Thursday, October 18, 2007

ఊహూ.. ఇక ఊరుకుంటే లాభం లేదు.

ఊహూ.. ఇక ఊరుకుంటే లాభం లేదు.

బ్లాగుల్లో ఎక్కడ , ఎక్కడ , చూసినా పద్యాలు కనిపిస్తున్నాయి.ఆ మధ్యెప్పుడో చదువరి పద్య లేఖరి అయినప్పుడూ ఇదే తంతు.

ఈ బ్లాగులోళ్ళకి పద్యాల మత్తెక్కినట్టుంది. ఇప్పుడు ఆ మత్తు గాలి నా బ్లాగ్ కొచ్చింది. ఫిల్టర్లు లేవు కాబట్టి ఆ గాలి పీల్చక తప్పింది కాదు.

నేను కూడా పద్యాలు నేర్చుకుంటా. (చిన్న పిల్లాడి టైపులో)

(ఇప్పుడు పెద్ద పిల్లాడి టైపులో...) ఛందస్సు మేధస్సేంటో, తేట గీతి మధురమెంతో , మత్తేభం పొగరెంతో, సీసం ఘనమెంతో, కందం మందమెంతో, ఆట వెలది ఘాటు ఎంతో, ఉత్పల మాల, చంపక మాల పొడవెంతో, మత్తకోకిల పిలుపెంతో, తరళం సుళువెంతో, వృతాల ప్రవృత్తేంటో, లఘువుల బిగువెంతో, గురువుల బరువెంతో….లగణ జగణ భగణ..(ఆయాసం.. కొంచెం గ్యాప్)…. వికీపీడియా, avkf.org, గూగులమ్మా, తూగులమ్మా, ఊగులమ్మా అన్నీ మధించి, పరిశోధించి, చదివేసి, నమిలేసి, మింగేసి జీర్ణించుకొని నర నరాన వంట బట్టించుకొని వస్తా.


అంత వరకు సెలవ్. అవన్నీ ఇప్పుడు నేర్చుకొవాలంటే ఓ అర్ధ దశాబ్దం పడుతుంది. అంత వరకు యమగోల సినిమాలో యముడు భూలోకాని కెళితే తాళాలు వేసినట్టు బ్లాగుకు తాళాలు వేస్తున్నా.


పులి ని చూసి నక్క వాత పెట్టుకుంటే….. సందేహాలొస్తున్నాయా? ఆ వాత లెలాంటివో చూద్దాం.


జై పద్యాల విహారి.


.

7 comments:

తెలుగు వీర said...

అచ్చం నాకూ ఇలాంటి అవేశమే వచ్చింది. కానీ ప్రస్తుతం వాతలు తట్టుకొనే శక్తిలేదేమోనని కాస్త తమాయించుకున్నా. ఆల్ ద బెస్ట్.

కొత్త పాళీ said...

అభీష్టసిద్ధిరస్తు

వెంకట రమణ said...

త్వరగా ఆ పద్యాలేవో నేర్చుకొని పద్యాలతో పాటుగా పద్యాలు నేర్చుకోవడమెలా అనే టపాను కూడా వ్రాయండి. నాకు కూడా వాతలు పెట్టుకోవాలని చాలా సరదాగా ఉంది.

Giri said...

శీఘ్రమేవ ఆశుపద్య ప్రాప్తిరస్తు !

రానారె said...

అర్ధదశాబ్దమా? ఐదురోజులు ఎక్కువౌతాయేమో. తెవికీ ఉంది. మీకొచ్చే ఎలాంటి సందేహాలనైనా తీర్చడానికి సాహిత్యం గుంపు వుంది. అక్కడ చాలామంది విద్యార్థులే కనుక మీ ప్రశ్నలకు జవాబులిచ్చి పెద్దవాళ్లమౌదామనే ఉత్సాహం ఉంటుంది. పెద్ద ప్రశ్నలకు పెద్దలెలాగూ ఉన్నారు. ఇంకేం కావాలి. శ్రీఘ్రమేవ పద్యజ్ఞానం ప్రాప్తిరస్తు!

విహారి(KBL) said...

మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.

Anonymous said...

@ తెలుగు వీర గారు,

చూద్దాం నా శక్తెంతో. నెనర్లు.

@ కొత్త పాళి గారు,

మీ ఆశీర్వాదం వుంటే చాలు.

@ వెంకట రమణ గారు,

నాకు వాతలు వస్తే ఆ వాతలన్నీ ప్రపంచంలో వుండే తెలుగు బ్లాగర్లందరికి పంచుతా.

@ గిరి గారు,

మీ దీవెనలకు నెనర్లు.

@ రానారె,

అసలే ఒక దశాబ్దం అనబోయి అర్ద దశాబ్దం అన్నానేమో అని బాధ పడుతుంటే అయిదు రోజులు చాలంటారా. "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారా..." అని పాడే వయసు కాదు కదా. బీవీ హై, బచ్చే హై ఇంగా కన్న కషమాలం హై. అయిదురోజులు చాలవు.

మిమ్మల్నందరిని పెద్దోళ్ళని చేసేందుకే కంకణం కట్టుకున్నా .

@ విహారి(KBL) గారు,

లేటయినా మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు కొంచెం చాలా అడ్వాన్సుగా దీపావళి శుభాకాంక్షలు కూడా :-)

-- విహారి