Thursday, April 12, 2007

నా ఏడో తరగతి మొట్టికాయలు

ఈ మధ్యెందుకో మొట్టికాయల మీదకి వెళ్ళింది ధ్యాస. మొట్టి కాయలంటే రాయలసీమ ప్రాంతంలో వాడుకలో వుండే 'గోరు చిక్కుడు ' కాయలు కాదు. బుర్ర కాయల మీద మేస్టారు కాయలు, ఇతర తోటి పిల్ల కాయలు వేసే మొట్టికాయలన్నమాట. ఇంకా గుర్తుకు రావాలంటే "పరమానందయ్య శిష్యుల కథ" సినిమా చూడాల్సిందే. అందులో లెంప కాయ, జెల్లి కాయ, డిప్ప కాయ, కొత్తెం అంటూ దాని మీద చిన్నప్పుడు బాగా రీసెర్చ్ చేసిన ఒక పెద్దాయన రాసినట్టున్నాడు. ఎంతయినా అనుభవ రీత్యా రాసిన విషయాలు చాలా చక్కగా పేలుతాయి.

ఇప్పుడు నా మొట్టికాయల సంగతి చెప్పుకుందాం. ఆరో తరగతి లో వున్నప్పుడు మొదలయింది హిందీ అక్షరా భ్యాసం. అప్పట్లో మాకో హిందీ పండిట్ వుండే వాడు ఆయన క్లాసులో 'నిశ్శబ్దం' మీద పెట్టినంత శ్రధ్ధ హిందీ పాఠాల మీద పెట్టే వాడు కాదు. ఆయన క్లాసులో కొచ్చాడంటే "పేనా లో ఇంకు గూడా కదిలేది కాదు" ఏంటా ఉపమానమనకండి నా బుర్రలోకి ఏదొస్తే అది రాసేస్తా."నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తా...ఇక్కడ ఎలా అనిపిస్తే అలా మాట్లాడుతా" అంటూ "చిరునవ్వు తో" సినిమాలో తొట్టెం పూడి వేణు డవులాగులా అనిపిస్తే అది ఆ రచయిత నానుండి కాపీ కొట్టాడని అర్థం చేసుకోవాలి. నేనతనిని హృదయ పూర్వకంగా క్షమించేశా.

అసలీ ప్రపంచంలో కాపీ కొట్టని వాడు ఎవడు. తెలుగు లో వున్న వన్నీ మన అచ్చులు, హల్లులు, గుణింతాలకు కాపీలు కాదా? ఆంగ్లంలో వున్న వన్నీ ఓ 26 అక్షరాలకు కాపీలు కాదా? అరె నాకు ఈ లాజిక్ ఇంత వరకు తట్టలేదు ఉద్యోగం పోతే లాయరు ప్రాక్టీసు పెడతా. ఇది చదివిన వాళ్ళందరూ నా క్లయింట్లే. కామెంట్లు రాస్తే డిస్కౌంట్ ఇస్తా. బండి పక్క దారిలో కెళ్ళింది. మెయిన్ రోడ్డులో కొచ్చేస్తా.

ఇందాక పెన్ను ఇంకూ అదేదో చెప్పాగా అలాగ ఎప్పుడూ సైలెంట్ గా వుండాలి ఆయను క్లాసులో వున్నా లేక పోయినా. ఆయన గారికి ఓ రోజు మూడొచ్చి అందర్నీ ఓ మూడు రూపాయలు పట్టుకొని రండి "ఆరో తరగతి వెధవల్లారా" అంటే ఆరున్నొక్క రాగం లో అరిస్తే కానీ ఇంట్లో నుండి ఆరూ డీవైడెడ్ బై రెండు జేబులోకి రాలేదు. ఎందుకంటే ఆ మూడు రూపాయలూ అదేదో హిందీ బుక్కు కొనటానికట. అప్పటికే టెక్స్ట్ బుక్కుల కోసం డబ్బులు ఖర్చుపెట్టిన అమ్మా నాన్నా మళ్ళీ డబ్బులు ఎందుకిస్తారు. అందుకన్నమాట ఆ రాగం. సరేలే అని ఇచ్చిన ఆ మూడు రూపాయలూ చెడ్డీ జేబులో పెట్టుకుని దీనా బంకు దగ్గరకు రాగానే కాళ్ళు ఆగిపోయాయి. ఆ మూడు రూపాయల్తో చానా ఎక్కువ పాల్కోవాలు, గుల్కన్ లు, రసగుల్లాలు, కమ్మర కట్లు, కేకులూ వస్తాయి మరి. జేబులో చెయ్యి పెట్టి మూడు రూపాయల మీద చెయ్యి వెయ్యగానే దాని చుట్టూ సెక్యూరిటీ గార్డు లా వున్న "వీపు విమానం మోత" ఓ గిల్లుడు గిల్లింది చూపుడు వేలు మీద. అ గిల్లుడుకి కమ్మరకట్లు, పాల్కోవాలు మాయ మయిపోయి కళ్ళద్దాల హిందీ అయ్యవారు, పహిల్వాన్ రొయ్య మీసాలు కనపడ్డాయి. ఆ మరుక్షణం నా చెడ్డీ లోని మూడు రూపాయలు పాంటులోని ఎన్నో మూడు రూపాయల్తో కలిసి పోయాయి.

ఓ మూడు రోజుల తరువాత ముప్పై పేజీల హిందీ బుక్కు టెక్స్ట్ బుక్స్ తో జత కట్టింది. "రొయ్య మీసాల మాస్టారు" వచ్చినప్పుడల్లా అది బయటికొచ్చి మొదటి పేజీ తెరుచుకొనేది. అందులో నేను ఇప్పటి వరకూ నేర్చుకొన్నది "ఇంలీ, ఈక్". అ, ఆ లకు ఏముందో నాకు తెలీదు. ఎప్పుడొచ్చినా ఆ ఇ, ఈ ల "ఇంలీ, ఈక్" అని చదివిచ్చేవాడు.

అంతా "బ్రహ్మా నంద రెడ్డి" స్కీం మహత్యం పరీక్షల్లో సున్నా వచ్చినా పై తరగతి కి ఉయ్యాలేసుకుని ఊక్కుంటూ వెళ్ళి పోవచ్చు. నేను నా తోటి విద్యార్థులందరూ "ఇంలీ..ఈక్.....ఇంలీ.. ఈక్" అనుకుంటూ ఏడో తరగతి లో కెళ్ళి పోయాం. ఆరు లో రెండు సెక్షన్స్ A,B అని వుండేటివి ఏడులో కొచ్చేసరికి దాన్ని మూడు చేసేశారు. మరి ఏడంటే పబ్లిక్ పరీక్షలుంటాయి "ఇంలీ ఈక్" అంటే కుదరక్కడ. అలా కుదర లేనోళ్ళందరూ మరింత దీక్షగా చదవాలనే ఉద్ధేశ్యం తో అదే క్లాసును నాలుగయిదు సార్లు చదివి తృప్తి చెందాకా ఎనిమిదికి వెళ్ళే వారు. అలా తృప్తి చెందక మనసును మరింత లగ్నం పెట్టాలనుకునే వాళ్ళు ఎక్కువవడం వల్ల ఎక్కువ సెక్షన్స్ చేసారు.రెండును మూడెలా చెయ్యాలి అని మేస్టార్లందరూ కలిసి 120/3 చేసుకుని సెక్షన్ కు 40 అన్నారు. అంతవరకు బాగానే వుంది తరువాత మొదలయింది క్లాసు టీచర్ల "చొక్కా గుండీలు పీక్కునే కార్యక్రమం" నాక్లాసులో బ్రైట్ స్టూడెంట్స్ లేరంటే లేరని ఓ ఇరవై గుండీలు కింద పడ్డాక "కనీసం నాకు వీడిని ఇవ్వండి" అని ఎక్కువ చొక్కా గుండీలు పీకిన మాస్టారు లాగడం వల్ల నేను వెళ్ళి B సెక్షన్ లో పడ్డా. నా జిగిరీలందరూ A లో కెళ్ళి పోయారు. ఏం చేద్దాం అని ఏడ్చుకుంటూ బుక్కుల మీద ఏడు B అని రాసుకుని B సెక్షన్ లో కూచున్నా.

మొత్తం సెక్షన్ లో ఏవడికి ఏ డవుటొచ్చినా "నువ్వు చెప్పుబ్బా" అని వచ్చేవాళ్ళు ఒక్క హిందీ దగ్గర తప్ప. హిందీ కోసం బాగా జిగిరీలయిన గులాం వలీ, కుమార్ గాళ్ళు మాత్రం వచ్చేవాళ్ళు నాకు ఆత్మ విశ్వాసం నింపడానికి. మన బతుకంతా "ఇంలీ ఈక్" అయిపాయె ఆరో తరగతి లో. దానికి తోడు ఆ సంవత్సరం "బుర్ర మీసాల మాస్టారు" రాలేదు. ఇంతకు ముందు రొయ్యన్నావ్ ఇప్పుడు బుర్రన్నావ్ ఏంటది అని అడక్కండి తొట్టెం పూడి వేణు డవిలాగ్ గుర్తు తెచ్చుకోండి. "ఇంలీ ఈక్" అంటే ఏడు లో పాసు కారని స్ట్రిక్ట్ గా వుండే ధనమ్మ మేడం ను ఏశారు ఏడో క్లాసుకి. అక్కడే "సీతమ్మ కష్టాలు" మొదలయ్యాయి మళ్ళీ "సీతమ్మ కష్టాలు" ఏంటి? "హరిశ్చంద్ర కష్టాలు" కదా అనే కొచ్చెన్ మార్కు లాజిక్కొస్తే....తొట్టెం పూడి వేణు.. అంతే.

స్కూల్లో ఏ అయివోరుకి రాని అవుడియాలన్నీ ఈ ధనమ్మ మేడం కొచ్చేవి. బాగా "ఇంలీ ఈక్" కు అలవాటయి పోయిన ఈ చింతకాయ్ వెధవలకి ఏదయినా పెద్ద డోసు ఇస్తే గానీ చదవరని ఓ బ్రహ్మాండమయిన ఉపాయం కనిపెట్టింది. అదేంటంటే హిందీ లో కొచ్చెన్లు వేస్తే సరిగ్గా సమాధానం చెప్పాలి చెప్పక పోతే చెప్పినోళ్ళ చేత మొట్టికాయలు పడతాయి. అలా ఆ మేడం ప్రశ్న లేసినప్పుడల్లా విజయ అనే అమ్మాయి డింగు మంటూ చెయ్యి పైకెత్తేది. మమ్మల్నెవర్నడిగినా లైట్ వెలగని లైట్ పోల్ లా లేచి నిలబడే వాళ్ళం నోట్లొంచి "ఇంలీ ఈక్" తప్ప ఇంకేమె వచ్చేటివి కాదు. ఆ అమ్మాయేమో ఎగురుకుంటూ వచ్చి మొట్టికాయలు వేసి పొయ్యేది. అప్పట్నుండి మొదలయింది కసి. ఎలాగయినా ఈ ఆడవాళ్ళ డామినేషన్ ఆపెయ్యాలి అని. ఆ కసి హిందీ పీరియెడ్ అయి పొయ్యేదాక వుండి తరువాత చప్పు మని చల్లారి పోయేది. ఎలా గయినా హిందీ భరతం బట్టాలనే తలంపుతో ఎంత చదివినా "ఇంలీ ఈక్" గుర్తొచ్చేది తప్ప మరింకేమీ బుర్ర కెక్కేవి కాదు.

ఓ రోజు ఇలాగే హిందీ కొచ్చెన్ ల కార్యక్రమం మొదలయింది. మా మగ పిల్లకాయల్లో అందరూ లైట్ పోల్ లాగా నిలబడ్డం ఆ అమ్మాయేమో జింక పిల్ల పిల్ల లా గా ఎగురుకుంటూ వచ్చి బుర్రల్ని తడిమి ఎక్కడ వెంట్రుకలు తక్కువున్నాయో చూసి మరీ మొట్టికాయలేసేది. అసలే చదువు కోవడానికి మూడు మైళ్ళు నడిచి వచ్చేది. అందునా బాగా కాయ కష్టం చేసేదేమో ఊళ్ళో, చేతి వేలి ఎముకలు గట్టిగా వుండి మాడు పగల కొట్టేది. అప్పుడప్పుడూ అని పించేది ఇలా మమ్మల్ని కొట్టడానికి ఇంటి దగ్గర రాళ్ళ మీద ప్రాక్టీసు చేసి వాళ్ళ అవ్వ దగ్గరో తాత దగ్గరో ఎక్కడ కొడితే ఎక్కువ నొప్పి వస్తుందో అని కొనుక్కొని వచ్చేదేమో అని.

ఇలా ఇంతగా మగ పిల్ల కాయల్ని సతాయిస్తున్న ఆ అమ్మాయి మీద కసి తీర్చుకోవాలని మధ్యాహ్నం పెరుగన్నం బాగ తినేసి వచ్చిన తరువాత మగ పిల్ల కాయల సంఘం సమావేశమయింది. ఆ పిల్ల ఆకృత్యాలకు అడ్డు కట్ట వెయ్యాలంటే ఒకటే మార్గం ఈ "మొట్టి కాయల ప్రోగ్రాం" మిగతా ఏ ఒక్క అయ్యవారి చేతనయినా ఇంట్రడ్యూస్ చేయించడం. అన్ని సమాధానాలు నేనే చెప్తా కాబట్టి అందరి బదులు నేను ఆ పిల్ల నెత్తి మీద జడ బాగా పైకెత్తి గట్టి మొట్టి కాయలేసి కసి తీర్చుకోవచ్చు. అందరూ తలా రెండు ఓట్లు వేసి ఓకే చేసేసారు.

ఇక మిగిలింది అయ్యవారి చేత ఒప్పించడం. మొదటి పీరియెడ్ ఇంగ్లీషు, రాజు అయివోరు వచ్చాడు. పాఠం చెప్పే ముందు లింగుమంటూ లేసి చేతులు కట్టుకొని చంకలకింద అరిచేతులు పెట్టుకుని "సార్, మీరు కొచ్చన్లు అడగండి సార్, మేం ఆన్సర్లు చెప్తాం సార్, చెప్పని వాళ్ళకు చెప్పి నోళ్ళు మొట్టి కాయలేస్తార్ సార్" అని వినయంగా చెప్పా. పేరుకు ఇంగ్లీషు అయివోరు కానీ మూర్తీభవించిన తెలుగు పండితుడిలా రోజూ తెల్లటి లాల్చీ ధరించి వచ్చే ఆయనది ఆరడుగులకు పైన వుండే భారీ విగ్రహం. ఆయన ఆప్యాయంగా మాట్లాడే బూతు తిట్లు ఎంతో బాగుంటాయి. నేను అలా చెప్పడం ఆలస్యం ఆయన ఫేవరేట్ డైలాగ్ తో సమాధాన మిచ్చాడు.

"ఒరేయ్ నువ్వు పొద్దున్నే లేచి .... కడిగావా?" అంతే క్లాసంతా ఘొల్లు మంది. తరువాతి డైలాగ్ "నోరు మూసుకుని చెప్పింది విను...కొచ్చెన్ నాకిష్టమయినప్పుడు అడుగుతా".

చ! ఈ క్లాసు పోతే పోయింది తరువాత లెక్కల క్లాసుంది అడుగుదాంలే అని సమాధాన పరుచుకుని కూచున్నా. ఆ క్లాసు అయిపోయి సీనప్పయివోరు వచ్చినాడు. ఈ సారి కూర్చునే అడిగా .
"సార్! మీరు లెక్కల్లో కొచ్చెన్లు అడగండి సార్, వాటికి సార్...మేము...సార్....." అయివోరుకి కోపం వచ్చేసింది "ఒరేయ్ భూమి గా! ఏందన్నా అడగల్లంటే లేసి అడగల్లని తెలీదురా...ఇట్ల రారా" అని దగ్గరకు పిలిచి లాగి చెంప మీద చెళ్ళు మని ఒకటి పీకాడు. మొట్టికాయకు లెంప కాయ్ ఫ్రీ !!!. పిలిచినప్పుడు చంక కింద జాగ్రత్త పెట్టుకుని వెళ్ళిన అర చెయ్యొకటి చెంపని నిమురుకుంటూ వుంటే వచ్చి నా సీట్లో కూల బడ్డా. ఇక ఆ రోజుకి అయివోరు దగ్గరకి కొత్త ప్రతిపాదనలు తీసుకెళ్ళే సన్నివేశాలు బంద్. అయివోరు కొట్టిన దానికన్నా మా మగ పిల్లకాయల సంఘం లోని కొంత మంది నవ్వడం ఎక్కు వ బాధ పెట్టింది. సామెత ఎదో చదివినోళ్ళకే వదిలి పెట్టేశా.

తరువాత రోజు నేను చెప్పేశా "ఒరేయ్ నా వల్ల కాదు ఆ పిల్ల యేసే మొట్టికాయలు నాకు అలవాటయి పోయినాయి మీకు అవసరమ నుకుంటే మీరే అయివోరిని అడుక్కోండి" అని పిల్ల కాయల సంఘానికి రాజీనామా చేసేశా. చింత చచ్చినా పులుసు చావదని ఈ సారి డైరెక్టుగా హిందీ మేడం నే అడిగా "మేడాఁ! ప్రతి సారీ ఈ పిల్ల చేత మొటిక్కాయలు తింటున్నాం ఇట్ల కాదు గానీ మీరు హిందీలో కాకుండా ఇంకేదన్నా అడగండి" అని. దానికి అమో సారి నన్ను "దగ్గరకు రా" అని పిలిచింది. ఆహా ఏమి నా సౌభాగ్యము మేడం నా మొర ఆలకించింది మా మగ పిల్ల కాయల వెతలు తీరినవి అని పరుగెత్తుకుంటూ వెళ్ళా టేబుల్ దగ్గరకి.

"మ్మేయ్! విజయా! నువ్వీడికొచ్చి వీడి తల కాయ్ మింద ఇంగో నాలుగు మొటిక్కాయలేసి పో" అని పిలిచి సవినయంగా సత్కారం చేసింది. అప్పటికే ముందు రోజు విశేషాలు చూసి మాంచి కసి మీదుందేమో నాలుగు బొనస్ పాయింట్లు ఇచ్చి వెళ్ళింది. ఆ రోజు నుంచి ఆ పిల్ల మీదే కాకుండా మేడం మీద కూడ కసి పెరిగిపోయింది. ఎలాగయిన దారి కాసి ఓ రాయి తో ఈ మేడం తలకాయకో బొక్క, ఈ పిల్ల తలకాయకో బొక్క పెట్టాలి అని రోజు కలలు కంటుంటే ఏడో క్లాసు పాసయి పోయి ఎనిమిది లో పడ్డా. ఏదో ఆ మొట్టి కాయల పుణ్యమా అని నాలుగు ఎక్కువ "ఇంలీ ఈక్" లు నేర్చుకోవడం వల్ల ఏడు లో గుడ్డు పెట్టకుండా ఎనిమిది లో చేరా. ఈ సారి ఎనిమిది లో ఈ పిల్లని ఇరగదీయల్ల అనుకుంటా వుంటే మళ్ళీ సెక్షన్ లు వచ్చాయి. కాంపొసిట్ లెక్కలంటూ ఒక సెక్షనూ, జనరల్ లెక్కలంటూ ఒక సెక్షనూ తగలబడి. ఆ పిల్ల జనరల్ లెక్కల సెక్షన్ లోకి నేను కాంపోసిట్ లెక్కల సెక్షన్ లోకి మారి పోయి అవే సెక్షన్ లు పది వరకు సాగి మొట్టి కాయలు లేకుండానే పది ప్యాస్ అయిపోయా. పదో తరగతి హిందీ పరీక్షల్లో "కబీర్ కే దోహే" భట్టీ వేయడం మరియూ నాకు వచ్చినదంతా హిందీ అక్షరాల్లో పెట్టేయడం వల్లా అన్నింటికన్నా తక్కువగా ఓ 68 మార్కులతో బయటపడ్డా.

23 comments:

Srini said...

హహహా...బాగుందండి మీ మొట్టికాయల ప్రహసనం...పాపం, మీరు ఆ పిల్లకి మొట్టికాయలు వేయకుండానే స్కూల్ చదువులు అయిపోయాయి.

మంజుల said...

అది అలా తీరని కోరిగ్గ ఉండిపోయిందనమాట,
అన్నట్టూ మీ మీదనాదోక ఫిర్యాదు.
మీ బ్లాగ్ కివస్తేనవ్వి నవ్వి కళ్ళ నీళ్ళు , కడుపూ నోప్పీ వచ్చేస్తాయి..
దీనికి మీ సంజాయిషీ??

సిరిసిరిమువ్వ said...

ప్చ్ చివరికి మీ కోరిక తీరనేలేదన్నమాట. ఇప్పుడు మీ పండు ద్వారా ఆ కోరిక తీర్చుకుందామన్నా వీలు కాదే!!!

ప్రదీపు said...

చాలా బాగా వివరించారు. నవ్వాపుకోలేక పోతున్నాను. ఇది చదువుతున్నప్పుడు నాకు జరిగి ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.
నేను ఎనిమిదీ తరగతిలో ఉన్నప్పుడు మా సోషల్ స్టడీసు మేస్టారు మాకు కూడా ఇలాంటి స్కీము ఒకటి మా మీద ప్రయోగించాడు. అయితే మొట్టికాయలకు బదులుగా లెంపకాయలన్నమాట.
మొదటి అవకాశం నాకే వచ్చింది, వెళ్ళి ఒక అమ్మాయిని కొట్టాలి. మెళ్ళిగా అంటీ అంటనట్టుగా కొట్టాను. మా మేస్టాగారు నన్ను దగ్గరకు పిలిచి లాగి ఒకటిచ్చాడు నా చెంపమీద. "లెంపకాయ అంటే ఇలా కొట్టాలి. మళ్ళీ ఇంకోసారి కొట్టు" అని అన్నాడు.

Sriram said...

ఈ మొట్టికాయల హాస్యం వెనుక మీ బుర్ర అనుభవించిన బాధలు ఎన్నో పాపం.చాలా అందంగా రాసారు.

చదువరి said...

ఐదులో మా ప్రైవేటు పంతులు గారు - లక్ష్మీనారాయణ గారు - కూడా ఇలా చెంపదెబ్బలు వేయించేవారు. చెంపదెబ్బ కొట్టాల్సినపుడు ఓ పద్య భాగం చదివేవారు.. "భట్రాజును ఇట్రమ్మని నిట్రాదికి నిలువదీసి కొట్రా ఒక చెంపదెబ్బ శిరీషుకుమారా" అని చదివేవారు. పద్యంలో ఎవరి పేరు వచ్చిందో వాడి చేత మిగతావాళ్ళకు చెంప వాయింపు కార్యక్రమం ఉండేది.

కొత్త పాళీ said...

భాయీ విహారీ, మొట్టికాయల విహారీ, అన్నా, నీకు నువ్వే సాటి.
ఇవాళ్ళ నా లక్కు బావుంది - పొద్దున్నే టీ తాగుతూ నీ టపా ఇంట్లోనే చదివేశా.
ఆఫీసులో దీన్ని తెరిచి ఉంటే నవ్వాపుకోలేక చచ్చే చావయ్యేది.
ఇంలీ ఈఖ్ .. మిగతావి నాకూ గుర్తు రావట్లేదు గానీ క కి కబూతర్ అని ఉండేది.
అందుకే నాకు మైనె ప్యార్ కియా సినిమాలో ఆ పాట అంటే మహా వొళ్ళు మంట.
@చదువరి - మీ మేస్టారి కవిత్వం భలే వుంది.

త్రివిక్రమ్ Trivikram said...

ధ.దే.ఈ.శు.! రే.శ.!! మ.ప.వా.ము.!!!

మరేం లేదు... ఇంకో రెండ్రోజులపాటు మీ బ్లాగు చదువుతూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు గదాని. :)

Venkat Kantamneni said...

విహారి గారూ,
చిన్నప్పట్టి మొట్టికాయలతో బొబ్బి కట్టిన నా తలని మళ్ళీ తడిమి చూచుకున్నానండి. అప్పటి ఆ మొట్టికాయలకి కళ్ళవెంట నీళ్ళు వస్తే, ఇప్పుడు నవ్వు ఆపుకోలెక నీళ్ళు వచ్చాయి.

-నేనుసైతం
http://nenusaitham.wordpress.com

రానారె said...

అయ్యయ్యో, చానా అన్యాయం జరిగిపోయనే. కొన్ని ప్రతీకారాలు తీరకనేపోతాయి. "మ్మేయ్!!" -- యూనికోడ్ లో తొలిసారి ఈ పదం రాసింది మీరేనేమో.

జ్యోతి said...

విహారీ నాకు అనుమానం. నీ మొట్టికాయల ప్రహసనం ఇంకా నడుస్తుందని. అప్పుడు ఆ అమ్మాయి. ఇప్పుడు మీ ఆవిడ వేస్తూనే ఉందికదా? అబద్దాలు చెప్పకు. అందుకే బట్టతల వచ్చింది.

Unknown said...

భలే మిమ్మల్ని మొట్టికాయలు తినిపించిన చిన్నది...
నేనయితే ఎలాగోలాగ మొట్టేవాడినే. ఇప్పుడేమన్నా కనిపిస్తుందేమో చూడండి.
నేను అమ్మ చేతిలో తప్పితే ఎవరితోనూ దెబ్బలు తినలేదు.

రానారె said...

గోరుచిక్కుడుకాయల్ని మటిక్కాయలు లేదా మొటిక్కాయలు అంటారు. మొట్టికాయలంటే మీకు తెలుసు. తడుముకోనక్కరలేదు.

Anonymous said...

@ శ్రీనివాస్ గారూ,

ధన్యవాదాలు.

@ స్వాతి గారూ,

ఉష్ణ ఉష్ణేణ శీతలహా.
మీరు నూటొక్కసారి ఈ బ్లాగు సందర్శిస్తే మీ కడుపునొప్పి మటుమాయం.
అంతగా నవ్విస్తున్నానంటే నేను నా ప్రయత్నంలో సఫ్హలమయినట్టే.

@ సి.సి.ము. గారూ,

ఇప్పుడు తీర్చుకుందామని వాళ్ళూరికి వెళితే అప్పుడే పెళ్ళయి పోయిన ఆ అమ్మాయికి హైస్కూల్లో చదువుతున్న కొడుకులో కూతుర్లో వుండే ప్రమాదముంది. గుట్టు చప్పుడు కాకుండా వుండడమే సేఫ్.

@ ప్రదీపు గారూ,

ఆ అనుభవం నాకు కూడా ఎదురయింది.

@ శ్రీ రాం గారూ

ఇవి అందమైన మొట్టి కాయాలా :-)

@ చదువరి గారూ,

మీరు అలా జనాల్ని హింసించారన్న మాట :-)

@ కొత్త పాళీ గారూ,

మీ ఆశీర్వచనాలకు నమోన్నమహ :-)

@ త్రివిక్రములు గారూ,

రే.శ.!! మ.ప.వా.ము.!!! ఏమిటి? నాకు పరీక్షలా? విక్రముల వారు భేతాళుడి పాత్ర తీసుకున్నారా?

@ పీపీలకం గరూ,

మీరు నా సోదరులే అన్న మాట :-)

@ రానారె గారూ,

కొన్ని కొన్ని ప్రతీకారాలంతే. ష్..ఎవ్వరికీ చెప్పకండి.. ఆ అమ్మాయిని వీలయినన్ను తిట్లు అప్పుడే గ్రూపుగా తిట్టేశాం.

"మ్మేయ్" చరసాల గారు రాసినట్టు గుర్తు.

@ జ్యొతక్కా,

నాకు బట్టతల ఇంకా రాలేదు. స్కూలు అనుభవం తో ఇంట్లో తిరిగేప్పుడు హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నా. ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు.

@ ప్రవీణ్ గారూ,

ఎంతటి వాళ్ళాయినా మొట్టి కాయలు తినాల్సిందే ఆడ వాళ్ళ చేతిలో :-)

త్రివిక్రమ్ Trivikram said...

విహారి గారూ!
ఈ.శు. ఐనప్పుడు రే.శ. యే కదా?
మీరు ధ.దే.ఈ.శు. అన్నా, నేను రే.శ. అన్నా దాని అర్థం మ.ప.వా.ము. అనే కదా?

Kamaraju Kusumanchi said...

చాలా చక్కగా రాశారు విహారి గారు! One of the best posts I have read on personal blogs!

Sridevi Aduri said...

Hi vihari

Very very nice. Venuni kshaminchina mee kshmagunamto saha anni superb.
And a codes yento kuda vivaristhe ante trivikramgaru meeru matladukune codes ento artham kaledu sumi

poobanti said...

chala baga raasarandi viharigaru. mee hasyapujallulo memandaram munigitelamu. excellent.

రవి said...

హ్హహ్హహ్హ..మొట్టికాయల ప్రహసనం బావుంది. నాకు మంచి అనుభవాలు వున్నాయి, మొట్టికాయల మీద...

Dr. Ram$ said...

విహారి గారు,
మీరు ఎమి దిగులు పడకండి, ఆడపిల్లల చేత మొట్టికాయలు తిన్నాము అని.. మీ బదులు నేను "కక్షి" తీర్చుకున్నాను లేండి..నాలుగో తరగతి వెలగపెట్టేటప్పుడు, "తాడికొండ స్కూల్ ప్రవేశ పరిక్ష" కి ఒక ప్రత్యేక బాచ్ వుండెది..అందులో మనము ఒక కొత్తెం గాడిని లే..ఏది అడిగిన చెప్పేవాడిని.. వరుస పెట్టి చెంప దెబ్బలు వేసే వాడిని..కనీసం ప్రతి ప్రశ్న కి 4గురు,5గురు కి పడేవి..అనిత అని ఒక అమ్మాయి వుండెది, పాల వంటి తెలుపు పాపం.. నేను అభిమానిని కూడా. అందుకే కాస్త గట్టిగా కొట్టేవాడిని.. చెంపలు ఎర్రగా చేపించుకొని వెల్లేది.. నన్ను ఐతె బండ బూతులు తిట్టుకునేది..తరువాత తను లొ వేరే ఊరు వెల్లింది..నేను మిస్స్ అయ్యాను..కాకపోతె యీ చెంప దెబ్బలా సీను తరువాత యే క్లాసులో జరగలేదు కాని, మరల 10 లో చివరి పరిక్షల కి రెండు నెలల ముందు మాత్రం మంచి జోరు గా సాగింది.. ఈ సారి అరవింద, క్ర్రిష్ణవేణి వీళ్ళ కి మాత్రం నేను గుర్తు వుండె వుంటాను,..ఒక్కో సారి వాళ్ళు దూరం జరుగుతారు, అప్పుడు మనకి బోనస్ పాయింట్ లు వచ్హేవి, అవేమిటొ తెలుసా, వేసుకో యింకో లెంప కాయ.. యెవడైనా ఫెమినిస్ట్ గాడు అయ్యో అమ్మయిలు కదా అని సుతారం గా ముట్టించి వస్తే, వాడికి మా నారయణ పంతులు గారు కొసరి యిస్తారు.. కాకపోతె, యి 10 కి ఓ ప్రత్యేకత వుంది లే, నేను కూడా తినాలిసి వచ్హేది అప్పుడప్పుడు..అమ్మయిల చేతుల్లో.. దొంగ మొహాలు వాళ్ళ "కచ్హి" అంతా చూపించే వాళ్ళు.. యిది మా చెంప దెబ్బల ప్రస్థానం...ఎదైనా ఆ యిస్కూలు చదువులే వేరులే..హ్హహ్హహ్హ..

సుజాత వేల్పూరి said...

అంటే, ఈ లెంపకాయలు, మొట్టి కాయలు ఆంధ్రాలో అన్ని స్కూళ్లలోనూ ఉన్నాయన్నమాట! విహారి గారు, మీ టపా చదువుతుంటే, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి సినబ్బ కతల్లోని ఒక కత గుర్తొచ్చింది. పోన్లెండి, చిరునవ్వుతో రచైతను క్షమించినట్టుగా, సినబ్బను కూడా క్షమించెయ్యండి. అంతే కాదు, ఈ సారి తిరప్తి కి వెళ్ళినపుడు, ఈ టపా ప్రింటౌట్ తీసి, నామిని గారికి తప్పక చూపించి తెస్తా!

హాస్యం రాయడం చాలా కష్టం! మీకది నల్లేరు మీద బండి నడకలా ఉందేమండీ బాబూ!

Anonymous said...

సుజాత గారూ!
నామిని గారికి చూపించారా? ఆయన ఏమన్నారు?

SriKal said...

చాలా చాలా బాగుందండీ..
మా స్కూలులో కూడా ఈ లెంపకాయల ప్రహాసనం వుండేది. అందులో ఒక అమ్మాయి చాలా పొట్టి... కానీ ఇంగ్లీష్ లో బహు గట్టి. తను వచ్చి నప్పుడు మేము తల అందకుండా నిగడదీస్తే "సార్ ఈ అబ్బాయి అందడం లేదు సార్" అని కంప్లైంట్ ఇచ్చేది. దాంతో సారు "వంగవాయ్" అని అరిస్తే,ఆ అమ్మాయి చెంగున ఎగిరి మరీ లెంపకాయలు వేసి గున గున నడుచుకుంటూ గర్వంగా వెళ్ళి పోయేది.

ఆఫ్ కోర్స్ ఆ అనుభవం ఇప్పుడు పనికొస్తోందనుకోండి...