మన బడి గడుగ్గాయిలు
వేసవి సెలవులు అయిపోయిన తరువాత వచ్చిన పిల్లలను సెలవుల్లో ఏమి చేసారో రాసుకొని రమ్మన్నాను. ఒకళ్ళేమో డిస్నీకెళ్ళామంటే ఇంకొకళ్ళు డకోటా(సౌత్ డకోటా) కెళ్ళామని రాసుకొచ్చారు. ఒక గడుగ్గాయి భారత్ వెళ్ళొచ్చాడు. పేపర్ లో రాసుకొచ్చింది నా చేతిలో పెట్టి నా పక్కన నుంచున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింట్లో ఆవు ఈనిందట. ఒక దూడ పెయ్యని ఈనిందట. అమ్మమ్మ జున్ను చేసి ఇచ్చిందట. జున్ను.. జున్ను అనగానే మనసు రాకెట్ ఎక్కి మా అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ నేను ఆవు పొదుగు నుండి పాలు తాగుతున్న సీన్ ని 70 MM లో "క్షీర క్షీర క్షీర.. మనసార గ్రోలరా.. " అన్న పాట ను బ్యాక్ గ్రౌండు లో పెట్టి ఫ్రంట్ గ్రౌండ్ మర్చిపోయా. యాంత్రికంగా రాసింది చదువుతూ వుంటే భారత్ లో వున్నప్పుడు మొట్టికాయల ఆట ఆడాను అన్నది కనపడింది. బ్యాక్ గ్రౌండ్ పాట తారాస్థాయిలో వుండగా ఆ గడుగ్గాయిని మొట్టికాయల ఆట ఎలా ఆడుతారు అని పొరపాటున అడిగా. నా కళ్ళు ఒక చేత్తో మూసి ఇంకో చేత్తో టెంకి జెల్ల ఇచ్చుకున్నాడు. ఆ దెబ్బకి నా ఏడో తరగతి మొట్టికాయలు గుర్తుకు తెచ్చుకుంటుంటే నా ముందున్న మూడో తరగతి పిలకాయలు "ఎన్నాళ్ళో వేచిన ఉదయం... " అన్న పాటకి మైఖేల్ జాక్సన్ స్టెప్పు లేస్తూ కనిపించారు.
కొత్తగా మొదలయిన క్లాసు లో పిల్లలు రెండో సెషన్ కు వచ్చినప్పుడు పోయిన క్లాసు లో చెప్పిన హోము వర్కు చేసుకొచ్చారా అని అడిగితే అందరూ చూపించారు. ఒకడు మాత్రం చూపించలేదు.
"హోం వర్కు చేసుకొచ్చావా ?"
"ఎస్!"
"అయితే చూపించు?"
"వై?"
ఈ బుడ్డోడు పైన చెప్పిన మొట్టికాయల బుడ్డోడి తమ్ముడు. వయసు ఆరేళ్ళు
కొత్త క్లాసులో కొత్తగా చేరింది ఓ పిల్ల పిడుగు. నేను ఒకటి చెబితే తను నాలుగు చెబుతుంది. ఎంత ఊర్కోమన్నా ఊర్కోలేదు. సరే ఇలా కాదని నేను వెళ్ళి తన పక్కన కూర్చుని నేను పాఠాలు చెప్పను నువ్వే వెళ్ళి చెప్పు అన్నా. నదురు బెదురు లేకుండా లేచి నేను నుంచునే చోటుకు వెళ్ళి.
"బ్రేక్..." అని చెప్పింది ఆరేళ్ళ పిల్ల పిడుగు.