కలిసుందాం లేకుంటే నోర్మూసుకుందాం
తెలుగు సినిమా వంద సంవత్సరాల వేడుకకు కమిటీ చైర్మన్ గా దిల్ రాజు ఎన్నుకోబడ్డారు. ఇక ఏర్పాట్ల విషయాని కొస్తే ఖర్చుకు ఏమాత్రం తగ్గకూడనే ఉద్ధేశ్యం తో చలన చిత్ర పరిశ్రమ లో వున్న వారందరూ తలా అయిదు కోట్లకు తక్కువకాకుండా ఇవ్వాలని చిత్ర పరిశ్రమ లో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరి ఇళ్ళకు సందేశాలు పంపబడ్డాయి. ఈ విషయాన్ని వారి వారి ఇళ్ళళ్ళో, కార్లలో, షూటింగ్ స్పాట్ లోని లేజర్ టీవి ల మీద స్క్రోల్ మెసేజ్ గా రావడం ఆలస్యం పెద్ద హీరోలయిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు,ప్రభాస్, అర్జున్, మోక్షజ్ఞ తేజ, రాం చరణ్ తేజ, నాగ చైతన్య, అఖిల్, విష్ణు వర్ధన్, మనోజ్ కుమార్, కళ్యాణ్ రాం లు తమ బ్యాంక్ ఖాతాల్లోనుంచి తలా పది కోట్లు Te.M.A.(Telugu movie artists association) కు ట్రాన్స్ఫర్ చేసేశారు. టీ.వి హక్కులు రెండు వందల కోట్లకు "మేమూ తెలుగే" అనే పర భాషా టీ.వి కి ఇవ్వబడ్డాయి. ఈ హక్కులు చాలా తక్కువ ధరకు ఇచ్చేశారు అని కొందరు విమర్శించారు.
ఇప్పుడున్న టీ.వి లలో కనీసం వారానికొక సారి తెలుగు వారిచేత తెలుగు మాట్లాడిస్తూ తెలుగు ని చూపిస్తున్నందుకు వాళ్ళకు మేమిచ్చిన గౌరవం " అని TEMA అధ్యక్షుడు జూ. ఎన్టీఆర్ ఒక ప్రకటన ఇచ్చారు.
మమూలుగా కమిటీ సమావేశాలను టెలీ కాన్ఫరెన్స్ లలో నిర్వహించే వారు. టీ.వి. హక్కుల విషయం మాట్లాడుకుంటుంటే ఎవరో హ్యకర్ వచ్చి వాళ్ళ సమావేశ వివరాల్ని బయట పెట్టడం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తుకు తెచ్చుకుని ఈ సారి చాలా జాగరూకతతో వ్యవహరించాలి అనే ఉద్ధేశ్యంతో ఈ సమావేశాన్ని ఒక రహస్య స్థలమయిన మైక్రోసాఫ్ట్ నేల మాళిగ లో ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఎలక్ట్రానిక్ పరికరాల్ని లోనికి రానీయ లేదు. సమావేశం మొదలయింది. అందులో పోయిన సారి వజ్రోత్సవాలప్పుడు జరిగిన తప్పులను మళ్ళీ చేయకూడదని అందరూ ముక్త కంఠతో అన్నారు. ఇది వంద సంవత్సరాల వేడుక కాబట్టి గొప్పగా జరపాలని తలచి విశాఖ సముద్ర తీరంలో సంచరించే "తెలుగు సాగరం" అనే ఓడ మీద జరపాలని తీర్మానించారు. ఈ "తెలుగు సాగరం" విస్తీర్ణం 540 ఎకరాలు. దీని మీద ప్రకృతి సిద్ధంగా సృష్టించబడ్డ ఉద్యాన వనాలు, గురుకులం లో కనిపించే అద్వితీయమైన సౌందర్యాలు అన్నీ రంగరించి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అన్నింటిని కలిపి నిర్మించారు. ఒక పక్క ప్రాచీన వైభవాన్ని, ప్రకృతి సోయగాలను మరో పక్క ఆధునికత సంతరించుకున్న రోజుకో రంగు మార్చుకునే కళ్ళు చెదిరే ప్లాస్టిక్ రోడ్లు, కంప్యూటరీకరించిన ప్రదేశాలు. ఎక్కడ వున్నా ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చే మనుషులు దీని ప్రత్యేకత. చాలా ఓడల్లో అతిథులను చూసుకోవడానికి ఖర్చు తగ్గించుకోవడానికి మర మనుషులను పెడితే ఈ తెలుగు సాగరంలో మాత్రం సహాయకులు గా చక్క గా చీర కట్టుకున్న అందమైన తెలుగు అమ్మాయిలను పెట్టారు ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా. అంత ఖరీదయినదనే దీన్ని ప్రపంచంలోని గొప్ప Cruise ఓడల్లో మొదటిది గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించారు.
మళ్ళీ సమవేశ వివరాల్లోకొద్దాం. "పోయిన సారి జరిపినప్పుడు మూడు రోజులు జరిపారు. అందులో మూడో రోజు జరిగిన తప్పిదాలను జరక్కుండా చెయ్యాలంటే దానికి ఒకటే మార్గం మూడు రోజులకు బదులు ఈ సారి అయిదు రోజులు చేద్దాం. మూడో రోజు అనర్థం జరిగింది కాబట్టి ఆ రోజున అందరం మౌన వ్రతం చేద్దాం ఎలాంటి కార్యక్రమాలు లేకుండా. కేవలం మన కళాఖండాల ప్రదర్శన పెడదాం" అని అరగొండ గణేష్ అన్నాడు.
"అరె నిన్ను హీరో భార్య తుపాకీ తో కాల్చిన తరువాత నీ బుర్ర బాగా పనిచేస్తోందే" అని మనసులో అనుకొని "సెభాష్..సెభాష్.." అని చప్పట్లు కొట్టి ఓకే చేసేశారు. "ఇక ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలి అని కాకుండా ఎలాంటి అవార్డులు ఇవ్వాలి అనేదాని మీద మాట్లాడుదాం" అన్నాడు వెరీగుడ్ నిర్మాత.
ఈ సారి వృద్ధ కె.కె.రావు గారు "ముందుకొచ్చి బాబ్బాబు పోయిన సారి నా తలకు కట్టిన బొప్పి ఇంకా మాన లేదు. ఈ సారి లెజెండ్రీ అవార్డూ ఒద్దూ సెలెబ్రిటీ అవార్డూ ఒద్దు. రెండూ కలిపి "లెజెండ్రబ్రిటీ" అని అవార్డిచ్చేద్దాం. లేకపోతే ఈ కమిటీ చైర్మన్ దిల్ రాజు పేరు డల్ రాజు అయిపోతుంది" అన్నాడు.
"అరె వెబ్ సైట్లంటే పడని ఈయనికి వెబ్ సైట్లు చదివి చదివి జ్ఞానోదయమయినట్టుంది" అని దానికీ చప్పట్లు కొట్టేసి అందరూ "వాకే" అనేశారు. ఇంతకు ముందు బొంబాయి నుండి కాజోల్ ని తెస్తే అందరూ తిట్టారు అందుకని ఈ సారి హాలీవుడ్ నుండి బ్రిట్నీ స్పియర్స్ కూతురు చట్నీ స్పియర్స్ ని తెద్దాం అన్నారు. దానికి ఒక యువ నిర్మాత "ఖర్చులు నేను పెట్టుకుంటా...ఒస్తే నా ఇంట్లో వుంటుంది" అన్నాడు. "అబ్బో ఖర్చు లేకుండా పని జరిగి పోతుందని" కమిటీ చైర్మన్ సంబరపడ్డాడు.
ఇక అయిదో రోజు ముఖ్య అతిధిగా ఎవర్ని పిలుద్దాం అనేదానిమీద రెండుగా చీలిపోయి నానా రభస జరిగి నాలుగైదు వాకౌట్లు వాకిన్ లు అయ్యాక ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడుని పిలుద్ధామని నిర్ణయించారు. అంతగా కావాలంటే ప్రారంభ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని పిలుద్దాం అన్నారు కొందరు. అది కూడా జగన్ మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కరంటు కట్ చెయ్యనని లోకేష్ నాయుడు హామీ ఇస్తేనే పిలవాలని కొందరు సూచించారు. ఇక వెళ్ళి ముఖ్య మంత్రి నడిగి హామీ తెచ్చే బాధ్యత చిరంజీవి మీద పడింది. మిగిలిన పనులు కూడా వారి వారి వర్గాలు పంచేసుకుని సమావేశం ముగించేశారు.
ఓ సుముహుర్తాన చిరంజీవి వెళ్ళి ముఖ్య మంత్రి ని కలిశాడు. చిరంజీవి వస్తున్నాడని తెలిసి తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకుని కలిశాడు ముఖ్యమంత్రి. చిరంజీవిని చూడగానే "రండంకుల్" అని కాళ్ళ కు మొక్కి సాదరంగా అహ్వానించాడు. చిరంజీవి తనొచ్చిన పని చెప్పగానే "అదేంటంకుల్ మీరడగడమూ నేను కాదనడమూ నా. అందులోనూ మమ్మీ, ఆంటీ మంచి స్నేహితురాళ్ళు. మీరొచ్చి చెపితే, జగన్ ఒచ్చినా సరే నేనెందుకు కరంట్ కట్ చేస్తాను. అందులోనూ ముక్కలు చెక్కలైన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలపడానికి నేనూ జగన్ కలిసి పనిచేశాము. జగన్ నాకన్నా పెద్ద వాడయినా ఇద్దరం మంచి స్నేహితులం." అన్నాడు.
"చాలా మంచిది నాయనా" అని చిరంజీవి వచ్చేశాడు. లోకేష్ ఈ విషయాన్ని వెంటనే డిల్లీ లో వున్న తండ్రికి తెలియ చేశాడు.
ఈ కార్యక్రమం అందరూ అనుకున్న రోజు రానే వచ్చింది. "తెలుగు సాగరం" దేద్యీప మానంగా అలంకరించబడ్డది. అందులోని సభాస్థలికి వున్న ప్రత్యేకతలు చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు. చూడానికి బహిరంగ వేదిక గా వున్న ఎప్పుడు ఏది కావాలంటే అది సమకూర్చుకోవచ్చు. కావాలంటే మొత్తం చీకటి చేసుకుని నక్షత్రాలు, చంద్రుడు తెప్పించుకోవచ్చు లేదా మంచు కురిపించుకోవచ్చు అదీ కాదంటే చిరు జల్లులు తెప్పించుకుని ఆనందించొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశ సౌభాగ్యానికి దాన్ని కొలబద్ద గా వర్ణించవచ్చు. వంద సంవత్సరాల వేడుకలకు అందరూ విమానంలో విశాఖ ఏర్ పోర్ట్ లో దిగటం అక్కడి నుండి "ధీరూ ఏవియేషన్" (ధీరూ భాయ్ అంబాని మనవడు) వారి హెలికాప్టర్ లో "తెలుగు సాగరం" లో దింపటం సవ్యంగా జరిగి పోతోంది. తెలుగు నాడు రాష్ట్రం నలుమూలల్నుంచి అయిదు వేలకు పైగా జనాలు వచ్చారు.(ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి మళ్ళీ కలిసిన తరువాత పెట్టిన పేరు) అందరికి అయిదు రోజుల వసతి "తెలుగు సాగరం" మీదనే. ఎక్కడా ఏ లోపమూ లేకుండా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా సాగిపోయాయి. తెలుగు చిత్ర సీమలో వున్న చిన్న పెద్దా అన్ని నటులకు ఉచితంగా ప్రవేశం మరియు ప్రయాణపు సదుపాయాలు కల్పించబడ్డాయి.
కార్యక్రమం లో పాల్గొన్న కొత్త యువత అందరికి "తల తంతి తర్జుమా"(Interpreter head phones) యంత్రాలు ఇవ్వబడ్డాయి. చాలా మందికి తెలుగు రాదు వచ్చినా అక్కడ వేదిక మీద మాట్లాడే భాష అర్థమవదని "సంస్కృతి" అనే కంపెనీ వాళ్ళు అందరికి ఉచితంగా అందచేశారు. ఇవి చాలా తెలివి గా పనిచేసే యంత్రాలు. ఎవరైనా మాట్లాడుతుంటే ఆ విషయాలను ఇంతకు ముందు ఎవరైనా మాట్లాడారా అని శోధించి అలా మాట్లాడుంటే వెంటనే ఆ విషయాన్ని చెవుల్లో పెట్టుకున్న వాళ్ళకు ముందుగా చెప్పేస్తుంది. మొదటి రోజు బాలకృష్ణ,చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ,త్రిష సహాయం తో జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాలు ప్రారంభించారు. చిరంజీవి మోహన్ బాబును వేదిక మీదికి సాదరంగా ఆహ్వానించాడు. మోహన్ బాబు చిరంజీవిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని వ్యాఖ్యాత గా తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. "ఎందరో మహాను భావులు అందరికి వందనాలు" అని అక్కినేని నాగేశ్వర రావు ని కింద నుంచి వేదిక మీదకు తీసుకొచ్చాడు.
ఈ సారి కూడా అగ్ర తాంబూలం వంద సంవత్సరాల కురు వృద్ధుడు అక్కినేని నాగేశ్వర రావు కే దక్కింది. అతని సమకాలీకులందరూ స్వర్గస్తులైపోయారు. కుర్చీలో కూర్చున్న అక్కినేనికి నాగ చైతన్య మైక్ అందివ్వ బోతే "వాట్ నాన్సెన్స్...నాకు సహాయమెందుకు నేనే మైకు దగ్గరకొస్తాను" అని లేచి మైకు చేతిలో తీసుకోగానే సభ మొత్తం గౌరవ సూచకంగా లేచి నుంచింది. అందర్ని కూర్చోమని చెప్పి తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు.
"వెన్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ పాండీ బజార్ వితౌట్ చెప్పల్స్...." అని మొదలు పెట్ట గానే తర్జుమా తల తంతి పరికరాలు మిగిలిన మాటలు గబా వినిపించెయ్యసాగాయి. గోడల మీదున్న స్క్రీన్స్ కూడా మిగిలిన ప్రసంగాన్ని మొత్తం చూపించేశాయి. అది చూసి అక్కినేని కోపంగా "అదేమిటి ఈ సంబరాలను నన్ను అవ్మాన పర్చడానికి పిలిచారా" అని కోప్పడ గానే ఆ దిల్ రాజు గబ గబా వెళ్ళి "స్మార్ట్ సిస్టం" ను డిసేబుల్ చేసి వచ్చాడు. " నేను అప్పుడే చెప్పాను...మన సంస్కృతీ సంప్రదాయాలను మీరు గౌరవించాలని. మీరు చక్కగా తెలుగు నేర్చుకుని వుండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు..ఈ తెలుగు సినిమాలో క్రమ శిక్షణ నాతోటి..నా బ్రదర్ ఎన్టీఆర్ తోటే వచ్చింది...." అని మొదలి పెట్టి తను చెప్పాలిసిందంతా చెప్పి కూర్చున్నాడు.
ఇక తరువాత వంతు దాసరి నారాయణ రావుది. తను మైకు తీసుకుని మొదలు పెట్టాడు. "ఈ తెలుగు చిత్ర పరిశ్రమను ఎవరు కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు..ఎవరు పెంచారు..ఎందుకు పెంచారు...ఎవరు పొషించారు..ఎందుకు పొషించారు.. కనిపెట్టి పొషించారా..పొషించి కనిపెట్టారా .. పొషించి కని పెట్టి పెంచారా? "
అది విన్న కొన్ని పాత తంతి తర్జుమా యంత్రాలు "డమాల్" మని పేలి పోయి మాడిపోయాయి. వాటికి కొత్త గా వేసిన safety ear bag వల్ల ఎవరికీ ఏమీ అపాయం కలగ లేదు. కొన్ని పేలి పోయినందున కంప్యుటర్లన్నీ ఆటో పైలట్ లో పని చెయ్యడం మొదలు పెట్టాయి. దాని ఫలితంగా తంతి తర్జుమా పరికరాల "స్మార్ట్ సిస్టం" ఎనేబుల్ అయ్యిపోయి మిగిలిన ప్రసంగమంతా వినిపించడం మొదలు పెట్టింది. ఇలా కాదని తెలివైన దాసరి తన చెప్పిందే తిప్పి తిప్పి చెప్పే మాటల్ని మానేసి అసలు విషయం లోకి రాగానే అన్నీ మామూలుగా పనిచెయ్యడం మొదలుపెట్టాయి.
" ఈ రోజున ఇలా మనమందరం మళ్ళీ కలవడానికి కారణం మన పాత తరం కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణే చేసిన కృషే. మన రాష్ట్రం రాయలసీమ, ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, ఆంధ్రా, కళింగాంధ్రా, గ్రేటర్ హైదరాబాద్ లాగా విడీపోతే. మన తెలుగు పరిశ్రమ కూడా అన్నే ముక్కలయి విడిపోయింది. మన నాయకుల ప్రయత్నాల వల్ల మనం మళ్ళీ ఒక్కటయినా పరిశ్రమ ఒక్కటవ్వ లేదు. అందుకోసం నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, మరియు మన జూనియర్ ఎన్టీఆర్ చేసిన కృషి మరువ లేనిది అంతే కాకుండా మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ కాల నాళికను లండన్ లో భద్ర పరచడానికి వారు చేసిన కృషి శ్లాఘనీయం....వాళ్ళందర్నీ మనం ఈ రోజు సత్కరించుకోవాలి." అని ముగించేశాడు.
తరువాత అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎక్కడా ఎవరికీ తక్కువ కాకూడదనే ఉద్ధేశ్యంతో కొన్ని వేల టీ.వి. తెరలు పెట్టి ఒక్కో దాన్లో ఒక్కో సినిమా వేసేశారు డబ్బింగ్ చేసిన ఇంగ్లీషు సినిమాలతో సహా. నా క్లిప్పింగ్ వెయ్య లేదు అనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు.
రెండో రోజు "ముగ్గురు మిత్రులు" "నీ భుజం నామీద నా భుజం నీ మీద" అనే ట్యాగ్ లైంతో వున్న నాటకాన్ని రాం చరణ్ తేజ, విష్ణు వర్ధన్, మనోజ్ కుమార్ లు వేస్తుంటే అక్కడ ఉన్న జనం అంతా కరతాళ ధ్వనులు చేశారు.
మూడో రోజు మాత్రం అందరూ మౌనంగా ప్రదర్శనలో పెట్టిన అన్నీ చూస్తున్నారు. అందరూ ఒక ప్రదర్శన గదిలోకి వెళ్ళి వచ్చి ఆవేశంతో మాట్లాడ బోయారు కొందరు. గొంతు లోంచి మాటలు వచ్చే కదలికలను కూడా కని పెట్టి బయటకు విసిరేసే మర మనుషులను అక్కడ పెట్టడం వల్ల ఎవరూ నోరు మెదప లేదు. అంత ఆవేశానికి లోను చేసే చిత్రాలు "మోహన్ బాబు కుడి చెయ్యెత్తి చూపుడు వేలుతో ఏదో చెప్తున్న దృశ్యం". "చిరంజీవి ఎడమ చెయ్యెత్తి చూపుడు వేలుతో ఏదో చెప్తున్న దృశ్యం". ఆ రెండు ఆ గది లోనే వున్నయ్ మరి. ఆ రోజు సాయంత్రానికి గానీ కమిటీ వాళ్ళు చేసిన పొరపాటు గుర్తుకు రాలేదు. అందర్నీ సముచితంగా చూపించాలనే తాపత్రయం తో పోయిన సారి వజ్రోత్సవాలప్పుడు తీసిన ఫోటోలను కూడా పెట్టేశారు. అదే తమ పాలిట "పిడుగు" అవుతుందేమోనని గాబరా పడ్డాడు దిల్ రాజు.
నాలుగో రోజు "అబ్బీ లబ్బీ ఓ యబ్బీ పాటకు" జూనియర్ ఎన్టీఆర్ ఇరగ దీస్తూ డ్యాన్స్ చేసాడు.
"జామ్మంది జుమ్మంది...తకధిమితోం" అనే పాట కు అల్లు అర్జున్.
"ఏ...కిరి..కిరి..పొకిరీ..." అనే పాటకు మహెష్ బాబు,
"నా బాబు చిరురో..నా బామ్మర్ది అర్జున్రో..నా బాబాయ్ పవన్రో" అనే పాటకు రాం చరణ్ తేజ,
"నైజాం నారీ...నా ఖండ చక్కర ప్యారీ" అనే పాటకు ప్రభాస్ లు డ్యాన్స్ చేసి ఆడిటోరియం దద్ధరిల్లేట్టు చేశారు.
అయిదో రోజు సన్మాన కార్యక్రమాలు ప్రారంభ మయ్యే రోజు. దిల్ రాజు దిల్ "డమాల్..డమాల్" అని కొట్టు కోవడం ప్రారభించింది. సన్మానానికి ముందు పోయిన వజ్రోత్సవ సభలో సీలు చేసిన కాల నాళిక తెరవడం కార్యక్రమంలో ఒక భాగం. దాన్ని తెరవడానికి క్యారక్టర్ ఆర్టిస్టు గా స్థిరపడిన హీరో శివాజిని వేదిక మీదకు పిలిచారు. సభ అంతా ఉత్కంఠ గాఎదురు చూస్తూ ఉండగా శివాజి వినమ్రంగా కాల నాళికకు నమస్కరించి దాని సీలుని పగలగొట్టాడు. అందులోనుండి ఒక్కోక్కటీ బయటకు తీసి చదివే కార్యక్రమం శేఖర్ కమ్ముల కు ఇవ్వబడింది. అసలే ఇలాంటి వాటికి దూరంగ వుండే శేఖర్ బెదురుతూ పెట్టె తెరిచాడు
.
అంతే ........
అందులోనుంచి దట్టమైన పొగ బయటికి వచ్చింది.
ఆవేశం ఆపుకోలేక అల్లు అర్జున్ ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి
"మామయ్య లెజెండ్ అవార్డ్ నేను బయటికి తీసి ఇస్తా" అన్నడు".
"ఊహూ నాన్నకు నేనిస్తా " అన్నాడు రాం చరణ్.
"బాక్సు బద్దలయిపోతుంది ఎవరైన తీతీస్తే..నేనే తీస్తా నేనే ఇస్తా తాతకు" అన్నాడు రామలింగ
తేజ ఉరఫ్ రాం చరణ్ తేజ కొడుకు.
"చక్కర్ మే రక్కా... తల్లీ చెల్లి ఏ గల్లీ లో లేని సిల్లీ నాకొడుకుని నేను..నేనే తీస్తా నేనే ఇస్తా నా మిత్రుడైన చిరన్...జీవికి" అన్నాడు రాగం తీస్తూ.
ఆ డైలాగ్ దెబ్బకి పొగ మొత్తం ఆగి పోయింది.
మోహన్ బాబు పెట్టె అంతా గబ గబా వెతికాడు అవార్డులు కానీ ఇంకా ఉత్తరాలు కానీ ఏమైనా దొరుకు తాయేమో నని. పెట్టె మొత్తం ఖాళీగా కనిపించింది. అది చూసి అందరూ తెల్ల బోయారు.
అంతలో ఆకాశం లో నుంచి తెల్లని మెరుపులు ఆ వెనకనె చిర్నవ్వులు చిందిస్తూ కళా తపస్వి కె.విశ్వనాధ్ గారు కనిపించారు. ఇంతలో కల కలం మొదలయింది. అది చూసి విశ్వనాధ్ చెప్ప సాగాడు.
"వజ్రోత్సవాలప్పుడు జరిగిన సంఘటన చూసి నా మనసు కలుక్కుమంది. ఇన్నాళ్ళు ఎంతో సఖ్యంగా వుంటూ ఒకర్నొకరు ఆదుకుని ఒక కుటుంబంగా వుంటూ అప్పుడప్పుడు జరిగిన చిన్న చిన్న సంఘటనల్ని మరిచి హాయిగా వున్న మన మధ్య ఈ అవార్డులు చిచ్చు పెట్టాయి. దానికి తోడు ఈ కాల నాళిక లో కొన్ని అవార్డులు వచ్చి పడ్డాయి. అవార్డులే ఇలా వుంటే ఇందులో రాసిన ఉత్తరాలు ఎలా వుంటాయో చూద్దామని వజ్రోత్సవం అయిపోయిన తరువాత ఎవరికీ తెలియకుండా ఆ పెట్టె తెరిచి చూసాను. ఆ జ్ఞాపికల కన్నా అందులో వేసిన ఉత్తరాలు మరింత క్షోభ కు గురిచేశాయి. ఒక్కొక్కరు ఒక్కోతీరుగా తమలో వున్న కసిని వెళ్ళగక్కారు. ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తే వంద సంవత్సరాల వేడుక మరింత వేడిని రగిలిస్తుందని అందులో వున్న వన్నీ తీసేశాను. మూడో రోజు టీ.వీ. ల మీద కొన్ని చిత్రాలు కనిపించకుండా నేనే దాచేశాను. అవుంటే మళ్ళీ రసాబాస య్యేది. మీరు ఇప్పుడున్నట్లే కలిసి కట్టుగా వుండండి లేకుంటే నోర్మూసుకోండి.
అనవసరంగా స్టేట్మెంట్లిచ్చి బజార్న పడకండి......ఇక నే వెళ్ళొస్తా" అని అంతర్ధానమై పొయాడు.
13 comments:
Nice article. Chaala manchi satire mana telugu cine field gurinchi. Keep up the good work.
ఎంత అద్భుతం గా రాశారండి.చాలా నవ్వొచ్చింది.
వాస్తవికం గా కూడా ఉంది.యండమూరి గారు రాసే కామెడీ లా ఉంది కొన్ని చోట్ల.
మీరు కధలు రాయొచ్చు ఐతే.
చాలా బాగా వ్రాశారు.
సూపర్ , అల్టిమేట్ .... కిరాక్ .....
ఇరగదీసారసలా ...
"లెజెండ్రబ్రిటీ" ...
చట్నీ స్పియర్స్ ..
వారసుల పేర్లు .... హిల్లారియస్ ....
చాలా బాగా రాసారు ..... :)
ha ha..nijam gaa ilaagea jarugutumdemo.[konni konni kalpita kadhalu kuudaa nijamayina samdarbhaalu konni vunnaayi kada]
ఈ పోస్టుకు 'లెజెండరీ' అవార్డు ప్రకటిస్తున్నాము. ఇక్కడ ఎవరికైనా అభ్యంతరమా బాబూ?
రామలింగ తేజ - నవ్వాపుకోలేక పోయాను. చివరగా కాలనాళికలో ఏమేమి కుళ్లు రాసిపెట్టివుంటుందో విశ్వనాథ్ పాత్రలో చెప్పించి ఒక మంచి నీతికథ చెప్పారు.
మీలాంటి రచయితలను ముందుకు తెస్తున్న ఈ బ్లాగ్‌ప్రక్రియకు శతకోటివందనాలు.
అద్భుతం అత్యద్భుతం. విశిష్టమైన అరుదైన బ్లాగిది. పాతికేళ్ళ ముందుకు తొంగిచూస్తూ బోలెడన్ని విషయాల మీద మనదైన శైలి ఎలా వుంటుందో చక్కగా చెప్పారు.
చాలా నవ్వించింది, చాలా బాగుంది.
--ప్రసాద్
http;//blog.charasala.com
మంచి ఊహ - చదివించే కథనం
మీ ముందు చూపు చాలా హాస్యభరితంగా వుంది. మాంఛి సెటైర్ అందించినందుకు ధన్యవాదాలు.
చాలా బాగుంది.
రాసిన ఇరవై నాలుగ్గంటల్లో పది ప్రశంసాత్మక వ్యాఖ్యలు నాకెంతో ఆనందంగా ఉంది. ప్రశంశిస్తూతూ రాసిన అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు.
చందు గారూ,
ముందుముందు మరిన్ని రాయటానికి ప్రయత్నిస్తా.
స్వాతి గారూ,
ఏడో మీ అభిమానమండి. యండమూరి అంత కామెడీ లేదండి. కామెడీ లో నాకు స్పూర్తి బాపు-ముళ్ళపూడి, యెర్రం సెట్టి శాయి, మల్లిక్ లండీ.
ఒరెమున, వెంకటరమణ, రావ్, మనోహర్ గార్లకు
మీ అభినందనలకు థాంక్స్.
క్రిష్ రేం గారు,
మీ అభినందలకు చాలా సంతోషం. ఆ పేర్లు నాకు కూడా చాలా నచ్చాయి.
రాధిక గారు,
నిజంగా ఇలాగే జరిగితే బాగుండునని పిస్తోంది .
రానారె,
మిమ్మల్ని ఇంత నవ్విచ గలిగానంటే నా ధ్యేయం నెరవేరినట్లే.
మీ లెజెండరీ అవార్డ్ తీసుకోవాలంటే నాకు "design avaarD ఇవ్వండి :-)
పసాద్ గారూ,
మీరి దీన్ని విశిష్టమైన, అరుదైన బ్లాగన్నందుకు నా ఆనందం చెప్పనలవి కాదు.
మురళీ కృష్ణ గారు,
ఇలాంటి పాజిటివ్ దృక్పథంతో మరిన్ని ఇక ముందు అందించ గలననుకుంటున్నాను.
ఇంకా ఎంతో మంది లెక్కకు మిక్కిలి గా వచ్చి చూసిపోతున్న వాళ్ళకు,
మీరు ఈ టపా ను మీకు వచ్చిన "ఈ-టపా" ఫార్వర్డ్ ల ద్వారా చూస్తున్నదుకు మీకు కూడా ధన్యవాదాలు.
భవదీయుడు.
విహారి.
అయ్యో నేను మిస్ అయిపోయాను మీ టపాను.
సూపర్ గా ఉంది గురు గారూ.
Nice article. It is hilarious. Keep it up!
Post a Comment