చెనిక్కాయిలు ఉడకేసుకుందాం రా రా…
.
గమనిక: ఇందులో గ్రామీణ వాతావరణంలో స్నేహితుల మధ్య జరిగే సహజ సంభాషణలు రాయ బడ్డాయి. కొన్ని చోట్ల బూతులాంటి వెగటు అనిపించొచ్చు. ఇబ్బందనిపిస్తే ఇంకో టపా ఆహ్వానం పలుకుతోంది.
ఇరవై సంవత్సరాలా పొడవు కత్తెరేస్తే...
......
......
......
భారద్దేశంలో ఓ చిన్న ఊరు…
ఓ అందమైన సాయంత్రం………….
అది గోదారి గట్టు కాదు.కొబ్బరి చెట్లసలే లేవు ఎక్కడ చూసినా పచ్చదనమే అని చెప్పే సీను లేదు.అది వంశీ దృశ్య కావ్యమూ కాదు.
కూలి పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరే వారు కొందరు. ఆవులను మేపుకొని ఇంటికి ఆతృతగా వెళ్ళే వాళ్ళు కొందరు. ఎద్దు బళ్ళ మీద ఇంటికి చేరుకునే వారు ఇంకొందరు. అవన్నీ చూస్తూ, ఆస్వాదిస్తూ రోడ్డు మీద ఓ స్నేహితుల గుంపు. ఏ కల్మషాలు తెలియని స్నేహం. ఇజాలకు బీజాలు పడలేదు. ఈగోల లోగోలు లేవు. తుళ్ళిపడే నవ్వులే తప్ప తవ్వి తీసుకునే గోతులు లేవు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కొట్టుకున్నా ఆనందమే.. తిట్టుకున్నా ఆనందమే. ఒక్కడి ఆనందం ఇంకొక ఆరుగురికి ఆనందం. ఊళ్ళో అప్పటికీ ఇప్పటికీ అదే గుంపు అందరి ముందు. ఒకడు ఊరెళ్తే ఆరుగురు తోడు బస్టాండు వరకు. ఒకడు ఊరినుండి వస్తుంటే ఆర్గురు ఎదురుచూపులు బస్టాండులో.
**
“రేయ్ కర్రోడా! ఈ రోజు రాత్తిరికి చెనిక్కయిలు ఉడకేసుకుందా మేమిరా” శంకిరి గ్యాడు.
“అవున్రేయ్ ఈ తూరి చానా దినాలు అయిపోయిందిరా. కొండామారి కిందికి బోదామా లేకుంటే ఎలకుంట్ల కాడికి పోదామా” కర్రోడి ఆన్సరు.
“కొండామారి కాడికి బోతే ఈ శంకిరి గ్యాని చేన్లో చెనిగి చెట్లు పీకల్ల. వీడు పిసినారి నాకొడుకు. ఒద్దులేరేయ్ ఎలకుంట్ల కాడికే పోదాము” మల్లి గ్యాడు గాలి తీసేసినాడు.
“నీ యబ్బ మల్లి గా నీకు చేనుంటే తెలిసేదిరా దాని బాదేందో. మీ కొంపకొస్తే ఎప్పుడూ కారంబెట్న బొరుగులే ఇస్తావు కదరా ఎబ్బుడన్నా క్ర్యాక్ జాక్ బిస్కట్లు ఇచ్చినావా నోరు ముయ్యరా రేయ్ పుట్ట గోసిగా” శంకిరి గ్యాడు రివర్సిచ్చినాడు.
“నోరు ముయ్యిరా నంగి నాకొడకా మాకు చేనుంటే దినానిగొగసారి గొడ్డును చేన్లోకి తోసినట్టు నిన్ను చేన్లోకి తోసేసిండేవాణ్ణి” మల్లి గ్యాడు బాణాలు ఎయ్యడం మొదలు పెట్టినాడు.
“థూ.. మీరేంట్నాకొడుకుల్రా ఎబ్బుడు జూసినా కొట్టుకుంటా వుంటారు. ఇదే పనా మీకు. రాత్తిరికి యాడికి బోదామో మల్ల డిసైడ్ జేద్దాం గ్యానీ. ముందు ఎవురెవురొస్తారో కనుక్కోండి” నా హూంకరింపు.
“ఈళ్ళెబ్బుడూ ఇంతేలేరా ఈల్లిట్లా కొట్టు కుంటా వుంటేనే మంచిది లేగబోతే ఉడకేసిన చెనిక్కాయలన్నీ బొక్కలాడేస్తార్రా సామి” కర్రోడని పిలవబడే వీరి గ్యాడు.
అబ్బుడే ఏదో ఎద్దుల బండి బోతా వుంటే ఎనకలా బండి గూటం పట్టుకోని దుంకేసినాడు చెంగడు.
“ఇంగుంటాణ్ణోవ్. మీ ఎద్దులు బొలే ఉషారుగా వుండాయే” అని ఎద్దుల బండిలో లిఫ్టిచ్చిన అన్నకి చెప్పిన్యాడు.
“ఎందిరా సామి అందురూ అబ్బుడే ఒచ్చేసినారు. ఏందన్నా పెద్ద ప్లానేమన్నా ఏసినారా?”
చెంగడు చానా చతురుడు. వానికి ఒగ రూపాయిచ్చి వళ్ళూ, మిరపకాయి బజ్జీలు కొనుక్కోని రమ్మంటే అంగడి కాడికి బొయ్యి అయిదు రూపాయిలు అప్పుజేసి బోండాలు, వళ్ళు, బజ్జీలు, మురుకులు తీసుకోని వస్తాడు ఆ ఒగ రూపాయి జేబీ లోనిండి తియ్యకుండా.
“రా రా సామి నీ కోసమే ఎదురు జూస్తా వుండాము. రాత్తిర్కి చెనిక్కాయిలు ఉడకేసుకునేదానికి బోదామా?”
“పోదాములే గనీ. ఎన్ని గంట్లకు పోదాము. అన్నం తినేసినంకా బోదాము” చెంగడు.
“అన్నం దినేసినంక నే రా సామి లేకపోతే మా యమ్మ జంపేస్తుంది. అవున్రేయ్ ఈ శివిగ్యాడేడా ఇంగా రాలా వాళ్ళ చెరుకు తోట కాణ్ణే వుండిపూడిసినాడా ఏంది” నేను.
“ఆడ జూడు శివిగ్యానికి నూరేండ్లు. ఏవున్‌దో సైకిల్ తొక్కుకుంటా వస్తా వుండాడు.”
శివి గ్యాడు మా ముందుకొచ్చి సైకిల్ ఆపేసి “రేయ్ బిత్తిరి గ్యా ఇంగ దిగరా కిందికి” అన్న్యాడు.
ఎనకాల సైకుల్ క్యారీర్ మిందనుండి కిందికి దిగినాడు ఎనిమిదేళ్ళ బిత్తిరి గ్యాడు. బిత్తిరి గ్యాడు దిగంగానే వానికి సైకిల్ హ్యాండిల్ ఇచ్చేసి “ రేయ్ జాగ్రత్త రా సామి అసలే కత్తిరి కాలేసుకోని సైకిలి తొక్కతా వుండావు యాడన్నా గుద్దేసేవు. ఈ పక్కంతా రోడ్డేస్తా వుండారు. ఆ పక్కనుండే బండ్ల మింద పడ్ణ్యావంటే నీ తలకాయి పిచ్చిలు పిచ్చిలు అయిపోతుంది.” అని జాగ్రత్త చప్పంగానే వాడు ఒగ కాలు ఈ పక్క పెడల్ మింద ఇంగో కాలు బారు కింద నిండి ఆ పక్క పెడల్ మింద ఏసి “కట్…కట కట కట కట్..” అని సైకిలు సౌండు జేస్తా ఉంటే పూడిసిన్యాడు.
“రేయ్ శివిగా ఎబ్బుడూ పిల్లోల్లని బొలే ఏమార్పిచ్చేస్తావు కదరా.” శివి గ్యాని భుజం మింద చెయ్యేసి మల్లి గ్యాడు.
“ఏందిరాయప్పో నేనే ముందు గా వచ్చినాననుకుంటే నాకన్న ముందుగానే అందురూ వచ్చేసినారు. ఇంగా ఒగడు మిస్సింగే. ఆ పీలి గ్యాడు ఇంగా రాలేదా?”
“వాడబ్బుడే యాడొస్తాడు. వాళ్ళీధిలో నీళ్ళిడిసిపిట్టే టైము గదా ఆ కిట్టూ కి లైనేస్తా వుంటాడు” మల్లి గ్యాడు.
“శివప్పా! ఈ రోజు రాత్తిరికి చెనిక్కాయిలు ఉడకేసుకునే దానికి పోదాం రేయ్.” శంకిరి గ్యాడు చెప్పినాడు.
“మెరెట్ల జెబ్తే అట్లనే ప్పా. ఈ పొద్దు రేత్తిరికి ఎన్నెల గూడా బాగుంది.అద్సరే ఉడకేసుకునే దానికి బోకెవురు తెస్తారు?”
“అది గూడా కష్టమేనేమిరా. నేను అన్నం తినేసి మీ ఇంటికొచ్చి మీ యమ్మ ని మాటల్లో బెడతా నువ్వు చిన్నగా ఒగ పెద్ద సంగటి జేసే గిన్నె ఎనకాల్నుండే మొండి గోడ మింద పెట్టేయ్. తరువాత నేను జూసుకుంటా దాని సంగతి.” నేను.
“అట్లాగేప్పా” శివి గ్యాడు.
“ఉప్పెవురు తెస్తారు. రేయ్ శంకిరిగ్యా నువ్వు తెస్తావా?” చెంగడు.
“తూరి తూరికి నేనే నేనే తేవల్నా? ఈ తూరి ఈ మల్లి గ్యాణ్ణి తెమ్మను.రేయ్ మల్లి గా నువ్వు తీసుకోని రారా” శంకిరి గ్యాడు.
“పిసినారి నాకొడకా. అంతుప్పు తెచ్చేదానికేమి రోగం నీకు? మీ యబ్బ లిబ్బంతా పోతుంద్యా?” మల్లి గ్యాడు.
“థూ ఆపండి ఎప్పుడూ కాట్ల కుక్కల మాదిరి జెటీ పటీ కొట్టుకునే పనే మీకు. ఆడ జూడండ్రేయ్. ఎగరేసుకుంటా మొగానికి రెండించీల ఫేర్ అండ్ లవ్లీ రాసుకోని వస్తా వుండాడు ఆ పీలి గ్యాన్నడిగితే సరి పోతుంది” నేను.
“రేయ్ పీలిగా, అబ్బుడే వచ్చేసినా వేమిరా నీళ్ళ బిందిలు మోసేది అయిపోయిందా” కర్రోడు వుడికించడం మొదలు పెట్న్యాడు.
“నీళ్ళ బిందిలు మోసే ఖర్మ నాకేమి రా.అంత బగిసీనం పన్లు నువ్వురా జేసేది” ఉడుక్కుంటా పీలి గ్యాడు.
“నువ్వు నీళ్ళ బిందిలేమీ మొయ్యద్దు గ్యానీ రాత్తిరికి చెనికాయలు ఉడకేసుకునేదానికి ఉప్పు గావల్ల. అది తీసుకోనిరా జాలు” మల్లి గ్యాడు.
“ఉప్పే గదా. మా యమ్మకి ఎట్లో ఒగట్ల టోకరా ఇచ్చేసి నా పాంటు జేబీలో పోసుకోని వచ్చేస్తా” పీలి గ్యాడు.
“అగ్గిపెట్టెవురు తెస్తార్రా. రేయ్ అయివోరు కొడకా నువ్వు తెస్తావా” చెంగడు మొదలు పెట్న్యాడు.
“నా వల్ల కాదురా సామీ. మా ఇంట్లో గనీ తెలిసిందంటే నేను సిగరెట్లు కాలస్తానని అనుకుంటారు. ఇంగేమీ ల్యా” నేను
“నేను ఎవురో ఒగ సేద్దిగ్యాన్నడిగి తేస్తాలేప్పా” శివి గ్యాడు ఆదు కుణ్యాడు.
“సరేరా అందురూ అన్నం తినేసి బస్ట్యాండు దగ్గర వెయిట్ జెద్దాం” నేను.
***
రాత్తిరి తొమ్మిదిముక్కాలుకి బస్ట్యాండు లో బాషా అంగిడి కాడ బీడా లేసుకుని బయల్దేరతా వుంటే అయిస్కూలు లెక్కలయివోరు కనిపిచ్చి న్యాడు. “ఏందిరా మొత్తం బ్యాచి బ్యాచంతా బయలు దేరింది. యాడికి బోతా వుండారు” అన్యాడు.
“యాడికీ లేదు సార్. ఈణ్ణే అరిటికాయిలు తినే దానికి ఒచ్చినాము” నేను జెప్పిన్యా.
బీడా తీసుకోని లెక్కలయిఓరు పూడిసినాడు.
“రేయ్ నీక్యాడి నుండి వస్తాయిరా అయిడియాలు. వుండూ… రేపు స్కూల్లో మీ నాయిన్ని ఈ అయివోరు అడుగుతాడు అబ్బుడు నీ బండాలం బయట పడుతుంది” మల్లి గ్యాడు.
“రేబుటికి జూసుకుందాం లే రా” నేను.
అబ్బుటికే అందురూ ఒచ్చేసినారు. ఇంగందురూ శంకు మార్కు లుంగీలతో, పీలి గ్యాడు మాత్తరం ప్యాంటుతో ఊర్నిండి రోండు కిలోమీటర్లుండే ఎల్లకుంట్లకు ఒగని భుజాల మింద ఇంగోడు చెయ్యేసుకొని నడుచుకుంటా చేరుకున్నాం. అబ్బుడు టైము రాతిరి పదింకాలు.
ఇంగ చేన్లో చెట్లు పీకే పని మొదలయింది.
“రేయ్ శివిగా ఎవురి చేన్లో చెట్లకు కాయిలు బాగా కాసినాయిరా” చెంగడు.
“మా చేన్లో ఈ తూరి కొంచుం తక్కువే. మా చేను పక్కన కిష్ణప్పోల్ల చేన్లో అయితే చెట్టుకి ఇరవే ముప్పై గాయిలు గాసినాయి”
“వాల్లవి చిన్న గుత్తి కాయిలు గదరా” శంకిరి గ్యాడు.
“వాళ్ళీతూరి చిన్నగుత్తి కాయిలు ఒగ్గొడ్డం మాత్తరమే ఏసినారు. మిగతా అంతా పెద్ద గుత్తి కాయిలే”
“ఏ గుత్తయితే ఏం గ్యానీ. ముందు చెట్లు పీకండి. అందురూ పీకిన వన్నీ ఆ రోడ్డుకు ఒగ పక్కగా వెయ్యండి” కర్రోడు జెప్పిన్యాడు.
“రేయ్ నాకొడకల్లారా నాకు పాములంటే బయిం కదరా నన్నొదిలేసి యాడాడికో పూడస్తా వుండారు. నేను ఈణ్ణే రోడ్డు వారగా వుంటా. మీరందురూ పీకేసిన చెట్లన్నీ నా దగ్గిరిగ్య తెచ్చి ఎయ్యండి” మల్లి గ్యాడు.
“నువ్వాడొద్దు గనీ ఈడ బాయి దగ్గిరికొచ్చి నిలబడుండు” పీలి గ్యాడు చెప్పిన్యాడు.
“నేన్యాడన్నా బాయిలో బడిపోతే ఎట్ల రా సామీ. నాకు ఈత గూడా రాదు” మల్లి గ్యాడు.
“అందుకేరా జెప్పింది.మా తో పాటూ వచ్చి ఈత నేర్చుకోని జావచ్చు గదా” నేను.
“మీతో వస్తే ఏమి నేరిపిస్తారు పోయింతూరి ఎండా కోలంలో ఏమి నేర్పిచ్చిన్యారు. బెండ్లు కట్ట తెస్తానని డబ్బులు తీసుకోని పోయిన ఆది గ్యాడు పత్తా ల్యే. మీతో వచ్చి వచ్చి బాయి కాడ డాయర్లు బోగొట్టుకునే ద్దప్పిచ్చి ఇంగేం జరగలా” నిష్టూరా ల్యాణ్యాడు మల్లి గ్యాడు.
వీని ముందర ఎప్పుడు ఈత సంగతి జెప్పినా ఆ పోయిన డ్రాయరు సంగతి గుర్తు జేస్తా వుంటాడు.
“మల్లి గ్యా, నివ్వింగా ఆ ఎర్ర డ్రాయరు సంగతి మరిచిపోలేదేమ్ర్యా” చెంగడు.
“వాడు వాని మనవళ్ళకు గూడా జెబ్తాడేమో మనమే వాని డ్రాయరు పోగెట్టేసిన్యామని.గలీజు నాయాలా” పీలి గ్యాడు.
“నోరు ముయ్యిరా పీలి గా! పదో తరగతి పరీచ్చల్లో నీళ్ళ కుండ కాడ కూర్సున్యావు గాబట్టి పాసయి పొయినావురా. ఈ అయివోరు కొడుగ్యాడు బిట్ పేపర్ ఆన్సర్లన్నీ నీళ్ళు తాగేదానికొచ్చి నీకిచ్చేసిన్యాడు లేక్పొయ్యుంటే ఫెయిల్ అయి పూడిసిండే వానివి. అబ్బుడు టిర్రె….టిర్రు అని ఎద్దు తోకల్ని పట్టుకోని తోలుకుంటా మడక దున్నుకునే వాడివి రా నాకొడకా” మల్లి గ్యాడు వాని చరిత్ర తిరగదోడిన్యాడు.
“ఓ... బొ జదివిన్యాడు ఈ నాకొడుకు. నీగ్గూడా ఆ పది గ్రేసు మారుకులు కలబ్బట్టి లెక్కల్లో 33 వచ్చినా పాసయిపొయినావురా. లేక పొయ్యింటే మీ నాయిన నీ మెళ్ళో తక్కిడి, భుజమ్మీద ఒగ సంచి పట్ట ఏసి పల్లిలికి పంపిచ్చిండే వాడు చింత పిచ్చిలు కొనుక్కోని రమ్మని. అబ్బుడు నువ్వు ' చింతపిచ్చిలు కొంటాం .. చింత పిచ్చిలు కొంటాం ...' అని ఈ పల్లిలన్నీ తిరుక్కుంటా వుణ్ణే వానివి రా బిత్తిరి నాకొడకా” పీలి గ్యాడు.
“నాకు పది మార్కులు కలిపినా నావి సెకండ్ క్లాసు మార్కులు రా నేను గనక వీని పక్కన (నన్ను చూపిచ్చి) పడింటే ఫస్టు క్లాసు మార్కులు వచ్చిండేటివి రా కంపార్టుమెంటల్ నాకొడకా”
“రేయ్ మల్లి గ్యా ఆ పది మార్కులు కలపకుండా వుంటే మనమ్ముగ్గురూ పూడిసుండేవాళ్ళం రేయ్. అబ్బుడు ఈ నాకొడుకులు కాలేజీకి పోతావుంటే మనము బస్సెక్కిస్తావుండేవాళ్ళం” కర్రోడు గోడు చెప్పిన్యాడు.
ఇట్లా తిట్టుకుంటా వుంటే మద్దిలో శివి గ్యాడు బ్రేకేసిన్యాడు.
“అన్ని చెట్లు ఒగే చోట పీకొద్దురా. ఆడ కొంచెము ఆడ కొంచెం పీకండి లేగపోతే వాళ్ళు గుర్తు పడతారు” శివి గ్యాడు వార్నింగులు ఇచ్చేశిన్యాడు.
“ఒరేయ్ శంకిరిగ్యా. ఇంగ నువ్వు ఈడ పీకింది జాలు గానీ పొయ్యి ఆ ఈరన్నోళ్ళ చేన్లో కొన్ని చెట్లు పీకు బో. వాళ్ళ చేన్లో చెట్లకు భలే కాయిలు గాసినాయంట” కర్రోడు చెప్పి న్యాడు.
“నువ్వాడికి పోరా. నేను ఈ కొంచెం పీకేసి వస్తా” శంకిరి గ్యాడు.
“నేను రెడ్డెమ్మోళ్ళ చేన్లో కొన్ని చెట్లు పీక్కోని వస్తా” వీరి గ్యాడు.
“రేయ్ ఆడికి మళ్ళీ బోవద్దురా సామీ నేనిబ్బుడే ఇన్ని చెట్లు పీక్కోని వచ్చినా. కావల్లంటే ఇంకొచెం ఎగదాలకు బొయ్యి కుంటెంగటప్ప వాళ్ళ చేన్లో పీక్కోని రా” నేను.
“రేయ్ పీలిగ్యా ! మల్లి గ్యా! ఈ చెట్లన్నీ మోసుకోని ఆ కంపలేసిన కాడికి దీసుకోని బో. ఆడ అన్నీ వుడ్డేసి చెనిక్కాయిలు ఇడిపిచ్చు. నేను ఈ చెన్లో కొన్ని పీకేసి ఆడికొచ్చి మంటేస్తా” చెంగడు చెప్పిన్యాడు.
“నీ యబ్బా మీరందురూ తలా కొన్ని చెట్లు పీకేసి నన్ను మాత్తరము అన్ని చెట్లూ ఇడిపిచ్చమంటారేంది వాయ్. నేను గావల్లంటే పొయ్యెలిగిస్తా. మీరందురూ ఒచ్చి కాయిలు ఇడిపిచ్చండి.” కోపంగా చెప్పిన్యాడు మల్లి గ్యాడు.
“నీకు మజ్జరం ఎక్కువ సోంబేరి నాకొడకా. కొంచెం ఒళ్ళు ఒంచు వాయ్. బొక్కలాడే దానికి మాత్రం ముందరుంటావ్. అట్లే బొయ్యి ఆడేడన్నా మూడు పెద్ద రాళ్ళుంటే తీసుకోని రా పొయ్యి జేసేదానికి” నేను.
“నేను పోను రా సామి. ఆ బండ్ల కింద తేల్లు గానీ మండ్ర గబ్బలు గానీ వుంటాయి.” మల్లి గ్యాడు.
“వుంటే వాటి చేత కరిపిచ్చుకో ఆడింగి నాకొడకా.” శంకిరి గ్యాడు.
“రేయ్ నువ్వు చెన్లో నుండి ఇవతలకు రారా నీ సంగతి జెబ్తా. యారక తినే నాకొడకా” మల్లి గ్యాడు.
“రేయ్ ఇంగ పీకింది జాలు గ్యానీ కాయిలు ఇడిపిద్దాం రండి” శంకిరి చెప్పిన్యాడు.
“రేయ్ మీరందురూ చెనిక్కాయిలు ఇడిపిస్తా వుండండి నేను బొయ్యి అనపకాయిలు, అలసందలు ఉండాయోమో జూసొస్తా” చెంగడు ఇంకో చెన్లో బణ్యాడు.
ఇంగ అందరం రోడ్డుకు ఒగ వారగా కూచుని కాయిలు ఇడిపిచ్చే పన్లో బణ్ణాము. శివి గ్యాడు యాడ్నుండో ఎండిపొయిన బోద కొంచిము తెస్తే మల్లి గ్యాడు దాన్ని అగ్గి పెట్టితో ముట్టిచ్చిన్యాడు. శివి గ్యాడు దాన్ని పైకెత్తి పొయ్యిలో ఏసినాడు. శంకిరి గ్యాడు బాయిలోకి దిగి బోకి లో నీళ్ళు తెచ్చిన్యాడు. పీలి గ్యాడు దాన్లో అంతుప్పూ, తులసి కొమ్మలు యేసి పొయ్యి మింద పెట్నాడు. ఇడిపిచ్చిన చెనిక్కాయిలు గిన్ని లో యేసేటప్పుడు చెంగడు చెన్లో సాల్లో యేసిన అనపకాయిలు, అలసంద కాయిలు తీస్కోనొచ్చి పాత్తరలో యేసినాడు.
పోయ్యి మింద అవి ఉడికేంత సేపూ పొయ్యిలోకి కంపలు తోసేపని శివి గ్యానింది. అందురూ అట్లా మాట్లాడుకుంటా వుంటే ఒగ అగ్గి రవ్వొచ్చి మల్లి గ్యాని లుంగీ మింద పడింది. అది మల్లి గ్యాడు జూసుకోలా.
లుంగీ ఎర్రగా కాలతావుంటే పీలి గ్యాడు జూసి “రేయ్ మల్లి గ్యా నీ లుంగీ మింద కాలిపుయిన కట్టిపుల్ల పడిందిరేయ్” అని అరిచిన్యాడు. ఇంగ జూసుకో మల్లి గ్యానికి కోప్మొచ్చింది.
“రేయ్ అడ్డ పట్టీ నాకొడకా! పుల్లలు పోయ్యిలోకి తోస్తావుండావా నా లుంగీ లోకి తోస్తావుండావా” అని ఎగిరి పైకి లేసి లుంగీ ఇదిలిచ్చిన్యాడు.
శివి గ్యాడేమో కూలుగా “అది నీ మింద పడిందేమిరా. అది ఏదో ఎర్రగ ఎలగతా వుంటే మినకర బూసి అనుకుంట్ర్యా. చాణా కాలిపూడిసిందా” అని అడిగిన్యాడు.
“గుడ్డి నా కొడకా మినకర బూసికి అగ్గికి తేడా తెలీదా? అందుకే నాకొడకా నువ్వు టెంత్ క్లాసు రెండు సార్లు ఫెయిలయ్యింది”
ఇట్లా మాట్లాడుకుంటా వుంటే శంకిరి గ్యాడేమో ఉడికిందా లేదా అని చెనిక్కాయిలు పాత్తర లో నుండి తీసి ఊదుకుంటా తినేస్తా వుండాడు.
“రేయ్ తిండిపోతు నాయాలా యేరక తినేదానికి మాత్తరం ముందొస్తావు. కంపలయిపోయినాయి పోయ్యి కొన్ని ఆ గప్చీప్ కంపలు తీసుకోని రాపో” పీలి గ్యాడు అరిచాడు.
“ఈ నాకొడ్డుక్కి ఎప్పుడూ నేనే కనిపిస్తా….” అని తిట్టుకుంటూ శంకిరి గ్యాడు వెళ్ళి కంపలు తెచ్చిన్యాడు.
కొంజేపుకి కాయిలు ఉడికిపూడిసినాయి. చెంగడు నీళ్ళను వడగట్టేసి రోడ్డు మింది పోసినాడు. ఇంగ అందురూ వుడ్డగా గూచోని చెనిక్కాయిలు తినే కార్యక్రమాన్ని పూర్తి జేసినాము…
అబ్బుటికి టైము అర్ధ రేత్తిరి దాటి ఒంటి గంటయింది… ఖాళీ అయిన బోకిని శంకిరి గ్యాని నెత్తి మీద బొర్లిచ్చి అందురూ ఊరి వైపు నడుచుకుంటా వస్తా వుండాం…
......
......
......
కత్తిరించిన ఇరవై సంవత్సరాలు మళ్ళీ కుట్టేస్తే.
అమెరికాలో ఒక నగరంలో కంప్యూటర్ ముందర…
అలా చెనిక్కాయలు ఉడకేసిన రోజులు ఎన్నో, నేరేడు చెట్లెక్కి నేరేడు కాయలు కోసుకుంటూ లేటుగా ఇంటికొచ్చి తన్నులు తిన్న రోజులెన్నో.. మామిడి తోపుల్లో ఉప్పూ కారం తో కలిపి మామిడి కాయలు తిన్న రోజులెన్నో… ఇలాంటివి మరెన్నో… గుర్తుకొస్తున్నాయి…ఆ రోజులు మళ్ళీ రావని మనసు మౌనంగా రోదిస్తోంది.
.
రేపే విడుదల : మీర్రాసిన టపా హిట్టా ఫట్టా – విశ్లేషణాత్మక వ్యాసం
.
11 comments:
beautiful.
బాగుంది విహారి.
ఇలాంటివన్నీ మధురస్మృతులే.
కానీ నాకొకటి అనిపిస్తుంది. పాతవాటిని తలచుకుని ఆనందించడం ఒకటి, ప్రస్తుతాన్ని ఆనందించడం ఇంకొకటి.
ప్రస్తుతంలో ఏం చేస్తే ఆనందం కలిగిస్తుంది అనేదాని పైన కూడా జనాలు కాన్సన్టేట్ చెయ్యడం మొదలుపెడితే నా చిన్నప్పుడు అంత బాగా ఎంజాయ్ చేసాను, ఇప్పుడు చెయ్యలేకపోతున్నాను అనే డైలాగులు కొంత తగ్గవచ్చు. (ఇది ఈ టపా ని ఉద్దేశించి కాదు.)
చాలా బా రాసినారండి
భళా విహారీ....ఇది నెల్లూరి మాండలీకమా.......కొంచెం తమిళ వాసన ఉంది అందుకే అనుమానం.....నివృత్తి చేయండి.
మీ మధురస్మృతులు బాగున్నాయ్.ఈ మాండలీకం చిత్తూరు జిల్లా అనిపిస్తోంది నాకు.
-నేనుసైతం
చాలా బాగున్నాయి.కానీ చాలా పదాలు అర్ధం కాలెదు.
ప్రవీణ్ గారూ పెళ్ళికి ముందు దాకా వర్తమానంలోనే బ్రతుకుతాము.తరువాత నుండే ఎక్కువగా గతంలో తిరుగుతూవుంటాము.అదంతే.మీకూ పెళ్ళవ్వనివ్వండి.తెలుస్తుంది.
భలేగ్యా ర్యాసినారప్పా...
యస్ ఆర్ కండ్రిగ ప్రాంతంలో తిరిగిన రోజులు ఆ మిత్రులు/రాళ్ళు గుర్తోచ్చారు.
"ఆ రోజులు మళ్ళీ రావని మనసు మౌనంగా రోదిస్తోంది."
రోదించఖర్లేదు. ఆ అనుభవాలు వేరు. నేటి అనుభవాలు వేరు.
ఈ వాఖ్య చదువుతున్నంతసేపు మీ ఆనందం వేరు. రేపు మరొక టపా. మరొక వాఖ్య. మరొక "ఆనందం".
అవునా!
@ కొత్తపాళి గారికి,
నెనర్లు.
@ ప్రవీణ్ గారు,
నెనర్లు.
అనందం అన్నది అన్ని చోట్ల ఒక్కటే కానీ. "అలాంటి" ఆందం, "ఇలాంటి" అనందం అన్నవి మళ్ళీ రావు కదా అందుకనే అలా అన్నాను.
@ బూదరాజు అశ్విన్ గారు,
నెనర్లు.
@ నరహరి గారు,
ఇది చిత్తూరు యాసే.
@ నేను సైతం గారు,
అవును ఇది చిత్తూర్ యాసే.
@ రాధిక గారు,
ఒక్క బొరుగులు(మర మరాలు), వళ్ళు(వడలు) తప్పితే అన్నీ అర్థమవుతాయనే ఉద్ధేశ్యంతో వాటికి అర్థాలు ఇవ్వలేదు. ఈ సారి రాసినప్పుడు అర్థాలు కూడా రాస్తాను.
నెనర్లు.
@ వేను గారు,
నెనర్లు.
@ నెట్టిజెన్ గారు,
ఇక్కడి రోదన "అటువంటి" అనుభవాలు మళ్ళీ రావనే. వేరు అనుభవాలు చాలానే వస్తాయి రక రకాల స్థాయిల్లో.
నెనర్లు.
-- విహారి
మొన్నాడు రెండు దఫాలోచ్చి రొవ్వొంత రొవ్వంత చదివిపూడ్చిన. ఇంగా సదవాల్సింది శానుంది (మొత్తానికి రచ్చ జేసినావుగా)
100 saarlu chadivaa ee tapa ni.. i miss my place.. chittoor.. :( ..
Post a Comment