Tuesday, April 17, 2007

"మాండలే బే" లో "ఖైదీ నంబరు 300"




లాస్ వేగాస్ లోని "సీజెర్ ప్యాలెస్","బెల్లాజియో","ట్రాపికానా" కేసినో ల వాళ్ళు వాళ్ళ గోడలకు, గేట్లకు కొన్ని రిపైర్లు వుండాయి వాటి కోసం విరాళాలు ఇచ్చేవాళ్ళు కావాలి అని మా కంపెనీ వాళ్ళను అడుక్కోవడం వల్ల మా వాళ్ళు నన్ను అడుక్కొని లాస్ వేగాస్ కెళ్ళి కొన్ని విరాళాలు ప్రకటించి రా అని చెప్పారు.అందువల్ల నేను లాస్ వేగాస్ రావడం జరిగింది. పేరులోనే వుంది "లాసు" గమనించగలరు. ఒరకిల్ కాన్ఫరెన్స్ వుంది అని మభ్య పెట్టి నన్ను పంపేశారు.

ధర్మ రాజు ఎక్కువ పూనడం వల్ల టైమంతా జూదమాడ్డానికే అయిపోతుంది ఇలా అయితే నేను బ్లాగేదెలా? అని ఆలోచిస్తే పొద్దు వాళ్ళు చెప్పిన కాపీ రైట్లు గుర్తొచ్చాయి. ఓ పక్షం రోజులు ఆగితే వాళ్ళ వ్యాసాలు వాళ్ళ బ్లాగులో పెట్టుకోవచ్చు అని. నేను పొద్దు అతిథి కోసం బరికిన వ్యాసముంది దాన్ని యథాతదంగా దింపేస్తే పోలా అని అవుడియా వచ్చింది. అసలే నేను చాలా తెలివయినోడిని. (ఎంత తెలివంటే నేను వేగాస్ లో మిలియెన్లు విరాళాలు ఇవ్వడం లేదు. కేవలం వందలు మాత్రమే ఇస్తున్నాను. "అబ్బో.." ఆనందం తో బాబూ మోహన్ లాగా గుటకేస్తున్నా) ఇదిగో పొద్దు కోసం నేను రాసిన వ్యాసం కింద ఇస్తున్నా.

అసలు నన్ను పొద్దు వాళ్ళు అతిథి గా పెట్టడమేమిటి అని అనుమానమొస్తే ఒక ఆకాశ రామన్న ఉత్తరం వాళ్ళకు రాసుకోండి.వాళ్ళు చానా మంచోళ్ళు కాబట్టే నన్ను మంచోడని సర్టిఫికేటిచ్చారు. అంటే నాకో పేద్ద ముద్దర ఏశారన్నమాట. వాళ్ళదగ్గర మంచిని కొలిచే "మంచో మీటరు" వుంది. కాపీరైట్లు త్రివిక్రం కు ఇచ్చేరనుకుంటా.

అప్పుడెప్పుడో స్కూల్లో చదువుకునేప్పుడు "మాండలే జైలులో" అని ఒక పాఠం వుండేది. ఆ మాండలే జైలులో బాల గంగాధర్ తిలక్ ను పెడితే అక్కడ కూచుని కొన్ని పుస్తకాలు రాశాడట. ఇప్పుడు ఈ భూపతి గగన విహారి తిలక్ ప్రస్తుతానికి "మాండలే బే" లో కూచుని బ్లాగు రాస్తున్నాడు. ఎవరికన్నా తిలక్ ఏంటి అని లాజిక్కొచ్చెన్ వస్తే, తొట్టెంపూడి వేణు లాగా నా సమాధానం....ఇంట్లో మొన్న బేబీ పండు అన్నప్రాశనతో పాటు సత్యనారాయణ పూజ జరిగితే తిలకం పెట్టుకొచ్చా. మాండలే అంటే ఏమిటి అని అడిగితే ఎవరూ చెప్పట్లేదు. "మాండలే జైలులో" పాఠం గుర్తు చేస్తే "అదేంది" అంటున్నారు నేను చదువున్న సిలబస్సే చదివిన తెలుగు సోదరులు. "మాండలే బే" అన్నది ఒక హోటల్ పేరు. అసలు వేగాస్ అంటే ఏంటి తరువాతి టపా లో రాస్తా అంతవరకు ఈ బ్లాగు ఖైదీ నంబరు 300 చదవండి.
:
:
:
:

వారి(పొద్దు) సొల్లు:

ఈ నెల మా అతిథి - బ్లాగు విహాయస విహారి, దోనిపర్తి భూపతి విహారి. ఈయన బ్లాగు చిక్కటి హాస్యానికి ఓ చక్కటి మజిలీ. కొలరాడో తెలుగు సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బుడిబుడి అడుగుల నుండి వడివడి నడకల దాకా తన బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో చెబుతున్నారీ ఆత్మకథా విహారి. ఆలకించండి.

————-

విహారి సొల్లు

పోయిన ఆగస్టు నెలలో అనుకుంటా గూగుల్లో తెలుగు గురించి కాస్త వెతుకుతుంటే తెలుగు బ్లాగర్ల గుంపు పేరు కనపడింది. ‘ఆహా, ఏదో తోక దొరికింది. దాన్ని పట్టుకుని వెళితే మంచి తెలుగు మేత దొరుకుతుంది’ అని దాన్ని వెంబడించాను. అది తీసుకెళ్ళి తెలుగు కోసం తపన పడుతున్న కొంత మంది వున్న గుంపులో పడేసింది. ‘మన తెలుగు కోసం ఓ బ్లాగర్ల గుంపు కూడా వుందా?’ అనుకొని, ‘ఇంకొంచెం తవ్వితే ఇంకెన్ని వుంటాయో?’ అని పలుగు, పార ఎత్తుకొని తవ్వితే తెలుగు సాహిత్యం అంటూ ఇంకో గుంపు పలుగుకి తగిలింది. దాన్ని పట్టుకెళ్ళి నాకిష్టమైన గుంపు పెట్టెలో పెట్టేశా. తవ్వుతున్న కొద్దీ “తెలుగు మిత్ర”, “ఫ్రెండ్స్ ఫ్రం ఆంధ్రా” లాంటివి తగిలాయి. అన్నీ తీసుకెళ్ళి నా పెట్టెలో పెట్టేశా.


‘అన్నీ పెట్టెలో పెట్టుకుంటే ఏం లాభం? వాటిని కాస్త వాడుకోవాలి’ అని మొదట తెలుగు బ్లాగర్ల గుంపులో ఓ చెయ్యి పెట్టా. పెట్టిన తరువాత నా చెయ్యిమీద “ధభేల్” మని ఓ ముద్రేశారు. ఏంటా అని చూస్తే చేతిమీదో నంబరు …..నంబరు 300. అంటే నేను మూడువందల నంబరు ఖైదీ నన్నమాట (ఖైదీ నని ఎందుకన్నానో తరువాత చెబుతా). ఇక ఎటూ నంబరొచ్చేసింది కదా ఎదో ఒకటి చేద్దామని జెండా పండగ నాడు రాజకీయ నాయకులకు గాంధీ గుర్తొచ్చినట్టు అప్పుడప్పుడూ లింగు లిటుక్కుమని అందులో “నేను వున్నాను” అని కేకలు పెట్టే వాడిని. ఆ కేకలు విని తోటి సభ్యులు “నీకు రెక్కలొచ్చాయ్ వెళ్ళి నీ గూడు కట్టుకో”, అన్నట్టు “నీకు కేకలు పెట్టడం బాగానే వచ్చు. వెళ్ళి నీ బ్లాగులో పెట్టుకో. ఇది నీ ఇంటిముందు మర్రి చెట్టు కాదు నీ వాగుడు వింటానికి” అన్నారు.


“మీరు బ్లాగు పెట్టుకోమంటే పెట్టేసుకుంటానా? నేను సెలెబ్రిటీనే కాదు లెజెండ్ లా బ్లాగెలా పెట్టుకుంటా?” అని నోటి నాలుకకు (కాల నాళికలా అనిపిస్తే మీరు సినిమా వజ్రోత్సవాలను బాగా ఫాలో అయ్యారని అర్థం) తాళం వేసి కొన్నాళ్ళు బ్లాగు పరిశోధన చేశా. అప్పుడప్పుడూ, ఎవరి బ్లాగుల్లో వాళ్ళు పెడుతున్న కేకలు చూసి నేను కూడా “పొలి కేక”, “గావు కేక” పెట్టుకుంటూ బ్లాగుల్లో కామెంట్స్ రాయడం మొదలు పెట్టా. ఎక్కువగా రాజకీయాల మీద, బాష మీద, తెలంగాణా మీద, రిజర్వేషన్ల మీద రాసిన వ్యాసాలు బాగా ఆకర్షించేవి. వాటికి నా సమాధానం “డింగో డింగు” అంటూ ఇచ్చేవాడిని. అప్పట్లో నాకు తెలిసిన బ్లాగుల పందిరి కూడలి, తెలుగు బ్లాగర్స్ వుండేవి. వాటిని సందు దొరికినప్పుడల్లా కొత్త బ్లాగుల కోసం “ఫ్రెష్ కావే..ఫ్రెష్ కావే” అని ఎలుక తోక తో కొట్టే వాడిని. పాపం ఎలుక అలిసి పోయేదే కానీ కొత్తవి అంత తొందరగా వచ్చేవి కాదు. ఇప్పుడయితే ఆ ఎలుక ముదిరిపోయిన వీధి రౌడీలాగా నిర్లక్ష్యంగా “ఏ! ఇప్పుడొస్తున్న బ్లాగులు చాలవూ? ఒక్క రిఫ్రెష్ కే ఇన్ని వస్తున్నాయ్ వెళ్ళి వాటి సంగతి చూసి రా, మాటి మాటికి నా జోలికి వస్తే నా ఓనర్ విఘ్నరాజు కు చెప్పి నీ తాట తీయిస్తా” అని బెదిరిస్తోంది.


కొన్నాళ్ళకు “ఝుమ్మంది నాదం..బ్లాగంది పాదం” , “నన్ను ఎవరో చిలికిరి..కలికిరి..కెలికిరి…బ్లాగులోని మత్తు మందు చల్లిరి” , “పరువమా బ్లాగు పరుగు తీయవే..” లాంటి సందేశాలు అశరీరవాణి వినిపించడం మొదలు పెట్టింది. అంటే నాకు ఇక బ్లాగులు రాసే వయసొచ్చేసింది అన్నమాట. ఇంకేం కొత్త కాపురం, “ఇదీ నా మది” అని ఓ బ్లాగుకు ఓపెనింగ్ సెరెమనీ చేసేసి బ్లాగుల గుంపులో పెట్టేసి, కూడలి లో పెట్టమని వీవెన్ కో లేఖ, తెలుగు బ్లాగర్లో పెట్టమని చందూకో లేఖ పెట్టేశా. ఎప్పుడో రాసుకున్న, రాజుకున్న కొన్ని కవితల్ని అందులో పెట్టేసి చేపల కోసం వల వేసిన జాలరి ఎదురు చూసినట్టు కామెంట్ల కోసం ఎదురు చూడ్డం మొదలయింది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాధానం రాయడం మొదలయింది. బాగా నచ్చిన కామెంట్లను నాలుగయిదు సార్లు చదువుకుని కిత కితలు పెట్టుకునేవాడిని. ‘ఇక ఇలా కాదు నాకు తెలిసిన వన్నీ బ్లాగెయ్యాలి’ అని ఇంకో బ్లాగు “నాటకాలు” అని మొదలు పెట్టా. అందులో రెండు టపాలకంటే ఎక్కువ రాయడానికి కుదర్లేదు. మామూలుగా మూడంకె వేసి బజ్జుంటారు. కానీ నేను మాత్రం రెండంకె వేసి గుర్రెట్టా. కొన్నాళ్ళు బండిని లూప్ లైన్లో పార్క్ చేసి వచ్చే పొయ్యే బ్లాగు రైళ్ళను మళ్ళీ చూడ్డం మొదలయింది. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు బాగా ఆకట్టుకున్నాయి. నేనూ అలా రాద్దామని ప్రయత్నించా. మన బొగ్గింజనుకు అంత సీను లేదు అని తెలిసింది. సరేలే ఎక్కడ బడితే అక్కడ ఆగిపోయే “దొంగల బండి” లా ఎందుకు తయారవకూడదు? కిందా మీద పడి, దీర్ఘంగా హ్రస్వంగా, లోపలికి బయటకి, భూమ్మీదా మేఘాల మీద (కార్లో స్పీడుగా అని) అలోచించి..చించి మెదడుకు చిల్లు పెట్టుకుని ఎక్కడెక్కడో వన విహారం, జల విహారం, వాయు విహారం చేసి బ్లాగుకో నామధేయం నా పేరులోనుండే “విహారి” అని పెట్టేశాను. ఇక విహరించడం మొదలయింది.


అలా నేను విహరిస్తూ వుండగా…వుండగా ఈ బ్లాగర్లు ఎప్పుడూ అలుపూ సొలుపూ లేకుండా పొద్దూ పాడూ తెలీకుండా బ్లాగేస్తున్నారు.వీళ్ళకు కొంచెం పొద్దులు తెలియ చేసి బ్లాగులంటే ఇలా వుండాలి అని తెలియ చెప్పడానికి ఓ “పొద్దు” పొడుచుకొచ్చింది. అందరి మన్ననలు పొందుతూ దూసుకు పోతోంది.అలా తెల తెల వారుతున్నట్లు రోజు పొద్దు పొడుస్తూ సద్దుమణుగుతూ వుండగా ఋతువులు మారాయి. వసంతమొచ్చింది. వికసించే పుష్పాలెక్కువయ్యాయి తేనెటీగల సరాగాలు తోడయ్యాయి. అలాంటి తేనెటీగల కోసం తమిళంలో వున్న “తెన్ కూడు” తెలుగులో కూడా “తేనె గూడు” లా వెలిసింది. ఉచితంగా బాజా వాయించే వాళ్ళుంటే పెళ్ళికి సిద్ధం అన్నట్లు అన్ని బ్లాగు తేనెటీగలు అక్కడ కూడా వాలి మకరందాన్ని చేరుస్తున్నాయి. ఇవన్నీ చూసి శ్రీ కృష్ణ దేవరాయలు “ఏను తెలుగు వల్లభుండ..” అని గర్జిస్తే దేశంలోని పండితులు అందరూ వినమ్రంగా నిలబడి రండి “వైద్య కవి గారూ”(సూదేస్తాని బెదిరించాడ్లే..కత్తుల్లేవుగా) అని తెలుగు పెత్తనమిచ్చి తెలుగు గుబాళింపులు దేశీ పండిట్ లో విరజిమ్మాలని ఆహ్వానించారు. మన తెలుగు బ్లాగర్ల ప్రపంచంలో ఇదొక అధ్యాయం.


టపాలు రాసే కొత్తలో ప్రతి దానికి ఉత్సాహపడి పోవటం. టపా రాసిన వెంటనే వాటికి కామెంట్లు వచ్చాయేమోనని ఆత్రంగా చూడ్డం. ఒక్క కామెంటు వచ్చినా వంద సార్లు చదువుకుని కొత్తవున్నాయేమో అని ఎలుక ఎడమ ముక్కుని చావబాదటం. కొన్ని ఎక్కువగా రాగానే చొక్క గుండీలు తీసేసి లుంగీ ఎగ్గట్టి “ఎస్..నేనే నంబెర్ వన్” అని ఎన్టీఆర్ పాట పాడేసుకోవడం (మగ వాళ్ళయితే). ఆడవాళ్ళయితే కొప్పు ముడేసి కొడవలికి సాన పెట్టి “లేచింది..నిద్ర లేచింది మహిళా లోకం” అని పాడేసుకోవడం. ఆ ఉత్సాహంలో ఇంకో టపా దాని నెత్తి మీద రాయటం అందరికీ అనుభవంలో కొచ్చే విషయాలు.


అనుభవంలోకి వచ్చే ఇంకో విషయం. మొగుళ్ళు పెళ్ళాలను గుర్రుమని చూడ్డం. పెళ్ళాలని మొగుళ్ళు గుర్రుమని చూడ్డం. పెళ్ళి కాని వాళ్ళను వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి సినిమాలకు వెళ్ళి పోవడం. ఎందుకంటే బ్లాగొక వ్యసనం. ఎవరో చెప్పినట్టు ఇది “మధుర వ్యసనం”. కాకపోతే జలగ లాగ ఓ పట్టాన వదలదు. బాగా అతుక్కు పోయిన వాళ్ళను “బ్లాగ్ జలగ” అంటారు. ఎవరో ఎక్కడో అన్నారు “బ్లాగిలం” అని కూడా. ఇది ఎంతగా చుట్టేస్తుందంటే ఆఫీసు నుండి ఇంటికెళ్ళే ముందు ఓ సారి కూడలిని రౌండేసి వస్తే కానీ తృప్తి వుండది. అలాగే ఇంటికెళ్ళగానే లాప్టాప్ లో పొద్దున తెరిచి వుంచిన కూడలిని ఓ సారి ఓ F5 (refresh button) అంటే గానీ మనసూరుకోదు. (ఓ F5 అనగానే ముళ్ళపూడి వారి అప్పారావు డైలాగు -”ఓ ఫైవుంటే ఇస్తావూ” గుర్తొస్తోందా?) అందరూ బ్లాగులకు ఖైదు అయిపోతారు. అందుకే అన్నా “ఖైదీ” అని. నేను ఖైదీ నంబరు 300.


ఇంకో రెండు మూడేళ్ళకు ఓ పెళ్ళయిన జంట మన ముందుకొచ్చి “ఆ బ్లాగులో ఆయన టపా చూసి నేను పడిపోయా” అని ఆవిడ,
“ఆ టపాకు ఈ సమాధానం చూసి ఈవిడను నేను లేపా” అని ఆయన చెప్పే రోజులు. తమ బ్లాగు ప్రేమ కథలు చెప్పి “ఈ బ్లాగు మమ్మల్ని కలిపింది కాబట్టి మా బుడ్డోడు/బుడ్డిది పుట్టిన రోజు సందర్భంగా ఈ బ్లాగుల సంఘానికి ఓ వెయ్యిన్నూటపదార్లో లేక లక్షా నూటపదార్లో ఇస్తాం” అని చెప్పే రోజులు వస్తాయి. (బ్రహ్మచార్లూ గాల్లో రింగులు రింగులు వేసుకొని విహరిస్తున్నారా…కాస్త ఆగండి)


తెలుగు బ్లాగర్లు ఇప్పుడు అయిదొందలు దాటారు. బ్లాగులేమో ఓ మూడొందలు వున్నాయి. రాసే టపాలు లెక్కకు మిక్కిలిగా వుంటున్నాయి. ఇప్పుడు చదివిన టపాలకు ఎంత బాగున్నా కామెంట్లు రాసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. భ్లాగులను ఓ పళ్ళ తోటతో పొలిస్తే, రెండు నెలల క్రితం వరకు ఏ చెట్టు ఎక్కడుందో ఏ పండు ఎక్కడుందో ఏ చెట్టుకు ఎలాంటి కాయలు కాసేవో తెలిసేది. ప్రతి చెట్టూ, దాని పుట్టు పూర్వోత్తరాలూ తెలిసేవి. ఇప్పుడు ఇలాంటి ఫలాలను అందించే బ్లాగులు ఎక్కువయి పోయాయి. ఎన్ని ఆరగించాలో ఎలా అరిగించుకోవాలో తెలియడం లేదు. ఒకరికొకరు పోటీగా రాసేస్తున్నారు. ఇంతగా మన “తెలుగులు (తెలుగు వాళ్ళు)” లాగుతున్నారంటే దానర్థం మన తెలుగుకు మంచి రోజులు వున్నట్టే.


ఇక్కడ నాకు ఇరవై ఏళ్ళ క్రితం చదివిన జోకు గుర్తుకు వస్తోంది.
“సిడ్నీ షెల్టాన్ తెలుగు నేర్చుకుంటే ఎలా ఫీలవుతాడు”
“తెలుగు లో నేనిన్ని కథలు ఎప్పుడు రాశానబ్బా” అని ఆశ్చర్య పోతాడు.

కాపీ అయితే నేమి, సృజనాత్మకత అయితే నేమి, సాహిత్య పరిశోధన అయితేనేమి తెలుగులో రాసే వాళ్ళు కొల్లలుగా పుట్టుకు వస్తున్నారు ఈ పరుగులు పెట్టే ఆధునిక జీవితంలో.

ఓం బ్లాగ్వ్యసనం ప్రాప్తిరస్తు !!!

-----

3 comments:

కొత్త పాళీ said...

అరే, బొమ్మలో చూస్తే చిన్నపిల్లాళ్ళా ఉన్నారు, మీరూ నేను చదివిన తెలుగు వాచకమే చదివారా?
పూర్వకాలంలో బర్మా అనే వాళ్ళు, ఇప్పుడు మారు వేషం వేసుకుని మయన్మార్ అంటున్నారు - ఆ దేశంలో మాండలే ఒక నగరం.

Anonymous said...

@ కొత్త పాళీ గారూ,

నేను కుర్రొడినేమీ కాదు :-) రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వయసొచ్చి రెండేళ్ళయింది.

కొత్త పాళీ said...

అదేం కాదులెండి - యేళ్ళ తరబడి పుస్తకాలు మార్చని మన స్కూలువిద్యా విభాగం మహిమ అనుకుంటున్నాను.