ఎబ్బుట్నుంచో సెబ్తామనుకుణ్ణా గానీ ఈ పన్ల వల్ల చానా కష్టమై పోతావుంది. ఇబ్బుడు కుంచెం వీలుబాటు అయ్యింది అందుకని రాస్తా వుండా. ఏమీ రాయకండా బోతే ఎవురు జూస్తారు ఈ బ్లాగుని.
ఏం చెప్పాలన్నా ఎర్రకోట పల్లి ఎర్రకోట పల్లే. ఆ ఏరు ఆ చుట్టు పక్కలున్న గానుగ చెట్ట్లు. కాలవల పక్కనుండే బోద.
మన మట్లా ఏట్లోకి పోగానే మన ఎనకాలనే వచ్చి "భూపతీ ఎబ్బుడోచ్చినావుప్పా? లీవులా? కలికిరికి బొయ్యొచ్చినారా? ఇంగ లీవులు అయిపూడిసే దాకా ఈణ్ణే వుంటావు కదప్పా!" అని ఎనకనుంచి మామ కూతురో కొడుకో పలకరిస్తారు.
"అవును. నేనింకీడ్నే వుంటా లీవులు అయిపుయ్యేవరకు... ఈ తూరి టమాట చేట్లేసినారే..పత్తి చెట్లెయ్యలేదా?" మన పలకరింపులు. దాంతో మొదలవుతుంది ఆవూరి మీద దండయాత్ర.పగలంతా చింత చెట్లమీదనో గనుక చెట్లమీదనో కోతికొమ్మ ఆట సాయంత్రమయితే వంగి దూకుడు, బారా కట్ట.. ఇంగా రాత్రి ఎన్నెల్లో నేల బండ. నేల బండ ఆడేటబ్బుడు ఎన్ని తేల్లు మండ్ర గబ్బలు చంపింటామో గుర్తే లేదు.
ఇంతకు ముందే జెప్పినా గదా మాయవ్వోల్లకు ఆవులెక్కువ అని.ఆవులే గాదు కోళ్ళు గూడా ఎక్కువే. ఎబ్బుడు జూసినా కొక్కురొక్కోమంటు ఏ కోడో...పుంజో వచ్చి కూర్సున్న చోటంతా గబ్బు గబ్బు జేసి పోయ్యేటివి. పిల్లల కోడయితే దాని కోడి పిల్ల కాడికి పోంగానే బొచ్చంతా నిక్కబొడుచుకోని మీదకొచ్చి ముక్కు తో బొడిచేది. ఒగసారి ఇట్లాగే దాని మీదకు బోతే నా కాలి మీద పోడిచిన పొడుచుడికి ఆ చుట్టుపక్కల గుడిసెలెగిరిబొయ్యేట్లు అరిచినా. మా యమ్మయితే యాడ్నుంచో పరిగెత్తుకునొచ్చి " నీ కెన్ని తూర్లు జెప్పినా! ఆ పిల్లల కోడి కాడికి బోవద్దురా అని, జెబ్తే ఇంటావా, వుండు నీ సంగతి జెబ్తా" అని ఆ పక్కన కట్టే దొరుకుతుందేమోనని ఎదకతా వుంటే మనం మామోళ్ళింటికి పరార్. సాయంత్రమైతే సాలు ఇంట్లో నాలుగయిదు గంపల్ని సగం బొర్లిచ్చి, ఎదో రాయి బెట్టి కొంచెం ఖాళీ వుంచతారు. తెల్లారి బొయిన కోళ్ళన్నీ "కుక్కుక్..కుక్కుక్.." అనుకొంటా గంప కిందికి బొయ్యి పండుకుంటాయి. కొన్నింటికి మళ్ళీ గంపలో నుంచీ బయటికి బొయ్యే అదృష్టం వుండదు. ఆ రోజుకు కూరయి పోతాయి. మా లీవులయిపోయ్యసరికి పెద్ద కోళ్ళన్నీ మాయమయి పోతాయి.
బయట నులక మంచమ్మీద మనం దుప్పటి గప్పుకుని నిద్ర పోతావుంటే "సర్రు..సర్రు" మని పాలు పిండే శబ్దాలు, ఆ రోజుకు పెరుగయిపోయిన ముందు రోజు పాలుని గుంజ కాడ సట్లో పోసి కవ్వం వేసి చిలికే సబ్దాలు, అబ్బుడే గంపలొనుంచీ బయటికొచ్చి ఒగ కాలు పైకెత్తి ఒక రెక్క ని విరుస్తూ ఒళ్ళు విరుసు కుంటూ కోళ్ళు చేసే అరుపులు, లేగ దూడ కోసం "అంబా " అనే ఆవుల అరుపులే మనకు "కౌసల్య సుప్రజా రామా" సుప్రభాతాలు. ఆ శబ్దాలకి మంచం మీద నుంచి లేచి వురుకెత్తుకొని బొయ్యేది మజ్జిగ చిలికుతున్న అవ్వ దగ్గిరికి.
"అవ్వా! ఎన్న బాగ ఎక్కువయి బయటికి వచ్చేచ్చా వుంది. నేను ఆ ఎన్న ని దీసి వేరే సట్లో ఏసేదా?" సహాయం పోజు పెడుతూ
"ఒద్దులేప్పా నేనేచ్చాలే, నిన్నెయ్యమంటే సగం నోట్లో ఎసుకుని సగం కింద దార పొచ్చావ్. నువ్వు బొయ్యి పండ్లు తోముకొని రాపో. నీకోసం పూరీలు జేసినా"
అవ్వెట్ల మన మనసులోని మాట కనిపెట్టేచ్చాదో అనుకుంటా జలజాట్లోకి బొయ్యి గూట్లో బెట్టిన బొగ్గు ముక్క తీసుకోబోతే అత్తంటాది " ఇట్టా రా నాయినా ఈడ నీకోసరం ఆ బొగ్గుని ఈ రాయితో నున్నగా నూరి బెట్టినా.ఇంద ఇది ఆ చేతిలో ఏసుకుని ఈ చేత్తో తోముకో...ఆ పొంతలో (ఒక వైపు రాయి బదులు కుండ పెట్టిన పొయ్యి) వుడుకు నీళ్ళుండాయి చెంబుతో ఎత్తి పోసుకో. సూరమ్మక్క మజ్జిక్కోసరం వచ్చింది. పోసేసి వచ్చా. జాగ్రత్తప్పా. వుడుకు నీళ్ళు కాలిమీదేడన్న పోసుకునేవు"
"అబ్బా నాకేం కాదులే అత్తా. నువ్వు పో నేను తోముకుని వచ్చేస్తా". గబ గబా బొగ్గు పొడి నోట్లో వేసుకుని బొగ్గు నీళ్ళు చెంపల మింద కారతా వుంటే వేలుతో దాన్ని మళ్ళీ నోట్లోకి తోసేసి ఎలాగోలా "దంత ధావనం" కావించేస్తాం. బొగ్గు లేక పోతే ఇటుక పొడి. కొంచెం పెద్దయినంక వంక కాడికి పొయ్యి ఓ పది గానుగ కొమ్మల్నో లేక చింత కొమ్మల్నో పీకి వాటిని నోటితో పరిశీలించి మంచి దయితే ఇంటికొచ్చి అమ్మకొకటి ఇచ్చి హీరో పోజు పెట్టడం బాగ గుర్తు. వేప కొమ్మలు చాలా చేదు కాబట్టి వాటిని నిషేధించడమయినది. అప్పుడప్పుడు తప్పని సరి పరిస్థితులలో అంటే నాన్నా మన కాలరు పట్టుకుని నోట్లో పెట్టినప్పుడు తప్ప వేపను మన శరీరం దగ్గిరికి రానిచ్చేవాళ్ళం కాదు.
ఇంత చేసి మజ్జిగ చిలుకుతున్న అవ్వ దగ్గిరికి బొయ్యేసరికి కవ్వం మాత్రం కనిపిస్తా ఎక్కిరిస్తా వుంటాది. అయినా మనం వదలకుండా ఆ కవ్వానికి అక్కడక్కడ అతుకున్న ఎన్నని జాగ్రత్త గా నాలుకతో శుభ్రం చేసేవాళ్ళం. ఎవురూ చూసే వాళ్ళు గాదు చూసినా నాకు కనిపించేవాళ్ళు గాదు. ఇంగ ముద్దలు జేసిన ఎన్న యాడుందో కనుక్కోవడం మన తక్షణ కర్తవ్యం. ఇంట్లో పైన ఒక పెద్ద ఎదురు బొంగు అడ్డంగా ఏలాడదియ్యబడి దానికింద అయిదు ఉట్ట్లు(మంచి దారంతో పేనినవి) ఏలాడదీసి వుంటాయి. అన్నిట్లోనూ నల్ల ముంతలు రక రకాల సైజుల్లో ఒక దాని మీద ఒకటి పెట్టి వుంటాయి. మన జ్ఞాపక శక్తికి పరీక్ష అక్కడే వుంటుంది. అవ్వ మాత్రం ఒకే ముంత వాడుతుంది ఆ ముంత వున్న చోటు మాత్రం ఒగ వుట్టి మీదనుంచి ఇంగో వుట్టి మీదకు మార్చేస్తా వుంటుంది. ఆ రోజు ఎన్న పెట్టిన ముంతకు ఎక్కడో ఒగ చోట కొంచెం తేమ వుంటుంది. అదే మనకు పెద్ద బండ గుర్తు. దాన్ని గుర్తు బెట్టుకుని ఇంట్లో అందరూ ఏ చేనికాడకో వంక కాడికో బొయినప్పుడు మన దొంగ కార్యక్రమాలు మొదలవుతాయి.
ఉట్టి అంత ఎత్తుకు ఎక్కడం మన సైజు పిలకాయలకు చేత కాదు. అందుకని మామ కూతుళ్ళలో(అందురూ నాకన్నా పెద్ద వాళ్ళే వయసులోనే కాదు హైటు లో కూడా..ఒక అమ్మాయి తప్ప) ఎవురో ఒగర్ని మచ్చిక చేసుకుని వాళ్ళకు ఏందన్నా కావాలంటే అది యాడుందో (మీరు మరిచిపొయింటే....మనకు జ్ఞాపక శక్తి ఎక్కువ) మనం చెప్పి ఇంట్లోకి తీసుకుని వచ్చేవాళ్ళం. ఇంకేం..వాళ్ళు కింద వంగుంటే మనం వాళ్ళ వీపు పైకెక్కి ఆ సట్లోని ఎన్న ముద్ద మీద శ్రీరాముడు ఉడుత వీపు మీద చేతి వేళ్ళతో నిమిరినట్టు నా మూడు వేళ్ళను ఎన్న మీద రాపాడించి దాన్ని నోట్లో కరిగించి మళ్ళీ ఎన్న ముద్ద మీద రాపాడించి..(అలా ఓ పది తూర్లు లేక కడుపు నిండేవరకు ఏది ముందు జరిగితే అది) కిందకు దిగి ఆ వీపు సాయం జెసినోళ్ళకు వాళ్ళ ఋణం బెట్టుకోకుండా వాళ్ళగ్గావాల్సిన సామాన్లు చూపిచ్చే వాణ్ణి.
పొద్దున్నే పిండిన పాలను కాసేదానికి మళ్ళీ పొయ్యి బెట్టకుండా వండే పని అయిబొయ్యినంక ఆ పొయ్యి లో పిడకలు యేసి లేదా పొయ్యి లోని నిప్పులు ఆ పక్కకి ఈ పక్కకి తిప్పి ఆ వేడికే పాలు చిక్కగా కాచేవాళ్ళు. ఇట్లా పాల కుండ పొయ్యి మింద బెట్టి బోయినారంటే మనకు పండగే పండగ. అదే మీగడ పండగ. అట్ల పొయ్యి మీద బెట్టిన పాలు చిక్కగా మరిగి మీగడ మందంగా పేరుకును పొయుంటాది. వేలు బెట్టి తీస్తే వేలు కాలుతుంది..నోరూ కాలుతుంది. అందుకని ఆ పొయ్యి కాడ వున్న చిన్న పుల్లని తీసుకుని( వాటిని గప్ చీప్ కంపలంటారు) దాన్ని ఆ సట్టిలో పెట్టి మీగడ మీద కర్ర సాము తిప్పినట్టు తిప్పి మీగడంతా అతుక్కుణ్ణాకా పైకి లేపి నోటితో ఆ మీగడ వేడిని వూదేసి లటుక్కుమని నోట్లే వేసుకుంటే మాయ మయి బొయ్యేది. ఏదీ దొరక్క పోతే లోట తెచ్చుకుని ఆ సట్లో పాలు పోసుకుని ఆ లోటాని తొట్లో నీళ్ళ మీద ఈత కొట్టిచ్చి చల్లగయిపోనంక తాగేసేవాడిని.
ఎబ్బుడన్నా మా యవ్వ జూసి. "ఏమిప్పా సట్లో పాల్లు పొయ్యి మీదున్నట్లే ఎట్లయిపోయినాయి" అనేది.
"ఆ తెల్ల పిల్లి పాలు తాగేసింటిందిలే అవ్వా, నేనిబ్బు డే జూసినా ఆ పిల్లి మీసాలకున్న పాలు నాకతావుంటే " ఆహా మన తెలివి.
"అవున్లేప్పా రెండు కాళ్ళ పిల్లి తాగేసింటిందిలే" నవ్వుకుంటూ అవ్వ అనేది.
నేను ఆరేళ్ళ వయసులో వున్నప్పుడు బాగా జబ్బు చేస్తే మదనపల్లి గౌషాస్పటల్ (MLL hospital) అడ్మిట్ చేసినారు.
నన్ను చూసేదానికి మా యవ్వ, మామ అందురూ వొచ్చినారు. ఆస్పత్రి లోనే కొన్నాళ్ళుండల్లని చేప్పేసరికి మా మామ గూడా ఆడ్నే ఆస్పత్రి లో వుండిపొయినాడు. ఆయనకు వార్తలు వినకపోతే ఏమీ తోచేది కాదు. వూర్లో అయితే తెరలాంటి యాంటన్నా వున్న పెద్ద వ్యాక్యూం ట్యూబ్ రేడియో వుండేటిది. అది స్టార్ట్ అయ్యేదానికి రెండు నిమిషాలు పట్టేది. వ్యాక్యూం ట్యూబులు వేడెక్కళ్ళంటే మాటలా. ఎందుకైనా మంచిదని మదనపల్లి టవును కొచ్చాం కదా అని అప్పారావు వీధిలో ఒక మంచి ఫిలిప్స్ రేడియో కొన్నాడు. అది హాలండ్ లో తయారయిందని గొప్పగ చెప్పేవాడు. దాన్ని కొనుక్కొనొచ్చి సాయంత్రం మాకూ ఇంగా ఆస్పత్రి లో వున్న వాల్లందురుకి పాటలు వార్తలు ఇనిపిచ్చి చూపిచ్చినాడు. ఆ మరుసుటి దినం ఎదో కొనల్లని ఆస్పత్రి లో నా బెడ్డు పక్కన్నే రేడియో పెట్టి బయటికి బొయినాడు. మా యమ్మేమో ఆస్పత్రి లో పక్కనున్న బెడ్లమీద పేషంట్ల తో మాట్లాడేదానికి బొయ్యింది. ఇంగ జూసుకో మన పక్క రేడియో దానిపక్కన చక్కిర కలపేదానికి పెట్టిన స్పూను (మనకు మంచి పని ముట్టు). మా మామ తిరిగొచ్చేసరికి ఆ రేడియో కవరు ఒగ జోట, సెల్సులు(బ్యాటరీలు) ఒగ జోట, రేడియో పార్ట్లన్నీ ఒగ జోట. మా మామ మొగం చూడల్ల. ఎంతో అపురూపంగా కొనుక్కున్న రేడియో అట్ల అయిబొయ్యేసరికి ఏమీ మాట్లాడలేక ఆ పార్ట్లన్నీ తీస్కోని బొయ్యి రిపేరు చేస్కొని వూరికి తీసుకొని బొయినాడు.
మా యవ్వేమో "అమ్మణ్ణీ వీడు ఇంజినీరు అవుతాడు" అని అప్పుడే చెప్పింది. పేరుకయితే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివాం కాని చేస్తున్నది మాత్ర ఐ.టి. ఉద్యోగం. ఆ రేడియో ప్రయోగం వల్ల ఎబ్బుడు వూరికి బొయినా మా మామ రిపేరు పన్లంటికీ నన్నే పిలిచేవాడు.
(సశేషం)