Thursday, October 05, 2006

మా యవ్వ. - 1

***************************************************
ఏదో ఒకటి మొదలు పెట్టాలి..మొదలు పెట్టాలి అనుకుంటుంటే అనిపించింది. ఏదో ఒకటి ఎందుకు. ఎందుకైనా మంచిది ఓ మంచి దాన్తో మొదలు పెడితో సరిపోతుంది కదా అని. ఇక చిన్నప్పటి సంగతి తో మొదలు పెడ్తా.
***************************************************


నేను నా చిన్నబ్బుట్నుంచి పెరిగింది చిన్న చిన్నూళ్ళలో. ఏందుకంటే మా యమ్మ మా నాయినా జేసే పని టీచురు పని. అబ్బుట్లో సింగిల్ టీచర్ స్కూల్ లేదా ఇద్దురు పన్జేసే స్కూల్ వుంటే ఆడికి ట్రాన్స్పర్ చేసే వోళ్ళన్న మాట. నేను చాన చిన్న పిలకాయనని నాకన్న రొండేళ్ళు పెద్దోడయిన మాయన్న ని దగ్గరే బెట్టుకుని నన్ను మాయమ్మ మా యవ్వోళ్ళూరు లో పెట్టింది కొన్ని దినాలు .అబ్బుట్లో నే మా యమ్మ బేబి సిట్టింగ్ ని అవుట్ సోర్స్ చేసేసింది.



మాయవ్వంటే మా యమ్మొళ్ళ అమ్మన్నమాట. మా యవ్వ నన్ను చాన బాగ జూసుకునేది. మా పెద్ద మామ గూడ నన్ను చాన బాగా జూసుకునేవాడు. పాపం ఆయనకు పిలకాయల్లేరు. ఆ వూరి పేరు జెప్పలేదు గదూ. ఆ వూరి పేరు యర్ర కోట పల్లి. చిత్తూరు జిల్లా కలకడ దగ్గిర ఓ చిన్నూరు. ఆ వూర్లో మా మామంటే మా మామే. అదే పెద్ద మామ. ఇంక ఇద్దురు మామలుండార్లే అందుర్లోకి చిన్న మామ కిట్ట మామ. ఆయనెబ్బుడు స్టయిలు గా ఉండే వోడు. ఆయన జేసే పనేమో దేశాలు తిరగడం ఎబ్బుడు జూసినా బొంబాయి కి బొయ్యేవాడు. వూళ్ళో అందురూ బొంబాయి కిట్టయ్య అనే వోళ్ళు. ఎబ్బుడూ నళ్ళద్దాలు పెట్టుకుని బొచ్చు టోపీ పెట్టుకునే వాడు. ఇంగో మామేమో మా పెద్ద మామ ఇంటి దగ్గిరే ఇంగో ఇంట్లో వుండే వోడు. ఆయనకు అయిదు మంది కూతుర్లు ఒగ్గొడుకు. కొడుక్కోసరం అంత మందిని కణ్ణాడంట. అందురూ సేద్యం జేసుకునేటొళ్ళే.



అబ్బుడే జెప్పినా కదా మామామంటే మామామే అని. ఆయనకి రేషన్ షాపు, గుడ్డలంగిడి ఇంకా ఏవేవొ వుండేటివి. ఆయన వూళ్ళో అందరికి సహయం చేసే ఓడు. అందురికి తళ్ళో నాలికంట. నేనేమో ఆయన్ను పెద మామా అంటే వూళ్ళో వాళ్ళందరూ రామయ్యన్నా అనేవోళ్ళు. ఈ ముగ్గురి కొడుకులకి ఇంగొ ముగ్గురి కూతుర్లకి అమ్మే మా యవ్వ. మా తాత నేను బుట్టక ముందే చచ్చి పొయినాడంట. నేను చాన చిన్నగ వుణ్ణప్పుడు అంటే నేను చెడ్డీ లేకుండ పరిగెత్తే టబ్బుడన్న మాట చాన ఎర్రగా బుర్రగా బొద్దుగా వుండే వాణ్ణని వూళ్ళో వాళ్ళు నన్ని దీసుకోని పొయి వాళ్ళింట్లో ఆడిచ్చుకునే వాళ్ళంట. నాకు తరవాద్దెలిసింది లే నేను ఎర్ర గా లేనని. నేను కుంచెం పెద్దయిన తరువాత, అంటే ఇంట్లో వున్న నీళ్ళ బాయి బండ మీద నుంచి నిక్కి నిక్కి బాయి లోపలికి చూసేంత పెద్దన్నమాట, మా యవ్వ మా యమ్మని పిలిచి "అమ్మణ్ణీ, వీడు బాయి లోకి పారికి పారికి తొంగి జూచ్చా వుండాడు వీణ్ణింగ నువ్వు తీసుగోని బో " అని జెప్పింది. ఇంగేముంది మా యమ్మ నన్ను తాను పన్జేసే వూరికి దీసుకును పొయింది. ఆ వూరి పేరు నెల్లిమంద. ఇంగ జూసుకో మనికి ఇస్కూళ్ళో పండగే పండగ. మనం టేచురు కొడుకు కదా ఎవుణ్ణయినా తిట్టచ్చు గిల్లొచ్చు కొట్టొచ్చు. ఎవురు పుచ్చకాలైన(బుక్కుల్ని నేనట్లే పిలస్తా) చించొయ్యచ్చు. ఎవురి పలకలైన..ఎవురు తలకాయలైన పగలకొట్టచ్చు.



ఆ వూళ్ళో పిల్లకాయలందరి పలకలు పగిలి బొయినంక మళ్ళీ ట్రాన్స్పరొచ్చి లద్దిగం లో యేసినారు. ఆడ్నే మనల్ని గూడా స్కూళ్ళో యేసినారు. మాయమ్మ స్కూల్లో ఒగటోతరగతి కి రెండో తరగతి కి పాటాల్ జెప్పేది. మా నాయినేమో మూడో తరగతి నాలుగో తరగతి అయిదో తరగతి కి బొయ్యే ఓడు. అబ్బుడు స్కూళ్ళంతే. ఇంగేముంది ఆ స్కూళ్ళో గూడ మనమే రాజులం. ఎవుడూ మనల్ని రేయ్ అనే వోళ్ళు గాదు. అందురు "య్యోవ్" అని పిలిచే వోళ్ళు. "య్యోవ్" అంటే అయ్యా అని అర్థమన్న మాట. పొద్దున్నే ఎవుడో ఒగడు ఒచ్చి మా ఇంట్లో నుండి నా బుక్కులు(పుచ్చకాలైన) దీసుకోని స్కూళ్ళొ నా క్లాసులో ముందు లైన్లో బెట్టే వోడు. మళ్ళీ ఇంగోడు మద్యానానికి ఇంట్లో తెచ్చి పెట్టే వోడు. ఎబ్బుడూ స్కూలుకు బోక పొయినా మనమె క్లాసు ఫస్టు.నా బుక్కులు స్కూళ్ళో వుంటే నేనేమో పల్లి లో చెరువులు కాడ బాయిల కాడ ఆడుకునే దానికి బోయే వోణ్ణి. మా యమ్మ ఎబ్బుడన్న స్కూళ్ళోఎ డిక్టీషన్ జెబ్బేటబ్బుడు ఇద్దుర్నో నలుగుర్నో పంపిస్తుంది మన కోసం. అబ్బుడు వాళ్ళందురు మన కోసం చింతోపుల్లోనో బాయికాడనో చెరువుకాడనో కుంట కాడనో ఎతుకుతారు. నేను దొరికితే ఒచ్చి చేతులు కట్టుకుని "య్యోవ్ మ్యాడం రమ్మంటా వుంది.డిక్టీషన్ జెబుతుందంట" అని జెప్తారు. మనమేమో "తరువతొస్తా పోరా" అని వాణ్ణి గాఠ్ఠి గా అరిచి పంపిచ్చేసేవాణ్ణి. ఇంగొంత సేపటికి మళ్ళీ ఇంగోడు ఒచ్చి జెబ్తే. సర్లే పదరా అని వురుకెత్తుకుని ఒచ్చి క్లాసులో మా యమ్మిచ్చిన డిక్టీషన్ గబగబ రాసేసి చూపిచ్చేస్తే మనకు పది కి పది మార్కులు ఒచ్చేవి. దొంగ మార్కులేమీ కాదు లేబ్బా. అబ్బుడు మనం బాగానే జదివి వేవాళ్ళం ఇంటికాడ స్పెషల్ క్లాసులుంటాయి గదా.నా క్లాసులో ఇద్దురో ముగ్గురో సీ గాన పెసూనాంబ లు వుండే ఓళ్ళులే.


ఇట్లే ఒగ తూరి స్కూలెగ్గొట్టి వూళ్ళో రమణప్పోళ్ళ మొక్క జొన్న తోట్లోకి దూరి మొక్క జొన్నలు తింటా వుంటే ఆ తోటాయనికి దొరికి బొయినా. ఇంగ చూడల్ల నా మొగం. ఆయన్నన్ను గుర్తు బట్టి "సిగ్గు లేదూ టీచురు కొడుకయ్యుండి దొంగతనం జేస్తావా, ఈ తూరికి వొదిలేస్తావుండా టీచురు కొడుకని..పో" అని తిట్టేసరికి నేను నా చేతిలో కంకి ఆడ పారేసి వురుకో..వురుకు. తరువాత మా నాయినకి జెబ్బినాడో లేదో నాకు తెలీదు.



ఇంగ లీవులిచ్చినారంటే ఫస్టు బొయ్యేది మా యవ్వోళ్ళూరికి. లద్దిగం నుండి ఎర్రకోట పల్లి కి బోవాలంటే మొదట కలకడకు బొయ్యి ఆడ బస్సు మారల్ల. బస్సు ఎక్కితే మా యమ్మ కీ కండక్టర్ కీ గలాట. మా యమ్మేమో ఈడు చిన్నోడు టిగట్టక్కర్లేదంటే కండక్టరేమో లేదు ఆఫ్ టిగట్ కొనాల్సిందే అంటాడు. ఒగోతూరి మాయమ్మ గెలుస్తుంది ఇంగో తూరి కండక్టర్ గెలుస్తాడు. మేము కలకడలో బస్సు దిగ్గానే మాయమ్మ తెలిసినోళ్ళు చానా మంది కనిపిస్తారు. వోళ్ళు కనిపిచ్చగానే "ఏం అమ్మణ్ణీ వూరికి బోతావుండావా." అని అడగతారు. "అవును సుబ్బమ్మక్కా! నువ్వూ నీ కొడుకూ బాగానే వుండారా" అని అంటుంది మాయమ్మ. తరువాత ఆణ్ణే బస్టాండ్లో ఏ సాయుబూ అంగడి కాడికో బోయి అరిటి కాయలు బేరం జేసి పేపర్లో పొట్లం కట్టుకొని తీసుకొనొచ్చి సంచి లో పైన పెడతాది. ఇంగ బస్సు కోసం ఎంక్వయిరీ మొదలవుతుంది. అణ్ణే బస్టాండ్ లో ఎవుర్నన్నా "న్నా(అన్నా) బొజ్జు గుంట పల్లి కి బొయ్యే బస్సెప్పుడోస్తుంది" అని అడిగేది. "ఇబ్బుడే ఒక బస్సు ఎళ్ళి పూడిసింది. నేను ఆసందు కాడికొచ్చేసరికి ఆ డ్రైవరు గోడు అపకుండ పూడిసినాడు" అని చెప్పి."నువ్వు రామయ్య చెల్లిలు రంగమ్మ గదూ..ఏం అమ్మణ్ణీ అందురు బాగుండారా? ఈళ్ళిద్దురూ నీకొడుకులా..కూతుర్లు లేరా" అని పిల్చేసరికి ఇంగ మా యమ్మ గూడా "నువ్వా మునెంకటప్పన్నా ఎవురో అనుకుంట్నే బాగ సన్నగయి పోయినావే ఏమ్నా ఒళ్ళు బాగ లేదా ఎంది" అని మాటలు మొదలుపెడుతుంది. కొంజెపటికి బస్సొస్తే "పదమ్మా తిక్క బస్సొచ్చేసింది బిర్నే బోతే గానీ సీట్లు దొరకవు" అని. ఆ బస్సు కు తిక్క బస్సని పేరెందుకొచ్చిందంటే ఆ చుట్టు పక్కలున్న పద్నాలుగు పదైదు చిన్న పల్లిల్ని తిరుక్కుంటూ వచ్చేది. ఒగే రూట్లో చానా సార్లు తిరగడం వల్ల దానికి తిక్క బస్సు అని పేరు పెట్నారు.



కలకడ నుండి బొజ్జుగుంట వారి పల్లి కి ఆరో ఏడో ఎనిమిదో కిలోమీటర్లు. ఆడ దిగేసి ఇంకా ఒగ కిలోమీటరు నడిస్తే గానీ మాయవ్వ వాళ్ళ వూరు రాదు. ఇంగ ఆడ దిగిన కాడ్నించి జూసుకో అందురూ అడిగే వాళ్ళే "నువ్వు రామయ్య చెల్లెలు రంగమ్మ గదూ. నీ కొడుకులా ఏమి చదవతాండారు" అని.



(సశేషం)

8 comments:

spandana said...

విహారీ,
బాగా చెప్పినావప్పా. "న్నా" అని రాయలసీమ అన్నా పదాన్ని పలికించడం తీయగా వుంది.
అలాగే పెద్దవడాన్ని "నీళ్ళ బాయి బండ మీద నుంచి నిక్కి నిక్కి బాయి లోపలికి చూసేంత పెద్దన్నమాట " అని పోల్చడం చాలా బాగుంది.
ఇంకా మీ చిన్నప్పటి అనుభవాలు రాయండి.

--ప్రసాద్
http://charasala.com/blog/

మురళీ కృష్ణ said...

మంచి మొదలు ... కానీండి ... ఆపకండి మధ్యలో.

వర్మ said...

చాలా బాగుంది మళ్ళీ బాల్యంలోకి తీసుకువెళ్ళారు.నామిని కథలు చదువుతున్నంత ఆనందం. ఇది సశేషంగానే ఉంచండి . ఇంకా చిన్నప్పటి సంగతులుతో పాటు మీవూరు పండుగలు , మీవూరి దేవతలు, చెరువుగట్లు , మీ నేస్తాలు గురుంచి కూడ వ్రాయండి.

--వర్మ దాట్ల

Anonymous said...

ప్రసాద్ గారికి,

చాల ధన్యవాదాలండి. రాయలసీమ శైలి సరీగా వస్తుందో రాదో నని భయపడ్డా. కానీ మీ అభిప్రాయం చూశాక 'నా బండి రాగాన బాగానే పడింది" అని తెలుసుకున్నా. ఇంకా ఎన్నొ సంగతులు చెప్పాలి. చెప్పేస్తా.

మురళీ కృష్ణ గారికి,

ఇది మొదలయితే ఆగేది లేదండి. తప్పకుండ కొనసాగిస్తా.

వర్మ గారికి,

మీ అభిమానానికి కృతజ్ఞుడ్ని. తప్పుకుండా అన్నీ ఇందులో పొందు పరుస్తా. మీరు నా మొదటి ప్రయత్నాన్ని నామినీ కథలతో పోల్చినందుకు నా అనందం వర్ణనాతీతం.

భవదీయుడు.
విహారి.

రానారె said...

కలకడ యాస యండన్. మస్తు.

Anonymous said...

యో శానా బాగుండాదయ్యో ఇహారీ అట్టనే రాచ్చా పోతుండు

Kumar said...

Bale baaga cheppavu....

Hareesh Rayala Malisetty said...

యో విహారీ ఏమ్బా బలే రాసినావ్ సామీ , 'ఇంగ' ,'బిర్నే', 'బోతావుండావా' లాంటి పదాలు మన దగ్గర చాల మామూలు గా వాడతా ఉంటారు. రచ్చ పో చదువుతా ఉంటేనే బలే ఉంది. కానీ కలకడ, పీలేరు ఈ ఊర్ల కాడ 'పూడిసింది ' ,'పూడిసినాడు' అనరు గదబ్బా!!