Wednesday, August 13, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (ఒలంపిక్స్, పట్టుకుంటే పదివేలు, దేవుడు)

* * * * * * * *


"అయ్యా!"
"సిద్ధా!"

"ఈ సారి మనకు ఒలంపిక్స్ లో ఓ స్వర్ణం తెచ్చి మన త్రివర్ణాన్ని రెప రెప లాడించాడు గదా మన బింధ్రా."
"అవును. అభినవ్ భింద్రాను చూసి ఆసేతు హిమాచల మంతా ఆనంద డోలికల్లో మునిగి అణువు అణువునా పులకరిస్తోంది."

"ఇరవై నాలుగేళ్ళ కుర్రోడు, స్వతంత్ర భరతావని చరిత్రలో మొదటి సారి వ్యక్తిగత పతకమొస్తే అనిర్వచనీయమైన అనందంతో గంతు లేయకుండా స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంతంగా ఎలా వుండగలిగాడు"
"పోయినేడు రాథోడ్ కు రజితమొచ్చినప్పుడు ఆనందంతో గంతులెయ్యకుండా కుళ్ళు కున్నాడని అన్న వాళ్ళ నోళ్ళు మూయించడానికనుకుంటా"

"తనెప్పుడూ ఇలాగే వుంటాడేమో"
"అవును నాలాగా"

"ఇంకో మాట చెప్పండి"
"నీ ఎదుట నున్న వాడిలా"

"అది కూడ ఒద్దు గానీ ఇంకో మాట చెప్పండి"
"బుధ్ధా లా"

"సద్ది ముద్దేం కాదూ..?"
"ఏంట్రా నీలో నువ్వే గొణుక్కుంటున్నావ్?"

"ఆఁ ఏం లేదు. మీలా ముద్దుగా సుద్దులు చెప్పే బుద్ధులు లేరంటున్నారు"
"ఇప్పటికి నిజమొప్పుకున్నావ్ రా. నిన్ను చూస్తుంటే సొంత డబ్బుల్తో బీజింగ్ కు పంపించాలనిపిస్తోంది"

"అలానే అంటారు. మిమ్మల్ని నమ్ముకునేదానికన్నా ఏ వైయెస్సునో, సోనియాను నమ్ముకొనుంటే బావుండేది"
"నీకు సోనియాను, రాహూల్ ను బీజింగులో చూసినప్పటి నుండి ఎవేవో కోరికలు కలుగుతున్నాయిరా"

"భుట్టో ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ బీజింగ్ లో కలిశారు కదా ఏం మాట్లాడుకొనుంటారు?"
"మీ ఇంట్లో ఇద్దరు, మా ఇంట్లో ఇద్దరు"

"అంటే హత్య కావించ పడ్డవారనా?"
"ఈ బాంబులు, రైలు ప్రమాదాలు, వరదలు చూసి నువ్వలా అయిపోయావ్. నేను చెప్పింది అది కాదు. ప్రధాన మంత్రులు"

"భవిష్యత్తులో మన దేశానికి రాహుల్ ప్రధాన మంత్రయి, బిలావల్ జర్దారి పాకిస్తాన్ ప్రధాన మంత్రయితే ఏమవుతుంది?"
"వాళ్ళిద్దరూ ఒలంపిక్సులో మళ్ళీ ఓ టీ తాగుతారు.మనిద్దరం రెండు ఇడ్లీలు తింటుంటాం."

"అలా వాళ్ళిద్దరూ తాపీగా మాట్లాడుకుంటుంటే మనమెందుకు శతృ దేశం అని కొట్టుకోవాలి?"
"వాళ్ళని దేశాధినేతలుగా చూసి తరించుకోడానికి"

"మనోళ్ళు 56 మంది బీజింగ్ ఒలంపిక్స్ కు వెళ్ళారు కదా ఎన్ని పతకాలొస్తాయంటారు"
"వస్తాయి రెండో మూడో"

"ఓ వెయ్యి మంది ని పంపించుంటే ఇరవయ్యో ముప్పయ్యో వచ్చేటివి గదా?"
"అలా రావాలంటే కమల్ హాసన్ నో రజనీ కాంత్ నో పంపించాలి. ఒక్కోరు పది, వంద పతకాలు పట్టుకొచ్చే వాళ్ళు.”"

"అప్పుడు బుష్షూ, కమల్ హాసనూ కలిసుండే వాళ్ళు"
"ఎందుకు? దశావతారాల్లో బుష్షావతారం చూసేందుకా?"

"కాదులెండి. బుష్షు అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవయ్యాడు కదా?"
"ఏఁ ఇండియాకు ఏమన్నా గ్రాంటులిచ్చాడా?"

"గ్రాంటు ఇస్తే మారిన వాడు అవుతాడు కానీ ఇంప్రూవ్ అయినవాడు కాదు. చాన్నాళ్ళ కింద ప్రిట్జల్ తిని కళ్ళు తిరిగి కార్పెట్ మీద పడుకున్నాడు కదా. ఈ సారి ఒలంపిక్స్ చూస్తా నీళ్ళు తాగి కింద పడకుండా తమాయించుకున్నాడు."
"అదా. అవును చాలా చాకచక్యంగా, సాహసంగా, నైపుణ్యంగా, ఆత్మవిశ్వాసంతో తమాయించుకున్నాడు బాడీ గార్డుల సాయం తో. ఎంతయినా ఒలంపిక్స్ చూస్తున్నాడు గదా. కొంచెం లీనమయి పోయుంటాడు"

"వచ్చే ఏడు ఒలంపిక్సుకు మనము కూడా వెళ్దాం"
"అలాగలాగే. దానికి ఇప్పటి నుండే డబ్బు సంపాదించాలి గదా."

"నన్నపనేని రాజకుమారి పట్టుకుంటే రెండు పది వేలు బహుమానం ప్రకటించారు గదా ట్రై చేద్దామా?"
"ఎవర్ని"

"వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి ని"
"ఏం పర లోకాలకు బెర్తు గానీ రిజర్వ్ చేయించుకున్నావా? ఈ రోజుల్లో మంచి సంపాదన వచ్చేది రాజకీయ పార్టీల్లోనే.ఏ పార్టీ లో చేరుదాం చెప్పు"

"కొత్త పార్టీ లో చేరితే?"
"చిరంజీవి పార్టీనా? అది ప్రస్తుతానికి గిట్టు బాటు కాని వ్యవహారం. వాళ్ళు పదవిలోకొచ్చినా మొదటి సారి కదా డబ్బులు తినటానికి కొంచెం సంకోచిస్తారు. తెలుగు దేశం మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అన్నారు కదా. అలాగే కాంగ్రేస్ పార్టీ ఫరెవర్. అందులో దూకేద్దాం."

"జీవితం లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పార్టీలో చేరాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. మీ ఇంట్లో మీ పూర్వీకులు ఎక్కడన్నా, లంకె బిందెలు కానీ, వజ్రాలు దాచి పెట్టారేమో చూడండి. వాటి కోసం వెతుకుదాం"
"వజ్రాలుంటే ఎప్పుడో సూరత్ వెళ్ళి వ్యాపారం పెట్టుకొనుండే వాడిని"

"ఇప్పుడు సూరత్ లో కూడా వజ్రాలు దొరకడం లేదు. ఎక్కడ బడితే అక్కడ మిల మిల మెరిసే బాంబులే దొరుకుతున్నాయట"
"అలా అయితే మన అనంతపురం లోని వజ్ర కరూర్ లో వజ్రాలు దొరుకుతాయి కదా అక్కడ వెదుకుతాం"

"వెతుకుతారు... వెతుకుతారు... వుంటే గింటే మన దాకా రానిస్తారేంటి? ఇప్పుడు అక్కడ సీజ్ చేసిన బస్సులే దొరుకుతాయట"
"అనవసరంగా సీజ్ చేస్తున్నార్రా. చూడు జె.సి. ప్రభాకర్ రెడ్డి మనసెంత గాయపడి విల విల లాడిందో."

"అవునా?"
"అవున్రా.ఆయన మాట్లాడిన ప్రతి మాటని ఈ మీడియా వాళ్ళు వక్రీకరించారు. ఆ రోజు మాట్లాడిన టేపును తెప్పించి అందరికీ చూపించాడు. ఈ మీడియా వాళ్ళు కళ్ళున్న కబోది వాళ్ళు."

"అయ్యో పాపం. ఎంత పని జరిగింది. ఈ పేపరోళ్ళకు ఎప్పుడూ నీతి , నిఖార్సయిన వాళ్ళ మీదనే కళ్ళుంటాయి. కాంగ్రేసు లో నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడేవాళ్ళెంత మంది లేరు"
"కదా? కాంగ్రేస్ లో వుంటూ చిరంజీవి పార్టీ కోసం పని చేసే నీతి మంతులు కూడా వున్నారు"

"అనవసరంగా ఆయన్ని ఆడి పోసుకుంటారే. అమర్ నాథ్ దేవాలయం గొడవలో రాజీనామా చేసిన మంత్రుల్లేరా? వాళ్ళు మన దేశం లోనే వుండి ఎవరికో పని చెయ్యట్లా?"
"ఆ రూట్లో వచ్చావా? అయితే జోగయ్యా జిందాబాద్"

* * * * * * * *



"అయ్య గారూ, దేవుడి పాలన లో వరుణ దేవుడు కూడా వాళ్ళ పార్టీనే నటగా"
"అవును"

"మరి ఇలా వరదలెందుకొస్తున్నాయంటారు"
"అందరూ ఎమ్మెస్ సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి లా ఊరుకుంటారేంట"

"సొంత పార్టీ వాళ్ళు ఏం చేస్తారండి"
"మర్రి చెన్నా రెడ్డి ముఖ్య మంత్రి గా వున్నప్పుడు ఏం జరిగింది?"

"అంటే ఈ వాన"
"మరో దేవుడు నాయినా"

* * * * * * * *


"డాలర్లు ఎవరు సంపాదిస్తారు?"
"అమెరికా పోయినోళ్ళు, అమెరికా పోలేక టి.టి.డి.లో ఉద్యోగం సంపాదించుకున్నోళ్ళు"

* * * * * * * *

6 comments:

Rajendra Devarapalli said...

"డాలర్లు ఎవరు సంపాదిస్తారు?"
"అమెరికా పోయినోళ్ళు, అమెరికా పోలేక టి.టి.డి.లో ఉద్యోగం సంపాదించుకున్నోళ్ళు"
---:)

Madhu said...

భలే వున్నాయి మీ వ్యాఖ్యానాలు
అందుకోండి మా వందనాలు

ఏకాంతపు దిలీప్ said...

:-))))))))

సుజాత వేల్పూరి said...

డాలరు ఎవరు సంపాదిస్తారు?

హ హ హ !

Srividya said...

:)... :) :)

రానారె said...

మహానుభావా! మిమ్మల్ని యక్షుడుగానీ ప్రశ్నలు వేసుంటే మీ చాకచక్యానికి అబ్బురపడి పాండుసోదరులతో పాటు మాద్రిని, పాండురాజును కూడా బతికించేసేవాడు.