Thursday, April 26, 2007

భక్తుల మొర ఆలకిస్తాను కానీ.....

తలకోన అడవుల్లో కోతుల గుంపు సమావేశమయింది. అవి రెండు వర్గాలు గా చీలిపోయాయి. ఒకటి స్థానిక కోతులగుంపు ఇంకోటి తిరుమల కాందిశీకుల గుంపు.

స్థా.కో. గుంపు తి.కాం. గుంపు ని తిడుతున్నాయి. "మీరు రాక ముందు మాకు ఇక్కడ అన్నీ చక్కగా దొరికేవి వున్నంతలో హాయిగా తిని తల్లో పేన్లు(పేలు) చూసుకుంటూ చెట్లకు వేలాడు కుంటుండేవాళ్ళం. మీరొచ్చిన తరువాతే మాకు మేత దొరకడం కష్టమయిపోయింది"

తి.కో.గుంపు వాటికి సమాధాన మిస్తూ "మేము మీలాగా ఏది దొరికితే అది తినే టైపు కాదు. భక్తులు ఎక్కడెక్కడినుండో తెచ్చిన అరటి పళ్ళు, పులిహోర పట్లాలు, దద్ధోజనాలు తిని ఆరొగ్యంగా పిల్లా పాపలతో కాపురం చేసుకునే వారసులకు చెందిన వాళ్ళం. మేము చాలా నాగరికంగా బతికేవాళ్ళం. మీలా ఎక్కడ పడితే అక్కడ నిద్దర పోయే టైపు కాదు"

"చాలు చాల్లే సంబడం. ఎక్కడినుండో వచ్చి ఇక్కడ సెటిలయింది చాలక మళ్ళీ మా బతుకులు మంచివి కావి అంటారా? ముందు మిమ్మల్నిక్కడినుండి తరిమేస్తే కానీ మీకు బుద్ధి రాదు".

అంతలో తి.కా. గుంపు లోనుండి బాగ వయసు పైబడ్డ ముసలి కోతి రెండు పిల్ల కోతుల సాయంతో లేచి నిలబడి "ఆగండర్రా, మీరు కూడా ఇలా మనుషుళ్ళా పోట్లాడేసుకుంటే ఎలా? మనం మనిషిగా రూపాంతరం చెందే వయసు అప్పుడే వచ్చినట్టు ఇలా మాట్లాడు కోవడం ఏమీ బాగోలేదు."

స్థా.కో.గుంపు లో మాంచి పొగరు మీదున్న యువ కోతి మాట్లాడుతూ " ఏయ్! ముసలి కోతి నీకు తిరుపతి కొండ మీద తిన్న లడ్లూ, వడలూ ఇంకా అరిగినట్లు లేదు. మాకు నీతులు భోధిస్తావా? చూడు నిన్నేం చేస్తానో" అని మీదికి రాబోయింది. తాతల కాలం లో తి.కాం.కో. గుంపు తో సంబంధాలు కలిసి వున్న స్థా.కో. గుంపు లోని ముసలి కోతి "ఆగవే పిల్ల కోతీ, మనుషుల్లా మాట్లాడక కాస్త కోతిలా ప్రవర్తించు" అని గదమాయించింది. పోగరు కోతి కాస్త చల్ల బడింది.

తిరుమల నుండి వచ్చిన ముసలి కోతి చెప్పనారంభించింది.
"ఇరవై సంవత్సరాల క్రితం.. మేము ఇక్కడికెందుకు వచ్చామో ఏలా రాబడ్డామో వివరిస్తా. కాస్త ఓపిక తెచ్చుకుని వినండి. అప్పుడు నాకు ఒక సంవత్సరం వయసనుకుంటా......"


********* *******

తిరుమలలో వున్న 8 రేకుల షెడ్డు క్యూ కాంప్లెక్సులన్నీ వచ్చిన భక్తులతో కిట కిట లాడుతున్నాయి. అసలే ఎండా కాలం. చంటి పిల్లలు వేడికి తాళ లేక ఏడుస్తుంటే తల్లులు తమ చీర కొంగులే విసన కర్రలుగా చేసి విసురు తున్నారు. గుండు కొట్టించుకున్న కొంత మంది తండ్రులు తలకు చుట్టుకున్న తువ్వాళ్ళు తీసి పిల్లలకు, పెళ్ళాలకు విసనకర్ర లా వీస్తూ అప్పుడప్పుడూ చెమట పట్టిన గుండు తుడుచుకుంటున్నారు. షెడ్లన్నీ అరుపులు కేకలతో గుయ్యిమని శబ్దం చేస్తున్నాయి. ఒక షెడ్లోని గేటు తియ్యగానే మిగతా షెడ్లోని జనాలు ఆదరా బాదరగా లేచి బుడ్డోళ్ళని భుజాల మీదకి ఎత్తుకొని పరుగులు పెట్టడానికి తయారవుతున్నారు. అప్పుడే చెవులు కుట్టించుకున్న బుడిగిలు కాస్తా భే... అంటూ ఏడుపులంఖించు కుంటున్నారు.

అప్పటి వరకు షెడ్లోని పై కప్పులకే పరిమిత మయిన కోతుల గుంపులోని ఒక కోతి ఇదే సందుగా భావించి ఆ కదులుతున్న జనాల మీదకు పడి ఒక పల్లెటూరాయన చేతిలోని తువ్వాలు తీసుకుని పైకెగిరి ఆ ఇనుప కమ్మీల మీద కూచుంది. ఆ పల్లెటూరాయన తిట్లు అందుకున్నాడు "థూ..నీయవ్వ.. ఈ కోతులు..నిన్నేసేస్తా" అని స్థంభం పట్టుకుని ఎక్క బోయాడు.

అంతలో ఓ పెద్దావిడ అడ్డమొచ్చి "చూణ్ణాయనా, నువ్వు దాన్ని పట్టుకోలేవు గానీ, నీ సేతిలో వుండే అరిటి కాయిని దాని మిందకు ఇసిరెయ్ అబ్బుడు ఆ కోతి నీ టవలు కింద పడేస్తుంది" అని చెప్పింది. ఇదేం కిటుకు రా అని ఆ పల్లె టూరాయన చుట్టు పక్కల వున్న షెడ్లు చూశాడు. కొన్ని కోతుల చేతిలో టోపీలు, ఇంకొన్ని కోతుల చేతిలో టవళ్ళు, ఇంకొన్ని కోతుల దగ్గర విసన కర్రలు. పెద్దామె చెప్పింది కదా అని చేతిలో అరటి పండు ఆ కోతి మీదకు వెయ్యగానే టక్కున అరటి పండు పట్టుకొని టవల్ కింద పడేసింది. గుండు కనిపిస్తే కనిపిస్తుందిలెమ్మని ఆ టవల్ ని నడుముకు చుట్టుకున్నాడు ఈ సారి. అరటి పండు తిన్న వెంటనే వేరే బకరా కోసం ఇంకో షెడ్లోకి వెళ్ళి పోయింది ఏడాది వయస్సున్న ఆ కోతి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇలాంటి ఎక్స్చెంజ్ ఆఫర్లో నిజాయితీని చూసి కిడ్నాపర్లు ఎంతో నేర్చుకోవాలి.

అలా రోజూ భక్తుల దగ్గర నుండి ఏదో ఒకటి కిడ్నాప్ చేసి దానికి ప్రతిగా తమ పొట్ట (పొట్ట నిండాక దవడ దగ్గర స్టోర్ చేసుకునే సదుపాయం కూడా) నింపుకుని దిన దిన ప్రవర్ధమానం చెందుతున్న కోతుల బెడదని అరికట్టాలని తి.తి.దే.పాలక వర్గం నిర్ణయించింది. కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే ఈ కోతులని తరిమేస్తే భక్తులకు సౌకర్యంగా(???) వుంటుందని కోతులను పట్టే వాళ్ళను తీసుకు వచ్చారు.

వాళ్ళు దొరికిన కోతిని దొరికినట్లు వ్యాన్లలో కుక్కేసి తిరుపతి చుట్టుపక్కల నున్న తల కోన, పెంచల కోన, భాకరాపేట అడవుల్లో వదిలేసి వచ్చారు.

********* *******

"అలా నన్నూ ఓ వ్యాన్లో కుక్కేసి ఇక్కడికి తీసుకు వచ్చి పడేశారు. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని వెళ్ళి పోమంటే మేమెక్కడికెళ్తాం." అని కంట తడి పెట్టుకుంది.

"భక్తులకు అసౌకర్య మౌతుందని మిమ్మల్ని ఇక్కడి పంపించేశారు కదా. మీరు ఇప్పుడూ ఆ వేంకటేశ్వర స్వామి దగ్గరకెళ్ళి మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు అసౌకర్యంగా వుందని చెప్పి ఏదయినా ఉపాయముంటే ఆయన్నే సెలవివ్వమని అడగండి" అని తీర్మానించింది స్థా.కో. గుంపు.

ఇక చేసేదేమీ లేక ఆ ముసలి కోతి ఇంకో మూడు కోతులను వెంట బెట్టుకుని వేంకటేశ్వర స్వామిని కలుద్దామని తిరుమల చేరుకుంది. క్యూ లైన్ననీ ఖాళీగా కనిపించాయి. అక్కడ గుడి ప్రాకారం తప్ప ఇంకేమీ గుర్తు పట్టలేక పోయింది. పెద్ద పెద్ద క్యూ కాంప్లెక్సులు, కొత్త కాటేజీలు ఎక్కడికో మారిపోయిన కళ్యాణ కట్ట, అందులో ఆడ క్షురకులు, కనిపించని వేయి స్థంభాల మంటపం ఇవన్నీ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తను చిన్నప్పుడు పరుగులు పెట్టిన రేకుల షెడ్డు లాంటిది ఒకటి కోనేటి దగ్గర కనిపించగానే కళ్ళ వెంబడి నీళ్ళు జల జల రాలాయి. ఆపసోపాలు పడుతూ ఎలాగోలా ఆ షెడ్డులో కి దూరింది. పాత ఆనవాళ్ళేమీ లేవు ఇప్పుడక్కడ. అలా అంతా పరికించి చూస్తుంటే షెడ్డు లోనుండి విమాన వేంకటేశ్వర స్వామి కనిపించగానే చేతులెత్తి దండం పెట్టింది.

అంతలో కింద ఎదో కల కలం మొదలయిందని చూస్తే తి.తి.దే. పని చేసే వాళ్ళు ఈ కోతుల వైపు చూస్తూ ఏదో అరుస్తున్నారు. అప్పుడర్థమయింది తమని తరమడానికి వెంట పడుతున్నారని. మిగతా మూడు కోతులతో కలిసి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కి గుడి మహాద్వారం దగ్గర నున్న సహస్ర
దీపారాధన భవనం వెనక నక్కి కూచున్నాయి. మళ్ళీ ఏదో అలికిడి అయితే లేచి చూసింది. ఈ సారి తమని తరమట్లేదు, పోలీసులు గుడి ముందున్న జనాలని లాఠీ చార్జ్ చేసి నెట్టి వేస్తున్నారు.

గుడి ముందు లాఠీ చార్జేమిటి అని అలోచిస్తూ వుండగా గమనించింది. అభిషేక్ బచ్చన్, తన సతీమణి ఐశ్వర బచ్చన్, అమితాబ్ బచ్చన్, అనిల్ అంబాని, అమర్ సింగ్ అందరూ మహాద్వారం గుండా లోపలికెళ్తున్నారు. క్యూ లైన్లన్నీ ఖాళీగ వుండటానికి కారణం అప్పుడర్థమయింది
మన అన్న ఎన్టీయార్ వున్నప్పుడు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ తప్ప ఎవ్వరూ నేరుగా గుడిలోకి వెళ్ళ కూడదని శాశనం చేశాడు కానీ ఎవ్వరూ పాటించడం లేదు అనుకుంది. ఓ రెండు గంటలయి పోయాక వాళ్ళు చేతులూపుకుంటూ బయటికి వచ్చి వెళ్ళి పోయారు.

పగలు వెళితే ఎవరైనా చూస్తారు అని రాత్రి వెళ్ళి దేవుణ్ణి కలుద్దాం అని నిర్ణయించాయి నాలుగు కోతులు కలిసి. అది కూడా గుడీ తలుపులు మూసి వేశాక అని అనుకున్నాయి. రాత్రి ఒంటి గంటప్పుడు చప్పుడు చేయకుండా గుడి ప్రాకారాన్ని దాటి గర్భ గుడిలోకి ప్రవేశిస్తూ వుండగా ఏవో మాటలు వినిపిస్తే బయటే ఆగి పోయాయి.

"అదేమిటి స్వామీ మీ భక్తులకు అంతగా ఇబ్బంది కలుగచేస్తూ ఈ ముఖానికి రంగు వేసుకునే వాళ్ళకు గంటలకు గంటలు దర్శనమిస్తున్నారు. ఆ సమయాన్ని ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మీ దర్శనానికొచ్చిన సామాన్య భక్తులకు కేటాయించొచ్చు కదా?" అడుగుతోంది పద్మావతీ దేవి.

"ఏం చెయ్యమంటావు దేవీ, వీళ్ళు రావడానికి ఓ వారం రోజుల ముందే అనిల్ అంబానీ, అమర్ సింగ్ వాళ్ళ వాళ్ళు వచ్చి నా హుండీ తలో 51 లక్షలు వేశారు" సమాధాన మిస్తున్నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి.

"అంటే డబ్బులు ఇచ్చిన వారి పక్షమా మీరు?"

"అలా కొప్పడకు దేవీ నీకు తెలుసు కదా మన పెళ్ళికి డబ్బెంత ఖర్చయిందో"

"వాళ్ళు డబ్బులిస్తే మిగతా వాళ్ళను అలా పడిగాపులు కాయిస్తారా?"

"ఆ..ఆ..అలా కాదు సామాన్య భక్తులు వేచి వుండటం లో ఆనందముందని భావిస్తారు. అందుకే వాళ్ళకు ఇంకొంత ఆనందాని ప్రసాదిస్తున్నాను."

"ఇలా చేస్తున్నందుకు మీకు అపవాదు లొస్తాయని తెలీదా నాదా?"

"అపవాదులు నాకు కాదు. ఈ పాలక మండలి వాళ్ళకి. అప్పుడే ఒక విచారణ కమిటీ కూడా వేశారు ఎందుకు అలా ఒక గంట సేపు సమయాన్ని వాళ్ళకు ఇచ్చావు అని. ఇప్పుడు ఇందులో పాలు పంచుకున్న వాళ్ళందరిని కాపాడటం కూడా నా బాధ్యతే".

"అంటే మీరు సామాన్యుల మొర ఆలకించరా?"

"ఆలకిస్తాను కానీ....."

ఇవన్నీ బయటి నుండి విన్న పండు కోతికి అర్థమయి పోయింది తన విన్నపాలు ఆలకించే స్థితిలో స్వామి లేడని. తన తిప్పలేవో తనే పడుకోవాలి అని మిగతా కోతులతో కలిసి తిరుగు ప్రయాణ మయింది తలకోన అడవులకు.

11 comments:

radhika said...

కధ ప్రారంభం చూసి నిన్నటి రానారే కధకి పేరడీ అనుకున్నాను.తరువాత తరువాత కధలోని వ్యంగ్యం లో నిజాలు చదివి బాధపడ్డాను.అయితే ఆయన వడ్డికాసుల వాడే అన్నమాట.

కొత్త పాళీ said...

నామాల విహారీ?

ప్రవీణ్ గార్లపాటి said...

మంచి చురకే. ఈ రోజు న్యూస్ చూశారా ?
ఇక నుండి తిరుపతి లో కేవలం ప్రోటోకాల్ నేతల కు మాత్రమే వీఐపి దర్శనం అట. ఇదెన్నాళ్ళు సాగుతుందో.

ప్రసాద్ said...

కథనం చాలా బాగుంది. అక్కడ కాకులు, ఇక్కడ కోతులు గోల చేయడం కాక(కి)తాళీయమా, కోతితాళియమా? :)

ఏదేమయితేనేం, స్వామి డబ్బులున్నవాడి పక్షమే అని చక్కగా చెప్పారు!


--ఫ్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

@ రాధిక గారూ,

మీరు చెప్పేంత వరకు నేను రానారె బ్లాగు చదవలేదు. ఇప్పుడే చదివొచ్చా. ఆ కాకులు ప్రజల గురించి మాట్లాడుకుంటే ఈ కోతులు దేవుడి గురించి అలోచించాయి.

@ కొత్త పాళీ గారూ,

అది తిట్టా? పొగడ్తా?. మధ్యలో ఆపేశారు మీరే సెలవియ్యాలి.:-)

@ ప్రవీణ్ గారూ,

ఎన్ని శాశనాలు చేసి ఏమి లాభం. ఆచరించే వాళ్ళు వుండాలి గా. అదేం ఖర్మో ఈ కాంగ్రేస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతాయో లేక అప్పుడే పత్రికల వారికి వాళ్ళ ధర్మం గుర్తొస్తుందో తెలీదు.

@ ప్రసాద్ గారూ,

ఇందాకే చెప్పినట్టు ఆ కాకి వేరు, ఈ కోతి వేరు.
"గొప్ప బుర్రలు ఒక్కలాగే ఆలోచిస్తాయి" మరి.

రానారె said...

1996లో నేను మొదటిసారి తిరుమల వెళ్లాను. అప్పుడు టి.ఎన్.శేషన్ వచ్చాడని స్వామివారు మాకు 4గంటల ఎక్కువ ఆనందం పంచారు.

"ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇలాంటి ఎక్స్చెంజ్ ఆఫర్లో నిజాయితీని చూసి కిడ్నాపర్లు ఎంతో నేర్చుకోవాలి." - గొప్పబుర్రల ఆలోచనలు. లోకకల్యాణానికే ;-)

రానారె said...

అన్నట్టు చెప్పడం మరిచాను, స్వామివారు పంచిన 4గంటల ఎక్స్ట్రా ఆనందం వలన నేను నేర్చికొన్నదేమంటే, ఆ ఆనందాన్ని షెడ్డుల్లో, క్యూలలో అనుభవించే బదులు బయట పార్కుల్లోనో లేక కొండదిగి సినిమాహాళ్లలోనో ఆనందించవచ్చని. ఆతరువాత ఒక సారి వెళ్లానుగానీ స్వామిని పలకరించడానికి కాదు, కేవలం ఆ కొండ ఎక్కడంలోని మజా కోసమే. ఇదీ స్వామిపంచిన ఆనందమే కావచ్చు.

Nagaraju Pappu said...

విహారి, సునిశిత హాస్యరస విహారీ, నవరస విహారీ:
మీరు రోజుకో టపా రాయకపోతె ఇకముందు నిరాహార దీక్ష చెయ్యాల్సిఉంటుంది.

"కనిపించని వేయి స్థంభాల మంటపం ఇవన్నీ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయ"

మీ టపాలన్నిటిలో అద్భ్హుతమైన ప్రయోగాలుంటాయి. కోనసీమ కొబ్బరితోటంతా మీ పెరట్లో పెట్టుకొని, మీకెందుకుసార్ మా ఆవగింజలు?

కొత్త పాళీ said...

రెండూ కాదు - బిరుదు. అంతే.
ఆ తరవాత నాగరాజు గారు ఇంకొన్ని బిరుదులు తగిలించారుగా! :-)
అన్నట్టు ధదేఈశు జోకు లేదా? ఆ ప్రశ్నపత్రమేనా?
ఈ దేశంలో TGIFridays అని ఒక పానశాల గొలుసున్నట్టు మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు తిండి కూడా పెట్టినా అక్కడికి చేరేపక్షులు ఎక్కువగా దాహం పుచ్చుకోటానికి చేరేవే.
ధదేఈశు పేరుతో ఒక తెలుగు పానశాల మొదలు పెడదాం. అక్కడి ప్రత్యేక పానీయాలు - ధూల్ పేట గుడుంబా, తాజా తాటి కల్లు, నాటు సారా!

Anonymous said...

@ రానారె గారూ,

తిరుమలకు అంత తక్కువగా వెళ్ళారా?

మరి చూశారా స్వామి ఎంత ఆనందాన్ని ఇస్తాడో కదా!!!

@ నాగరాజు గారూ,

నాకయితే ఏమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు.

నా టపా కోసం నిరాహార దీక్ష చేస్తారా? ఏం మీరు సన్నగానే వున్నారు కదా ఇంకా సన్న బడాలనుకుంటున్నారా ఏమిటి? :-) నేను బ్లాగడమే మానేద్దామని ఓ రోజు తర్జన బర్జనలు పడ్డా. రోజుకో టపానా. సరే ఉద్యొగం ఉష్ కాకయిపోతుంది మరి మీ కన్సల్టింగ్ కంపెనీలో ఉద్యోగమిస్తారా?

మరదే. మీవి ఆవగింజ అణువు కాదు అదొక atom దానికి శక్తెక్కువ. ఫ్యూజన్(ఫిషనా?) ఎక్కువుంటుంది. నా కొబ్బరి తోటలో కొబ్బరి మట్ట, పీచు మాత్రమే వుంటుంది మరి :-)

@ కొత్త పాళి గారూ,

ద.దే.ఈ.శు. మళ్ళీ ప్రారంభిస్తా వెరైటీగా.

పాన శాలను ప్రారభిద్దాం. మన బ్లాగర్లలో అక్కిరాజు గారి వొల్డ్ మాంక్, పెప్సి గుర్తు చేశారు. ఆయనను పార్ట్నర్ గా చేస్తే మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంటుంది :-)

విహారి

leo said...

నేను క్రితం సారి వెళ్ళినప్పుడు నాకు కూడా అనుభవమైంది. క్రైస్థవులైన సోనియా, రాజసేఖర రెడ్డి ల కోసం అంత మంది భక్తులని ఇబ్బంది పెట్టటం బాధ కలిగించింది. చాలా చక్కగా చురకలు వేసారు.