Tuesday, October 24, 2006

స్వర్గం - నరకం

అది 2025 వ సంవత్సరం....

శ్రీ శంకర్ యాదవ్ తను స్థాపించిన ధార్మిక సంస్థ కార్యాలయం లో పనులు చూస్తున్నాడు. తను రెండు కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన అనాధ శరణాలయం నుండి వచ్చిన శరణాలయ పర్య వేక్షణాధికారి అడిగిన పనులకు డబ్బులు మంజూరు చేసేసి అప్పటికే ఎంతో సేపటినుండి తన కోసం ఎదురు చూస్తున్న అభాగ్య జీవుల గాథలు విని తలో అయిదు వేలో పది వేలో ఇస్తున్నాడు. దాన్ని స్వీకరించిన వాళ్ళు ఎంతో అప్యాయంగా "నూరు కాలా ల పాటు చల్ల గా వుండు నాయనా!" అని దీవిస్తున్నారు. వారి ఆశీర్వాదాలను అందుకుని ఏదో ఊరి నుండి వచ్చిన వారికి గుడి కోసమని మరో యాభై వేలు ఇచ్చాడు. అక్కడ గుమికూడిన జనమంతా అయనకు జేజేలు పలికారు.

అది 2004 వ సంవత్సరం....

శంకరన్న పేరు చెబితే ఆ చుట్టుపక్కలున్న ప్రజలందరి కి హడల్. వయసులోవున్న ఆడవాళ్ళెవరూ అతని ఛాయలకు కూడ వచ్చేవాళ్ళు కాదు. అక్కడ సాగే గుడుంబా, కల్తీ సారా లన్నింటికీ అతనే నాయకుడు. అడ్డూచ్చినోళ్ళను అడ్డంగా నరకడమే పని. ఆ వూరి ఎమ్మెల్యే అండగా దగ్గరే వుండి అన్ని పనులూ చేయించే వాడు. అప్పటి దాకా ఓ మాదిరి గా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫ్యాబ్ సిటీ మరియూ రింగ్ రోడ్ వల్ల ఒక్క సారిగా వూపందుకుంది. ఇక ఎమ్మెల్యే గారి కళ్ళు రియల్ ఎస్టేట్ మీద పడ్డాయి. మందిని బెదిరించడం ఇళ్ళు పొలాలూ ఖాళీ చేయించటం పట్టా లు తన పేరు మీద రాయించుకునే పనులన్నీ శంకరన్న మీద పడ్డాయి. ఎకరా లక్షో లక్షన్నరో ఉన్న భూములు కూడ అమాంతం రెండు మూడు కోట్లు పలకటం మొదలయింది. ఇంకేముంది శంకరన్న సొంత జెండా ఎత్తుకొని ఆ ఎమ్మెల్యే ని ఓ మంచి సమయం చూసి పై లోకానికి పంపించాడు. ఆ వచ్చిన ఉప ఎన్నికల్లో శంకరన్న సత్తా చూసిన ప్రభుత్వం అతనికే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపించుకుంది.

ఒక ఏడాది తిరిగే సరికి శంకరన్న కు ఆ ఏరియా లో వెయ్యి ఎకరాలకు పైగా భూములు తన పేరు మీదకో లేక బినామి పేర్ల మీదకో రిజిస్టరు చెయ్య బడ్డాయి. అడ్డొచ్చిన వాళ్ళు కైలాసగిరి కి పంపబడ్డారు. బతికున్న కొంతమంది పిల్లా పాపల్తో బజార్న బడ్డారు. శంకరన్న కాస్తా అసలు పేరు తో శ్రీ శంకర్ యాదవ్ గా పిలవ బడ్డాడు. ఇరవై ఏళ్ళ తరువాత తన పలుకుబడిని ఇంకా పెద్దది చేసుకోవాలని తన అరాచకాలను కప్పిపుచ్చు కోవాలనే ఉద్దేశ్యం తో కొన్ని సేవా సంస్థలు కూడ మొదలు పెట్టాడు.

2026 వ సంవత్సరం....

శ్రీ శంకర్ యాదవ్ ఉరఫ్ శంకరన్న అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి మరణించాడు. యమ భటులు ఇద్దరు వచ్చి శంకరన్న ఆత్మ ను తీసుకును వెళుతుంటే శంకరన్న అడిగాడు "యమ కింకరులారా! నన్ను మీరిప్పుడు నరకానికి తీసుకు వెళుతున్నారు కదా అది ఎలా ఉంటుందో నాకు చెబితే నేను మెంటల్ గా ప్రిపేర్ అవుతా".
దానికి ఆ కింకరులు ఫక్కున నవ్వి "నువ్వు వెళుతోంది నరకానికి కాదు స్వర్గానికి" అన్నాడో కింకరుడు.
"అదెలాగబ్బా?"
"నువ్వు పిచ్చోడి లాగున్నావే యమ కింకరులు ప్రాణాలు తీసి నరకానికే తేసుకెళ్ళడమే కాదు, నరుడి తప్పొప్పులను బట్టి స్వర్గానికి కూడ తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేస్తాం "
"మరి నేను ఎన్నో మర్డర్లూ మానభంగాలు ఇంకా ఘోరమైన పనులు చేశా కదా నన్ను స్వర్గానికెందుకు తీసుకెళుతున్నారు"
"చూడు నరుడా నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా చచ్చే ముందు ఒకటో రెండో మంచి పనులు చేస్తే చాలు స్వర్గానికి బెర్తు కొనుక్కోవచ్చు. అలాగే చాలా సదుపాయాలు కల్పించారు మన దేవుళ్ళు"

శంకరన్న తన మనసులో " అలాగయితే స్వర్గం లో కొన్నాళ్ళుండి మళ్ళీ నన్ను ఈ గడ్డ మీదే పుట్టించమని ఇంద్రుణ్ణి అడుగుతా"

నీతి: ఎన్ని నేరాలు ఘోరాలు అయినా చెయ్యొచ్చు. స్వర్గానికి బెర్తులు జీవితం చివర్లో కొనుక్కో వచ్చు.

6 comments:

oremuna said...

లేదండీ మీ కాన్సెప్టు తప్పనుకుంట

according to Law of Nature" అనే iskcon పుస్తకం

మీరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాలి
పుణ్యాలకు ఆనందాన్ని అనుభవించాలి
ఏది ముందు వస్తుంది, ఏది తరువాత వస్తుంది అనే విషయంలో మాత్రం కొద్దిగా కన్సేషను ఉంటుంది. మీరు కొన్ని చిట్కాలు ద్వారా సుఖాలు ప్రీపోన్ చేసుకోవడం, కష్టాలు పోస్ట్పోన్ చేసుకోవడం చెయ్యవచ్చు. ఉదాహరణకు కొన్ని ఉంగరాలు ధరించడం, యజ్ఞాలు చేయడం మొదలగున్నవి :)

ఇహ పోతే కర్మ బంధము పుణ్యాలకు, పాపాలకు రెండింటీకీ వర్తిస్తుంది పుణ్యాలు చేస్తే ఆ సుఖాల కోసం మరళా జన్మించాలి.

కష్టాలు అయితే పాపాల కోసం మరళా జన్మించాలి.

అయితే ఈ జన్మ భూమి పైననే అనే గ్యారంటీ లేదు, మనిషిగానే అనే గ్యారంటీ లేదు.

కాకపోతే మరొక లోప్ హోల్ కూడా ఉన్నదండోయ్, చనిపొయ్యేటప్పుడు ఏమి తల్చుకుంటే తిరిగి అలా జన్మిస్తారట, భరత మహారాజు ఓ జింకను తల్చుకోని జంకలాగా పుట్టినాడట

అజామిళుడు నారాయణా అని తల్చుకోని తన పాపాలకు కన్సేషను పొందినాడు.

ఈ బాధలన్నీ లేకుండా అన్ని పనులూ భగవంతునికి అర్పిస్తే ఏ కర్మా రాదట.

అందుకే కృష్ణార్పణం

Anonymous said...

విహారి..ఒక చిన్న సందేశాన్ని..కథ ద్వారా చక్కగా చెప్పారు. మీలో కథకుల లఖ్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాగే రాస్తూండండి.

నవీన్
http://gsnaveen.wordpress.com

spandana said...

మీ కథ చాలా బాగుంది.
నా వుద్దేశ్యంలో స్వర్గం, నరకం అన్నీ మనస్సుకు సంబందించిన సృష్టి. కణాజాలంతో ఏర్పడిన మెదడు నశించగానే అవన్నీ నశిస్తాయి. భౌతిక సూత్రాలే నిజం మిగతావన్నీ కల్పనలు, మిధ్య.
--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

I believe in what Charasala said. If there is a supreme power to judge us, it should also have the power not to let us do any crimes. The supreme power that allows us do crimes (causing others suffer) and later causing us suffer for it, is sadistic.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

ఈటపా ఇప్పుడే చూస్తున్నా. అవును- స్వర్గం, నరకం ఇవి మన ఊహలోనే ఉంటాయనుకొమ్టా- ఈ మధ్య ఆనలుగురు సినిమాలో ఇదే చెప్తాడు- సంతోషంగా ఉంటే స్వర్గం, దుఃఖంగా ఉంటే నరకం అని. పుణ్యాలు, పాపాలు- వాటికి శిక్షలు ఉన్నాయి. మనం చేసే పనులకి మనం అనుభవించాల్సిందే కదా?
@రానారె- మీ లాజిక్లో ఏదో వెలితి ఉంది. మీ అబ్బాయి ఎటువంటి పనులు చేస్తాడో, చేయడో మీరెమైనా నియంత్రించగలరా? వాడి తప్పొప్పులకి మీరు పూర్తిగా బాధ్యులా? పుట్టించడం, మంచి చెడ్డలు నేర్పడం (ప్రయత్నించడం)మాత్రమే మీరు చేయగలరు.

రానారె said...

సత్యసాయిగారు,
నేను మామూలు మనిషిని. అతీంద్రియశక్తి లేనివాణ్ణి. దైవం అలా కాదుకదా, సర్వశక్తులూ కలదిగా దైవశక్తిని చెప్పుకుంటాం కదా.