Tuesday, February 20, 2007

బ్లాగు వాగుడు

బ్లాగులో ఏమి రాద్దామా అని అలోచిస్తుంటే అసలు బ్లాగుల గురించే రాస్తే పోలా అనిపించింది. ఇంకేం అని బుర్రకి సాన పెడదామనుకున్నా. అమెరికా వచ్చిన తరువాత బుర్ర సాన పెట్టేంత ఉక్కు స్థాయిలో లేదు అది కాస్తా ప్లాస్టిక్ పదార్థంగా మారింది. దాన్ని సాన పెడితే ఉన్నది కాస్తా కరిగి పోతుందని సాన పెట్టకుండా మొదలు పెట్టేసా.

బ్లాగర్లు పలు రకాలు మొదటగా వాళ్ళను క్రికెట్ తో పోల్చుకుందాం. చాలా మంది రాహూల్ ద్రావిడ్ లాగా నిలకడ గా బ్లాగులు రాస్తూ ముందుకు పోతున్నవారు కొందరు. అంటే వీళ్ళందరూ కేవలం బ్యాట్స్ మెన్సే అన్న మాట. వీళ్ళని "బ్లాగు ద్రావిడ్ లు" అనవచ్చు. వీళ్ళు చాలా నింపాదిగా అన్ని విషయాలని పరిశీలించి ఆ వచ్చే బాలును (టాపిక్) చూసి మంచిదయితే తమ దయిన స్టయిల్లో(శైలి) దాన్ని బౌండరీ దగ్గరకో లేక గాల్లో లేపి సిక్సర్ గానో మార్చేస్తారన్నమాట. అది సిక్సరయితే బ్లాగర్లందరూ ఓ వారం పాటు చర్చించుకుంటారన్నమాట. ఇంకొందరు మహేందర్ సింగ్ ధోనీ లాగా ధనా ధన్ మని పిచ్చ పిచ్చగా రాసేస్తుంటారన్నమాట. ధోనీ ఏ బాలు ఎలా వచ్చిందని చూడడు అది వేసిన వాడు స్పిన్నరా పేసరా అని కూడ చూడకుండా వీర బాదుడు బాదుతుంటాడు. అలాగే "బ్లాగు ధోనీలు" ఏ విషయం మీద అని కాకుండా అన్నింటి మీదా ఫటా ఫట్ మని బ్లాగుల్ని నింపేస్తారన్నమాట. రాసిన టాపిక్ "గూగ్లీ" నా "యార్కరా" అన్నది రాసిన వాళ్ళకు కూడా తెలీదు.

ఇంకొందరు బ్లాగర్లు ఏదో ఒక దానికే పరిమిత మవుతారు అంటే కవితలు కానీ, చిత్రాలు కానీ సినిమాలు కానీ, సినిమా పాటలు కానీ, మాత్రమే వాళ్ళ ధ్యేయమన్నమాట. వీళ్ళను స్పిన్నర్లు గా, ఆఫ్ స్పిన్నర్లు గా, ఫాస్ట్ బౌలర్సు గా, మీడీయం పేసర్లు గా విభజించవచ్చు. వీళ్ళు కూడా ఒకే సారి అయిదారు వికెట్లు తీసుకునే మ్యాచ్ విన్నర్లుగా మారినప్పుడు బ్లాగర్లందరు అటు వైపు కన్నేసి వాటి స్పూర్తి తో ఇంకొన్ని బ్లాగులు రాస్తారన్నమాట. వీళ్ళని "బ్లాగు హర్భజన్ లు" , "బ్లాగు శ్రీశాంత్ లు", "బ్లాగు పటాన్ లు" అని పిలుచుకోవచ్చు. ఇంకా కొంత మంది మన కపిల్ దేవ్ లాంటి వాళ్ళు. ఏ విషయాన్నయినా అవపోశన పట్టేసి వీలయితే కవతల్లాగా స్పందిస్తారు లేదా పేరాలు పేరాలు రాసేస్తారు. అవసరానికి తగ్గట్టు రాసి "ఆల్ రౌండర్లు " అనిపించుకొంటారు.

ఇంకొందరు మన "లక్ష్మణ్" లాగా పద్ధతి గా బ్లాగుతుంటారు. వీళ్ళని కరివేపాకు లాగా వాడుకుంటారన్నమాట. ఎపుడో ఓ సారి టీం లోకి తీసుకున్నట్టు , "ఇంకొంచెం బాగ రాయొచ్చు" అని ఓ కామెంట్ రాసేసి ప్రశంసించేసి పక్కన పడేసి వీలయితే "నువ్వు లావు తగ్గు" అని వెంగ సర్కార్ చెప్పినట్టు ఓ సలహా పడేస్తారన్న మాట.

అప్పుడప్పుడూ టేం లోకి వస్తూ వెళుతూ వుండే "పార్తీవ్ పటేల్ లు" , "గౌతం గంభీర్ లు", "ఆశిష్ నెహ్రా లు" లాంటి బ్లాగర్లు కొందరు. వీళ్ళు అప్పుడప్పుడూ జన్మకో శివరాత్రి అన్నట్టు రాస్తారన్న మాట. అప్పుడప్పుడూ కూడల్లో, తేనె గూళ్ళో, బ్లాగర్ల సంఘం లో కనిపిస్తూవుంటారు. ఇంకొందరు "వెంకటపతి రాజు", "వెంగ సర్కార్" లాగా బ్లాగులు రాయటం నుండి రిటైరయి పోయి కామెంట్ల కింద, తెలుగు బ్లాగర్ల గుంపు లోనూ కనిపిస్తూ వుంటారు. మరికొంత మంది ఈ బ్లాగర్లకు ఇంకేం చేయాలబ్బా అని ఆలోచిస్తూ పలు ప్రయత్నాలు చేస్తూ వుంటారు కమర్షియల్ గా.

ఇంకొందరు క్రికెట్ మ్యాచ్ చూసి స్పూర్తి పొంది ఇంటికెళ్ళి సందులో పిల్లల తో ఆడినట్టు కూడలి లో చూసేసి "ఓస్ ఇంతేనా నేనూ బ్లాగేస్తా పీకల్దాకా" అని ఓ బ్లాగు రాసేసి "ఓ సారి నా బ్లాగును లుక్కండ్రోయ్" అని అందరికి ఈ-టపా పెట్టేసి వాళ్ళొచ్చి చూసి "అబ్బా కుర్రోడా/కుర్రదోయ్! భలే తెలుగు తున్నావ్ ఇక బ్లాగ్జృంభణ మొదలు పెట్టు" అనగానే రొమ్ము విరుచుకుని వెంటనే ఆవులించుకుని నోట్లో రెండు లేదా మూడు చిటికలేసుకుని నిమ్మళంగా నిద్దర పోయే వాళ్ళు కొందరు. వీళ్ళని "ఉత్తర ప్రేక్షక బ్లాగర్లు" అంటారు.

ఎవరే టైపు బ్లాగరొ కనుక్కోవడానికి బ్లాగర్లందరికోసం అప్పుడప్పుడూ ప్రపంచ కప్పులు జరుగుతుంటాయి దాన్ని "భారత బ్లాగర్ల కప్పు" అని వ్యవహరిస్తారు. ఇవి వ్యక్తి గత విభాగంలో జరిగేటివి అన్న మాట. వీటి గురించి చాలా మంది బ్లాగర్లకు తెలీదు. తెలిసినా కొంత మంది పట్టించుకోరు. పట్టించుకున్న వాళ్ళు "ఆ! ఈ కప్పు నాకొద్దు నా కొచ్చేస్తే ఇతరులు బాధ పడతారు" అని తప్పుకునే నా లాంటి బ్లాగర్లు కొందరు.

హమ్మయ్యా! ఇంత రాసిన తరువాత నా ప్లాస్టిక్ మెదడు ఇంకా వుందా అని తడిమి చూసుకుంటే అది కాస్త అసలు సిసలు మెదడు గా రూపాంతరం చెందినట్టు కనిపిస్తోంది.

నీతి: తెలుగు లో ఆలోచిస్తూ...తెలుగు కోసం పాటు పడితే మెదడు చురుకుగా తయారవుతుంది.

మీరు ఏ టైపు బ్లాగరో మీరే ఊహించుకోండి. మీరు "పార్ధీవ్ పటేల్" బ్లాగరయితే తిరిగి టేంలో కి వచ్చి క్రికెట్ ను చీల్చి చెండాడుతున్న బెంగాల్ పులి "గంగూలీ" బ్లాగరవటానికి ప్రయత్నించండి. "బ్లాగు వాగుడు" మాత్రం మానకండి.

అయ్యా మరియూ అమ్మా!

ఇది ఎవరినీ ఉద్ధేశించి రాసినది కాదనిన్నూ, ఎవరినీ మనసులో వుంచు కొని రాసినది కాదనిన్నూ, ఎవరి మనసూ నొప్పించాలని కాదనిన్నూ, ఎంతో సహృదయతో రాసిందనిన్నూ, నేను అందరిలాంటి మానవ మాతృడననిన్నూ, మీకు ఈ బ్లాగు వాగుడు లో విన్నవించు కొనుచున్నాను.


సిక్సర్ కొట్టేసిన
క్రికెట్ విహారి
(బౌండరీ లైను దగ్గర ఎవరూ క్యాచ్ పట్టకపోతే)

15 comments:

Dr.Ismail said...

బాగుంది మీ బ్లాగాట!'సచిన్ టెండూల్కర్'ని మరచినట్టున్నారు!

రానారె said...

పీకల్దాక బ్లాగుతాననడం భలేగా వుంది. నేనేటైపులోకొస్తాను? జన్మానికో శివరాత్రి టైపా?

Mouni Shankar said...

చాల చక్కగా వివరించారు.ఇంతటి అవగహన వుంటే మాలాంటి వాళ్లకు కు ఉపయోగమే.

Anonymous said...

విహారి గారు

మీ బ్లాగు బాగుంది అండి. నేనో కొత్త బ్లాగరుని.

shadruchulu said...

నీ బుర్ర బానే పని చేస్తుంది తమ్మి.మస్తుగ చెప్పినవ్.కాని ఎవడి డబ్బా వాడే కొట్టుకుంటే బావుండదు కదా.నీగురించి నేను చెప్పనా.ధోనీ.వాడిలాగే తెగ బ్లాగేస్తావ్ నీ అల్లరితో.ఎట్లుంది

Rajesh said...

బాగా చెప్పారు

తెలు'గోడు' unique speck said...

మీ బ్లాగ్విహారాల్లో చాపెల్‌లాంటి కోచ్‌లు, హెయిర్‌లాంటి యెంపైర్లు లేరా?

సుధాకర్(శోధన) said...

నేను బై రన్నర్ లా వున్నాను :-)

spandana said...

బాబ్బాబు ఈ క్రికెట్ గొడవ నాకు తెలియదు.
కాని బ్లాగరుల గురించి తెలుసు. దీన్నే కాస్తా మార్చి ఏ క్రికెటర్ ఏ బ్లాగరు లాంటివాడో చెప్తే నాకు క్రికెట్ జ్ఞానమూ అబ్బుతుంది కదా!
--ప్రసాద్
http://blog.charasala.com

radhika said...

మీ పోస్టులన్ని భలే తమాషాగా వుంటాయి.

Anonymous said...

@ ఇస్మాయిల్ గారూ,

థాంక్స్.
సచిన్ మునుపున్నంత ఫాం లో లేడని అతని పేరు పెట్ట లేదు.

@ రానారె గారూ,

మీరు అప్పుడప్పుడూ రాసినా అవసారినికి ఆదుకునే యువరాజ్ సింగ్ లాంటి వారు.

@ మౌని శంకర్ గారూ,

మెచ్చుకున్నందుకు ధన్య వాదాలు.

@ అజ్ఞాత వ్యక్తి గారూ,

మీ పేరు రాయ లేదు, మీరు దీక్షగా మీ బ్లాగు మొదలు పెట్టండి.

@ జ్యోతక్క గారూ,

నేను ధోనీ అంతటి వాడిని కాదండి. మీరు గమనించారో లేదొ మా ఇంటి పేరు లో "దోని" వుంది. ఏదో మీ అభిమానం కానీ.

ఒక ధోనీ, ఒక ద్రావిడ్, ఒక జహీర్ ఖాన్, ఒక యువరాజ్ సింగ్ కలిపితే మీరవుతారు.

@ రాజెష్ గారూ,

థాంక్సండి.

@ సుధీర్ గారూ,

మన బ్లాగులోళ్ళు ఇంకా ఆ దశకు ఎళ్ళ లేదని రాయలేదు. వుంటే గింటే బోడెన్ లాంటి అంపైర్లు ఉంటారు.

@ సుధాకర్ గారూ,

మీరు గొప్ప "బ్లాగ్ ద్రావిడ్/బ్లాగ్ కైఫ్ లు" అండి. బై రన్నర్ అంటారేంటి.

@ప్రసాద్ గారూ,

మీరు కూడ ద్రావిడ్ లాంటి వాళ్ళు. బ్లాగర్లందరిని క్రికెటర్లతూఎ పోల్చే సాహసం నేను చేయలేనండి. పొరపాటున ధొనీ ని ద్రావిడ్ అనో, ద్రావిడ్ ను ఆశిష్ నెహ్రా నో అన్నాననుకోండి కొంపలు మునిగి పోవూ. వీలయితే ఈ ప్రపంచ కప్పు ఆటలు చూడండి. బాగా ఆస్వాదిస్తారు.

@ రాధిక గారూ,

అంత కామెడీగా రాస్తున్నానా? ఏదో సరదాగా రాస్తున్నా. మీ ప్రశ్న కు పెద్ద సమాధానం ఇవ్వాలని వుంది కానీ సమయం సరిపోవడం లేదు.

:-:

ఒకే సారి పది సమాధానాలిచ్చి
ఒకే మ్యాచ్ లో పది వీకెట్లు తీసుకున్న
కుంబ్లే విహారి :-)

swathi said...

ilaa saradaa sangatulu raaste serious blog la madhyalo kaasta navvukuntaam.
srujanatmakata peekaldaakaa unnaTTundi meedaggara:))

సుధాకర్(శోధన) said...

మీరు కైఫ్ అనగానే నాకో జోకు గుర్తొచ్చింది..

ఇది టాక్సీ నెం 9211 సినిమాలోనిది. నానా పాటేకర్ ఇంటి బయటకు వస్తాడు. అతని కొడుకు గల్లీలో అందరితో క్రికెట్ ఆడుతూ ఫీల్డింగు చేస్తుంటాడు. కొడుకు దగ్గరకు సీరియస్ గా వెళ్ళి ఇలా అంటాడు (నానా స్టయిల్ లో)

నానా : ఓ బ్యాట్ కిస్ కా హై రే? (ఆ బాట్ ఎవరిదిరా?)
కొ : మేరా బాట్ హై డాడీ (నాదే నాన్న)
నానా : తో తూ ఫీల్డింగ్ క్యు కర్ రహే హో (మరి నువ్వు ఫీల్డింగు ఎందుకు చేస్తున్నావు?)

కొ : " "

నానా : బ్యాట్ తేరా హై, వికెట్స్ భీ తెరా ...తో ఇధర్ వుల్లూ కే జైసే ఫీల్డింగ్ క్యు. జా ...బ్యాటింగ్ కర్. తు సచిన్ బన్ నేకా...కైఫ్ నహీ...జా

:-)

Sudhakar said...

Chala baga rasarandi, enjoyed reading it ...

me analysis prakaram, nenu pata ganguly typu, ante edo rendu mukkalu rayadam annamata

Anonymous said...

@ స్వాతి గారూ,

బాగుందన్నందుకు ధన్యవాదాలు. నాలో అంత సృజనాత్మకత వుందంటారా? నాకయితే చాలా అనుమానం.

@ శోధన సుధార్ గారూ,

మీ జోకు అదిరింది. ఆ సినిమా ఎందుకనో చూడలేక పోయా.

మీరు భారత బ్లాగర్ల పోటీ విజేత అవుతారని అప్పుడే చెబుతామనుకున్నా కానీ "ముందే కూసిన కోయిల" అవకూడదని చెప్పలేదు.

@ సుధాకర్ గారూ,

ఇంకేం గంగూలీ అన్నారు కదా. మ్యాన్ ఆఫ్ ద సీరీస్ అయ్యేంత గా విజృంభించండి.

విహారి