Friday, February 23, 2007

ఏకవీర

బ్లాగు పోటీలు ముగిసాయి. పోటా పోటీ గా ముగ్గురు రాగా చివరి ఓవర్ లో చివరి బాలుకు విన్నర్ ఎవరో తెలిసినట్టు శోధన సుధాకర్ గారు విజేత గా జెండా పట్టుకుని వచ్చారు. ఇప్పటికెన్ని సార్లు అభినందనలు చెప్పానో తెలీదు కానీ మళ్ళీ చెబుతున్నా...బ్లాగు విజేతకు శుభాకాంక్షలు. దగ్గరగా వచ్చిన "హృదయానికి", "శ్రీ కృష్ణ దేవరాయలుకు" ఇంకా ఇందులో పాల్గొన్న ఇతర బ్లాగర్లకు హార్ధిక అభినందనలు.

ఈ పోటీ లో నాకొచ్చిన ఓట్లు(నేను పోటీ లో లేకపోయినా) చూసి నామీద నాకే తెగ జోకులు వెయ్య బుద్ధేస్తోంది. ఈ బ్లాగు పోటీలనగానే గోచీ ఎగ్గట్టి పలుగు పార తీసుకుని బ్లాగు మడిలోకి దిగి పలు రకాలుగా ఎగ్గొట్టి, దిగ్గొట్టి, మసి పూసి, సున్నమేసి, రంగేసి దానిమీద కళ్ళాపిచల్లి దాని మీద ముగ్గేసి దాన్నెత్తిన గుమ్మడి పువ్వు పెడితే సరిపోదని విక్టోరియా పువ్వును తెచ్చి పెట్టేసి ఆహా "ఎంత సుందరం నా మడి" అని ఆనందించేసి తీసుకెళ్ళి నా మడిని "అలంకరణ విభాగం" లో పెట్టి వచ్చేస్తే దాన్ని తీసుకెళ్ళి భీముళ్ళు, భీష్ముళ్ళు, బ్రహ్మర్షులు పంచన వేసేసారు. నేనేమో "ఉంగా ఉంగా" అనుకుంటూ ఇంకా ఉగ్గు పాలు తాగుతున్నోడిని. ఇక అక్కడి నుండి పాక్కుంటూ వెళ్ళే ఓపిక లేక అక్కడే మహమహుల ఒళ్ళో వాళ్ళ గడ్డాలతో, గదలతో ఆడుకుంటూ ఉండిపోయా. "ఈ కాస్త సమయం రాజశేఖర రెడ్డి దగ్గర గడిపేసి వుంటే తన అనుంగు మిత్రుడనని ఫోజు కొట్టేసినట్టయితే నాకు ఓ పదో పరకో నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చేసేటివి కదా" అని కూసేపు చింతించా. బుర్రలో "అయిననూ వెళ్ళి రావలె హస్తినకు.." అని అనుకోకుండా నా మడి సాగులో నేను పడీపోయా. వీళ్ళిలా చేస్తారా అని నా మెడుల్లా అబ్లాంగేటా "నేను అసలు ఓటెయ్యను పో" అంటే హృదయం మాత్రం "హృదయం ఎక్కడున్నది..హృదయం ఎక్కడున్నది నీ చుట్టూ నే తిరుగుతున్నది.." అని గజినీ లో పాట పాడింది. సరే నా వోటన్నా ఎవరికైనా వేద్ధాం అని వెళితే కొండ వీటి చాంతాడంత లోతున్న బావి కనిపిస్తే నేను దూకలేనని వచ్చేశా. అలా నా ఓటు కూడా వెయ్యలేదు. మరి నాకు ఓటేసిందెవరు. ఎవరు ఓటేసారో వాళ్ళకు శత కోటి వందనాలు.
బ్లాగు బహుమతుల ప్రాయోజకులకు ఒక విజ్ఞప్తి. ఇక మీదట బ్లాగు "విజేత" లకే కాకుండా "చివరిజేత" లకు కూడా కొన్ని వీలయితే చానా బహుమతులు ఇవ్వాలని "ఏకవీర" నైన నేను కోరుకొంటున్నాను.

కొసమెరుపు: ఈ మొత్తం పోటీల లో కేవలం ఒక్క ఓటే వచ్చిన బ్లాగరు నేను కాకుండా ఇంకొకరు కూడ నా చెంతకు చేరి నా ప్రత్యేకత కు గండి కొట్టినందుకు చింత చెట్టుకింద చాలా చింతిస్తున్నాను.

ఏకవీర విహారి.

8 comments:

ప్రవీణ్ గార్లపాటి said...

బాబూ మీరు మరీను...
ఏదో పోటీ అండి బాబూ, అంత సీరియస్ గా తీసుకుంటే ఎలాగా ?

మాలాంటి వాళ్ళు మీకు తోడున్నారు లెండి అయినా. మనకు వచ్చే ఆనందం ముందు ఇవన్నీ ఎంత చెప్పండి :)

ఎవరు ఎలా అన్నా మీరు రాసే టపాలు నాకెంతో ఇష్టం అని ఇక్కడ పబ్లిగ్‌గా మానవి చేసుకుంటున్నాను ఒహో. ఈ సారి నా ఓటు మీకే.

Anonymous said...

అయ్య బాబోయ్. ఈ టపా సీరియెస్ గా వుందా?

నేనేదో కామెడీ గా రాసేసాను. అంతే కానీ కప్పూ, పోటీ అంటు ఏమీ గుస్సగా లేనండి.

మీరో ముక్క సీరియెస్ గా తీసుకోకండి అంటే వరసపెట్టున పెళ్ళు పెళ్ళు మని దాని మీద రాసేస్తారు మిగిలినవారు.

ఇది నేనెంతో కష్టపడి ఆచి తూచి ఎన్నో/ఎంతో సెన్సార్ చేసి రాసా కొత్త అర్థాలు రాకూడదని. ఇలాంటివి ఇంకో రెండోస్తే నేను ఈ టపానే లేపాస్తా బ్లాగులోనుంచి.


అయ్యో రామా విహారి

radhika said...

నిర్వాహకులు తిప్పారా మీ బ్లాగు ప్లేటు .అయినా ఏమీలేదుగా వచ్చిన చేటు.మొదటి రౌండ్ దాకా నిలబడ్డారంటే అది ఎంత గ్రేటు.ఇప్పటికింతేలే ఫేటు.....అయినా సరే తీసుకోండి జ్యోతి గారు చేసిన ఓ స్వీటు..

సుధాకర్(శోధన) said...

నేను ఖచ్చితంగా అనుకున్నట్లే జరిగింది. మీరు మీ ఓటు మీకు వేసుకుని వుండరని వూహించాను :-) మీ నిజాయతీ, ప్రతీదానిని సరదాగా తీసుకోవటం మీ రాతలలోనే తెలిసిపోతుంది. అందుకనే అలా వూహించా. మరోలా అనుకోకండి. నాకు రెండు ఓట్లు వుండి వుంటే ఒకటి మీక్కూడా వేసి వుండేవాడిని. నేను బాగా అభిమానించే ఒక బ్లాగరుకు వేసాను ఆ వోటు :-)

Dr.Ismail said...

'ఏకవీర' విహారి వీరవిహారం 2007లో వీక్షిద్దాం!

ప్రవీణ్ గార్లపాటి said...

అయ్యో మిమ్మల్ని hurt చేసినందుకు క్షమించాలి :)

తెలు'గోడు' unique speck said...

"ఏకవీరు"ని ఏకరువు కూడా భలే చమత్కారంగా ఉంది....నిజంగా మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి జోహార్లు! మీ బ్లాగు ఎందరినో ఆనందింపజేస్తుంది...అంతకంటే ఇంకేం కావాలి...మీదంటూ ఒక రోజొస్తుంది, అప్పుడు ఏకవీరుని నుంచి ఏకైకవీరునిగా(విజేతగా) తప్పక నిలుస్తారు!

Anonymous said...

@ రాధిక గారూ,

ఏమి స్వీటో లెండి. మన కృష్ణ దేవరాయలుకు వచ్చినట్టు నా కూడా కొలెస్టరాలో కాస్త ధనవంతుండనయ్యాను.

@ సుధాకర్ గారూ,

నన్ను నిజాయితీ పరుడినని అవమాన పరుస్తారా? ఉన్నండి మీ పని చెబుతా.

@ డాకటేరు గోరూ,

నా ఈర ఇహారం మామూలుగానే సేత్తానండి.

@ అయ్యో ప్రవీణ్ గారూ,

నేను హర్ట్ అవలేదండి. నా బాధంతా ఒకటే నేను రాసిన సెటైరు నిర్వాహకుల నిర్వాకం మీద. కాకపోతే అది కొణెం రివర్సు గా స్వీకరించబడింది.

@ సుధీర్ గారూ,

థాంక్సండి. ప్రతి రోజు నా రోజేనండి. నేనెప్పుడు విజేత నేనండి.

-- విహారి