Thursday, November 21, 2013

ధ.భ.నే.శు. - ద ఆర్ట్ ఆఫ్ (న)ల్లివింగ్


ఓ నూట యభై లక్షల సెకండ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ….

*****

“అరే! అన్ని పూరీలు నేను తినలేనండి బాబూ..ఇక చాలు”
“అల్లాఘంటే ఎళ్ళాగ మీఋ మా వైట్ హవుజ్ అతిథులు. ఇవి మా మిచెల్లె శ్వయంగా చేషింది. రసిక రెస్టారెంట్ నుండి తెచ్చిన పూరీలు కావు.బావున్నాయి తిణండి” ఒబామా ఒకటే బలవంత పెడుతున్నాడు.తినక పోతే నోట్లో పెట్టేటట్టు వున్నాడు.
“ హవును ణేను ఒబామా కి ఖూడ ఎప్పుఢూ ఇంత భాఘా బర్గర్ షెయ్యలేదు. మీఋ తప్పఖుంఢా తిణండి” మిచెల్లె ఒబామా కూడా బలవంత పెట్టేస్తోంది.
“నేను పూరీలు తింటాను గానీ. ఇంతకూ మీకు తెలుగు నేర్పింది ఎవరు?”
“మాంచు లఖ్ష్మి..”

అంతలో ఓ హెలికాప్టర్….. నా మీద పడింది.

“ఇది ఘోరం. పూరీలు తినక పోతే నా మీద డ్రోన్ దాడులు జరిపిస్తారా ఇదెక్కడి అన్యాయం ఒబామా గారూ ” అని గట్టిగా అరిచాను.
“నాన్నోయ్.. నీ పూరీలు సంతకెళ్ళా. అమ్మ పేరు ఓ బామ్మ ఎప్పుడయ్యింది? నీ మీద దాడులు కాదు నా మీద ఏలియన్స్ దాడి చేసి నన్ను కొరికేస్తున్నారు” రెండో బుడ్డోడు ఉరఫ్ చిన్న బుడ్డోడు.
“ఇంతకూ నువ్విక్కడికెలా వచ్చావ్రా?”
“నా రూములో హెలికాప్టరేసుకుని మీ బెడ్ రూములో ల్యాండ్ అయ్యా”
“నీ హెలికాప్టర్ చుట్టూ ఆ నల్లగా తిరుగుతున్నవేమిట్రా?”
“ఏలియన్స్ నాన్నా.. అవి హెలికాప్టర్ లోకి కూడా వచ్చేశాయి”
“వాటిని ఏలియన్సు అనర్రా..నల్లులు అంటారు”
“అయితే మన మీద నల్లేలియన్సు దాడి జరిగింది నానా”

 అప్పుడు కోడి పుంజు ఆడియో సాంగేసుకునే టైము 3:33.

  బుడ్డోడి హెలికాప్టర్ అద్దెకి తీసుకొని దాని ప్రొపెల్లెర్ మీద కూచుని పక్కింటోడి బ్యాక్యార్డ్ లోకెళ్ళి అక్కడున్న మోషన్ సెన్సార్ సోలార్ సెక్యూరిటీ లైట్లు మూడు లాక్కోని నా నెత్తి మీద పెట్టుకుని చిన్న బుడ్డోడి రూం లో పరిశోధన కెళ్ళా.

  అప్పుడే ఫ్రెష్ గా డిన్నర్ అయిపోయినట్లుంది. చాలా నల్లులు రక రకాల భంగిమలలో డ్యాన్స్ చేస్తూ కనిపించాయి. అవి ఏవో పాటలు కూడా పాడుకొంటున్నట్లున్నాయి. నా చెవులకేమీ వినబడలేదు. నా అపరాధ పరిశోధన బుర్రలో హెడ్ ఫోన్లు వెలిగాయి.

  అందరి పక్కింటోళ్ళలాగా మా పక్కింటోడు కూడా చాలా పిసినారి. వాడి బ్యాక్ యార్డ్ లో మోషన్ సెన్సారే పెట్టాడు ఆడియో సెన్సర్ పెట్టలేదు. ఈసారి ఎదురింటి పక్కింటోడి బ్యాక్ యార్డ్ లో కెళ్ళి ఆడియో సెన్సర్ బగ్గులన్నీ పీకి దాని వైర్లు నా నాలుగు చెవుల్లో పెట్టుకొని మళ్ళీ బుడ్డోడి రూములో కెళ్ళా. ఇప్పుడు పాట్లన్నీ సర్రౌండ్ సౌండ్ లో వినిపించాయి.

  ఒక గుంపు “జిలె లె జిలె లె ఆయొ ఆయొ జిలె లె..మస్తి మె మస్తి మె ఆయొ ఆయొ ...జిలె లె  జిలె లె..”  అని. ఇంకో గుంపు..”ఎంద చాటయొ..ఎంద కాట్ర విల్లియో..ఎంద చాట్ర కాట విల్లయో  ” అని పాడుకుంటున్నాయి.

  ఇంకొన్ని చాలా ఐకమత్యంగా సెపరేటుగా  “జింగాలే జిగి బిగిలే... కిళ్ళీ లో జెల్లీ లే...  నీ బెల్లీ నే గిల్లా లే ..” అని  , “రొప్పు.....  రొక్కు.....  నొక్కు....  నక్కు....  కక్కు.....  బొక్కు......  డొక్కు.... బ్రక్కు..... ళ్రక్కు... ణ్రక్కు..  ” అని , “నీ డిప్ప మీద కాయ్....  నా రెప్ప మీద టాయ్... నువ్వు నన్ను చేశావు అన్నాయ్....  నేను నిన్ను చేస్తా డెస్ట్రాయ్......” లాంటి స్వచ్చమైన తెలుగు పాటలు పాడుకుంటున్నాయ్.

  ఇంకొంచెం లోపలికెళితే “నీ చంకలో బంక... నేనందులో దుంక.. ఇద్దరం అవుదాము ఇంక బంకబంక....ఈ విహారి గాడి ఇల్లు చేద్దాము టెంక టెంక...  ” అని వినిపించింది .  నా అయిదు చెవుల్లోని బగ్గులు పేలిపోయాయి.

  ఫగిలిపొయిన బగ్గులు తీసేసి నెత్తినున్న లైట్లతో పెద్ద బుడ్డోడి రూములో హెలికాప్టర్ ఇంజిన్ కి కాళ్ళు వేలాడేసి వెతికా. అక్కడ కూడా 300 సినిమాలో సైన్యం లా ఎక్కడ చూసినా మందలు మందలుగా "ఎన్నియల్లో...  ఎన్నియల్లో...  చంద మామా ..ఓయ్..  ఒరేయ్..  అరేయ్... విహారిగా... " అని కోయ యుగళ గీతాలు, అమంగళ గీతాలు స్వేచ్చగా పాడుకుంటున్నాయి.

  కట్ చెయ్యకుండా సీను అర్థమయిపొయింది. అప్పటికి మూడో అంతస్తంతా ఆక్రమించేశాయ్. ఇక ఆ రాత్రి అందరూ కూచుని ‘ఐ డోంట్ స్పై నల్లి’ ఆట ఆడుతూ సంతోషంగా జాగారం చేశాం.

    'ఐ డోంట్ స్పై' అనేది 'ఐ స్పై' కి ఆపోజిట్. ఐ స్పై ని చిన్నప్పుడు చెడ్డీ ఎక్కడుందో తెలీని వయసులోనే నేను చౌడేపల్లి లో ఆడుకున్నా. దాన్ని 'ఐస్‌పాయ్' అనే వాళ్ళం. నాన్-చౌడేపల్లి వాళ్ళు కాపీ కొట్టేసి సాబ్జ అని కూడా అంటారు. చరిత్ర చూస్తే చౌడేపల్లి వాళ్ళందరూ మేధావులే. కొంత మంది చాలా ఏళ్ళ క్రితం వలసపోయారు. అక్షర క్రమం లో వారి పేర్లు..అరిస్టాటిల్, ఆర్కిమెడిస్, ఇసాక్ న్యూటన్… ( ఈ వరస క్రమం లో విహారి పేరు కూడా గుర్తొస్తే మీరు తెలివైన వాళ్ళే కాదు అందమైన ధనవంతులు కూడా అవుతారు)

ఐ డోంట్ స్పై ఆట వివరాలు

  హాల్లో వన్ టూ త్రీ చెప్పుకొని అందరూ వాళ్ళ రూముల్లోకి వెళ్ళాలి. వెళ్ళి నల్లులు కనిపించక పోతే 'ఐ డోంట్ స్పై నల్లి' అని అరవాలి. నల్లి కనిపిస్తే చంపాలి.

  చాలా సేపు వన్ టూ త్రీ లే అరిచాము. కానీ ఒక్కరూ ఐ డోంట్ స్పై నల్లి అని అరవలేదు. పక్కింటోళ్ళు ఫోర్ ,ఫైవ్ ,సిక్స్ అని కోరస్ ఇచ్చారు. మా గేమ్ రూల్సు చెప్పిన తరువాత సెవన్, ఎయిట్ అని అట్లాంటా సముద్రం లోకి నైట్ డ్రస్సులో కారేసుకుని వెళ్లి పోయారు. మేము మాత్రం మళ్ళీ ఒన్ టూ త్రీ లు చెప్పుకుని అలుపూ సొలుపు లేకుండా రెండున్నర వారాలు ఆడాం. అయినా గేం అయిపోలేదు.  నల్లులు చావలేదు.

  ఇలా కాదని నల్లుల సమస్య పరిష్కారించాలని 'దోని(పర్తి)' రాజ్య సమితి సమావేశానికి సమితిలోని మొత్తం నలుగురు సభ్యులకూ ఈ మెయిలు, ఫేస్బుక్ అకౌంట్ కి మెసేజ్ లూ పంపించాము. ఫేస్ బుక్ నుండి వెంటనే రిప్లై వచ్చింది అందరినుండి.

   శాశ్వత సభ్యులైన నేనూ, మా ఆవిడా, తాత్కాలిక సభ్యులైన మా బుడ్డోళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ మీద 'శుక్లాం బరధరం' మలయాళం లో  చెప్పుకుని సమావేశమయ్యాం. టేబుల్ మీద నుండి కాళ్ళు కింద జారేసి ఒకరి మొఖాలు ఒకరు చూసుకోకుండా కూచున్నాం  అచ్చం ఐక్య రాజ్య సమితి సమావేశం లా నిండుగా.

 నిండు సభ తో చర్చలు మొదలయ్యాయి.

كيف تقتل البق
Πώς να σκοτώσει τα ζωύφια
איך להרוג חרקים
如何殺臭蟲

నాలుగు నాన్ తెలుగు బాషల్లో బట్టలు చినిగాకా తెలుగు లో నాలుగు తీర్మానాలు చేసి ఏకాభిప్రాయం కుదరక ఒక్క దాన్ని మాత్రమే పాటించాలి అని ఓటింగుకు పెట్టాం. తీర్మానాలు కింద ఇవ్వబడ్డాయి.

     1. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి ఒకటి 
     2. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి రెండు
     3. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి మూడు
     4. ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలి నాలుగు

  ఓటింగుకు పెడితే ఒక్కో దానికి ఒక్క వోటు మాత్రమే వచ్చింది. చీటింగుకు కూడా పెట్టాము. అయినా ఒక్కో దానికి ఒక ఓటు మాత్రమే వచ్చింది.  నాలుగు ఓట్లు వున్నప్పుడు ఒక ఓటు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. తరువాత టాస్ వేద్దామని నిర్ణయించాం. పెద్ద బుడ్డోడు ఐదు రూపాయిల బిళ్ళ తెచ్చాడు. బిళ్ళ అర చేతిలో పెట్టుకొని ఏం కావాలో  కోరుకోండి అన్నా.

  మా ఆవిడ "రవ్వల నెక్లెస్" అంది. పెద్దోడు "విమానం" అన్నాడు. రెండో వాడు "అంగారకుడు" అన్నాడు. ఫ్లోలో నేను కూడా "ఏ.కె. 47." అన్నా.

"నా అరచేతిలో ఐరావతం లేదు ఐదు రూపాయలే వున్నాయి. వాటికి ఇన్ని రావు" అనగానే మా ఆవిడ వాళ్ళ పుట్టింటికి ఫోన్ చెయ్యడానికి వెళ్లి పోయింది.  బుడ్డోళ్ళు హెలికాప్టర్ లో క్రికెట్ ఆడుకుంటూ వెళ్ళిపోయారు.

మళ్ళీ అందరికి ఎస్సెమ్మెస్ పంపిస్తే ముగ్గురూ హెలికాప్టర్ లో వచ్చేసారు.

   ఇద్దరు బొమ్మ అన్నారు.ఇంకో ఇద్దరు మాత్రం బొరుసుకు ఆపోజిట్ అన్నారు.  ఏదో ఒకటే నెగ్గాలి కాబట్టి సింహం బొమ్మ ఒకో తలకాయ మీద ఒక్కొక్కరు పందెం కాసాం. గుర్తు కోసం అందరూ వాళ్ళ నంబర్లు వాళ్ళ సింహం తలకాయ మీద స్కెచ్ పెన్ను తో రాశారు. నేను టాస్ వేస్తే నాలుగో తలకాయ బొమ్మ పడింది. మా చిన్న బుడ్డోడు ఎగిరి గంతేశాడు. అదెలా జరిగిందిరా అంటే.

“మీరందరూ మీ సింహం జుట్టులో నంబరేశారు.  నేను నా సింహం ముక్కు మీద నంబరేశా. అది నంబర్ని గొక్కుంటూ పైకి వచ్చేసింది”.

 ఎంతైనా మేధావి కదా (మీకు చౌడేపల్లి గుర్తుకు వస్తే మీరు అక్కడి నుండి వలస వెళ్ళిన మేధావి కాందిశీకులు. ఫేస్ బుక్ , ట్విట్టర్ , గూగుల్ ప్లస్, గూగుల్ డివైడెడ్ బై , గూగుల్ VIBGYOR లలో ఉన్న మనోళ్ళనందరినీ ఏకం చెయ్యండి. నేను వాళ్ళకు నాయకుడిగా అవకాశమిస్తా. ). అందరం వాన్ని పైకెత్తాం. ఆ సంతోషం లో వాడు మూడు లక్షల ఏడు నల్లుల్ని కంటి రెప్పతో అతి పరాక్రమంగా చంపి నల్లుల శాతాన్ని 0.0001 తగ్గించాడు. వాడికి 'నల్లి గండర గండడు' అని బిరుదు ఇచ్చాం. దాన్ని వాడు స్కూల్లో టీచర్ కి ఇచ్చి వాడి క్లాస్ మేట్ సోఫియా కు వాలంటైన్స్ డే కి గిఫ్టుగా ఇమ్మన్నాడు.

*****

  దోని రాజ్య సమితి తీర్మానం ప్రకారం ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవడానికి ఎవరైనా జ్యోతిశాస్త్రం చెప్పే పూజారి దొరుకుతాడేమోనని గూగుల్ లో వెంకటేశ్వర టెంపుల్ అని సెర్చ్ కొట్టా. అయిదు మైళ్ళ రేడియస్ లో పది వెంకటేశ్వర టెంపుల్స్ కనిపించాయి. వాటి పేర్లు బాక వెంకటేశ్వర టెంపుల్, లుబ వెంకటేశ్వర టెంపుల్ ,యరూబ వెంకటేశ్వర టెంపుల్ అని అన్నీ ఆఫ్రికా తెగల పేరుతో వున్నాయి. విచారిస్తే గుళ్ళన్నీ తెలుగు వాళ్ళవే. ఆఫ్రికా తెగల పేర్లన్నీ ఇప్పుడున్న తెలుగు వాళ్ళ కులాలట వాళ్ళు తెలివిగా తమ పూర్వీకుల తెగల పేర్లు పెట్టుకున్నారట. ఈ విషయాలన్నీ బేస్మెంట్ లో జరిగే  ప్రైవేట్ మీటింగుల్లో పోకర్ ఆడేప్పుడు తెలుస్తాయ్. మీ జ్ఞాన పీఠం పెద్దదవాలంటే పోకర్ నేర్చుకొని అమెరికా వీసాకు అప్లై చెయ్యండి.

  లుబ పేరు బాగా నచ్చి ఆ గుడి కెళ్ళి లోపలున్న పూజారితో నల్లి సమస్య చెప్పడము మొదలుపెట్టా. ఆయన కళ్ళు మూసుకుని నన్ను నోరు మూసుకోమన్నాడు. కొంతసేపటికి తను నోరు తెరిచి నన్ను కళ్ళు మూసుకోమన్నాడు. తల పైకెత్తిన తరువాత కళ్ళు, చెవులు తెరవమన్నాడు.

“ఇప్పుడు చెప్పు నీకు ఏమి కనిపిస్తోంది?" అని అమృతమ్ అప్పాజీ లా అన్నాడు.
“ఎల్.జి. 60W ఎల్ఈడి. బల్బు స్వామీ. నేను కూడా మొన్నే వాల్మార్ట్ లో కొన్నా. డిస్కౌంటు పోయిన తరువాత 2 డాలర్ల 13 సెంట్ల బిల్లు కనిపించింది.”

“చూడు నాయనా ఎంత ఇంజినీరయితే మాత్రం బ్రాండు పేరుతో సహా చెప్పాలా? నీ పెళ్ళప్పుడు అరుంధతి నక్షత్రం కనిపించిందా?”
“పెళ్ళప్పుడు ఆ ఖర్చులకు చాలా నక్షత్రాలే కనిపించాయి స్వామి ఆ పేర్లన్నీ ఇప్పుడు గుర్తు లేవు”

“నేనడిగింది చుక్కల గురించి కాదు. శాస్త్రమన్న తరువాత కొన్ని సార్లు కొన్ని ఒప్పుకోవాలి.”
“సరే స్వామి ఇప్పుడెక్కడ చూడాలో ఏమి కనిపించుకోవాలో చెప్పండి. అందులో నాకు U సర్టిఫికేట్ వుంది. ”

“తెలివైన వాడివి పైకొస్తావ్! మీది చౌడేపల్లనుకుంటా..... ఆ చాతీ కొంచెం లోపలికి దోపుకో నాయనా. ఈ సారి పైకప్పు కాకుండా అలా ఏటవాలుగా కిటికీ లోనుండి ఆకాశం చూడు. అక్కడ ఒక సింహాసనం కనిపిస్తుంది”.

“ఆ కనిపించింది. దాని మీద  ఎవరో యూరి గగారిన్ గాడు కూర్చుని వున్నాడు. మెళ్ళో వజ్రాల హారాలు చాలా వున్నాయి.”
“ఇక ఇటు వైపుకు తిరుగు. ఆ యువకుడెవరో కాదు.గద మగధ సామ్రాజ్య యువరాజు.  నువ్వే. అది నీ పూర్వ జన్మ.”

“అబ్బా! ఇప్పుడా యువకుడు మహేష్ బాబులా వున్నాడు స్వామీ. ఏమన్నారు అది నేనా? అయితే ఇప్పుడున్న మహేష్ బాబు నాకు డూపన్నమాట. వుండండి స్వామీ ఇప్పుడే ఓ ఫోటో తీసుకుంటా…”
“ఎందుకు నాయనా..”

“ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చెయ్యాలి స్వామీ.”
“అలా ఆల్జీబ్రా మెలికలు తిరగటం ఆపి ఆ వృత్తాంతం వింటావా?”

“అలాగే. అందులో ఎవరున్నా లేకున్నా సమంతా లాంటి యువరాణి మాత్రం వుండాలి స్వామీ నేను ముందుగానే చెబుతున్నా. తరవాత మాటొస్తుంది. ”
“అలాగే కానీ. నువ్వు మాటి మాటికీ వట్ర సుడులు తిరగటాలు… చాతీ వుబ్బటాలు... మీసాలు తిప్పటాలు లాంటివేం చెయ్యకు... ఆ బెల్టు కొంచెం కిందకు లాగి తొడకు కట్టుకో అసలే రాయలసీమోడివి.  నీకు నీ పూర్వ జన్మ లో చేసిన నల్లి కర్మ వృత్తాంతాన్ని చెబుతా విను. ”.

(మళ్ళొస్తా ...)

4 comments:

సూర్యుడు said...

Very Funny.


ధ.భ.నే.శు. అంటే ఏంటండి?

Anonymous said...

TGIF - Thank God its Friday
ధన్యవాదాలు భగవంతుడా నేడు శుక్రవారం.
ధన్య వాదాలు..

సూర్యుడు said...

Thanks, good one :-)

Ragu Vardan said...

news4andhra is an Informative Portal which provides information about the latest news and Entertainment.

Telugu Movie News, Telugu Political News and Telugu Cinema Reviews