Monday, February 05, 2007

మా వూరికి ఎండొచ్చింది.


దాదాపు ఏడు వారాలనుండి మమ్మల్ని వణికించి, రోడ్లను రొచ్చు చేసి, కార్లకు మట్టి రంగులు వేయించి తన ప్రతాపాన్ని చూపిన చలి-మంచు పులి ఎట్టకేలకు ఒక నూతన రికార్డును స్తాపించి కాస్త సేద తీరింది. మొన్ననే నమోదయిన సరి కొత్త రికార్డు -18 F(-28C). వరసగా ఆరు వారాంతాలు మంచు పడ్డం మరో రికార్డు. ఇంకో రికార్డుకు దగ్గరవడానికి ఇంకో పదో పదిహేనో రోజులు వున్నాయి. ఇంతకు ముందు 63 రోజులు భూమి మీద మంచు కరగకుండా వున్నదట. ఇప్పటికి యాభై రోజులు పూర్తయ్యాయి. సూర్య భగవానుడు కాస్త దయ చూపి దర్శనం ఇస్తున్నాడు. పిల్లా పీచు ఆడుకోటానికి బయటికొస్తున్నారు.



అదేం చోద్యమో గానీ ఇక్కడి వాళ్ళు మంచు పడిన తరువాత రోడ్లు శుభ్రం చెయ్యరు గానీ.. సరదాగ షికారు కెళ్ళే బైక్ పాత్ లు (జాగింగ్ కు, సైకిల్ తొక్కే దానికి ఉపయోగించే దార్లు) మాత్రం టంచను గా శుభ్రం చేస్తారు. ఓ రోజు 5 అంగుళాల మందాన మంచు పడి నానా తంటాలు పడి ఇంటి ముందు శుభ్రం చేసుకొని కారు బయటకు తీసి నడుపుతుంటే చూశా మా ఇంటి దగ్గరున్న బైక్ పాత్. అది నున్నగా అప్పుడే గుండు కొట్టించిన తిరపతి గుండు లా నిగ నిగ లాడుతోంది. ఇప్పుడయితే కొన్ని రోడ్లలో చక్కెర పాకం రోడ్డు మీద పొసినట్టు వుంది. దాని మీద అడుగు వేస్తే మన ప్రయత్నం లేకుండా ఓ పది అడుగులు ఉచితంగా వెళ్ళి పోవచ్చు రెండు పక్కటెముకలు విరగ్గొటుకుని. కొన్ని చోట్ల పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాలు వచ్చి బాగా గడ్డ కట్టిన మంచును రాళ్ళను కొట్టినట్టు కొట్టి చిన్న ముక్కలను చేసి ఒక పక్క కుప్ప గా పోస్తున్నాయి. వాటిని కొంత మంది తమ సృజనాత్మ శక్తి ని ఉపయోగించి ఇంటి చుట్టూ కాంపౌండ్ స్తంభాల్లాగా పెట్టుకున్నారు.


ఇంతటి మంచులో కూడా మేము మన సంక్రాంతి ని మరిచి పోకుండా జరుపుకున్నాం. గజ గజ వణికించే చలిలో మా ఆవిడ ఇంటి ముందు ఓ ముగ్గు కూడా వేసేసింది నేను లేవక ముందే.



*** -11F (-28C) చలిలో మా ఆవిడ వేసిన ముగ్గు ఇది.

మా సంక్రాంతి సంబరాలు ఇక్కడి హిందూ దేవాలయంలో జరిగాయి. రెండు నాట్యప్రదర్శనలు మరియు స్వామి చిదాత్మానంద(చిన్మయా మిషన్, హైదరాబాద్) వారి ప్రవచనాలతో మా సంక్రాంతి ముగిసింది. దాని వార్తా విశేషాలు మీరు ఈనాడు లో చూడచ్చు.


*** స్వామి చిదాత్మానంద

4 comments:

spandana said...

లోపల థెర్మల్ బట్టలు పైన మల్ళీ బట్టలు, సాక్సు, బూట్లు, ఆపైన జాకెట్టు, చెవులకు తలకు చుట్టుకునే అదేదో గుడ్డముక్క... ఇన్ని వేసుకొని గానీ కదలనే బయటికి (అందుకే ఈ చలికాలం అంటే తెగ మంట). ఓ ముగ్గుకోసం మీ ఆవిడ ఇంత కష్టపడిందంటే ముగ్గు మీద ఆమెకెంత మక్కువో!
అభినందనలు.

--ఫ్రసద్
http://blog.charasala.com

cbrao said...

మంచు ఎంత ఆనందాన్నిస్తుందో, అంతే అసౌకర్యాన్నీ కలగచేస్తుంది. అతి దేనిలోనైనా బాధిస్తుంది.కాసేపు మీ ఊరు తీసుకెళ్లారు మమ్మల్ని.చలిలో వేసిన ముగ్గు చక్కగా ఉంది.

రాధిక said...

మాకు -22F కానీ ఫీల్స్ లైక్ -28 F .బయటకి వెళితే 2 నిమిషాలకి ఊపిరి తీయడం కష్టమయింది.మరి మీ ఆవిడ ఎలా వేసారో ముగ్గు.రియల్లి గ్రేట్.

Anonymous said...

@ రావు గరూ, ప్రసాద్ గారూ, రాధిక గారూ,

మా ఆవిడ ఎలా వేసుందో అంత చలిలో నాకే అర్థం కావట్లేదు.

మెచ్చుకున్నదుకు (మా)ఆవిడకు చెబుతా.


విహారి