Monday, January 29, 2007

వజ్రోత్సవాలు అభినందించాలో ఆలోచించాలో?

మన సినిమా వజ్రోత్సవాలు ముగిసాయి ఘనంగానే. "శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి". అన్నట్లు టీవీలకు అతుక్కుపోయిన వాళ్ళకు వీలయినంత వినోదం అందించింది.ఎంతో మంది పెద్ద వాళ్ళు తనకు తోచిన విధంగా స్పందించారు వేదిక మీద. కొంతమంది రాసుకొచ్చింది చదివితే మరికొంతమంది ఇంతరులు రాసి పెట్టింది చదివారు ఇంకొంతమంది మనసులో వున్నది చదివారు. ఏదేమయినా ఏ రాష్ట్ర చిత్రసీమా చెయ్యని పని మన తెలుగు చిత్ర పరిశ్రమ వారు చేశారు. కొన్ని పరిశ్రమలు వంద సంవత్సరాలు పూర్తయినా ఎందుకు చెయ్యలేదో అన్న దానికి కారణం మన వజ్రోత్సవాల ముగింపు చెప్పింది. ముగింపెలాగయినా అంత పెద్ద కార్యాన్ని నెత్తినెత్తుకుని( ఎన్ని మొటిక్కాయలు పడ్డా) పూర్తి చేసిన నిర్వాహకులకు నా అభినందనలు.

ఒక్క సారి జరిగిన దానిని ఆత్మావలోకనం చేసుకుందాం.

నాగేశ్వర రావు గారు మాత్రం వజ్రాల్లాంటి మాటలను నొక్కి వక్కాణించారు. సినిమాలు చూసి ప్రజలు పాడయిపోతారు అన్న దాన్ని ఖండిస్తూ సోదాహరణంగా తన సినిమాల గురించి చెప్పారు. అది తన స్వొత్కర్ష కావచ్చు, ఆ సినిమాలందించిన దర్శక రచయితల ప్రతిభ కావచ్చు. వాటిలో నటించింది తనే కాబట్టి ఒక్కో సినిమా గురించీ, దాని సందేశాలను చక్కగా చెపారు.

కళా తపస్వి కె.విశ్వనాథ్ గారు తనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వస్తే ఎలా వుంటుందో తెలీదు కానీ ఈ పురస్కారం అంతకన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చింది అన్నారు.

ఒక్కో రోజు ఒక్కో వ్యాఖ్యాత. మొదటి రోజు కనిపించని అతిథులు(?) రెండో రోజు ప్రత్యక్షం. ఒక్కొక్కర్నీ చూస్తూ వుంటే మనం చిన్నప్పట్నుంచి చూసిన సినిమాల్లో వారు వేసిన పాత్రలు గుర్తుకు రావడము మన ఙ్ఞాపకాల దొంతర్లకు పరీక్షలు పెట్టం జరిగిపోయింది. అన్నీ సవ్యంగా జరిగిపోతున్నట్లు గా అగుపించింది. ఇక చివరిదైన మూడో రోజు మధ్యహ్నాం తరువాత సినిమాల్లో వున్న మంచి క్లైమాక్సును ఇచ్చి వజ్రోత్సవాలకు ముగుంపు పలికి కొత్త పోకడలకు నాంది పలికారు.

ఇక తెర వెనుక్కి వస్తే.....

ఈ ఏర్పాట్లప్పుడు ఏఎన్నార్ గారు చెప్పారు. ఈ ఉత్సవాలకు ఫీజులు పెట్టకండి మనం ప్రజల ద్వారా ఇంత వాళ్ళమయ్యాం వాళ్ళుకు ఇది ఉచితంగా అందివ్వాలి అని. ఆ మాటలను ఎవరూ లెఖ్ఖ చెయ్యలేదు సరికదా ఈ ఉత్సవాలను క్యాన్సిల్ చేద్దాం అని కూడ బెదిరించారు(ట). ఇక తప్పదన్నట్టు ఏఎన్నార్ గారు బయటకు వచ్చేశారట. ఆయన ఓ రెండు లక్షలు ఇచ్చేసి ఇక నేను వీటికి హాజరు కాను అనికూడా చెప్పారట. చివరికి బతిమాలి బామాలి ఆయనను పురస్కారానికి ఒప్పించారు. వజ్రోత్సవ పాట అప్పుడు కూడా తన ని పిలవ లేదట. చివరి నిముషంలో పిలిస్తే రానన్నారట.

ఇక విరాళాలకోసం కొంత మంది ఉదారంగా మరికొంతమంది వికారంగా ఇచ్చారట. చిరంజీవి మొదట 10 లక్షలు ఆ తరువాత ఇంకో అయిదు లక్షలు ఇచ్చారట. ఇక నాగర్జున ఇంకా కొంతమంది దర్శకులు, నిర్మాతలు ఒక్కొక్కరు 5 నుండి 10 లక్షలవరకు ఇచ్చారు(ట). ఇవ్వలేని వాళ్ళకు డోనార్ టికెట్ట్లు 10 అమ్మమని బలవంత పెట్టారు(ట). ఇలా కొన్ని లక్షలో కోట్లో సేకరించ బడ్డాయి.
వేదిక మీద సెట్టింగ్స్ ఒకరు స్పాన్సర్ చేశారు. పాటల దుస్తులు కొంత మంది స్పాన్సర్ చేశారు. ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి మాటీవి వాళ్ళు 1.5 కోటికి పైగా ఇచ్చారు.

ఇంటెర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు అయిన ఖర్చు రోజుకు ఆరు లక్షలు. మళ్ళీ భోజనాల దగ్గరకి ఒచ్చేసరికి మూడు రకాలుగా విభజించారుట. ఇందులో ఎవడు ఎక్కువ డబ్బులు పెట్ట గలితే వాడు స్టార్లను కలిసి ఫోటో తీయించుకోవచ్చట. అంతా డబ్బు మయం. ఈ ఉత్సవాలకు లైట్ బాయ్ నుండి స్టార్ల వరకు అందరూ హాజరవోచ్చని ఎవరైన అనుంటే అది గుర్తుకు ఒస్తే అది మీతప్పే.

ఇక రసవత్తరంగా సాగిన క్లైమాక్స్. ఏ స్క్రిప్ట్ లేకుండా అంత రక్తి కట్టించారంటే మన వాళ్ళకున్న సత్తా ఏ పాటిదో వూహించుకోవచ్చు. ఈ శక్తి ని బయట పెట్టగలిగితే ఓ ఆస్కార్ రావడం అంత కష్టమేమీ కాదు.

ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఎన్నో కొన్ని లోపాలుండడం సహజం. "లోపాల్లేకుండ వున్న వాళ్ళను కోరుకోవడం కూడ లోపమే" అని ఒక పాత్ర ద్వారా చెప్పించారు "పెళ్ళయిన కొత్తలో" రచయిత. అంత ఉద్విగ్నమైన క్షణాల్లో కూడ సమన్వయంతో తరువాత మాట్లడతాను అని చిరంజీవి అనడం ఎంతో హుందాతనంగా వుంది. చిరంజీవి అన్న వాటితో నేను అక్షరాల ఏకీభవిస్తాను. మరింకెవరైనా అంత బాగా చెప్పేవాళ్ళు కాదేమో.

తరువాత చెప్పిన మాటలే నాటకీయంగా చెప్పాడు తనకు లెజెండ్ అవార్డ్ ఇస్తున్నప్పుడే చెప్పాను తనకు ఇది తగదని అని. తరువాత ఆ అవార్డును కాల నాళిక లో వెయ్యడం మరింత రసవత్తరం. మరి మోహన్ బాబు కు కూడా చెప్పేవుంటారు నీకు లెజెండ్ ఇవ్వం సెలెబ్రిటీ ఇస్తామని. అప్పుడు ఏమీ చెప్పకుండ అలా వేదిక మీద చెప్పడం మోహన్ బాబు తప్పే అవుతుంది. మోహన్ బాబుకు కూడ ఆ లెజెండ్ అవార్డు ఇచ్చింటే తను కూడా తన అవార్డుని ఆ కాల నాళికలో వేసే వాడేమో?. అది ఇంకొక మహత్తర ఘట్టం అయ్యెదేమో? ఇరవై అయిదేళ్ళ తరువాత విష్ణు వర్ధనో, రాం చరణో వాటిని బయటకు తీసి వుంటే అప్పుడు చూసే వాళ్ళ కళ్ళు మరింత చెమ్మగిల్లేవేమో?

లోపాలు వుండడం సహజమే. కార్యక్రమంలో తెలియకుండ గమనించకుండ జరిగిన వాట్ని లోపాలనడం సహజమే. ఏఎన్నార్ ను మరిచిపోయి ఆఖరు నిముషంలో అడుక్కోవడం లోపమా? జూ.ఎన్టీఆర్ ను అఖరు నుముషంలో పాట కోసం మద్రాస్ నుండి రప్పించి తరువాత చిత్రీకరణ చెయ్యక పోవడం లోపమా? లెజెండ్, సెలెబ్రిటీ అంటూ వేరు చేయడం సబబా? వ్యక్తుల బిరుదులే కొలబద్దలయితే మోహన్ బాబుకు కూడా పద్మ శ్రీ వుంది, డాక్టరేట్ వుంది ఇంకా రాజ్య సభ సభ్యుడుగా పని చేసిన అనుభవమూ వుంది. అందులోనూ తల నొప్పి అనుకున్న వాళ్ళను అందులో వుంచి వేదిక మీదకు రప్పించడం లోపమా? నిజమే మోహన్ బాబు ముక్కుసూటి గా మాట్లాడుతాడు. అది తన కుళ్ళు అనడం అవివేకమే అవుతుంది. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చినప్పుడు నోరు జారిన మాట వాస్తవం.ఒక్క చిరంజీవి తన కూతురు పెళ్ళికి రమ్మనలేదనడం తప్పు. మిగతా వాటి గురించి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనసులో ఒకటి వుంచుకుని బయటికి ఒకటి మాట్లాడే అలవాటు లేనివాడు మోహన్ బాబు. అలాంటి వాడని తెలిసి పిలిచి తనొద్దన్న సత్కార్యాన్ని ఇచ్చి కాదనిపించుకోవడం ఏమిటి? ఇక్కడ మోహన్ బాబు ని పిలవడం ఓదార్యమంటూ ఎవరైనా ప్రశ్నిస్తే అది "రాజకీయం" అంటా నేను.

ఇందులో మహా మంచి మనిషి అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరి బాకాలు వాళ్ళవి. ఒకప్పుడు మెగా అల్లుడు అంటూ వెంట బడి 10 సినిమాలు బుక్ చేసుకున్న ఉద్ధండ పిండాలు పరిస్తితులు తారుమారయితే మొహం చాటేసిన గోముఖ వ్యాఘ్రాలున్న పరిశ్రమ ఇది. అందులో ఇలాంటివి మనకు వినోదం కలిగిస్తున్నాయి. వాటిలో వినోదమే చూడాలి. ఈ పరిశ్రమ కార్పోరేట్ స్తాయికి ఎదిగింది. వాటి పర్యవసానాలు ఇప్పుడు చూస్తున్నాము.

అందుకే కాస్త అభినందించి కాస్త ఆలోచిద్దాం.

3 comments:

చదువరి said...

బాగానే చేసారు, అభినందించాల్సిందే! అయితే మోహన్‌బాబు, చిరంజీవిల ప్రవర్తన మాత్రం ఈ పండుగలో మచ్చే!

వెంకట రమణ said...

వజ్రోత్సవాల గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది.

Anonymous said...

@ చదువరి గారూ,

కష్టపడ్డందుకైనా అభినందించాలి. మీ వ్యాఖ్యలకు ధన్య వాదాలు

@ వెంకటరమణ గారు,

ఢన్యవాదాలండి.

చూడబొతే మన బ్లాగర్లలో చాల మందికి మోహన్ బాబు గురించి రాసింది రుచించలేదు.

విహారి