* * * * * * * *
<:ఫోటోల మీద నొక్కితే బొమ్మలు పెద్దగా కనిపిస్తాయి.(ఒక్కోటి 10 మెగా పిక్సెల్స్):>
మరూన్ బెల్స్: అమెరికాలో విరివిగా క్యాలండర్ లలో వుండే చిత్రం ఇదే. అమెరికా వచ్చిన కొత్తలో ఫ్లోరిడా లోనో, టెక్సాస్ లోనో పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు ఈ టి.వి. ల వాళ్ళు మదర్ నేచర్ కన్నెర్ర చేసింది, మదర్ నేచర్ మార్పులు తెచ్చింది అని అంటుంటే వీళ్ళు కూడా ఏంటబ్బా మనలా మదర్ ఇండియా, మాతృత్వం లాంటి పదాలు వాడతారు అని బోల్డాచ్చర్యపోయి అదంతా ఫోనులో పోసి భారత్ లో వినే వాళ్ళ చెవులు నింపే వాడిని. తరువాత్తరువాత ఆ వాడకం వినీ, వినీ బుర్రకలవాటయిపోయింది. అప్పట్నుండి ఎక్కడ ఏ కొండో, గుట్టో, చెట్టో, పుట్టో అందంగా కనిపించినా మదర్ నేచర్ అనే పదం బుర్ర మీద కిరీటంలా కూచుంటుంది. అలా ఈ మదర్ నేచర్ కిరీటం స్థానం ఆక్రమించినప్పుడల్లా కారు నోట్లో పెట్రోలు (గ్యాసు) పీపా పెట్టి ఊర్లు తిరగడం అలవాటయింది. అలాంటి తిరుగుళ్ళలో ఈ ఆస్పిన్ వెళ్ళి రావటమొకటి.
మరూన్ బెల్స్: వరుసగా బారులు తీరి వున్న ఫోటోగ్రాఫర్లు. ఈ ఫోటో తీసేటప్పుడు నా వెనక పెద్ద బెటాలియన్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ వున్నారు. నాకు చోటు లేక ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. కొలరాడో రాష్ట్రం లోని ఆస్పిన్ అనే పట్టణం ప్రపంచం లోని స్కీయింగ్ ప్రియులను అమితంగా ఆకట్టుకునే అతి కొద్ది ప్రదేశాల్లో ఒక్కటి. ప్రతి హాలీవుడ్డు స్టారుకు, వాలువీధి (వాల్ స్ట్రీట్) వీరుడికి ఒక విడిది గృహం వుంటుంది ఇక్కడ. ధరలు కొంచెం ఘాటెక్కువ. ఓ మాదిరి ఇల్లు కొనాలంటే మినిమము మిలియను మదుపు చెయ్యాలి. ముదిరిన మిలియనోళ్ళు ఎక్కడెక్కడినుండో ఎగురుకుంటూ వచ్చి పగలంతా ఆయిసు ముక్కల మీద జారి రాత్రయితే వైను గ్లాసుల చేరి డాలర్లను కరిగించుకొని పోతారు. వాళ్ళు చలికాలం లో స్కీయింగు వెళితే నాలాంటి బడ్జెట్ బాబూ రావులు ఇలా ఆకులు రాలే కాలం లో వెళ్ళి పెన్నీలు కరిగించుకొని వస్తారు.
మరూన్ బెల్స్ ఆస్పిన్ డెన్వర్ కు పశ్చిమాన 180 మైళ్ళ దూరం లో వుంటుంది. ఇక్కడ ఆస్పిన్ చెట్లు అధికంగా వుంటాయి. దారి మొత్తం దాదాపుగా ఘాట్ రోడ్డే. రోడ్డుకు రెండు వైపులూ కొండలు వుంటాయి. వెళ్ళాలంటే అంతర్రాష్ట్ర రహదారి I-70 తీసుకోవాలి. (అమెరికాలో తూర్పు పశ్చిమాలను కలుపుతూ వెళ్ళే రహదారి పేర్లు సరి సంఖ్యలు(I-40,I-70) గాను, ఉత్తర దక్షిణాలను కలుపుతూ వుంటే బేసి సంఖ్యలు(I-25,I-225) గానూ వ్యవహరిస్తారు ). ఈ కొండల్లోనుండి వెళ్ళడానికి 4 గంటలు పైనే తీసుకుంటుంది. ఒకే రోజులో వెళ్ళి రావాలంటే కాస్త ఒళ్ళు నొప్పులు తెచ్చే వ్యవహారమే. పిల్లా పీచు లేనప్పుడు రయ్యిమని వెళ్ళి వచ్చే వాళ్ళమే. ఇద్దరు బుడ్డోళ్ళున్నారని ఓ రోజు అక్కడే మకాం పెట్టాం. అబ్బో ఆస్పిన్ లోనే అని నోరు వెళ్ళ బెట్టుంటే జిప్పెట్టేయండి. ఆస్పిన్ లో వుందామని ఒక రోజు అద్దె ఎంతో తెలుసుకోవాలని హోటలోళ్ళకు ఫోను చేస్తే నా సంవత్సరం జీతం, 401K (పెన్షన్) డబ్బు అడగటం మొదలు పెట్టారు. కొంత మందయితే మా తాత ఎంత సంపాదించాడో అడిగారు. అసలే ఎకానమీ ఏడుకొండలవాడి నుదుటి మీద మూడు నామాలు చూపిస్తుంటే "గోవిందా..గోవిందా.." అని అరిచే శక్తి లేదని ఆస్పిన్ పక్కనే 8 మైళ్ళ దూరం లో వున్న స్నోమాస్ పల్లె (విలేజ్) లో రూము తీసుకున్నాం. వీడు సగం నెల జీతమే అడిగాడు. ఉదార స్వభావుడు.
నీళ్ళలో మరూన్ బెల్స్ అందాలు ఆసలెందుకు ఆస్పిన్ వెళ్ళటం అని చెప్పలేదు కదూ. ఫోటోలు చూసేశారు కదా మళ్ళీ ఉపోద్ఘాతమెందుకు అని చెప్పలేదు. ఈ సమయం లోనే చెట్ల ఆకులు రాలుతాయి. ఆకులు ఆకు పచ్చ రంగు నుండి పసుపు రంగులోకి, కొన్ని ఎరుపు రంగులోకి మారు తాయి. కొండల మీదనున్న చిన్న పొదలు వివిధ రంగుల్లో వుండి కొండకు రంగులద్దినట్లు వుంటుంది. అది చూడ్డానికి శోభాయ మానంగా వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రకృతి దృశ్యాలను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక్కసారి అనుభవించాల్సిందే. కారు నడిపే డ్రైవరు ఈ అందాలను చూడాలంటే ఇంకో డ్రైవరును చూసుకోవాలి.
స్నేమాస్ పల్లె అంతా ఎగుడు దిగుడుల మయం. ఎక్కడన్నా కారు బ్రేక్ మీద కాలు తీసామంటే నేరు గా కిందకెళ్ళిపోతాం. ఈ ఊర్ని చూస్తే నాకు తిరుమలే గుర్తొచ్చింది. అక్కడ హోటెల్ పేర్లను అంజనాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి అని పేరు పెట్టుకొని పిలుచుకున్నా. మేము శేషాద్రి కాటేజ్ లో వున్నాం. అంటే స్టోన్ బ్రిడ్జ్ ఇన్ లో వున్నాం. అక్కడ షాపులోని ఏ వస్తువును తాకాలన్నా షాక్ ప్రూఫ్ గ్లోవ్స్ వేసుకొని ముట్టుకోవాలి. బొమ్మలంగళ్ళు కనిపించినప్పుడల్లా బుడ్డోళ్ళని ఆకాశం లో చుక్కలు లెక్కపెట్టమనే వాళ్ళం. ఒక్క "శ్రీ.. శ్రీనివాసం.. శ్రీ వేంకటేశం.." అని పాట వినబడలేదు గానీ ధరలు మాత్రం అలానే వున్నాయి.
ఊరేదైతేనేమి రాతలు ఒకటే వెళ్ళిన రెండో రోజుకల్లా అన్నానికి మొహం వాచిపోయి ఏదీ లేక ఓ థాయ్ రెస్టారెంటుకు వెళ్ళాం. బుడ్డోడు ఆరంజ్ చికెనూ, మా ఆవిడ చికెన్ నూడుల్సూ చెబితే, వెరైటీ ఈజ్ స్పైస్ ఆఫ్ లైఫ్ అని ఏదో "కాన్యన్ క్రీక్ చికెన్" అని పేరుంటే అది ఆర్డరిచ్చా. (కాన్యన్ క్రీక్ అన్నది అక్కడ వున్న ఒక ప్రదేశం పేరు). నా కాన్యన్ క్రీక్ చికెన్ వచ్చాక ప్లేటు చూసి సొంతం సినిమాలో హోటల్ లో కొత్త వంటకం ఆర్డరిచ్చిన సునీల్ గుర్తొచ్చాడు. 15 సెంటీమీటర్ల వ్యాసంతో వృత్తం చేసి, చుట్టు కొలతంతా పచ్చని పచ్చి బ్రాకోలితో గోల్ఫ్ కోర్సు లా డెకరేట్ చేసి మధ్యలో ఆవ గింజంత సైజున్న చికెన్ ముక్కలు పది పెట్టున్నాయి. అందులో మళ్ళీ అయిదు ముక్కలు క్యాప్సికం. రెండు ముక్కలు బెల్ పెప్పర్. కనుగుడ్ల నుండా ఉబికి వస్తున్న నీరును కార్గిల్ సైనికుడిలా చాకచక్యంగా ఎదుర్కొని చికెన్ ముక్కలను బబుల్ గమ్ లా ఆస్వాదించి వదిలేసిన బ్రాకోలీ కనిపించకుండా పేపర్ న్యాప్కిన్ తో కప్పెట్టేశా. అక్కడ వడ్డించిన థాయావిడ బహు మర్యాదస్తురాలు. భారతీయుల టేబుల్ దగ్గర చంద్ర బాబు మొహం తో , అమెరికనుల టేబుల్ దగ్గర వై.ఎస్. మొహం తో సంభాషించేది. ఇది చూసి చిర్రెత్తుకొచ్చి టిప్పు మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ కు రైళ్ళిచ్చినన్ని ఇచ్చా.
ఎక్కడ చూసినా పసుపు మయం. వైల్డు లైఫు కనిపిస్తుందేమోనని ఆశగా చూసిన మాకు ఒక బుల్లి పాము, రెండు సీతాకోక చిలకలు, బోలెడు ఉడుతలు, వై.ఎస్. ఆస్తిలో రూపాయలకు సమానంగా తేనెటీగలు కనిపించాయి.
మరూన్ బెల్స్ సీతాకోక చిలుక వచ్చేటప్పుడు ఓ చోట ఆగి అక్కడున్న అందాలను చూసి వస్తుంటే ఒక తేనెటీగ కారులో దూరింది. అది ఊరుకుంటే తేనెటీగ ఎందుకవుతుంది. వెళ్ళి పెద్ద బుడ్డోడు తింటున్న అరటి పండు పై వాలింది. ఇక వాడేమో బాంబు పేలుళ్ళ తరువాత అద్వానీ అరిచినట్లు అరిచాడు. అసలే రైలింగు కూడా లేని ఒక లేన్ రోడ్డు. ఆపాలంటే లోయలోకి డైవ్ కొట్టి ఆపాలి. నాకయితే ఇప్పట్లో డైవ్ చెయ్యాలనే ఆలోచనలు లేవు. అప్పటికే అది కొంచెం అరటి పండు కొరికి వుందేమో వీడి అరుపులకు భయపడి నిద్ర పోతున్న చిన్న బుడ్డోడి కారు సీటు వెనక్కెళ్ళి పార్కింగ్ చేసింది. కాస్త దూరమెళ్ళాక కర్బ్ చూసుకొని ఆపి తలుపులు తెరిచి నీ స్టాపొచ్చింది దిగెయ్యమ్మా అనగానే దిగి వెళ్ళిపోయింది.
ఆస్పిన్ లో అదృష్టం :నేనెక్కడికెళ్ళినా నా ఇష్ట దైవం అదృష్ట దేవత నా వెంటే వుంటుంది. ఈ అమెరికా నగరాల లోని రోడ్లన్నీ పారలల్, పర్పెండుకులర్ అని స్కేలు పెట్టి మరీ కడతారు. అందులో మళ్ళీ వన్‌వేలు. మనమెళ్ళాల్సిన చోటెప్పుడూ వన్‌వేకు వ్యతిరేక దిశలో వుంటుంది. పార్కింగు చెయ్యడానికి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా స్థలం లేక ఒక చోట వామ పాదం పెట్టేంత జాగా వుంటే అక్కడ పెట్టేసి తరువాత వచ్చి చూద్దునుకదా. డ్రైవరు డోరు దగ్గర తెలుగు దేశం పార్టీ అప్లికేషన్ ఫాములా పచ్చగా తళతళ లాడిపోతూ టికెట్ యభై డాలర్లకు. తీసి చదివితే " నువ్వు ఇంటర్ సెక్షన్ కు 20 అడుగుల దూరములో, స్టాపు సైనుకు ముప్పై అడుగుల దూరములో పార్కు చేసి వుంటివి. అది నా కంటబడినది. నీ చెక్కు పై చెవ్రాలు పెట్టి ఈ కింద చిరునామాకు బట్వాడా చేయుము".
మరూన్ బెల్స్: బాల కౌబాయ్ ఇలాంటి ప్రదేశాలకు వెళితే నేను తీసుకునే ఫోటోలకు కాప్షన్‌లు ఇలా వుండేవి.
1. కొండ కింద నేను
2. కొండ పైన నేను
3. కొండ పక్కన నేను
4. కొండ మధ్యలో నేను
5. కొండ లోపల నేను
6. కొండ పిండుతూ నేను
ప్రదేశం మారితే కొండ బదులు బండో, చెట్టు ఖాండమో వుండేవి. ఇప్పుడు కొండ పక్కన నేను అని చెప్పుకోడానికి ఫోటోలు వుండట్లేదు.
1. బుడ్డోన్నెత్తుకొని నేను
2. బుడ్డోణ్ణి దించుతూ నేను
3. బుడ్డోణ్ణి సముదాయిస్తూ నేను
4. బుడ్డోడితో గిల్లించుకుంటూ నేను
5. బుడ్డోడితో తన్నించుకుంటూ నేను
6. బుడ్డోడు ముక్కు పిండుతుంటే నేను
.... ఇంకా చాలా నేనులు ప్లస్ ఇద్దరు బుడ్డోళ్ళు.
విహారి సోదరుల కేరింతలు : సుహాస్ విహారి, రుషీల్ విహారి ఆస్పిన్ లో తీసిన 380+ చాయాచిత్రాల్లో మరి కొన్నింటిని
ఇక్కడ చూడ వచ్చు.
* * * * * * * *