ఈ వారం సిధ్ద -- బుద్ధ (క్రికెట్, ఉండవల్లి)
"రేయ్ సిద్ధా, ఓ సారిలా రా?"
"......"
"రేయ్ సిద్ధా, ఎక్కడున్నవ్ రా? ఏంటి వంటింట్లో లేడు కంప్యూటర్ రూములో లేడు ఎక్కడికెళ్ళాడు? రేయ్ సిధ్ధిగా ఎక్కడ చచ్చావ్ రా?"
"....."
"ఏంటిది వరండాలో కూడా లేడు…. ఓర్నీ ఇక్కడ రోడ్లో ఆ క్రికెట్టేందిరా ఇది క్రికెట్టాడే వయసా? ఆ బ్యాటూ బాలూ అక్కడ పడేసి లోపలికి రా"
"చా పొండయ్యగారూ నేను సక్కగా కిరికెట్టు నేర్చుకుంటుంటే మీకు కుళ్ళు గా వుంది. కావాలంటే మీరు కూడా రండి ఇద్దరం కలిసి ఆడుకుందా. నేనిప్పుడే దోసె రా ఎట్లా ఎయ్యాలో నేర్చుకున్నా. మీరు బ్యాటు పట్టుకోని నిలబడుకోండి. చూపిస్తా."
"అది దోసె రా కాదు రా దూస్రా. నీ దూస్రా పిచ్చుకలెత్తుకెళ్ళ. వెంటనే వచ్చి ఓ దోసె పడెయ్ నాకు."
"అది కాదయ్య గారూ, కావాలంటే మీరు బౌలింగ్ చెయ్యండి నేను రివర్సు స్వీటు షాటు ఎలా చేస్తానో చూపిస్తా"
"నీ అర్ధ క్నాలెడ్జి తగలెయ్య. అది రివర్సుస్వీప్ షాట్, రివర్సు స్వీటు కాదు. ఈ లెక్కన ఎల్బీడబ్ల్యూ ని లడ్డూ జిలేబి, సిల్లీ పాయింటు ను చిల్లీ చికెను అని క్రికెట్ మొత్తాన్ని డైనింగ్ టేబుల్ చేసేట్టున్నావ్. ఆ బ్యాటు అక్కడ పడేసి రా."
"అది కాదండి నేను పెద్ద క్రికెటరయితే మీరు హాయిగా ఇంటి పట్టున కూచోని మ్యాచు ఫిక్సింగ్ చేసుకో వచ్చు కదా."
"మ్యాచు ఫిక్సింగులా అదేమన్నా కేకు మిక్సనుకున్నావా? నీ మూతికి బాలు ఫిక్సుకాకుండా చూసుకో. అసలు నీకు క్రికెట్టాడే వయసా ఇది?"
"అదేంటండి అట్లంటారు. జయసూర్య కు 37, కుంబ్లేకి 36, సచిన్ కు 35. నాకు 15 ఏళ్ళకే పెళ్ళి చేసారు కాబట్టి పెద్ద పిల్లలున్నారు కానీ. నా వయసు 34 కదా. క్రికెట్టాడ్డానికి ఏం తక్కువని?"
"నీ లెక్కలు బానే వున్నాయి కానీ. నీకు శరద్ పవార్ కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ తెలుసేమిటి?"
"అబ్బే తెలీదండి."
"అయితే బాగా మసాలా పట్టించి పప్పుల పోడేసి వెన్న రాసి రెండు మాసాలా దోసెలు పట్టుకురా వంటింట్లోకెళ్ళి. "
"అలాగే అయ్యగారూ" అని గుర్రు మని చూసుకుంటూ వెళ్ళిపోయాడు.
**
"మసాలా దోసె బ్రహ్మాండగా చేశావు. పోయిన వారం బ్లాగులన్నావ్ ఈ సారి క్రికెట్టంటున్నావ్.నీకు ఈ క్రికెట్ మీద మనసెందుకు పోయింది? "
"నేను చిన్నగా వున్నప్పుడెప్పుడో మా ఊర్లో రాత్తురుల్లో బట్టలు ఏలం ఏసేవాళ్ళు. రెండు కిరసనాయిలు బుడ్డీలు ఆపక్కొకటి, ఈ పక్కొకటి పెట్టి మధ్యలో గుడ్డలు పరిచి అమ్మేవోళ్ళు. ఏలం పాట చెబితే మా ఊర్లో ఆడోళ్ళు మగోళ్ళు రెట్టలు ఎగేసుకోని భలే పాడే ఓళ్ళు లే. ఇప్పుడు సేం టూ సేం. గుడ్డల బదులు కిరికెట్టు ఆడే ఓళ్ళు... మా ఊర్లో రెట్టలెగేసుకునే వాళ్ళ కు బదులు కోట్లేసుకున్నోళ్ళు. ధోనీని ఆరు కోట్లకు, ఇషాంత్ నాలుక్కోట్లు, ఆండ్రో సైమండ్స్ అయిదున్నరకోట్లు, ఒకట్రొండు మ్యాచులాడిన మనోజ్ తివారిని కూడా రెండున్నర కోట్లకు ఏలం పాటలో పాడేసుకున్నారు కదా. నేను కూడా కిరికెట్టు నేర్చుకుంటే నన్ను కూడా ఏలం లో పాడుకుంటారు కదా "
"వాళ్ళందరి లక్కూ అలాంటిది మరి. మనోళ్ళెవరికైనా బాగా డబ్బొచ్చిందా?"
"మన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ కు వచ్చింది ఒకటిన్నర కోటే పాపం"
"అయ్యో అంత తక్కువా?"
"ఏం లేదు తనకి దిగ్గజం హోదా వస్తే అయిదు కోట్లకు పైగా ఇవ్వాల్సి వస్తుంది. అంత డబ్బు పెట్టే బదులు తాను కేప్టన్ అయిన హైదరాబాద్ కు మంచి ఆటగాళ్ళను కొనుక్కోవచ్చు కదా అని."
"ఇట్లాగే మంచికి పోతే ఏదో ఒక రోజు టెస్టుల నుండి కూడా పీకేస్తారు. "
***
"అయ్యగారూ, మీకు జంతువులు మాట్లాడే భాష తెలుసా?"
"తెలీదు రా"
"పక్షులు మాట్లాడే భాష తెలుసా? "
"పక్షుల భాషే కాదురా అక్కుపక్షీ! చేపల భాష కూడా తెలీదు. ఇంతవరకు ఏ జంతువు భాషా శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేదు."
"మరి మొన్న వై.ఎస్. అసెంబ్లీ లో చంద్ర బాబును పట్టుకుని అసలది మనుషులు మాట్లాడే భాష కాదు అని స్పష్టంగా ఎలా చెప్పగలిగాడు?"
"నాకు తెలీదు ఆయనకు ఆంధ్ర దేశంలో వున్న ఆడవాళ్ళనందరినీ లక్షాధికారులు, దళితులనందరినీ టాటా, బిర్లాల లాగా చేసే శక్తులు వున్నాయన్నాడు గదా. అంత గొప్పోడికి జంతు జాలాలు మాట్లాడే భాష కూడా వచ్చేమో?"
"కాకా ఇంట్లో విందుకు పోయినప్పుడు ఏ భాష మాట్లాడుంటారంటారు?"
"ఏదయినా గానీ రాయలసీమ భాష మాత్రం మాట్లాడుండడు.వై.ఎస్.కి చాలా భాషలు వచ్చు "
"ఉండవల్లి రాజమండ్రి లో ఏ భాష వాడాడు?"
"ఒకటి తెలుగు దేశం భాష , ఇంకోటి కాంగ్రేస్ భాష."
"అవి పార్టీలు కదా వాటికి భాషలేంటి?"
"అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏ స్పీకర్ లోనుండి వస్తే అది ఆ పార్టీ వాళ్ళ బాష. సపోస్ తెలుగుదేశం వాళ్ళ స్పీకర్ నుండి వచ్చిందనుకో అది 'దురదృష్ట వశాత్తు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. ఇప్పుడు దాన్ని ఆచరించక తప్పని పరిస్థితి' అని చెప్తుంది. ఆదే కాంగ్రేస్ వాళ్ళ స్పీకర్ నుండి వస్తే తెలుగు దేశం వాళ్ళని ఉద్ధేశిస్తున్నట్టు '(మీ) దురదృష్టం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. ఇప్పుడు దాన్ని ఆచరించక తప్పని పరిస్థితి ' అని వినిపిస్తుంది."
"ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం?"
"అలాంటి వాటికి జవాబు చెప్పడానికి పడవల్లో నుండి, కూచిపూడి నుండి, కుండల్లో నుండి వెలికి తీసి నిష్కర్షగా నిజాలను చెప్పే పత్రిక వస్తోంది. అందుకు నువ్వే సాక్షి."
3 comments:
క్యామెడీ కింగ్ విహారి గారికి చిన్న సూచన. ఈ వారం సిద్ద-బుద్ద అని టైటిలు గమ్మునా వదిలేశేబదులు, దాని పక్కన వ్యాసానికి తగిన పేరు కూడా జోడిస్తే అద్దిరిపోతుందని నా ప్రగాఢ నమ్మకం :)
నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)
అన్నా మీ జలక్ లే జలక్ లు...
శివకుమార్ దిన్నిపాటి
ఆఖరి మాటొక్కదానికే నూరు మార్కులు.
Post a Comment