Thursday, May 03, 2007

ధ.దే.ఈ.శు. ఏదో ఒక ఊసు

పిల్లలు స్కూలుకు వెళ్ళే సన్నివేశాలు పిల్లలున్న అందరికి గుర్తుంటుంది. భారత్ లో అయితే ఆరున్నొక్క రాగం తొ మొదలయ్యి చెవులు ఎర్ర రంగులోకి, చెంపలు గులాబి రంగులోకి, వీపు వివిద రంగుల్లోకి వర్ణ సంక్రమమయి ఇంధ్రధనుస్సు వెలిశాక బుజ్జి శాల్తీ నిండైన రిక్షాలోకో, ఆటోలోకో వెళ్తుంది. ఆ వెళ్ళే వాహనాన్ని చూస్తే ఇంధ్ర ధనుస్సు గుంపు అరుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అమెరికాలో అయితే ఆ ఇంధ్రధనుస్సు అంతా ఇంట్లో వుండేట్టు చూసుకోవాలి లేకపోతే నెమలి ఈకల రంగులు గుర్తుకుతెచ్చుకుని ఆ ఈకల ధారి శ్రీకృష్ణ జన్మస్థానం చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మా బుడ్డోడు రంగుల్లేకుండా స్కూలుకు వెళ్తున్నాడు. కాకపొతే మాకే ఎక్కువ రంగుల పడుతున్నాయి వాడి మాటల్తో.


మామూలుగా స్కూలుకు వెళ్ళి వచ్చిన పిల్లలు స్కూల్లో ఆ రోజు ఏమి జరిగిందో గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. దానికి మా వాడు రివర్స్. ఇదిగో నిన్న జరిగిన సంభాషణ మా వాడు K.G. స్కూలు నుండి వచ్చిన తరువాత.


బుడ్డోడి అమ్మ: నాన్న! ఈ రోజు స్కూల్లో ఏమి చెప్పారు?

బుడ్డోడు : నేను చెప్పను.

అమ్మ: అది కాదు నాన్నా స్కూల్లో ఏమి జరిగిందో ఇంట్లో చెప్పాలని నీకు స్కూల్ టీచర్ చెప్పింది కదా.

బుడ్డోడు : నేను చెప్పనంటే చెప్పను అంతే.

అమ్మ: చెప్పు నాన్న ప్లీజ్.

బుడ్డోడు : అయితే నువ్వు పొద్దున్నుండి ఏమి చేశావో చెప్పు అప్పుడు నేను ఆలోచిస్తా చెప్పాలో వద్దో.

అమ్మ: ? ? ?



:

:

3 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

కంటే కొడుకునే కనాలని ఉత్తినే అన్నారా? మీవాడి ప్రతాపం చదవగానే మా అబ్బాయిచ్చిన జెర్క్ గుర్తొచ్చింది. వాడు 5 ఏళ్ళున్నప్పుడు, హోం వర్కు చేసావా అని అడిగితే ఓ అన్నాడు. ఏదీ పుస్తకం చూపించంటే, నేను నిన్నెప్పుడైనా నీ పుస్తకాలు చూపించమని అడిగానా, నేనెందుకు చూపించాలని అడిగాడు. వీళ్ళందరిదీ ఒకే ఆలోచనాబడి(school of thought)అనుకొంటా!

రాధిక said...

అమ్మో బుడ్డోళ్ళు కాదీళ్ళు మహా గట్టోళ్ళు.చూడాలి మా వాడు ఏమి జర్క్ లు ఇస్తాడో?

Nagaraju Pappu said...

"..ఇంధ్ర ధనుస్సు గుంపు అరుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది..."
వావ్.. నేను మళ్ళీ జన్మకోసం దాచుకొన్న అవిడియాలన్నీ మీరిలా కాపిరైట్లని గౌరవించకుండా, క్రెడిటివ్వకుండా వాడేసుకోడం అన్యాయం.