Friday, November 28, 2008

ఈ దుశ్చర్యను ఖండించాలా?

ముంబైలో విదేశీ ముష్కరులు చేసిన మారణకాండను ఖండించాలా? ఎందుకు ఖండించాలి? ఖండించాల్సింది జరిగిన దుస్సంఘటనను కాదు.

ఈ సంఘటనకు శాయశక్తులా సహాయపడిన స్వదేశీ రాక్షసుల కుత్తుకలను ఖండించాలి.
వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీల గుట్టు మట్లు తెలుసుకోవడానికి చూపిస్తున్న స్వామి భక్తి పరాయణత ను దేశ భద్రత మీద పెట్టని ఇంటెలిజెన్సు అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
వస్తోంది మాదక ద్రవ్యమో, మందు గుండో తెలుసుకోకుండా లంచం తీసుకుంటూ ఆయుధ సామాగ్రి ని దేశం లోకి అనుమతిస్తున్న సరిహద్దు నిఘా విభాగం అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
ఒంటి మీది తెల్ల చొక్కా నలగకుండా నలుగురు ప్రజలు కనిపిస్తే రెండు వేళ్ళు పైకెత్తి చూపించే భ్రష్ట రాజకీయ నాయకులకి చూపిస్తోంది చేతకాని తనమని చెప్పి వాళ్ళ చేతులు ఖండించాలి.
సంక్షోభ సమయం లో సంఘీభావాన్ని ప్రకటించకుండా తగుదునమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభుత్వ వైఫల్యమని చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకుల కాళ్ళు ఖండించాలి.

Tuesday, November 25, 2008

ఈ వారం సిద్ధా - బుధ్ధ (వంశాలు, గర్జనలు, బ్లాగులు, ఆటలు)

* * * * * * * *


"రేయ్ సిధ్ధా!!!"
"......"

"రేయ్ సిధ్ధా!!! ఆ గంతులేమిటి ఇలా రా.. క్రికెట్ లో మనోళ్ళు బాగానే ఆడుతున్నారు. నువ్వు ప్రాక్టీసు చేసి దేశాన్నేమీ ఉద్ధరించక్కర్లేదు ఇటొచ్చి కాస్త పని చూడు"
"అయ్య గారూ, నేను క్రికెట్ ప్రాక్టీసు మానేసి చాలా కాలమయింది. ఇప్పుడు నేను ప్రాక్టీసు చేస్తోంది తొడ కొట్టి మీసం మెలెయ్యడం"

"ఏ సంక్రాంతికి కుస్తీ పోటీలు గానీ జరుగుతున్నాయా ఊర్లో?"
"వచ్చే సంక్రాంతి కల్లా ఈ కుచ్చు టోపీలొళ్ళంతా ఎలక్షన్లతో కుస్తీ పట్లు పడతారు కదా. మునెమ్మలా నాక్కూడా ఏదైన చాన్సు వుంటుందేమోనని ఇప్పట్నుండి తొడ కొట్టడం ప్రాక్టీసు చేసుకుంటున్నా. ఇప్పుడు తొడ కొట్టడం, మీసం మెలెయ్యడం, గాల్లో ముద్దులివ్వడం.. అదే కదా ఫ్యాషన్"

"నువ్వు తొడ కొట్టడం బానే వుంది గానీ. మీసాలు మెలెయ్యాలంటే నీకు వున్నవి మిడత మీసాలు అవి సరిపోవు"
"మీసాలు పెరగడానికి ఏవైనా స్టెరాయిడ్సు వున్నాయేమో కాస్త అంతర్జాలం లో వెతికి పెట్టండి. ఓ సాంపుల్ మా కిలారి పాల్ గారికి కూడా పంపిస్తా"

"అన్ని పార్టీలోళ్ళు అయిపోయారు ఇప్పుడు పాల్ మిగిలాడన్న మాట. ఈ గర్జన వంశం, తొడ కొట్టే వంశం, ముద్దులిచ్చే వంశం, సర్ప వంశం వాళ్ళతో ఎక్కడ పోటీ పడుతాడు"
"అరె! ఆ నాలుగో సర్ప వంశమేంది కొత్తగా?"

"ఆ నలుగురు హీరోల్లో మూడో హీరో వున్నాడు కదా. ఆయనదే సర్ప వంశం"
"అది అక్కినేని వంశం కదా?"

"కాదు. మొన్న కింగు ఆడియో విడుదలప్పుడు అక్కినేనే చెప్పాడు. నా పేరులో పాముంది, నా కొడుకు పేరు లో పాముంది, నా మనవడి (నాగ చైతన్య) పేరులో కూడా పాముంది అని. బుజ్జి సర్పం కూడా 'నేను ఇలా ప్రేక్షకుల మీద బుస కొట్టడానికి రెండేళ్ళ నుండి ఎదురు చూస్తున్నా' అని చెప్పింది. సో అది సర్ప వంశమన్న మాట"
"ఆ నలుగురు హీరోల్లో ముగ్గురు మూడు పార్టీల్లో ఫిక్సయిపోయారు కదా. నాలుగో ఆయన కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతే బావుణ్ణు. ప్రేక్షకులు నిశ్చింతగా చింత కాయల బదులు చింతాకు పులగూర చేసుకుని తింటారు. బహు జన సమాజ్ పార్టీలో చేరి బడుగు జనాలకు కీడు జరక్కుండా కాపాడుతూ వుంటే బావుంటుంది"

"ఆయనకి కొంచెం దైవ భక్తి ఎక్కువ, కొంచెం వేదాంతం మనిషి. బి.జె.పి. అయితే బావుంటుందేమో"
"'ప్రేమించుకుందాం రా', 'పెళ్ళి చేసుకుందాం రా' లా 'బి.జె.పి లో చేరదాం రా' అనే సినిమా తీసి రాజకీయ రాజ్యం లోకి రాకెట్ లో రోదశీలోకి వెళ్ళిన రాకేష్ శర్మ లా, రణ గొణ ధ్వనుల రాక్షస రహదారుల రాజధానిలో రివ్వున రాసుకు దూసుకు పోయే రీగల్ క్యాబులా, పీడిత తాడిత ప్రజలను ఆదరించి, అభిమానించి, పరిపాలించే ప్రభువులా వస్తే అందరినీ సంతోష పెట్టిన వాడవుతాడు"

"నువ్వు ఆశు కవివయిపోయావురో?"
"డైరెక్టుగా తిట్టమని మీకెన్ని సార్లు చెప్పాలి అయ్యగారూ? మీకు ఆ హక్కు వుందని ఎప్పుడో చెప్పానుగా. ఇలా డొంక తిరుగుడు గా మారెప్ప... చింతకాయల రవి... అని అనడమెందుకు"

"సడేలే. వెళ్ళి మిరపకాయలు బాగా దట్టించి ఓ పెసరట్టు వేసి కొబ్బరి చెట్నీ తో పట్టుకు రాపో.."
"ఇవిగోండి"

"అట్టు అదరగొట్టావ్ రో. ఏవిటి బ్లాగుల్లో కొత్త రెసిపీలు గానీ చూస్తున్నావా?"
"ఆయనెవరో భాస్కర్ రాజట నల భీమ పాకం అని మొదలు పెట్టి భలే ప్రయోగాలు చేస్తున్నాడు. నేను కూడా ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టా. వచ్చే వారం మీకు ఐస్ క్రీం పప్పు విత్ జామూన్ బిర్యాని. సైడ్ డిష్ గా ఉప్మా సూప్ చేసి పెడతా"

"హుం.... బ్లాగులు పెరిగిపోతున్నాయి."
"అవునండి ఏం జదివేట్టు లేదు..ఏం రాసేట్టు లేదు.."

"చంపేస్తా వెధవా... రాయక పోతే పోయావ్ చదివేదన్నా సరిగ్గా చదువు ఏడువు. లేకపోతే నేను ఎలాంటి వంటకాలు తినాల్సి వస్తుందో ఏమో. ఇంటర్నెట్ కనెక్షన్ పీకించేస్తా"
"ఊ..అలానే అంటారు. పీకించిందేం లేదు"

"ఆ బుంగ మూతేంటి? పదారేళ్ళ కుర్రాడిలా? కొత్త బంగారు లోకం రివ్యూ గానీ చదివావా?"
"ఆ మీరు మరీను, కుర్ర కారు బ్లాగులు చూస్తే కుర్ర తనంగానూ, చరిత్ర బ్లాగులు చూస్తే చరిత్ర కారులు గానూ, భక్తి బ్లాగులు చూస్తే భక్తులు గానూ, పాటల బ్లాగులు చూస్తే పాటగాళ్ళు గానూ, వంటల బ్లాగులు చూస్తే వంటవాడి గానూ, ఆవేశం బ్లాగులు చూస్తే.."

"ఇక ఆపెయ్. నా కర్థమయిపోయింది. ఈ రోజుకి నీ నోటి టపా కట్టెయ్."
"అలాగే"

* * * * * * * *


"అయ్యగారూ! మనమిద్దరం ఈ రోజు ఒక ఆటాడుకుందాం"
"సరే. నువ్వు తొడ గొట్టు. నేను మీసం మెలేస్తా"

"అబ్బే అదికాదండి. మనం తెలుగు సంఘమాట ఆడుకుందామా?"
"ఓ అదా! నువ్వు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు, నేను తిరుపతి ఎంపీ గా పోటీ చేస్తున్నట్టు ఆడుకుందాం.."

"మీ ఫ్యూజు ఒక పక్క బాగా పీకేసింది"
"ఏం. అమెరికా తెలుగు సంఘాలోళ్ళు చేసే పని అదే కదా"

"ఆ ఆట లో మజా ఏముంది. నేను చెప్పేది అది కాదు"
"మరి?"

"మీరు నన్ను బహిష్కరించండి... నేను మిమ్మల్ని బహిష్కరిస్తా... మీరొక పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వండి దానికి కౌంటర్ గా నేనొక స్టేట్ మెంట్ ఇస్తా"
"!!!"

"ఏం అలా అయిపోయారు"
"ఏం లేదు నేను వెళ్ళి రెస్టు తీసుకుంటా. ఎవరొచ్చినా డిస్టర్బ్ చెయ్యాకు"

"అలాగే. ఎవరన్నా వస్తే రామ కోటి రాసుకుంటున్నాడని చెబ్తా"

* * * * * * * *

Sunday, November 23, 2008

ఒబామా నాకెందుకు నచ్చలేదంటే...

* * * * * * * *


దేశంలో గరీబోళ్ళు ఎక్కువయ్యారని ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' అంది. పదవి లోకి రాగానే గరీబోళ్ళకు చాలా చేసింది...
గరీబోళ్ళు హ్యాప్పీ..
రాష్ట్రం లో బీదోళ్ళు ఎక్కువయిపోయారని రెండు రూపాయలకే బియ్యమిస్తానన్నాడు అన్న ఎన్టీఆర్. రాగానే ఇచ్చాడు...
బీదోళ్ళు హ్యాప్పీ...
రైతులు బ్యాంకు ఋణాలు కట్టలేరని మాఫీ అన్నాడు చెన్నా రెడ్డి. పదవిలోకి రాగానే ఋణాలు మాఫీ...
రైతులు హ్యాప్పీ...
కరెంటు మాఫీ అన్నాడు వై.ఎస్. పదవిలోకి రాగానే కరెంటు చార్జీలు మాఫీ...
మళ్ళీ రైతులు హ్యాప్పీ...
అమెరికా ఎకానమీ బుష్షు కాలం లో భ్రష్టు పట్టిపోయిందని,ఇంటి ఋణాలు(మార్టుగేజు) కట్టలేక కొంపలు కొల్లేరవుతున్నాయని(ఫోర్ క్లోజర్సు) అన్నాడు ఒబామా. పదవిలోకొస్తే ఇళ్ళ ఋణాలు మాఫీ అంటాడేమో ..నేను కూడా హ్యాప్పీ అనుకున్నా..ప్చ్..
ఇప్పుడు నేను నాట్ హ్యాప్పీ...


మీకు తెలుసా?: ఒబామా ట్రాన్సిషన్‌ టీము 15 మంది లో భారతీయ సంతతివారు నలుగురు.

* * * * * * * *

Thursday, November 20, 2008

ఎకానమీ సునామీ... దీనిక్కొంచెం మెంటల్.

* * * * * * * *

అన్ని దేశాల ఎకానమీలు సున్నా అయి సున్నకెంత విలువుందో చూపిస్తాం అని సునామీ సృష్టిస్తున్నాయి. దీనికి మెంటలా అంటే అవును. ఓ రోజు తారా జువ్వలా రివ్వున ఎగసి పడుతుంది ఇంకో రోజున తుస్సు తుపాకీ అని పుటుక్కుమని నేల పడుతుంది. అక్టోబరు మొదటి వారం లో రికార్డు స్థాయిలో అమెరికా డౌ జోన్సు ఇండెక్సు 800+ పాయింట్ల పతనం..(చరిత్ర సృష్టించింది) మళ్ళీ వారం తిరక్కుండానే రికార్డు స్థాయిలో 800+ పాయింట్ల వృద్ధి..(మళ్ళీ చరిత్ర సృష్టించింది). సహజంగా ఏ దేశం సంక్షోభంలో పడినా ఆ దేశపు కరెన్సీ చతికిల పడుతుంది.(సోవియట్ రష్యా కింద పడ్డప్పుడు రూబుళ్ళ విలువెంతుందో అందరికీ గుర్తుండే వుంటుంది. రష్యాకు రూబుళ్ళలో మనమివ్వాల్సిన డబ్బు ఏ అయిదో, పదో శాతానికి పడికిపోయింది). కానీ అమెరికా డాలర్ విలువ ప్రపంచం లోని ప్రతి కరెన్సీ తోనూ పెరుగుతోంది. గుడ్డిలో మెల్లంటే ఇదే. మతులు పోతున్న ఈ సమయములో దిగుమతులకు ఊరట. ఖజానా ఖాళీ అయితే ఇదేం ఊరట అంటే అయిసు ముక్క లేకపోయినా అయిసు పుల్ల చీక్కోడం లోని తృప్తి ఇదే. ఇక మన రూపాయి నువ్వెక్కడ అంటే నేను హాఫ్ సెంచురీ నాటవుట్ అంటోంది. జనవరిలో 21,000దాటి చుక్కల్లెక్కేసిన బొంబాయి స్టాకు ఇండెక్సు ఇప్పుడు ఎనిమిది వేల దగ్గర ఎగరలేక పీక్కు పోయిన రెక్కలతో బిక్క చచ్చి పోయింది.

ఈ దెబ్బలకి ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోవడం సంగతేమో గానీ ప్రాడక్టివిటీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రతోడూ పనిచ్చిన పదినిముషాలకు పూర్తి చేసి ఇంకా పనేమన్నా వుందా సార్ అని అడుగుతున్నారు. లేకపోతే ఉద్యోగానికి ఎసరొస్తుందని భయం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు ఎంత బాగా పని చేసినా పింకు స్లిప్పు బారి నుండి తప్పించుకోవడం సులభతరమే కాదు.

ఇప్పటికే భారత్ లో కొన్ని కంపెనీలు కొంత మందిని పిప్ (పర్ఫార్మెన్సు ఇంప్రూవ్మెంట్ ప్లాన్) లో పెట్టాయి.మరి కొంత మందికి శనక్కాయలకు బదులు సున్నలు చేతిలో పెట్టాయి. ఈ కేటగిరీల లో వున్న వాళ్ళ మీద మొదట దెబ్బ పడుతుంది. సాధారణంగా మొదటి దశ పింకు(ఉద్వాసన) స్లిప్పు ఇచ్చే ముందు సరీగా పని చెయ్యక పోవడం, తోటి ఉద్యోగులతో సఖ్యత గా లేకపోవడం, ఇంటర్నెట్ చూడ్డం, పని వేళల్లో కేఫిటేరియాలో చక్కర్లు కొట్టడం లాంటి విషయాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఇందులో ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు కూడా వుంటారు. ఇక రెండో దశ లో ఎవరు మిగతా వారికన్నా తక్కువగా పని చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి వుంటుంది.

ఇప్పుడున్న పరిస్థితులతో ఉద్యోగం కాపాడుకోవాలంటే ఒంట్లోని మత్తును పక్కన పెట్టి ఒళ్ళు వంచి పని చెయ్యడం ఉత్తమం. ఒకప్పుడు "ఆఁ నన్నెవడు పీకుతాడు" అని మీసాలు మెలేసి నిమ్మకాయలు నిలబెట్టిన వీర సామ్రాట్టులు నీరసంతో ఆ నిమ్మకాయలు పిసికి జ్యూసు తాగి ఎక్ స్ట్రా గా పని చేస్తున్నారు పీరియెడ్. ఆఫీసులో బెస్టు ఇంటర్నెట్ యూజర్ అవార్డు రాక ముందే అంతర్జాల సందర్శనం పూర్తిగా ఆపేస్తే మంచిది. దాని బదులు ఆ సమయాన్ని కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కోసం కేటాయిస్తే మరీ మంచిది. ఎందుకంటే గ్రహ చారమో, ఉప గ్రహాచారమో బాలేక ఉద్యోగం ఉష్ కాకయితే బయట ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ. వాళ్ళతో పోటీ పడి కాకిలాగ కావు కావు మంటే వేరే ఉద్యోగాలు రావు. ఓ నెల క్రితం మా కంపీనీ వాళ్ళకు ఒక డి.బి.ఏ. (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) కోసం 140 రెస్యూమే లు వచ్చాయి. అంతకు ముందు ఒకటీ అరా కూడా వచ్చేవి కాదు. భారత్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి వుందనుకుంటున్నా.
* * * * * * * *

బాగా పని చేసినా పీకేస్తారు కదా అంటే ఒక్కోసారి నా ఫ్రెండుకు జరిగినట్లు జరగచ్చు. అతను కాలిఫోర్నియాలో పని చేస్తాడు. రెండు రూపాయల పనేదన్నా వుంటే పావలా జీతం తీసుకుంటున్న అతనికి ఇచ్చేవారు. పావలాలు తీసుకుంటూ శనాది వారాలు కూడా పని చేస్తూ వాళ్ళకు చాలా రూపాయలు మిగలబెట్టే వాడు. ఇంత చేసినా పరిస్థితి బాలేదని కంపెనీలో దశల వారీగా పింకు స్లిప్పులు ఇవ్వడం మొదలు పెట్టారు. కంపెనీ వాళ్ళేమో ఉదారంగా, పీకేసిన ప్రతోడికీ సంవత్సరం సర్వీసుకు ఒక నెల జీతం చొప్పున సెవెరన్సు ప్యాకేజీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ లెక్కన మనకూ ఎనిమిది నెలల జీతమొస్తుందని లెక్కలేసుకొని భారత్ కి తిరిగి వెళ్ళి పోదామని సంబరంగా వున్నాడు. తన ఇల్లు అమ్ముకోని భారత్ కు ఓ ట్రిప్పు వెళ్ళి వచ్చాడు. శని గ్రహం దాటొస్తే ఉపగ్రహం తీసుకెళ్ళి దింపొచ్చినట్లు ఓ ప్రమోషనిచ్చి రెండు సెనిక్కాయలు చేతిలో పెట్టి మూట సెనిక్కాయలు ఖర్చయ్యే చోటికి బదిలీ చేస్తామన్నారు. అసలే వున్న సెనిక్కాయలు భారత్ లో ఖర్చు పెట్టుకొచ్చాడు వాళ్ళిచ్చిన రెండు సెనిక్కాయలు ఒద్దని చెప్పేశాడు.పావలాకే బాగా పని చేస్తాడని ఉద్యోగం లో నుంచీ పీకనూ లేదు. ఇప్పుడు ఉప గ్రహాలను చూస్తే పారిపోతున్నాడు.

ఇంత ఎకానమీ తంతున్నా కొంత మంది తమ ఎంజాయ్ మెంట్ లు మాత్రం మానటం లేదు. ఇక్కడ నా ఫ్రెండోళ్ళ ఆఫీసులో ఎవడో వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఆ సాయంత్రం పెద్ద మందు పార్టీ ఇచ్చార్ట ఆఫీసు వాళ్ళందరూ కలిసి. ఇక మీడియా వాళ్ళయితే ఓబామా వైట్ హౌసుకు తీసుకెళ్ళడానికి ఏ కుక్కయితే బావుంటుంది అని కొన్ని కుక్కపిల్లలను సెలక్టు చేసి ఓటింగుకు పెట్టారు. ఈ కుక్క పిల్లల్లో కూడా తక్కువ అలర్జీ వున్న బొచ్చు కుక్క పిల్లల ఫోటోలు పట్టుకొచ్చి పెట్టారు. ఒబామా పిల్లల్లో ఒకరికి అలర్జీలున్నాయట మరి. రా.త.దె.కొ.

ఇంత జరుగుతున్నా షాపింగు చేసే వాళ్ళకోసం థాంక్సు గివింగు బ్లాక్ ఫ్రైడే వస్తోంది.కొనేవాళ్ళు కొంటూనే వుంటారు. ఇప్పుడే చాలా స్టోర్లవాళ్ళు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంటారు. మీరు అమెరికాలో వుండి అలాంటి డీల్సు కోసం ఎదురు చూస్తుంటే నేడే సందర్శించండి డీల్ అంకుల్..డీల్ అంకుల్..డీల్ అంకుల్... దీనికి నీకు ఏమి సంబంధం అంటే నేనే ఆ డీల్సు లోడర్ని, క్లీనర్ని, ఓనర్ని. ఎందుకు మొదలెట్టావ్ అంటే ఉద్యోగం పోతే బ్యాకప్ కోసం. మా ఆఫీసులో రెండు సునామీలు తప్పించుకున్నా ఇప్పటికి. పోయిన్నెల్లోనే ఒకటి జరిగింది. ఇంకోటొస్తే తప్పించుకుంటానో లేదో తెలీదు. అందుకే ఈ డీల్ మావయ్య.. ఇందులోంచి మీరు ఏ స్టోరు లో కొనాలంటే ఆ స్టోరు లింకు మీద నొక్కి ఆ స్టోరు నుండి కొనుగోళ్ళు చెయ్యొచ్చు. పన్లో పనిగా మీ స్నేహితులకు వాళ్ళ స్నేహితులకు కూడా చెప్పండి. హ్యాప్పీ డీల్సూ...

* * * * * * * *


చివరగా నా ప్రశ్న నా సమాధానం:
ప్రశ్న: 2001 లో కూడా ఎకానమీ తన్నింది కదా. అప్పుడు లేనిది ఇప్పుడెందుకంత పరిస్థితి వచ్చింది.
సమాధానం: అప్పుడు వాలు వీధి పెట్టుబడులలో నేను వున్నాను కాబట్టి ఒడ్డున పడింది. ఇప్పుడు నేను లేనుగా.
* * * * * * * *