Tuesday, November 27, 2007

క్లోజప్పూ కోల్గేటూ లైఫ్ బాయీ..




బ్లాగులో సొంత విషయాలు రాయ కూడదు అని గఠ్ఠిగా నిర్ణయించుకుని ఆ మాట మీదనే నిలబడి, వంగోని, కూచోని, పడుకొని వుంటున్న ఏకైక వ్యక్తిని నేనే. ఒక్క టపా పొస్టు చేసే ముందు నుండి పోస్టు అయిపోయేంతవరకు మాత్రం కొంచెం వెసులు బాటు కల్పించే దయార్ద కరుణామయుడైన ఏసు ప్రభువును, అడిగిన వెంటనే వరాలిచ్చే ఈశ్వరుడను, అడిగినోళ్ళందరికి ఇందిరమ్మ గృహాలిచ్చే అభినవ సర్ ఆర్థర్ కాటన్ దొర వై.ఎస్.ను కూడా నేనే.


ఈ మధ్య ఏది బ్లాగదామనిపించినా పెద్ద బుడ్డోడు చిన్న బుడ్డోడు చుట్టూనే తిరుగుతోంది. చంద్ర బాబు దగ్గుతూ “గర్జించు రైతూ..గాండ్రించు రైతూ” అని గర్జించినప్పుడు, కాంగ్రేసు సమావేశాల్లో “రావబ్బా...రాహూలూ...రావబ్బా...” అని పాడుతూ రాహూల్ గాంధిని పిలుస్తున్నప్పుడు , దేవేగౌడ నిద్దర్లోంచి లేచి “చూ మంతర్” అని యడుయూరప్ప కుర్చీ లాగేసి మళ్ళీ గురక పెట్టినప్పుడు కూడా అవుడియాలు రావడం లేదు. ఏమిటా అని ఆలోచిస్తే ఒక్క విషయం అవగతమైంది. ఈ మధ్యనే ఇక్కడి తెలుగు సంఘంలో నాలుగేళ్ళు పని చేసి స్టాన్ ఫోర్డు యూనివర్సిటీ లో ఎం.బి.ఏ. కన్నా ఎక్కువ అనుభవం సంపాదించి దీపావళి తారాజువ్వలాగా ఎగిరి అందులో మందు అయిపోయాకా భూమ్మీద కొచ్చా. మామూలుగా ఆఫీసులో గోళ్ళు గిల్లుకోవడం అయిపోయాకా సాయంత్రాల్లో మరియు శనాదివారాలో ఆ పని మీద కాళ్ళు గిల్లు కునే వాడిని. ఇప్పుడు ఆ పన్లు లేనందువల్ల లుంగీ కట్టుకుని ఇంట్లో బుడ్డోళ్ళని ఆడించే పన్లో వుంటున్నా. అమెరికా చలి కొంపల్లో లుంగీ లేంటి షరాయిలేసుకోకుండా అంటే కొన్ని శాల్తీలంతే గోదాట్లో, చౌడేపల్లి చెరువులో ఎన్ని సార్లు ఈదినా మారవు.


గతం:


లైఫ్ బాయ్ ఎక్కడ వుందో ఆరోగ్యం అక్కడ వుంది…ట్రిల్..ట్రిల్.. లైఫ్బాయ్…ట్రిల్..ట్రిల్..


అడ్వర్టైజ్మెంట్ అదయినా నేను భారత్ లో వున్నంత కాలం పియర్స్ సబ్బు, క్లోజప్పు పేస్టు వాడే వాడిని. పియర్స్ సబ్బేమో “ఆనాటికి ఈనాటికి కొందరి చర్మ సౌందర్యం ఒక్కటే. కారణం...పేర్స్...పేర్స్..” అంటుంది.యాదృచ్చికంగా అందులో చిన్న బుడ్డోడు బార్అనగాలేదా(/) బుడ్డిది వుంటుంది బార్అనగాలేదా(/) వుంటాడు. నేనేమో ఫ్రీ కరంటుకు పడి పోయిన రైతు లాగా చర్మ సౌందర్యం అలాగే వుంటుందని వాడా. మర్మం అర్థమయ్యేలోగా ఎఫెక్టేమో అంతః సౌందర్యానికి వచ్చింది. బహుశా “సీతయ్య” సినిమాలో హీరో కూడా ఈ సబ్బే వాడుంటాడు. (ఈ వాక్యం పైన చెప్పిన లుంగీకి సంబంధించినది. లింకిక్కడెందుకుందంటే నేను బ్లాగులు సరీగా రాయటం కుదరలేదని తెలుగు సినిమా రైటర్ బార్ అనగా మరియూ ఎడిటర్ ని నియమించుకొన్నా. అతను ఇచ్చిన సలహాలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నా. అలా పాటించకపోతే టపా ఫ్లాపని హెచ్చరించాడు. ఎడిటింగ్ లేకుండా చెప్పాలంటే ఇంకో మాట కూడా అన్నాడు. “నువ్వీ జన్మకు బాగు పడవు” అని. ముందు మాటకు ఈ మాటకు లింకేంటని అడిగితే తెలుగు ఎడిటర్ ని అవమాన పరుస్తావా? వెళ్ళి మైసమ్మ ఐ.పి.ఎస్. సినిమా చూడు లేక పోతే నేనే చూపిస్తా అని బెదిరించాడు.)


క్లోజప్ ఫార్ క్లోజ్ అప్స్….


ఇక క్లోజప్పు పేస్టు కొస్తే రెండు వారాలు తిరక్కనే క్లోజు అయిపోయేది. మా రూమ్మేట్లు కాలేజీ బిగినింగ్ అప్పుడు వాళ్ళూర్లో సెట్టంగట్లో కొనుక్కొచ్చిన కోల్గేట్ పేస్టు మాత్రం అట్లాగే వుండి ఎండాకాలం లీవుల్లో వాళ్ళూరికి పొయ్యేటప్పుడు తీసుకుని వెళ్ళి పోయేవాళ్ళు. మళ్ళీ కాలేజీ తెరిచినప్పుడు అదే పేస్టు తో వచ్చే వాళ్ళు. ఏమన్నా అడిగితే కొత్త పేస్టు అని చెప్పేవాళ్ళు. అదే పేస్టు కాలేజి చివరి రోజు ఆటోగ్రాఫ్ లో సంతకం పెట్టించుకునే రోజు వరకు వచ్చేది రిలే రన్నింగ్ లో స్టిక్కు లాగా. నా క్లోజప్పు పేస్టు చివరికొచ్చినప్పుడు దాన్ని తీసుకొని రోడ్డు రోలరు డ్రైవరు తో మాట్లాడి ట్యూబులో నుండి వచ్చే దాంట్లో చెరి సగం అని డీల్ మాట్లాడుకొని రోలరు తో ట్యూబు ను తొక్కించి పేస్టు బయటికి లాగే వాళ్ళు. కొత్తగా వచ్చిన రూమ్మేట్లు కూడా సాయంత్ర మైతే చాలు మొహమ్మీద నోరు పెట్టి “హా..హా” అని “వాసనొస్తుందా ” అని కనుక్కొని మరీ బాత్రూం లో దూరి డోర్ గట్టిగా క్లోజ్ చేసి క్లోజప్ సంహారం చేసే వాళ్ళు. వాళ్ళకు పాత రూమ్మేట్లు ఇన్స్పిరేషన్ అని ఆటోగ్రాఫ్ బుక్కులో రాసినప్పుడు కానీ నా గంట మోగ లేదు. జీవితంలో ఒక్క సారన్నా “క్లోజప్ దాతా సుఖీభవ” అని దీవించలేదు కృతఘ్నులు. పియర్స్ సబ్బు రుద్దుకునే వాళ్ళు కాదు అని మాత్రం అర్థం అయింది ఎందుకంటే వాళ్ళు నాలాగా సీతయ్యలు అయిపోలేదు.


కొస మెరుపు ఏంటంటే నా రిన్/డెట్ సబ్బు కూడా వాడే వాళ్ళు కాదు. కారణం జానా రెడ్డి ని అడిగినా తడుము కోకుండా చెప్పేస్తాడు. వాళ్ళు ఉతికిన బట్టలు వేసుకునే వాళ్ళు కాదు. ఐరన్ బాక్సు మాత్రం పాంట్లకు, చొక్కాలకు, బనీన్లకు వాడే వాళ్ళు. వాళ్ళు ఇస్త్రీ చేసిన తరువాత ఐరన్ బాక్సుని విమ్ పౌడర్ తో కడిగి వాడే వాడిని.


మళ్ళీ వర్తమానం:


చిన్న బుడ్డోడికి పైన మూడు పళ్ళు కింద మూడు పళ్ళు వచ్చాయి. వాడికి కోల్గేట్ పేస్టు చూపించగానే ఆరు పళ్ళూ బయట బెట్టి “పే..పే..” అని ముడ్డి ఊపుకుంటూ వచ్చేస్తాడు. ఇంకా క్లోజప్పు పేస్టు అలవాటు చెయ్యలేదు. పేస్టు మాత్రమే నోట్లో పెట్టు అని అరిచేంతలోపే బ్రష్షు మీద పేస్టు పెట్టి వాడి నోట్లోకి తొయ్యబడుతుంది. వాడు అలా బ్రష్షుతో పేస్టు చప్పరించినప్పుడల్లా రవితేజా లాగ కళ్ళద్దాలు పెట్టుకుని కుడి వైపుకి చూస్తూ

“గుర్తుకొస్తున్నాయి… గుర్తుకొస్తున్నాయి..
బాత్రూములో ఏ మూలనో పెట్టిన క్లోజప్పేస్టు..
రూమ్మేట్లు బొక్కిన రోజులు గుర్తుకొస్తున్నాయి..”

అని పాడు కుంటూ వుంటా. పెద్దోడేమో పేస్టు నోట్లో పెట్టుకుని “వన్..టూ..త్రీ .. “ అని పద్దాకా లెక్క పెట్టుకుని తోముకుం(తిం)టాడు. ఆ లెక్కలకర్థం పైకి పది సార్లు, కిందకి పది సార్లు, అడ్డంగా పది సార్లు, నిలువుగా పది సార్లు తోమాలన్నమాట.


కాలెజీలో క్లోజప్పయితే ఇప్పుడు కోల్గేటా అని పెళ్ళయిన వాళ్ళను అడక్కూడదు. చంద్ర మోహన్ సినిమాలు బాగా చూడాలంతే.




16 comments:

Dr.Pen said...

మళ్లీ మాంఛి ఫాంలోకి వచ్చారుగా! బాగా నవ్వుకొన్నా...అన్నట్టు కొద్ది రోజుల కిందే మీ దీపావళి సంబరాలు అంతర్జాలంలో చూశాను. మళ్లీ ఇలా...స్కిట్ ఏదైనా వేశారేంటి?

Naga Pochiraju said...

మీరు standford లో mba చేసారా??

ramya said...

మీ బుడ్డోన్ని ఓ సారి చూపించండి,చూడాలనివుంది

జ్యోతి said...

హి హి హి

లలిత
విహారి mba చేయలేదు ..అలా ఫీలయ్యా అని చెప్పాడన్నమాట.

Naga Pochiraju said...

అవునా...నేను ఇంకా విహారి గారి నుంచీ సలహాలు తీసుకుందామని అనుకున్నాను...

వికటకవి said...

ఎవరో మహానుభావుడు చెప్పినట్లు, ఎత్తుకు ఎదగటం ఓ ఎత్తైతే, దాన్ని నిలబెట్టుకోవటం మరో ఎత్తు. నో డౌట్, సచిన్ లాగా మళ్ళీ ఫాం లోకి వచ్చినట్లే. టూత్పేస్ట్, రోడ్ రోలర్ బాగా నవ్వు తెప్పించింది.

--వికటకవి

Unknown said...

హహ...
నాక్కూడా పేస్టంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తినే వాడిని. ఇప్పుడు చప్పరిస్తా

Chari Dingari said...

అదిరింది విహారీ.....ఇలాంటి పోస్టుల కోసమే....నా గూగుల్ రీడర్ లో నీ బ్లాగు పెట్టా......

రాధిక said...

అదిరింది ...బాగా నవ్వుకొన్నా.

శివకుమార్ said...

ఎప్పాట్లానే అదిరిందన్నా..

మీ బ్లాగంతా విశ్రాంతి లేకుండా నడిచి, పరిగెత్తి, ఎత్తు దుముకులు (high jump) & పొడవు దుముకులు (long jump) దూకాను. మొటిక్కాయలు కూడా తిన్నా (ఒక వర్గం నుండి ఇంకొ వర్గం లోకి దూకినపుడు మా ఆవిడ దగ్గర. ఇద్దరం కలిసి చదువుతాం. మా ఆవిడ ఆంగ్ల మాద్యమం వలన తెలుగు సన్నం (weak)). ఇక రెండు వర్గాలు మాత్రం బాకీ

శివకుమార్ దిన్నిపాటి. (మా ఆవిడ కూడా కామెంటారు కాని తనకు మనం ల్యప్టాప్ ఇస్తే కదా చా.బా.రా. అట.)
-ఓ తిర్పతోడు

Anonymous said...

@ స్మైల్ గారు,

స్కిట్టేమీ వెయ్యలేదు ఈసారి పనులు తడిసి మొపెడయ్యాయి.

నా ఫాము సరే మీరేంటి ఇలా మళ్ళీ బ్లాగుల వెంట పడ్డారు. మీ పేపరు గానీ లీకయిందా?

@ లలిత గారు,

అక్కడ ఎం.బి.ఏ. చేద్ద్దామని నా కోరిక గూడా. కానీ ఇప్పుడు అంత సీను లేదు నాకు. ఏమన్నా సహాయం కావాలా? మా ఆఫీసులో ఒకాయన అక్కడ ఎం.బి.ఏ. చేస్తున్నాడు. ఖర్చు ఓ పావు మిలియెనట. అక్కడ సీటొస్తే గూగుల్ సి.ఈ.ఓ., మైక్రొసాఫ్ట్ సి.ఐ.ఓ. లాంటి వాళ్ళ పక్కన కూర్చొని బఠాణీలు తింటూ పాఠాలు వినొచ్చు(ట).

@ రమ్య గారు,

ఫోటో బ్లాగు మొదలు పెట్టినప్పుడు చూపిస్తా.

@ జ్యొతక్కోయ్,

మూడు హి లేనా?

@ వికటకవి గారు,

ఏదో మీ అభిమానంతో అలా అంటున్నారు గానీ నేను నేల మీదనే వున్నా.

@ ప్రవీణ్,

ఎన్ని పేస్టులు కొంటారు వారానికి?

@ రాధిక గారు,

నెనర్లు.

@ శివ కుమార్ గారు,

ఏమిటి మీ ఆవిడకి ల్యాప్టాప్ ఇవ్వనంత ధైర్యమా మీకు?. ఓ సారి ఫోటో వుంటే పంపిస్తారా?

నెనర్లు.

-- విహారి

Anonymous said...

నరహరి గారు,

మీ అభిమానానికి ధన్యవాదాలు.

-- విహారి

చదువరి said...

తిరుపతి బ్రహ్మోత్సవాల కోసం..
http://www.tirupatitoday.com/

Dr.Pen said...

ఇక తప్పదు ఘాట్టిగా చెప్పాల్సిందే! నా పరీక్షలన్నీ ఎప్పుడో అయిపోయేయి...కానీ ఇంటర్వ్యూలంటూ దేశం నలుమూలలా తిరగాల్సివస్తోంది(గుడ్డిలో మెల్ల-టపాలకు వైవిధ్యమయిన సరుకూ దొరికిందనుకోండి, వివరాలు త్వరలో! ).మీలాగా హాయిగా అంతర్జాల దర్శనాలో లేక దూరవాణి సంభాషణలతోనో జరిగే పనిలా కాక, ఈ ముఖాముఖిల వల్ల పెద్ద చిక్కొచ్చి పడింది. అదీ సంగతి! ఇక అన్నీ చివరాఖరికొచ్చాయి. ఇంతలోనే మన బాబుగారు నన్ను బ్లాగ్లోకంలోకి మళ్లీ తోసారు. ఇక బాగా తిరగడం వల్ల జబ్బు పడి(ఫ్లూ) ఈ మూడు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో హాయిగా బజ్జుంటున్నాను. ఆ వెసులుబాటుతోనే ఈ వీరంగమంతా! అన్నట్టు మీ డెన్వర్లో మీకు బాగా తెలిసిన రెసిడెన్సీ ప్రోగ్రాం డైరట్రు ఉన్నాడేంటీ;-)

vaishnavi said...

HI HI HII chala bagunnai ardham chesukonte mana jeevithamlone hasyam undikada

పావనీలత (Pavani Latha) said...

మీ టపా చదువుతూ ఆఫీసులో ఉన్నానన్న సంగతి మరిచిపోయి మరీ చదివేసి మా బాస్ కు దొరికి పోయాను....అంతటిటో ఆగకుండా పదే పదే గుర్తు తెచ్చుకుని మరీ నవ్వేసరికి అదేంతో కనుక్కుందామని ఇంటరెష్టుతో నా సిస్టం లోకి తొంగి మరీ చూసారు,వాళ్ళెవరికీ తెలుగు రాదు కాబట్టి బతికిపోయాను...
చాలా చాలా బాగుంది....విహారి గారూ