత అభిమాన ముందని అర్థం.
ఈ టాపిక్ వచ్చింది కదా ఏదైనా వెరైటీ గా రాద్దాం అని ధారపుండ చేత్తో పట్టుకొని బుర్రకు తకిధిమి తాళం వేస్తుంటే ఒక కొస చేతిలో వుండిపోయి ధారపుండ జ్ఞాపకాల సుడిగుండం లో పడిపోయింది. అప్పుడే బుడ్డోడు "ఉరే! మట్టి నాన్నా! నా గాలీ పటం దారం పోయిందిరో " అని పక్కిల్లు, ఎదురిల్లు, వెనకిల్లు ఎగిరి పోయేట్టు ఏడుపులంకించుకున్నప్పుడు కానీ ఈ లోకం లోకి రాలేదు. కాసేపు ధారపు మధనం చేస్తే వణుకుతూ వడికిన ధారం బయటికొచ్చింది. సురులు అసురులు సాగర మధనం చేసినప్పుడు కామ ధేనువు, కాలకూట విషమూ, అమృతమూ ప్యాకేజీ డీల్ లా వచ్చినట్లు నాక్కూడా ఓ సంఘటన ధారపు పోగు చివరన కొబ్బరికాయకు పీచులా, కాంగ్రేసుకు న్యూక్లియార్ డీల్లా అతుక్కొని వచ్చింది. అదే ఈ టపా. దీన్ని అల్లరి కింద కానీ బకరా అనే దృష్టితో కానీ చూడకండి. కొంచెం సీరియస్ టపా.(అని రాసేప్పుడు అనుకున్నా కానీ రాసిన తరువాత అలా అనిపించలా. ప్చ్...కొన్ని సార్లు లైఫ్ బాయ్ సబ్బు, గ్రైప్ వాటరూ, వై.ఎస్. నవ్వూ, చంద్ర బాబు రెండు వేళ్ళూ, చిరంజీవి చారిత్రాత్మక తప్పిదం, నేనూ అంతే.)
ఊరు: రాయలసీమ లో ఓ చిన్న పట్టణం.
సమయం: కాలేజీ కుర్రోళ్ళు మెస్ లో మధ్యాహ్నం మత్తొచ్చే మజ్జిగన్నం మూడు కుంభాలు లాగించి ఆ తరువాత కదళీ ఫలాన్ని కదనోత్సాహంతో ఆరగించి భుక్తాయాసంతో ఉబ్బసం రోగిలా రూముకెళ్ళే సమయం.
పరీక్షలొస్తే మెస్సు భోజనమే. అలా ఓ సారి పరీక్షలొచ్చినప్పుడు వి.కె.మెహతా రాసిన పుస్తకం లోని మొదటి పేజీ లోని "ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజినీరింగ్ విచ్ డీల్స్ విద్ ద ఫ్లో ఆఫ్ ఎలక్రానిక్స్ త్రూ వాక్యూం ఆర్ ఏర్...." అనే ఎలక్ట్రానిక్స్ నిర్వచనాన్ని బట్టీ వేసి వేసి అట్ట నలిగి పోయి, మనసు అలసి పోయి, మెదడు కుళ్ళి పోయి, పేగులు అలసి పోయి మెస్సు కెళ్ళి భోంచేసి నడచి వస్తున్నా. అలా వచ్చేటప్పుడు మధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ వస్తున్నా. అలా చూస్తుంటే పంచ కట్టుకున్న ఓ యువకుడు (నా వయసే వుంటుందేమో) ఒకతను నా దగ్గర కొచ్చాడు.
"ఏంలే(ఏంరా) అట్లా జూస్తా వుండావు" అన్నాడు.
"నువ్వెవర్రా" నేను.
"నేనెవుడైతే నీకెందుకు గ్గానీ . ఎందుకు నువ్వట్లా ఎనక్కి దిరిగి సూస్తావుండావ్"
"నా ఇష్టం. నీకెందుకు చెప్పాల్ల"
"ఏ గల్లీ నీది"
"గల్లీనా. నా గల్లీ నీకెందుకురా "
అంతలోనే అక్కడ బంకు దగ్గరున్న నా క్లాస్ మేట్ ఇది చూసి వచ్చాడు. "అలే (అరేయ్). ఈ యబ్బి నా క్లాస్ మేటే. ఎందుకలే ఆపినావ్?"
"ఏం లేదలే ఈడు మాటి మాటికీ ఎనక్కి దిరిగి జూస్తాండాడు. మొన్న ఆ గల్లీలో వానితో గలాటా జరిగితే నా సంగతి జూస్తా అణ్యాడు. వాళ్ళోడేమో నని ఆపినా"
"అట్టాంటి దేమీ లేదు మన పిల్లోడేలే"
"అట్నా. అయితే మనోడే గదా. సారీ అప్పా"
"ఫరవాలేదులేప్పా!!!" నేను చెప్పా.
పైన నిజంగా జరిగిన సంభాషణ రాయటం కేవలం పరిస్థితులెలా వుంటాయో చెప్పడానికే కాదు భవిష్యత్తులో ఓ టపా రాయటానికి కూడా.
మా రూములో(అది పెద్ద ఇల్లే. ఈ భూమ్మీద శత మర్కటాలుండే దేన్నయినా తెలుగు భాషలో రూమే అంటారు.) ఎప్పుడూ కనిష్టంగా ఓ ఆరు మంది వుండే వాళ్ళం. గరిష్టానికి లెక్కల్లేవ్. ఎప్పుడు ఎవడికి రూము కావాలన్నా రాజు గారి ధర్మసత్రం వున్నట్టు జోలె భుజానేసుకుని రూములో వాలి పోయే వాళ్ళు. వాళ్ళు ఎగిరిపోవడానికి రెక్కలు, ఈకలు సమకూర్చడం మా రూములో వాళ్ళ పని. మా కాలేజీ యాజమాన్యం వాళ్ళ సంస్థలన్నీ మా రూముకు దగ్గరే అక్కడే వుండేవి. అందులో ఓ జూ: కాలేజీ వుండేది. అందుకని ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణం లా వెలిగి పోయేది.నిత్య, కళ్యాణి, తార పేర్లు గుర్తు రాక పోతే మీరు కళా ప్రియులు, కళాభిమానులు, కళా పోషకులు కాదు. అలాంటి వాళ్ళు పాండు రంగడు సినిమా భోజనానికి ముందు ఇంటర్వెల్ వరకు, భోజనం తరువాత అశుభం వరకు రోజుకు రెండు సార్లు వరసగా ఏడు రోజులు లేదా వారం రోజులు అలా కాదంటే అట్ లీస్టు వన్ వీక్ ఐనా నిష్టా గరిష్టులై చూసి తరించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. కాలేజీ వదిలిన తరువాత "రామ చిలకలు", "పంచ దార చిలకలు", "సీతా కోక చిలకలు", "చిలిపి చిలకలు", "కొంటె చిలకలు" మా రూము ముందు నుండి వయ్యారంగా రెక్కలు విరుచుకుంటూ, వింజామర వీచికలా వెళ్ళేవి. అలా వుంటే ఇక మా కాలేజీలో క్లాసు అయిపోయిన ప్రతి జిడ్డు మొహమూ రూము తాళం చెవులు తీసుకొని ఇంటికొచ్చి పియర్సు సోపు అరగదీసి, ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబు చిదిమేసి, పాండ్స్ పౌడర్ డబ్బా తో మొహం మీద డబ్బా మధనం చేసి పౌడర్ వర్షం కురిపించుకొని ఇస్త్రీ చేసిన లాకోస్టే టి-చొక్క వేసుకొని ఇంటి ముందు గారడీ బొమ్మల్లా, హోం మినిస్టర్ లా నిలబడి వచ్చే పోయే "తళుకు తార"లను బెదర గొట్టే వాళ్ళు. అలా బెదర గొట్టబడిన వాళ్ళకు తొడలు కొట్టే అన్నయ్యలో, చిటికలేసే నాన్నలో వుంటే అదర గొడదామని మా రూముకు దండ యాత్రకొచ్చేవాళ్ళు. అలాంటి ఉద్రిక్త వాతావరణం వున్న రోజుల్లో దిండు కింద కత్తులు మెత్తగా పెట్టుకొని బజ్జోని, కాలేజీకి జేబులో న్యూట్రిన్ చాకులెట్టులు,సాక్సుల్లో నన్ చాకులెట్టుకొనీ, బుక్కుల్లో బాకులు భద్రపరుచుకుని వెళుతూ పూంచ్ సరిహద్దుల్లో వున్న వాళ్ళలా జీవించే వాళ్ళం.
ఉపమానాలు పలు రకాలు. ఇందాకా గాల్లో ఎగిరే చిలకలు చెప్పుకున్నాం కదా. అలాగే గాల్లో వేలాడే పళ్ళు బాధ పడకుండా వాటి గురించి కూడా చెప్పుకుందాము. ఎన్ని పళ్ళున్నా అందులో దొండ పండు, ద్రాక్ష పండు, ఆపిల్ పండు లాంటి కేటగిరీలు లేకపోతే రసాస్వాదన లేనట్టే. దొండ పండు లాంటి ముక్కు, ఆపిల్ పండు లాంటి బుగ్గలు, ద్రాక్ష పండు లాంటి సిగ్గులు వున్న ఒక అమ్మాయి కూడా వుండేది. ఆ అమ్మాయిని కొంత మంది 'బ్యూటీ క్వీన్' అనే వాళ్ళు, ఇంగ్లీషు అంతంత మాత్రమే వచ్చి Psychology అనమంటే 'పిస్కాలజీ' అనే నా లాంటి తెలుగు మీడియం ధీరాగ్రేసులు 'బూటీకీ' అనే వాళ్ళం. చాలా అడ్వాన్స్డ్ ఇంగ్లీషు తెలిసిన హిగ్గిన్ బోథాంసు గాళ్ళు అంటే అప్పటికే షేకవుతున్న స్పియరూ, అండూ ఆర్ కె నారాయణన్నూ బుక్కులు చదివినోళ్ళు మాత్రం 'బుటిక్' అనే వాళ్ళు. వీళ్ళతో మాకెప్పుడూ పడేది గాదు. భార్యా భర్తల్లా వుండే వాళ్ళం. అలా బూటీకీ ఇంటి ముందు నుండి పాసయి పోగానే పిట్ట గోడ మీదున్న అందరూ ఇండియన్ క్రికెట్ టీము క్రీజ్ నుండి పెవిలియన్ లోకి టీమ్ స్పిరిట్ తో వచ్చినట్టు రూములోకొచ్చి మసాలా టీ తాగి బాలేదని చెప్పి కప్పు కడక్కుండా వెళ్ళి పోయే వారు. ఈ బూటీకీ గురించి ఒక స్పెషల్ ఎపిసొడ్ రాయాలనుంది కానీ ఇప్పుడు రాస్తే మా ఆవిడ చూసే ప్రమాదముంది. మళ్ళీ జ్యోతక్క బ్లాగులో నా 99 వ జన్మ దిన శుభాకాంక్షలు చూసిన తరువాత రాస్తా. అంత వరకు దాన్ని అధికార రహస్యాల చట్టం కింద అట్టి పెడతా. 99 వరకు ఎవరన్నా బతుకుతారా అంటే ఇక్కడ మా ఊళ్ళోనే వున్న డాక్టర్ చేత చెప్పిస్తా. ఆయన ఆయుర్వేదిక్ మందులు వాడితే 120 గ్యారంటీ అంటున్నాడు. ఇంకా అనుమాన ముంటే వెళ్ళి భాషా ను అడగండి. ఆయన సంవత్సరానికి ఒక సారి హిమాలయాల కు వెళ్ళి వస్తాడు కదా ఎందుకనుకుంటున్నారు? స్కీయింగ్ కు అనుకుంటే వేడి చద్దన్నంలో నాలుక పెట్టి సర్రున కాల్చుకున్నట్లే. అక్కడ మూడు వందలు, నాలుగువందలు సంవత్సరాలు నిండి వున్న వారు చెట్లకు పుట్లకు వేలాడుతూ కనిపిస్తారట. అలా (వేలాడ్డానికి) నాక్కూడా పెద్ద ప్రణాళికుంది. అరవై దాటిన తరువాత అక్కడి కెళ్ళి ఎనభై దాటిన తరువాత తిరుపతి కి తిరిగొచ్చి అంటే తిరుమలకి తిరిగొచ్చి పేద్ద మల్టిప్లెక్సు ఆశ్రమం కట్టి అక్కడ ఏ.సి రూము నుండి అదేందది సామాజిక స్పృహ.. ఆఁ.. దాని గురించి కూడా బ్లాగుతా ఇప్పటి ట్రెండు ప్రకారం.
మంచు పల్లకి సినిమాలో పిట్ట గోడ మీద కూర్చున్న హీరోల్లా వున్న మా బాంగ్లా దేశ కాందిశీకుల శిబిరంలో ఓ సారి కలకలం బయలు దేరింది. కలలు కనే కసి వయసులో అలా కలకలానికి కారణమైంది బ్యూటీ క్వీన్ . ఎక్కడైనా కాలేజీ అబ్బాయిల్లో కలకలం బయలు దేరిందంటే ఏ అందమైన అమ్మాయో లేక అందంగా లేని అమ్మాయో అయుంటుందని అర్థమై పోతుంది. మరి దొండ, ద్రాక్ష, ఆపిల్ కాంబినేషన్ అమ్మాయుంటే ఏం జరగాలి? బొబ్బిలి యుద్ధమో, పాణి పట్టు యుద్ధమో, హాకీ యుద్ధమో జరగాలి. అలా అనుకునే వాళ్ళయితే రాంగోపాల వర్మ తీసిన 'ఫూంక్' సినిమాని అయిదు లక్షల కోసం ఒంటరిగా చూడ్డానికి అర్హులు కాదు. ఇక్కడే మూడు మార్కులు మైనస్. ఈ అతలాకుతల కల కలానికి కారణం 'బ్యూటీ క్వీన్' కాదు. సరే సస్పెన్సు వీడ గొడుతున్నా. ఓ రోజు ఎవడి చొక్కా జేబులోనో ఇరవై రూపాయలు మాయం. ఇంకో రోజు ఎవడిదో డొక్కొచ్చేంటీ వాచీ మాయం. ఇంకో రోజు నా జేబులో రెండు గాంధీ నోట్లు మాయం. చూస్తూ వుండగానే ఓ రోజు మూడు సైంటిఫిక్ క్యాలికులేటర్లు మాయం. అందరూ ఒకటే గగ్గోలు. మనలోనే ఎవడో దొంగ వెధవ వున్నాడు. వాడే ఈ పని చేస్తున్నాడని అందరూ తలా ఇరవై వేళ్ళు పైకెత్తి వందల కొద్దీ వోట్లేసి ఆ దొంగ వెధవను ఎవరి సహాయం లేకుండా మనమే పట్టుకోవాలని తీర్మానించేశాం.
ఈ తీర్మానం విషయం కాలేజీలో బెంచీలకు, కుర్చీలకు, చెట్లకు, చెట్టు మీదున్న పక్షులకూ, టీ వేసే వెంకట సామికి, టీ పొడి తెచ్చిచ్చే ఈరప్పకు, టీ గ్లాసులు కడిగే ఉబేదుల్లాకు, టీ నీళ్ళు తాగే మేధావులకు కూడా తెలిసింది. మేధావి వర్గమంతా ఒకే చోట వుంటుంది. వాళ్ళంతా మా రూములో నా పియర్స్ సోపు వాడుంటారు కదా.
ఇప్పుడు... అప్పటి పియర్స్ సోపు ప్రకటన(మీ కోసం): ఒక చిన్న పాప వాళ్ళమ్మ సోపు రాస్తుంటే "పేర్స్..పేర్స్..నన్నూ అమ్మలా చేయవూ" అంటుంది.నా సోపు మొహానికి రాసుకునేవాళ్ళు "పియర్సూ..ఓ నా పియర్సూ నన్నూ విహారీలా చేయవూ?" అని మూడు సార్లు రాసేవాళ్ళు.
ఒక్కోడూ నెత్తిన హ్యాటూ, జేబులో భూతద్దం, చేతిలో పెన్సిలూ పెట్టుకొని డికేస్టీ ఉద్యోగం లో జాయిన్ అయిపోయారు. వాళ్ళ చొక్కా బ్యాడ్జిల మీద షెర్లాక్ హోమ్స్ , మైక్ హ్యామర్, యుగంధర్, షాడో, రాడో, ర్యాంబో, చంటబ్బాయ్, చిరంజీవి, గూండా, రాక్షసుడు, సన్నాసి గాడు లాంటి పేర్లు రాసుకోని మరీ రూముకొచ్చేశారు. అలా చాలా మంది యుగంధర్ లూ, షాడోలు, షెర్లాక్ హోమ్‌సూ కలిసి సమావేశం ఏర్పాటు చేసారు. అంతవరకు డబ్బులు, వాచీలు వగైరా పోగొట్టుకున్న వాళ్ళనందరిని లైన్లో రమ్మని చాలా ప్రశ్నలు వేసి మా రూములో టీ డబ్బాలు, చక్కెర డబ్బాలు , పాల డబ్బాలు ఖాళీ చేసి పోగొట్టుకున్నోళ్ళ వంట్లో శక్తి ని కరగదీసి, మా కంట్లో కన్నీళ్ళు కార దీసి సంతోషించారు. వేసే ప్రతి కొత్త ప్రశ్నకి హైఫైవ్ లు చెప్పుకున్నారు కానీ దొంగెవరో ఏ బ్యాడ్జి గాడికి అర్థం కాలేదు. కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన మీదట దొంగెవరో కనుక్కోవాలంటే ఒకే ఒక డిటెక్టివ్ వుండాలి వాడికే అన్ని అధికారాలు అప్పగించాలి అని బ్యాడ్జిలన్నీ పీకేసి ఫ్లాస్కులో సెట్టన్న అంగడి నుండి తెచ్చుకున్న కాఫీ తాగి తీర్మానించారు. డిటెక్టివ్ అంటే కొంచెం మతిమరుపు, కొంచెం తెలివి తేటలు, కొంచెం అతి తెలివి తేటలు, కొంచెం గూండాయింజం, కొంచెం నీరు, కొంచెం ఉప్పూ,కొంచెం గరళం... అప్పుడప్పుడూ చంద్ర లేఖ వుండాలని అందరి బుర్రలూ చెక్ చెయ్యాలి ఓపెన్ చెయ్య మన్నారు. అందరూ బుర్ర మీద జిప్పులు సర్రు సర్రుమని ఓపన్ చేసి పెట్టుకున్నారు. ఎవడి బుర్ర చిప్ప ఓపన్ చేసి చూసినా ట్రిగనామెట్రీ, ఎలక్ట్రానిక్సూ, స్ట్రెంక్త్ ఆఫ్ మెటీరియల్సూ, హిగ్గిన్ బోథాంసూ కనిపిస్తాయి తప్ప స్కాట్లాండ్ యార్డు మట్టి ఒక్క బుర్రలో కూడా కనిపించలేదు. ఒకడి బుర్ర చూస్తే కౌరవుల్లో విదురిడిలా, లంకలో విభీషణుడిలా అందులో వాక్యూం కనిపించింది. గాలి కూడా లేదు. అది తెలిసి ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు పెళ్ళి చూపుల్లో అమ్మాయి అబ్బాయి చూసుకున్నట్లు(ఒలంపిక్సు ఫాలో అయ్యేవాళ్ళు అభినవ్ భింద్రా కు స్వర్ణం రాగానే సురేష్ కల్మాడి చూసినట్టు). తరువాత అందరూ కలిసి భుజాల మీద భుజాలు వేసుకోని మిద్దె మీదకు నిచ్చెన వేసుకొని వెళ్ళి పోయారు. పైకెళ్ళిన తరువాత నిచ్చెన తీసేశారు. ఎవరూ పైకి రాకుండా. సరే నన్ను మర్చిపోయారని నేను కిందనే వుండిపోయా.
కాసేపటికి అందరూ కిందకు వచ్చి నా చేతిలో రెడీగా నున్నడబ్బు అప్పు గా తీసుకొని చందాలు పోగు చేశారు. ఆ డబ్బుతో తంతి తపాలా ఆఫీసుకు వెళ్ళి స్పెషల్ బుకింగ్ చేసి స్కాట్లాండ్ యార్డు నుండి మట్టి తెప్పించారు. ఎవడి బుర్రలో వ్యాక్యూం వుందో మళ్ళీ రెండో సారి పరీక్షించి ఆ బుర్రలో ఆ మట్టిని వేసి మైదా పిండి తో చేసిన బంకతో సీలు చేసి లక్కతో స్టాంపు వేశారు "డీకేస్టీ" అని. వాడి బుర్ర చురుగ్గా పని చెయ్యడం మొదలు పెట్టింది. వాడే షాడో అలియాస్ యుగంధర్ అలియాస్ డీకేస్టీ అలియాస్ దళపతి అయిన..... మీ ఊహ కరక్టే. మీకు మూడు మార్కులు ప్లస్సు. మీరు చాలా తెలివయినవారు.
(బ్యాక్ గ్రౌండ్ చప్పట్లు.. తరువాత జేమ్స్ బాండ్ మ్యూజిక్... ద మ్యాన్ విత్ ద ఇనప గన్... ద మ్యాన్ విత్ ద ఇనప గన్...)
మ్యూజిక్ అయిపోగానే ఫ్లూటు కృష్ణ దగ్గర సైకిలప్పు తీసుకొని కత్తెర కాలేసుకుని బషీర్ బుక్ స్టాలుకు పొయ్యి రోజుకు మూడు పుస్తకాలు మంత్లీ మెంబర్షిప్పు కట్టి మూడు పుస్తకాలు అద్దెకు తీసుకొచ్చా. ఒకటి యుగంధర్ ది, ఇంకోటి షాడో ది, మూడోది నటశేఖర కృష్ణది. వాటిని పగలు బల్లిలా రాత్రి నల్లిలా,ఎండలో ఎలకలా, వానలో నక్కలా మూడు రోజుల పదకొండు సెకండ్లలో చదివేసి ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకున్నా. ఏడమ చేత్తో బట్టలుతకడం, వంట చెయ్యడం, బిందెతో నీళ్ళు తేవడం, కుక్కల్ని, పిల్లుల్ని, ఈగల్ని తరమడం, దోమల్ని చంపడం లాంటి అన్ని పనులు చెయ్యగలననే నమ్మకం కుదిరిన తరువాత దేవుడి ముందు కర్పూరం వెలిగించి, తమలపాకులో చక్కెర పెట్టి, రెండున్నర గుంజీలు, మూడు బస్కీలు తీసి మొక్కుకుని కుట్లూడిపోయిన కోటేసుకున్నా. కోటు మహత్యమో బస్కీల మహత్యమో దొంగతనం జరిగిన సన్ని వేశాల్ని మొత్తం విశ్లేషణ చేసి ఒక్కొకళ్ళనీ ఎలిమినేట్ చెయ్యగా చెయ్యగా ఒకతని పేరు బయటికి వచ్చింది. అతనే కదిరప్ప (పేరు మార్చబడింది). బాడీ మైక్ టైసన్ లా, చూడ్డానికి చంద్ర మోహన్ లా వుంటాడు. మాట్లాడితే చెప్పనక్కర లేదు. అందరికీ తెలిసినంత వరకు మనిషి మాత్రం మంచోడే. సరే ఎటూ దొరికి పోయాడు కదా అని ఓ రోజు దగ్గరకు పిలిచి ఫోనులో చెప్పి చూశా "దొంగెవరో తెలిసి పోయింది. నువ్వు ఇంత వరకు కొట్టేసిన డబ్బులన్నీ వెనక్కిచ్చెయ్ లేక పోతే ప్రిన్సిపాలుకు చెప్పి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. తరువాత నీ చదువు మటాష్. నీ జీవితం మటాష్." అని. విన్లేదు. మళ్ళీ ఓ రోజు 'అంటేసే ఆట' సాబ్జ ఆడేటప్పుడు చెప్పా "నీ లైఫు మటాష్. నీ స్టడీస్ మటాష్." అని అయినా విన్లేదు. మేము కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కుడి వేపుకు తిరగాలి కదిరప్ప మాత్రం ఎడమ వైపుకు తిరగాలి. అందుకే ఎడమ వైపు మార్గం లో మాటు వేసి (బ్యాక్ గ్రవుండ్ లో ..ద మ్యాన్ విద్ ద ఇనప గన్..) చెప్పి చూసా. సైకిల్ స్టాండుకు వెళ్ళే మార్గం లో (బ్యాక్ గ్రవుండ్ లో మీకు తెలుసు. మీకు ఇంకో రెండు మార్కులు)చెప్పి చూశా. బాత్ రూమ్ వెళ్ళే మార్గం లో (బ్యాక్.. మీరు చాలా షార్ప్ ఇంకో మూడు మార్కులు) అడ్డు పడి చెప్పా. చివరికి సినిమాకెళ్ళే దారిలో కూడా చెప్పా. అలా చాలా చాలా మార్గాల్లో విభిన్నరీతుల్లో..ప్యాంటు జేబు లో చేతులు పెట్టుకొని, బెల్టులో చేతులు పెట్టుకొని, చొక్కా జేబులో చేతులు పెట్టుకొని, భుజాల మీద చేతులు పెట్టుకొని, క్రాపు సరి చేసుకుంటూ చెప్పి చూశా. (నా జేబులో, నా క్రాపు ..వగైరా..వగైరా అని అనుకుంటే మీకు అర మార్కే. పక్కోళ్ళ జేబులో, పక్కనోడి క్రాపు... వగైరా వగైరా అనుకుంటే మీకు నాలుగు మార్కులు ) పలితం మాత్రం నిల్లు. ఇక మిగిలిన అంకం రానే వచ్చింది.సాబ్జ (ఐస్ పాయ్) ఆట కొస్తే బెదిరిస్తాడని రావడం మానేసిన వాడు ఓ రోజు టైము బ్యాడయి పోయి బ్యాడ్ మింటన్ ఆడ్డానికి ఆప్కో వారి చారల లుంగీ కట్టుకోని మా రూము దగ్గరకు వచ్చాడు. నేను ఇంద్ర సినిమా లో చిరంజీవి లా కంటి రెప్ప మీద మూడు వెంట్రుకలతో సైగ చెయ్యగానే అసిస్టంట్ డీకేస్టీలు అలర్టుగా వెంటనే పట్టుకెళ్ళి రూములో వేసేశాం.
మధ్యలో అతన్ని కూచో పెట్టి అప్పటి ట్రెండు (శివ లా) ప్రకారం సైకిల్ చెయిన్ తీసుకున్నా.(శివ చూడని వారు పోకిరి లో బండ గణేష్ ను చంపే రీలు వేసుకోండి) పద్దతిగా చెప్పి చూశా.
"చూడు.. నీకు ఇన్ని దినాలు చెప్తానే వుణ్యాం. నాకు గ్యానీ కోపమొస్తే మనిషిని గాదు తెలుసు గదా. ఇన్నాళ్ళూ మాతో పాటే దిరిగినావ్ కదా పోతే పోనీలే అని నీకు చాన్సు ఇస్తావుండాము. ళేకపోతే నా..(బూతులు మార్చ లేదు మూర్చ బోయాయి) నిన్నేం చేసిండే వాణ్ణో తెలుసా."
"నువ్వెన్నన్నా చెప్పుకో నేను ఆ పని చెయ్యల్యా. "
"రేయ్ వీనికి సైకిల్ చేన్ సరి పోదు గానీ ఆ నన్ చాక్ తీసుకొని రారా.."
"నువ్వు నన్ను కొత్తు, కొయ్యి, సంపు గానీ నేనీపని చెయ్యలేదంటాడా గా"
"ఇట్లొద్దు గానీ. నీకు డబ్బులవసరమైతే నాకు జెప్పు. నేనెబ్బుడన్నా ఎవుడన్నా అడిగితే కాదణ్యానా? ఆ క్యాలికులేటర్లు యాడ బెట్నావో జెప్పు. లేకపోతే రేయ్ నా.. నీ .. నీ .."
అతని చేతిలో వాచీ పీక్కున్నాం. ఊహూ! చొక్కా పీకేశాం. లుంగీ పీకేశాం. బనీను పీకేశాం. చివరికి వి.ఐ.పి. వారి మాడల్ లా చేతులు పైకెత్తించి నిలబెట్టాం. మ్యాన్ హండ్లింగుకు దూరంగా మానసిక హ్యాండ్లింగుకు దగ్గరగా ప్రయత్నించా. ఏవీ సఫలం కాలేదు. పోనీలే మనోడే కదా అని ఆ రోజుకు వదిలేశాం.
కొద్ది రోజుల తరువాత బ్యాంగ్.. బ్యాంగ్.. ఏమీ లేదు. ఓ రోజు సూరీడు(వై.ఎస్. వెనకోడు కాదు) మామూలుగానే లేచాడు. మేము కూడా అంతే మామూలుగా లేచాం. క్లొజప్ పేస్టుతో పళ్ళు తోముకున్నాం, పియర్సు సోపు తో ఒళ్ళు రుద్దుకున్నాం. ఉగ్గానీ తింటున్నాం. కాసేపటికి... బ్యాంగ్.. బ్యాంగ్..
ఒకడు ఎర్ర హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు గోడకు తగిలించిన చొక్కా లోనుండి డబ్బు తీస్తూ. నేను ఉగ్గానీ ప్లేటు అక్కడే వదిలేసి కోటు వేసుకోని అక్కడ వాలిపోయా. వాడికి జరగాల్సిన శాస్తి జరిగాక (వి.ఐ.పి. ఫోజుకు కూడా నోచుకోలేదు వాడు) ఎక్కడెక్కడ ఎవరిదగ్గర డబ్బులు కొట్టేసింది వివరించాడు. అన్నీ ఒక హైలైట్ అయితే వాడు క్యాలిక్యు లేటర్లు కొట్టేసిన విధానం చాలా హైలైట్. ఎండా కాలం రాగానే మిద్దె పైకి ఒక సిల్కు వైరు లాగి బల్బు పెట్టుకొని చదువుకోవడం అలవాటు. అలా చదువుకుంటూ కాలిక్యులేటర్లు అక్కడే పెట్టి నిద్ర పోయే వాళ్ళు. ఏవరన్నా ఊరికి వెళ్ళి రావాల్సి వస్తే ట్రెయిన్ లో వచ్చేవాళ్ళు. ఆ ట్రెయిన్ ఏ అర్ధ రాత్రో రెండు గంటలకు వచ్చేది. అలా రాత్రి వచ్చిన వాళ్ళు నేరుగా మిద్దెక్కి ఎవర్నో ఒకర్ని నిద్ర లేపి తాళం చెవులు ఎక్కడున్నాయో కనుక్కుని రూములో కొచ్చేవాళ్ళు. ఈ 'దొంగ' అలా వచ్చినపుడు మిద్దెక్కి వచ్చి ఎవర్నీ లేపకుండా కాలిక్యులేటర్లు,డబ్బు లేపేసి మళ్ళీ ఊరెళ్ళి పోయి రెండు రోజుల తరువాత దర్జాగా వచ్చేవాడు. వాడి తెలివికి అందరూ గ్రూపుగా తల్లి పిచుక మేత తెస్తే పిల్ల పిచుకలు నోళ్ళు వెళ్ళబెట్టినట్టు నోళ్ళు వెళ్ళబెట్టాం.
అఫ్ కోర్సు, మొదట చెప్పిన కదిరప్పను మనస్పూర్తిగా క్షమించమని కోరా.
గిల్టీ ఫీలింగుతో అతను కనిపించినప్పుడల్లా స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లా ప్రతిసారీ "సారీ అప్పా కదిరప్పా" చెప్పేవాడిని. అది తెలిసి చాలా సార్లు తప్పించుకుని తిరిగాడు. చివరికి ఓ రోజు పరీక్ష హాల్లో ఆన్సర్ షీటు మీద ఓం అని రాసి సమాధానాలు రాసే లోగానే అటు తిరగి "సారీ అప్పా కదిరప్పా" అని చెప్పా. అది చూసి తట్టుకోలేక "ఇలా చేసావంటే నేను టి.సి. తీసుకోని పక్కనున్న హైస్కూల్లో ఆరో తరగతి లో చేరిపోతా" అని బెదిరించాడు.పాపం మళ్ళీ ఆరో తరగతి నుండి కాలేజీ వరకు చదివొచ్చేసరికి చిరంజీవి తో పోటీ పడిన సుమన్ లా కేరక్టర్ పాత్రలు వేసే స్థితికి వచ్చేస్తాడని సారీ చెప్పడం మానేశా. కాలేజీ చివరి రోజు ఆటో గ్రాఫ్ ఇచ్చేటప్పుడు "సారీ బై విహారీ" అని రాసిచ్చా. ఆ తరువాతే "ఏ ఫిల్మ్ బై అరవింద్" వచ్చిందని మీరు కనిపెడితే ఇంకో నాలుగు మార్కులు కూడుకోండి టొటలేసుకోని ఎన్నొచ్చాయో చెప్పండి.
మళ్ళీ బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్... ద మ్యాన్ విత్ ద హ్యామర్ గన్...ద మ్యాన్ విత్ ద హ్యామర్ గన్.
ఇప్పుడు మీకో అపరాధ పరిశోధన ప్రశ్న:
అందరూ మిద్దె మీదకు వెళ్ళగానే నేను డబ్బు ఎందుకు చేతిలో పట్టుకొని వున్నానో చెప్పగలరా? ఛెప్పలేక పోతే కిందనే సమాధానం ఇచ్చేశా. చూసి మీ సమాధానం సరైందో కాదో చూసుకోండి.
సమాధానం: అందరు వెర్రి డికేస్టీల్లాగా వాళ్ళు మిద్దె మధ్యలో మాట్లాడుకోకుండా సింబాలిక్ గా పైనున్న పిట్ట గోడ మీద కూచుని మాట్లాడుకున్నారు. నేను ఇంటి బయట నున్న కిటికీ కమ్మీల మీదకి ఎక్కి చెవులు పిట్ట గోడకు ఆనించి వినేశా. వాళ్ళు కిందకొస్తున్నారనగా లోపలికొచ్చేసి సూట్ కేసులో నుండి డబ్బు తీసి చేతిలో పట్టుకొనున్నానన్నమాట :-)
వర్గాలు: నవ్వించావు లేవోయ్
Thursday, August 21, 2008
అమెరికాలో తెలుగు వారి పిల్లలకు తెలుగు పాఠాలు
సిలికానాంధ్ర : కాలిఫోర్నియాలోని ఈ తెలుగు సంస్థ పేరు చెప్పగానే అమెరికా లో తెలుగు భాష మీద, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద అభిమాన మున్న ప్రతి వ్యక్తి అనుకునే ఒకే ఒక మాట " ఇలాంటిది మా ఊర్లో కూడ ఒకటి వుంటే బావుండు". ఈ సంస్థ ప్రతి సంవత్సరము తమ సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. వీరి ప్రత్యేకత ఏంటంటే సినిమా పాటలు లేక పోవడమే కాదు రికార్డు చేసిన ఏ కార్యక్రమమూ వుండదు. అంటే సి.డి.లు, క్యాసెట్లు పెట్టి తైతక్క లాడే దృశ్యాలుండవు. ఈ మధ్యనే గిన్నీసు రికార్డు కెక్కిన అంతర్జాతీయ కూచి పూడి నాట్య సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇదే సంస్థ వారు సుజనరంజని అనే అంతర్జాల సాహిత్య పత్రిక కూడా నడుపుతున్నారు.
పోయినేడు కాలిఫోర్నియా రాష్ట్రం లోని తెలుగు వారి పిల్లలకు తెలుగు నేర్పడం మన బడి తరగతులు ద్వారా మొదలు పెట్టారు. అది విజయవంతమవగానే అమెరికా లో కొన్ని రాష్ట్రాలకు విస్తరించారు. ఆ విస్తరణలో భాగంగా కొలరాడో రాష్ట్రం లో కూడా మన బడి తరగతులు ప్రారంభించబడ్డాయి. దాదాపు 9 నెలలు గా నేనే ఉపాధ్యాయుడిగా పనిచేశా(స్తున్నా)ను. ఇందులో పది మంది పిల్లలు నాలుగేళ్ళ కోర్సు గల ఈ మనబడి లో మొదటి సంవత్సరము 'ప్రవేశము' తరగతి ని విజయవంతంగా పూర్తి చేశారు. దేశం మొత్తం మీద ఇప్పటికి 350 మందికి పైగా విద్యార్థులు వున్నారు.
దీనికి వస్తున్న స్పందన అపూర్వం. ఈ సంవత్సరం దీన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. తరగతులు వచ్చే సెప్టంబరు మొదటి వారం లో మొదలవుతున్నాయి. మా కొలరాడో లో కూడా మరిన్ని చోట్లకు విస్తరిస్తున్నాము. అమెరికాలో వున్న వారెవరైనా వారి ఊళ్ళలో ఈ మనబడి ప్రారంభించాలంటే రాజు చమర్తి గారిని(408-685-7258 raju@chamarthi.com) లేదా శంకర్ తుములూరు గారిని(650-430-5958 shan_Tumuluru@yahoo.com) లేదా కూచిభొట్ల ఆనంద్ గారిని గానీ సంప్రదించండి. శంకర్ గారు డెట్రాయిట్ లో వుంటారు.
కొన్ని వివరాలు:
మీరు అమెరికాలో వుండి మీ ఊళ్ళో ప్రారంభించాలంటే ఈ మన బడి లంకె కు వెళ్ళండి. అక్కడ మరిన్ని వివరాలు దొరుకుతాయి.
మా వూరి సమాచార కరపత్రం కింద ఇవ్వబడింది.
వర్గాలు: ఏదో తుత్తి
Wednesday, August 13, 2008
ఈ వారం సిధ్ద -- బుద్ధ (ఒలంపిక్స్, పట్టుకుంటే పదివేలు, దేవుడు)
"అయ్యా!"
"సిద్ధా!"
"ఈ సారి మనకు ఒలంపిక్స్ లో ఓ స్వర్ణం తెచ్చి మన త్రివర్ణాన్ని రెప రెప లాడించాడు గదా మన బింధ్రా."
"అవును. అభినవ్ భింద్రాను చూసి ఆసేతు హిమాచల మంతా ఆనంద డోలికల్లో మునిగి అణువు అణువునా పులకరిస్తోంది."
"ఇరవై నాలుగేళ్ళ కుర్రోడు, స్వతంత్ర భరతావని చరిత్రలో మొదటి సారి వ్యక్తిగత పతకమొస్తే అనిర్వచనీయమైన అనందంతో గంతు లేయకుండా స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంతంగా ఎలా వుండగలిగాడు"
"పోయినేడు రాథోడ్ కు రజితమొచ్చినప్పుడు ఆనందంతో గంతులెయ్యకుండా కుళ్ళు కున్నాడని అన్న వాళ్ళ నోళ్ళు మూయించడానికనుకుంటా"
"తనెప్పుడూ ఇలాగే వుంటాడేమో"
"అవును నాలాగా"
"ఇంకో మాట చెప్పండి"
"నీ ఎదుట నున్న వాడిలా"
"అది కూడ ఒద్దు గానీ ఇంకో మాట చెప్పండి"
"బుధ్ధా లా"
"సద్ది ముద్దేం కాదూ..?"
"ఏంట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావ్?"
"ఆఁ ఏం లేదు. మీలా ముద్దుగా సుద్దులు చెప్పే బుద్ధులు లేరంటున్నారు"
"ఇప్పటికి నిజమొప్పుకున్నావ్ రా. నిన్ను చూస్తుంటే సొంత డబ్బుల్తో బీజింగ్ కు పంపించాలనిపిస్తోంది"
"అలానే అంటారు. మిమ్మల్ని నమ్ముకునేదానికన్నా ఏ వైయెస్సునో, సోనియాను నమ్ముకొనుంటే బావుండేది"
"నీకు సోనియాను, రాహూల్ ను బీజింగులో చూసినప్పటి నుండి ఎవేవో కోరికలు కలుగుతున్నాయిరా"
"భుట్టో ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ బీజింగ్ లో కలిశారు కదా ఏం మాట్లాడుకొనుంటారు?"
"మీ ఇంట్లో ఇద్దరు, మా ఇంట్లో ఇద్దరు"
"అంటే హత్య కావించ పడ్డవారనా?"
"ఈ బాంబులు, రైలు ప్రమాదాలు, వరదలు చూసి నువ్వలా అయిపోయావ్. నేను చెప్పింది అది కాదు. ప్రధాన మంత్రులు"
"భవిష్యత్తులో మన దేశానికి రాహుల్ ప్రధాన మంత్రయి, బిలావల్ జర్దారి పాకిస్తాన్ ప్రధాన మంత్రయితే ఏమవుతుంది?"
"వాళ్ళిద్దరూ ఒలంపిక్సులో మళ్ళీ ఓ టీ తాగుతారు.మనిద్దరం రెండు ఇడ్లీలు తింటుంటాం."
"అలా వాళ్ళిద్దరూ తాపీగా మాట్లాడుకుంటుంటే మనమెందుకు శతృ దేశం అని కొట్టుకోవాలి?"
"వాళ్ళని దేశాధినేతలుగా చూసి తరించుకోడానికి"
"మనోళ్ళు 56 మంది బీజింగ్ ఒలంపిక్స్ కు వెళ్ళారు కదా ఎన్ని పతకాలొస్తాయంటారు"
"వస్తాయి రెండో మూడో"
"ఓ వెయ్యి మంది ని పంపించుంటే ఇరవయ్యో ముప్పయ్యో వచ్చేటివి గదా?"
"అలా రావాలంటే కమల్ హాసన్ నో రజనీ కాంత్ నో పంపించాలి. ఒక్కోరు పది, వంద పతకాలు పట్టుకొచ్చే వాళ్ళు.”"
"అప్పుడు బుష్షూ, కమల్ హాసనూ కలిసుండే వాళ్ళు"
"ఎందుకు? దశావతారాల్లో బుష్షావతారం చూసేందుకా?"
"కాదులెండి. బుష్షు అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవయ్యాడు కదా?"
"ఏఁ ఇండియాకు ఏమన్నా గ్రాంటులిచ్చాడా?"
"గ్రాంటు ఇస్తే మారిన వాడు అవుతాడు కానీ ఇంప్రూవ్ అయినవాడు కాదు. చాన్నాళ్ళ కింద ప్రిట్జల్ తిని కళ్ళు తిరిగి కార్పెట్ మీద పడుకున్నాడు కదా. ఈ సారి ఒలంపిక్స్ చూస్తా నీళ్ళు తాగి కింద పడకుండా తమాయించుకున్నాడు."
"అదా. అవును చాలా చాకచక్యంగా, సాహసంగా, నైపుణ్యంగా, ఆత్మవిశ్వాసంతో తమాయించుకున్నాడు బాడీ గార్డుల సాయం తో. ఎంతయినా ఒలంపిక్స్ చూస్తున్నాడు గదా. కొంచెం లీనమయి పోయుంటాడు"
"వచ్చే ఏడు ఒలంపిక్సుకు మనము కూడా వెళ్దాం"
"అలాగలాగే. దానికి ఇప్పటి నుండే డబ్బు సంపాదించాలి గదా."
"నన్నపనేని రాజకుమారి పట్టుకుంటే రెండు పది వేలు బహుమానం ప్రకటించారు గదా ట్రై చేద్దామా?"
"ఎవర్ని"
"వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి ని"
"ఏం పర లోకాలకు బెర్తు గానీ రిజర్వ్ చేయించుకున్నావా? ఈ రోజుల్లో మంచి సంపాదన వచ్చేది రాజకీయ పార్టీల్లోనే.ఏ పార్టీ లో చేరుదాం చెప్పు"
"కొత్త పార్టీ లో చేరితే?"
"చిరంజీవి పార్టీనా? అది ప్రస్తుతానికి గిట్టు బాటు కాని వ్యవహారం. వాళ్ళు పదవిలోకొచ్చినా మొదటి సారి కదా డబ్బులు తినటానికి కొంచెం సంకోచిస్తారు. తెలుగు దేశం మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అన్నారు కదా. అలాగే కాంగ్రేస్ పార్టీ ఫరెవర్. అందులో దూకేద్దాం."
"జీవితం లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పార్టీలో చేరాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. మీ ఇంట్లో మీ పూర్వీకులు ఎక్కడన్నా, లంకె బిందెలు కానీ, వజ్రాలు దాచి పెట్టారేమో చూడండి. వాటి కోసం వెతుకుదాం"
"వజ్రాలుంటే ఎప్పుడో సూరత్ వెళ్ళి వ్యాపారం పెట్టుకొనుండే వాడిని"
"ఇప్పుడు సూరత్ లో కూడా వజ్రాలు దొరకడం లేదు. ఎక్కడ బడితే అక్కడ మిల మిల మెరిసే బాంబులే దొరుకుతున్నాయట"
"అలా అయితే మన అనంతపురం లోని వజ్ర కరూర్ లో వజ్రాలు దొరుకుతాయి కదా అక్కడ వెదుకుతాం"
"వెతుకుతారు... వెతుకుతారు... వుంటే గింటే మన దాకా రానిస్తారేంటి? ఇప్పుడు అక్కడ సీజ్ చేసిన బస్సులే దొరుకుతాయట"
"అనవసరంగా సీజ్ చేస్తున్నార్రా. చూడు జె.సి. ప్రభాకర్ రెడ్డి మనసెంత గాయపడి విల విల లాడిందో."
"అవునా?"
"అవున్రా.ఆయన మాట్లాడిన ప్రతి మాటని ఈ మీడియా వాళ్ళు వక్రీకరించారు. ఆ రోజు మాట్లాడిన టేపును తెప్పించి అందరికీ చూపించాడు. ఈ మీడియా వాళ్ళు కళ్ళున్న కబోది వాళ్ళు."
"అయ్యో పాపం. ఎంత పని జరిగింది. ఈ పేపరోళ్ళకు ఎప్పుడూ నీతి , నిఖార్సయిన వాళ్ళ మీదనే కళ్ళుంటాయి. కాంగ్రేసు లో నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడేవాళ్ళెంత మంది లేరు"
"కదా? కాంగ్రేస్ లో వుంటూ చిరంజీవి పార్టీ కోసం పని చేసే నీతి మంతులు కూడా వున్నారు"
"అనవసరంగా ఆయన్ని ఆడి పోసుకుంటారే. అమర్ నాథ్ దేవాలయం గొడవలో రాజీనామా చేసిన మంత్రుల్లేరా? వాళ్ళు మన దేశం లోనే వుండి ఎవరికో పని చెయ్యట్లా?"
"ఆ రూట్లో వచ్చావా? అయితే జోగయ్యా జిందాబాద్"
"అయ్య గారూ, దేవుడి పాలన లో వరుణ దేవుడు కూడా వాళ్ళ పార్టీనే నటగా"
"అవును"
"మరి ఇలా వరదలెందుకొస్తున్నాయంటారు"
"అందరూ ఎమ్మెస్ సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి లా ఊరుకుంటారేంట"
"సొంత పార్టీ వాళ్ళు ఏం చేస్తారండి"
"మర్రి చెన్నా రెడ్డి ముఖ్య మంత్రి గా వున్నప్పుడు ఏం జరిగింది?"
"అంటే ఈ వాన"
"మరో దేవుడు నాయినా"
"డాలర్లు ఎవరు సంపాదిస్తారు?"
"అమెరికా పోయినోళ్ళు, అమెరికా పోలేక టి.టి.డి.లో ఉద్యోగం సంపాదించుకున్నోళ్ళు"
వర్గాలు: ఈ వారం సిధ్ద -- బుద్ధ
Friday, August 08, 2008
08/08/08 08:08:08 (అన్నీ ఎనిమిది లే)
ఇందులో విషయం లేదు కానీ ప్రచురించే సమయానికి ప్రత్యేకత వుంది.(చిరంజీవి ఈ సమయానికే పార్టీ పేరు ప్రకటిస్తాడేమో)
సమయం రెండువేలలో 8 వ సంవత్సరం, 8 వ నెల, 8 వ రోజు , 8 గంటలు, 8 నిముషాలు, 8 సెకన్లు.
నా జీవితకాలం లో మళ్ళీ ఇంకో సారి దీన్ని చూడను.
ఇంతకు ముందు చూసిన ప్రత్యక మైన తేదీ.
12:34:56 7-8-90
Wednesday, August 06, 2008
ఈ వారం సిధ్ద -- బుద్ధ (బ్లాగు సమీక్ష)
"అయ్య గారూ"
"హాయి హాయిగ జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి ..."
"ఎక్కడున్నారు?"
"హాయ్ హమ్మా హాయ్ హాయ్ హమ్మ..."
"ఏమైంది మీకు?"
"చికు బుకు చికు బుకు రైలే...అదిరెను దీని స్టైలే.."
"అంత సంబరమెందుకో".
"ఇదిగో ఇందుకు"
"ఓసోస్ ..దానికే ఇంత ఆనందమా?..ఇప్పుడూ...నేను చెప్పేదేంటంటే ... అలాంటివి చాలా వస్తూ వుంటాయ్.... గదా.. ఆఁ..వస్తుంటాయ్ గదా..అందుకని...ఏరీ మళ్ళీ ఎక్కడికెళ్ళారు? కిందెక్కాడా కనబడ్డం లేదు."
"బీట్ ఇన్ మై హార్ట్...మేఘాలలో తేలి పొమ్మన్నది ..."
"మహాను భావా ఆ మేఘాలేంటి ..ఆ విహరించడమేంటి? కాస్త కిందకొస్తారా?"
"మళ్ళీ ఆ చూపేంటి? సరే ఇప్పుడు నన్నేం చేయమంటారు?"
"ఏవిటేవిటి నేను ఇప్పుడు టోపీ తియ్యాలా? ఈ మాత్రం దానికే?"
"పెద్ద తిప్పార్లే మూతి.తియ్యక పోతే ఏం జరుగుతుందంట?"
"ఓ యబ్బో...ఇలాంటివి చాలా చూశాం "
"హాం ఫట్ .."
"నన్నొగ్గెయ్యండి బాబో..నన్ను సాండ్విచ్ చెయ్యకండి కావాలంటే మీకు టొపీలేం కర్మ,గంగూలీ లా చొక్కా కూడా తీసేస్తా.."
"అలా రా దారికి కూర్మాంఢం బద్దలవుతుంది. ఏమనుకున్నావో ఏమో ..డల్ల డర్కి వెధవా ."
"ఆ తిట్లేంది? ఇదిగో తీసేస్తున్నా అలా చూడకండి."
"హూ తొందరగా కానీ..డేగ డస్కి."
"కొత్త తిట్లు కూడానా ... తప్పదా?"
"తప్పదు సిడ్కాల సిత్తి!..."
"సరే చేసుకున్నోడికి చేసుకున్నంత. మీ ఖర్మ"
"ఓలమ్మో...ఓరయ్యో..ఓలప్పో..."
"అందుకే అప్పుడే చెప్పా వింటారా? "
వర్గాలు: ఈ వారం సిధ్ద -- బుద్ధ