భారత్ కు తిరిగి వెళ్ళడం - ఈనాడు లొ వచ్చిన కథ
కానుక
- వై.సాయిబాబా
కాలిఫోర్నియా
27.09.2006
పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్ నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం.
ఇట్లు
మీ కుమారుడు
ప్రదీప్
కు్లప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వైదేహీల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి వెుహాలు ఒకరు చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో ఉన్న కోడలూ ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్ కచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు.
''ఏమిటండీ ఇది?'' భర్తని అడిగింది వైదేహి.
''ఉత్తరం'' సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి వెుహంచూసి చిన్నగా నవ్వి ''నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి'' అన్నాడు.
ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్యమనస్కంగానే గడిపారా ఇద్దరు. సాయంకాలం వాలుకుర్చీలో నడుంవాల్చి అదే ఆలోచనల్లో ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ ప్రదీప్ తానిచ్చినదాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడుగా? ఒకవేళ చూసినా, వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికీ దానికీ ఏమన్నా సంబంధం ఉందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాడాయన. దానిని ప్రదీప్‌కి అందజేసిన రోజు జ్ఞాపకం వచ్చిందాయనకు. ఆరోజు...
రెండేళ్ళక్రితం తల్లిదండ్రులను చూడటానికి కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్. నెలరోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటిరోజే తిరుగుప్రయాణం. వైదేహి కోడలినీ పిల్లలనూ తీసుకుని తెలిసినవారింటికి వెళ్ళింది. ఇంట్లో తండ్రీకొడుకులు మాత్రమే ఉన్నారు.
''బాబూ... దీపూ!'' గదిలో బ్యాగ్ సర్దుకుంటున్న ప్రదీప్ తలెత్తిచూశాడు. ఎదురుగా తండ్రి.
''ఏమిటి నాన్నగారూ'' అన్నాడు ప్రదీప్.
తన చేతిలోని ఒక ప్యాకెట్ కొడుకుకి అందిస్తూ ''ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు'' అన్నాడు సీతారామయ్య.
''ఏమిటిది?'' ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్.
''అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేనూ మీ అమ్మా మరణించిన తర్వాతే తెరిచి చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. 'మేము లేము' అని తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటివరకూ దీన్ని ఓపెన్ చేయకు'' అన్నాడు సీతారామయ్య. కొడుకు మరోమాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలోనుండి ఇవతలకి వచ్చేశాడు.
కొడుకు 'ఆ ప్యాకెట్‌నుగాని తెరిచి చూశాడా?' అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకి వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహం యధార్థమే... జరిగింది అదే.
ప్రదీప్‌ని గత కొద్దికాలంనుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. స్వంత ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలన్స్... జీవితంలో కోరుకున్నవి అన్నీ సాధించినా, వాటి తాలూకు ఆనందం మనసుని తాకడంలేదు. ఇవేవీకావు, ఇంకా... ఇంకా... ఏదో కావాలని ఆరాటం... ఏమిటది? ఏసీ గదిలో భార్యాపిల్లలు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నా, తనకిమాత్రం కంటిమీద కునుకురాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం ఉద్యోగంమీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిస్తే కదా, పరిష్కారం గురించి ఆలోచించడానికి.
చిన్నప్పటినుండి ప్రదీప్ చదువులో ఫస్ట్. ఇంటర్‌లో ర్యాంక్ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్ ఇంజినీరింగ్ చేయాలని ఎంతో ఉబలాటపడ్డాడు. స్కూల్ టీచరైన తండ్రి తనకంత శక్తిలేదంటే అతి కష్టంమీద ఒప్పించి, తరతరాలనుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే అంకితమైపోయాడు. ఇంజినీరింగ్‌లో కూడా ర్యాంక్ రావడం... అతడి మరో చిరకాలవాంఛ- అమెరికాలో ఉద్యోగం... అన్నీ చకచకా జరిగిపోయాయి. తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి, తన చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. ఆరంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంత ఫీలింగ్... తనని ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు- రమ్య, సిద్ధార్థ... భార్యాభర్తలిద్దరి ఆర్జన... 'జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను. నాకింక లోటేమీలేదు' అని భావించిన ప్రదీప్‌లో అసంతృప్తి అదృశ్యరూపంలో వెన్నాడటం వెుదలయింది.
ఆరోజు... ఇండియా నుండి వచ్చిన ఇరవైరెండు నెలల తరవాత... అర్ధరాత్రి పన్నెండయ్యింది. ఎప్పటిలాగానే నిద్రపట్టక బెడ్‌రూంలో పచార్లు చేస్తున్నాడు. భార్యాపిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. బెడ్‌రూం నుండి రీడింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. కాసేపు ఏదైనా మంచి సంగీతం విని రిలాక్సవుదామని క్యాసెట్ కోసం షెల్ఫ్ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్ శ్రీనివాస్ పాటల క్యాసెట్ కన్పించింది. ఆ క్యాసెట్ తీస్తుండగా, షెల్ఫ్‌లో కన్పించింది తండ్రిచ్చిన ప్యాకెట్.
ఇండియా నుండి వచ్చిన తరవాత ఒకటి రెండుసార్లు 'ఆ ప్యాకెట్ ఓపెన్‌చేసి చూద్దామా?' అని అనిపించింది. కానీ తండ్రిమీద గౌరవంతో ఆ పని చేయలేక షెల్ఫ్‌లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనబడేసరికి మళ్ళీ కుతూహలం వెుదలయింది. ప్యాకెట్ చేతిలోకి తీసుకున్నాడు. 'ఒక్కసారి తీసిచూస్తే' అన్పించింది. కానీ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో 'భావ్యం కాదు' అనుకుని తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయబోయి ఆగాడు. 'తప్పేంటీ? ఎప్పటికైనా చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పినదానికన్నా కొద్దిగా ముందు చూస్తున్నాడు... అంతేగా' మనసుకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది.
'నాన్నగారూ! మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి' అని మనసులోనే అనుకుని సీల్ చేసిన ఆ ప్యాకెట్‌ని ఓపెన్ చేశాడు. 'తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది' అనుకుని ఆశపడ్డ ప్రదీప్‌కి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. ప్యాకెట్‌ిలో రెండు సీడీలూ ఒక లెటరూ ఉన్నాయి. అంతే... నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్ అన్యమనస్కంగానే ఉత్తరం అందుకుని చదవసాగాడు.
''బాబూ, దీపూ! మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేనూ అమ్మా ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చేముందు ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా సడెన్‌గా వచ్చేయవచ్చు. మా మరణవార్త తెలిసిన తరవాత నువ్వెంత ఆఘమేఘాల మీద పరిగెత్తుకు రావాలనుకున్నా, ఆఫీసులో సెలవు దొరికి, ఫ్త్లెట్‌లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప, మా భౌతికకాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించేముందు ప్రతీ తల్లికీ తండ్రికీ తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం... ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేంకాదు. కానీ ఆ అవకాశం మాకులేదు. ఎలా..? ఒకసారి టీవీలో 'మాయాబజార్' సినిమా చూస్తున్నా. ఎప్పుడో యాభై ఏళ్ళనాటి సినిమా. అందులో నటించిన యస్వీఆర్, యన్టీఆర్, సావిత్రి, రేలంగి... వీళ్ళల్లో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి నటనాకౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల గానం ఈనాటికీ మన గుండెలోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించే ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. మనం మరణించాక మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫొటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు 'అదిగోరా మీ తాతయ్య... అదిగో మీ నాన్నమ్మ...' అని చూపిస్తారు. అంతేగా! కానీ మా కంఠస్వరాలు వినలేరు కదా! ఎప్పుడో ఏళ్ళనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, వాళ్ళ మాటలూ పాటలూ వినగలుగుతున్నప్పుడు, మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేం? నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం, మా మాట నీముందుంటుంది. అమ్మానాన్నలను చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికీ? సీడీలు చూడూ...
ఇట్లు
నీ నాన్న''
విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్ ఉత్తరాన్ని మడిచి, 'అమ్మ' అని లేబుల్ అంటించిన సీడీ తీసి, డి.వి.డి.ప్లేయర్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు.
తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతులనిండా గాజులు... మూర్తీభవించిన ముత్త్తెదువ రూపంలో చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ అమ్మ...
'బాబూ, దీపూ... మీ నాన్నగారు- అబ్బాయితో ఏమన్నా మాట్లాడు' అన్నారు. 'ఏం మాట్లాడనురా కన్నా? దీపూకి నా మాటకంటే పాటే ఇష్టం. నా పాటే వినిపిస్తాను' అన్నాను. 'మరి నా పాట వింటావా?' వైదేహి అడుగుతోంది ప్రదీప్‌ని.
అవును... అమ్మ అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. రేడియో ఆర్టిస్ట్ కూడానూ. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది? అమ్మంత గొప్పగా కాకపోయినా, తనుకూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ... పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమస్థానం తనదే. దానికి కారణం అమ్మపెట్టిన సంగీత భిక్ష. ఇప్పుడీ యాంత్రిక జీవితంలో పడిన తరవాత తనకి సా...పా...సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచనలనుండి తేరుకుని స్క్రీన్ వంక చూశాడు.
పూజా మందిరంలో దేవుని ముందు కూర్చుని వైదేహి 'ఎందరో మహానుభావులు' కీర్తన ఆలపిస్తోంది. తరవాత 'నగువోము కనలేని' కీర్తన... అలా వరసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి కీర్తనలు... హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబుర మీటుతూ 'కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ' అంటూ అన్నమయ్య కీర్తనతో వెుదలుపెట్టి, రామదాసు, పురందరదాసు కీర్తనలు... పెరట్లో పూలవెుక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన 'అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ' వంటి లలితగీతాలు పాడుతూ...
సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసిముద్దయిపోతూ ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రదీప్‌కి ఊపిరిపీల్చడమే కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు... అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకీ వచ్చు... అమ్మేగా నేర్పిందీ..? పసితనంలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా... ఎదిగిన తరవాత ఒక గురువులా ఎన్ని పాటలు నేర్పిందీ? ఏవీ ఆ పాటలూ... ఏవీ ఆ మధురానుభూతులూ..? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ... స్నానం చేసినట్టు స్వేదంతో శరీరమంతా తడిసిపోయింది. వణుకుతున్న చేతులతో 'నాన్న' అన్న లేబిల్ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్‌లోపెట్టి ఆన్ చేశాడు. మల్లెపూవులాంటి పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
''దీపూ... బాగున్నావురా బాబూ? 'నాన్న ఏం చెబుతారులే- ధర్మపన్నాలూ నీతిబోధలూ చేసి ఉంటారు' అనుకుంటున్నావు కదూ. అవన్నీ చెప్పడానికి నేనెవరినిరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలివారు కోరుకున్నట్లు తానుండలేని మనిషి, ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు ఉండాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరి సందేశాలూ హితబోధలూ అవసరమా? మరి నీకు ఏం చెప్పాలి? ఆ... లోకంలో సంపదనంతా గుమ్మరించినా కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు. అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాలకంటే మధురమైన నీ బాల్యస్మృతులు ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ళముందే కదలాడుతుంటే నీ స్మృతిపథంలో మేం కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులౌతామేవోనన్న చిన్న ఆశ. దీపూ... నీకు గుర్తుందా..?'' అంటూ సీతారామయ్య ప్రదీప్ చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటీ చెప్పనారంభించాడు...
మిగిలినది ఇక్కడ చదవండి
గమనిక: ఇది 14-జనవరి-2007 ఈనాడు లో వచ్చినది. ఇది నా సొంతం కాదు.
4 comments:
ఇది వార్త కాదు. ఆదివారం ఈనాడులో వచ్చిన వై.సాయిబాబా గారి కథ అండీ! మంచి కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
చాలా బావుంది కథ... ఆత్మీయతలకు దూరమవుతున్న వారి జీవితంలోని అసంతృప్తిని కళ్ళకు కట్టినట్టు చూపించింది సాయిబాబా గారి కథ.
చాలా మంచి కధ; నాకు చాలా నచ్చింది (కొంచెం కదిలించింది కూడా)
మంచి కథ.
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment