Monday, January 08, 2007

వీసా వచ్చే..... పాస్ పోర్ట్ పోయె......

లండన్ కు పంపిస్తామని మద్రాస్ లో ఉద్యోగమిచ్చి ఒక సంవత్సరమైనా పంపక పోయెసరికి విసుగొచ్చి అమెరికా ప్రయత్నాన్ని మొదలు పెట్టా. అంతకన్న ఎక్కువగా మద్రాస్ బోరు కొట్టింది లెండి. ఒక సంవత్సరం మద్రాస్ లో వున్నా ఒక్క ముక్క కూడా అరవం నేర్చుకోలేదు. దానికి తోడు అందులో పని చేసే కంపెనీ General Manager ప్రాజెక్టు గురించి నోరు విప్పితే అరవం లో అరిచేవాడే వాడే కానీ ఇంగ్లీష్ లో అరిచే వాడు కాదు. ఇక మొదటి ప్రయత్నం లోనే అమెరికా ఉద్యోగం వచ్చేసింది. అప్పట్లో ఒరకిల్ మహత్యం అటువంటిది. "ఒరకిల్ వచ్చా" అంటే "వచ్చు" అని సమాధానం చెబితే చాలు ఇచ్చేసే వాళ్ళు. అమెరికాలో "ఊడిగానికి ఉద్యోగం తయార్" అని రాగానే పాస్ పోర్ట్ పత్రాలు వగైరా వగైరా పంపించిన తరువాత ఇరవై రోజుల్లో వీసా పత్రాలు కూడా వచ్చేశాయ్. అప్పుడు అదో రికార్డు.


ఇక వీసా "ముద్ర" నే తరువాయి. మద్రాసు లోనే ఉద్యోగం చేశాం కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ వున్నారు. ముందు రోజునే స్నానం చేసి అమెరికా కన్సులేట్ కు వెళ్ళా లైన్లో నుంచోవడానికి(దాన్నే పడుకోవడం, పడిగాపులు కాయడం అంటార్లెండి). అక్కడ నాకన్నా ముందు లైన్లో వున్న శ్రీ తాటి చిప్పల్ని మరియూ శ్రీ శ్రీ కొబ్బరి బొండాం చిప్పల్ని దాటి అప్పుడే చార్మినార్ ఎక్స్ ప్రెస్ ,జయంతి జనత ఎక్స్ ప్రెస్, బాంబే ఎక్స్ ప్రెస్ నుండి నేరుగా బ్యాగుల్తో సహా క్యూ లోకి విచ్చేసిన సహచర లైను పౌరులను దాటి వెనకన నిలబడ్డా. తాటి చిప్పలు మరియు కొబ్బరి బోండాం లు అక్కడ దగ్గరలో నున్న బీదా బిక్కి గుడిసెల్లో వున్న పిల్లల రెప్రెజెంటేటివ్స్ అన్న మాట. వాటిని అక్కడ పెట్టి లైను ను రిజర్వు చేసి తరువాత దాన్ని డిమాండు కు తగ్గట్టు అమ్ముకుంటారు.స్వయం ఉపాధి పథకం అన్నమాట. అమెరికన్ కన్సులేట్ వాళ్ళు పరోక్షంగా కూడా ఉద్యోగాలు క్రియేట్ చేశారు. ఆ పవిత్రమైన చిప్పలు వంద రూపాయల నుండి అయిదు వేల రూపాయల వరకు అమ్ముడు పోతాయి. అంతే మరి "మీ అన్ని కష్టాలకు ఆఖరి రోజు ఇదే... అమెరికా అంతా భూతల స్వర్గమే" అని గుర్తు చేసేవి అవే కదా. అమెరిక వచ్చిన తరువాత దాని అర్థం మారుతుంది అది వేరే విషయం.


నేను అలా కొనలేక (కొన బుద్ది కాక సరైన పదం) లైన్లో నిలబడి అక్కడే రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసి చాలా దోమలకు రక్తాన్ని ఉచితంగా అందచేసి నిద్ర వచ్చినప్పుడు అయిదు రూపాయల ధరతో "టీ" లేదా "కాఫీ" అనే మారుపేర్లతో చెలామణీ అవుతూ వుండే వేడి వేడి రంగు నీళ్ళను తాగుతూ..జోగుతూ, జోగుతూ..తాగుతూ ఉదయం నాలుగు గంటల వరకు ఎదురు చూశా. అప్పుడు ముందుగానే నిర్ణయించ బడ్డ స్నేహితుడు రాగానే అతన్ని కొబ్బరి కొండాం చిప్పను చేసి టి.నగర్ లోని రూముకు వెళ్ళి రక్త దాన శిబిర గుర్తులను బాగా రుద్ది స్నానం చేసి వచ్చి నా కొబ్బరి బోండాం ఉరఫ్ స్నేహితునికి "థా" చెప్పి లైన్లో నిలబడ్డా. వాడికి "థా" ఒక్కటే కాదు ఎవడు ముందుగా అమెరికా వెళ్ళినా వాడు అక్కడికెళ్ళి మిగిలిన వాళ్ళకు ఉద్యోగం చూసి పెట్టాలన్న పెద్ద మనుషుల ఒప్పందం కూడ వుంది.


అలా లైన్లో నిలబడి ఉన్నప్పుడు, ఉదయం 7 గంటలనుకుంటా, ఒక కొబ్బరి బొండాం చిప్ప రెప్రజెంటేటివ్ నో లేక వాడి ఫ్రెండ్ నో ఎవరో ఒకతను రక్తం వచ్చేలా కొట్టడం చూశా. ఎందుకలా కొడుతున్నావంటే చెప్పాడు. ఆ పిల్ల వాడు ఒకమ్మాయి పాస్ పోర్టు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడట. అదీ నిజమే అలాంటివి చాలా జరుగుతుంటాయక్కడ. అలా దొంగిలించిన వాటి మీద ఫొటోలు మార్చి లేదా ఆ నంబరును వాడుకుని నకిలీ పాస్ పొర్టులు తయారు చేస్తారట. ఆ ఎపిసోడ్ అయిన రెండు గంటలకు లోపల్నుండి వాచ్ మెన్ వాచ్చి అక్కడున్న వాళ్ళందరికి వరుసక్రమంలో చీటి లిచ్చి లోపలికి పంపాడు. ఆ వాచ్ మెన్ చాల మందికి అప్పుడే గర్భ గుడి తలుపులు తెరిచిన పూజారి లా గా కనిపించాడు. నాకయితే వీసా వస్తుందో రాదో అన్న టెన్షన్ లేదు ఎందుకంటే అప్పుడు మద్రాస్ లో వస్తున్న జీతం కన్న రెండితలు ఇచ్చే ఉద్యోగం నాకు నచ్చిన బెంగుళూరు లో వచ్చింది కాబట్టి. లోపలి కెళ్ళిన రెండు గంటలకు వీసా వచ్చిందని చెప్పి మధ్యాహ్నం తరువాత వచ్చి ముద్రేసిన పాస్ పోర్ట్ తీసుకెళ్ళమని చెప్పారు. ఇంకేం రాని వాళ్ళను చూసి కాస్త జాలి చూపి బయటపడ్డా. సాయంత్రానికి పాస్ పోర్ట్ తీసుకుని ఇక అమెరికా ప్రయాణ ఏర్పాట్లలో పడ్డా.


ఎవరో ఉచిత సలహా ఇచ్చారు ఎందుకయినా మంచిది ECNR(emigration check not required) కూడా నీ పాస్ పోర్ట్ లో తీసేసుకో సింగపూర్ లాంటి దేశాల్లో దిగటానికి పనికి వస్తుంది అని.అప్పుడు తెలీదౌ అని నాకు ఎంత అనుభాన్నిస్తుందో అని. అదే నా పాలిట యముడే కూర్చుంది.


ECNR ఇచ్చేది పాస్ పోర్ట్ కార్యాలయం వాళ్ళే. నేను కొంత కాలం బెంగుళూరు లో ఉద్యోగం చెయ్యడం వల్ల అక్కడే పాస్ పోర్ట్ తెచ్చుకున్నా. ECNR కావాలంటే అక్కడికే వెళ్ళాలి. సరే అని దానికి దరఖాస్తు బరికేసి పాస్ పోర్ట్ కార్యాలయం లో ఇచ్చేసి రెండు పెద్ద సూట్ కేసులు కోనే కార్యక్రమంలో(ఏ సాధారణ భారతీయుడైన గర్విస్తూ చేసే పని) భాగంగా బజార్ల మీద పడ్డా.


పెద్ద సూట్ కేసులు కొనేసి వాటిని రూములో పడేసి "నిన్నే పెళ్ళాడతా" సినిమాని మరో సారి చూసి తరువాతి రోజు "గ్రీకు వీరుడు నా రాకుమారుడు ...ఎంత చక్క గా వున్నాడో...డ్రీం బాయ్ " అని పాడుకుంటూ పాస్ పోర్ట్ కార్యలయానికి వెళితే "టేకు వీరుడు.... మా దొంగపౌరుడు .. ఎంత దొంగగా తెచ్చాడో ...డ్రామా బాయ్.. " అని వాళ్ళు పాట పాడారు నాకు పోటీగా. ఎందుకటే నా పాస్ పోర్ట్ అప్పుడు పోలీసు విచారణ జరిగితే నేను వూళ్ళో లేనట. అంటే నేను చట్ట విరుద్ధంగా పాస్ పోర్ట్ తెచ్చుకున్నానన్నమాట. గుండ్రం గుండ్రంగా నలుపు తెలుపు వృత్తాలు దాటుకుంటూ...గుండ్రం గుండ్రంగా మరిన్ని వృత్తాలు...దాటి ఒక్క సారి ఫ్ల్యాష్ బ్యాక్ లోకి వెళ్ళా.*** ***


జె.పి.నగర్ లోని రూములోనుండి బయటకు వస్తూ వుంటే ఒక ఖాకీ పోలీసు లోపలికి వస్తూ కనపడ్డాడు.నా దగ్గరకొచ్చి.
"ఇల్లి యారో పాసుపోర్టు క్కి అప్ప్లై మాడిద్దారు.ఇల్లి భూపతి యారు" (ఇక్కడ ఎవరో పాసుపొర్టుకు అప్ప్లై చేసినారు).
"నమస్కార సార్.నానే భూపతి"
"అవుదా..నాను వెరిఫికేషన్ మాడబేకు" (అవునా నేను వెరిఫికషన్ చెయ్యాలి).
మనకు చెప్పే దేముంది తంతు ఎలాజరుగుతుందో తెలుసు. ఆమ్యామ్యం సమర్పయామి సమయమొచ్చింది.
"సంతోష.. బన్ని.ఇగో ఈ టూ హండ్రెడ్ రుపీస్ తొగోళిరి" (మంచిది..రండి. ఈ రెండొందలు తీసుకోండి)
"Thanks sir. నాను చెన్నాగా రిపోర్టు మాడితిని" ( నేను మంచి రిపొర్టు పంపిస్తాను).
అలా సంతోషంగా(?)నే వెళ్ళి పోయాడా రక్షక బటుడు.


*** ***గుండ్రాలన్నీ మాయమయి పోయాయి.నా ఫ్ల్యాష్ బ్యాక్ లో ఎక్కడా తేడా కనిపించ లేదు. ఇదెలా జరిగిందబ్బా అని రక రకాలు గా ఆలోచించా.ఎక్కడా సమాధానం దొరకలేదు.ఎందుకయినా మంచిది పాస్ పోర్ట్ అధికారి ని కలుద్దామని లోపలికెళ్ళి మాట్లాడా.వెళ్ళి ఎంతో సవినయంగా మనవి చేసుకున్నా నాకు వీసా వచ్చేసింది ఇంకో మూడు రోజుల్లో అమెరికా వెళ్ళాలని.ఆయన "ఠాట్ వీల్లేదు" పొమ్మన్నాడు.ఇక కుదరదని మా రూమ్మేట్ కు తెలిసిన ACP ఒకాయన వుంటే ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాం.ఆయన ఎంతో సహృదయత తో ఒక పోలీసు ను నాతో పంపి పాస్ పోర్ట్ కార్యాలయాధికారితో మాట్లాడమని చెప్పాడు.ఆ పోలీసు వచ్చి చెప్పినా ఆ పాస్ పొర్ట్ అధికారి వినలేదు.ఎన్ని సార్లు చెప్పినా ఆ అధికారి ఒకటే అన్నాడు "Gentlemen!, if there is a way you can leave the country without passport do so". నేను పళ్ళికిలించి మహా జోకారన్నట్టు "మీరు భలే చిలిపి అలాగెలా కుదురుతుంది బాసు" అని "ప్రస్తుత కర్తవ్య బోధన" చెయ్యమన్నా. ఏం లేదు మేమొక సీలు చేసిన ఉత్తరమిస్తాం దాన్ని తీసుకొని వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఈ పాస్ పోర్ట్ మొహం నీ మొహం ఒకటేనని ఈ దృవపత్రంలో సంతకాలు పెట్టించుకోని రావాలి అని. "చిత్తం ప్రభో మీరంత చక్కగా సెలవిచ్చాక ధిక్కరించే ధైర్యం కూడానా" అని ఆయన దగ్గర సెలవు తీసుకుని సంతకాల సేకరణ యజ్ఞం లో పాల్గోవటానికి బయటికి వచ్చేసరికి సాయంత్రమయింది.


ఆ రోజు రాత్రంతా నా ఫైల్లో తప్పుగా రాసిన పోలీసును నానారకాలుగా తిట్టుకుంటు వుండగానే తెల్లారింది. పొద్దున్నే దంత దావనం అయ్యిందనిపించి మయూర దర్శిని లో ఇడ్లీ సాంబార్, వడ తిని ఒక గుక్క కాఫీ తాగి శ్రీనివాస్ ను వెంటబెట్టుకుని అతని ఫ్రెండ్ ద్విచక్ర వాహనాన్ని అప్పు తీసుకున్నాం. శ్రీనివాస్ కు రథ చోదకుడిగా అవకాశమిచ్చి నేను అర్ధ రథుడై కార్యోన్ముఖులై మొదటి పోలీసు స్టేషన్ కు బయలుదేరాము. అదే జె.పి.నగర్ రక్షక భట నిలయం. ఆ స్టేషన్ దగ్గరకు రాగానే శ్రీనివాస్ ను వదిలి రథం మీద నుండి కింది లంఘించి పద్మ వ్యూహం లాంటి యుద్ద రంగం లో ప్రవేశించా.మనం అడుగుపెట్టే సమయానికి ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదు.


అదృష్ట దేవత "నేను ఎక్కడుంటానో నీకు తెలీదోచ్" అని చెవుల్లో వూదినట్టు అనిపించింది. అలా ఎదురు చూసి చూసి...చూడగా శ్రీమాన్ ఇన్స్పెక్టర్ గారు మధ్యాహ్నానికి వేంచేశారు. మనం వెంటనే వెళ్ళకూడదు ఎందుకంటే రాజు గారికి మన కన్నా కొన్ని పెద్ద పనులుంటాయ్. అవన్నీ అయిన తరువాత పిలుపొస్తే లోపల ఒక ఖైదీని కన్నడ బూతులు తిడుతూవున్న ఇన్స్పెక్టర్ కి ఒక నమస్కారం పడేసి వచ్చిన విషయం చెప్పా. ఆయన నావైపు అదోలా చూసి "If you don't satisfy the people these kind of things will happen" అన్నాడు.


ఔరా! ఎంతటి గీతోపదేశము! చిన్నప్పుడు మానాన్న నాకు దీన్ని భోదించక చాలా తప్పు చేశాడు అని మధన పడుతున్నట్టు నటించి ఈ విషయం తప్పుకుండా నా పిల్లలకు చెప్తానని నా మెదడులో ఒక మూల నున్న ఖాళీలో "గుర్తు పెట్టుకో వెధవా" అనే పేజీ తెరిచి అందులో రాసేసి "But I did pay some money" అని అన్నా దాన్నివినిపించు కోక కవరు అందుకొని అందులో సంతకం పెట్టాల్సిన చోట పెట్టేసి నాతో ఇంకో పోలీసు ను పంపి వాళ్ళ ప్రాంతీయ కార్యాలయానికి(జయనగర్ సబ్-డివిజన్) వెళ్ళమన్నాడు.మరి నేను ఆ కవరు తెరిచేస్తే ఎలాగ అందుకని ఆ పోలీసుడు మనకు తోడు. మళ్ళీ "గుర్తు పెట్టుకో వెధవా" పేజీ తెరిచి "పెద్ద వాళ్ళ ముందు అందునా పోలీసుల ముందు నోరు తెరవకు" అని ఇంకో లైను రాసుకున్నా. శ్రీనివాస్ పూర్ణ రథుడే ద్విచక్ర రథంలో బయలు దేరితే నేను ఆ తోటి భటుడు త్రిచక్ర వాహనంలో జయనగర్ వైపు సాగిపోయాము.


జయనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన తరువాత అదృష్ట దేవత కేవలం సౌండూ మాత్రమే ఇచ్చి అక్కడనుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అక్కడుండాల్సిన DSP రౌండ్స్ కు వెళ్ళాడని చెప్పారు. అప్పటికే సమయం మధ్యాహ్నాం 01:00. ఎదురు చూడగా చూడగా రెండు గంటలకు వచ్చాడు పెద్దాయన. రాగానే ఒక రూములోకి వెళ్ళాడు ఆ వెనకనే 10 అంతస్తుల మల్టీ స్టోరెయెడ్ స్టీల్ క్యారియర్ ఒకతని భుజమ్మీద, పెద్ద అరటి ఆకు అతని చంకలో లోపలికి వెళ్ళింది. పది నిమిషాల తరువాత భుజమ్మీద పెట్టుకుని వెళ్ళిన క్యారీయర్ చెతిలో ఊక్కుంటూ వచ్చింది. అరటి ఆకు రాలేదు. దానికి తోడుగా తమలపాకులు లోపలికెళ్ళాయి. తమలపాకుల అతను బయటికి వచ్చి "సాబ్ మల్కొనిద్దారు"(పడుకొన్నారు) అని చెప్పాడు. అయ్య వారికి ఈ కళలు కూడ వుండాయా అనుకున్నా.


సుఖపురుషుడు....IPS చేస్తే వచ్చే ఆనందమిదే. ఆమూసిన తలుపు దగ్గర "ఇంధ్ర ధనుస్సు" సినిమాలో కృష్ణ పాడిన పాట "నేనొక ప్రేమ పిపాసిని...నీవొక ఆశ్రమ నివాసివి...నా దాహాం తీరనిది..నీ హృదయమ కదలినిది.. తలుపు మూసిన తల వాకిట నే పగలూ రేయి నిలుచున్నా." పాడుకున్నా. అలా పదహారో సారో ఇరవైరొండోసారో పాడిన తరువాత "పిలిచావా ప్రియతమా" అన్నట్లు చక్కగా తల దువ్వుకుని ముఖానికి పోడరు అద్ది, వున్న మూడు వెంట్రుకలను కుడి వైపు నుండి ఎడమ వైపు వేసుకుని బయటకు వచ్చాడు సారు.


అక్కడ వున్న క్లెర్కులకు తలో యభై రూపాయలు సమర్పించుకొన్నాక నా పత్రాలు ముందుకు జరపబడి(జరపడమేమీ లేదు తీసి చెత్త బుట్టలో వెయ్యకుండా వుండడం) సంతకం కావించుకొన్నాయి. నాలాంటి వాళ్ళే ఇంకా ఇద్దరు ముగ్గురు కనబడ్డారు. అందులో ఒక వ్యక్తి తన భార్య పాసు పోర్టు కోసం పరుగులు పెడుతున్నాడు భార్య తో కలిసి. రెండు రోజుల ముందే పెళ్ళయిందట. తన హనీమూన్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ "ప్రేమ యాత్రలకు జయ నగర్ జేపీ నగర్లుండగా బృదావనము నందన వనములేలనో " అని పాడుకుంటూ. అందులో నా భవిష్యత్తు కూడా మాయ దర్పణం లోలాగ కనిపించింది. పెళ్ళి చేసుకుంటే పాస్ పోర్ట్ వున్న అమ్మాయినే చేసుకోవాలి లేక పోతే హనీమూన్ లో ఒకటో రెండో రోజులు వేష్టయిపోతాయి అని నా మెదడు పై అర లో "నా పెళ్ళాం కోసం" పేజీ తెరిచి అందులో గుండ్రంగా రాసుకున్నా.


ఆ పత్రాన్ని తీసుకుని ఆటో లో మళ్ళీ జె.పీ.నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళా ఆ వచ్చిన పోలీసు తో కలిసి. ఆ పోలీసు ఇంకో యాభై తీసుకుని మనసును టచ్ చేస్తూ "నీవు నెక్స్ట్ టైం ఒందు టీషర్ట్ కొడబేకు"(మీరు అమెరికా నుండి వచ్చిన తరువాత నాకు టీషర్ట్ ఇవ్వాలి) అన్నాడు. "నేను నిన్నేసుకున్న టీషర్టే ఇంకా తీయలేదు నీకు అమెరికా నుండి ఇంకో టీషర్టా నీ టీషర్ట్ దొంగలెత్తుకెళ్ళా" అనుకోని. "తప్పకుండా తీసుకొస్తా" అని హామీ ఇచ్చి స్టేషన్ లోపలికెళ్ళి ఆ మిగిలిన సంతకాలు తీసుకొని. అక్కడున్న రథ చోదకుడైన శ్రీనివాస్ తో కలిసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళాం. అక్కడంతా చీమ చిటుక్కుమంటే కింద పడేటంత నిశ్శబ్దం. కర్నాటక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (చిత్తరంజన్ అనుకుంటా) తన గదిలో ఎదో మాట్లాడుతు వున్నాడు. ACP ఒక పోలీసును అక్కడికి పంపించాడు ఏదయినా అవసరమవుతుందేమో అని. ఆయన్ను తీసుకుని లోపలికి వెళ్ళా.IG చాలా గంభీరమైన మనిషి. ఒక IG ని అంత దగ్గరగా చూడ్డం అందునా ఆయనతో మాట్లాడ్డం అదే ప్రధమం. మళ్ళీ "గుర్తు పెట్టుకో వెధవా" పేజీ తీసి ఆ పేజీ అంతా నింపేసే పరిస్థితి వస్తుందేమోనని అనుకుంటూ వుండగా కంచుకంఠం తో అన్నాడు "What do you want?" అని.


నేను విషయం మొత్తం చెప్పబోతే మధ్యలో ఆపి "So you want police verification done?" అన్నాడు. అంతే కదా అంత పెద్దాయన.. బాసులకు బాసు. మనం చెప్పే సోది ఎందుకు వింటాడు అసలు విషయం తప్ప. ఆ వచ్చిన పోలీసు నడిగాడు వీళ్ళు నీకు తెలుసా అని. "వీళ్ళు ACP బంధువులు" అని చెప్పాడు. ఇంకేముంది పని అయిపోయింది. ఆయన సంతకం తీసుకు పాస్ పోర్ట్ ఆఫీసు దరఖాస్తులన్నీ పంపించే కార్యాలయానికి వచ్చాం. అప్పుడు సమయం అయిదు గంటలు అయింది. తొందరగా కవర్ అందించగలిగితే రేపటి కల్లా పాస్ పోర్ట్ వచ్చేస్తుంది. లేక పోతే అమెరిక ప్రయాణం వాయిదా!


అక్కడే అత్యంత కఠిన మైన ముక్కోపి మరియు దూర్వాస మహాముని దగ్గరి బంధువు అయిన ఇన్స్పెక్టర్ తగిలాడు. అతను చెయ్యవలసిందల్లా నా దరఖాస్తును అప్పుడే బయటికి వెళుతోన్న బండిల్ లో పెట్టాలి. ఎంత అడిగినా ససేమిరా కుదరదన్నాడు. డబ్బులిస్తాం గదా అంటే "ఏం డబ్బులిస్తే అన్నీ చేసేస్తామనుకున్నారా" అంటాడు. ACP చేత ఫోను చేయిస్తే "నేను చెయ్యను ఏం చేసుకుంటావో చెసుకో పో" అన్నాడు. మరి ఆ ACP department వేరు ఈయన department వేరు. డబ్బు తీసుకుంటూ ఏ తప్పు లేని దరఖాస్తును కూడ కేవలం తన ఈగో కోసం ఆ రోజు పంపించకుండా తరువాత రోజు పంపించాడు. ఈ సారి "గుర్తు పెట్టుకో వెధవా" పేజీ తీసి అందులో రాయలేదు. ఎందుకంటే ఆ దూర్వాసుడి మాటలు డైరెక్టుగా DNA లో కలిసిపోయాయి.


ఇక పాస్ పోర్ట్ తరువాతి రోజు రాదని తెలిసి మా ఏజెంట్ కి ఫోను చేసి నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి అమెరికా ప్రయాణం వాయిదా వేయించా.ఎట్ట కేలకు రెండు రోజుల తరువాత నా పాస్ పోర్ట్ నా చేతికి వచ్చింది గూడుకు చేరిన పక్షి లాగా.దాన్నో సారి తనివి తీరా చూసుకొని "ఒసేయ్ బుజ్జి ముండా నాకెంత పని పెట్టావే" అని తీసుకెళ్ళి ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేసా అమెరికా వెళ్ళేటప్పుడు బయటికి తీయొచ్చని.7 comments:

Nagaraja said...

ఎంత విహారి అని పేరు పెట్టుకున్నా మరీ ఇంత తిరుగుతారనుకోలేదు... హహ్హహ్హా... రక్త దాన శిబిరం వంటి పోలికలతో బాగా నవ్వించారు. చాలా చాలా బాగుంది.

Naveen said...

పోస్టు పోస్టుకి చాలా మెరుగౌతున్నారు. అద్బుతంగా వ్రాసారు. నేను ముందే అన్నట్టు మీ శైలి బావుంది :)

ప్రవీణ్ గార్లపాటి said...

సూపర్ గా రాసారు అండి.
వీసా యజ్ఞం లో ఎన్ని కష్టాలు పడ్డారో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ప్రసాద్ said...

అన్ని కష్టాలు పడ్డా భలే సరదాగా నవ్విస్తూ చెప్పారు.
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

చాలా బాగా వ్రాసారండి! దీనిని మా వెబ్సైటులో వేస్తే బాగుంటుందనిపిస్తోంది - tlca.com . మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే నాకొకసారి ఈమయిల్‌ చేస్తారా editor @ tlca.com .. శ్రీనాధ్‌

Raj said...

బాగుంది. మీరు కూడా బెంగళూరువాసి అన్నమాట.

Bharath Pinneboiena said...

too good piece of information, I had come to know about your site from my friend sajid, bangalore,i have read atleast 11 posts of yours by now, and let me tell you, your web-page gives the best and the most interesting information. This is just the kind of information that i had been looking for, i'm already your rss reader now and i would regularly watch out for the new post, once again hats off to you! Thanks a lot once again, Regards, tatkal passport hyderabad