Friday, February 15, 2008

రాజు గారి రహస్య పర్యటన




రోజూ తన దైనందిన కార్యక్రమాలతో విరామం లేకుండా పనిచేస్తున్న వై.ఎస్. కి ఏదైనా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పని చెయ్యాలనుకున్నాడు సూరీడు. పూర్వ కాలం లో రాజు అలసి పోయాడనిపిస్తే వెంటనే ఓ ఆటా పాటా ఏర్పాటు చేసే వారు. ఇప్పుడు రాచరికాలు లేవు కాని పరివారం మాత్రం వుంది. ఆటా పాటా కావాలంటే అందుకు సంబంధించన వాడు వుండాలి అని తమ పార్టీ వాడైన సాంస్కృతిక శాఖ చైర్మెన్, సినీ నటుడు అయిన ధర్మ వరపు సుబ్రహ్మణ్యానికి ఫోను చేశాడు.



"ఆ చెప్పండి సూరీడు అన్న గారు, ఎమన్నా ప్రాబ్లమా? మీకు ప్రాబ్లమేంటండి? మీరు దేవానందు గైడు లాంటి వారు మీరు మిమ్మల్ని చూసి మేము కాపీ కొట్టాలి గానీ"

"అంత లేదులే గానీ అబ్బీ, అన్నకి ఎబ్బుదూ పన్లు వుంటాండాయి గదా. ఏమన్న ఎంటర్ టైన్‌మెంట్‌ ఇజ్జామని అనుకుంటాండా"

"అయ్యో దాందేముందన్నా. వెంటనే ఇంద్ర, ఆది, సమరసింహా రెడ్డి సినిమాలు చూపించు"

"ఎంత రాయల సీమ గురించి జూపిస్తే మాత్తరం మన ఎగస్పార్టీ వాళ్ళ సినిమాలు జూపిచ్చమంటావా ఏంది?"

"సర్లే అయితే ఒక పాత శ్రీకృష్ణ దేవరాయలు సినిమా వుంది పంపించమంటావాన్నా"

"అట్లాగేబ్బీ బిర్నే పంపిచ్చు. రాత్తిరికి అన్నకి జూపిస్తా"

"అన్నా ఇంకో మాట."

"చెప్పుబ్బి"

"అన్నా నేనెన్ని పైరవీలు చేసినా నాలుగయిదు కోట్లకన్నా ఎక్కువ ఖజానా లో జమ కాలేదు. తమరు కనీసం ఓ వందేసుకోనుంటారు కదా అదెలానో సెలవిస్తే నేనూ ఫాలో అయిపోతా"

"ఏంది? నూరా అది నువ్వు ఇబ్బుటికే చేరుకోవాల్సిన రేంజు. నేనంత నాబర్దాగా కనిపిస్తా వుండానా? నువ్వు ఫోను పెట్టెయ్ ముందు"

::::::

ఆ రోజుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే సూరీడు డి.వి.డి ఆన్ చేసి టి.వి. పెట్టి

"అన్నా! నువ్వు బాగా అలిసిపొయినావు గానీ కొంజేపు ఈ సినిమా జూసి పండుకో" అని చెప్పి వెళ్ళిపోయినాడు.

ఆ సినిమా చూస్తున్న వై.ఎస్.కి ఒక సన్నివేశం చూసాకా బుర్రలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. వెంటనే సూరీడు ని పిలిపించాడు.

"సూరీడూ, నువ్వు ఈ రోజు చానా మంచి పని జేసినావ్. ఈ సినిమా జూసినంక నాగ్గూడా శ్రీకృష్ణ దేవరాయలు మాదిరి రాజ్యమంతా రహస్యంగా తిరిగి నా గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసు కోవాలని వుంది"

"అదెంత పనన్నా ఇబ్బుడే అన్ని అరేంజిమెంట్లు జేస్తా. కాక్పోతే ఒగ కండిషన్. మనమెప్పుడు యాడికి పోతున్నామో నేను జెప్పను"

"అయ్యో సూరీడూ నీ మాట నేనెప్పుడన్నా కాదన్నానా అలాగే కానీ"

::::::

తరువాత రోజే ప్రయాణం మొదలయింది. ప్రజలు గుర్తు పట్టకుండా వై.ఎస్. సర్దార్ పాపారాయుడి గెటప్ వేసుకున్నాడు (తుపాకీ లేకుండా). సూరీడేమో రామ దాసు సినిమాలో నాగేశ్వర రావు వేసిన కబీరు గెటప్పు తెప్పించుకుని వేసుకొన్నాడు(జోలె లేకుండా). చీకటవగానే హెలికాప్టర్ ఎక్కి ఆంధ్ర దేశంలో ని ఒక ఊరికి పది కిలోమీటర్ల దూరంలో చేన్లో దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పాత అంబాసిడర్ కారు ను తీసుకొని సూరీడు డ్రైవ్ చేసుకుంటూ ఊరి చివర్లో చెట్టు కింద పార్క్ చేసి ఊర్లో సంచారం చెయ్యడం మొదలు పెట్టారు.



ఆ ఊర్లోని రోడ్లు, ఇళ్ళు, శుభ్రత చూసి వై.ఎస్. ముగ్దుడైపోయాడు. అందరి ఇళ్ళ ముందు ఏదో ఒక ఫారిన్ కారో ఇండియెన్ కారో వుంది. ఇంట్లో ఎల్.సి.డి. టి.వి.లు, కార్పెట్లు చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు. వెంటనే సూరీడును గుండెలకు హత్తుకొని “ఈ సారి బాబుకి బోడి చిప్పే మళ్ళీ మనమే రాబోతున్నాం. మేడంకు ఇప్పుడే ఫోను చేసి చెప్పేస్తా ఎలక్షన్లు ఇప్పుడే పెట్టేద్దామని” అని ఫోను తియ్యబోతుంటే సూరీడు వారించాడు.

"అయ్యో మీరు కొంచెం ఆగండి. ఇంగా ఒగ ప్లేసుకూడా పూర్తిగా చూడలేదు అప్పుడే ఫోనెందుకు. ఇంకొంచెం ముందు బొయ్యి ఊరంతా చూద్దాం పా"

అలా కొంత దూరం వెళ్ళి కొంచెం మధ్య తరగతి కుటుంబం లా కనిపించే ఇంటి ముందు ఆగి ఆ ఇంట్లో నుండి వచ్చే మాటలు వింటున్నారు.

"ఓయ్ మామా నేనిప్పుడే వెళ్ళి చీటీ పాడుకోని వస్తా నువ్వీణ్ణే వుండి పిల్లోడికి మందులెయ్యి"

"అది కాదే నేనియ్యాల పొలం కాడికి బొయ్యి ప్రాజెక్టులో నుండి వచ్చే నీళ్ళు మన మళ్ళోకి కట్టల్ల. నువ్వీణ్ణే వుండి పిల్లోడికి మందులెయ్యి. వానికసలె ఒంట్లో బాగలేదు"

"అయ్యో వాడికేమీ కాదులే మొన్నే కదా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వాడికి ఒళ్ళు బాగు చేయించుకుని వచ్చాం గదా ఏమీ కాదులే. ఇంకా ఏమన్నా అయితే మనమే డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకోవచ్చు. పావలా వడ్డీతో తీసుకున్న అప్పు తీరిపొయి కొంచెం వెనకేసుకున్నాం కదా"

"అది కాదే వరసగా మూడో సమత్సరం.ఈ సారి కూడా మూడో పంట వేస్తున్నాం అది మన చేతికి వస్తే మనం కూడా కారు కొనుక్కోవచ్చే"

"సరేలే అయితే నువ్వు పొలం కాడికి పొయి రా నేను పిల్లాడిని చూసుకుంటా. ఈ చీటీ కాకపోతే ఇంకో చీటి. మనకేమన్న డబ్బులకు కష్టమా"

అది విన్న వై.ఎస్. పరమానంద భరితుడయ్యాడు.

"చూశావా సూరీడూ, మన ఆంధ్ర ప్రదేశ్ ఇంతగా డెవలప్ అయిపోతుంటే ఆ బాబేమో హరితాంధ్ర కాదు నేరాంధ్ర, జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అంటాడు. వెంటనే మేడం కు ఫోను చేసి ఎలక్షన్స్ పెట్టెయ్యమని చెప్పేస్తా" అని ఫోను తియ్యబోతుంటే సూరీడు గబుక్కున లాక్కొని జేబులో వేసుకున్నాడు.

అంతలో అక్కడ టీ స్టాలు దగ్గర ఎవరో మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళారు.

"ఏం? రాజశేఖర్ మాత్రం నటుడు కాదా? అతనికి ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? చిరంజీవి, రాజశేఖర్ ఒకే సినిమాలో నటించలేదా? అని ఈ రోజు నేను మాట్లాడుతున్నా. చిరంజీవి కన్నా ఇంకా మంచి రంగు, రుచి, వాసన వున్న వాళ్ళు ఎంతో మంది వున్నారు. వాళ్ళు లిట్మస్ టెస్ట్ ఎలా చెయ్యాలో తెలీక అలా అయిపోయారు ..." ఏకబిగిన మాట్లాడేస్తున్నాడు మంత్ర మారెప్ప.

"ఏమిటిది అప్పుడెప్పుడో దీని గురించి మాట్లాడమని కీ ఇచ్చా. అదింకా పని చేస్తున్నట్టుంది.. " అన్నాడు వై.ఎస్.

"మీ కీ అంత స్ట్రాంగన్నా.సర్లే పదన్నా మనం తరువాత వెళ్ళాల్సిన చోటికి టైమవుతోంది" సూరీడు పురమాయించాడు.

హెలికాప్టర్ లో వెళ్ళి ఇంకో చోట వాలారు. అదో పల్లె టూరు. అక్కడో దీపం ఇక్కడో దీపం వెలుగుతోంది. ఇంటి ముందు పెద్ద పేర్లతో ఇందిరమ్మ గృహ పథకం అని కనిపిస్తోంది.

ఆ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ఇంటి కిటికీ దగ్గరకు వెళ్ళి గోడకు ఆనుకుని నిలబడ బోయాడు వై.ఎస్.

అది చూసి "అన్నా ఆ గోడకు ఆనుకోవద్దు. గట్టిగా ఆనుకుంటే ఈ గోడ పడిపోతుంది. ఈ రోజు పొద్దునే వాన కూడా పణ్ణట్టుంది." అన్నాడు సూరీడు.

"మన వాళ్ళు అంత స్ట్రాంగా కట్టారా?"

"అంతా మనూరోళ్ళే అన్నా "

లోపలి నుండి మాటలు వినిపించసాగాయి.

మొగుడి మీద పెళ్ళాం గట్టిగా అరుస్తోంది.

"నేను నీకెప్పుడో చెప్పినా ఈ ఇంట్లోకి మారొద్దు. చావో రేవో ఆ మట్టి కొంపలోనే తేల్చుకుందాము అని. నువ్వు నా మాటింటావా వున్న ఆ కొంచెం డబ్బులు పోసేసి పక్కా ఇల్లు, పక్కా ఇల్లు అని ఈడకొచ్చి పడినాం. వచ్చిన్రోజే చెప్పినా ఆ గొళ్ళకు నెర్రెలు కనిపించకుండా సున్నాలు కొట్టినారు. ఈడుండేది మంచిది కాదు అని. ఇప్పుడు చూడు ఇల్లంతా కారి చస్తా వుంది. ఎప్పుడు ఊడి మీద పడుతుందో అని ప్రాణాలు అర చేతిలో పెట్టుకోని బతుకుతున్నా".

"అది కాదే నకెట్ల తెలుస్తుంది ఈళ్ళు ఇట్లా చెస్తారని. నేనేమన్నా కల గన్నానా. ఈ మాడి పోతేపోయింది గానీ నాలుగడుగుల నేల మన పేరు మీద రిజిస్టరు అయింది కదా"

"ఆ చాల్లే సంబడం. కాణీ విలువ లేని పాములు, తేళ్ళు తిరిగే చోట కాలనీ కట్టేసి. భూమొచ్చిందంటావా. అది కూదా శ్మశానం పక్కన. అది సరే ఆవు కొనుక్కునే దానికి అప్పు ఇచ్చినారు గదా ఆ డబ్బే ది"

"ఇంకెక్కడి డబ్బే. ఆడ డబ్బులు అందరి చేతులు మారి నా చేతికొచ్చింది నాలుగు వందలు. దానికి ఆవు తోక కాదు కదా కాలి గిట్టలు కూడా రావు. అందుకే ఆ గవర్నమెంటోళ్ళు ఇచ్చిన డబ్బులు ఆ గవర్నమెంటోళ్ళకే ఇచ్చి అప్పు తీర్చేసి వచ్చేశా"

"నీ జిమ్మడ ఆ వచ్చిన డబ్బులు ఊరి మొగసాల్లో పెట్టిన బెల్టు షాపులో ఇచ్చేసి పీకల్దాకా తాగొస్తావా అసలు నిన్ను కాదు అనాల్సింది.." అని బూతులంకించుకుంది.

"సూరీడూ మనం తొందరగా హైదరా బాద్ వెళ్ళి పోదాం పదా. మన జగన్ బాబు సాక్షి పత్రిక గురించి ఏదో మాట్లాడన్నాడు గదా తొందరగ పోదాం రా" అని వెనక్కి కూడా తిరిగి చూడకుండా హెలికాప్టర్ దగ్గరకి వెళ్ళి పోయాడు.

సూరీడు బిక్క మొహం వేసుకొని వెంట నడిచాడు.



హెలికాప్టర్ లో కూచున్న తరువాత మెల్లిగా సూరీడు నడిగాడు.

"ఈ ఊరు ఇంకా బాగు పడినట్టు లేదు ఈ ఊరు పేరేమి"

"పేరెందుకులే అన్నా, ఇది మన ఆంధ్ర దేశం లో ఒకానొక ఊరు "

"ఇలా ఒక్క ఊరే ఉంటుంది కదా. దీన్నెలాగైనా మనం మొదట చూసిన ఊరి లాగా మార్చెయ్యాలి. అప్పుడే మనది హరితాంధ్ర అవుతుంది"

"ఇలా ఒక్కటి కాదు. అన్నీ ఇలాంటి ఊర్లే అన్నా."

"అదేంటది మరి మనం మొదట చూసిన ఊర్లో అందరూ హాయిగా సుఖంగా వుండారు కదా. ఆ ఊరి పేరేమి"

"చెప్పక తప్పదంటారా"

"చెప్పు సూరీడు నేను నిన్నేమన్నా అంటానా చెప్పు"

"పులివెందుల"


:::::


12 comments:

కొత్త పాళీ said...

B R A V O !!

Unknown said...

మళ్ళీ కత్తి లాంటి టపా...

Sudhakar said...

నవ్వలేక చచ్చా...:-)

Rajendra said...

Vihaari Strikes back.

అమ్మ వ్యంగ్యం & సస్పెన్స్ మిక్స్ చేసారుగ పాత వంశీ సినిమాలా. ఇరగదీసారు మస్టారు మళ్ళీ.

రాజేంద్ర ఆలపాటి

Rajendra said...

చాల బాగుంది నవ్వలేక పోయాను. నిజంగా రాష్ట్రంలో ఇదేగా జరుగుతోంది.

జయశ్రీ ఆలపాటి

రానారె said...

అరిపిచ్చినావ్ బో!! (తమాసాలకేంగానీ, పులెందుల్లోగూడా అనుకున్నెంతేం లేదంట్నే!?) అప్పుడెప్పుడో "బ్లాగుకు దీర్ఘవిరామం" అని చదివినాంక ఈ పక్కకు రాల్యా. సందీకుండా రాచ్చానేవుండావు. మంచిది. రోంత తీరికజేసుకోని అన్నీ సదవాల.

వేణు గొపాల్ said...

చాల బాగుంది

నిషిగంధ said...

చాలా చాలా బావుందండీ! :-)

GR said...

Saana bagundadi abbi....kaani nuvvu seppinattu antha improment ledu .

Arvnd

Kiran said...
This comment has been removed by the author.
Kiran said...

Super :)

రాఘవ said...

శెహభాష్ అనిపించుకోవటాన్కి గల అన్ని అర్హతలూ యీ "టపా"కాయకున్నాయ్.