Wednesday, February 21, 2007

పెళ్ళి లో "దొంగ" విందు భొజనం.

రాజేష్ గారి బ్లాగు లో "పిలవని పేరంటానికి.." చదివిన తరువాత నా పిలవని పేరంటం గుర్తొచ్చింది. అది బ్లాగేస్తున్నా హాయిగా.

మమ్మీ చేసిన బ్రెడ్ తినేసి కాలేజ్ లో అమ్మాయిల్ని చూసి "మమ్మీ మమ్మీ మాడ్రన్ బ్రెడ్" అని పాడేసిన పాటలయిపోయి "మూసుకోని నీ బ్రెడ్ నువ్వు సంపాయించుకో" అని గుర్తు చేసిన రోజులవి. తిరపతి లో ఇంజినీరింగ్ పట్టభద్ర స్వీకరణ అయిపోయిన తరువాత ఊరుకు దగ్గరగా వుంటుంది కదా అని బెంగళూరు మహా నగరం లో "సాపాటు ఎటూ లేదు పాటయిన పాడు బ్రదర్" అని పాడుకొంటూ అక్కడ ఇక్కడ దరఖాస్తులు పెట్టుకుంటూ "నీ బోడి ఫస్ట్ క్లాసు మాకు చాలదు" అని తిరస్కారానికి గురవుతున్నా మొక్క వోని దీక్షతో అయిదు రూపాయల "అన్న-సాంబారో" లేక "రస-అన్నా నో" తినుకుంటూ వెళ్ళబుచ్చేస్తున్న కాలం. ఇలా ఉద్యోగాలకి ప్రయత్నిస్తే చాలదు కానీ ఎలాగయిన ఓ కంప్యూటర్ కోర్సు చేసేసి ఉద్యోగ లక్ష్మిని వరించాలనే తలంపు తో జయనగర నాలగవ బ్లాకు లో వున్న "ఆప్టెక్" లో ఓరకిల్ కోర్సు ఫీజు కట్టేసి రోజు టంచనుగా క్లాసులకు హాజరవుతున్నా. గది కూడా కొంచెం దగ్గరనే జె.పి.నగర మొదటి దశలో (ఫస్ట్ ఫేస్).

ఓ రోజు అలా క్లాసయిపోయాక బండేసుకుని ఇంకొందరు స్నేహితులతో కలిసి లాల్ బాగ్ పార్కు లో రౌండ్లేద్ధామని బయలు దేరాం. లాల్ బాగ్ లో అక్కడున్న "అందాలను" తనివితీరా చూసే లోపే వర్షం రావడం మొదలయింది. ఆ వర్షం రావడం చూసి నా తమిళ ఫ్రెండు "అంగ పార్ డా! రెయిన్ ఈజ్ కమింగ్ లెట్స్ గో హోం" అన్నాడు. వాడో ప్రత్యేక మయిన మనిషి. కొంచెం అరవం, కొంచెం తెలుగు, కొంచెం కన్నడ కొంచెం ఆంగ్లం కలిపి ఒక వాక్యం తయారు చేసేస్తాడు. వాడెక్కడుంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయిస్తాడు. వాడు చెప్పిందే తడవు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ బైకుల్లో బయలు దేరాం రూముకు జయనగర్ మీదుగా. జయనగర నాలుగవ బ్లాకుకు వచ్చేసరికి వర్షం ఎక్కువయి పోయింది. కాస్త తగ్గితే వెళ్దామని అక్కడున్న చెట్ల కింద నిలబడ్డాం కాసేపు. అలా కొంత సేపు వున్న తరువాత అర్థమయింది ఆ వర్షం ఇక తగ్గదని. అప్పటికే సమయం ఎనిమిదవుతోంది. కడుపులో ఆత్మా రాముడు "హలో"..హలో" అనడం మొదలు పెట్టాడు. రూముకెళితే ఎవడో ఒకడు వండాలి లేక పోతే ఏ హోటల్ కో పోవాలి.

ఏం చేస్తే బావుంటుంది అని చర్చించుకుంటూ వుంటే అర్థమయింది మేము నిలబడ్డ చోటు పెళ్ళిళ్ళు జరిగే కళ్యాణ మంటపాల దగ్గర అని. అక్కడ ఒకే వీధిలో దాదాపు అయిదు కళ్యాణ మంటపాలు వున్నాయి. అవి కూడా కాస్త ఖరీదయినవే. " ఇన్ని కళ్యాణ మంటపాలున్నాయి మనల్ని ఎవడన్నా పెళ్ళి కి పిలిస్తే బావుండు" అనిపించింది. అప్పుడు మా మనోహర్ కి బల్బు వెలిగింది. వాడి ఫ్రెండు పెళ్ళి ఆరోజే అది కూడా అక్కడే కాకపోతే వాడికి పెళ్ళి జరిగే కళ్యాణ మంటపం గుర్తు లేదు. ఆ వర్షం లో అక్కడున్న పెళ్ళి మంటపాలన్నీ తిరిగే ఓపిక కూడా లేదు. వీడేమో అన్నింట్లోనూ స్పెషలిష్టాయే.

"అయ్యో అప్పా.. ఐ టోటలీ ఫర్ఘాట్ అబౌట్ దిస్ మ్యారేజ్..లెట్స్ గో టూ హిజ్ మ్యారేజ్ అండ్ హావ్ ఫ్రీ మీల్స్ ఫార్ ద నైట్. "

"యూ ఇడియెట్ ఇట్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ మ్యారేజ్ హౌ కెన్ వుయ్ కం యుగో? వుయ్ ఆర్ నాట్ కమింగ్" అన్నా కడుపులో పరుగులు పెడుతున్న ఎలకల్ని కాస్త గదమాయించి.

"ఇల్లాడ. ఇట్స్ ఆల్ స్మాల్ స్మాల్ థింగ్స్ యు నీడ్ నాట్ వర్రీ. ఇఫ్ యు కన్ సిడర్ ఆల్ దీస్ థింగ్స్ యు విల్ నాట్ ప్రాస్పర్ అటాలూ" అని అందర్ని తయారు చేసేసి బయల్దేర దీసాడు.

అందరం అలా పోలోమని వెళితే బాగుండదని బళ్ళన్నీ ఓ చెట్టు కింద పార్క్ చేసేసి. ఓ కళ్యాణ మంటపం దగ్గరికెళ్ళి ఆగాం. దాని చూసిన వెంటే మా మనోహర్ గాడు వీర లెవెల్లో నటించడం మొదలు పెట్టాడు. అక్కడున్న బోర్డును వేలెత్తి చూపిస్తూ "ఇక్కడ్రా.దిస్ ఈజ్ అవర్ ప్రభాకర్. సీ రాధ వెడ్స్ ప్రభాకర్..లెట్స్ గో ఇన్ సైడ్ ఫాస్ట్ లేదంద్రే హీ విల్ల్ బీ మ్యాడ్". ఇంకేం పిల్లా కోడి వెంట వెళుప్తున్న కోడి పిల్లల్లాగా బిర బిర మంటూ లోపలి కెళ్ళి పోయాం.

అప్పటికే పెళ్ళి అయిపోయి స్టేజ్ మీద రిసెప్షన్ జరుగుతోంది. పెళ్ళి కొడుకు కూతురూ వచ్చిన వారందర్నుండీ శుభాకాంక్షలందుకుంటున్నారు. అప్పటికే అందరూ భోజనాల గదిలోకి వెళ్ళి పోతున్నారు. ఇక గుంపులో గొవిందయ్య లాగా వెళ్ళి విషెస్ చెప్తామనుకుంటూ పైకి వెళ్ళ బోతుంటే ఒక పెద్దాయన అడ్డు తగిలి "ఊటా ఆయత్తా(భోజనం అయిందా)?" అని అడిగాడు అతిథి మర్యాద చేస్తూ. "ఆహా శ్రీకృష్ణ భగవానా సమయానికొచ్చావా ఆదుకోవటానికి" అని ఓ మొక్కు పడేసి పళ్ళికిలించి" ఇల్లారి(లేదండి)" అనేశాం కోరస్ గా. దానికి ఆ పెద్దాయన " అవుదా..ఈ కడే బన్ని (అవునా ఈ పక్కకు రండి)" అని బఫే ప్లేట్లు చూపించాడు.

ఆయనకు థా చెప్పి బ్యాటింగ్ మొదలు పెట్టాం. అందరి మొహాల్లో ఎక్కడ లేని నటన! ఉబికి వస్తున్న నవ్వును ఆపుకుని ఒక్కో వంటా రుచి చూస్తూ ఆరగించడం పూర్తయ్యేసరికి ఒక అర గంట అయ్యింది. ఇక బయలు దేరదామనుకుంటూ వుంటే ఇంకో కుర్రాడు వచ్చి ఐస్ క్రీం తెచ్చి ఇచ్చాడు. అప్పటికే నిండి పోయిన కడుపు క్రిక్కిరిసిన జనం మధ్యలోకి మహారాజు రాగానే దారి ఇచ్చేసినట్టు కాస్త ఖాళీ చేసుకుని ఐస్ క్రీముకు ధారి ఇచ్చింది.

పగిలి పోతున్న పొట్టతో "అన్నదాతా సుఖీభవ" అని దీవించేసి బయటకు రాబోతే హోరుమనే వర్షం ఇంకా తగ్గనే లేదు. సరేలే ఆత్మా రాముడు చల్లబడ్డాడు కదా కొంచెం భుక్తా యాసం తీర్చుకుని పోదామని అక్కడే కారిడార్ లో చతికిల పడ్డాం. అలా కూచున్నామో లేదో ఒక పెద్దాయన... ధవళ వర్ణం తో మెరిసి పోతున్న ఖద్దరు వస్త్రాలతో లాల్చీ, ధోవతీ, భుజం మీద కండువా తో లోపలికి ప్రవేశించాడు. నల్లటి రూపు దాదాపు ఆరు ఆడుగుల ఎత్తు దానికి తగ్గ శరీరం. వస్తూ వస్తూనే అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. నేను ఇంకా నిలబడే వున్నాను. లోపలికి వెళుతూ నా వైపుగా వస్తూ నమస్కరించిన చేతులతో దగ్గరకు రాగానే నేను కూడా నమస్కారం పెట్టా. అలా చూస్తూ వుండగానే లోపలికి వెళ్ళి పోయాడు.

అప్పుడు నా వెనక ఉన్నవారు అంటుంటే విన్నా. " దేవే గౌడ అవరు బందిద్ధారు (దేవే గౌడ గారు వచ్చారు)". అప్పుడర్త మయింది ఈ చూసిన ముఖమెవరో కాదు. కర్నాటక ముఖ్యమంత్రి దేవేగౌడ అని. ఆయన అలా లోపలికి వెళ్ళాడో లేదో వెంటనే ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడే తెలిసింది ఆయన ఎంత నిరాడంబరుడో. అప్పట్లో ఆయనంటే ప్రజల్లో వల్ల మాలినంత అభిమానం. అందుకే ఆయనకు పెద్ద సెక్యూరిటీ అవసరం లేదనే వారు. దేవే గౌడ లోపలికి వెళ్ళి వధూవరులను ఆశీర్వదించి కాసేపటికి బయటికి వచ్చేసారు. ఆయన వరండా దిగి రాగానే ఒక ఎస్సై గొడుగు పట్టుకుని నడవబోతే ఒద్దని తనే గొడుగు తీసుకుని తన అంబాసిడర్ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకుని వెళ్ళి కూర్చున్నాడు. ఆ కారు ముందు రెండు మోటర్ బైకులు వెనక ఇంకో కారు అంతే ఆయన సెక్యూరిటి అప్పట్లో.

ఆయన అలా వెళ్ళగానే మా మనోహర్ గాడి చొక్కా పట్టుకున్నంత పని చేశాం." వెధవా! ముఖ్యమంత్రి లాంటి వాడు వచ్చిన పెళ్ళి లో మేము గనుక దొరికి పోయి వుంటే మా పరిస్థితి ఏమయి వుండేది" అంటే.

"ఇట్స్ ఓకే డా! ఒన్సినే వైల్ యు డూ నథింగ్ విల్ హపెన్. వుయ్ హాడ్ సం ఫన్నూ" అన్నాడు వాడు.

"ఒరేయ్! మనోహర్ గా! రూముకు పదా నీ సంగతి చెప్తాం" అనేసి అక్కడినుండి జారుకున్నాం.

6 comments:

రాధిక said...

హ హ...ఇలాంటి అనుభవాలు చాలామందికే వున్నట్టున్నాయే?రండి ఒక్కొక్కళ్ళు బయట పెట్టండి.

రానారె said...

ఉద్యోగాలకోసం ప్రాక్టీసుగా ఉంటుందనా ఇంగ్లీష్ లో మాట్లాడేది? లేక మిత్రుల్లోని ఆంధ్రేతరులకు తెలుగర్థంకాదనా?

Anonymous said...

@ రాధిక గారూ,

బయట పెట్టమంటే ఎవరూ పెట్టరండి. వాళ్ళ చిత్తం "చిత్తం ప్రభో" అంటే బయట పెడతారు లేకుంటే లేదు.

@ రానారె,

ఉద్యోగాల ప్రాక్టీసంత లేదు గానీ. మిగిలిన ఫ్రెండ్స్ కు తెలుగు సరీగా రాదని అలా మాట్లాడే వాళ్ళం.

విహారి

ఆసా said...

తెలుగు బ్లాగులో కన్నడ పదాలు చదివి 'నమ్మ బె౦గుళూరు' రోజులు గుర్తుకు వచ్చాయి.

కొన్ని పరిస్థితులలో ప్రా౦తీయ భాష రావట౦ చాలా ముఖ్య౦.

వాడెవడో వీరప్పన్ , అక్కడ హీరో 'రాజ్ కుమార్' ని కిడ్నాప్ చేస్తే , ఎవరో అల్లరి మూక రోడ్డు మీద నిలబెట్టి కన్నడ ? కాదా అని భాష పరీక్షి౦చి మరీ బైక్ లు విసిరికొట్టారు.
తరవాత తెలిసి౦ది వాళ్ళ కోప౦ తమిళ వాళ్ళ మీద అని, నాకు తమిళ్ రాన౦దుకు , వీరప్పన్ తెలుగు వాడు కాన౦దుకు ఆ రోజు కాస్త మేలు జరిగి౦ది.

Anonymous said...

హ హ హ ...మీ అనుభవం చాలాబాగుంది

Anonymous said...

@ ఆసా గారూ,

ఏమైనా బెంగుళూరు నిజంగా "నమ్మ బెంగుళూరే" నండి.

-- విహారి