Monday, October 15, 2007

భ్లాగోళ జంభ దాని ప్రకంపనలు

.

ఇక్కడ “ఆనంద్ అవుట్ డోర్ సినీ సర్వీస్” లేనందున బ్లాగోళ జంభ టపా కోసం బేస్‌మెంట్ లోనే చిన్న సెట్టింగ్ వేసి షూటింగ్ చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా కిందకెళ్ళిపోయి దాని ప్రొడక్షన్ సీన్లు చూసే వాడిని. ఈ షూటింగ్ కి లైట్ బాయ్ నుండి తోట తరణి, పి.సి.శ్రీరాం, మణి రత్నం, రామా నాయుడు వరకు నేనే.

అప్పుడప్పుడూ అడిగినప్పుడు మా ఆవిడ కాఫీ నో, టీనో తెచ్చి ఇచ్చేది. అలా వచ్చినప్పుడు అక్కడే హ్యంగర్స్ కు వేళాడుతున్న డ్రస్సులు చూసి “మొత్తానికి బేస్‌మెంట్ ను ఒక డ్రామా కంపెనీ లాగా మార్చేశావ్” అంది.

“మరి నువ్వు మాత్రం కాచి టీ పెట్టుకొని రమ్మంటే, మైక్రోవేవ్ లో పెట్టి బ్రూ కాఫీ తీసుకొచ్చేసి అదే టీ అన్నట్టు డ్రామా లెయ్యడం లేదా” అని సగటు మగవాడిలా అనబోయి తమాయించుకొని “అప్పుడే ఏమయింది ఇంకా చూస్తూ వుండు ఎన్ని చేస్తానో” అన్నా రాబోయే ఉపద్రవాన్ని పసి గట్టకుండా.

“ఆ..చాల్లే సంబడం. ఇంటి వెనకాల గడ్డి పీకడానికి టైము లేదు గానీ వీటికంతా వుంటుంది. తొందరగ ముగించుకోని రా” అంది.

తను అలా వెళ్ళగానే బుడ్డోళ్ళిద్దరూ నా యూనిట్ లో నాన్-వర్కింగ్ సభ్యులయిపోయి నన్ను నాట్ వర్కింగ్ ఆర్టిస్టును చేసేవాళ్ళు.

“గుండయితే అయ్యింది కానీ లడ్డు మాత్రం దొరికింది” అన్నంత ఆనందం తో ‘భ్లాగోళ జంభ” డబ్బా బ్లాగులోకి వెళ్ళింది.

ఇక ట్రైపాడు ఇతర వస్త్రా లంకరణ సామాగ్రి అంతా పైకి తెచ్చే పని మా ఆవిడది. “హమ్మయ్యా, కాఫీలు మోసుకెళ్ళే బాధ తప్పింది” అని అన్నీ తీసుకొచ్చి పైన బడేసింది.

ఆఫీసు నుండి రాగానే కూచుని టి.వి. చూస్తూ “నా తోడు గా నీవుండగా …..చక్ర వాకం….చక్ర వాకం” అని వింటుంటే ఎక్కడి నుండో “భ్లాగోళ జంభ… భ్లాగోళ జంభ… ” అనే సౌండు టి.వి. కన్నా ఎక్కువ వస్తోంది. మా ఆవిడే లేచి వెళ్ళి లివింగ్ రూములో నుండి ఒక చేత్తో ట్రైపాడూ ఇంకో చేత్తో హ్యాటూ తీసుకొని వచ్చింది.

ఆ వెనకనే మా పెద్ద బుడ్డోడు “అమ్మా! నేను, తెలుగు బ్లాగు గేము ఆడుకుంటా. నా కివ్వు” అంటూ వెంట పడుతున్నాడు.

వాడిని పిలిచి “ఈ గేమేంట్రా” అనడిగితే.

“అదే, నువ్వూ.. బేస్‌మెంట్లో..భ్లాగోళ జంభ చేస్తున్నావు కదా... అది”

“నీకు ట్రైపాడ్, హ్యాటు ఎందుకు?”

“నాకు కావాలి. నేను తెలుగు బ్లాగు ఆడుకుంటా”

నేను నవ్వుకుంటా వాడిని దగ్గరకు తీసుకున్నానో లేదో అంత వరకు అక్కడే లివింగ్ రూములో ఆడుకుంటున్న సంవత్సరం కూడా నిండని చిన బుడ్డోడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ “భ్లా... భ్లా... భ్లా... “ అని వస్తున్నాడు.

.

6 comments:

Anonymous said...

bAguMdi vihAri gAru.

మాకినేని ప్రదీపు said...

బ్లా... బ్లా... బ్లా...

lalithag said...

:-)

తెలుగు వీర said...

హిహిహి..మీది బ్లాగు పరివారమే :-)

radhika said...

బ్లా... బ్లా... బ్లా...

Anonymous said...

అందరికి నెనర్లు

-- విహారి