Friday, September 12, 2008

రాకీ పర్వత శ్రేణుల్లో హిందూ కుటుంబ శిబిరం.

* * * * * * * *



హిందు జగేతో.... విశ్వ జగె

జై జై గీత భగవద్గీత



వంటి నినాదాలతో శాంట మరియా క్యాంపు మారుమ్రోగింది. చాన్నాళ్ళ తరువాత ఎప్పటి వెప్పటివో తీపు గుర్తులు, ఉద్విగ్న క్షణాలు గుర్తుకు వచ్చాయి ఆ మూడు రోజులూ.

హెచ్.ఎస్.ఎస్., అమెరికా (హిందూ స్వయం సేవక్ సంఘ్) కొలరాడో విభాగం వారు ఆగస్టు 29-31 తేదీలలో హిందూ కుటుంబ శిబిరాన్ని నిర్వహించారు. డాదాపు ప్రతి సంవత్సరమూ జరిగే ఈ కుటుంబ శిబిరంలో ఈ సారి 45 కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ప్రవేశ రుసుము కట్టేస్తే మనము చెయ్యాల్సిన పనల్లా వాళ్ళు నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొని వాళ్ళు పెట్టే విందు భోజనాన్ని లాగించెయ్యడమే.

ఈ క్యాంపు (YMCA శాంట మారియా) డెన్వర్ కు తూర్పు దిశలో 60 మైళ్ళ దూరాన పచ్చని స్ప్రూస్, ఆస్పిన్ చెట్ల మధ్య ప్లాటె నదీ తీరాన వుంది. ఇక్కడికి సాయంత్రం 5 గంటలకే చేరుకోవాలని చెప్పడం వల్ల కార్యాలయానికి నాలుగు గంటలకే పెద్ద గంట కొట్టేసి ఇంటి నుండి 6 గంటలకు బయలు దేరాము. కొంత మంది తో కలిసి ర్యాలీ లాగా వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు. గమ్యానికి ఇరవై మైళ్ళ దూరంలో మా పర్మిషన్‌ లేకుండానే పెద్ద ర్యాలీ మొదలయింది కొన్ని వేల కార్లతో. ఆ ర్యాలీకి కారణం పెద్ద ట్రక్కు మామ. మామూలుగా పార్కు చేస్తే బాగోదని రోడ్డు మీద డై హార్డు బ్రూసు విల్లీసు లా పల్టీ కొట్టి అడ్డం తిప్పి సరదాగా పార్కు చేశాడు. ఎప్పుడో మధ్యాహ్నం 2:30 జరిగిన ఈ సరదా పార్కింగు రాత్రి ఎనిమిది గంటలకు కానీ క్లియర్ అవలేదు. ట్రక్కు మామ కే అంత సరదా వుంటే మాకు లేదా అని మేము కూడా కార్లు రోడ్డు మీద పార్కు చేసి "చెమ్మ చెక్కా చారడేసి మొగ్గ.." అని పాటలు పాడేశాం.

రాత్రి ఎనిమిదింటికి క్యాంపుసైటు కెళ్ళి "వచ్చేశామోచ్" అని అరవగానే ఇంటిల్లి పాదికీ డయపర్ బుడ్డోడితో సహా ఓ బ్యాడ్జి పెట్టి కొక్కీలేసేశారు. మా పేర్లున్న బ్యాడ్జి తిప్పి చూసుకుంటే ఆ మూడు రోజులు (రెండు రాత్రులు)మేముండాల్సిన క్యాబిన్ పేర్లు రాసున్నాయి. ఒక్కొకళ్ళు ఒక చోట. అవి చూసి ఆహా మా ఆవిడ పోరు లేదు.. మా ఆవిడ బెడ్డు ఈ రోజు సర్దక్కర లేదు అని మగాళ్ళందరూ చీర్సు చెప్పుకుంటూ బీరుంటే బావుందేది కదా అని బాద పడుతుండగా "తాజ్ మహల్ టీ, పార్లె-జి బిస్కత్తులు" అని అరిచారెవరో. లగెత్తుకెళ్ళి అవి లాగించి కూచున్నామో లేదో శాఖ జరుగుతోంది రండంటూ ఒక హాల్లోకి తీసుకెళ్ళారు.

ఆ హాల్లో, ఆ తరువాతి రెండు రోజులు ఏమి చెయ్యాలో చెప్పారు. ఏమేమి చెప్పారో గుర్తు లేదు గానీ పొద్దున ఆరింటికే లేవాలి అన్నది మాత్రం గుర్తుండి పోయింది. ఎందుకంటే జీవితం లో అత్యంత కష్టమైన పని పొద్దున 6 గంటలకు లేవడం. నయగరా జలపాతం లో దూకి ఆ జలపాత ధార ని పట్టుకొని పైకి పాకి రమ్మంటే వస్తా గానీ పొద్దున లేవడం అనేది..కష్టం.. కష్టం.. చాలా సార్లు. బాల గణ, స్త్రీ గణ, పురుష గణ అని వర్గాలు చేశారు. ఎప్పుడూ లైన్లో వుండవలసిందే. నేను ఇంత వరకు ఆర్.ఎస్.ఎస్., వి.హెచ్.పి. లాంటి వాటిలో కాలు, వేలే కాదు కన్ను కూడా పెట్టలేదు. అర్.ఎస్.యు. (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్) లో తల పెట్టే అవకాశం తప్పిపోయింది. అలాంటి నాకు ఈ కార్యక్రమాలు కొత్తగా, ఉత్సాహంగా అనిపించాయి.

ఈ క్యాంపు సైటు గురించి:

మొత్తం ఎనిమిది క్యాబిన్‌లు. ఒక చోటే అందరికీ భోజనాలు. సమావేశాలు జరుపుకోడానికి ఒక పెద్ద హాలు (సెయింట్ పాల్ హాలు). ఆడుకోడానికి చాలా పెద్ద స్థలం. పక్కనే ప్లాటే నది. ప్లాటే నది దాటగానే మరికొంత ఆట స్థలము, క్యాంపు ఫైర్ వేసుకునే చోటు. బోలెడంత పార్కింగు స్థలము. ఒక్క క్యాబిన్‌కు మాత్రం అతుక్కొన్న బాత్రూములు. మిగతా వాటికి విసిరేయ బడ్డ బాత్రూములు. అంటే దూరంగా వున్నవి అని అర్థం. ఈ క్యాబిన్‌లు కూడా ఒకదానికొకటి కనిపించవు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. అర్ధ రాత్రయినా అపరాత్రయినా ఆ చెట్లూ,పుట్టలూ దాటుకొని బాత్రూముకు వెళ్ళాల్సిందే. హైలైటెంటే దార్లో లైట్లుండవు. ఎలుగు బంట్లూ పాడూ కనిపిస్తే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ ఫ్రీ. పేరుకు ఎండాకాలమైనా చలి కాలం లా ఉష్ణోగ్రతలు పడి పోయాయి. ఈ క్యాంపు సైటు మొత్తం హిందూ ఫ్యామిలీ క్యాంపుకే బుక్ చేశారు.

క్రమ శిక్షణ..క్రమ శిక్షణ ఆల్ ద వే:

హెచ్.ఎస్.ఎస్. అంటే క్రమశిక్షణ కు మారు పేరు. సాయంత్రం పదింటికి నిద్ర పొమ్మని కంటి రెప్పలు కుట్టేస్తారు. పొద్దున ఆరింటికి వచ్చి మళ్ళీ కుట్లు విప్పి చెవిలో పీక ఊది నిద్ర లేపేస్తారు. భోజనానికి సమయమయిందంటే తీసుకెళ్ళి నోట్లో అన్నం పెట్టేస్తారు. ఇంక ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎలా జరుగుతాయో చెప్పనక్కరలేదు.

వెళ్ళిన రోజు మొదలయిన శాఖ మూడోరోజు మధ్యాహ్నానికి గానీ ముగియలేదు. రెండో రోజు సాయంత్రం క్యాంప్ ఫైర్ వేశారు. అక్కడ అందరూ పిల్లా పాపల్తో పాటలు పాడుకొన్నారు. మూడోరోజు కొండ మీదికి ట్రెక్కింగ్ వెళ్ళారు అందరూ. నేను వెళ్ళ లేదు. ఎందుకూ అంటే కొన్ని రహస్యాలు చెప్పకూడదు. కడుపు కట్ చేస్తే కాళ్ళ మీద పడుతుంది. అది బేబీ సిటింగ్ అని ఎవరికైనా అనుమానమొస్తే నేను చెప్పినట్లు కాదు. మీ తెలివి తేటలే. అద్దం ముందుకెళ్ళీ నిలబడి టోపీలు తీసేసుకోండి.

నా హిందీ:

ఓ సారి ఆటలు ఆడేటప్పుడు లైన్‌లో నుంచుని హిందీలో నంబర్లు చెప్పమన్నారు. నాకు హిందీ లో అంకెలు పాంచ్ దాటి చెప్పే పంచ్ లేదు. బాయ్ నయినా టాయ్ లా అన్న చిరంజీవి స్పీచ్ లా బిక్కు బిక్కు మంటూ నా ముందెంతమందున్నారో అని తెలుగు లో లెక్కేసుకున్నా. ఒకటి, రెండు, మూడు, నాలుగు.. అంతే. బతికి పోయా. పాంచ్ అయిదు..పాంచ్ అయిదు..అని వల్లె వేసుకొంటూ వుండగా నా నంబరు చెప్పమన్నారు. వెంటనే పాంచయిదు అని చెప్పేశా. ఏవరో చప్పట్లు కొట్టిన శబ్దం వినిపించింది వెంటనే. ఆవి కొట్టిన చేతులు మా ఆవిడవి , మా ఆవిడ ఒళ్ళో వున్న చిన్న బుడ్డోడివి. ఇంకొన్ని ఆటల్లో రెండు టీములు చెయ్యడానికి ఏక్, దో అని చెప్పమనే వాళ్ళు. అక్కడయితే కేకు నడకే. శాఖ జరిగేటప్పుడు సావధాన్, విశ్రామ్‌ అనే బదులు అదేదో ఆశిష్ట, వశిష్ట అన్నారు. అప్పుడైతే పుష్పక విమానంలో కమల్ హాసన్ ని మించిపోయా. తప్పు చేస్తే కర్ర తో కొడతారేమో నని లైను చివర్లో నిలబడే వాడిని.

ఆటలు..ఆటలు..:

ఆడే ఏ ఆటయినా రామాయణ భారతాలతో సంబంధం లేకుండా వుండదు. ఖో..ఖో బదులు, రాంఖో, లక్ష్మణ్ ఖో అనే వాళ్ళు.
రామ్‌ రావణ్ ఆట భలె వుంది. ఓక వైపు రామ్‌ టీము, ఇంకో వైపు రావణ్ టీము వుంటుంది. మధ్యలో ఓ గీతుంటుంది. ఫ్రచారక్ లు రామాయణ కథ చెబుతుంటారు. కథలో రామ్‌ అనే పేరు రాగానే రామ్‌ టీము వాళ్ళు రావణ్ టీమును వాళ్ళు సరిహద్దులు దాటక ముందే అంటుకోవాలి (టచ్ చెయ్యాలి). ఎంత మంది అంటుకో బడ్డారో వాళ్ళందరూ రామ్‌ టీం లో కొచ్చెయ్యాలి. అలాగే రావణ్ పేరు వచ్చినప్పుడు వాళ్ళు రామ్‌ టీమును అంటుకోవాలి. ఈ ఆటలో నేను రామ్‌ టీములో వున్నా. మా టీము గెలిచింది.

ఇంకోటి చేనా గోడ ఆట. రెండు టీములు అటూ ఇటూ వుంటే విజిల్ వెయ్యగానే ఒక టీము వాళ్ళు అవతలి టీమును దాటాలి. టీములొ ఒక్కళ్ళు దాట గలిగినా ఆ టీము గెలుస్తుంది. ఈ గేము మేమే గెలిచాం.

ఇంకోటి ఏ టీముకాటీము వృత్తాకారం లో చేతులతో లంకెలేసుకొని నడుస్తూ అవతలి టీము వాళ్ళ లింకులు పడ గొట్టాలి. ఇందులో కూడా మా టీమే గెలిచిందని సగర్వంగా చెప్పుకుంటున్నాను.

ఇంకోటి మాస్ గేం. నాలుగు టీములు తయారు చేశారు. వేదాలు నాలుగు చోట్ల దాచబడ్డాయి. ఒక్కో వేదం ఒక్కో చోట. ఒకటి శ్రీనగర్ లో, ఇంకోటి కలకత్త లో , ఇంకోటి బాంబే లో, ఇంకోటి కన్యా కుమారిలో. అన్నీ తీసుకొని చివరిగా నాగ్ పూర్ చేరుకోవాలి.కొంత మంది వాలంటీర్లు భారత దేశం పటం లో లాగా ఒక్కో చోటుకు(నగరానికి) ప్రతినిధి గా నిలబడి వుంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అవును, కాదు అని మాత్రమే సమాధానం చెబుతారు. మీకు బచ్చన్‌ తెలుసా, బాలకృష్ణ తెలుసా, ఇడ్లీలు తింటారా, చెట్నీ వేసుకుంటారా అని రక రకాల విసిగించే ప్రశ్నలు వేసి సమాధానాన్ని తెలుసుకొని ఇంకో దిక్కువైపుకు పకడ్బందీ గా వెళ్ళాలి. అలా అన్ని ప్రదేశాల్ని కనిపెట్టి అక్కడి వేదాల్ని తీసుకొని వాళ్ళిచ్చిన ఆ వేదాల్లోని కొన్ని శ్లోకాల్ని అక్కడే చదివి ఇంకో చోటుకి పరుగులు పెట్టాలి. వేదాలు చేతికి రావాలంటే మొత్తం టీమంతా అక్కడే వుండాలి. లెక్క పెట్టుకోని అందరూ వుంటే ఇస్తారు లేకుంటే లేదు. తొందరగా చేరాలని పరుగులు పెట్టి అన్నీ పూర్తి చేసుకోని చివరి మజిలీ హెడ్ క్యార్టర్సు నాగ్ పూర్ చేరుదామనుకుంటుంటే మా టీములో నున్న పెద్ద బుడ్డోడు నేను పరుగెత్తలేనని క్యాస్టింగేసిన చెయ్యి కూడా కలిపి చేతులు బారుగా పైకెత్తేశాడు. ఆంతకు ముందు వారమే మంకీ బార్ లోనుంచి తోసివేయబడి చెయ్యి ఫ్రాక్చర్ చేసుకొన్నాడు.ఇక వాడిని, వాడి క్యాస్టింగును భుజాల కెత్తుకోని పాము పూర్ చేరుకొని కప్పు కొట్టేశాం. ఎందుకంటే అప్పటికే విజయాలకు అలవాటు పడి పోయాం కదా.

శాఖ జరిగేటప్పుడు ఓ గ్రూపు డిస్కషన్ కూడా పెట్టారు. టాపిక్ ఏమో "What is hindu family means to you in America". ఇందులో మూడు టీములు గంగ, యమున , సరస్వతి అని. చాలా విలువైన విషయాలు చర్చించ బడ్డాయి. హిందూ ఫ్యామిలీ అంటే హిందూ సంస్కృతిని ప్రతిబింబ చేయడమని, పిల్లలకు గీత భోదించడమని, వసుదైక కుటుంబమని, అన్య మతస్తులను గౌరవించడమని.. ఇలా చాలా అర్థవంతమైన విషయాలు మాట్లాడుకోబడ్డాయి. ఇందులో గంగ టీము గెలిచింది. నేను గంగ టీములో లేను. ఇందాకా తీసేసిన టొపీ నెత్తి మీద బోర్లించుకోండి. మిమ్మల్ని డిసపాయింట్ చేసినందుకు బాధ పడుతున్నాను. కప్పులు తీసుకోవడం చిరాకు పుట్టి ఈ సారి వాళ్ళకు ప్రసాదించేశాం. ఇది నా దాతృత్వం అనుకుంటే మళ్ళీ అద్దం ముందుకెళ్ళి టోపీ తీసెయ్యండి. మళ్ళీ పెట్టుకునే అవసరం లేదు.

ఈ గ్రూపు డిస్కషన్ ని జయసింహ గారు తన హాస్యపు చణుకులతో ఆసక్తి కరంగా నిర్వహించారు.

నలుగురు తల్లులు, నలుగురు తండ్రులు కంగారు పడ్డ వేళ:

రెండో రోజు మధ్యాహ్నం ఒక వైపు శాఖ నడుస్తోంది. ఇంకో వైపు బాలగణ వాళ్ళ ఆట పాటల్లో మునిగి పోయారు. నాలుగు తెలుగు కుటుంబాలకు చెందిన 5 మంది పిల్లలు అదృశ్యం. ఆట స్థలం లో లేరు. శాఖ దగ్గర లేరు. బాలగణ వున్న చోట లేరు. ఇక ఆ నది వెంట పరుగులు, చెట్ల కిందకు ఉరుకులు. చివరిగా క్యాబిన్‌ ల వైపు వెళ్ళి వెదికారు. ఓ క్యాబిన్ లో ఈ అయిదు మంది పిల్ల పిడుగులు కూచోని క్రాక్ జాక్ బిస్కట్లు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.ఎవరి పిల్లల్ని వాళ్ళు కళ్ళతో కాల్చేసారు.నేను కళ్ళతో కాల్చలేదు ఎందుకంటే మా వాడి క్యాస్టింగు ఊడొస్తుందని.

* * * * * * * *


క్యాంపులో 'ఖండ ముదురు':

ఈ క్యాంపులో రెండేళ్ళు కూడ నిండని బుడ్డోడొకడు శాఖ లో వున్నప్పుడు ధ్యానం లో వున్నప్పుడు ప్రతి ఒక్కర్నీ కొట్టి పలకరిస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూడ్డం ఒక తంతు. పాదరసం మింగినోడి లా ఎక్కడ బడితే అక్కడికి పరుగులు పెట్టేవాడు. రెండు మూడెళ్ళున్న పిల్లలు వాళ్ళ తల్లులతోనే వుండేవాళ్ళు. నాన్నలతో కూడా వుండచ్చు. అలాంటి నాన్నలు నాకు కనిపించలేదు. చాలా మంది తెలుగు నాన్నలు వున్నారు. ఈ పిల్లా పీచూ క్యాబిన్ లో వున్న బుడ్డోడు పడుకుంటే అందరూ పడుకున్నట్టే వాడు. లేస్తే అందరూ లేచినట్లే. రోజూ పొద్దున్నా 6 గంటలకు హెచ్.ఎస్.ఎస్. వాలంటీర్లు పీకలు పట్టుకొని క్యాబైన్ ల దగ్గరకొచ్చి ఊదేవాళ్ళు అని చెప్పాగా. పీక ఊది తాయిలాల పేరు చెబుతూ "చాయ్..కాపీ తయార్..ఉటో..ఉటో.." అని అరిచేవారు. ఒక్కో చోట చాలా కష్టపడే వాళ్ళు లేపడానికి. ఈ బుడ్డోడి క్యాబిన్ దగ్గర వీళ్ళకు చాలా టైం సేవ్ అయ్యేది. వచ్చి వీడిని మాత్రం లేపేవాళ్ళు. వాడేమో పెద్ద చిన్న తేడా లేకుండా అందర్నీ "గో..గో..” అని జుట్టు పట్టుకుని లేపేసే వాడు.

సంతూర్ సబ్బు:

చివరి రోజు ట్రెక్కింగ్, ఒకటిన్నర మైలు దూరం కొండ ఎక్కుతున్నారు. దేశ భక్తి గీతాలు, రామాయణ భక్తి గీతాలు పాడుకుంటూ ఉత్సాహంగా వున్నారు. మా పుత్తూరు కట్టు క్యాస్టింగు కూడా ఎక్కేసింది. ఈ ట్రెక్కింగులో ఓ అరవై ఏళ్ళ ఆవిడ కూడా పాల్గొంది. ఈ తెలుగు ముసలావిడ కొన్ని చోట్ల నడవలేక పోతే ఇద్దరు బుడ్డోళ్ళున్న ఒకావిడ సహాయం చేసింది చేతులు పట్టుకొని. అప్పుడు జరిగిన సంభాషణ.

"నువ్వు చాలా ముచ్చటగా వున్నావమ్మా"
"హీ.. హీ.. థ్యాంక్స్"
"నువ్వేకాలేజీ లో చదువుతున్నావమ్మా?"
"నేనేమీ చదవడం లేదండి"
"నీకు మంచి మొగుడు దొరుకుతాడమ్మా"

జెజ్జినక..హా.. జెజ్జినక..హా..జెజ్జినక...జెజ్జినక

ఇప్పుడు ఈ చిన్నావిడ ఈ క్యాంపును ఎంత కాలం గుర్తు పెట్టుకుంటుంది?

అ) రెండేళ్ళు
ఆ) పదేళ్ళు
ఇ) జీవితాంతం

* * * * * * * *


ఇప్పుడు అక్కడికెళ్ళొచిన బుడ్డోళ్ళని పలకరించి "వన్ టూ..వన్ టూ.." అంటే "వుయ్ ఆర్ హిందూ .."అంటారు. అంతే కాదు..బోలెడన్ని 'నార'లు చెబుతారు.

జై జై మాత...భారతమాత
జై జై గీత... భగవద్గీత
జై భవాని..వీర్ శీవాజి

అక్కడికి ముఖ్య అతిధి గా కాలిఫోర్నియా నుండి వచ్చిన తెలుగు వాడైన జయసింహ గారు చెప్పిన సందేశాల్లో నాకు నచ్చిన కొటేషన్.

"Repeated actions are hobbies, repeated hobbies are character"

మనవి: ఫోటోలు లేవా? అని అడక్కండి. వెళ్ళడమైతే డిజిటల్ ఎస్సెల్లార్ తో పాటు రెండు లెన్సులు కూడా తీసుకెళ్ళా. ఒక్కో సారి కడుపు కట్ చేసుకోకూడదు అంతే.

* * * * * * * *


కొన్ని 'మై'లు స్టోన్‌ లు:
ఈ బ్లాగుకు హిట్లు: 50,000+
యునీక్ హిట్లు: 28,000+
కామెంట్లు : 1000+
'సబ్బు' స్క్రైబర్లు: 84

మొదటి 10,000 చేరుకోడానికి రాసిన టపాలు :100
తరువాతి 18,000 చేరుకోడానికి రాసిన టపాలు :64

మీ ఆదరాభిమానాలకు నా హృదయపూర్వక వందనాలు.
వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న పాఠకదేవుళ్ళకు నమోన్నమః (ఎన్టీఆర్ స్టయిల్).

కూడలికి ప్రత్యేక కృతజ్ఞతలు.


* * * * * * * *

19 comments:

oremuna said...

Welcome to 1000 comments club!

you are No two ?

సుజాత వేల్పూరి said...

చాలా బాగుంది విహారి గారూ! ఆ కాంప్ లో మేము కూడా ఉన్నట్టే అనిపించినిది. (ఎందుకంటే రాకీ పర్వతాలు నేను చూశాను. ఆ మంచు, అక్కడ కాటేజీలు బాగా నచ్చేశాయి). మీ ట్రిప్ నేను కూడా ఎంజాయ్ చేశాను.

కొత్త పాళీ said...

good show - on multiple fronts!

రాధిక said...

నేను నా స్కూలు అంతా ఆరెస్ ఎస్ స్కూలులోనే చదివాను.ఇప్పుడు సరిగా గుర్తులేవు గానీ వశిష్ట[నిలుచోడం],ఉపవిష[కుర్చోవడం]
దక్ష[అటెంక్షన్],ఆర్మ[ఇదేమిటో ఊహించండి :)]
స్కూలులో నేనే గణ నాయకిని.మా గణం పేరు ఝాన్సీ లక్షీభాయ్.ఇంకో గణం పేరు రాణీ రుద్రమ...ఇవన్నీ నాకు ఎంత నచ్చేవో.మా తమ్ముడేమో ఎల్లోహవుస్,రెడ్ హవుస్ అని చెప్పేవాడు టీం పేర్లు.
కబడ్డీ కూడా రామ రామ రామ అని కూత కూసేవాళ్ళం.
మెమొరీ గేం కూడా ఆడించివుండాలే?వ్రుత్తాకారంలో కుర్చోబెట్టి పురాణాల్లోని పేర్లన్ని ఒకరితరువాత ఒకర్ని చెప్పమంటారు.అందరూ ఎప్పడం అయ్యాకా ఎవరేమి పేరు చెప్పారో మనకి గుర్తున్నంతవరకు తప్పులు లేకుండా వరుసక్రమంలో చెప్పాలి.బాగుంటుందిలెండి ఆట.
అన్నట్టు ఖాఖీ నిక్కర్లు వేసుకోవాలి అని అనలేదా?
ఏమిటో మీటపా చూడగానే స్కూలు రోజులకి వెళ్ళిపోయాను.అందుకే ఏమిటేమిటో రాసేసాను.
ఇప్పుడు నేను సాంప్రదాయాలు,ఆచారాలు అంటూ అంత పట్టుబట్టి కూర్చోడానికి కారణం ఈ ఆరెసెస్ నే.వాళ్ళు హిందూమతంలోని ప్రతీ విషయానికి శాస్త్రీయంగా కారణాలు చూపిస్తారు.ఆరకంగా నా మనసులో హిందూ ధర్మం పట్ల ఒకరకమైన పూజ్యభావం వుండిపోయింది.

రాధిక said...

ఆ పై కామెంటు నాదే.వేరే ఐడీ తో వచ్చేసింది.క్షమించగలరు.
రాధిక
http://snehama.blogspot.com

వికటకవి said...

నేనూ సరస్వతీ విద్యామందిర్ నుంచే వచ్చినవాణ్ణి. ఈ ఆర్.ఎస్.ఎస్ స్కూల్ వల్ల బోలెడంత సంస్కారం, మంచి బుద్ధులు అలవడినాయి. కానీ చిన్నప్పుడు ఆర్.ఎస్.ఎస్ శాఖలో చాలా ఏళ్ళు పాల్గొన్నవాడిగా దానితో పాటే హిందూముస్లిం భేదాలు, చిన్నప్పటి నుంచే పాకిస్తాన్ అంటే ఓ విధమయిన విద్వేషం కూడా ఏర్పడ్డాయి (పాకిస్తాన్ కంపు అన్న మాట అది నిజమే అయినా), ఆ వయసులో అవి అనవసరమయినా కూడా. ఇక ఈ తొగాడియాలు, సింఘాల్ లతో ఆర్.ఎస్.ఎస్ పట్ల నా ధృక్పధం అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. కానీ నా బడి మాత్రం జీవితానికి సరిపడా సంస్కారం, మంచితనం నేర్పింది. కానీ అదీ ఆర్.ఎస్.ఎస్ బడి అన్న సత్యాన్ని ఎలా కాదనగలను? ఎక్కువ మంచి, కొంత చెడు అనమాట. సో, మీరు మంచి నేర్చుకున్నారు కాబట్టి అంతా శుభమే.

durgeswara said...

చక్కని అనుభవం
మేము అమెరికా వచ్చే అవకాశం ఈజన్మకు లేకపోయినా ఆలోటు మీరచనలద్వారా ఊహించుకుని మనసులొ భర్తీచెసుకుంటున్నాము. నేను అమెరికా చూడాలనేది నారద మహర్షులవారి రాగధారతో ప్రభవించిన నయగారా ఎలావుంటుందో చూడాలనే కోరికతో మాత్రమేసుమండీ!. అయినా హిమాలయాలకు వెళ్ళామా? అల్లసాని వారి మనుచరిత్రం తెలుపలేదూ ! అలాగే విహారులు విహరించి విరచించినవి చదివి తృప్తిచెందాము లెండి.

durgeswara said...

vihaarigaaroo,

13 vatedijarige sanipradOsha kaala maahaasiva abhiShEkaaniki mee gOtranaamaalu pampamdi.dhanyavaadamulu.

నిషిగంధ said...

భలే ఉందండీ మీ క్యాంపింగ్!! ఆటలు కూడా చాలా సరదాగా ఉన్నాయి.. లాస్ట్ మంత్ లోనే మా కొలీగొకడు డెన్వర్ కి వెకేషన్ కి వెళ్ళొచ్చి, ఆ ఫోటోలు చూపిస్తుంటే మనసు ఆ పర్వతశ్రేణుల్లోంచి రానంది!!

Anonymous said...

కేక! మొత్తానికి హిందుత్వాన్ని తలచుకుని ఆనందిచారన్నమాట.
మీ మైలురాయిలకి కూడా భేషో!

Anil Dasari said...

దుర్గేశ్వరగారు,

అమెరికా వస్తే నయాగరా చూసినా చూడకున్నా గ్రాండ్ కేనియన్స్ చూడండి. నయాగరాని తక్కువ చెయ్యటం కాదుగానీ, అమెరికాలో ఉన్న అద్భుతాల్లో నేనైతే గ్రాండ్ కేనియన్స్‌కే మొదటి ఓటు వేస్తా. జలపాతాలు ప్రపంచంలో బోలెడున్నాయి కానీ ఇలాంటి కేనియన్స్ మరెక్కడా లేవు. వాటి ముందు నిలుచుని చూస్తుంటే ఈ సృష్టిలో మనదెంత బుల్లి స్థానమో అర్ధమౌతుంది.

రిషి said...

బాగున్నాయండి..మీ ట్రిప్ సంగతులు.

మీరు చెప్పింది నిజమేనండీ..పొద్దున్న 6 గంటలకి లెగడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో క్రిషి, ఆత్మవిశ్వాసం..వగైరాలు కావాలి.. :)

వికటకవి said...

విహారి, చిటారు కొమ్మన కూర్చున్నట్లు నిన్నటి నుంచి కూడలిలో పైకెక్కి దిగట్లేదు. మాయాజూదం లాగా మాయ టపానా? రిగ్గింగా?

సుజాత వేల్పూరి said...

వికట కవి గారు,
నిన్నటి నుంచీ నేను అదే చూస్తున్నా ఏమిటా ఇది అని! రాకీ మౌంటెన్స్ చాలా ఎత్తుగా ఉంటాయి కదా, దిగటానికి కొంచెం టైము పడుతుందేమో! ఏమంటారు విహారి గారు! (సరదాకి)

కొత్త పాళీ said...
This comment has been removed by the author.
కొత్త పాళీ said...

మొత్తానికి ఇంటిల్లి పాదీ శాఖ దెబ్బ రుచి చూశారన్నమాట. ఏమాటకామాట చెప్పుకోవాలి. ఆర్గనైజింగ్ లో వాళ్ళ క్రమశిక్షణ, అంకిత భావం మెచ్చదగినవి. వాళ్ళ మాటలు జీర్ణించుకోవడం మాత్రం నా వల్ల కాదు!

Anonymous said...

Nice post & congratulations!

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది విహారి గారు ఎలాంటి విషయమైనా హాస్యాన్ని మేళవించి చెప్పడం లో మీకు మీరే సాటి.
సరి కొత్త మైలు రాళ్ళని అధిగమించినందుకు గాను అందుకోండి నా అభినందనలు.

kimimitaka said...

What is saniparadosha ?
I wanted to find out the meaning of this day for my puja.
But I could only found your blog.
I am from Japan.
Thank you.

kimi