Friday, February 23, 2007

ఏకవీర

బ్లాగు పోటీలు ముగిసాయి. పోటా పోటీ గా ముగ్గురు రాగా చివరి ఓవర్ లో చివరి బాలుకు విన్నర్ ఎవరో తెలిసినట్టు శోధన సుధాకర్ గారు విజేత గా జెండా పట్టుకుని వచ్చారు. ఇప్పటికెన్ని సార్లు అభినందనలు చెప్పానో తెలీదు కానీ మళ్ళీ చెబుతున్నా...బ్లాగు విజేతకు శుభాకాంక్షలు. దగ్గరగా వచ్చిన "హృదయానికి", "శ్రీ కృష్ణ దేవరాయలుకు" ఇంకా ఇందులో పాల్గొన్న ఇతర బ్లాగర్లకు హార్ధిక అభినందనలు.

ఈ పోటీ లో నాకొచ్చిన ఓట్లు(నేను పోటీ లో లేకపోయినా) చూసి నామీద నాకే తెగ జోకులు వెయ్య బుద్ధేస్తోంది. ఈ బ్లాగు పోటీలనగానే గోచీ ఎగ్గట్టి పలుగు పార తీసుకుని బ్లాగు మడిలోకి దిగి పలు రకాలుగా ఎగ్గొట్టి, దిగ్గొట్టి, మసి పూసి, సున్నమేసి, రంగేసి దానిమీద కళ్ళాపిచల్లి దాని మీద ముగ్గేసి దాన్నెత్తిన గుమ్మడి పువ్వు పెడితే సరిపోదని విక్టోరియా పువ్వును తెచ్చి పెట్టేసి ఆహా "ఎంత సుందరం నా మడి" అని ఆనందించేసి తీసుకెళ్ళి నా మడిని "అలంకరణ విభాగం" లో పెట్టి వచ్చేస్తే దాన్ని తీసుకెళ్ళి భీముళ్ళు, భీష్ముళ్ళు, బ్రహ్మర్షులు పంచన వేసేసారు. నేనేమో "ఉంగా ఉంగా" అనుకుంటూ ఇంకా ఉగ్గు పాలు తాగుతున్నోడిని. ఇక అక్కడి నుండి పాక్కుంటూ వెళ్ళే ఓపిక లేక అక్కడే మహమహుల ఒళ్ళో వాళ్ళ గడ్డాలతో, గదలతో ఆడుకుంటూ ఉండిపోయా. "ఈ కాస్త సమయం రాజశేఖర రెడ్డి దగ్గర గడిపేసి వుంటే తన అనుంగు మిత్రుడనని ఫోజు కొట్టేసినట్టయితే నాకు ఓ పదో పరకో నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చేసేటివి కదా" అని కూసేపు చింతించా. బుర్రలో "అయిననూ వెళ్ళి రావలె హస్తినకు.." అని అనుకోకుండా నా మడి సాగులో నేను పడీపోయా. వీళ్ళిలా చేస్తారా అని నా మెడుల్లా అబ్లాంగేటా "నేను అసలు ఓటెయ్యను పో" అంటే హృదయం మాత్రం "హృదయం ఎక్కడున్నది..హృదయం ఎక్కడున్నది నీ చుట్టూ నే తిరుగుతున్నది.." అని గజినీ లో పాట పాడింది. సరే నా వోటన్నా ఎవరికైనా వేద్ధాం అని వెళితే కొండ వీటి చాంతాడంత లోతున్న బావి కనిపిస్తే నేను దూకలేనని వచ్చేశా. అలా నా ఓటు కూడా వెయ్యలేదు. మరి నాకు ఓటేసిందెవరు. ఎవరు ఓటేసారో వాళ్ళకు శత కోటి వందనాలు.
బ్లాగు బహుమతుల ప్రాయోజకులకు ఒక విజ్ఞప్తి. ఇక మీదట బ్లాగు "విజేత" లకే కాకుండా "చివరిజేత" లకు కూడా కొన్ని వీలయితే చానా బహుమతులు ఇవ్వాలని "ఏకవీర" నైన నేను కోరుకొంటున్నాను.

కొసమెరుపు: ఈ మొత్తం పోటీల లో కేవలం ఒక్క ఓటే వచ్చిన బ్లాగరు నేను కాకుండా ఇంకొకరు కూడ నా చెంతకు చేరి నా ప్రత్యేకత కు గండి కొట్టినందుకు చింత చెట్టుకింద చాలా చింతిస్తున్నాను.

ఏకవీర విహారి.

Thursday, February 22, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు.

బుడతడు: తాతయ్య చూశావా నా ఐపాడ్. అగ్గిపెట్టెలా వున్న దీనిలో కొన్ని వేల పాటలు స్టోర్ చేసుకొని వినొచ్చు తెలుసా?

తాతయ్య: అదేం పెద్ద గొప్ప. మా కాలం లో ధర్మ వరం వాళ్ళు అగ్గి పెట్టెలో పట్టేంత పదహారు గజాల పట్టు చీర తయారు చేసే వారు తెలుసా?

బుడతడు: ఆ కాలంలో అంత పెద్ద అగ్గి పెట్టెలు తయారు చేసేవారా తాతయ్యా?

తాతయ్య: ???

బోనస్ జోకులు:

మార్గదర్శి పై కక్ష లేదు -- కె.రోశయ్య.
పత్రికా స్వేచ్చను గౌరవిస్తా -- కె.కేశవరావు.

Wednesday, February 21, 2007

పెళ్ళి లో "దొంగ" విందు భొజనం.

రాజేష్ గారి బ్లాగు లో "పిలవని పేరంటానికి.." చదివిన తరువాత నా పిలవని పేరంటం గుర్తొచ్చింది. అది బ్లాగేస్తున్నా హాయిగా.

మమ్మీ చేసిన బ్రెడ్ తినేసి కాలేజ్ లో అమ్మాయిల్ని చూసి "మమ్మీ మమ్మీ మాడ్రన్ బ్రెడ్" అని పాడేసిన పాటలయిపోయి "మూసుకోని నీ బ్రెడ్ నువ్వు సంపాయించుకో" అని గుర్తు చేసిన రోజులవి. తిరపతి లో ఇంజినీరింగ్ పట్టభద్ర స్వీకరణ అయిపోయిన తరువాత ఊరుకు దగ్గరగా వుంటుంది కదా అని బెంగళూరు మహా నగరం లో "సాపాటు ఎటూ లేదు పాటయిన పాడు బ్రదర్" అని పాడుకొంటూ అక్కడ ఇక్కడ దరఖాస్తులు పెట్టుకుంటూ "నీ బోడి ఫస్ట్ క్లాసు మాకు చాలదు" అని తిరస్కారానికి గురవుతున్నా మొక్క వోని దీక్షతో అయిదు రూపాయల "అన్న-సాంబారో" లేక "రస-అన్నా నో" తినుకుంటూ వెళ్ళబుచ్చేస్తున్న కాలం. ఇలా ఉద్యోగాలకి ప్రయత్నిస్తే చాలదు కానీ ఎలాగయిన ఓ కంప్యూటర్ కోర్సు చేసేసి ఉద్యోగ లక్ష్మిని వరించాలనే తలంపు తో జయనగర నాలగవ బ్లాకు లో వున్న "ఆప్టెక్" లో ఓరకిల్ కోర్సు ఫీజు కట్టేసి రోజు టంచనుగా క్లాసులకు హాజరవుతున్నా. గది కూడా కొంచెం దగ్గరనే జె.పి.నగర మొదటి దశలో (ఫస్ట్ ఫేస్).

ఓ రోజు అలా క్లాసయిపోయాక బండేసుకుని ఇంకొందరు స్నేహితులతో కలిసి లాల్ బాగ్ పార్కు లో రౌండ్లేద్ధామని బయలు దేరాం. లాల్ బాగ్ లో అక్కడున్న "అందాలను" తనివితీరా చూసే లోపే వర్షం రావడం మొదలయింది. ఆ వర్షం రావడం చూసి నా తమిళ ఫ్రెండు "అంగ పార్ డా! రెయిన్ ఈజ్ కమింగ్ లెట్స్ గో హోం" అన్నాడు. వాడో ప్రత్యేక మయిన మనిషి. కొంచెం అరవం, కొంచెం తెలుగు, కొంచెం కన్నడ కొంచెం ఆంగ్లం కలిపి ఒక వాక్యం తయారు చేసేస్తాడు. వాడెక్కడుంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయిస్తాడు. వాడు చెప్పిందే తడవు అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ బైకుల్లో బయలు దేరాం రూముకు జయనగర్ మీదుగా. జయనగర నాలుగవ బ్లాకుకు వచ్చేసరికి వర్షం ఎక్కువయి పోయింది. కాస్త తగ్గితే వెళ్దామని అక్కడున్న చెట్ల కింద నిలబడ్డాం కాసేపు. అలా కొంత సేపు వున్న తరువాత అర్థమయింది ఆ వర్షం ఇక తగ్గదని. అప్పటికే సమయం ఎనిమిదవుతోంది. కడుపులో ఆత్మా రాముడు "హలో"..హలో" అనడం మొదలు పెట్టాడు. రూముకెళితే ఎవడో ఒకడు వండాలి లేక పోతే ఏ హోటల్ కో పోవాలి.

ఏం చేస్తే బావుంటుంది అని చర్చించుకుంటూ వుంటే అర్థమయింది మేము నిలబడ్డ చోటు పెళ్ళిళ్ళు జరిగే కళ్యాణ మంటపాల దగ్గర అని. అక్కడ ఒకే వీధిలో దాదాపు అయిదు కళ్యాణ మంటపాలు వున్నాయి. అవి కూడా కాస్త ఖరీదయినవే. " ఇన్ని కళ్యాణ మంటపాలున్నాయి మనల్ని ఎవడన్నా పెళ్ళి కి పిలిస్తే బావుండు" అనిపించింది. అప్పుడు మా మనోహర్ కి బల్బు వెలిగింది. వాడి ఫ్రెండు పెళ్ళి ఆరోజే అది కూడా అక్కడే కాకపోతే వాడికి పెళ్ళి జరిగే కళ్యాణ మంటపం గుర్తు లేదు. ఆ వర్షం లో అక్కడున్న పెళ్ళి మంటపాలన్నీ తిరిగే ఓపిక కూడా లేదు. వీడేమో అన్నింట్లోనూ స్పెషలిష్టాయే.

"అయ్యో అప్పా.. ఐ టోటలీ ఫర్ఘాట్ అబౌట్ దిస్ మ్యారేజ్..లెట్స్ గో టూ హిజ్ మ్యారేజ్ అండ్ హావ్ ఫ్రీ మీల్స్ ఫార్ ద నైట్. "

"యూ ఇడియెట్ ఇట్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ మ్యారేజ్ హౌ కెన్ వుయ్ కం యుగో? వుయ్ ఆర్ నాట్ కమింగ్" అన్నా కడుపులో పరుగులు పెడుతున్న ఎలకల్ని కాస్త గదమాయించి.

"ఇల్లాడ. ఇట్స్ ఆల్ స్మాల్ స్మాల్ థింగ్స్ యు నీడ్ నాట్ వర్రీ. ఇఫ్ యు కన్ సిడర్ ఆల్ దీస్ థింగ్స్ యు విల్ నాట్ ప్రాస్పర్ అటాలూ" అని అందర్ని తయారు చేసేసి బయల్దేర దీసాడు.

అందరం అలా పోలోమని వెళితే బాగుండదని బళ్ళన్నీ ఓ చెట్టు కింద పార్క్ చేసేసి. ఓ కళ్యాణ మంటపం దగ్గరికెళ్ళి ఆగాం. దాని చూసిన వెంటే మా మనోహర్ గాడు వీర లెవెల్లో నటించడం మొదలు పెట్టాడు. అక్కడున్న బోర్డును వేలెత్తి చూపిస్తూ "ఇక్కడ్రా.దిస్ ఈజ్ అవర్ ప్రభాకర్. సీ రాధ వెడ్స్ ప్రభాకర్..లెట్స్ గో ఇన్ సైడ్ ఫాస్ట్ లేదంద్రే హీ విల్ల్ బీ మ్యాడ్". ఇంకేం పిల్లా కోడి వెంట వెళుప్తున్న కోడి పిల్లల్లాగా బిర బిర మంటూ లోపలి కెళ్ళి పోయాం.

అప్పటికే పెళ్ళి అయిపోయి స్టేజ్ మీద రిసెప్షన్ జరుగుతోంది. పెళ్ళి కొడుకు కూతురూ వచ్చిన వారందర్నుండీ శుభాకాంక్షలందుకుంటున్నారు. అప్పటికే అందరూ భోజనాల గదిలోకి వెళ్ళి పోతున్నారు. ఇక గుంపులో గొవిందయ్య లాగా వెళ్ళి విషెస్ చెప్తామనుకుంటూ పైకి వెళ్ళ బోతుంటే ఒక పెద్దాయన అడ్డు తగిలి "ఊటా ఆయత్తా(భోజనం అయిందా)?" అని అడిగాడు అతిథి మర్యాద చేస్తూ. "ఆహా శ్రీకృష్ణ భగవానా సమయానికొచ్చావా ఆదుకోవటానికి" అని ఓ మొక్కు పడేసి పళ్ళికిలించి" ఇల్లారి(లేదండి)" అనేశాం కోరస్ గా. దానికి ఆ పెద్దాయన " అవుదా..ఈ కడే బన్ని (అవునా ఈ పక్కకు రండి)" అని బఫే ప్లేట్లు చూపించాడు.

ఆయనకు థా చెప్పి బ్యాటింగ్ మొదలు పెట్టాం. అందరి మొహాల్లో ఎక్కడ లేని నటన! ఉబికి వస్తున్న నవ్వును ఆపుకుని ఒక్కో వంటా రుచి చూస్తూ ఆరగించడం పూర్తయ్యేసరికి ఒక అర గంట అయ్యింది. ఇక బయలు దేరదామనుకుంటూ వుంటే ఇంకో కుర్రాడు వచ్చి ఐస్ క్రీం తెచ్చి ఇచ్చాడు. అప్పటికే నిండి పోయిన కడుపు క్రిక్కిరిసిన జనం మధ్యలోకి మహారాజు రాగానే దారి ఇచ్చేసినట్టు కాస్త ఖాళీ చేసుకుని ఐస్ క్రీముకు ధారి ఇచ్చింది.

పగిలి పోతున్న పొట్టతో "అన్నదాతా సుఖీభవ" అని దీవించేసి బయటకు రాబోతే హోరుమనే వర్షం ఇంకా తగ్గనే లేదు. సరేలే ఆత్మా రాముడు చల్లబడ్డాడు కదా కొంచెం భుక్తా యాసం తీర్చుకుని పోదామని అక్కడే కారిడార్ లో చతికిల పడ్డాం. అలా కూచున్నామో లేదో ఒక పెద్దాయన... ధవళ వర్ణం తో మెరిసి పోతున్న ఖద్దరు వస్త్రాలతో లాల్చీ, ధోవతీ, భుజం మీద కండువా తో లోపలికి ప్రవేశించాడు. నల్లటి రూపు దాదాపు ఆరు ఆడుగుల ఎత్తు దానికి తగ్గ శరీరం. వస్తూ వస్తూనే అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. నేను ఇంకా నిలబడే వున్నాను. లోపలికి వెళుతూ నా వైపుగా వస్తూ నమస్కరించిన చేతులతో దగ్గరకు రాగానే నేను కూడా నమస్కారం పెట్టా. అలా చూస్తూ వుండగానే లోపలికి వెళ్ళి పోయాడు.

అప్పుడు నా వెనక ఉన్నవారు అంటుంటే విన్నా. " దేవే గౌడ అవరు బందిద్ధారు (దేవే గౌడ గారు వచ్చారు)". అప్పుడర్త మయింది ఈ చూసిన ముఖమెవరో కాదు. కర్నాటక ముఖ్యమంత్రి దేవేగౌడ అని. ఆయన అలా లోపలికి వెళ్ళాడో లేదో వెంటనే ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడే తెలిసింది ఆయన ఎంత నిరాడంబరుడో. అప్పట్లో ఆయనంటే ప్రజల్లో వల్ల మాలినంత అభిమానం. అందుకే ఆయనకు పెద్ద సెక్యూరిటీ అవసరం లేదనే వారు. దేవే గౌడ లోపలికి వెళ్ళి వధూవరులను ఆశీర్వదించి కాసేపటికి బయటికి వచ్చేసారు. ఆయన వరండా దిగి రాగానే ఒక ఎస్సై గొడుగు పట్టుకుని నడవబోతే ఒద్దని తనే గొడుగు తీసుకుని తన అంబాసిడర్ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసుకుని వెళ్ళి కూర్చున్నాడు. ఆ కారు ముందు రెండు మోటర్ బైకులు వెనక ఇంకో కారు అంతే ఆయన సెక్యూరిటి అప్పట్లో.

ఆయన అలా వెళ్ళగానే మా మనోహర్ గాడి చొక్కా పట్టుకున్నంత పని చేశాం." వెధవా! ముఖ్యమంత్రి లాంటి వాడు వచ్చిన పెళ్ళి లో మేము గనుక దొరికి పోయి వుంటే మా పరిస్థితి ఏమయి వుండేది" అంటే.

"ఇట్స్ ఓకే డా! ఒన్సినే వైల్ యు డూ నథింగ్ విల్ హపెన్. వుయ్ హాడ్ సం ఫన్నూ" అన్నాడు వాడు.

"ఒరేయ్! మనోహర్ గా! రూముకు పదా నీ సంగతి చెప్తాం" అనేసి అక్కడినుండి జారుకున్నాం.

Tuesday, February 20, 2007

బ్లాగు వాగుడు

బ్లాగులో ఏమి రాద్దామా అని అలోచిస్తుంటే అసలు బ్లాగుల గురించే రాస్తే పోలా అనిపించింది. ఇంకేం అని బుర్రకి సాన పెడదామనుకున్నా. అమెరికా వచ్చిన తరువాత బుర్ర సాన పెట్టేంత ఉక్కు స్థాయిలో లేదు అది కాస్తా ప్లాస్టిక్ పదార్థంగా మారింది. దాన్ని సాన పెడితే ఉన్నది కాస్తా కరిగి పోతుందని సాన పెట్టకుండా మొదలు పెట్టేసా.

బ్లాగర్లు పలు రకాలు మొదటగా వాళ్ళను క్రికెట్ తో పోల్చుకుందాం. చాలా మంది రాహూల్ ద్రావిడ్ లాగా నిలకడ గా బ్లాగులు రాస్తూ ముందుకు పోతున్నవారు కొందరు. అంటే వీళ్ళందరూ కేవలం బ్యాట్స్ మెన్సే అన్న మాట. వీళ్ళని "బ్లాగు ద్రావిడ్ లు" అనవచ్చు. వీళ్ళు చాలా నింపాదిగా అన్ని విషయాలని పరిశీలించి ఆ వచ్చే బాలును (టాపిక్) చూసి మంచిదయితే తమ దయిన స్టయిల్లో(శైలి) దాన్ని బౌండరీ దగ్గరకో లేక గాల్లో లేపి సిక్సర్ గానో మార్చేస్తారన్నమాట. అది సిక్సరయితే బ్లాగర్లందరూ ఓ వారం పాటు చర్చించుకుంటారన్నమాట. ఇంకొందరు మహేందర్ సింగ్ ధోనీ లాగా ధనా ధన్ మని పిచ్చ పిచ్చగా రాసేస్తుంటారన్నమాట. ధోనీ ఏ బాలు ఎలా వచ్చిందని చూడడు అది వేసిన వాడు స్పిన్నరా పేసరా అని కూడ చూడకుండా వీర బాదుడు బాదుతుంటాడు. అలాగే "బ్లాగు ధోనీలు" ఏ విషయం మీద అని కాకుండా అన్నింటి మీదా ఫటా ఫట్ మని బ్లాగుల్ని నింపేస్తారన్నమాట. రాసిన టాపిక్ "గూగ్లీ" నా "యార్కరా" అన్నది రాసిన వాళ్ళకు కూడా తెలీదు.

ఇంకొందరు బ్లాగర్లు ఏదో ఒక దానికే పరిమిత మవుతారు అంటే కవితలు కానీ, చిత్రాలు కానీ సినిమాలు కానీ, సినిమా పాటలు కానీ, మాత్రమే వాళ్ళ ధ్యేయమన్నమాట. వీళ్ళను స్పిన్నర్లు గా, ఆఫ్ స్పిన్నర్లు గా, ఫాస్ట్ బౌలర్సు గా, మీడీయం పేసర్లు గా విభజించవచ్చు. వీళ్ళు కూడా ఒకే సారి అయిదారు వికెట్లు తీసుకునే మ్యాచ్ విన్నర్లుగా మారినప్పుడు బ్లాగర్లందరు అటు వైపు కన్నేసి వాటి స్పూర్తి తో ఇంకొన్ని బ్లాగులు రాస్తారన్నమాట. వీళ్ళని "బ్లాగు హర్భజన్ లు" , "బ్లాగు శ్రీశాంత్ లు", "బ్లాగు పటాన్ లు" అని పిలుచుకోవచ్చు. ఇంకా కొంత మంది మన కపిల్ దేవ్ లాంటి వాళ్ళు. ఏ విషయాన్నయినా అవపోశన పట్టేసి వీలయితే కవతల్లాగా స్పందిస్తారు లేదా పేరాలు పేరాలు రాసేస్తారు. అవసరానికి తగ్గట్టు రాసి "ఆల్ రౌండర్లు " అనిపించుకొంటారు.

ఇంకొందరు మన "లక్ష్మణ్" లాగా పద్ధతి గా బ్లాగుతుంటారు. వీళ్ళని కరివేపాకు లాగా వాడుకుంటారన్నమాట. ఎపుడో ఓ సారి టీం లోకి తీసుకున్నట్టు , "ఇంకొంచెం బాగ రాయొచ్చు" అని ఓ కామెంట్ రాసేసి ప్రశంసించేసి పక్కన పడేసి వీలయితే "నువ్వు లావు తగ్గు" అని వెంగ సర్కార్ చెప్పినట్టు ఓ సలహా పడేస్తారన్న మాట.

అప్పుడప్పుడూ టేం లోకి వస్తూ వెళుతూ వుండే "పార్తీవ్ పటేల్ లు" , "గౌతం గంభీర్ లు", "ఆశిష్ నెహ్రా లు" లాంటి బ్లాగర్లు కొందరు. వీళ్ళు అప్పుడప్పుడూ జన్మకో శివరాత్రి అన్నట్టు రాస్తారన్న మాట. అప్పుడప్పుడూ కూడల్లో, తేనె గూళ్ళో, బ్లాగర్ల సంఘం లో కనిపిస్తూవుంటారు. ఇంకొందరు "వెంకటపతి రాజు", "వెంగ సర్కార్" లాగా బ్లాగులు రాయటం నుండి రిటైరయి పోయి కామెంట్ల కింద, తెలుగు బ్లాగర్ల గుంపు లోనూ కనిపిస్తూ వుంటారు. మరికొంత మంది ఈ బ్లాగర్లకు ఇంకేం చేయాలబ్బా అని ఆలోచిస్తూ పలు ప్రయత్నాలు చేస్తూ వుంటారు కమర్షియల్ గా.

ఇంకొందరు క్రికెట్ మ్యాచ్ చూసి స్పూర్తి పొంది ఇంటికెళ్ళి సందులో పిల్లల తో ఆడినట్టు కూడలి లో చూసేసి "ఓస్ ఇంతేనా నేనూ బ్లాగేస్తా పీకల్దాకా" అని ఓ బ్లాగు రాసేసి "ఓ సారి నా బ్లాగును లుక్కండ్రోయ్" అని అందరికి ఈ-టపా పెట్టేసి వాళ్ళొచ్చి చూసి "అబ్బా కుర్రోడా/కుర్రదోయ్! భలే తెలుగు తున్నావ్ ఇక బ్లాగ్జృంభణ మొదలు పెట్టు" అనగానే రొమ్ము విరుచుకుని వెంటనే ఆవులించుకుని నోట్లో రెండు లేదా మూడు చిటికలేసుకుని నిమ్మళంగా నిద్దర పోయే వాళ్ళు కొందరు. వీళ్ళని "ఉత్తర ప్రేక్షక బ్లాగర్లు" అంటారు.

ఎవరే టైపు బ్లాగరొ కనుక్కోవడానికి బ్లాగర్లందరికోసం అప్పుడప్పుడూ ప్రపంచ కప్పులు జరుగుతుంటాయి దాన్ని "భారత బ్లాగర్ల కప్పు" అని వ్యవహరిస్తారు. ఇవి వ్యక్తి గత విభాగంలో జరిగేటివి అన్న మాట. వీటి గురించి చాలా మంది బ్లాగర్లకు తెలీదు. తెలిసినా కొంత మంది పట్టించుకోరు. పట్టించుకున్న వాళ్ళు "ఆ! ఈ కప్పు నాకొద్దు నా కొచ్చేస్తే ఇతరులు బాధ పడతారు" అని తప్పుకునే నా లాంటి బ్లాగర్లు కొందరు.

హమ్మయ్యా! ఇంత రాసిన తరువాత నా ప్లాస్టిక్ మెదడు ఇంకా వుందా అని తడిమి చూసుకుంటే అది కాస్త అసలు సిసలు మెదడు గా రూపాంతరం చెందినట్టు కనిపిస్తోంది.

నీతి: తెలుగు లో ఆలోచిస్తూ...తెలుగు కోసం పాటు పడితే మెదడు చురుకుగా తయారవుతుంది.

మీరు ఏ టైపు బ్లాగరో మీరే ఊహించుకోండి. మీరు "పార్ధీవ్ పటేల్" బ్లాగరయితే తిరిగి టేంలో కి వచ్చి క్రికెట్ ను చీల్చి చెండాడుతున్న బెంగాల్ పులి "గంగూలీ" బ్లాగరవటానికి ప్రయత్నించండి. "బ్లాగు వాగుడు" మాత్రం మానకండి.

అయ్యా మరియూ అమ్మా!

ఇది ఎవరినీ ఉద్ధేశించి రాసినది కాదనిన్నూ, ఎవరినీ మనసులో వుంచు కొని రాసినది కాదనిన్నూ, ఎవరి మనసూ నొప్పించాలని కాదనిన్నూ, ఎంతో సహృదయతో రాసిందనిన్నూ, నేను అందరిలాంటి మానవ మాతృడననిన్నూ, మీకు ఈ బ్లాగు వాగుడు లో విన్నవించు కొనుచున్నాను.


సిక్సర్ కొట్టేసిన
క్రికెట్ విహారి
(బౌండరీ లైను దగ్గర ఎవరూ క్యాచ్ పట్టకపోతే)

Friday, February 16, 2007

ధ.దే.ఈ.శు.-- జోకు

ఒక వ్యక్తి హత్యా నేరం మీద కోర్టులో ప్రవేశపెట్ట బడ్డాడు.

జడ్జి: "నువ్వు ఎందుకు మీ యజమానిని చంపావు?"

పని మనిషి :"అయ్యో నా కేటీ తెల్వదండీ. నేను ఆయనను చంపలేదండీ"

జడ్జి:"మరి ఆయన గొంతు ఎవరు పిసికారు?"

పని మనిషి : "మా అయ్యగోరు ఎప్పుడు ఏ పని సెయ్యమంటే అది సేత్తానండి. ఓ పారి కాళ్ళు నొప్పులంటే కాళ్ళు పిసికానండి. ఇంకో పారి చేతులు నొప్పంటే చేతులు పిసికానండి. ఈ పారి గొంతు నొప్పంటే గొంతు పిసికానండి.కావాలంటే ఇప్పుడు మీకు గొంతు నొప్పని సెప్పండి దాన్ని కాసేపు పిసికిపెడతానండి. అంతే కానీ నాకేటీ తెల్వదండి."

జడ్జి: "????"



ధ.దే.ఈ.శు. అంటే ఏంటని అడక్కండి. మీరే కనుక్కోండి.



**** --- ***

Wednesday, February 14, 2007

నిన్నటి నేటి వార్త ..

ఒక పనికి మాలిన వార్త రాస్తే వాళ్ళకి బుద్ధి లేదు. నీకూ బుద్ధి లేదా?
-- వై.ఎస్. రాజశేఖర రెడ్డి.

ఏం తమాషా ఆడుతున్నారా? ఇది ప్రజాస్వామ్యమని గుర్తుంచుకోండి. నాయకుడి కల్చర్ నే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు.

-- చంద్రబాబు నాయుడు.

మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుగాక.


** **

Monday, February 12, 2007

బ్లాగర్ల పోటీ -- ఓ సమాలోచన

భారత బ్లాగర్ల వాళ్ళు ఉత్తమ బ్లాగర్ల పోటీ నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ పోటీలు బ్లాగుతున్న ఎంతో మందిని ఉత్తేజితులను చేస్తుందనటలో సందేహం లేదు. ఇప్పటికే దాని ప్రతిస్పందనలు మీరు చూసే ఉంటారు www.indibloggies.org లో కానీ సొంత బ్లాగులలో కానీ. ఏ పని చేస్తున్నా వారిని ప్రొత్సహించడానికి ఇలాంటివి రావడం ఎంతో అవసరం. భవిష్యత్తులో ఇలాంటివి నిర్వహించడానికి ఇంకా ఎంతో మంది వస్తారు కూడా.


ఇందులో పోటీ చేస్తున్న అందరికి అభినందనలు.

కాకపోతే నాకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి తప్పనిపిస్తే సరిదిద్దండి. భారత బ్లాగర్ల సాలె గూడు లో తెలిపిన ప్రకారం భారత్ కు సంబందించిన ఏ బ్లాగైనా ఏ విభాగంలో నైనా పాల్గొనవచ్చు. అలాగే వివిధ భాషా బ్లాగుల కింద మరికొన్ని ఇచ్చారు. వివిధ విభాగాల కింద అంటే , వంట, చాయా చిత్రం, కవితలు వాటి కింద నామినేట్ చేసే బ్లాగులన్నీ ఆంగ్లం లో నే వుండాలని ఎక్కడా రాసినట్టు లేదు. దానర్థం ఏ భాషా బ్లాగయినా ఏ విభాగంలో నైనా పోటీ పడొచ్చు అనేకదా అర్థం. కానీ జరిగింది దానికి విరుద్ధం. నేను మన తెలుగు బ్లాగులను కొన్నింటిని వివిధ విభాగాల్లో అంటే ఎంటర్ టైన్ మెంట్, వంట, కవిత, కొత్త మరియు సాంకేతిక విభాగాల కింద నామినేట్ చేశాను. అవన్నీ ఇప్పుడు తెలుగు బ్లాగుల కింద పోటీ పడుతున్నట్టు ప్రకటించేశారు. మరీ చోద్యం అందులో ఓటేసిన వంటల బ్లాగు లేదు. ఇవన్నీ పోటీ చేసేవారికి తెలీదులే అని నిర్వాహకులు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో ఏ ఏ విభాగాలకింద నామినేట్ చెయ్యబడ్డారో, ఎవరు ఓటు చేశారో కూడ తెలిసిపోతుంది సులభంగా.

ఇది కేవలం నిర్వాహకుల "ఓవర్ లుక్" అని సరిపెట్టేసుకుందామా? లేక మన తెలుగుకు (లేదా ఇతర ) భాష(ల)కు ఇతరత్రా విభాగాల్లో పోటీ (ఆంగ్లం కాకపోతే) చేసే సత్తా లేదని సరిపెట్టుకుందామా?

చందాల విహారి

నా బ్లాగులో ఒక కొత్త సదుపాయం ఈ మధ్యనే పెట్టా. ఇలాంటివి ఇంకా మన తెలుగు బ్లాగుల్లో వున్నాయి కానీ వాటిని ఎవరూ అంతగా గమనించినట్లు లేదు. అందుకని దానిగురించి ఒక ముక్క రాద్ధామని రాస్తున్నా. ఈ బ్లాగు చూసిన వాళ్ళెవరైనా బ్లాగు నచ్చితే దీని లో కొత్తవేమైనా వున్నాయా అని చూడ్డానికి ప్రతి సారి ఈ బ్లాగుకు రానక్కరలేదు ఇక మీదట. దానికి మీరు చేయవలిసిందిల్లా ఎడమ వైపున ఇచ్చిన "ఖాళీ పెట్టె" లో మీ ఈ-చిరునామా ఇచ్చి "కొత్తవి పంపించు" అన్న మీట ను నొక్కితే చాలు. మీరు మీట ను నొక్కిన వెంటనే ఒక "ధృవీ కరణ" టపా వస్తుంది. దాన్ని తెరిచి దానిలో ఇచ్చిన లంకె ను నొక్కితే చాలు మీరు ఈ బ్లాగు కు చందా దారులు అవుతారు(డబ్బులు కట్టక్కర్లేదండొయ్). మీకెప్పుడైనా "ఈ బ్లాగు విహారి గాడు" ఈ మధ్య "బోడి విహారి గాడు" అయిపోయాడు అనిపిస్తే వద్దని కూడా చెప్పెయ్యొచ్చు నిర్మొహమాటంగా ఈ-టపా ద్వారా. ఇక ఈ బ్లాగులో ఏదైనా కొత్త టపా రాయటం జరిగితే దానిగురించిన వివరాలు నేరుగా మీ ఈ-పెట్టె లోకి వచ్చేస్తాయి. దాని నమూనా ఈ కింద చూపించిన విధంగా వుంటుంది. మరింకేం నచ్చితే "కొత్తవి పంపించు" మీటను నొక్కండి మీ ఈ-చిరునామా ఇచ్చి.

ఇట్లు
(అంద) చందాల విహారి

Friday, February 09, 2007

చట్నీ ఎలా చేస్తారంటే..

బ్రిటీషువాడు తిరుపతికి వచ్చాడు. వచ్చిన తరువాత అక్కడున్న వాళ్ళు చెప్పారు " నువ్వు కొండకు నడిచి వెళ్తే చాలా పుణ్యం వస్తుంది" అని.

"సరే" అని అలిపిరి నుండి బయలు దేరాడు. ఆకలిగా వుంటే అక్కడే వున్న చిన్న దుకాణంలో టిఫిన్ తిందామని లోపలికెళ్ళాడు.

అక్కడ సర్వర్ తెచ్చిన దోశ, వేరు శెనగ చట్నీ తిన్నాడు. చట్నీ చాలా బాగుందని అది ఎలా తయారు చేస్తారో కనుక్కుందామని ఆ సర్వర్ నడిగాడు. తన ఆంగ్ల పరిజ్ఞానంతో ఆ సర్వర్ ఇచ్చిన సమాధానం.

"ఫస్ట్ చిల్లీస్ థౌసండ్(వెయ్యి)"
"ఓ కే" బ్రిటీషువాడు.
"నెక్స్ట్ సాల్ట్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ టామరిండ్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ ఫ్రైడ్ గ్రౌండ్ నట్స్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ ఆనియెన్స్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ ఆల్ హండ్రెడ్(నూరు)... చట్నీ రెడీ"
"??????"

Thursday, February 08, 2007

ధన్యవాదాలు

భారత బ్లాగర్ల ఉత్తమ బ్లాగర్ల పోటీలు ఫిబ్రవరి 5 న ముగిశాయి. ఉత్తమ తెలుగు బ్లాగు బహుమతి ని తేనె గూడు వారు ప్రాయోజితం చేస్తొందని అందరికి తెలిసిందే. నేను అలంకరణ (design) విభాగంలో పాల్గొన్నా. బహుమతి వస్తుందన్న ఆశ ఏ కోశానా లేదు. ఓ తెలుగు వాడు ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పడానికి పాల్గొన్నా, అందుకోసం నా బ్లాగులో లింకుకూడా పెట్టా. దాన్ని చూసి కొందరు దాన్ని చూడకముందే కొందరు నాకు ఓట్లేశారు. అలా నాకు ఓట్లేసిన వారందరికి నా బ్లాగు ముఖంగా ధన్యవాదాలు. నాకు వచ్చినవి 7 ఓట్లు ( నాది కూడా కలిపి). అదే మహద్భాగ్యం అనుకొంటున్నాను. నా బ్లాగ విహారం మొదలు పెట్టి అయిదు నెలలు మాత్రమే అయింది. ఇన్ని రావడం నాకు ఓటేసిన వారి ఉదారగుణమే తప్ప నా గొప్పేమీ లేదని విన్నవించుకొంటున్నాను.



నా బ్లాక్కొచ్చి చూసిన వాళ్ళకు ఓటేసిన వాళ్ళకు మరొక్క సారి కృతజ్ఞతలు.


ఇట్లు,
కృతజ్ఞ విహారి.

Monday, February 05, 2007

మా వూరికి ఎండొచ్చింది.


దాదాపు ఏడు వారాలనుండి మమ్మల్ని వణికించి, రోడ్లను రొచ్చు చేసి, కార్లకు మట్టి రంగులు వేయించి తన ప్రతాపాన్ని చూపిన చలి-మంచు పులి ఎట్టకేలకు ఒక నూతన రికార్డును స్తాపించి కాస్త సేద తీరింది. మొన్ననే నమోదయిన సరి కొత్త రికార్డు -18 F(-28C). వరసగా ఆరు వారాంతాలు మంచు పడ్డం మరో రికార్డు. ఇంకో రికార్డుకు దగ్గరవడానికి ఇంకో పదో పదిహేనో రోజులు వున్నాయి. ఇంతకు ముందు 63 రోజులు భూమి మీద మంచు కరగకుండా వున్నదట. ఇప్పటికి యాభై రోజులు పూర్తయ్యాయి. సూర్య భగవానుడు కాస్త దయ చూపి దర్శనం ఇస్తున్నాడు. పిల్లా పీచు ఆడుకోటానికి బయటికొస్తున్నారు.



అదేం చోద్యమో గానీ ఇక్కడి వాళ్ళు మంచు పడిన తరువాత రోడ్లు శుభ్రం చెయ్యరు గానీ.. సరదాగ షికారు కెళ్ళే బైక్ పాత్ లు (జాగింగ్ కు, సైకిల్ తొక్కే దానికి ఉపయోగించే దార్లు) మాత్రం టంచను గా శుభ్రం చేస్తారు. ఓ రోజు 5 అంగుళాల మందాన మంచు పడి నానా తంటాలు పడి ఇంటి ముందు శుభ్రం చేసుకొని కారు బయటకు తీసి నడుపుతుంటే చూశా మా ఇంటి దగ్గరున్న బైక్ పాత్. అది నున్నగా అప్పుడే గుండు కొట్టించిన తిరపతి గుండు లా నిగ నిగ లాడుతోంది. ఇప్పుడయితే కొన్ని రోడ్లలో చక్కెర పాకం రోడ్డు మీద పొసినట్టు వుంది. దాని మీద అడుగు వేస్తే మన ప్రయత్నం లేకుండా ఓ పది అడుగులు ఉచితంగా వెళ్ళి పోవచ్చు రెండు పక్కటెముకలు విరగ్గొటుకుని. కొన్ని చోట్ల పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాలు వచ్చి బాగా గడ్డ కట్టిన మంచును రాళ్ళను కొట్టినట్టు కొట్టి చిన్న ముక్కలను చేసి ఒక పక్క కుప్ప గా పోస్తున్నాయి. వాటిని కొంత మంది తమ సృజనాత్మ శక్తి ని ఉపయోగించి ఇంటి చుట్టూ కాంపౌండ్ స్తంభాల్లాగా పెట్టుకున్నారు.


ఇంతటి మంచులో కూడా మేము మన సంక్రాంతి ని మరిచి పోకుండా జరుపుకున్నాం. గజ గజ వణికించే చలిలో మా ఆవిడ ఇంటి ముందు ఓ ముగ్గు కూడా వేసేసింది నేను లేవక ముందే.



*** -11F (-28C) చలిలో మా ఆవిడ వేసిన ముగ్గు ఇది.

మా సంక్రాంతి సంబరాలు ఇక్కడి హిందూ దేవాలయంలో జరిగాయి. రెండు నాట్యప్రదర్శనలు మరియు స్వామి చిదాత్మానంద(చిన్మయా మిషన్, హైదరాబాద్) వారి ప్రవచనాలతో మా సంక్రాంతి ముగిసింది. దాని వార్తా విశేషాలు మీరు ఈనాడు లో చూడచ్చు.


*** స్వామి చిదాత్మానంద

శుభాకాంక్షలు......మరియు సంసారంలో సరిగమలు.

ముందుగా జ్యొతి గారికి,

మీరు మన బ్లాగర్ల వ్యక్తిగత సంతోష సందర్భాలను వెలికి తీసి అందరితోనూ పంచుకున్నందుకు, మీ సహృదయతకు ధన్య వాదాలు. నేను ఈ సందర్భంగా నాలుగు ముక్కలు రాద్దామనుకున్నా. అది మీ కామెంట్ల కింద పెడితే బాగుండదని. నా బ్లాగులో పెడుతున్నా...


ఇస్మాయిల్ మరియు సుధ దంపతులకు,


ఏడవ వార్షిక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.


వీవెన్ మరియు కల్పన దంపతులకు,


ప్రధమ వార్షిక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.


అనిల్ గారికి,


మీ బ్రహ్మ చర్య కు వీడ్కోలు చెప్పి సంసార సాగరంలో దూకుతున్నందుకు మీక్కూడా శుభాకాంక్షలు.


విహారి
ఇంకా ఇంట్లో వున్న వాళ్ళందరు.


ఈ సందర్భంగా నాకు ఒక జోకు గుర్తుకు వస్తోంది.


పెళ్ళయిన మొదటి సంవత్సరం భార్య చెప్పినట్టు భర్త వింటాడట.
రెండవ సంవత్సరం భర్త చెప్పినట్టు భార్య వింటుందట.
మూడో సంవత్సరం నుండి భార్య భర్త ఇద్దరూ మాట్లాడుకుంటుంటే పక్కింటి వాళ్ళు వింటారట.

*********

ఆంగ్లంలో ఒక సామెత వుంది. పెళ్ళయిన ఏడేళ్ళకు అదేదో కుట్టి "seven year switch" అవుతుందట. నాకు ఏడేళ్ళు అవడానికి ఇంకా రెణ్ణెళ్ళు వుంది.

*********

నాకు నా బ్రహ్మ చర్య రోజులు గుర్తుకు వస్తున్నాయి. పొద్దున్నే చక్క గా తయారై ఊరెంబడి షికార్లు కొట్టుకుంటూ బాలాదూరుగ తిరిగే ఆ రోజులెక్కడికి పోయాయో ఇప్పుడు.

ఓ సుముహుర్తాన పెళ్ళయిపోయి "అచ్చి..బుచ్హి.." అనుకుంటూ అమెరికా వచ్చిన ఆర్నెల్లకు "నాన్నోయ్ ! నా రిలీజ్ డేట్ వచ్చే ఆగస్టోచ్" అని పండుగాడు సిగ్నలిచ్చేశాడు. వాడొచ్చిన అయిదేళ్ళకు " ఒరేయ్ నాన్నా ! నేను కూడ వచ్చేసాన్రోయ్ అన్నీ అన్న గాడికే కాదు నాక్కూడా కొన్ని బొమ్మలు కొన్రోయ్" అని ఇంగో పండుగాడు వచ్చేశాడు.


కట్ చేస్తే.....


03-Feb-07...సాయంత్రం నాలుగ్గంటలు.

ఇంటెర్నెట్ చూద్దామని లాప్టాప్ తెరిచి కూచున్నా.

"ఏంటి ఏం చేస్తున్నారు..ఖాళీగానే వున్నారు కదా. వీడినెత్తుకోండి" అంది "అచ్చి..బుచ్హి" అనే మా ఆవిడ.నా సమాధానం కోసం ఎదురు చూడ్డాల్..గీడ్డాల్ ఏమీలేవ్. మరుక్షణమే చిన్న పండు గాడు నా వళ్ళో వాలాడు "ఉక్కూ..ఉక్కూ" అంటూ. అది చూసి పెద్ద పండు గాడు వచ్చి "నాన్నా ! నేనిక్కడ కూచుంటా" అన్నాడు నా వడి చూపించి. "సరే రా" అని చి.పం. ను ఏడమ పక్కకు మార్చి పె.పం. కుడి పక్క వళ్ళో కూర్చో పెట్టుకుని వినాయకుడికి అవతరమెత్త సిబ్ధి..బుద్ధి లను లాలించినట్టు నా కుమార రత్నాలను ఆడిస్తూ ఆయన వాహనమైన ఎలుక గార్ని మెళుకువ గా ఉపయోగిస్తూ ఇంటెర్నెట్ వార్తా సంచారాన్ని పూర్తి చేశా.


దీన్ని సంసార ఝంఝాటమంటే....అదొక శాంపిల్ మాత్రమే.


********

Thursday, February 01, 2007

కలిసుందాం లేకుంటే నోర్మూసుకుందాం

తెలుగు సినిమా వంద సంవత్సరాల వేడుకకు కమిటీ చైర్మన్ గా దిల్ రాజు ఎన్నుకోబడ్డారు. ఇక ఏర్పాట్ల విషయాని కొస్తే ఖర్చుకు ఏమాత్రం తగ్గకూడనే ఉద్ధేశ్యం తో చలన చిత్ర పరిశ్రమ లో వున్న వారందరూ తలా అయిదు కోట్లకు తక్కువకాకుండా ఇవ్వాలని చిత్ర పరిశ్రమ లో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరి ఇళ్ళకు సందేశాలు పంపబడ్డాయి. ఈ విషయాన్ని వారి వారి ఇళ్ళళ్ళో, కార్లలో, షూటింగ్ స్పాట్ లోని లేజర్ టీవి ల మీద స్క్రోల్ మెసేజ్ గా రావడం ఆలస్యం పెద్ద హీరోలయిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు,ప్రభాస్, అర్జున్, మోక్షజ్ఞ తేజ, రాం చరణ్ తేజ, నాగ చైతన్య, అఖిల్, విష్ణు వర్ధన్, మనోజ్ కుమార్, కళ్యాణ్ రాం లు తమ బ్యాంక్ ఖాతాల్లోనుంచి తలా పది కోట్లు Te.M.A.(Telugu movie artists association) కు ట్రాన్స్ఫర్ చేసేశారు. టీ.వి హక్కులు రెండు వందల కోట్లకు "మేమూ తెలుగే" అనే పర భాషా టీ.వి కి ఇవ్వబడ్డాయి. ఈ హక్కులు చాలా తక్కువ ధరకు ఇచ్చేశారు అని కొందరు విమర్శించారు.

ఇప్పుడున్న టీ.వి లలో కనీసం వారానికొక సారి తెలుగు వారిచేత తెలుగు మాట్లాడిస్తూ తెలుగు ని చూపిస్తున్నందుకు వాళ్ళకు మేమిచ్చిన గౌరవం " అని TEMA అధ్యక్షుడు జూ. ఎన్టీఆర్ ఒక ప్రకటన ఇచ్చారు.


మమూలుగా కమిటీ సమావేశాలను టెలీ కాన్ఫరెన్స్ లలో నిర్వహించే వారు. టీ.వి. హక్కుల విషయం మాట్లాడుకుంటుంటే ఎవరో హ్యకర్ వచ్చి వాళ్ళ సమావేశ వివరాల్ని బయట పెట్టడం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తుకు తెచ్చుకుని ఈ సారి చాలా జాగరూకతతో వ్యవహరించాలి అనే ఉద్ధేశ్యంతో ఈ సమావేశాన్ని ఒక రహస్య స్థలమయిన మైక్రోసాఫ్ట్ నేల మాళిగ లో ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఎలక్ట్రానిక్ పరికరాల్ని లోనికి రానీయ లేదు. సమావేశం మొదలయింది. అందులో పోయిన సారి వజ్రోత్సవాలప్పుడు జరిగిన తప్పులను మళ్ళీ చేయకూడదని అందరూ ముక్త కంఠతో అన్నారు. ఇది వంద సంవత్సరాల వేడుక కాబట్టి గొప్పగా జరపాలని తలచి విశాఖ సముద్ర తీరంలో సంచరించే "తెలుగు సాగరం" అనే ఓడ మీద జరపాలని తీర్మానించారు. ఈ "తెలుగు సాగరం" విస్తీర్ణం 540 ఎకరాలు. దీని మీద ప్రకృతి సిద్ధంగా సృష్టించబడ్డ ఉద్యాన వనాలు, గురుకులం లో కనిపించే అద్వితీయమైన సౌందర్యాలు అన్నీ రంగరించి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అన్నింటిని కలిపి నిర్మించారు. ఒక పక్క ప్రాచీన వైభవాన్ని, ప్రకృతి సోయగాలను మరో పక్క ఆధునికత సంతరించుకున్న రోజుకో రంగు మార్చుకునే కళ్ళు చెదిరే ప్లాస్టిక్ రోడ్లు, కంప్యూటరీకరించిన ప్రదేశాలు. ఎక్కడ వున్నా ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చే మనుషులు దీని ప్రత్యేకత. చాలా ఓడల్లో అతిథులను చూసుకోవడానికి ఖర్చు తగ్గించుకోవడానికి మర మనుషులను పెడితే ఈ తెలుగు సాగరంలో మాత్రం సహాయకులు గా చక్క గా చీర కట్టుకున్న అందమైన తెలుగు అమ్మాయిలను పెట్టారు ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా. అంత ఖరీదయినదనే దీన్ని ప్రపంచంలోని గొప్ప Cruise ఓడల్లో మొదటిది గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించారు.

మళ్ళీ సమవేశ వివరాల్లోకొద్దాం. "పోయిన సారి జరిపినప్పుడు మూడు రోజులు జరిపారు. అందులో మూడో రోజు జరిగిన తప్పిదాలను జరక్కుండా చెయ్యాలంటే దానికి ఒకటే మార్గం మూడు రోజులకు బదులు ఈ సారి అయిదు రోజులు చేద్దాం. మూడో రోజు అనర్థం జరిగింది కాబట్టి ఆ రోజున అందరం మౌన వ్రతం చేద్దాం ఎలాంటి కార్యక్రమాలు లేకుండా. కేవలం మన కళాఖండాల ప్రదర్శన పెడదాం" అని అరగొండ గణేష్ అన్నాడు.


"అరె నిన్ను హీరో భార్య తుపాకీ తో కాల్చిన తరువాత నీ బుర్ర బాగా పనిచేస్తోందే" అని మనసులో అనుకొని "సెభాష్..సెభాష్.." అని చప్పట్లు కొట్టి ఓకే చేసేశారు. "ఇక ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలి అని కాకుండా ఎలాంటి అవార్డులు ఇవ్వాలి అనేదాని మీద మాట్లాడుదాం" అన్నాడు వెరీగుడ్ నిర్మాత.

ఈ సారి వృద్ధ కె.కె.రావు గారు "ముందుకొచ్చి బాబ్బాబు పోయిన సారి నా తలకు కట్టిన బొప్పి ఇంకా మాన లేదు. ఈ సారి లెజెండ్రీ అవార్డూ ఒద్దూ సెలెబ్రిటీ అవార్డూ ఒద్దు. రెండూ కలిపి "లెజెండ్రబ్రిటీ" అని అవార్డిచ్చేద్దాం. లేకపోతే ఈ కమిటీ చైర్మన్ దిల్ రాజు పేరు డల్ రాజు అయిపోతుంది" అన్నాడు.

"అరె వెబ్ సైట్లంటే పడని ఈయనికి వెబ్ సైట్లు చదివి చదివి జ్ఞానోదయమయినట్టుంది" అని దానికీ చప్పట్లు కొట్టేసి అందరూ "వాకే" అనేశారు. ఇంతకు ముందు బొంబాయి నుండి కాజోల్ ని తెస్తే అందరూ తిట్టారు అందుకని ఈ సారి హాలీవుడ్ నుండి బ్రిట్నీ స్పియర్స్ కూతురు చట్నీ స్పియర్స్ ని తెద్దాం అన్నారు. దానికి ఒక యువ నిర్మాత "ఖర్చులు నేను పెట్టుకుంటా...ఒస్తే నా ఇంట్లో వుంటుంది" అన్నాడు. "అబ్బో ఖర్చు లేకుండా పని జరిగి పోతుందని" కమిటీ చైర్మన్ సంబరపడ్డాడు.

ఇక అయిదో రోజు ముఖ్య అతిధిగా ఎవర్ని పిలుద్దాం అనేదానిమీద రెండుగా చీలిపోయి నానా రభస జరిగి నాలుగైదు వాకౌట్లు వాకిన్ లు అయ్యాక ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడుని పిలుద్ధామని నిర్ణయించారు. అంతగా కావాలంటే ప్రారంభ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని పిలుద్దాం అన్నారు కొందరు. అది కూడా జగన్ మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కరంటు కట్ చెయ్యనని లోకేష్ నాయుడు హామీ ఇస్తేనే పిలవాలని కొందరు సూచించారు. ఇక వెళ్ళి ముఖ్య మంత్రి నడిగి హామీ తెచ్చే బాధ్యత చిరంజీవి మీద పడింది. మిగిలిన పనులు కూడా వారి వారి వర్గాలు పంచేసుకుని సమావేశం ముగించేశారు.

ఓ సుముహుర్తాన చిరంజీవి వెళ్ళి ముఖ్య మంత్రి ని కలిశాడు. చిరంజీవి వస్తున్నాడని తెలిసి తన కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకుని కలిశాడు ముఖ్యమంత్రి. చిరంజీవిని చూడగానే "రండంకుల్" అని కాళ్ళ కు మొక్కి సాదరంగా అహ్వానించాడు. చిరంజీవి తనొచ్చిన పని చెప్పగానే "అదేంటంకుల్ మీరడగడమూ నేను కాదనడమూ నా. అందులోనూ మమ్మీ, ఆంటీ మంచి స్నేహితురాళ్ళు. మీరొచ్చి చెపితే, జగన్ ఒచ్చినా సరే నేనెందుకు కరంట్ కట్ చేస్తాను. అందులోనూ ముక్కలు చెక్కలైన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలపడానికి నేనూ జగన్ కలిసి పనిచేశాము. జగన్ నాకన్నా పెద్ద వాడయినా ఇద్దరం మంచి స్నేహితులం." అన్నాడు.

"చాలా మంచిది నాయనా" అని చిరంజీవి వచ్చేశాడు. లోకేష్ ఈ విషయాన్ని వెంటనే డిల్లీ లో వున్న తండ్రికి తెలియ చేశాడు.

ఈ కార్యక్రమం అందరూ అనుకున్న రోజు రానే వచ్చింది. "తెలుగు సాగరం" దేద్యీప మానంగా అలంకరించబడ్డది. అందులోని సభాస్థలికి వున్న ప్రత్యేకతలు చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు. చూడానికి బహిరంగ వేదిక గా వున్న ఎప్పుడు ఏది కావాలంటే అది సమకూర్చుకోవచ్చు. కావాలంటే మొత్తం చీకటి చేసుకుని నక్షత్రాలు, చంద్రుడు తెప్పించుకోవచ్చు లేదా మంచు కురిపించుకోవచ్చు అదీ కాదంటే చిరు జల్లులు తెప్పించుకుని ఆనందించొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశ సౌభాగ్యానికి దాన్ని కొలబద్ద గా వర్ణించవచ్చు. వంద సంవత్సరాల వేడుకలకు అందరూ విమానంలో విశాఖ ఏర్ పోర్ట్ లో దిగటం అక్కడి నుండి "ధీరూ ఏవియేషన్" (ధీరూ భాయ్ అంబాని మనవడు) వారి హెలికాప్టర్ లో "తెలుగు సాగరం" లో దింపటం సవ్యంగా జరిగి పోతోంది. తెలుగు నాడు రాష్ట్రం నలుమూలల్నుంచి అయిదు వేలకు పైగా జనాలు వచ్చారు.(ఆంధ్ర ప్రదేశ్ విడిపోయి మళ్ళీ కలిసిన తరువాత పెట్టిన పేరు) అందరికి అయిదు రోజుల వసతి "తెలుగు సాగరం" మీదనే. ఎక్కడా ఏ లోపమూ లేకుండా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా సాగిపోయాయి. తెలుగు చిత్ర సీమలో వున్న చిన్న పెద్దా అన్ని నటులకు ఉచితంగా ప్రవేశం మరియు ప్రయాణపు సదుపాయాలు కల్పించబడ్డాయి.


కార్యక్రమం లో పాల్గొన్న కొత్త యువత అందరికి "తల తంతి తర్జుమా"(Interpreter head phones) యంత్రాలు ఇవ్వబడ్డాయి. చాలా మందికి తెలుగు రాదు వచ్చినా అక్కడ వేదిక మీద మాట్లాడే భాష అర్థమవదని "సంస్కృతి" అనే కంపెనీ వాళ్ళు అందరికి ఉచితంగా అందచేశారు. ఇవి చాలా తెలివి గా పనిచేసే యంత్రాలు. ఎవరైనా మాట్లాడుతుంటే ఆ విషయాలను ఇంతకు ముందు ఎవరైనా మాట్లాడారా అని శోధించి అలా మాట్లాడుంటే వెంటనే ఆ విషయాన్ని చెవుల్లో పెట్టుకున్న వాళ్ళకు ముందుగా చెప్పేస్తుంది. మొదటి రోజు బాలకృష్ణ,చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ,త్రిష సహాయం తో జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాలు ప్రారంభించారు. చిరంజీవి మోహన్ బాబును వేదిక మీదికి సాదరంగా ఆహ్వానించాడు. మోహన్ బాబు చిరంజీవిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని వ్యాఖ్యాత గా తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు. "ఎందరో మహాను భావులు అందరికి వందనాలు" అని అక్కినేని నాగేశ్వర రావు ని కింద నుంచి వేదిక మీదకు తీసుకొచ్చాడు.

ఈ సారి కూడా అగ్ర తాంబూలం వంద సంవత్సరాల కురు వృద్ధుడు అక్కినేని నాగేశ్వర రావు కే దక్కింది. అతని సమకాలీకులందరూ స్వర్గస్తులైపోయారు. కుర్చీలో కూర్చున్న అక్కినేనికి నాగ చైతన్య మైక్ అందివ్వ బోతే "వాట్ నాన్సెన్స్...నాకు సహాయమెందుకు నేనే మైకు దగ్గరకొస్తాను" అని లేచి మైకు చేతిలో తీసుకోగానే సభ మొత్తం గౌరవ సూచకంగా లేచి నుంచింది. అందర్ని కూర్చోమని చెప్పి తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు.

"వెన్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ పాండీ బజార్ వితౌట్ చెప్పల్స్...." అని మొదలు పెట్ట గానే తర్జుమా తల తంతి పరికరాలు మిగిలిన మాటలు గబా వినిపించెయ్యసాగాయి. గోడల మీదున్న స్క్రీన్స్ కూడా మిగిలిన ప్రసంగాన్ని మొత్తం చూపించేశాయి. అది చూసి అక్కినేని కోపంగా "అదేమిటి ఈ సంబరాలను నన్ను అవ్మాన పర్చడానికి పిలిచారా" అని కోప్పడ గానే ఆ దిల్ రాజు గబ గబా వెళ్ళి "స్మార్ట్ సిస్టం" ను డిసేబుల్ చేసి వచ్చాడు. " నేను అప్పుడే చెప్పాను...మన సంస్కృతీ సంప్రదాయాలను మీరు గౌరవించాలని. మీరు చక్కగా తెలుగు నేర్చుకుని వుండుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు..ఈ తెలుగు సినిమాలో క్రమ శిక్షణ నాతోటి..నా బ్రదర్ ఎన్టీఆర్ తోటే వచ్చింది...." అని మొదలి పెట్టి తను చెప్పాలిసిందంతా చెప్పి కూర్చున్నాడు.

ఇక తరువాత వంతు దాసరి నారాయణ రావుది. తను మైకు తీసుకుని మొదలు పెట్టాడు. "ఈ తెలుగు చిత్ర పరిశ్రమను ఎవరు కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు..ఎవరు పెంచారు..ఎందుకు పెంచారు...ఎవరు పొషించారు..ఎందుకు పొషించారు.. కనిపెట్టి పొషించారా..పొషించి కనిపెట్టారా .. పొషించి కని పెట్టి పెంచారా? "


అది విన్న కొన్ని పాత తంతి తర్జుమా యంత్రాలు "డమాల్" మని పేలి పోయి మాడిపోయాయి. వాటికి కొత్త గా వేసిన safety ear bag వల్ల ఎవరికీ ఏమీ అపాయం కలగ లేదు. కొన్ని పేలి పోయినందున కంప్యుటర్లన్నీ ఆటో పైలట్ లో పని చెయ్యడం మొదలు పెట్టాయి. దాని ఫలితంగా తంతి తర్జుమా పరికరాల "స్మార్ట్ సిస్టం" ఎనేబుల్ అయ్యిపోయి మిగిలిన ప్రసంగమంతా వినిపించడం మొదలు పెట్టింది. ఇలా కాదని తెలివైన దాసరి తన చెప్పిందే తిప్పి తిప్పి చెప్పే మాటల్ని మానేసి అసలు విషయం లోకి రాగానే అన్నీ మామూలుగా పనిచెయ్యడం మొదలుపెట్టాయి.

" ఈ రోజున ఇలా మనమందరం మళ్ళీ కలవడానికి కారణం మన పాత తరం కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణే చేసిన కృషే. మన రాష్ట్రం రాయలసీమ, ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, ఆంధ్రా, కళింగాంధ్రా, గ్రేటర్ హైదరాబాద్ లాగా విడీపోతే. మన తెలుగు పరిశ్రమ కూడా అన్నే ముక్కలయి విడిపోయింది. మన నాయకుల ప్రయత్నాల వల్ల మనం మళ్ళీ ఒక్కటయినా పరిశ్రమ ఒక్కటవ్వ లేదు. అందుకోసం నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, మరియు మన జూనియర్ ఎన్టీఆర్ చేసిన కృషి మరువ లేనిది అంతే కాకుండా మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ కాల నాళికను లండన్ లో భద్ర పరచడానికి వారు చేసిన కృషి శ్లాఘనీయం....వాళ్ళందర్నీ మనం ఈ రోజు సత్కరించుకోవాలి." అని ముగించేశాడు.


తరువాత అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎక్కడా ఎవరికీ తక్కువ కాకూడదనే ఉద్ధేశ్యంతో కొన్ని వేల టీ.వి. తెరలు పెట్టి ఒక్కో దాన్లో ఒక్కో సినిమా వేసేశారు డబ్బింగ్ చేసిన ఇంగ్లీషు సినిమాలతో సహా. నా క్లిప్పింగ్ వెయ్య లేదు అనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు.

రెండో రోజు "ముగ్గురు మిత్రులు" "నీ భుజం నామీద నా భుజం నీ మీద" అనే ట్యాగ్ లైంతో వున్న నాటకాన్ని రాం చరణ్ తేజ, విష్ణు వర్ధన్, మనోజ్ కుమార్ లు వేస్తుంటే అక్కడ ఉన్న జనం అంతా కరతాళ ధ్వనులు చేశారు.

మూడో రోజు మాత్రం అందరూ మౌనంగా ప్రదర్శనలో పెట్టిన అన్నీ చూస్తున్నారు. అందరూ ఒక ప్రదర్శన గదిలోకి వెళ్ళి వచ్చి ఆవేశంతో మాట్లాడ బోయారు కొందరు. గొంతు లోంచి మాటలు వచ్చే కదలికలను కూడా కని పెట్టి బయటకు విసిరేసే మర మనుషులను అక్కడ పెట్టడం వల్ల ఎవరూ నోరు మెదప లేదు. అంత ఆవేశానికి లోను చేసే చిత్రాలు "మోహన్ బాబు కుడి చెయ్యెత్తి చూపుడు వేలుతో ఏదో చెప్తున్న దృశ్యం". "చిరంజీవి ఎడమ చెయ్యెత్తి చూపుడు వేలుతో ఏదో చెప్తున్న దృశ్యం". ఆ రెండు ఆ గది లోనే వున్నయ్ మరి. ఆ రోజు సాయంత్రానికి గానీ కమిటీ వాళ్ళు చేసిన పొరపాటు గుర్తుకు రాలేదు. అందర్నీ సముచితంగా చూపించాలనే తాపత్రయం తో పోయిన సారి వజ్రోత్సవాలప్పుడు తీసిన ఫోటోలను కూడా పెట్టేశారు. అదే తమ పాలిట "పిడుగు" అవుతుందేమోనని గాబరా పడ్డాడు దిల్ రాజు.

నాలుగో రోజు "అబ్బీ లబ్బీ ఓ యబ్బీ పాటకు" జూనియర్ ఎన్టీఆర్ ఇరగ దీస్తూ డ్యాన్స్ చేసాడు.
"జామ్మంది జుమ్మంది...తకధిమితోం" అనే పాట కు అల్లు అర్జున్.
"ఏ...కిరి..కిరి..పొకిరీ..." అనే పాటకు మహెష్ బాబు,
"నా బాబు చిరురో..నా బామ్మర్ది అర్జున్రో..నా బాబాయ్ పవన్రో" అనే పాటకు రాం చరణ్ తేజ,
"నైజాం నారీ...నా ఖండ చక్కర ప్యారీ" అనే పాటకు ప్రభాస్ లు డ్యాన్స్ చేసి ఆడిటోరియం దద్ధరిల్లేట్టు చేశారు.


అయిదో రోజు సన్మాన కార్యక్రమాలు ప్రారంభ మయ్యే రోజు. దిల్ రాజు దిల్ "డమాల్..డమాల్" అని కొట్టు కోవడం ప్రారభించింది. సన్మానానికి ముందు పోయిన వజ్రోత్సవ సభలో సీలు చేసిన కాల నాళిక తెరవడం కార్యక్రమంలో ఒక భాగం. దాన్ని తెరవడానికి క్యారక్టర్ ఆర్టిస్టు గా స్థిరపడిన హీరో శివాజిని వేదిక మీదకు పిలిచారు. సభ అంతా ఉత్కంఠ గాఎదురు చూస్తూ ఉండగా శివాజి వినమ్రంగా కాల నాళికకు నమస్కరించి దాని సీలుని పగలగొట్టాడు. అందులోనుండి ఒక్కోక్కటీ బయటకు తీసి చదివే కార్యక్రమం శేఖర్ కమ్ముల కు ఇవ్వబడింది. అసలే ఇలాంటి వాటికి దూరంగ వుండే శేఖర్ బెదురుతూ పెట్టె తెరిచాడు
.
అంతే ........

అందులోనుంచి దట్టమైన పొగ బయటికి వచ్చింది.

ఆవేశం ఆపుకోలేక అల్లు అర్జున్ ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి
"మామయ్య లెజెండ్ అవార్డ్ నేను బయటికి తీసి ఇస్తా" అన్నడు".
"ఊహూ నాన్నకు నేనిస్తా " అన్నాడు రాం చరణ్.
"బాక్సు బద్దలయిపోతుంది ఎవరైన తీతీస్తే..నేనే తీస్తా నేనే ఇస్తా తాతకు" అన్నాడు రామలింగ
తేజ ఉరఫ్ రాం చరణ్ తేజ కొడుకు.
"చక్కర్ మే రక్కా... తల్లీ చెల్లి ఏ గల్లీ లో లేని సిల్లీ నాకొడుకుని నేను..నేనే తీస్తా నేనే ఇస్తా నా మిత్రుడైన చిరన్...జీవికి" అన్నాడు రాగం తీస్తూ.

ఆ డైలాగ్ దెబ్బకి పొగ మొత్తం ఆగి పోయింది.
మోహన్ బాబు పెట్టె అంతా గబ గబా వెతికాడు అవార్డులు కానీ ఇంకా ఉత్తరాలు కానీ ఏమైనా దొరుకు తాయేమో నని. పెట్టె మొత్తం ఖాళీగా కనిపించింది. అది చూసి అందరూ తెల్ల బోయారు.

అంతలో ఆకాశం లో నుంచి తెల్లని మెరుపులు ఆ వెనకనె చిర్నవ్వులు చిందిస్తూ కళా తపస్వి కె.విశ్వనాధ్ గారు కనిపించారు. ఇంతలో కల కలం మొదలయింది. అది చూసి విశ్వనాధ్ చెప్ప సాగాడు.

"వజ్రోత్సవాలప్పుడు జరిగిన సంఘటన చూసి నా మనసు కలుక్కుమంది. ఇన్నాళ్ళు ఎంతో సఖ్యంగా వుంటూ ఒకర్నొకరు ఆదుకుని ఒక కుటుంబంగా వుంటూ అప్పుడప్పుడు జరిగిన చిన్న చిన్న సంఘటనల్ని మరిచి హాయిగా వున్న మన మధ్య ఈ అవార్డులు చిచ్చు పెట్టాయి. దానికి తోడు ఈ కాల నాళిక లో కొన్ని అవార్డులు వచ్చి పడ్డాయి. అవార్డులే ఇలా వుంటే ఇందులో రాసిన ఉత్తరాలు ఎలా వుంటాయో చూద్దామని వజ్రోత్సవం అయిపోయిన తరువాత ఎవరికీ తెలియకుండా ఆ పెట్టె తెరిచి చూసాను. ఆ జ్ఞాపికల కన్నా అందులో వేసిన ఉత్తరాలు మరింత క్షోభ కు గురిచేశాయి. ఒక్కొక్కరు ఒక్కోతీరుగా తమలో వున్న కసిని వెళ్ళగక్కారు. ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తే వంద సంవత్సరాల వేడుక మరింత వేడిని రగిలిస్తుందని అందులో వున్న వన్నీ తీసేశాను. మూడో రోజు టీ.వీ. ల మీద కొన్ని చిత్రాలు కనిపించకుండా నేనే దాచేశాను. అవుంటే మళ్ళీ రసాబాస య్యేది. మీరు ఇప్పుడున్నట్లే కలిసి కట్టుగా వుండండి లేకుంటే నోర్మూసుకోండి.
అనవసరంగా స్టేట్మెంట్లిచ్చి బజార్న పడకండి......ఇక నే వెళ్ళొస్తా" అని అంతర్ధానమై పొయాడు.